వెయ్యిసంవత్సరములలోనికి రక్షింపబడుటకు వ్యవస్థగా నిలిచియుండుట
“అప్పుడు మంద ఒక్కటియు, గొర్రెల కాపరి ఒక్కడును అగును.”—యోహాను 10:16.
1. నిత్యము-జీవించు దేవునికి వెయ్యిసంవత్సరములు దేనివలెనున్నవి?
మానవజాతి కొరకు కాలమును కలుగజేసినవాడు యెహోవా దేవుడైయున్నాడు. యుగయుగములు జీవించు అమర్త్యతగల ఆ దేవునికి వెయ్యిసంవత్సరములు త్వరగా గతించిపోవు ఒక దినమువలెను, రాత్రియందలి ఒక జామువలెను ఉన్నవి.—కీర్తన 90:4; 2 పేతురు 3:8.
2. మానవజాతినంతటిని ఆశీర్వదించుటకు ఏ సమయమును యెహోవా నియమించియున్నాడు?
2 భూమిపైనుండు సకలకుటుంబములను ఆశీర్వదించు వెయ్యిసంవత్సరముల సూచనార్థక దినమునొకదానిని దేవుడు నియమించియున్నాడు. (ఆదికాండము 12:3; 22:17, 18; అ.కార్యములు 17:31) దీనియందు ప్రస్తుతము మృతులైయున్నవారును, ఇంకను జీవించియుండువారును చేరియున్నారు. దీనిని దేవుడెట్లుచేయును? సందేహమెందుకు, ఆయన దీనిని తన సూచనార్థక స్త్రీ “సంతాన”మగు యేసుక్రీస్తు మూలముగాగల తన రాజ్యము ద్వారాచేయును!—ఆదికాండము 3:15
3. (ఎ) దేవుని స్త్రీ సంతానపు మడిమెమీద దెబ్బ ఎట్లు కొట్టబడినది, అయితే ఎట్లు ఆ గాయము బాగుచేయబడెను? (బి) యేసుక్రీస్తుయొక్క వెయ్యేండ్లపరిపాలన అంతములో సూచనార్థకమైన సర్పమునకు ఆయన ఏమిచేయును?
3 సా.శ. 33వ సంవత్సరమున యేసుక్రీస్తు హతసాక్షిగా మరణించి, దాదాపు మూడు దినములపాటు మృతునిగా యుండినప్పుడు, దేవుని స్త్రీ (లేక పరలోకపు సంస్థ) సూచనార్థక సంతానముయొక్క మడిమెమీద దెబ్బ కొట్టబడినది. అయితే మహాగొప్ప-జీవదాత, సర్వశక్తిగలదేవుడు, యథార్థవంతుడైన తనకుమారుని మూడవదినమున ఆత్మీయసామ్రాజ్యమందు అమర్త్యమైన జీవమునకు పునరుత్థానము చేయుటద్వారా ఆ గాయమును మాన్పెను. (1 పేతురు 3:18) యేసు ఇక ఎన్నటికిని మరణించడు కావున, మానవజాతిపై వెయ్యిసంవత్సరములు రాజుగా పరిపాలించుటకును, అలాగే వెయ్యేండ్ల పరిపాలనాంతమున, సూచనార్థక సర్పము తలమీద కొట్టి ఇక అతడు ఎన్నటికిని ఉనికిలేకుండునంతగా నాశనముచేయు స్థానమందున్నాడు. పునరుద్ధరింపబడిన నమ్మకస్థులైన మానవజాతికి అది ఎంతటి ఆశీర్వాదమైయుండును!
4. ఏ విధమైన కార్యక్రమమును దేవుడు తన ప్రజలయెడల కొనసాగించుచున్నాడు?
4 అన్యజనులకాలములు 1914లో ముగిసిననాటినుండి “ఈ యుగసమాప్తియందు” భూమియంతటనున్న యెహోవా ప్రజలమధ్య ఎంతో వ్యవస్థీకరణ వృద్ధియగుచున్నది. (మత్తయి 24:3; లూకా 21:24, కింగ్ జేమ్సు వర్షన్) వెయ్యేండ్లపరిపాలనకు ముందు జరుగుచున్న ఈ వ్యవస్థీకరణ గొప్పవ్యవస్థాపకుడైన యెహోవాదేవుని నడిపింపుక్రిందను, ఆయన చిత్తానుసారముగాను కొనసాగించబడుచున్నది. భార్యవంటి పరలోక సంస్థయైన తన స్త్రీ ద్వారా, యేసుక్రీస్తు ఆధ్వర్యమున వాగ్ధానము చేయబడిన రాజ్యము 1914లో పుట్టినది. బైబిలు ప్రవచన నెరవేర్పుద్వారా ఇది నిర్ధారించబడినది.
5. ప్రకటన 12:5నందు దేనిపుట్టుక ప్రవచింపబడినది, ఇది మొదట ది వాచ్టవర్నందు ఎప్పుడు వివరించబడినది?
5 అట్లు మహిమాయుక్తముగా ప్రకటన 12:5లోని ఈ మాటలు నెరవేరినవి: “సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను.” దేవుని స్త్రీకి జన్మించిన నూతనశిశువు, క్రీస్తు ఆధ్వర్యమందలి యెహోవా రాజ్యముయొక్క పుట్టుకకు చిత్రీకరణయని తొలుత ది వాచ్‌టవర్ మార్చి 1, 1925నందు వివరించబడినది. 1914లో పరలోకమందు జన్మించిన ఈ మెస్సియా రాజ్యమునకు, 1919లో భూమిమీద జన్మించిన సీయోను ‘పిల్లల’ “జనము”నకు భేదముకలదు—యెషయా 66:7, 8.
6. (ఎ) రాజ్యపుట్టుక యేసు ప్రవచించిన ఏ పనికి పిలుపునిచ్చినది? (బి) ఈ పనినిచేయుట యెహోవా ప్రజల భాగముగా దేనిని చేయుటను కోరినది, ఏ విధముగా వారిప్పుడు పరిస్థితిని ఎదుర్కొనుచున్నారు?
6 సమస్త విశ్వమందు తన సార్వభౌమాధిపత్య హక్కును మహిమపరచుకొనుటకు మూలమైన యెహోవా రాజ్యము జన్మించెను, కాగా ఈ వార్తను భూమియందంతట ప్రచారము చేయవలసిన పని అక్కడయుండెను! మరియు తన అదృశ్య “సాన్నిధ్యమున”కు రుజువుగా యేసుచెప్పిన ఈ మాటల నెరవేర్పునకు ఇప్పుడు సమయము వచ్చియుండెను: “మరియు ఈ రాజ్యసువార్త సకలజనములకు సాక్ష్యార్థమై భూమియందంతట ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:3,14) కాగా భూమియందంతట ఐక్యత మరియు అనుగుణ్యత కలిగిన అంతర్జాతీయ ప్రకటనపనికి యెహోవావిశ్వవ్యాప్తమైన సంస్థలోని దృశ్యభాగముయొక్క వ్యవస్థీకరణకు ఇది పిలుపునిచ్చినది. దీనిని చేయుటకు, అప్పటి ప్రెసిడెంటు అయిన జె. యఫ్. రూథర్‌ఫర్డ్ ప్రాతినిధ్యమందలి వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్సొసైటి సుముఖముగా యుండెను. కాగా, మహా గొప్ప వ్యవస్థాపకుడైన యెహోవాదేవుని నడిపింపు మరియు ఆశీర్వాదముకొరకైన ప్రార్థనతో, యుద్ధానంతర సంవత్సరమైన 1919నుండి పునరుద్ధరింపబడిన జనాంగముగా, సొసైటిని యథార్థముగా బలపరచు వారిని వ్యవస్థీకరించు పని నిర్ణయాత్మకముగా ముందుకు సాగినది. రెండవప్రపంచయుద్ధము జరుగుచున్న కాలమున ఫ్యాసిస్టులు, హిట్లరు నాజీవిధానము, కేథలిక్కు చర్యలద్వారా, తీవ్ర వ్యతిరేకతలున్నను, శత్రులోకమును భూమియందంతటనున్న యెహోవాసాక్షులు ఐక్యతతో ఎదుర్కొనిరి.
7. (ఎ) ఒకరియెడల మరియొకరు కేవలము ఎటువంటి సంబంధమందు నిలిచియుండుటద్వారా మాత్రమే, యెహోవా ప్రజలు మహాశ్రమలను దాటగలందులకు అపేక్షించవచ్చును? (బి) జలప్రళయమునుండి తప్పించుకొనినవారు భూవ్యాప్త జలప్రళయమునుండి ఎట్లు తప్పించుకొనిరి, వారు ఎవరికి చిత్రీకరణయైయున్నారు?
7 అభిషేకించబడిన శేషము మరియు “గొప్ప సమూహము”నకు చెందిన యెహోవాసాక్షులు మాత్రమే అపవాదియగు సాతాను అధికారమందున్న మరియు నాశనమునకు సిద్ధముచేయబడియున్న ఈ విధానాంతముమీదికి రాబోవు అంతమునుండి, రక్షింపబడు లేఖనానుసారమైన నిరీక్షణను కలిగియున్నారు. (ప్రకటన 7:9-17; 2 కొరింథీయులు 4:4) వారు, మానవచరిత్రయంతటిలో క్రితమెన్నడు కలుగని ఆ తీవ్రశ్రమలో తప్పింపబడు “శరీరి”గా యుందురు. నోవహు దినములు ఏలాగుండెనో, తాను బయలుపరచబడు దినమందును పరిస్థితి అలాగేయుండునని యేసు చెప్పెను. అనేక సంవత్సరముల ఐక్య ప్రయత్నముల ఫలితముగా నిర్మితమైన ఓడద్వారా, ఆ భూవ్యాప్తిత జలప్రళయమందు కేవలము ఎనిమిది మానవ ఆత్మలు మాత్రమే రక్షింపబడినవి. ఐక్యపరచబడిన కుటుంబముగా వారు రక్షింపబడిరి. (మత్తయి 24:22, 37-39; లూకా 17:26-30) నోవహు భార్య క్రీస్తు పెండ్లికుమార్తెకును, ఆయన కుమారులు మరియు కోడళ్లు గొప్పసమూహముగా వృద్ధియగుచున్న యేసు ప్రస్తుత-దిన “వేరేగొర్రెలకును” పోలికగాయున్నారు. వీరు చివరకు ఎంతమందియగుదురో మనకిప్పుడు తెలియదు. (యోహాను 10:16) మహాగొప్ప నోవహుయైన యేసుక్రీస్తు క్రింద వెయ్యేండ్ల పరిపాలనలోకి రక్షింపబడుటకు, ఎవరినిమిత్తమై మహాశ్రమల దినములు తక్కువచేయబడెనో ఆ “ఏర్పరచబడిన” అభిషక్త శేషముతో వీరు వ్యవస్థగా నిలిచియుండవలసియున్నారు.—మత్తయి 24:21, 22.
వెయ్యేండ్లపాలనలోకి రక్షింపబడుట
8. తన సాన్నిధ్యమును గూర్చిచెప్పిన ప్రవచన ముగింపునందు, యేసు ఏ ఉపమానమును చెప్పెను, దానిని అర్థము చేసుకొనుటలో 1935, జున్ 1వ తేది ఎట్లు ప్రాముఖ్యమైయుండెను?
8 మత్తయి సువార్త ప్రకారము, తన సాన్నిధ్యమును గూర్చిన తన ప్రవచనమును యేసు ఒక ఉపమానముతో ముగించెను. సాధారణముగా గొర్రెల, మేకల ఉపమానమని మనము పిలుచు ఆ ఉపమానము ఇప్పుడు అనగా, 1914లో అన్యరాజుల కాలములు ముగియుటతో ప్రారంభమైన యుగసమాప్తి కాలమందు అన్వయింపును కలిగియున్నది. (మత్తయి 25:31-46) ఈ ఉపమానములోని గొర్రెలు గొప్పసమూహములోని సభ్యులని అర్థము చేసుకొను విషయములో, 1935 జూన్ 1, శనివారము ప్రాముఖ్యమైన తేదీయైయుండెను. ఆ దినమున వాషింగ్టన్ డి.సి.,లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశమునందు 840మంది యెహోవాకు యేసుక్రీస్తుద్వారా తమ సమర్పణకు సూచనగా బాప్తిస్మముపొందిరి. ప్రకటన 7:9-17 ఆధారముగా జె. ఎఫ్. రూథర్‌ఫర్డ్ యిచ్చిన ప్రసంగమునకు ప్రత్యుత్తరముగా వీరిలో అనేకులు ఈ చర్యనుగైకొనిరి. రానైయున్న మహాశ్రమలనుండి తప్పింపబడి, బ్రతికియుండే ఈ విధానాంతమునుండిదాటు అవకాశముగల, మంచికాపరియొక్క వేరేగొర్రెలలో భాగముగా తయారగుట, అలాగే కాపరియైన-రాజగు యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలోనికి ప్రవేశించి, చివరకు పరదైసుగా మారిన భూమిపై నిత్యజీవముపొందుట వారి కోరికయైయుండెను.—మత్తయి 25:46; లూకా 23:43.
9. “సిద్ధముచేయబడిన రాజ్యమును” స్వతంత్రించుకొనుటకు గొర్రెవంటివారు ఎందుకు ఆహ్వానింపబడిరి, మరియు వారు ఎట్లు రాజు సహోదరులయెడల మంచిచేయుటకు శ్రేష్టమైన స్థానమందున్నారు?
9 ఈ గొర్రెలాంటి వ్యక్తులు “లోకము పుట్టినది మొదలుకొని [వారికొరకు] సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుటకు” ఎందుకు ఆహ్వానింపబడుచున్నారు? తన “సహోదరులకు” మేలుచేయుటద్వారా తనకు మేలుచేసియున్నారని రాజు వారితో చెప్పెను. “సహోదరులు” అనుటలో యుగసమాప్తియందు ఇంకను భూమిపై జీవించియుండు తన ఆత్మీయసహోదరులని రాజు భావమైయుండెను. కాపరియైన-రాజగు యేసుక్రీస్తుయొక్క సహోదరులతో ఏకమై ఒక్కమంద అగుటద్వారా, అట్టి శేషముతో సాధ్యమైనంత సన్నిహిత సహవాసమును కలిగినవారై వారు, వారికి మేలు చేయుటకు సరైన స్థానమందుందురు. అంతము రాకమునుపు స్థాపించబడిన రాజ్యవర్తమానమును ప్రకటించు యేసు సహోదరులకు వస్తుదాయకముగాను సహాయముచేయుదురు. ఈ విషయములో ఒకే కాపరియొక్క ఒక్కమందగా, శేషముతో వ్యవస్థగా నిలిచియుండు ఆధిక్యతను వారు తమ భాగ్యముగా ఎంచుదురు.
10. “లోకము పుట్టినది మొదలుకొని [వారికొరకు] సిద్ధముచేయబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడనుటలో” గొర్రెవంటివారికి అది ఏ భావమైయున్నది?
10 సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుట అనగా దాని భావము ఈ గొర్రెలు యేసుతోను ఆయన సహోదరులతోను పరలోకములో వెయ్యిసంవత్సరములు ఏలుదురని కాదు. బదులుగా వెయ్యేండ్లపాలన ప్రారంభమునుండే వీరు రాజ్యముయొక్క భూసామ్రాజ్యమును స్వతంత్రించుకొందురు. వారు ఆదాముహవ్వల సంతానమైయున్నందున, క్రీస్తుద్వారాగల దేవునిరాజ్యముయొక్క అధికారము విస్తరించగల ఈ భూపరిధి విమోచించబడగల మానవజాతియొక్క “లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడియున్నదని” దాని భావము. అంతేకాకుండా, గొర్రెలుగాయున్నవారు “నిత్యుడగు తండ్రి”కాగల రాజుయొక్క భూసంబంధమగు పిల్లలగుదురు కావున, దేవునిరాజ్యముక్రింద వారు భూప్రాంతమును లేక సంస్థానమును స్వతంత్రించుకొందురు.—యెషయా 9:6, 7.
11. తాము రాజ్యము కొరకు నిలిచియున్నామని గొర్రెవంటివారు ఎట్లు చూపింతురు, మరియు ఇందును బట్టి, వారికి ఏ ఆశీర్వాదము లభించును?
11 సూచనార్థకమైన మేకలకు భిన్నముగా, గొర్రెలాంటివారు నిశ్చయముగా తాము రాజ్యముకొరకు నిలిచియున్నారని చూపించుకొందురు. ఎట్లు? కేవలము మాటలద్వారాకాక, క్రియలద్వారా వారట్లు చూపింతురు. రాజు పరలోకములో అదృశ్యుడైయున్నందున తనరాజ్యమునకు మద్దతుగా రాజుకు వీరు నేరుగా మేలుచేయలేరు. అయితే వారు ఇంకను భూమిపైయున్న ఆయన ఆత్మీయ సహోదరులకు మేలు చేయుదురు. అలా మంచిచేయుట వలన వారికి, మేకలద్వారా హింస, ద్వేషము, వ్యతిరేకతలు కల్గినను, వారు ‘తండ్రివలన ఆశీర్వదింపబడిరని’ రాజు గొర్రెలకు చెప్పును.
12. రక్షింపబడు గొర్రెవంటివారు ఎవరిని జీవమునకు ఆహ్వానించు ఆధిక్యతను కలిగియుందురు, మరియు ఈ విషయములో, శేషించినవారిలోని కొందరు ఎటువంటి తలంపును కలిగియుండిరి?
12 రాజుయొక్క ఆత్మీయ సహోదరులకు ఉపకారముచేయు గొర్రెలాంటి గొప్పసమూహము, వెయ్యేండ్ల పరిపాలనలోనికి రక్షింపబడే ఆనందదాయకమైన ఆధిక్యతతో ఆశీర్వదింపబడుదురు. తగినకాలమందు, సమాధులలోయున్న మానవమృతులను తిరిగి ఆహ్వానించుటయందు పాల్గొందురు. (యోహాను 5:28, 29; 11:23-25) వీరిలో, “మరిశ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి,” బహుశ త్వరగాకలుగు పునరుత్థానము కొరకు, యెహోవా సార్వభౌమాధిపత్యమును మహిమపరచుటకు బాధింపబడినను, సహించిన విశ్వాసులైన పితరులు, ప్రవక్తలును చేరియుందురు. (హెబ్రీయులు 11:35) పాక్షికముగా హెబ్రీయులు 11వ అధ్యాయములో ప్రస్తావించబడిన విశ్వాసులైన స్త్రీపురుషులలో బాప్తిస్మమిచ్చు యోహానుయు చేరియుండును. (మత్తయి 11:11) తాము అలానే బ్రతికియుండి, సా.శ. 33నకు ముందు చనిపోయిన అట్టి విశ్వాసులైనవారిని పునరుత్థానమందు స్వాగతింతుమని అభిషక్తశేషములోని కొందరు తలంచిరి. మరి అభిషక్తులు అట్టి ఆధిక్యతను కలిగియుందురా?
13. భూమిమీదకు పునరుత్థానమగు వారిని ఆహ్వానించుటకు మరియు వారియెడల శ్రద్ధచూపించుటకు ఎందుకు శేషించినవారు అక్కడ ఉండనవసరములేదు?
13 అలా కలిగియుండనవసరము లేదు. అప్పటి పరిస్థితిని గూర్చి శ్రద్ధతీసుకొనుటకు, పునరుత్థానమగువారికి “నూతన ఆకాశము” క్రిందగల “నూతన భూమి”ని గూర్చి తెలియజెప్పుటకు, శ్రమనుండి రక్షింపబడు గొప్పసమూహము వారు విస్తారమైన సంఖ్యలోయుందురు. (2 పేతురు 3:13) ఇప్పుడు సహితము, గొప్పసమూహము ఈ పనికొరకు వ్యవస్థీకరించబడుచున్నారు. ఈనాడు యేసు ఆత్మీయసహోదరులు లెక్కకు 9,000 కంటె తక్కువగాయున్నారు, కాగా వీరిలోనుండి రక్షింపబడువారు సాధారణ పునరుత్ధానమునకు నడుపు సిద్ధపరచుపని విషయమై శ్రద్ధతీసుకొనుటకు వారు బహుకొద్దిమందియై ఉందురు. (యెహెజ్కేలు 39:8-16) కాబట్టి ఇక్కడ, లక్షలాదిగా సంఖ్యవృద్ధియగుచున్న గొప్పసమూహము ఆ పనిని బాగుగా చేయగలరు. నిశ్చయముగా అట్టి ఆధిక్యత వారికొరకు భద్రపరచబడియున్నది.
14. (ఎ) గొప్పసమూహములోని వారు దేనికొరకు తర్ఫీదు పొందుచున్నారు, మరియు వారిలో అనేకులు ఇప్పుడు ఎందుకు బాధ్యతను తీసుకొనవలసియున్నారు? (బి) ఎటువంటి సంఘటనలు త్వరలో జరుగవలెను, వేరేగొర్రెలకొరకు ఎలాంటి పని వేచియున్నది?
14 ఇప్పటికే గొప్పసమూహములోని అనేకులు సంఘ సంబంధ బాధ్యతలయందును, భూవ్యాప్తముగా దేవునిసంస్థచే జరిగించబడుచున్న నిర్మాణపనులయందును తర్భీదును పొందుచున్నారు. మరియు అదనముగా గొప్పసమూహములోని ఆత్మీయ పరిపక్వతగల పురుషులు, యెహోవా నేడు భూమియందంతట నడిపించుచున్న సంస్థలో గొప్పబాధ్యతలనివ్వబడుటను చూచుట ఎంతో ప్రోత్సాహకరముగా యున్నది. అభిషక్తులలో మిగిలియున్నవారు వయస్సులో వృద్ధులగుచు తమపైగల భారమును మోయుటలో తక్కువ సామర్థ్యమును కలిగియున్నారు. రాజుయొక్క ఈ సహోదరులు ఆత్మీయముగా అర్హులైన వేరేగొర్రెలలోని పెద్దలు మరియు పరిచారకులు యివ్వగల సంస్థాపరమైన ప్రేమగల సహాయమును ఆహ్వానించుచున్నారు. బహుత్వరలో మహాబబులోను భూమిపైనుండి తీసివేయబడును. అప్పుడు, ప్రకటన 19:1-8 సూచించుచున్న ప్రకారము పరలోకమందు గొర్రెపిల్ల వివాహము 1,44,000 మందితోనిండిన పెండ్లికుమార్తెతో జరుగును, కాగా నూతన ఆకాశముక్రింద నూతన భూమిగాయుండు వేరేగొర్రెలు భూమియంతయు యెహోవాకు స్తుతి కలుగునట్లుగా జనముతో నిండియున్న పరదైసు భూమిని పునరుద్ధరించు గొప్పపనిని చేయుటలో రాజుకు ప్రాతినిధ్యము వహింతురు.—యెషయా 65:17; 61:4-6ను పోల్చుము.
15. వెయ్యేండ్ల పరిపాలనలోని ఏ ఉత్తరాపేక్షలను గొప్పసమూహము ఎదురుచూచుచున్నది?
15 క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనయందు విమోచింపబడిన మానవజాతి పునరుత్థానమగునప్పుడు, రక్షింపబడబోవు గొప్పసమూహము విస్తారమైన, మరియు ఘనమైన ఆధిక్యతలను అనుభవింతురు. వారప్పుడు రాజుకు కుమారులును, కుమార్తెలును అగుదురు. రాజైన దావీదు కుమారులు యువరాజులుగా వివిధ బాధ్యతలను తీసికొనినట్లే, వారిలోని అట్టి కుమారులలో రాజులయ్యే అవకాశము కలదు.a యెహోవా అభిషక్తుడైన “రాజు”ను సూచించుచు రచింపబడిన కీర్తన 45ను ఇది మనకు గుర్తుచేయుచున్నది.
16. నిజానికి కీర్తన 45 ఎవరినిగూర్చి సంబోధించినది, దీనిని ఎట్లు నిరూపించవచ్చును?
16 నిజమునకు ఏ రాజును కీర్తన 45 సంబోధించుచున్నది? సందేహములేదు, అది యేసుక్రీస్తును సంబోధించుచున్నది! ఆ కీర్తన 45:7ను ఎత్తివ్రాయుటలో హెబ్రీయులు 1:9 ఆ అన్వయింపును చేయుచున్నది. అది ఇలా చదువబడుచున్నది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటె హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.” కాబట్టి కీర్తన 45:16 నిజముగా మహిమపరచబడిన యేసుక్రీస్తునకు ఇట్లు చెప్పుచున్నది: “నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.”
17. రాజైన యేసుక్రీస్తు దేనియందు మరియు ఎవరియందు ప్రత్యేకముగా శ్రద్ధను కలిగియున్నాడు?
17 సరియైన విధముగా, యేసు గతమునందలి భూజీవితముకన్న రాజుగా పరిపాలింపబోవు తన భవిష్యత్తునందు ఎక్కువ శ్రద్ధనుకలిగియున్నాడు. అయితే, ఆ గతమును, ప్రత్యేకముగా అబ్రాహాము సంతానముద్వారా కుటుంబములన్నిటిని యెహోవా వాగ్ధానములో చేరియున్న ఆయన మానవ పితరులను యేసు మరచిపోడు. అయితే యిప్పుడు ఆయన ముఖ్య ఆసక్తి ఏమనగా, రాజునుచేసిన యెహోవాదేవుని సంకల్పమందలి భవిష్యత్తు కార్యక్రమమైయున్నది. కావున, యేసు భూసంబంధమైన పిల్లలు, ముఖ్యముగా అర్హులుగా యున్న వారిలోని పిల్లలు అధికారులుగా—తన భూసంబంధమైన పితరులకంటె ఎక్కువగా—అట్టి ఆసక్తిగల స్థానమును వహింతురు.
18. యేసుకు తన భూసంబంధ పితరులకంటే అధిపతులగు కుమారులమీదయుండు గొప్ప శ్రద్ధను కీర్తన 45:16ను తర్జుమా చేసిన కొన్ని భాషాంతరములు ఎట్లు నొక్కిచెప్పుచున్నవి?
18 పితరులకన్న రాజకుమారులందు యేసు ఎక్కువ శ్రద్ధ వహించునని అనేక బైబిలు తర్జుమాలయందు నొక్కిచెప్పబడినది. కొందరు కీర్తన 45:16ను తర్జుమా చేసిన రీతి యిలాగున్నది: “నీ పితరులస్థానములో నీకు కుమారులుందురు, వారు భూమియందంతట రాజులుగా ఉందురు.” (మోఫత్) “నీ పితరుల స్థానమును నీ కుమారులు తీసుకొందురు. వారిని నీవు భూమియందంతట రాజులుగా చేయుదువు.” (17వ వచనము, ది న్యూ అమెరికన్ బైబిలు) “నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు జన్మింతురు, భూమిపై వారిని నీవు రాజులుగా చేయుదువు.”—సామ్యూల్ బాగ్స్టర్ అండ్ సన్స్ ప్రచురించిన, ది సెప్టాజెంట్ వర్షన్.
19. గొప్పసమూహములోని కొంతమంది మనుష్యులకు ఇప్పుడు ఏ ఆధిక్యతలు కలవు, మరియు రాజైన యేసుక్రీస్తు తన వెయ్యేండ్లపాలనలో వారిని ఏ స్థానమున నియమించును?
19 మనకు సంతోషము కలిగించురీతిగా భవిష్యత్తునందు కాబోయే “అధిపతులు” మనమధ్యనేయున్నారు. మంచికాపరియైన యేసుక్రీస్తు స్వరమును విను వేరేగొర్రెలలో వారిని మనము కనుగొనవచ్చును. ప్రత్యేకముగా 1935లో వాషింగ్టన్ డిసి., నందు ప్రకటన 7:9-17 వివరించబడినప్పటినుండి వారు ఆ స్వరమును వినుచున్నారు. ఈనాడు ప్రపంచమంతటయున్న 212 దేశములలో, 60,192కు పైగాగల యెహోవా సాక్షుల సంఘములలో ఈ వేరేగొర్రెలలోని గొప్పసమూహపు వారు వేలసంఖ్యలలో పెద్దలుగాను లేక పైవిచారణకర్తలుగాను సేవచేయుచున్నారు. ఇంకను భూమిపైనున్న యేసుయొక్క ఆత్మీయసహోదరులతో వ్యవస్థీకరించబడినవారిగా నిలిచియుండుట, ద్వారా, ఈ మనుష్యులు వాగ్ధానము చేయబడిన నూతన భూమిపై వెయ్యేండ్లపరిపాలనలో రాజగు యేసుక్రీస్తుకు భూసంబంధమగు కుమారులుగా సంపూర్ణముగా దత్తత తీసుకొనబడు వరుసలో ఉన్నారు. (2 పేతురు 3:13) విషయమట్లున్నది గనుక, వారు నూతన భూమిపై అధిపతులుగా సేవచేయవచ్చును.
20. (ఎ) రాజుకు తాను భూమిమీద నియమించిన వారియెడల ఎటువంటి దృక్పధమును కలిగియుండును? (బి) గొప్పసమూహము వారు ఎవరిని జీవమునకు ఆహ్వానింతురు, మరియు జీవమునకు వచ్చువారియెదుట ఏ అవకాశము ఉంచబడును?
20 ప్రస్తుత యెహోవా సాక్షుల సంఘములలో నమ్మకస్తులైన వేరేగొర్రెల పైవిచారణను యేసు గుర్తించినరీతిగానే, నూతనముగా నియమింపబడు ఈ అధిపతులను గుర్తించుటకు రాజైన యేసుక్రీస్తు సంతోషించును. వేరేగొర్రెలలోని గొప్పసమూహపు సభ్యులందరు—స్త్రీలు మరియు పురుషులు—భూవ్యాప్తముగా పరదైసుగా మార్చబడు శుభ్రపరచబడిన భూమిలో మానవ పరిపూర్ణతయందు నిత్యజీవమునొందు అవకాశముతో యేసు స్వరమువిని మృతులలోనుండి తిరిగివచ్చు వారినందరిని ఆహ్వానించు పులకరింపజేయు ఆధిక్యతను కలిగియుందురు. (యోహాను 5:28, 29) అట్లు ఉన్నతమైన దయతో పునరుత్థానమగువారిలో “మరిశ్రేష్టమైన పునరుత్థానమును పొందుటకై” యెహోవాదేవుని యెడల మరణమువరకు తమభక్తిని చూపుటకు యిష్టపడిన విమోచింపబడిన యేసు పితరులును చేరియుందురు. (హెబ్రీయులు 11:35) అయితే, విమోచకుడైన రాజగు యేసుక్రీస్తు వెయ్యేండ్లపరిపాలనలో పరిపూర్ణమైన మానవజీవితమునకు తేబడుట కేవలము ప్రారంభము మాత్రమే. వెయ్యేండ్ల పరిపాలనాంతములో పునరుద్ధరింపబడిన మానవజాతిపైకి వచ్చు చివరిపరీక్షలో యెహోవాదేవుని క్రింద స్థిరముగా వ్యవస్థీకరించబడిన వారమైయుండుటద్వారా యెహోవాదేవుని విశ్వసంస్థలో భూసంబంధమైన భాగముగా పరదైసులో నిరంతరజీవితమునకు యోగ్యులుగా వారు నిరూపించుకొందురు.—మత్తయి 25:31-46; ప్రకటన 20:1–21:1. (w89 9/1)
[అధస్సూచీలు]
a 2 సమూయేలు 8:18ను న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిల్, పాదవచనముతో పోల్చుము.
మీరెట్లు జవాబిత్తురు?
◻ మానవజాతినంతటిని ఆశీర్వదించుటకు ఏ సమయమును యెహోవా నియమించియున్నాడు?
◻ ఒకరియెడల ఒకరు కేవలము ఎటువంటి సంబంధమందు నిలిచియుండుటద్వారా మాత్రమే మనము మహాశ్రమలను తప్పించుకొనగలము?
◻ ‘లోకము పుట్టినది మొదలుకొని సిద్ధముచేయబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుట’ అనగా అది గొర్రెవంటివారికి ఎటువంటి భావమైయున్నది?
◻ వెయ్యేండ్లపరిపాలనలో, ఏ ఆధిక్యతలయందు గొప్పసమూహము భాగము వహించును?