మీ విశ్వాసమునుబట్టి మీరు లోకముపై నేరస్థాపన చేయుదురా?
“విశ్వాసమునుబట్టి నోవహు. . .తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; ఈ విశ్వాసమునుబట్టి ఆయన లోకముమీద నేరస్థాపనచేసెను.”—హెబ్రీయులు 11:7 NW.
1, 2. నోవహు జీవితమును పరిశీలించుటనుండి మనమేమి నేర్చుకొనగలము?
యెహోవా మానవులందరిలో కేవలము ఎనిమిదిమందిగల నోవహు ఆయన కుటుంబమునకు మాత్రమే జలప్రళయమునుండి రక్షించబడు ఆధిక్యతను అనుగ్రహించి, తన తరమువారైన ఇతరులందరిని జలసమాధిచేయుటతో వారి జీవితములు ముగిసిపోయెను. అయితే మనకందరికి నోవహుయే సామాన్య మూలపురుషుడైయున్నందున ఆయన కనపరచిన విశ్వాసమునకు మనమెంతో కృతజ్ఞులమైయుండవలెను.
2 నోవహు జీవితమును పరిశీలించుటద్వారా మనమెంతో నేర్చుకొనగలము. దేవుడు నోవహు తరమువారందరిని నాశనము చేసినప్పుడు ఆయన నోవహుకు రక్షణనిచ్చి ఎందుకు అనుగ్రహము చూపాడో లేఖనములు మనకు చెప్పుచున్నవి. అయితే అవే దైవిక వ్రాతలు మన తరము కూడా దేవునివలన అలాంటి తీర్పునే ఎదుర్కొనబోవుచున్నదని చూపుచున్నవి. దీనిని గూర్చి యేసు ఇట్లు చెప్పెను: “లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:21) కావున మనమును నోవహు విశ్వాసమును అనుకరించుటద్వారా, ప్రస్తుత దుష్టవిధానముపైకి ముంచుకొస్తున్న నాశనమునుండి రక్షించబడు నిశ్చయమైన నిరీక్షణను కలిగియుండగలము.—రోమీయులు 15:4; హెబ్రీయులు 13:7ను పోల్చుము.
3. యెహోవా జలప్రళయమును ఎందుకు తెచ్చెను?
3 ఆదాము సృష్టినుండి జలప్రళయము వరకుగల 1,656 సంవత్సరముల కాలమంతటిలో చాలా కొద్దిమంది మానవులు మాత్రమే మంచినిచేయు భావమును కలిగియుండిరి. నైతికస్థితి ఎంతో అధోఃగతికి దిగజారెను. “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను.” (ఆదికాండము 6:5) బలత్కారము, సుఖమును-వెదకుట, స్త్రీలను వివాహముచేసికొని బలాఢ్యులైన సంతతిని ఉత్పత్తిచేసినట్టి శరీరధారులైన దేవదూతల ఉనికి ఆ పురాతన లోకముపైకి దేవుడు తన తీర్పును విధించుటకు నడిపించినవి. నోవహుతో యెహోవా ఇట్లనెను: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది.” అట్లు “సర్వలోకమునకు తీర్పుతీర్చు” సృష్టికర్తయొక్క ఓపికకు పరిమితి దాటెను.—ఆదికాండము 6:13; 18:25.
నోవహు దేవునితో నడిచెను
4. (ఎ) యెహోవా నోవహును ఎట్లు దృష్టించెను? మరియు ఎందుకు? (బి) దేవుని న్యాయము ఆ దుష్టలోకమును నాశనము చేయునట్లు చేసినను, నోవహు మరియు తన కుటుంబముయెడల ఆయన ప్రేమ ఎట్లు వ్యక్తమైనది?
4 తన దినములనాటి ప్రజలకు నోవహు ఎంత భిన్నముగా ఉండెను! “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. . .నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైయుండి, నిజమైన దేవునితోకూడ నడిచెను.” (ఆదికాండము 6:8, 9 NW) దేవునితోకూడ నోవహు ఎట్లు నడిచెను? నీతిని చాటువానిగా ప్రకటించుట, విశ్వాసము, విధేయతతో ఓడను నిర్మించుట మొదలగు సరైనవాటిని చేయుటద్వారా ఆయనట్లు చేసెను. ఆ పురాతన లోకము పూర్తిగా చెడిపోయియుండుటనుబట్టి అది నాశనము చేయబడినను, దేవుడు, “భక్తిహీనుల లోకముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని ఆయన కాపాడెను.” (2 పేతురు 2:5) అవును, న్యాయవంతుడును, ప్రేమగల దేవుడైన యెహోవా దుష్టులతోపాటు నీతిమంతులను నాశనముచేయలేదు. నోవహుతో ఆయన తనను, తన యింటివారిని, జలప్రళయము తరువాత భూమిని నింపుటకై అనేక జంతువుల రక్షించుకొనునట్లు ఒక పెద్ద ఓడను నిర్మించవలెనని ఆజ్ఞాపించెను. నోవహు “అట్లు చేసెను.”—ఆదికాండము 6:22.
5. నోవహు నీతిని మరియు విశ్వాసమును లేఖనములు ఎట్లు వర్ణించుచున్నవి?
5 ఓడ సిద్ధమైనప్పుడు దేవుడు నోవహుతో: “ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి,” అని చెప్పెను. ఆ సంగతులను పౌలు ఇట్లు వర్ణించుచున్నాడు: “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తనయింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.”—ఆదికాండము 7:1; హెబ్రీయులు 11:7.
6. నోవహు తన విశ్వాసమునుబట్టి ఆయన దినములనాటి లోకముపై ఎట్లు నేరస్థాపనచేసెను?
6 నోవహు బహుగొప్ప విశ్వాసమును కలిగియుండెను. ఆతరమును తుడిచివేయుటనుగూర్చి దేవుడు చెప్పినదానిని ఆయన నమ్మాడు. యెహోవాను అసంతోషపరచు విషయంలో సరైన భయము కలిగియుండి, దేవుడిచ్చిన ఆజ్ఞలమేరకు విధేయతతో ఓడను నిర్మించెను. అంతేగాక, నోవహు నీతిని ప్రకటించువానిగా ఇతరులకు రానైయున్న నాశనమునుగూర్చి చెప్పెను. ఆయన మాటలను వారు వినకపోయినను, ఆ దుష్టలోకము తనను దాని “అడుగుజాడలలోకి మలుచుకొనునట్లు” ఆయన అనుమతించలేదు. (రోమీయులు 12:2, ఫిలిప్స్) బదులుగా, దాని దుష్టత్వమునుబట్టి ఆ లోకముపై నేరస్థాపనచేసి, అది నాశనమునకు తగినదని ఆయన చూపించెను. తన విధేయత మరియు నీతిక్రియలనుబట్టి తాను, తన కుటుంబమేకాక, జీవితవిధానమును మార్చుకొనుటకు యిష్టపడినట్లయిన ఇతరులును రక్షించబడియుండేవారని చూపించెను. తన స్వంత అసంపూర్ణ శరీరము, చుట్టూ ఉన్న దుష్టలోకము, మరియు అపవాదినుండి వత్తిడులున్నను దేవునిని సంతోషపరచిన జీవితమును జీవించ సాధ్యమని నిజమునకు నోవహు రుజువుపరచెను.
ప్రస్తుత విధానమును దేవుడు ఎందుకు నాశనముచేయును
7. మనము అంత్యదినములలో జీవించుచున్నామని మనకెట్లు తెలియును?
7 ఈ 20వ శతాబ్దపు ప్రతి దశాబ్దము లోకము మరియెక్కువగా దుష్టత్వములోకి మునిగిపోవుటను చూచినది. ప్రత్యేకముగా మొదటి ప్రపంచ యుద్ధము ప్రారంభమైననాటినుండి ఇది వాస్తవమైయున్నది. లైంగిక అవినీతి, నేరము, బలత్కార్యము, యుద్ధము, ద్వేషము, పేరాశ, రక్తమును దుర్వినియోగపరచుట మొదలగు విషయములందు మంచిని ప్రేమించువారు పరిస్థితులు ఇంకను నీచముగా మారునని తలంచురీతిగా మానవజాతి మునిగియున్నది. అయినను, మనము “అంత్యదినములలో” జీవించుచున్నామనుటకు మరి ఎక్కువ రుజువుగా మనతరమందు విపరీతముగా దుష్టత్వము పెరుగుటను బైబిలు ముందే తెలియజేసినది.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:34.
8. పాపమునుగూర్చిన మనోతలంపునుగూర్చి కొందరు ఏమి చెప్పియున్నారు?
8 ఈనాడు, బహు ఎక్కువమంది మనస్సులలో పాపమును గూర్చిన తలంపు నిరర్థకమైనదిగా ఉన్నది. 40 సంవత్సరముల క్రితము పోప్ పియస్ XII ఇట్లు గమనించెను: “ఈ శతాబ్దపు పాపము, పాపమునుగూర్చిన సమస్త వివేచనను కోల్పోయినదైయున్నది.” ప్రస్తుత తరము పాపమును, దోషమును ఒప్పుకొనుటకు తిరస్కరించుచున్నది. వాటెవర్ బికేమ్ ఆఫ్ సిన్? అను తన పుస్తకములో డా. కార్ష్ మెనింజెర్ ఇట్లు తెలియజేసెను: “‘పాపము’ అను పదము. . . ఆ పదము, దాని భావముతోకూడ దాదాపు పూర్తిగా మాయమైనది. ఎందుకు? ఇక ఎవరును పాపము చేయనందు వలననా?” అనేకులు తప్పిదమునుండి సరైనదానిని వివేచించు సామర్ధ్యమును కోల్పోయి ఉన్నారు. అయితే ఇందుకు మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకనగా “అంత్యకాలములో” తన ‘ప్రత్యక్షతయొక్క సూచనను’ గూర్చి చర్చించునప్పుడు ఇట్టి పరిణామములను యేసు ముందే తెలియజేసెను.—మత్తయి 24:3; దానియేలు 12:4.
నోవహు దినములలో చూపబడిన తీర్పు మాదిరి
9. నోవహు దినములను తన ప్రత్యక్షత సమయంలో జరుగువాటితో యేసు ఎట్లు పోల్చెను?
9 నోవహు దినములలోని సంఘటనలకు మరియు 1914 నుండి ఆయన రాజ్యాధికారముతో ప్రత్యక్షమై ఉండు సమయంలో జరుగువాటికి పోలికను యేసు చూపించెను. ఆయన ఇట్లనెను: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని ప్రత్యక్షతయు ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగక పోయిరి; మనుష్యకుమారుని ప్రత్యక్షతయు ఆలాగే ఉండును.”—మత్తయి 24:37-39 NW.
10. క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధముగా జరుగు సూచనాత్మక సంఘటనలను సామాన్యముగా ప్రజలు ఎట్లు లక్ష్యపెట్టరు?
10 అవును, నోవహు దినములలో వలెనె ఈనాడు ప్రజలు, ఎంతమాత్రము లక్ష్యపెట్టరు. వారు ప్రతిదినజీవితమును, స్వార్ధపర ఆశలను వెంటాడుటలో తీరికలేనివారై, ప్రస్తుత పరిస్థితులు గతమునకు భిన్నముగా ఉన్నవనియు, అంత్యకాలమును సూచించుటకై యేసు తెలిపినవాటికి సరిగా తగినట్లున్నవనియు గుర్తించుటకు ఒప్పుకొనరు. అనేక సంవత్సరములనుండి యెహోవాసాక్షులు ఆధునిక తరమునకు మెస్సియా రాజుగా యేసు ప్రత్యక్షత 1914లో ప్రారంభమై, “యుగసమాప్తికి” సమాంతరముగా నడచుచున్నదని చెప్పుచున్నారు. (మత్తయి 24:3) కాని, అనేకమంది రాజ్యవర్తమానమును అపహాస్యము చేయుచున్నారు. అయితే ఇది ముందుగా అపొస్తలుడైన పేతురు వ్రాతలో చెప్పబడినది: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్ధాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.”—2 పేతురు 3:3, 4.
11. మహాశ్రమలు వచ్చునప్పుడు ఈనాటి తరము ఎందుకు క్షమింపబడనిదైయుండును?
11 అయినను, మహాశ్రమలు వచ్చునప్పుడు నేటి తరము క్షమాపణకు అరక్షమైనదైయుండదు. ఎందుకు? ఎందుకనగా దేవుడు మనదినములలో చేయబోవుదానికి మాదిరిగా పురాతన దైవికతీర్పుల బైబిలు వృత్తాంతములున్నవి. (యూదా 5-7) వారి కండ్లముందే నెరవేరు బైబిలు ప్రవచనములు కాలప్రవాహములో మనమెక్కడ ఉన్నామో స్పష్టముగా చూపుచున్నవి. అంతేగాక, ఈ తరము దానియెదుట హెచ్చరికగా యెహోవాసాక్షుల ప్రకటన పనిని మరియు, నోవహువలెనే యథార్థతను కాపాడుకొను వారి చరిత్రను కలిగియున్నది.
12. సారాంశముగా, “ఇప్పుడున్న ఆకాశము మరియు భూమికి” రాబోవుదానిని నోవహు దినములనాటి లోక నాశనమునకు ఎట్లు పోల్చెను?
12 ఈ వాస్తవములను లక్ష్యపెట్టనివారికి ఏమిసంభవిస్తుందో పేతురు వివరించుచున్నాడు. యేసువలె అపొస్తలుడు కూడ నోవహు దినములలో జరిగినదానిని సూచించుచు ఇట్లనుచున్నాడు: “ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రముచేయబడియున్నవి.”—2 పేతురు 3:5-7.
13. ముందున్న అతిప్రాధాన్యమైన సంఘటనల దృష్ట్యా, పేతురుయొక్క ఏ హెచ్చరికను లక్ష్యపెట్టవలెను?
13 నిశ్చయమైన ఈ దేవుని తీర్పును స్థిరముగా దృష్టియందుంచుకొని, అపహాసకులవలన మోసగించబడకుండ లేక బెదరింపబడకుండా ఉందుము గాక. వారి అంతములో మనమును పాలుపొందనవసరములేదు. పేతురు ఇట్లు హెచ్చరించుచున్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, భూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. అయినను మనమాయన వాగ్ధానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును”.—2 పేతురు 3:11-13.
రక్షింపబడుటకై నోవహు విశ్వాసమును అనుకరించుము
14. మనలను మనము విమర్శించుకొనుటకు ఏ ప్రశ్నలు సహాయము చేయును?
14 రక్షింపబడుటకు అర్హులై, అందు కొనసాగుటకు నోవహు ఆయన కుటుంబము ఏ సవాళ్లను ఎదుర్కొనినదో మనమును వాటినే ఎదుర్కొనుచున్నాము. నోవహువలెనే యెహోవాసాక్షులు కూడ సత్క్రియలతో కూడిన తమ విశ్వాసమునుబట్టి లోకముపై నేరము మోపుచున్నారు. అయితే వ్యక్తిగతముగా మనలో ప్రతి ఒక్కరము ఇట్లు అడుగుకొనవచ్చును: ‘వ్యక్తిగతముగా నేనెట్లు చేయుచున్నాను? మహాశ్రమలు రేపు వచ్చినట్లయిన, రక్షణకై యోగ్యునిగా దేవుడు నన్ను తీర్పుతీర్చునా? తన తరమువారిలో నిందారహితునిగా రుజువుపరచుకొనిన నోవహువలె, లోకమునుండి వేరైయుండుటకు కావలసిన ధైర్యము నాకు ఉన్నదా? లేక నా ప్రవర్తన, మాటలు, లేక దుస్తులనుబట్టి కొన్నిసార్లు నాకును మరియు లోకసంబంధమైన వ్యక్తికిని మధ్య తేడాను కనుగొనుట కష్టముగా ఉన్నదా?’ (ఆదికాండము 6:9) యేసు తన శిష్యులను గూర్చి ఇల చెప్పెను: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” —యోహాను 17:16; 1 యోహాను 4:4-6 ను పోల్చుము.
15. (ఎ) 1 పేతురు 4:3, 4 ప్రకారము మన పూర్వపు లోక ఆలోచనను మరియు ప్రవర్తనను మనమెట్లు దృష్టించవలెను? (బి) పూర్వపు లోకస్నేహితుల వలన మనము విమర్శించబడినట్లయిన మనమేమి చేయవలెను?
15 పేతురు ఇట్లు హెచ్చరించుచున్నాడు: “మీరు పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తక పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.” (1 పేతురు 4:3, 4) అవును, మీరు వారితోకూడ పరుగెత్తనందుకు లోకసంబంధులైన మీ పూర్వ స్నేహితులు మిమ్ములను దూషించవచ్చును. అయితే, మీరు వినయముతో చేయు సత్క్రియలు మరియు విశ్వాసమునుబట్టి నోవహువలెనే మీరును వారిపై నేరస్థాపన చేయగలరు.—మీకా 6:8.
16. దేవుడు నోవహును ఎట్లు ఎంచెను? మన తలంపులను మరియు ప్రవర్తనను పరిశీలించుకొనుటకు ఏ ప్రశ్నలు సహాయపడగలవు?
16 దేవుడు నోవహును నీతిమంతునిగా పరిగణించెను. విశ్వాసపాత్రుడైన ఆ పితరుడు “యెహోవా దృష్టికి కృపపొందిన వాడాయెను.” (ఆదికాండము 6:8) దేవుని ప్రామాణికపు వెలుగులో మీ ఆలోచనలను ప్రవర్తనను పరిశీలించుకొనినప్పుడు, మీరు వెళ్లు ప్రతిస్థలములో, మీరు చేయుదానిని ఆయన అంగీకరించునని మీరు భావించుకొందురా? ప్రస్తుతము అధికముగానున్న తుచ్ఛమైన వినోదములలో కొన్నిసార్లు మీరు ఊగిసలాడెదరా? దేవునివాక్యము మనకు పవిత్రమైన, శ్రేష్టమైన, క్షేమాభివృద్ధిరమైన వాటిని తలంచవలెనని చెప్పుచున్నది. (ఫిలిప్పీయులు 4:8) ‘మీ జ్ఞానేంద్రియములను మంచి చెడులను వివేచించునట్లు సాధకముచేయులాగున’ దేవుని వాక్యమును మీరు శ్రద్ధతో పఠించుచున్నారా? (హెబ్రీయులు 5:14) చెడుసహవాసులను వదలుకొని క్రైస్తవ కూటములు మరియు ఇతర సమయములందు తోటి యెహోవా ఆరాధికులతో సహవాసమును పెంచుకొందురా?—1 కొరింథీయులు 15:33; హెబ్రీయులు 10:24, 25; యాకోబు 4:4.
17. యెహోవాసాక్షులముగా మనము నోవహును పోలి ఎట్లుండగలము?
17 ఓడ పూర్తిచేయబడుటను తెలియజేస్తూ లేఖనములు ఇట్లు చెప్పుచున్నవి: “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” దైవసంబంధియగు ఆయన ఒక యెహోవాసాక్షిగా ప్రకటించుపనిలో పట్టుదల గలిగియుండెను. నోవహు వలెనే నీవును నీతిని క్రమముగా ప్రకటించువానిగా సరైనదానిని దృఢముగా చాటువాడవైయుండవచ్చును. కొద్దిమందే వినినను దుష్టలోకపు అంతమునుగూర్చి హెచ్చరికచేయుటలో పట్టుదలతో కొనసాగుము. అంతము వచ్చుటకు ముందు శిష్యులను తయారుచేయు పని జరుగునట్లు తోటివిశ్వాసులతో ఐక్యముగా పనిచేయుము.—మత్తయి 28:19, 20.
18. మహాశ్రమలలో రక్షించబడువారిని యెహోవా ఏ ఆధారమునుబట్టి నిర్ణయించుచున్నాడు?
18 నోవహు దినములలో చేసినట్లే, అవే నైతిక మరియు న్యాయపరమైన ప్రమాణములను అన్వయింపజేయుచు, దేవుడు ఇప్పుడు ఎవరు రక్షించబడాలి లేక మహాశ్రమలలో ఎవరు నాశనము చేయబడాలి అని నిర్ణయించుచున్నాడు. ప్రస్తుత వేరుచేయుపనిని యేసు గొల్లవాడు మేకలనుండి గొర్రెలను వేరుచేయుటకు పోల్చెను. (మత్తయి 25:31-46) స్వార్ధపర కోరికలు మరియు ఆశలపై తమ జీవితములను కేంద్రీకరించు ప్రజలు ఈ పాతలోకము నాశనమగుటను యిష్టపడరు. కావున వారు రక్షించబడరు. అయితే ఈ లోకపు కల్మషములో పాల్గొనకుండా, దేవునియందు బలమైన విశ్వాసమును కాపాడుకొనుచు, రాజ్యవర్తమానమును ప్రకటించుచు, రాబోవుచున్న యెహోవా తీర్పునుగూర్చి హెచ్చరిక చేయువారు రక్షించబడువారిగా దేవుని అనుగ్రహమును పొందుదురు. యేసు ఇట్లనెను: “ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొనిపోబడును, ఒకతె విడిచిపెట్టబడును.”—మత్తయి 24:40, 41; 2 థెస్సలొనీకయులు 1:6-9; ప్రకటన 22:12-15.
నోవహుతోకూడ ఆశీర్వాదములను పొందుము
19. అంత్యదినములలో ఏ సమకూర్పు జరుగునని యెషయా మరియు మీకా ప్రవచించియున్నారు?
19 సారూప్యముగలిగిన ప్రవచనములలో దేవుని ప్రవక్తలైన యెషయా మరియు మీకా అంత్యదినములలో జరుగుదానిని వర్ణించారు. ఈనాడు మన కండ్ల ముందు నెరవేరు దానిని అనగా పాతలోకమును వదలి సత్యారాధనయైన సూచనార్ధకపు పర్వతముదగ్గరకు నీతియుక్తమైన హృదయముగలవారు ప్రవాహమువలె వచ్చుటను వారు ముందుగనే చూశారు. ఈ నీతియుక్తమైన హృదయముగలవారు ఇతరులకు: “యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతము” అను ఆహ్వానమును అందించుచున్నారు. (యెషయా 2:2, 3; మీకా 4:1, 2) సంతోషదాయకమైన ఈ సమూహముతో మీరును నడచుచున్నారా?
20. తమ విశ్వాసముద్వారా లోకముపై నేరస్థాపనచేయువారు ఏ ఆశీర్వాదములను అనుభవింతురు?
20 యెషయా మరియు మీకా తమ విశ్వాసముద్వారా లోకముపై నేరస్థాపనచేయువారు అనుభవించే ఆశీర్వాదములను కూడ తెలుపుచున్నారు. వారిమధ్య నిజమైన సమాధానము, న్యాయము నెలకొనియుండి యుద్ధమిక ఎన్నటికి నేర్చుకొనరు. యెహోవా నుండి వచ్చు స్వాస్థ్యమును పొందు నిశ్చయమైన నిరీక్షణను కలిగియుండి ప్రతివాడును “తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుందురు.” అయితే ప్రతివ్యక్తి ఒక స్థిరమైన తీర్మానము చేసికొనవలెను. ఎందుకనగా మీకా రెండు విధానములు సాధ్యమని చూపుచున్నాడు. ఎట్లనగా: “సకల జనములు తమతమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”—మీకా 4:3-5; యెషయా 2:4.
21. భూమిపై నిత్యజీవముపొందు గొప్ప ఆశీర్వాదములో మీరెట్లు పాలుపొందగలరు?
21 మహాశ్రమలలో తప్పించుకొనుటకు మనకేమి అవసరమో లేఖనములు స్పష్టముగా చూపుచున్నవి. అదేమనగా బలమైన విశ్వాసము. నోవహు అలాంటి విశ్వాసమును కలిగియుండెను. మరి దానిని నీవు కలిగియున్నావా? అట్లయిన నోవహువలెనే నీవుకూడ “విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడవగుదువు.” (హెబ్రీయులు 11:7) ఆ తరముపైకి దేవుని నుండి వచ్చిన నాశనములో నోవహు రక్షించబడెను. ఆయన జలప్రళయము తర్వాత 350 సంవత్సరములు జీవించుటయేగాక, భూమిపై నిరంతరము జీవించు ఉత్తరాపేక్షతో పునరుత్థానము కానైయున్నాడు. ఎంతటి గొప్ప ఆశీర్వాదము! (హెబ్రీయులు 11:13-16) నోవహు, ఆయన కుటుంబము మరియు నీతిని ప్రేమించు లక్షలకొలది ఇతరులతోపాటు నీవును ఆ ఆశీర్వాదములలో పాల్గొనవచ్చును. ఎట్లు? అంతమువరకు సహించి మీ విశ్వాసముద్వారా లోకముపై నేరస్థాపన చేయుటనుబట్టియే. (w89 10/1)
మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొందురా?
◻ నోవహు జీవితమును పఠించుట క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?
◻ తమను నాశనమునకు నడుపునట్లు, ఈ తరము ప్రజలు దేనిని లక్ష్యపెట్టరు?
◻ నోవహువలె మనమెట్లు ఈలోకముపై నేరస్థాపన చేయగలము?
◻ నీతిని ప్రకటించిన నోవహువలె మనమెట్లుండగలము?