కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 1/1 పేజీలు 12-22
  • యెహోవా మందిరం యొక్క మించిన మహిమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మందిరం యొక్క మించిన మహిమ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పుష్కలమైన “ఆహారము”
  • ప్రపంచవ్యాప్తంగా కోతపని
  • ఎల్లప్పుడూ ముందుకు కొనసాగడం
  • హగ్గయి అంతిమ వర్తమానాలు
  • అందరూ యెహోవాను ఘనపర్చుదురుగాక!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “నేను మీకు తోడుగా ఉన్నాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 1/1 పేజీలు 12-22

యెహోవా మందిరం యొక్క మించిన మహిమ

“నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.”—హగ్గయి 2:7.

1. విశ్వాసం మరియు క్రియలతో పరిశుద్ధాత్మ ఎలా సంబంధాన్ని కలిగివుంది?

ఇంటింటికి ప్రకటిస్తుండగా ఒక యెహోవాసాక్షి ఒక పెంతెకొస్తు స్త్రీని కలిసింది, ఆ స్త్రీ ఇలా వ్యాఖ్యానించింది, ‘మాకు పరిశుద్ధాత్మ ఉంది, కాని క్రియ చేస్తున్నది మీరు.’ పరిశుద్ధాత్మ ఉన్నవారు సహజంగానే దేవుని పని చేయడానికి పురికొల్పబడతారని ఆమెకు యుక్తిగా వివరించబడింది. యాకోబు 2:17 ఇలా తెలియజేస్తుంది: “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.” యెహోవా ఆత్మ సహాయంతో ఆయన సాక్షులు దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. వారు నీతి కార్యాలు చేసేలా—ప్రాథమికంగా ‘ఈ రాజ్యసువార్తను సకల జనములకు సాక్ష్యార్థంగా లోకమందంతట ప్రకటించేలా’ చేయడం ద్వారా ఆయన ‘తన మందిరమును మహిమతో నింపాడు.’ యెహోవాకు సంతృప్తి కలిగేలా ఈ పని జరిగినప్పుడు, “అంతము వచ్చును.”—మత్తయి 24:14.

2. (ఎ) యెహోవా సేవలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం ఏ ఆశీర్వాదాలను తెస్తుంది? (బి) “ఆలస్యం” అని అనిపిస్తున్న దాని గురించి మనం ఎందుకు సంతోషించాలి?

2 యేసు పల్కిన ఈ మాటలనుబట్టి ‘శ్రీమంతుడగు దేవుని గూర్చిన మహిమగల సువార్తను’ ఇతరులకు ప్రకటించడంపై దృష్టినిల్పడమే నేడు మనం చేయాల్సిన పనియనే నిర్ధారణకు మనం వస్తాము, అది మనకు అప్పగించబడింది. (1 తిమోతి 1:11) మనం యెహోవా సేవలో సంతోషంతో ఎంతగా నిమగ్నమౌతామో అంత త్వరగా అంతం వస్తున్నట్లు మనకనిపిస్తుంది. హబక్కూకు 2:2, 3 నందు మనం యెహోవా మాటల్ని ఇలా చదువుతాము: “చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” అవును, “ఆ దర్శనవిషయము” “ఆలస్యముగా వచ్చినను” అది నిజమౌతుంది. మనం యేసు రాజ్య పరిపాలన యొక్క 83వ సంవత్సరంలో ఉన్నాము గనుక మనమిప్పుడు ఆలస్యమౌతున్న కాలంలో ఉన్నట్లు కొందరు భావించవచ్చు. అయితే, అంతం ఇంకా రాలేదని మనం సంతోషించవద్దా? ఈ 1990లలో, అద్భుతమనిపించేలా తూర్పు యూరపులోను ఆఫ్రికానందలి కొన్ని ప్రదేశాల్లోను, ఇతర దేశాల్లోను సువార్త ప్రకటనపైనున్న నిషేధాలు ఎత్తివేయబడ్డాయి. ఇటీవలనే తెరవబడిన ఈ ప్రాంతాల్లో నుండి ఇంకా అనేకమంది “గొఱ్ఱెలు” సమకూర్చబడడానికి ఈ “ఆలస్యము” అని అనిపిస్తున్నది సమయాన్ని అనుమతిస్తోంది.—యోహాను 10:16.

3. “ఈ తరము”ను గూర్చిన మన ఇటీవలి అవగాహన అత్యవసరతతో దేవుని పనిని కొనసాగించడానికి మనల్ని ఎందుకు పురికొల్పాలి?

3 అది “జాగుచేయక వచ్చును” అని ప్రవక్త తెలియజేస్తున్నాడు. “ఇవన్నియు” జరిగే వరకు ప్రస్తుత దుష్టతరం గతించిపోదని యేసు చెప్పాడు. (మత్తయి 24:34) ఆయన మాటలను గూర్చిన మన ఇటీవలి అవగాహన మన ప్రకటన పని అంత అత్యవసరమైనది కాదనే భావాన్నిస్తుందా?a పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉందని వాస్తవాలు చూపిస్తున్నాయి! మన సమకాలీన తరం గత చరిత్రంతటిలో లేనటువంటి దుష్టత్వములోకి, అవినీతికరమైన స్థితిలోకి కూరుకుపోతోంది. (అపొస్తలుల కార్యములు 2:40 పోల్చండి.) మనం మన పనిని అత్యవసర భావంతో నెరవేర్చాలి. (2 తిమోతి 4:2) మహా శ్రమ హఠాత్తుగా, తక్షణమే, గుట్టుగా దొంగలా వస్తుందని దాని సమయాన్ని గూర్చిన ప్రవచనాలన్నీ చూపిస్తున్నాయి. (1 థెస్సలొనీకయులు 5:1-4; ప్రకటన 3:3; 16:15, 16) “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (మత్తయి 24:44) దైవభక్తిలేని ఈ మానవ తరం నాశనాన్ని సమీపిస్తుండగా, లోకసంబంధమైన అవరోధాల “బురదలో దొర్లుటకు” మరలడం ద్వారా నిత్యజీవాన్ని గూర్చిన మన నిరీక్షణను కోల్పోవాలని మనం ఎంతమాత్రం కోరుకోము!—2 పేతురు 2:22; 3:10; లూకా 21:32-36.

4. “తగినవేళ అన్నము” అందించే కార్యాన్ని అధికం చేయడానికి ఏ పరిస్థితి కారణమయ్యింది, ఈ అవసరత ఎలా తీర్చబడింది?

4 యేసు ప్రవచన నెరవేర్పుగానే, 1914లో మానవజాతి “యుగసమాప్తి”లోకి ప్రవేశించగానే ‘వేదనలు ప్రారంభమయ్యాయి.’ బాధలు, విధ్వంసకరమైన సంఘటనలు, దుర్నీతి నేటి వరకు పెచ్చుపెరిగిపోతూ వచ్చాయి. (మత్తయి 24:3-8, 12) అదే సమయంలో, తమ యజమానుడైన క్రీస్తు ఇంటివారికి “తగిన వేళ” ఆత్మీయ “అన్నము” పెట్టే బాధ్యతను అభిషిక్తులైన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతికి యెహోవా అప్పగించాడు. (మత్తయి 24:45-47) ఈ మెస్సీయ రాజు పరలోకంలోని తన సింహాసనం నుండి భూవ్యాప్తంగా ఆత్మీయ ఆహారాన్ని అందజేసే అద్భుతమైన కార్యానికి నడిపింపును ఇస్తున్నాడు.

పుష్కలమైన “ఆహారము”

5. “ఆహారము”లో ప్రధానమైన దానికి ఏ అవధానమివ్వబడుతోంది?

5 “ఆహారము” సిద్ధం చేయడాన్ని పరిశీలించండి. (లూకా 12:42) క్రైస్తవ భోజన పదార్థాల పట్టికలో దేవుని వాక్యమైన బైబిలు ప్రధానమైనది. బైబిలును ప్రభావవంతంగా బోధించడానికి, చదవదగిన, కచ్చితమైన అనువాదమన్నది ప్రాథమికావసరత. అనేక సంవత్సరాలనుండి ఈ అవసరత క్రమంగా తీర్చబడుతూ వచ్చింది, ప్రాముఖ్యంగా 1950లో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదము ఆంగ్లంలో వెలువడినప్పుడు ఇది ప్రారంభమయ్యింది. 1961 నాటికి పూర్తి బైబిలు నూతనలోక అనువాదము నందు లభ్యమయ్యింది, అనతి కాలంలో ఇతర ప్రాథమిక భాషలందు ప్రతులు వెలువడ్డాయి. 1996 సేవా సంవత్సరంలో విడుదలైన 3 సంపుటిలు ఆ మొత్తాన్ని 27కు చేరుస్తాయి, వాటిలో 14 పూర్తి బైబిళ్లు. బైబిలుపై బైబిలు సహాయకాలపై పని చేసేందుకు, దాదాపు 1,174 మంది సమర్పిత క్రైస్తవులు ఇప్పుడు 77 దేశాల్లో పూర్తికాలం తర్జుమా పని చేస్తున్నారు.

6. బైబిలు ప్రచురణల కొరకైన డిమాండును సంస్థ ఎలా తీర్చింది?

6 ఈ అనువాద సైన్యం చేస్తున్న పనికి మద్దతునిస్తూ వాచ్‌టవర్‌ సంస్థకు చెందిన 24 ముద్రణా బ్రాంచీలు అత్యధిక సంఖ్యల్లో ప్రచురణలను ఉత్పత్తి చేస్తున్నాయి. దీని కొరకు, కొన్ని ప్రధాన బ్రాంచీలలో అదనంగా హైస్పీడ్‌ రోటరీ ప్రెస్‌లను నెలకొల్పడం కొనసాగుతోంది. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ఉత్పత్తి నెలనెలకు పెరిగిపోతూ, ఈ సంవత్సరంలో 13.4 శాతం పెరుగుదలతో మొత్తం కలిపి 94,38,92,500 ప్రతులకు చేరింది. అమెరికా, ఇటలీ, కొరియా, జపాన్‌, జర్మనీ, ఫిన్‌లాండ్‌, బ్రెజిల్‌ మరియు మెక్సికోలలోనే బైబిళ్లు, గట్టి అట్ట పుస్తకాల మొత్తం ఉత్పత్తిలో 40 శాతం పెరుగుదల ఉంది, అంటే 1996లో 1995 కంటే 7,67,60,098 ప్రతులు ఎక్కువ ఉత్పత్తి చేయబడ్డాయి. సాహిత్యాలను తయారు చేయడంలో సాధించిన మొత్తం పెరుగుదలకు ఇతర బ్రాంచీలు కూడా ఎంతగానో దోహదపడ్డాయి.

7. యెషయా 54:2 ఇప్పుడు గొప్ప అత్యవసరతను ఎలా సంతరించుకుంది?

7 తూర్పు యూరపు మరియు ఆఫ్రికాలలో యెహోవాసాక్షులపై నిషేధాలు తీసివేయబడడంతో 1990లలో ఈ పెరుగుదల ఆవశ్యకమైంది. ఈ స్థలాల్లో ఆత్మీయ ఆహారం కొరకైన ఆకలి అధికంగా ఉంది. అందుకే యెషయా యొక్క ఈ మాటలు మునుపెన్నటికన్నా ఎక్కువ అత్యవసరతతో ప్రతిధ్వనిస్తున్నాయి: “నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము. నీ మేకులను దిగగొట్టుము.”—యెషయా 54:2.

8. ఆర్థిక మద్దతునిచ్చేందుకు ఏ ఉదార ప్రతిస్పందన సహాయం చేస్తోంది?

8 అలా, సంస్థకున్న 104 బ్రాంచీల్లోని అనేక బ్రాంచీలలో వసతులను విస్తరింపజేయడం అవసరమయ్యింది. క్రొత్తగా తెరువబడిన అనేక ప్రాంతాల్లోని తీవ్ర ఆర్థిక పరిస్థితుల మూలంగా, ఈ విస్తరణకు అవసరమైన ఖర్చుల్లోని అధిక భాగం, మరింత సంపన్నమైన దేశాలు ప్రపంచవ్యాప్త పని కొరకు ఇస్తున్న విరాళాల నుండి లభిస్తుంది. సంతోషకరంగా, నిర్గమకాండము 35:21 నందలి ఈ స్ఫూర్తికి అనుగుణ్యంగా సంఘాలు, వ్యక్తులు ప్రతిస్పందించడం జరిగింది: “తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి . . . యెహోవాకు అర్పణను తెచ్చిరి.” ఉదారంగా ఇవ్వడంలో భాగం వహించిన వారందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.—2 కొరింథీయులు 9:11.

9. రోమీయులు 10:13, 18 నేడు ఎలా నెరవేరుతుంది?

9 వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురణలు 1996లో యెహోవా నామాన్ని సంకల్పాలను భూదిగంతముల వరకు నిజంగా మహిమపర్చాయి. అది సరిగ్గా అపొస్తలుడైన పౌలు ప్రవచించినట్లుగానే ఉంది. యోవేలు ప్రవచనాన్ని, 19వ కీర్తనను సూచిస్తూ ఆయనిలా వ్రాశాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.” (రోమీయులు 10:13, 18) యెహోవా అనే అమూల్యమైన నామాన్ని ఉన్నతపర్చడం ద్వారా, ఆయన మందిరాన్ని మహిమతో నింపడంలో ఆయన ప్రజలు ప్రముఖ పాత్ర వహించారు. అయితే, 1996లో ఈ ప్రకటనాపని ప్రత్యేకంగా ఎలా విజయవంతమయ్యింది? దయచేసి 18 నుండి 21 పేజీలలో గల పట్టికను పరిశీలించండి.

ప్రపంచవ్యాప్తంగా కోతపని

10. ఈ పత్రికలోని 18 నుండి 21 పేజీల్లోగల పట్టికనందు వివరించబడినట్లుగా, యెహోవా ప్రజల కార్యకలాపాల్లో మీరు ఏ విశేషమైన అంశాలను గమనించారు?

10 లూకా 10:2 నందున్న యేసు మాటలు ఇంతటి శక్తివంతమైన ప్రభావాన్ని మునుపెన్నడూ చూపలేదు: “కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.” మీరు ఆ పిలుపుకు ప్రతిస్పందిస్తున్నారా? భూవ్యాప్తంగా కోట్లాదిమంది అలా చేస్తున్నారు. 1996లో ప్రాంతీయ సేవను నివేదించిన 54,13,769 మంది రాజ్యప్రచారకుల క్రొత్త శిఖరాగ్రాన్నిబట్టి ఇది వెల్లడౌతోంది. అంతేగాక, 3,66,579 మంది క్రొత్త సహోదర సహోదరీలు బాప్తిస్మం తీసుకున్నారు. ‘యెహోవా ఆరాధనా మందిరాన్ని మహిమతో నింపడంలో’ ఇప్పుడు భాగం వహిస్తున్న “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువుల”ను మనం ఎంత విలువైనవిగా ఎంచుతామోకదా!—హగ్గయి 2:7.

11. మనమందరం అధిక సంతోషాన్ని పొందడానికి మనకు ఎందుకు కారణముంది?

11 క్రొత్తగా తెరువబడిన ప్రాంతాల్లో జరుగుతున్న విస్తరణను గూర్చిన నివేదికలు కూడా విశేషమైనవే. ఇప్పుడు అలాంటి పెరుగుదలను అనుభవిస్తున్నవారిని చూసి మనం ఈర్ష్యపడుతున్నామా? దానికి బదులుగా మనం వారితో పాటు సంతోషిస్తాము. అన్ని దేశాలు అల్పసంఖ్యతో ప్రారంభమైనవే. హగ్గయి సమకాలీకుడైన జెకర్యా ఇలా వ్రాశాడు: “కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు?” (జెకర్యా 4:10) సాక్ష్యమిచ్చేపని చక్కగా జరుగుతున్న దేశాల్లో ఇప్పుడు కోట్లాదిమంది రాజ్య ప్రచారకులున్నారని, ప్రాంతాన్ని తరచూ పూర్తి చేస్తున్నారని అనేక పెద్ద నగరాల్లో ప్రతివారమూ అలా చేస్తున్నారని మనం ఎంతో సంతోషిస్తున్నాము. మునుపు నిషేధం క్రిందవున్న ప్రాంతాలవారికి యెహోవా ఇప్పుడు రక్షణ అవకాశాన్ని ఇస్తుండగా మనం మందగించడం కారణసహితమా? ఎంతమాత్రం కాదు! “పొలము లోకము” అని యేసు చెప్పాడు. (మత్తయి 13:38) యూదా విధానాంతంలో తొలి శిష్యులు ఎలా సంపూర్ణంగా సాక్ష్యమిచ్చారో అలాగే సంపూర్ణంగా సాక్ష్యమివ్వడం కొనసాగాలి.—అపొస్తలుల కార్యములు 2:40; 10:42; 20:24; 28:23.

ఎల్లప్పుడూ ముందుకు కొనసాగడం

12. “చక్కగా ఎదుటికి” కదలడానికి మనకు ఏ పురికొల్పు ఉంది? (“‘భూదిగంతము నుండి’ కోత” అనే బాక్సును కూడా చూడండి.)

12 అవును, మనం యెహోవా దూతల పరలోక రథంతోపాటు “చక్కగా ఎదుటికి” కదులుతూ కొనసాగుతూనే ఉండాలి. (యెహెజ్కేలు 1:12) “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు [“యెహోవా,” NW] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు” అన్న పేతురు మాటలు మనకు జ్ఞాపకమున్నాయి. (2 పేతురు 3:9) ఆర్థికంగా వెనుకబడివున్న దేశాల్లోని మన సహోదరుల మాదిరికరమైన ఆసక్తి మనల్ని పురికొల్పనిద్దాము. అర్మగిద్దోను రావడంలో అవుతున్నట్లనిపిస్తున్న ఏ ఆలస్యమైనా, ఈ దేశాల్లో నుండి అలాగే తరచూ పనిచేసిన అనేక ప్రాంతాల్లో నుండి వందల వేలమంది సమకూర్చబడేందుకు అవకాశాన్నిస్తోంది. దాని గురించి పొరపాటు పడకండి: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:14) మనం కూడా అతిశీఘ్రంగా సంపూర్ణమైన, అంతిమ సాక్ష్యమివ్వాలి!

13, 14. (ఎ) 1996లో అందించబడిన ప్రచురణల గురించి ఏమి చెప్పవచ్చు? (బి) సంఘాలు ప్రతి సంవత్సరం ఏ ప్రత్యేకమైన పథకాలు వేసుకోవచ్చు, మీరు దానిలో పాల్గొనడానికి ఎలా పథకం వేసుకుంటున్నారు?

13 సేవా పట్టికలో వివరాలు కనిపించకపోయినప్పటికీ, గత సంవత్సరంలో బైబిళ్లు, పుస్తకాలు, పత్రికలను పంచిపెట్టడంలో విశేషమైన అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు, పత్రికల అందింపు ప్రపంచవ్యాప్తంగా 19 శాతం అభివృద్ధిని చూపించింది, మొత్తం 54,36,67,923 ప్రతులు అందజేయబడ్డాయి. మన పత్రికలు వీధుల్లోనూ పార్కుల్లోనూ బస్‌స్టాప్‌లలోనూ వ్యాపార స్థలాల్లోనూ బహుముఖ ప్రజ్ఞావంతంగా ప్రకటించడాన్ని సులభతరం చేస్తాయి. రాజ్య ప్రకటనపని తరచుగా జరిగిన కొన్ని ప్రాంతాల్లో, మన పత్రికల నాణ్యతనుబట్టి ప్రజ్ఞావంతులు ప్రభావితమై బైబిలు పఠనాలను అంగీకరిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.

14 ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెలలో, సంఘాలు సాధారణంగా ఇంటింటికి మరియు బహిరంగ స్థలాల్లో దినమంతా ప్రచారం సాగేలా ప్రత్యేక పత్రికా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాయి. 1997 ఏప్రిల్‌లో మీ సంఘం దీనిలో భాగం వహిస్తుందా? కావలికోట మరియు తేజరిల్లు! యొక్క విశేషమైన ఏప్రిల్‌ సంచికలు సిద్ధం చేయబడ్డాయి, ప్రపంచవ్యాప్తంగా వాటిని ఒకేసారి అందజేయడం నిశ్చయంగా ఉత్తేజాన్ని కల్గిస్తుంది! సైప్రస్‌ ద్వీపంలోని సంఘాలు “వీలైన వారందరికి రాజ్య వర్తమానాన్ని తీసుకువెళ్లండి” అనే నినాదాన్ని తీసుకుని, ప్రతి నెల ఏర్పాటు చేయబడిన అలాంటి పత్రికాపనిలో భాగం కూడా వహించి ఆ సంవత్సరంలో 2,75,359 పత్రికలను అందించి క్రొత్త శిఖరాగ్రాన్ని చేరుకున్నాయి, అది 54 శాతం అభివృద్ధి.

హగ్గయి అంతిమ వర్తమానాలు

15. (ఎ) హగ్గయి ద్వారా యెహోవా అదనపు వర్తమానాలు ఎందుకు పంపాడు? (బి) హగ్గయి యొక్క మూడవ వర్తమానం మనకు ఏ పాఠాన్ని అందజేయాలి?

15 యెహోవా తన రెండవ వర్తమానమును అందజేసిన 63 రోజుల తర్వాత, మనం హృదయానికి తీసుకోవలసిన మూడవ ప్రకటనతో హగ్గయిని పంపించాడు. వాస్తవానికి 17 సంవత్సరాల క్రితమే యూదులు ఆలయ పునాది వేసినప్పటికి, వాళ్లు అప్పుడే పునాది వేస్తున్నట్లుగా హగ్గయి మాట్లాడాడు. మరోసారి శుభ్రపరచవలసిన అవసరత ఉందని యెహోవా గమనించాడు. యాజకులు, ప్రజలు తమ చేతులు ముడుచుకున్నారు; కాబట్టి, వారు యెహోవా దృష్టిలో అపవిత్రులయ్యారు. నేడు యెహోవా ప్రజలలో కొందరు లోకం అనుమతించే విచ్చలవిడితనం, వస్తుసంపద వంటి మార్గాలలో నిమగ్నులై తమ చేతులు ముడుచుక్కూర్చున్నారా? “ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను” అనే యెహోవా వాగ్దానమందు నమ్మకముంచి ‘ఇది మొదలుకొని’ ఆయన నామానికి మహిమ తేవడంపై మనమందరం మన మనస్సులను నిలుపుకోవడం అత్యవసరం.—హగ్గయి 2:10-19; హెబ్రీయులు 6:11, 12.

16. ఇప్పుడు ఏ ‘కంపింపజేయడం’ సమీపిస్తోంది, దాని ఫలితమేమై ఉంటుంది?

16 అదే దినాన, “సైన్యములకధిపతియగు యెహోవా” వాక్కు హగ్గయికి నాలుగవసారి, చివరిసారి వచ్చింది. “రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రైతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు” అని చెబుతూ తాను “ఆకాశమును భూమిని . . . కంపింపజేయ”డంలో ఏమి ఇమిడివుందో ఆయన తెలియజేశాడు. (హగ్గయి 2:6, 21, 22) అర్మగిద్దోనునందు యెహోవా భూమిని పూర్తిగా శుభ్రపరచినప్పుడు, “కంపింపజేయడం” అలా దాని ముగింపుకు వస్తుంది. నూతన లోకం కొరకు మానవ సమాజ కేంద్రబిందువుగా రూపొందడానికి అప్పటికల్లా “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులు” సమకూర్చబడివుంటాయి. ఆనందించడానికి, యెహోవాకు స్తుతి చెల్లించడానికి ఎంత చక్కని కారణాలోకదా!—హగ్గయి 2:7; ప్రకటన 19:6, 7; 21:1-4.

17. యేసు ‘ముద్ర ఉంగరముగా’ ఎలా చేయబడ్డాడు?

17 తన ప్రవచనాన్ని ముగిస్తూ, హగ్గయి ఇలా వ్రాశాడు: “జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” (హగ్గయి 2:23) భూసంబంధ యెరూషలేములో అధిపతియైన జెరుబ్బాబెలు మరియు ప్రధాన యాజకుడైన యెహోషువ ఇద్దరు వేర్వేరుగా చేపట్టిన కార్యరంగాలను ఏకం చేసి పరలోకంలో క్రీస్తుయేసు ఇప్పుడు యెహోవా యొక్క సూచనార్థక మెస్సీయ రాజు మరియు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యెహోవా కుడిచేతిపై అధికారిక ముద్ర ఉంగరములా, ‘దేవుని అనేక వాగ్దానాలను’ వాస్తవం చేయడంలో యెహోవా ఉపకరణంగా యేసు “అవునన్నట్టుగా” ఉన్నాడు. (2 కొరింథీయులు 1:20; ఎఫెసీయులు 3:10, 11; ప్రకటన 19:10) బైబిలునందలి ప్రవచనార్థక వర్తమానమంతా క్రీస్తును రాజుగా, యాజక విమోచకునిగా యెహోవా చేసిన ఏర్పాటుపై కేంద్రీకరిస్తుంది.—యోహాను 18:37; 1 పేతురు 1:18, 19.

18. “సైన్యములకధిపతియగు యెహోవా” యొక్క చివరి “వాక్కు” ఎలా ఉత్తేజకరమైన నెరవేర్పును కలిగివుంటుంది?

18 నిజంగా మన దినాల్లో అత్యధిక మహిమ ఏమిటంటే యెహోవా యొక్క ప్రకాశమానమైన ఆత్మీయ ఆలయంలో ఉండడమే! త్వరలోనే, యెహోవా సాతాను విధానాన్నంతటినీ నిర్మూలించిన తర్వాత, హగ్గయి 2:9 మరింత ఆనందభరితమైన నెరవేర్పును కలిగివుంటుంది: “ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” తుదకు శాశ్వతమైన, విశ్వమంతటా నిలిచే శాంతి ఉంటుంది. అది యెహోవా ‘ముద్ర ఉంగరము,’ “సమాధానకర్తయగు అధిపతియు”నైన క్రీస్తు యేసు ఇచ్చిన హామీ, ఆయన గురించి ఇలా వ్రాయబడింది: ‘ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును . . . సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.’ (యెషయా 9:6, 7) యెహోవా విశ్వ సర్వాధిపత్య శాంతియుత రాజ్యమంతటిలో ఆయన ఆలయ మహిమ నిరంతరం ప్రతిబింబిస్తుంది. మనమెల్లప్పుడూ ఆ మందిరంలో ఉందాము!—కీర్తన 27:4; 65:4; 84:10.

[అధస్సూచీలు]

a కావలికోట నవంబరు 1, 1995 సంచికలోని “ఒక ‘దుష్టతరము’ నుండి రక్షింపబడుట” మరియు “మెలకువగా ఉండవలసిన సమయం” అనే శీర్షికలను చూడండి.

మీరు వివరించగలరా?

◻ నేడు యెహోవా మందిరము ఎలా ‘మహిమతో నింపబడుతోంది’?

◻ సువార్తను ప్రకటించడం నేడు ఎందుకింతటి అత్యవసరతను సంతరించుకున్నది?

◻ 1996 సేవా సంవత్సర నివేదిక అత్యవసరంగా ప్రకటించడానికి ఏ పురికొల్పునిస్తుంది?

◻ క్రీస్తు యెహోవా యొక్క ‘ముద్ర ఉంగరముగా’ ఎలా సేవచేస్తున్నాడు?

[15వ పేజీలోని బాక్సు]

“భూదిగంతము నుండి” కోత

యెషయా 43:6 నందు మనం యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞను చదువుతాము: “బిగబట్టవద్దని . . . దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.” ఈ లేఖనం నేడు తూర్పు యూరపులో విశేషమైన నెరవేర్పును కలిగివుంది. ఉదాహరణకు, మునుపు కమ్యూనిస్టు దేశమైన మాల్డోవాను తీసుకోండి. ఇప్పుడక్కడ జనాభాలో దాదాపు సగంమంది సాక్షులున్న గ్రామాలున్నాయి. ప్రకటించే ప్రాంతం కొరకు వాళ్లు ఎంతో దూరం ప్రయాణించాలి, అయినా వారు కృషి చేస్తూనే ఉన్నారు! ఈ సంఘాల్లోని ప్రచారకులనేకులు 1950ల తొలిభాగంలో సైబీరియాకు పంపివేయబడిన తలిదండ్రుల పిల్లలు. వారి కుటుంబాలు ఇప్పుడు కోత పనిలో నాయకత్వం వహిస్తున్నాయి. 12,565 మంది ప్రచారకులలో 1,917 మంది గత సంవత్సరం బాప్తిస్మం తీసుకున్నారు. నలభై మూడు సంఘాల్లో ఒక్కో దానిలో దాదాపు 150 మంది ప్రచారకులున్నారు. క్రొత్త సేవా సంవత్సరంలో సర్క్యూట్లు నాలుగు నుండి ఎనిమిదికి పెరిగాయి.

అల్బేనియాలో జరిగిన పెరుగుదల కూడా విశేషమైనదే. అక్కడ దాదాపు 50 సంవత్సరాలుగా క్రూరాతి క్రూరమైన నిరంకుశత్వాన్ని సహించిన యథార్థ సాక్షులు కొంతమంది ఉన్నారు. వారిలో అనేకులు చంపబడ్డారు. యేసు చేసిన ఈ వాగ్దానాన్ని అది గుర్తు చేస్తుంది: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; . . . మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” (ప్రకటన 2:10; యోహాను 5:28,29; 11:24, 25 కూడా చూడండి.) అల్బేనియాలో ఇప్పుడు మనం ఏమి చూస్తాము? నిజంగా, యెషయా 60:22 నందు కనుగొనబడే, యెహోవా చేసిన ఈ వాగ్దానం యొక్క విశేషమైన నెరవేర్పే: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును!” అల్బేనియాలో 1990 నందు కేవలం ఒకే ప్రచారకుడు సేవను నివేదించాడు. అయితే, ‘కాబట్టి మీరు వెళ్లి, బాప్తిస్మమిచ్చుచు . . . సమస్త జనులను శిష్యులనుగా చేయుడి’ అని యేసు ఇచ్చిన పిలుపుకు ఇటలీ నుండి మరితర దేశాల నుండి “పనివారు” బదులిచ్చారు. (మత్తయి 28:19; లూకా 10:2) 1996లో యేసు మరణ జ్ఞాపకార్థ సమయానికి 773 మంది ప్రచారకులు ప్రాంతీయ సేవలో చురుకుగా ఉన్నారు, వారు తమ జ్ఞాపకార్థ కూటాలకు 6,523 మందిని సమావేశపర్చారు, అది ప్రచారకుల సంఖ్యకన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ! ప్రత్యేకించిన ప్రాంతాల నుండి అద్భుతమైన హాజరులు నివేదించబడ్డాయి. కుకీస్‌ మరియు దీవ్యాకే నగరాల్లో స్థానికంగా ప్రచారకులు లేకపోయినా, 192 మరియు 230 మంది హాజరయ్యారు. కేవలం ఒకే ప్రచారకుడున్న క్రూయేలో 212 మంది హాజరయ్యారు. కోర్చెలో 30 మంది ప్రచారకులు 300 కంటే ఎక్కువమంది కొరకు వసతులను అద్దెకు తీసుకున్నారు. హాలు క్రిక్కిరిసిన తర్వాత, ఇక స్థలం లేకపోవడంతో మరో 200 మందిని తిరిగి పంపివేయవలసి వచ్చింది. నిజంగా అది కోతకు సిద్ధంగా ఉన్న పొలం!

రుమేనియా నుండి ఈ నివేదిక వచ్చింది: “మేము ఇంటింటి పరిచర్యలో ఉండగా, ఒక చిన్న పట్టణంలో నివసిస్తూ తాను యెహోవాసాక్షినని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని మేము కలిశాము, మాకు తెలిసినంతమట్టుకు అక్కడ సాక్షులెవరూ లేరు. తానే కాకుండా, అనేక సంవత్సరాలుగా గురువారాల్లోనూ ఆదివారాల్లోనూ కూటాలు జరుపుకుంటూ, ఇంటింటికి ప్రకటించడం ప్రారంభించిన మరో 15 మంది వ్యక్తులు కూడా ఉన్నారని ఆయన మాతో చెప్పాడు. మరునాడు మేము ఆ పట్టణానికి వెళ్లాము. మాకోసం ఎదురు చూస్తూ రెండు గదుల్లో 15 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు, వారు 20 పుస్తకాలను, 20 ఇటీవలి పత్రికలను తీసుకున్నారు. బైబిలు పఠనాలను ఎలా నిర్వహించాలో మేము వారికి చూపించాము. మేము కలిసి పాటలు పాడి, వారికున్న ఎంతో అత్యవసరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చాము. ఆ గుంపుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఇలా చెప్పాడు: ‘ఒక కాపరిని మా కొరకు పంపమని నేను కొన్ని రోజుల క్రితం కన్నీళ్లతో యెహోవాకు ప్రార్థించాను, నా ప్రార్థనకు జవాబు లభించింది.’ మేము ఎంతో సంతోషించాము, మేము వెళ్లిపోతుండగా, చివరికి తండ్రిని కనుగొన్న అనాథలా ఆయనిలా చెప్పాడు: ‘దయచేసి మమ్మల్ని మరచిపోకండి. మళ్లీ వచ్చి మమ్మల్ని కలవండి!’ మేమలాగే చేశాము, ఇప్పుడు ఆ పట్టణంలో ఏడు బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి. అనేక క్రొత్త ప్రాంతాల్లో, బైబిలు ప్రచురణలతో పని అద్భుతమైన విధంగా ప్రారంభమౌతుంది, అది ఎంతో మెచ్చుకోదగినదిగా ఉంది, ఈ పనికి దైవిక మూలం ఉందని ఇది చూపిస్తుంది.”

[18-21వ పేజీలోని చిత్రం]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 1996 సేవా సంపత్సరపు నివేదిక

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

[16-17వ పేజీలోని చిత్రం]

సముద్ర ద్వీపాలు (1), దక్షిణ అమెరికా (2), ఆఫ్రికా (3), ఆసియా (4), ఉత్తర అమెరికా (5), యూరపు (6) నుండి “అన్యజనులందరి ఇష్టవస్తువులు” సమకూర్చబడుతున్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి