మెరుపులు—పెద్దవి మరియు చిన్నవి (మొదటిభాగం)
“పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.”—సామెతలు 4:18.
1. సత్యం ఎందుకు క్రమంగా బయల్పర్చబడింది?
సామెతలు 4:18కి తగినట్లుగా, ఆత్మీయ సత్యాలు క్రమంగా మెరుపుల ద్వారా బయల్పడడం దైవిక జ్ఞానానికి నిదర్శనం. దీని ముందు శీర్షికలో, ఈ వచనం అపొస్తలుల కాలంలో ఎలా నెరవేరిందో చూశాము. అధిక మొత్తంలో లేఖన సత్యం ఒక్కసారిగా బయల్పడినట్లైతే, అది అటు మిరుమిట్లుగొలిపేదిగానూ అయోమయపర్చేదిగానూ ఉంటుంది—చీకటి గుహలోనుండి మండే సూర్యునిలోకి వచ్చినట్లుగా ఉంటుంది. అంతేకాకుండ, క్రమంగా బయల్పడిన సత్యం క్రైస్తవుల విశ్వాసాన్ని ఎడతెగకుండా బలపరుస్తుంది. వారు నడవాల్సిన త్రోవను అది మరింత స్పష్టంగానూ వారి నిరీక్షణను మరింత ప్రకాశవంతంగానూ చేస్తుంది.
“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు”
2. ఆత్మీయ వెలుగును తన అనుచరులకు అందించేందుకు యేసు ఎవరిని ఉపయోగించుకుంటానని సూచించాడు మరియు అలా ఉపయోగించబడేవారిలో ఎవరెవరుంటారు?
2 అపొస్తలుల కాలంలో, తొలి మెరుపులను తన అనుచరులకు అందించేందుకు మానవాతీత మాధ్యమాన్ని ఉపయోగించడం సబబని యేసుక్రీస్తు గమనించాడు. దీనిలో మనకు రెండు ఉదాహరణలు ఉన్నాయి: సా.శ. 33 పెంతెకొస్తు మరియు సా.శ. 36 నందు కొర్నేలీ మత మార్పిడి. దాని తర్వాత, మానవ ప్రతినిధులను ఉపయోగించడం సబబని భావించాడు, ఆయన ముందే ఇలా చెప్పాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:45-47) ఈ దాసుడు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే కాలేడు, ఎందుకంటే పెంతెకొస్తునాడు మొదలైన క్రైస్తవ సంఘం నుండి యజమానుడైన యేసుక్రీస్తు ఓ లెక్క ఒప్పజెప్పించుకునేందుకు ఆత్మీయ ఆహారాన్ని అందించవల్సి ఉంది. ఈ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిలో, భూమి మీద ఏ సమయంలోనైనా ఉన్న అభిషక్త క్రైస్తవుల గుంపు ఉందని వాస్తవాలు సూచిస్తున్నాయి.
3. దాసుని తరగతిలోని మొట్టమొదటి సభ్యుల్లో ఎవరున్నారు?
3 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి తొలి సభ్యుల్లో ఎవరుకూడా చేరివున్నారు? “నా గొఱ్ఱెలను మేపుము” అన్న యేసు ఆజ్ఞను లక్ష్యపెట్టిన అపొస్తలుడైన పేతురు అందులో ఒకడు. (యోహాను 21:17) దాసుని తరగతిలోని ఇతర తొలి సభ్యులలో తన పేరుగల సువార్తను వ్రాసిన మత్తయి మరియు ప్రేరేపిత పత్రికలను వ్రాసిన పౌలు, యాకోబు మరియు యూదా ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని తన సువార్తను తన పత్రికలనూ వ్రాసిన అపొస్తలుడైన యోహాను కూడా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిలోని సభ్యుడే. ఈ పురుషులు యేసు ఆజ్ఞానుసారంగా వ్రాశారు.
4. “ఇంటివారు” ఎవరు?
4 భూమి మీద ఎక్కడ జీవించినప్పటికీ, అభిషక్తులందరూ దాసుని తరగతిలోని సభ్యులైతే, మరి “యింటివారు” ఎవరు? వారు అభిషక్తులే—కాకపోతే మరో దృక్కోణం నుండి పరిగణించబడేవారు—వేర్వేరు వ్యక్తులుగా పరిగణించబడేవారు. అవును, వ్యక్తులుగా వారు ‘దాసులా’ లేక ‘యింటివారా’ అన్నది, వారు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నారా లేక పొందుతున్నారా అన్నదానిపై ఆధారపడివుంటుంది. ఉదాహరణకు: 2 పేతురు 3:15, 16 నందు వ్రాయబడినట్లుగా, పౌలు పత్రికలను అపొస్తలుడైన పేతురు సూచిస్తున్నాడు. వాటిని చదివేటప్పుడు, దాసుని తరగతి ప్రతినిధిగా పౌలు అందించిన ఆత్మీయ ఆహారాన్ని తీసుకునే ఇంటివారిలో ఒకనిగా పేతురుంటాడు.
5. (ఎ) అపొస్తలుల తర్వాత శతాబ్దాల కాలంలో దాసునికి ఏమి సంభవించింది? (బి) పందొమ్మిదవ శతాబ్దపు తర్వాతి భాగంలో ఏ పురోభివృద్ధి వచ్చింది?
5 ఈ విషయంలో, వెయ్యేండ్ల దేవుని రాజ్యము సమీపించింది (ఆంగ్లం) అన్న పుస్తకం ఇలా పేర్కొంది: ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతి ఎలా వచ్చింది మరియు యజమానియైన యేసుక్రీస్తు అపొస్తలుల మరణం తర్వాత ఇన్ని శతాబ్దాల వరకు ఎలా సేవ చేసింది అన్న విషయాన్ని గూర్చి మనకు సవివరణమైన చారిత్రాత్మక నివేదికలేదు. ఒక ‘దాసుని’ తరగతి తర్వాతి తరానికి ఆహారమందించిందన్నది స్పష్టం. (2 తిమోతి 2:2) అయితే, పందొమ్మిదవ శతాబ్దపు తర్వాతి అర్ధభాగంలో పరిశుద్ధ బైబిలులోని ఆత్మీయ ఆహారాన్ని ప్రేమించి మరియు దాన్ని భుజించాలని కోరుకునే దైవభక్తిగల వ్యక్తులుండేవారు. . . . బైబిలు పఠన తరగతులు, . . . స్థాపించబడ్డాయి మరియు పరిశుద్ధ లేఖనాల్లోని మూల సత్యాల విషయాల్లో పురోగమనం సాధించబడింది. ఈ బైబిలు విద్యార్థుల్లోని యథార్థమైన స్వార్థరహితమైన వారు ఆత్మీయ ఆహారపు ప్రాముఖ్యమైన భాగాలను ఇతరులకు పంచేందుకు ఎంతో ఉత్సుకతను కల్గివున్నారు. ఆత్మీయ ఆహారాన్ని ‘తగిన సమయంలో యింటివారికి’ అందించేందుకు నియమించబడిన ‘దాసులని’ నమ్మకమైన స్ఫూర్తిని వారు కల్గివున్నారు. అది సరైన మరియు తగిన సమయమని మరియు ఆహారాన్ని అందించేందుకు ఏ పద్ధతి సరైనదని గ్రహించడంలో వారు చాలా ‘బుద్ధిమంతులు.’ ఆ పనిని చేసేందుకు వారు ప్రయత్నించారు.”—344-5.a
ఆధునిక కాలాల్లోని తొలి మెరుపులు
6. సత్యం క్రమంగా బయల్పడే సంబంధంగా ఏ వాస్తవాలు ప్రాముఖ్యంగా నిలుస్తాయి?
6 క్రమంగా ఆత్మీయ మెరుపులను పెంచేందుకు యెహోవా ఉపయోగించుకున్న వారి విషయంలో ప్రాముఖ్యంగా నిలిచే విషయమేమిటంటే, వారు తమకు ఏ ఘనతనూ తీసుకోలేదన్న విషయమే. తమ సాధారణ నైపుణ్యాలను ఉపయోగించుకునేందుకు ప్రభువు ఎంతో సంతోషిస్తున్నాడన్న దృక్పథాన్ని వాచ్‌టవర్ సొసైటీ మొదటి అధ్యక్షుడు కనుపర్చాడు. తన శత్రువులు ఉపయోగించే ఆస్కారమున్న అపహాస్యపు మాటలను గూర్చి, సహోదరుడైన రస్సల్ తానెన్నడూ ఏ “రస్సలైట్‌ను” కలవలేదని మరియు “రస్సలిజమ్” అనే మాటే లేదని పూర్తిగా తెలియజేశాడు.” ఘనతంతా దేవునికే వెళ్లింది.
7. తాము నిజంగా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో సహవసిస్తున్నామనేందుకు సహోదరుడైన రస్సల్ మరియు ఆయన జతపనివారు ఏ రుజువులను అందించారు?
7 ప్రతిఫలాలనుబట్టి తీర్పు తీర్చినట్లైతే, సహోదరుడైన రస్సల్ మరియు ఆయనతో సహవసిస్తున్న వారి ప్రయత్నాలను యెహోవా ఆత్మ నడుపుతోందని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. వారు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో సహవసిస్తున్నారనేందుకు రుజువునిచ్చారు. ఆ కాలంలోని నామకార్థ క్రైస్తవుల మత నాయకులు బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని మరియు యేసు దేవుని కుమారుడని నమ్మినప్పటికీ, త్రిత్వం, మానవ ఆత్మ అమర్త్యత మరియు నిత్య యాతన వంటి బబులోను సిద్ధాంతాలను వారు ప్రబోధించారు. యేసు వాగ్దానం ప్రకారం, సహోదరుడైన రస్సల్ మరియు ఆయన సహవాసులు సత్యాన్ని అందించేందుకు చేసిన విన్నపంతోకూడిన ప్రయత్నాలు ఎన్నడూ లేనట్లుగా వెలుగొందేలా చేయడానికి పరిశుద్ధాత్మే సహాయపడింది. (యోహాను 16:13) యజమాని ఇంటివారికి ఆత్మీయ ఆహారాన్ని అందించడం వారి విధిగా కల్గివున్న ఆ అభిషక్త బైబిలు విద్యార్థులు తాము నిజంగానే నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిలో భాగమనే రుజువును వారు అందించారు. వారి ప్రయత్నాలు అభిషక్తులను సమకూర్చేందుకు ఎంతో సహాయపడ్డారు.
8. యెహోవా, బైబిలు, యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మను గూర్చిన ఏ ప్రాథమిక వాస్తవాలను బైబిలు విద్యార్థులు స్పష్టంగా గ్రహించారు?
8 పరిశుద్ధాత్మ ద్వారా ఈ తొలి బైబిలు విద్యార్థులకు మెరుపులనునివ్వడం ద్వారా యెహోవా అనుగ్రహాన్ని అందించాడో చూడడం ఎంతో గణనీయం. ప్రథమంగా చెప్పాలంటే సృష్టికర్త ఉన్నాడని మరియు ఆయనకు యెహోవా అనే విశేషమైన నామం ఉందని గట్టిగా నిరూపించారు. (కీర్తన 83:18; రోమీయులు 1:20) యెహోవాకు నాలుగు ప్రధానమైన లక్షణాలున్నాయని వారు గమనించారు—శక్తి, న్యాయం, జ్ఞానం మరియు ప్రేమ. (ఆదికాండము 17:1; ద్వితీయోపదేశకాండము 32:4; రోమీయులు 11:33; 1 యోహాను 4:8) బైబిలు నిజంగానే దేవుని ప్రేరేపిత వాక్యమని మరియు అది సత్యమని ఈ అభిషక్త క్రైస్తవులు స్పష్టంగా నిరూపించారు. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) ఇంకా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, సృష్టించబడ్డాడని మరియు మానవజాతియంతటికీ తన జీవాన్ని విమోచనగా అందించాడని నమ్మారు. (మత్తయి 20:28; కొలొస్సయులు 1:15) పరిశుద్ధాత్మ త్రిత్వంలో మూడవ వ్యక్తికాక, దేవుని ఆత్మ అని గ్రహించడం జరిగింది—అపొస్తలుల కార్యములు 2:17.
9. (ఎ) పాపంవల్ల మానవుని స్వభావం మరియు బైబిలునందున్న భవిష్యత్ నిర్ణయాన్ని గూర్చిన ఏ సత్యాలను బైబిలు విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు? (బి) ఇంకా ఏ ఇతర సత్యాలను యెహోవా సేవకులు స్పష్టంగా చూశారు?
9 మనిషికి అమర్త్యమైన ఆత్మ లేదని మరి మానవుడు మర్త్యమైన వాడేనని బైబిలు విద్యార్థులు స్పష్టంగా చూశారు. మండే నరకం వంటి స్థలమే లేదు గనుక, “పాపము వలన వచ్చు జీతము” నిత్యయాతన కాదుకానీ “మరణము” అని వారు గ్రహించారు. (రోమీయులు 5:12; 6:23; ఆదికాండము 2:7; యెహెజ్కేలు 18:4) పరిణామ సిద్ధాంతం పూర్తిగా లేఖన రహితమైందేకాకుండ పూర్తిగా వాస్తవాధారంలేనిదని వారు స్పష్టంగా చూశారు. (ఆదికాండము 1 మరియు 2 అధ్యాయాలు) బైబిలు రెండు విధులను కల్గివుందని గమనించారు—క్రీస్తు అడుగుజాడల్లో నడిచే 1,44,000 మంది అభిషక్తులు పరలోకానికి వెళ్లే వారు మరియు భూమి మీద పరదైసులో జీవించేందుకు లెక్కలేని “వేరే గొఱ్ఱె”లోని “గొప్ప సమూహము.” (ప్రకటన 7:9; 14:1; యోహాను 10:16) ఆ తొలి బైబిలు విద్యార్థులు భూమి నిరంతరం ఉంటుందని మరి అనేక మతాలు బోధిస్తున్నట్లుగా కాలిపోదని గ్రహించారు. (ప్రసంగి 1:4; లూకా 23:43) క్రీస్తు రాకడ అదృశ్యంగా ఉంటుందని మరియు ఆయన రాజ్యాల మీద తీర్పును తీరుస్తాడని మరియు ఓ నూతన భూపరదైసును ప్రవేశపెడతాడని వారు నేర్చుకున్నారు.—అపొస్తలుల కార్యములు 10:42; రోమీయులు 8:19-21; 1 పేతురు 3:18.
10. బాప్తిస్మం, మతనాయకులు లౌకిక ప్రజల తేడా మరియు క్రీస్తు మరణ జ్ఞాపకార్థదిన విషయాల్లో బైబిలు విద్యార్థులు ఏ సత్యాన్ని నేర్చుకున్నారు?
10 పసిపిల్లలపై కేవలం నీటిని చిలకరించడం లేఖనాధారమైన బాప్తిస్మము కాదుకానీ మత్తయి 28:19, 20 నందు యేసు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా, బోధించబడిన విశ్వాసులను నీటిలో ముంచి తీయడమే సరైనదని బైబిలు విద్యార్థులు తెలుసుకున్నారు. మతనాయకులూ లౌకిక ప్రజలు అన్న తేడాకు లేఖనాధారం లేదని కూడా వారు గ్రహించారు. (మత్తయి 23:8-10) దానికి విరుద్ధంగా, క్రైస్తవులందరూ సువార్త ప్రచారకులై ఉండాలి. (అపొస్తలుల కార్యములు 1:8) క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అంటే నీసాను 14న మాత్రమే ఆచరించాలన్న విషయాన్ని బైబిలు విద్యార్థులు గుణగ్రహించారు. అంతేకాకుండ, ఈస్టర్ ఓ అన్యమత సెలవుదినమని వారు గ్రహించారు. దానికి తోడు, దేవుడు తమకు మద్దతునిస్తున్నాడని అభిషక్తులు ఎంతగా విశ్వసించారంటే, వారు ఎన్నడూ చందాలను సేకరించలేదు. (మత్తయి 10:8) క్రైస్తవులు బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా నడుచుకోవాలని వారు మొదటి నుండి గ్రహించారు. అందులో దేవుని పరిశుద్ధాత్మ ఫలాలను అలవర్చుకోవడం కూడా ఇమిడివుంది.—గలతీయులు 5:22, 23.
అధికమౌతున్న మెరుపులు
11. క్రైస్తవుల విధిపై మరియు గొఱ్ఱెలు మేకలను గూర్చిన యేసు ఉపమానంపై ఏ వెలుగు ప్రకాశించింది?
11 ప్రత్యేకంగా 1919 నుండి యెహోవా సేవకులు అధికమౌతున్న మెరుపుతో ఆశీర్వదించబడ్డారు. యెహోవా సేవకుల ముఖ్యమైన విధి “రాజును ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి,” అన్న విషయాన్ని 1922 సీడార్ పాయింట్ సమావేశంలో, వాచ్‌టవర్ సొసైటి రెండవ అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ నొక్కి చెప్పినప్పుడు ఎంతటి ప్రకాశవంతమైన మెరుపు మెరిసిందో కదా! ఆ తర్వాతి సంవత్సరమే, మేకలు, గొఱ్ఱెల ఉపమానంపై దివ్యమైన వెలుగు ప్రకాశించింది. ముందు అనుకున్నట్లుగా ఈ ప్రవచనం భవిష్యత్తునందు వెయ్యేండ్లకాలంలో కాకుండ, ప్రస్తుతమున్న ప్రభువు దినంలో నెరవేరాలని గ్రహించడం జరిగింది. వెయ్యేండ్లకాలంలో, క్రీస్తు సోదరులు అస్వస్థులు కారు లేక బంధించబడరు. బదులుగా, వెయ్యేండ్లకాలంలో తీర్పు తీర్చేది యేసుక్రీస్తు కాదు యెహోవా దేవుడే.—మత్తయి 25:31-46.
12. అర్మగిద్దోను విషయంలో ఏ మెరుపు మెరిసింది?
12 అర్మగిద్దోను యుద్ధం అన్నది ముందు బైబిలు విద్యార్థులు భావించినట్లుగా సాంఘిక విప్లవం కాదని 1926 నందు మరో దివ్యమైన మెరుపు బయల్పర్చింది. బదులుగా, యెహోవా తన శక్తిని ఎంత స్పష్టంగా ప్రదర్శిస్తాడంటే, దానితో అది, ప్రజలందరూ ఆయనే దేవుడని నమ్మే యుద్ధంగా ఉంటుంది.—ప్రకటన 16:14-16; 19:17-21.
క్రిస్టమస్—ఓ అన్యమత సెలవుదినం
13. (ఎ) క్రిస్టమస్ వేడుక విషయంలో ఏ వెలుగు ప్రసరమైంది? (బి) జన్మదినాలను జరుపుకోవడం ఎందుకు మానివేయడం జరిగింది? (అథఃస్సూచిని కూడా చేర్చండి.)
13 ఆ తర్వాతి కొద్ది కాలానికే, ఓ మెరుపు బైబిలు విద్యార్థులు క్రిస్టమస్‌ను జరుపుకోకుండా ఉండేలా చేసింది. దానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా బైబిలు విద్యార్థులు క్రిస్టమస్‌ను జరుపుకునేవారు మరియు బ్రూక్లిన్ ముఖ్య కార్యాలయంలో దాన్ని వేడుకగా జరుపుకునేవారు. అయితే అసలు, డిశంబరు 25 బాగా ప్రొద్దుగూకిన తర్వాత ఆచరించడం అన్యమతానికి సంబంధించినదని మరియు అన్యమతస్థుల మతం మార్చడాన్ని సులభతరం చేసేందుకు క్రైస్తవమత సామ్రాజ్యంవారు ఎన్నుకున్న పద్ధతే అది అని వారు గ్రహించారు. అంతేకాకుండ, యేసు జన్మించిన సమయంలో కాపరులు తమ మందలను పొలాల్లో మేపుతున్నారు—డిశంబరు నెలాంతంలో ఆ పని చేయరు కనుక చలికాలంలో జన్మించివుండడని కనుగొనడం జరిగింది. బదులుగా, యేసు సుమారు అక్టోబరు 1న జన్మించి ఉండవచ్చునని లేఖనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండ యేసు జన్మించిన సుమారు రెండు సంవత్సరాలకు ఆయనను దర్శించేందుకు వచ్చిన జ్ఞానులనబడేవారు నిజానికి అన్యమత జ్యోతిష్కులని గ్రహించడం జరిగింది.b
ఓ క్రొత్త నామము
14. యెహోవా ప్రజలను బైబిలు విద్యార్థులు అనే పేరు ఎందుకు సరిగా సూచించలేదు?
14 బైబిలు విద్యార్థులకు 1931 నందు సత్యాన్ని గూర్చిన దివ్యమైన వెలుగు సరైన లేఖనాధార నామాన్ని బయల్పర్చింది. రస్సలైట్లు, మిలేనియల్ డ్వానిస్ట్‌లు మరియు “నరకవ్యతిరేకులు”c వంటి ఇతరులు తమకిచ్చిన మారుపేర్లను తాము ఇకముందు అంగీకరించకూడదని యెహోవా ప్రజలు అర్థంచేసుకున్నారు. తమకు తాము పెట్టుకున్న అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు అనే పేరు వారిని సరిగ్గా సూచించలేదన్న విషయాన్ని వారు గుణగ్రహించడం ప్రారంభించారు. వారు బైబిలు విద్యార్థులు మాత్రమే కాదు. అంతేకాకుండ, ఇతర బైబిలు విద్యార్థులు ఎంతో మంది ఉండేవారు అయితే, బైబిలు విద్యార్థులకు వారు ఎలాంటి పోలికనూ కల్గిలేరు.
15. బైబిలు విద్యార్థులు 1931 నందు ఏ నామాన్ని స్వీకరించారు, మరి అది ఎందుకు సమంజసమైంది?
15 బైబిలు విద్యార్థులు క్రొత్త నామాన్ని ఎలా పొందారు? సంవత్సరాలుగా కావలికోట యెహోవా అనే నామాన్ని ప్రాముఖ్యమైందిగా చేసింది. కనుక, యెషయా 43:10 నందు కనిపించే నామాన్ని బైబిలు విద్యార్థులు స్వీకరించడం ఎంతో సమంజసం: “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. . . . ఇదే యెహోవా వాక్కు.”
నిరూపించడం మరియు “గొప్ప సమూహము”
16. పునరుద్ధరణ ప్రవచనాలు పాలస్తీనాకు తిరిగి వచ్చిన సహజ యూదులకు ఎందుకు అన్వయించబడలేదు, అయితే అది ఎవరికి అన్వయించబడతాయి?
16 వాచ్‌టవర్ సొసైటి వారు 1932 నందు ప్రచురించిన నిరూపించడం (ఆంగ్లం) అనే పుస్తకపు రెండవ సంపుటిలో, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు మరియు ఇతర ప్రవక్తల పునరుద్ధరణ ప్రవచనాలు, విశ్వాసలేమివల్ల మరియు రాజకీయ ఉద్దేశాలతో పాలస్తీనాకు తిరిగి వచ్చే శారీరక యూదులకు (ముందనుకున్నట్లుగా) అన్వయించబడకూడదనే ఓ మెరుపుని బయల్పర్చింది. బదులుగా, సా.శ.పూ. 537 నందు బబులోను చెరనుండి యూదులు తిరిగి వచ్చినప్పుడు చిన్న మొత్తంలో నెరవేరిన ఈ పునరుద్ధరణ ప్రవచనాలు, 1919 నందు ప్రారంభమైన ఆత్మీయ ఇశ్రాయేలీయుల విడుదల మరియు పునరుద్ధరణలోనూ మరియు నేడు యెహోవా నిజ సేవకులు అనుభవిస్తున్న ఆత్మీయ పరదైసు యొక్క సంపదనందు మరి విస్తృత పరిధిలో నెరవేరింది.
17, 18. (ఎ) ఈ మధ్య కాలంలో, మెరుపు ద్వారా యెహోవా ముఖ్య సంకల్పం ఏమిటని చూపించబడింది? (బి) ప్రకటన 7:9-17 సంబంధించి 1935 నందు ఏ మెరుపు మెరిసింది?
17 ఈ మధ్య కాలంలో, యెహోవా ముఖ్య సంకల్పం, మానవుల రక్షణ కాదుకానీ తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకోవడమేననే వెలుగు బయల్పర్చింది. అతి ప్రాముఖ్యమైన బైబిలు మూలాంశం, విమోచనకాదు రాజ్యమే, ఎందుకంటే అది యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపిస్తుంది. అది ఎంతటి మెరుపోకదా! సమర్పిత క్రైస్తవులు తాము పరలోకానికి వెళ్లే విషయంలో ఇక మీదట ప్రాముఖ్యమైన శ్రద్ధనివ్వలేదు.
18 ప్రకటన 7:9-17 నందు ప్రస్తావించిన గొప్ప సమూహము, రెండవ పరలోక తరగతి కాదనే ప్రకాశమానమైన మెరుపు 1935 నందు బయల్పర్చబడింది. ఆ వచనాల్లో ప్రస్తావించబడినవారు, పూర్తి నమ్మకంగా లేని కొందరు అభిషక్తులని, అందువల్ల వారు రాజులుగానూ యాజకులుగానూ యేసుక్రీస్తుతో సింహాసనాలపై కూర్చుని పరిపాలించే బదులు సింహాసనాల ఎదుట నిలుచుని ఉన్నారని భావించబడేది. అయితే కొంతమేరకు నమ్మకంగా ఉండడం అన్నదే లేదు. అటు నమ్మకంగానన్నా ఉంటారు లేదా అపనమ్మకంగానన్నా ఉంటారు. కనుక, అన్ని జనాంగాలనుండి నేడు సమకూర్చబడుతున్న మరియు భూనిరీక్షణ కల్గివున్న ఎన్నిక లేని గొప్ప సమూహాన్ని ఈ ప్రవచనం సూచిస్తోందని గ్రహించడం జరిగింది. వారు మత్తయి 25:31-46 నందలి “గొఱ్ఱెలు” మరియు యోహాను 10:16 నందలి “వేరే గొఱ్ఱెలు”.
సిలువ—క్రైస్తవ చిహ్నంకాదు
19, 20. సిలువ నిజ క్రైస్తవత్వానికి ఎందుకు ఒక చిహ్నం కాదు?
19 బైబిలు విద్యార్థులు, అనేక సంవత్సరాల వరకు సిలువను క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైన చిహ్నంగా చేశారు. వారికి “సిలువ మరియు కిరీటం” ఉన్న బాడ్జివంటిది కూడా ఉండేది. కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం, తమ “సిలువను” తీసుకోమని యేసు తన అనుచరులను కోరాడు మరియు అనేకులు అందుకని యేసు సిలువపైన చంపబడ్డాడని విశ్వసించడం ప్రారంభించారు. (మత్తయి 16:24; 27:32) దశాబ్దాలుగా ఈ గుర్తు కావలికోట పత్రికల కవరుపైన కూడా కనిపించేది.
20 సంస్థ 1936 నందు ప్రచురించిన సంపదలు (ఆంగ్లం) అనే పుస్తకం, యేసు సిలువపై కాదు నిలువుగావున్న దూలంమీద, లేక మ్రానుపై చంపబడ్డాడని స్పష్టంచేసింది. ఒక అధికారిక మూలం ప్రకారం, “సిలువ” అని కింగ్ జేమ్స్ వర్షన్‌లో అనువదించిన పదం (స్టావురోస్), “ప్రాముఖ్యంగా ఓ గుంజ కర్ర లేక మ్రానును సూచిస్తుంది. [దీన్ని,] రెండు కొయ్యలున్న చర్చి సంబంధిత సిలువ నుండి విడిగా గుర్తించాలి. . . . తర్వాత చెప్పినది ప్రాచీన కల్దియాలో ప్రారంభమైంది మరియు తమ్మూజు దేవతకు గుర్తుగా ఉపయోగించబడింది.” దాన్ని విగ్రహంగా చేసే బదులు, యేసు చంపబడిన పరికరాన్ని అసహ్యంతో దృష్టించాలి.
21. తదుపరి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?
21 పెద్ద మెరుపులను గూర్చి మరియు చిన్నవిగా పరిగణించబడే మెరుపులను గూర్చి అనేక ఉదాహరణలున్నాయి. వీటిని గూర్చిన చర్చకొరకు, తర్వాతి శీర్షికను చూడండి.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరేటెడ్ వారు 1973ప్రచురించింది.
b కాలం గడిచేకొలది, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన జన్మ దినాన్నే మనం జరుపుకోనప్పుడు, ఏ జన్మదినాన్ని జరుపుకోకూడదని గ్రహించడం జరిగింది. అంతేకాకుండ, అటు ఇశ్రాయేలీయులుగానీ లేక తొలి క్రైస్తవులుగానీ జన్మదినాలను జరుపుకోలేదు. బైబిలు కేవలం రెండు జన్మదినాలనే ప్రస్తావిస్తోంది ఒకటి ఫరో జన్మదినం మరొకటి హేరోదు అంతిపయ జన్మదినం. ప్రతి వేడుక, ఓ హత్యతో ముడివడి ఉంది. యెహోవాసాక్షులు జన్మదిన వేడుకలను జరుపుకోరు, ఎందుకంటే ఈ వేడుకలకు అన్యమతారంభముంది మరియు ఆ జన్మదినం ఎవరికొరకు జరుపబడుతోందో వారిని ఉన్నతపర్చేందుకు కారణమౌతుంది.—ఆదికాండము 40:20-22; మార్కు 6:21-28.
c అనేక క్రైస్తవమత సామ్రాజ్యపు తెగలు ఈ తప్పును చేశారు. మార్టిన్ లూథర్ శత్రువులు అతని అనుచరులకు పెట్టిన పరిహాసపు పేరే లూథరన్లు, పిమ్మట వారు దాన్ని స్వీకరించారు. అదే విధంగా, తాము నీటిలో ముంచే బాప్తిస్మాన్ని గూర్చి ప్రకటించేవారు కనుక, ఇతరులు తమకిచ్చిన పరిహాసపు పేరును బాప్టిస్టులు అంగీకరించారు. కాస్త అదే విధంగా, మెథడిస్టులు, ఓ బైటి వ్యక్తి తమకిచ్చిన పేరును వారు స్వీకరించారు. సొసైటి ఆఫ్ ఫ్రెండ్స్ అన్నది, ఎలా క్వేకర్స్‌గా మారిందన్న విషయాన్ని గూర్చి ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “‘ప్రభువు వాక్యాన్ని చదివి భయంతో వణకమని’ ఓ ఆంగ్ల న్యాయాధిపతితో చెప్పిన ఫాక్స్ [స్థాపకుడు] అనే వ్యక్తిని అవమానించేందుకు అన్న మాటే క్వేకర్ (వణికెడువానికి ఆంగ్ల పదం). ఆ న్యాయాధిపతి ఫాక్స్‌ను ‘క్వేకర్’ అని పిలిచాడు.”
మీకు జ్ఞాపకముందా?
◻ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎవరు మరియు “యింటివారు” ఎవరు?
◻ ఆధునిక దినంలోని కొన్ని తొలి మెరుపులేవి?
◻ యెహోవాసాక్షులు అనే క్రొత్త పేరు ఎందుకు సమంజసం?
◻ ఏ ప్రాముఖ్యమైన సత్యాలు 1935 నందు బయల్పర్చబడ్డాయి?
[17వ పేజీలోని చిత్రం]
సి. టి. రస్సల్ మరియు ఆయన సహచరులు ఆత్మీయ వెలుగును వ్యాప్తి చేశారు కానీ, ఘనత అంతా యెహోవాకే వెళ్లింది