కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 3/1 పేజీలు 9-14
  • మీరు యెహోవా దినం కొరకు సంసిద్ధంగా ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు యెహోవా దినం కొరకు సంసిద్ధంగా ఉన్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లకు గొప్ప అపేక్షలు ఉండేవి
  • యెహోవా దినం, యేసు ప్రత్యక్షత
  • వాళ్లు సిద్ధంగా ఉన్నారు
  • “మెలకువగా నుండుడి”
  • పరిశుద్ధక్రియలు అవసరం
  • మీ విశ్వాసమునుబట్టి మీరు లోకముపై నేరస్థాపన చేయుదురా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • నోవహు లాగ్‌బుక్‌ మన జీవితంలో దానికి ప్రాముఖ్యత ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 3/1 పేజీలు 9-14

మీరు యెహోవా దినం కొరకు సంసిద్ధంగా ఉన్నారా?

“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.”—జెఫన్యా 1:14.

1. యెహోవా దినాన్ని లేఖనాలు ఎలా వర్ణిస్తున్నాయి?

యెహోవా దేవుని ‘భయంకరమైన ఆ మహాదినం,’ ఈ దుష్టవిధానంపైకి త్వరలోనే వస్తుంది. యెహోవా దినాన్ని లేఖనాలు యుద్ధదినంగానూ, అంధకారమయమైన దినంగానూ, ఉగ్రత దినంగానూ, శ్రమా ఉపద్రవాలు సంభవించు దినంగానూ, ఘోషణా వినాశాల దినంగానూ వర్ణిస్తున్నాయి. అయినప్పటికీ, ‘యెహోవా నామాన్నిబట్టి ప్రార్థనచేయు వారందరూ రక్షించబడతారు’ గనుక తప్పించుకొనేవారు ఉంటారు. (యోవేలు 2:30-32; ఆమోసు 5:18-20) అవును, అప్పుడు దేవుడు తన శత్రువుల్ని నాశనంచేసి, తన ప్రజలను రక్షిస్తాడు.

2. యెహోవా దినాన్ని గురించి మనం ఎందుకు అత్యవసర భావాన్ని కల్గివుండాలి?

2 దేవుని ప్రవక్తలు, యెహోవా దినానికి ఓ అత్యవసర భావాన్ని ఇచ్చారు. ఉదాహరణకు, జెఫన్యా ఇలా వ్రాశాడు: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:14) ఆ పరిస్థితి ఎప్పటికన్నా నేడు మరింత అత్యంతావశ్యకంగా ఉంది. ఎందుకంటే దేవుని ముఖ్య సంహారకుడైన రాజగు యేసుక్రీస్తు ‘తన కత్తి మొలను కట్టుకొనీ, సత్యాన్నీ వినయంతోకూడిన నీతినీ స్థాపించేందుకు వాహనమెక్కి’ బయలుదేరబోతున్నాడు. (కీర్తన 45:3, 4) మీరు ఆ దినం కొరకు సంసిద్ధంగా ఉన్నారా?

వాళ్లకు గొప్ప అపేక్షలు ఉండేవి

3. థెస్సలొనీకయలోని కొంతమంది క్రైస్తవులు ఏ అపేక్షలను కల్గివున్నారు, ఏ రెండు కారణాల్నిబట్టి వారి అపేక్షలు తప్పైవున్నాయి?

3 అనేకమందికి యెహోవా దినాన్ని గురించి నెరవేరని అపేక్షలు ఉండేవి. థెస్సలొనీకయలోని కొంతమంది తొలి క్రైస్తవులు, ‘ప్రభువుదినమిప్పుడే [“యెహోవా దినం,” NW] వచ్చిందని’ తెలియజేశారు! (2 థెస్సలొనీకయులు 2:1) కానీ అది త్వరగా రాకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకదానిని ఉల్లేకిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా . . . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” (1 థెస్సలొనీకయులు 5:1-6) ఈ “అంత్యకాలము”లో మనం కూడా ఆ మాటల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. (దానియేలు 12:4) యెహోవా మహాదినం వచ్చిందనడానికిగల మరో రుజువును కూడా థెస్సలొనీకయులు పరిగణనలోనికి తీసుకోలేదు. ఎందుకంటే పౌలు వారితో ఇలా చెప్పాడు: ‘మొదట భ్రష్టత్వము సంభవిస్తేనే . . . గాని ఆ దినము రాదు.’ (2 థెస్సలొనీకయులు 2:3) పౌలు ఆ మాటల్ని (దాదాపు సా.శ. 51లో) వ్రాసేనాటికి నిజ క్రైస్తవత్వమందు “భ్రష్టత్వము” పూర్తిగా వృద్ధిచెందలేదు. నేడు, అది క్రైస్తవమత సామ్రాజ్యంలో పూర్తిగా వృద్ధిచెంది ఉండడాన్ని మనం చూస్తున్నాం. తమ అపేక్షలు నెరవేరకపోయినా, మరణ పర్యంతంవరకూ దేవున్ని నమ్మకంగా సేవించిన థెస్సలొనీకయలోని విశ్వాసులైన ఆ అభిషిక్తులు, చివరకు పరలోక బహుమానాన్ని పొందారు. (ప్రకటన 2:10) మనం యెహోవా దినం కొరకు ఎదురుచూస్తూ నమ్మకంగా గనుక నిలిచివుంటే, మనం కూడా ఓ బహుమానాన్ని పొందుతాం.

4. (ఎ) 2 థెస్సలొనీకయులు 2:1, 2 వచనాల్లో, యెహోవా దినం దేనితో ముడిపెట్టబడింది? (బి) క్రీస్తు తిరిగి రావడం గురించీ, మరి దాని సత్సంబంధిత విషయాల్ని గురించీ, చర్చి ఫాదర్లు అని పిలువబడుతున్న వారు ఏ దృక్పథాల్ని కల్గివున్నారు?

4 ‘యెహోవా మహాదినాన్ని,’ బైబిలు ‘మనప్రభువైన యేసుక్రీస్తు రాకడతో’ ముడిపెడుతోంది. (2 థెస్సలొనీకయులు 2:1, 2) క్రీస్తు మరలా రావడాన్ని గురించీ, ఆయన ప్రత్యక్షతను గురించీ అలాగే ఆయన వెయ్యేండ్ల పాలనను గురించీ చర్చి ఫాదర్లని పిలువబడుతున్న వారికి వివిధ అభిప్రాయాలు ఉండేవి. (ప్రకటన 20:4) సా. శ. రెండవ శతాబ్దంలో, హియెరాపొలివాడైన పాపియస్‌, క్రీస్తు వెయ్యేండ్ల పాలన కాలంలో భూసారం నమ్మశక్యంకాని రీతిలో ఉంటుందనే అపేక్షలను కల్గివున్నాడు. జస్టిన్‌ మార్టిర్‌, యేసు ప్రత్యక్షతను గురించి పదేపదే మాట్లాడేవాడు, పునరుద్ధరించబడిన యెరూషలేము ఆయన రాజ్యానికి కేంద్రస్థానం అవుతుందని ఆశించాడు. లొయన్స్‌వాడైన ఐరీనీయస్‌, రోమా సామ్రాజ్యం నాశనం చేయబడిన తర్వాత యేసు దృశ్యమైన రీతిలో కనబడతాడనీ, సాతాన్ని బంధిస్తాడనీ మరి భూమిపైనున్న యెరూషలేములో పరిపాలిస్తాడనీ బోధించాడు.

5. క్రీస్తు ‘రెండవ రాకడను’ గురించీ, ఆయన వెయ్యేండ్ల పాలనను గురించీ కొంతమంది పండితులు ఏమని తెలియజేశారు?

5 “సామాన్య పునరుత్థాన తీర్పులు జరగడానికి ముందు మృతులలోనుండి లేపబడిన పరిశుద్ధులతో కలిసి వెయ్యేండ్లూ భూమిపై క్రీస్తు మహిమతో దృశ్యంగా పరిపాలిస్తాడనే నమ్మకమే” సా. శ. 325లో నైసియా సభ జరగడానికి ముందున్న కాలంలోవున్న “అతి ప్రఖ్యాతిగాంచిన నమ్మకం” అని చరిత్రకారుడైన ఫిలిప్‌ షాప్‌ గుర్తించాడు. జేమ్స్‌ హేస్టింగ్స్‌ సంకలనంచేసిన ఎ డిక్షనరీ ఆఫ్‌ ది బైబిల్‌ ఇలా తెలియజేస్తోంది: “టెర్టూలియన్‌, ఐరీనీయస్‌, హిపాల్టస్‌లు [యేసుక్రీస్తు యొక్క] తక్షణ రాక కొరకు నిరీక్షిస్తున్నారు; కానీ అలగ్జాన్‌డ్రైన్‌ ఫాదర్ల రాకతో, మనం ఓ నూతన ఆలోచనా విధానంలోకి ప్రవేశిస్తాం . . . అగస్టైన్‌ బోధలు వెయ్యేండ్ల పాలనను చర్చి మిలిటెంట్ల కాలంతో సమానమని పరిగణించడంతో రెండవ రాకడ దూర భవిష్యకాలానికి వాయిదాపడింది.”

యెహోవా దినం, యేసు ప్రత్యక్షత

6. యెహోవా దినం ఎంతో దూరంలో ఉందనే నిర్ధారణకు మనం ఎందుకు రాకూడదు?

6 తప్పుడు అభిప్రాయాలు నిరుత్సాహాలకు దారితీస్తాయి, కానీ యెహోవా దినం ఎంతో దూరంలో ఉందని మనం అనుకోకూడదు. లేఖనాధారంగా, యెహోవా దినంతో ముడిపెట్టబడిన యేసు అదృశ్యమైన ప్రత్యక్షత ఇప్పటికే ఆరంభమయ్యింది. 1914వ సంవత్సరంలో క్రీస్తు ప్రత్యక్షత ఆరంభమయ్యిందనే లేఖనాధారిత రుజువులను యెహోవాసాక్షులు ప్రచురిస్తున్న కావలికోట పత్రికా, మరి దాని సంబంధిత ప్రచురణలూ తరచుగా అందజేశాయి.a అయితే యేసు తన ప్రత్యక్షతను గురించి ఏమని తెలియజేశాడు?

7. (ఎ) యేసు ప్రత్యక్షతకూ ఈ విధానాంతానికీ సంబంధించిన సూచనలోని కొన్ని సంగతులు ఏమైవున్నాయి? (బి) మనమెలా రక్షించబడతాం?

7 యేసు మరణించడానికి కొంతకాలం ముందు, ఆయన ప్రత్యక్షత ఓ చర్చనీయాంశమైంది. యెరూషలేము ఆలయ నాశనాన్ని గూర్చి ఆయన ప్రవచించిన విషయాల్ని విన్న తర్వాత, ఆయన అపొస్తలులైన పేతురూ యాకోబూ యోహానూ అంద్రెయలు ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకూ ఈ విధానాంతానికీ సూచన ఏమిటి?” (మత్తయి 24:1-3, NW; మార్కు 13:3, 4) దానికి ప్రత్యుత్తరంగా, యేసు యుద్ధాల్ని గూర్చీ, క్షామాన్ని గూర్చీ, భూకంపాల్ని గూర్చీ అలాగే తన ప్రత్యక్షతకూ ఈ విధానాంతానికీ సంబంధించిన “సూచన”లోని ఇతర సంగతుల్ని గూర్చీ ప్రవచించాడు. ఆయన ఇంకా ఇలా తెలియజేశాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) మనం మన ప్రస్తుత జీవితాంతం వరకూ లేక ఈ దుష్ట విధానాంతం వరకూ నమ్మకంగా సహించుకొన్నట్లైతే రక్షింపబడతాం.

8. యూదా విధానాంతానికి మునుపు ఏమి నెరవేర్చబడాలి, దీనిని గురించి నేడు ఏమి జరుగుతోంది?

8 అంతానికి ముందు, యేసు ప్రత్యక్షతకు సంబంధించి ప్రత్యేకంగా ఓ సూచనార్థక సంగతి నెరవేరుతుంది. దానిని గురించి, ఆయన ఇలా తెలియజేశాడు: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14, ఇటాలిక్కులు మావి.) రోమా సైన్యం యెరూషలేమును నాశనం చేయకముందూ, సా.శ. 70లో యూదా విధానం అంతంకాక మునుపూ సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటించబడిందని’ పౌలు తెలియజేయగలిగాడు. (కొలొస్సయులు 1:23) అయినా, నేడు మరింత విస్తృతమైన ప్రకటనా పనిని యెహోవాసాక్షులు ‘భూమియందంతటా’ చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా, తూర్పు ఐరోపాలో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేందుకు దేవుడు మార్గాన్ని తెరిచాడు. ‘ఇంకనూ ప్రకటించాల్సివున్న ప్రాంతంలో’ కూడా ప్రచారకార్యక్రమాన్ని విస్తృతపర్చేందుకు యెహోవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ముద్రణా సదుపాయాలతోనూ మరితర సదుపాయాలతోను సంసిద్ధంగావుంది. (రోమీయులు 15:22, 23) అంతంరాక మునుపు, మీ శక్తిమేరకు సాక్ష్యం ఇవ్వడానికి మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపిస్తోందా? అలా ప్రేరేపిస్తే, మన ముందున్న పనిలో ప్రతిఫలదాయకమైన రీతిలో భాగం వహించేందుకు మిమ్మల్ని దేవుడు బలపర్చగలడు.—ఫిలిప్పీయులు 4:13; 2 తిమోతి 4:17.

9. మత్తయి 24:36 వచనంలో నమోదుచేయబడిన ఏ విషయాన్ని యేసు తెలియజేశాడు?

9 యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలో ప్రవచించబడిన రాజ్య ప్రకటనాపనీ, ఇతర సంగతులూ ప్రస్తుతం నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ దుష్ట విధానాంతం సమీపంలోనేవుంది. నిజమే, యేసు ఇలా తెలియజేశాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:4-14, 36) అయితే ‘ఆ దినం కొరకూ, ఆ ఘడియ కొరకూ’ సిద్ధపడేందుకు యేసు ప్రవచనం మనకు సహాయపడగలదు.

వాళ్లు సిద్ధంగా ఉన్నారు

10. ఆత్మీయంగా మెలకువగా ఉండడం సాధ్యమేనని మనకు ఎలా తెలుసు?

10 యెహోవా మహాదినాన్ని తప్పించుకోవాలంటే మనం ఆత్మీయంగా మెలకువగా ఉండాలి, సత్యారాధన కొరకు స్థిరంగా నిలబడాలి. (1 కొరింథీయులు 16:13) అలాంటి సహనం సాధ్యమేనని మనకు తెలుసు. ఎందుకంటే, ఓ దైవిక కుటుంబం ఆ విధంగా సహించుకొని, సా.శ.పూ. 2370లో దుష్ట మానవుల్ని నాశనంచేసిన జలప్రళయం నుండి తప్పించుకుంది. ఆ శకంతో తన ప్రత్యక్షతను పోలుస్తూ యేసు ఇలా తెలియజేశాడు: ‘నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండిరి. జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ [“ప్రత్యక్షతయు,” NW] ఉండును.’—మత్తయి 24:37-39.

11. తన కాలంలో దౌర్జన్యంవున్నా నోవహు ఏ జీవిత విధానాన్ని వెంబడించాడు?

11 మనవలె నోవహూ, ఆయన కుటుంబమూ దౌర్జన్యపూరిత లోకంలో జీవించారు. అవిధేయులైన దేవదూతలు అంటే అవిధేయులైన “[సత్య] దేవుని కుమారులు” భౌతిక రూపాన్ని ధరించీ, స్త్రీలను పెండ్లి చేసుకొనీ నీచులైన నెఫీలుల్ని కన్నారు. వాళ్లే నిస్సందేహంగా పరిస్థితుల్ని మరింత దౌర్జన్యపూరితంగా మార్చేసిన కలహకారులు. (ఆదికాండము 6:1, 2, 4; 1 పేతురు 3:19, 20) అయినా, నోవహు నమ్మకంగా “[సత్య] దేవునితోకూడ నడచినవాడు.” ఆయన “తన తరములో” అంటే తను జీవించిన కాలంలోని దుష్టతరంలో “నిందారహితుడునై యుండెను.” (ఆదికాండము 6:9-11) ప్రార్థనాపూర్వకంగా దేవునిపై ఆధారపడి మనం యెహోవా దినం కోసం కనిపెడుతుండగా, ఈ దౌర్జన్యపూరితమైన దుష్ట ప్రపంచంలో మనమూ అదే విధంగా చేయగలం.

12. (ఎ) ఓడను నిర్మించడమేగాక నోవహు ఇంకా ఏ పనిని చేశాడు? (బి) నోవహు చేసిన ప్రకటనా పనికి ప్రజలు ఎలా ప్రతిస్పందించారు, వారు ఏ పర్యవసానాల్ని అనుభవించారు?

12 జలప్రళయం నుండి ప్రాణాల్ని కాపాడేందుకు ఓ ఓడను నిర్మించినవానిగా నోవహు సుపరిచితుడే. ఆయన ‘నీతి ప్రచారకుడు’ కూడా. కానీ దేవుడు ఆయనకు ఇచ్చిన సందేశాన్ని ఆయన సమకాలీకులు ‘గుర్తించ లేదు.’ జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయేంత వరకూ వాళ్లు తింటూ, త్రాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, జీవితపు సామాన్య వ్యవహారాల్లో మునిగిపోయారు. (2 పేతురు 2:5; ఆదికాండము 6:14) ‘దేవుని ఎదుట మారుమనస్సు పొందడాన్ని’ గూర్చీ, క్రీస్తునందు విశ్వాసాన్ని గూర్చీ, నీతినిగూర్చీ అలాగే ‘రాబోవు తీర్పును’ గూర్చీ యెహోవాసాక్షులు చెబుతున్న వాటిని వినకుండా చెవులు మూసుకుంటున్న ఈనాటి దుష్ట తరంలానే వాళ్లూ నీతియుక్తమైన మాటల్ని గూర్చీ, ప్రవర్తనను గూర్చీ వినేందుకు ఇష్టపడలేదు. (అపొస్తలుల కార్యములు 20:20, 21; 24:24, 25) నోవహు దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు భూమిపై ఎంతమంది ప్రజలు జీవించారో తెలియజేసే రికార్డు ఏదీ అందుబాటులోలేదు. కానీ సా.శ.పూ. 2370లో భూ జనాభా తీవ్రంగా తగ్గించివేయబడిందనే విషయం మాత్రం వాస్తవం! ఆ జలప్రళయం దుష్టుల్ని తుడిచివేసింది. ఆ దైవికచర్య కొరకు సంసిద్ధంగా ఉన్నవారు మాత్రమే అంటే నోవహు, ఆయన కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మాత్రమే తప్పించబడ్డారు.—ఆదికాండము 7:19-23; 2 పేతురు 3:5, 6.

13. దైవిక తీర్పును గూర్చిన ఏ హెచ్చరికనందు నోవహు పూర్ణ విశ్వాసాన్ని ఉంచాడు, ఆయన దీనికి అనుగుణంగా ఎలా పనిచేశాడు?

13 జలప్రళయం వచ్చే కచ్చితమైన దినాన్ని గురించీ, ఘడియను గురించీ దేవుడు అనేక సంవత్సరాల ముందుగానే నోవహుకు తెలియజేయలేదు. అయినా, నోవహుకు 480 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, యెహోవా ఇలా ప్రకటించాడు: ‘నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.’ (ఆదికాండము 6:3) ఈ దైవిక తీర్పును గూర్చిన హెచ్చరికనందు నోవహు పూర్ణ విశ్వాసాన్ని ఉంచాడు. 500 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఆయన “షేమును హామును యాపెతును కనెను.” ఆ రోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం, ఆయన కుమారులు పెళ్లిచేసుకోవడానికి మునుపు వాళ్లకు 50 నుండి 60 నిండి ఉండొచ్చు. జలప్రళయం నుండి రక్షించడం కోసం ఓడను నిర్మించమని నోవహుకు చెప్పబడినప్పుడు, ఆయన కుమారులూ వారి భార్యలూ ఆ పనిలో ఆయనకు మద్దతును ఇచ్చారనే విషయం సుస్పష్టమే. “నీతిని ప్రకటించిన” వానిగా నోవహు చేసిన సేవా కాలంలోనే బహుశా ఓడ నిర్మాణపుపనీ జరిగి ఉంటుంది, అది జలప్రళయం రాకమునుపున్న 40 నుండి 50 ఏళ్లూ ఆయన్ని తీరికలేకుండా ఉంచింది. (ఆదికాండము 5:32; 6:13-22) ఆ సంవత్సరాలన్నింటిలోనూ, ఆయనా ఆయన కుటుంబమూ విశ్వాసంగలవారై పనిచేశారు. సువార్తను ప్రకటిస్తూ, యెహోవా దినం కోసం కనిపెడుతుండగా మనం కూడా అలాగే విశ్వాసాన్ని ప్రదర్శిద్దాం.—హెబ్రీయులు 11:7.

14. చివరకు యెహోవా నోవహుతో ఏమి చెప్పాడు, ఎందుకు?

14 ఓడ నిర్మాణం దాదాపు పూర్తికావొస్తుండగా, జలప్రళయం కచ్చితంగా ఎప్పుడు వస్తుందనే విషయం నోవహుకు తెలియకపోయినా, అది ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడి ఉండొచ్చు. చివరకు యెహోవా ఆయనకు ఇలా తెలియజేశాడు: “ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము” కురిపిస్తాను. (ఆదికాండము 7:4) ఆ హెచ్చరిక, జలప్రళయం ఆరంభం కావడానికి ముందు అన్ని రకాల జంతువుల్నీ ఓడలోనికి తీసుకెళ్లడానికీ, తాము కూడా దానిలోనికి ప్రవేశించడానికీ సరిగ్గా సరిపోయేంత సమయాన్ని నోవహుకూ ఆయన కుటుంబానికీ ఇచ్చింది. ఈ విధాన నాశనారంభం కొరకైన దినాన్నీ ఘడియనూ మనం తెల్సుకోవాల్సిన అవసరం లేదు; జంతువుల్ని రక్షించాల్సిన బాధ్యతను మనకు అప్పగించలేదు, భవిష్యత్తులో తప్పించబడబోయే మానవులు సూచనార్థక ఓడలోనికి అంటే దేవుని ప్రజల ఆత్మీయ పరదైసులోనికి ప్రవేశించడం ఇప్పటికే ఆరంభమైంది.

“మెలకువగా నుండుడి”

15. (ఎ) మత్తయి 24:40-44 వచనాల్లోవున్న యేసు మాటల్ని మీ స్వంత మాటల్లో ఎలా వివరిస్తారు? (బి) దేవుని ప్రతీకారాన్ని అమలు చేసేందుకు యేసు వచ్చే కచ్చితమైన సమయం తెలియకపోవడం, ఏ ప్రభావాన్ని కల్గివుంటుంది?

15 తన ప్రత్యక్షతను గురించి, యేసు ఇలా వివరించాడు: “ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (మత్తయి 24:40-44; లూకా 17:34, 35) దేవుని ప్రతీకారాన్ని అమలు చేయడానికి యేసు వచ్చే కచ్చితమైన సమయం తెలియకపోవడం, మనం మెలకువగా ఉండేలా చేస్తోంది. అలాగే మనం యెహోవాను నిస్వార్థంగా సేవిస్తున్నామని రుజువుచేసుకునే అవకాశాన్ని ప్రతిదినమూ ఇస్తోంది.

16. ‘విడువబడిన’ వ్యక్తులకూ, ‘కొనిపోబడిన’ వ్యక్తులకూ ఏమి సంభవిస్తుంది?

16 ఒకసారి జ్ఞానాన్నిపొందినా స్వార్థపూరితమైన జీవన విధానంలో మునిగిపోయిన వాళ్లు, దుష్టులతోపాటు నాశనానికి ‘విడిచిపెట్టబడిన’ వ్యక్తులలో చేరతారు. యెహోవా ఎడల పూర్ణ భక్తిని కల్గివుండి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుని ద్వారా ఆయన దయచేస్తున్న ఆత్మీయ ఏర్పాట్లనుబట్టి నిజంగా కృతజ్ఞులైన వాళ్లలో అంటే ‘తీసికొనిపోబడు’ వారిలో మనమూ ఉందుముగాక! (మత్తయి 24:45-47) “పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమ”తో మనం అంతం వరకూ దేవున్ని సేవిద్దాం.—1 తిమోతి 1:5.

పరిశుద్ధక్రియలు అవసరం

17. (ఎ) 2 పేతురు 3:10 వచనంలో ఏమి ప్రవచించబడింది? (బి) 2 పేతురు 3:11 వచనంలో ప్రోత్సహించబడిన కొన్ని క్రియలూ పనులూ ఏమైవున్నాయి?

17 అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాస్తున్నాడు: “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.” (2 పేతురు 3:10) సూచనార్థక ఆకాశములూ, భూమీ, దేవుని మహోగ్రతా వేడిమిని తప్పించుకోజాలవు. గనుకనే పేతురు ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు: “ఇవన్నీ నాశనమైపోతాయి గనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనా క్రియల్లోనూ దైవభక్తిగల పనుల్లోనూ ఎలాంటి వ్యక్తులైవున్నారో చూసుకోవాలి!” (2 పేతురు 3:11, NW) క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవ్వడమూ, ఇతరులకు మంచి చేయడమూ, సువార్తను ప్రకటించడంలో ప్రాముఖ్యంగా పాల్గొనడమూ, ఈ క్రియల్లోనూ పనుల్లోనూ చేరివున్నాయి.—మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25; 13:16.

18. ఈ లోకంతో మనం అవినాభావ సంబంధాన్ని పెంపొందించుకుంటుంటే, మనం ఏమి చెయ్యాలి?

18 ‘పరిశుద్ధమైన ప్రవర్తనా క్రియలకూ, దైవభక్తిగల పనులకూ’ అవసరమైనది ఏమిటంటే ‘ఇహలోకమాలిన్యాన్ని మనకు అంటకుండా’ మనల్ని మనం ‘కాపాడుకోవడమే.’ (యాకోబు 1:27) కానీ, మనం ఈ లోకంతో అవినాభావ సంబంధాన్ని పెంపొందించుకుంటుంటే అప్పుడేం చెయ్యాలి? మనం ఈ లోకపు భక్తిహీన స్ఫూర్తిని పెంపొందించే అపవిత్రమైన వినోదాన్ని ఆనందించడమో లేక సంగీతాన్నీ పాటల్నీ వినడమో చేయడంవల్ల మనం దేవుని ఎదుట బహుశా ప్రమాదకరమైన స్థితిలో పడిపోవచ్చు. (2 కొరింథీయులు 6:14-18) విషయం అదేయైతే, మనం లోకంతోపాటూ గతించిపోకుండా దేవుని కుమారుని ఎదుట అంగీకృతమైన స్థానంలో నిలబడేందుకు, మనం ప్రార్థనలో దేవుని సహాయాన్ని అడుగుదాం. (లూకా 21:34-36; 1 యోహాను 2:15-17) మనం దేవునికి సమర్పించుకున్నట్లైతే, ఆయనతో ఉత్సాహపూరితమైన సంబంధాన్ని పెంపొందించుకొని, దాన్ని కాపాడుకునేందుకూ, తద్వారా యెహోవా భయంకరమైన ఆ మహాదినం కొరకు సంసిద్ధులుగా ఉండేందుకూ, మన శక్తిమేరకు మనం తప్పక చేయాలని కోరుకుంటాం.

19. రాజ్యప్రచారకులలో అనేకమంది ఈ దుష్ట విధానాంతం నుండి తప్పించబడి జీవించేందుకు ఎందుకు నిరీక్షించవచ్చు?

19 దైవభక్తిగల నోవహూ, ఆయన కుటుంబమూ ఆ ప్రాచీన లోకాన్ని నాశనం చేసిన జలప్రళయం నుండి తప్పించుకొని జీవించారు. సా.శ. 70లో యూదా విధానాంతం నుండి నీతిమంతులు తప్పించబడ్డారు. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను తాను ప్రకటన గ్రంథాన్నీ, సువార్త వృత్తాంతాన్నీ మరితర మూడు ప్రేరేపిత పత్రికల్నీ వ్రాసేనాటికి అంటే, దాదాపు సా.శ. 96-98 సంవత్సరాల్లో ఆయన దేవున్ని సేవించడంలో ఇంకా చురుకుగానే ఉన్నాడు. సా.శ. 33 పెంతెకొస్తు పండుగలో నిజమైన విశ్వాసాన్ని హత్తుకొన్న వేలాదిమందిలో అనేకమంది యూదా విధానాంతం నుండి తప్పించుకొని జీవించారు. (అపొస్తలుల కార్యములు 1:15; 2:41, 47; 4:4) నేడు అనేకమంది రాజ్య ప్రచారకులు, ప్రస్తుత దుష్ట విధానాంతం నుండి తప్పించుకొని జీవించగలమనే నిరీక్షణను కల్గివుండొచ్చు.

20. మనం ఎందుకు ఆసక్తిగల ‘నీతి ప్రచారకులుగా’ ఉండాలి?

20 మన ముందున్న క్రొత్త లోకంలోనికి కాపాడబడడానికి, మనం ఆసక్తిగల ‘నీతి ప్రచారకులుగా’ ఉందాం. ఈ అంత్యదినాల్లో దేవున్ని సేవించడం ఎంత ఆధిక్యతో కదా! ప్రస్తుతదిన ‘ఓడలోనికి’ అంటే దేవుని ప్రజలు అనుభవిస్తున్న ఆత్మీయ పరదైసులోనికి ప్రజల్ని నడిపించడం ఎంత ఆనందదాయకమైన విషయమో కదా! ఇప్పుడు అందులోవున్న లక్షలాదిమందీ నమ్మకంగానూ, ఆత్మీయంగా మెలకువగానూ ఉండి, యెహోవా గొప్ప దినం కొరకు సంసిద్ధంగా ఉందురు గాక! కానీ మెలకువగా ఉండేందుకు మనందరికీ ఏది సహాయపడుతుంది?

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఇండియా వారు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 10, 11 అధ్యాయాల్ని చూడండి.

మీరు ఎలా జవాబిస్తారు?

◻ యెహోవా దినాన్ని గురించీ, క్రీస్తు ప్రత్యక్షతను గురించీ కొంతమంది ఏ అపేక్షలను కల్గివుండేవారు?

◻ నోవహూ, ఆయన కుటుంబమూ జలప్రళయం కొరకు సిద్ధపడి ఉన్నారని మనమెందుకు చెప్పగలం?

◻ ‘మెలకువగా ఉన్న’ వారికీ, ఉండని వారికీ ఏమి జరుగుతుంది?

◻ పరిశుద్ధ క్రియలు ఎందుకు అవసరం, విశేషంగా మనం యెహోవా మహాదినాన్ని సమీస్తుండగా అవి ఎందుకు అవసరం?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి