కాలాలూ, రుతువులూ యెహోవా చేతుల్లో ఉన్నాయి
“కాలములను సమయములను [“రుతువులను,” NW] తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలుసుకొనుట మీ పనికాదు.”—అపొస్తలుల కార్యములు 1:7.
1. యేసు తన అపొస్తలులు అడిగిన కాలంతో ముడిపెట్టబడ్డ ప్రశ్నలకు ఎలా జవాబిచ్చాడు?
క్రైస్తవమత సామ్రాజ్యంలోనూ, భూమియందంతటనూ “[జరుగుతున్న] హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న” వాళ్లు, ఈ దుష్టవిధానం అంతమై దాని స్థానంలోకి దేవుని నీతియుక్త కొత్త లోకం ఎప్పుడొస్తుందని ప్రశ్నించడంకన్నా మరింత సహజమైన ప్రశ్నేదైనా ఉంటుందా? (యెహెజ్కేలు 9:4; 2 పేతురు 3:13) యేసు అపొస్తలులు ఆయన మరణించడానికి ముందూ, పునరుత్థానమైన తర్వాతా కాలంతో ముడిపెట్టబడివున్న ప్రశ్నల్ని అడిగారు. (మత్తయి 24:3; అపొస్తలుల కార్యములు 1:6) అయితే, వాటికి జవాబుగా యేసు వారికి తారీఖుల్ని లెక్కించే ఓ మాధ్యమాన్ని ఇవ్వలేదు. ఒక సందర్భంలో ఆయన వారికి సంయుక్త సూచనను ఇచ్చాడు, మరో సందర్భంలోనైతే ఆయన, “కాలములను సమయములను [“రుతువులను,” NW] తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలుసుకొనుట మీ పనికాదు” అని చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 1:7.
2. అంత్యదినాల్లో జరగాల్సిన సంఘటనల కోసం తన తండ్రి నియమించిన కాలాన్ని గురించి యేసుకు అన్ని సమయాల్లోనూ తెలిసివుండలేదని ఎందుకు చెప్పవచ్చు?
2 యేసు యెహోవా దేవుని అద్వితీయ కుమారుడైనప్పటికీ, జరగబోయే సంఘటనల కోసం తన తండ్రి నియమించిన కాలపట్టికను గురించి ఆయనకు కూడా అన్నివేళలా తెలిసివుండలేదు. అంత్యదినాల్ని గురించిన తన ప్రవచనంలో, యేసు వినయంగా ఇలా గుర్తించాడు: “ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:36) ఈ విధానానికి వ్యతిరేకంగా వినాశనకరమైన చర్యను గైకొనే ఖచ్చితమైన సమయాన్ని తన తండ్రి తనకు బయల్పర్చేంతవరకూ యేసు సహనంతో వేచివుండడానికి సుముఖత చూపించాడు.a
3. దేవుని సంకల్పాన్ని గూర్చిన ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబులనుండి మనమేం నేర్చుకోగలం?
3 దేవుని సంకల్ప నెరవేర్పులో భాగంగా సంఘటనలు ఎప్పుడు జరుగుతాయనే దానికి సంబంధించిన ప్రశ్నలకు యేసు జవాబులిచ్చిన తీరునుండి రెండు విషయాల్ని మనం గుర్తించవచ్చు. మొదటిది, యెహోవాకు ఒక కాలపట్టిక ఉంది; రెండవది, ఆ కాలపట్టికను నిర్ణయించేది ఆయన మాత్రమే. ఆయన కాలాలకూ లేదా రుతువులకూ సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని తమకు ముందుగా ఇవ్వాలని ఆయన సేవకులు అపేక్షించకూడదు.
యెహోవా కాలాలూ, రుతువులూ
4. అపొస్తలుల కార్యములు 1:7లో ‘కాలాలూ, రుతువులూ’ అని అనువదించబడిన గ్రీకు పదాల అర్థాలు ఏమిటి?
4 “కాలాలూ,” “రుతువులూ” అంటే అర్థమేమిటి? అపొస్తలుల కార్యములు 1:7లో రాయబడిన యేసు వ్యాఖ్యానంలో కాలానికి ద్విముఖాకృతులు చేరివున్నాయి. ‘కాలాలు’ అని అనువదించబడిన గ్రీకు పదానికి “అవధి అనే భావంలో కాలము” అనీ అంటే (దీర్ఘ లేదా తక్కువ) నిడివిగల కాలమనీ అర్థం. ‘రుతువులు’ అనేది స్థిరమైన లేదా నియమిత కాలాన్ని సూచించే, కొన్ని లక్షణాలచే గుర్తించబడ్డ ఒక ప్రత్యేకమైన రుతువునో లేదా కాలావధినో సూచించే ఒక పదం యొక్క అనువాదమే. ఈ రెండు మూల పదాల్ని గురించి డబ్ల్యు. ఇ. వైన్ ఇలా తెలియజేస్తున్నాడు: “అపొస్తలుల కార్యములు 1:7లో ఉన్నదాని ప్రకారం, కాలాల్నీ (క్రోనోస్) అంటే కాలావధులనూ, అలాగే రుతువులనూ (కైరోస్) అంటే కొన్ని ప్రత్యేక సంఘటనలచే గుర్తించబడిన యుగాలనూ ‘తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.’”
5. భ్రష్టలోకాన్ని నాశనం చేయాలనే తన సంకల్పాన్ని గురించి యెహోవా నోవహుకు ఎప్పుడు తెలియజేశాడు, ఏ రెండు రకాలైన పనిని నోవహు నిర్వర్తించాడు?
5 మానవులూ, మానవ శరీరాల్ని దాల్చిన తిరుగుబాటుదారులైన దూతలూ తీసుకొచ్చిన భ్రష్టలోకానికి దేవుడు 120 ఏళ్ల కాలపరిమితిని జలప్రళయం రావడానికి ముందు నియమించాడు. (ఆదికాండము 6:1-3) అప్పటికి, భక్తిపరుడైన నోవహుకు 480 ఏళ్లు. (ఆదికాండము 7:6) ఆయనకు అటు తర్వాత 20 ఏళ్లవరకూ పిల్లలు కలుగలేదు. (ఆదికాండము 5:32) అటు తర్వాత చాలా కాలానికి అంటే నోవహు కుమారులు పెద్దవాళ్లై పెళ్లిళ్లు చేసుకొన్న తర్వాత మాత్రమే, భూమిపై నుండి దుష్టత్వాన్ని తొలగించాలనే తన సంకల్పాన్ని గురించి దేవుడు నోవహుకు తెలియజేశాడు. (ఆదికాండము 6:9-13, 18) ఓడను నిర్మిస్తూ, తన సమకాలికులకు ప్రకటిస్తూ ఉండాలనే రెండు రకాలైన నియామకాన్ని నోవహుకు అప్పగించినప్పటికీ, యెహోవా తన కాలపట్టికను అతనికి బయల్పర్చలేదు.—ఆదికాండము 6:14; 2 పేతురు 2:5.
6. (ఎ) కాలానికి సంబంధించిన విషయాల్ని తాను యెహోవా చేతుల్లో విడిచిపెట్టానని నోవహు ఎలా చూపించుకున్నాడు? (బి) నోవహు మాదిరిని మనమెలా అనుసరించగలం?
6 దశాబ్దాలుగా—బహుశా అర్థ శతాబ్దంగా—“నోవహు . . . దేవుడు . . . [తన]కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” నోవహుకు ఖచ్చితమైన తారీఖు ఏదో తెలియకపోయినా “విశ్వాసమునుబట్టి” అలా చేశాడు. (ఆదికాండము 6:22; హెబ్రీయులు 11:7) జలప్రళయం రావడానికిక ఒక వారం రోజులు గడువు ఉందనేంత వరకూ సంఘటనలు జరగడానికైన ఖచ్చితమైన కాలాన్ని గురించి యెహోవా అతనికి తెలియజేయలేదు. (ఆదికాండము 7:1-5) యెహోవాపై నోవహు ఉంచిన ప్రగాఢమైన నమ్మకమూ, విశ్వాసమూ అతడ్ని కాలానికి సంబంధించిన కారకాల్ని దేవుని చేతుల్లో విడిచిపెట్టేలా చేశాయి. జలప్రళయంలోనూ, అటు తర్వాత ఓడలోనుండి శుభ్రపర్చబడిన భూమిపైకి అడుగిడినప్పుడూ తాననుభవించిన యెహోవా కాపుదలనుబట్టి నోవహు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడో గదా! విడుదల విషయంలో అలాంటి ఆశతోనే, దేవునియందు మనం అలాంటి విశ్వాసాన్నే పెంపొందించుకోవద్దా?
7, 8. (ఎ) జనాంగాలూ, ప్రపంచశక్తులూ ఎలా ఉనికిలోకి వచ్చాయి? (బి) యెహోవా ఏ విధంగా ‘నిర్ణయకాలాల్నీ, వారి నివాసస్థలాల యొక్క పొలిమేరల్నీ ‘ఏర్పర్చాడు’?
7 జలప్రళయానంతరం, నోవహు సంతానంలోని అనేకులు యెహోవా దేవుని సత్యారాధనను విడిచిపెట్టారు. ఒక్క చోటనే జీవించాలనే ఉద్దేశంతో, వాళ్లొక నగరాన్నీ, అబద్ధ ఆరాధన కోసమొక గోపురాన్నీ నిర్మించనారంభించారు. జోక్యం చేసుకోవడానికిది సమయమని యెహోవా నిశ్చయించుకున్నాడు. ఆయన వాళ్ల భాషను తారుమారు చేసి, “అక్కడ [బాబెలు] నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను.” (ఆదికాండము 11:4, 8, 9) అటు తర్వాత, ఆ భాషాగుంపులు జనాంగాలుగా వృద్ధిచెందాయి, అందులో కొన్ని ఇతర జనాంగాల్లో కలిసిపోయి ప్రాంతీయ శక్తులుగానూ, అలాగే ప్రపంచ శక్తులుగానూ అవతరించాయి.—ఆదికాండము 10:32.
8 తన సంకల్పాలను నెరవేర్చడానికి అనుగుణంగా దేవుడు, జాతీయసరిహద్దులనూ, కాలవాహినిలో ఫలానా జనాంగం స్థానికంగాగానీ లేదా ఒక ప్రపంచశక్తిగాగానీ ఎప్పుడు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో అనే విషయాన్నీ అప్పుడప్పుడూ నిర్ణయించాడు. (ఆదికాండము 15:13, 14, 18-21; నిర్గమకాండము 23:31; ద్వితీయోపదేశకాండము 2:17-22; దానియేలు 8:5-7, 20, 21) అపొస్తలుడైన పౌలు ఏథెన్సులో ఉన్న గ్రీకు మేధావులతో మాట్లాడినప్పుడు ఆయన యెహోవా కాలాల విషయంలోనూ, రుతువుల విషయంలోనూ ఈ అంశాన్ని సూచించాడు: “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు . . . యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను.”—అపొస్తలుల కార్యములు 17:24, 26.
9. రాజులకు సంబంధించినంతవరకూ యెహోవా ఎలా ‘కాలాల్నీ, రుతువుల్నీ మార్చివేశాడు’?
9 రాజకీయ విజయాలన్నింటికీ, జనాంగాల మధ్య జరుగు మార్పులన్నింటికీ యెహోవా బాధ్యుడని దీని అర్థం కాదు. అయినప్పటికీ, తన సంకల్పాన్ని నెరవేర్చాలని ఆయన ఎంపికచేసుకొనేటప్పుడు ఆయన జోక్యం చేసుకోగలడు. అందుకే, బబులోను ప్రపంచశక్తి అంతమై దాని స్థానంలో వచ్చిన మాదీయ-పారసీక ప్రపంచశక్తి రాకకు సాక్షిగా ఉన్న దానియేలు ప్రవక్త యెహోవాను గురించి ఇలా తెలియజేశాడు: “ఆయన కాలములను సమయ ములను [“ఋతువులు,” లివింగ్ బైబిల్స్ ఇండియావారి పరిశుద్ధ బైబిల్] మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.”—దానియేలు 2:21; యెషయా 44:24–45:7.
‘కాలము సమీపించినది’
10, 11. (ఎ) దాస్యాన్నుంచి అబ్రాహాము సంతానాన్ని తాను విముక్తి చేయబోయే సమయాన్ని ఎంత కాలంముందు యెహోవా నిర్ణయించాడు? (బి) తాము ఖచ్చితంగా ఎప్పుడు విడుదలచేయబడతామన్న విషయం ఇశ్రాయేలీయులకు తెలియదని ఏది తెలియజేస్తోంది?
10 తాను ఐగుప్తు ప్రపంచశక్తి యొక్క రాజును అవమానించి, అబ్రాహాము సంతానాన్ని దాస్యవిముక్తులను చేయబోయే ఖచ్చితమైన సంవత్సరాన్ని, యెహోవా నాలుగు శతాబ్దాలకన్నా ఎంతోకాలం ముందే నిర్ణయించాడు. అబ్రాహాముకు తన సంకల్పాన్ని బయల్పరుస్తూ, దేవుడిలా వాగ్దానం చేశాడు: “నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.” (ఆదికాండము 15:13, 14) యూదా మహాసభ ఎదుట ఇశ్రాయేలు చరిత్రను గూర్చిన తన పునఃసమీక్షలో, స్తెఫను ఈ 400 సంవత్సరాల కాలాన్ని సూచించి ఇలా తెలియజేశాడు: “దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధిపొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏల నారంభించెను.”—అపొస్తలుల కార్యములు 7:6, 17, 18.
11 ఆ కొత్త ఫరో ఇశ్రాయేలీయుల్ని దాసులుగా చేశాడు. మోషే ఆదికాండాన్ని అప్పటికింకా రాయకపోయినప్పటికీ, యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాలు బహుశా మౌఖికంగాగానీ లేదా రాతపూర్వకంగాగానీ అందజేయబడి ఉండవచ్చు. అప్పటికీ, ఇశ్రాయేలీయుల దగ్గరున్న సమాచారం, అణిచివేత నుండి విడుదల పొందబోయే ఖచ్చితమైన తారీఖును లెక్కగట్టడానికి సరిపోనట్లుగా కన్పిస్తోంది. తాను వాళ్లనెప్పుడు విడుదల చేయబోతున్నాడనే విషయం దేవునికి తెలుసు, అయితే బాధను అనుభవిస్తున్న ఇశ్రాయేలీయులకు దాన్ని గురించి తెలియజేయబడినట్టు కన్పించడంలేదు. మనమిలా చదువుతాం: “అనేకదినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.”—నిర్గమకాండము 2:23-25.
12. యెహోవా కాలానికన్నా ముందుగా ఇశ్రాయేలీయుల్ని విడుదల చేయడానికి మోషే ప్రయత్నించాడని స్తెఫను ఎలా చూపించాడు?
12 ఇశ్రాయేలీయులు విడుదలకాబోయే ఖచ్చితమైన సమయాన్ని గూర్చిన ఈ అవగాహనాలోపాన్ని స్తెఫను ప్రసంగాన్నుండి గ్రహించవచ్చు. మోషేను గూర్చి మాట్లాడుతూ, ఆయనిలా అన్నాడు: “అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.” (అపొస్తలుల కార్యములు 7:23-25, ఇటాలిక్కులు మావి.) దేవుని కాలానికన్నా 40 ఏళ్ల ముందే ఇశ్రాయేలీయుల్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు. దేవుడు ‘తన ద్వారా రక్షణ దయచేయడానికి’ మోషే మరి 40 ఏళ్లు వేచివుండాల్సి వచ్చిందని స్తెఫను చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 7:30-36.
13. ఐగుప్తునుండి విడుదల పొందడానికి ముందున్న ఇశ్రాయేలీయుల పరిస్థితిని పోలి మన పరిస్థితి ఎలా వుంది?
13 ‘వాగ్దాన కాలము సమీపిస్తున్నప్పటికీ,’ దేవుడు ఆ కచ్చితమైన సంవత్సరాన్ని నిర్ధారించినప్పటికీ మోషే, ఇశ్రాయేలీయులందరూ విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సి వచ్చింది. యెహోవా నియమిత కాలం కోసం వేచివుండాల్సి వచ్చింది, అదీ దాన్ని గురించి ముందుగా ఏ విధమైన లెక్కలూ కట్టుకోకుండానే. ప్రస్తుత దుష్ట విధానం నుండి మనం పొందబోయే విడుదల సమీపిస్తోందని మనం కూడా ఒప్పించబడ్డాం. “అంత్యదినములలో” జీవిస్తున్నామని మనకు తెలుసు. (2 తిమోతి 3:1-5) కాబట్టి మన విశ్వాసాన్ని చూపించుకోవడానికీ, యెహోవా మహాగొప్ప దినం కోసమైన ఆయన నియమిత కాలం కోసం వేచివుండడానికీ మనం సుముఖతను చూపించమా? (2 పేతురు 3:11-13) అప్పుడు మోషేవలే, ఇశ్రాయేలీయులవలే, యెహోవాను స్తుతించేందుకు మహిమాయుక్తమైన విడుదల కీర్తనను మనం కూడా పాడుతాము.—నిర్గమకాండము 15:1-19.
‘కాలము ఆసన్నమైనప్పుడు’
14, 15. దేవుడు తన కుమారుడు భూమిపైకి రావడానికి ఒక కాలాన్ని నియమించాడని మనకు ఎలా తెలుసు, ప్రవక్తలూ, చివరికి దేవదూతలూ దేనికోసం గమనిస్తూ ఉన్నారు?
14 తన అద్వితీయ కుమారుడు మెస్సీయాగా భూమిపైకి రావడానికి యెహోవా నిర్దిష్టమైన కాలాన్ని ఏర్పాటు చేశాడు. పౌలు ఇలా రాశాడు: “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, . . . ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.” (గలతీయులు 4:4) ఇది ప్రజలు ఎవరికి విధేయులై ఉండబోతారో ఆ షిలోహును—ఆ సంతానాన్ని పంపిస్తానన్న దేవుని వాగ్దాన నెరవేర్పైవుంది.—ఆదికాండము 3:15; 49:10.
15 మెస్సీయా భూమిపై కనబడబోయే, పాపపంకిలమైన మానవజాతికి రక్షణ సాధ్యమవ్వబోయే “రుతువు” కోసం దేవుని ప్రవక్తలూ, అలాగే దేవదూతలు సహితం గమనిస్తూ ఉన్నారు. “మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును [“రుతువును,” NW] సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. . . . దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు.”—1 పేతురు 1:1-5, 10-12.
16, 17. (ఎ) మెస్సీయా కోసం కనిపెట్టడంలో మొదటి శతాబ్దంలోని యూదులకు ఏ ప్రవచనం ద్వారా యెహోవా సహాయం చేశాడు? (బి) మెస్సీయా కోసం యూదులు కనిపెట్టడాన్ని దానియేలు ప్రవచనం ఎలా ప్రభావితం చేసింది?
16 అచంచలమైన విశ్వాసాన్ని కల్గివున్న తన ప్రవక్తయైన దానియేలు ద్వారా యెహోవా “డెబ్బదివారములు” చేరివున్న ఓ ప్రవచనాన్ని ఇచ్చాడు. వాగ్దాన మెస్సీయా కనిపించే సమయం సమీపిస్తున్నదని మొదటి శతాబ్దంలోని యూదులు తెలుసుకొనేలా ఆ ప్రవచనం చేయగల్గింది. ఆ ప్రవచనంలో కొంత భాగమిలా తెలియజేసింది: “జెరుసలం [యెరూషలేము] మళ్లీ కట్టి పూర్వస్థితికి తేవచ్చునని ఆజ్ఞ జారీ చేయడం జరిగే సమయంనుంచి అభిషిక్తుడైన అధిపతి సమయంవరకు ఏడు ‘ఏడులు’ [“వారములు,” పరిశుద్ధ గ్రంథము] అరవై రెండు ‘ఏడులు’ [“వారములు,” పరిశుద్ధ గ్రంథము] పడుతుంది.” (దానియేలు 9:24, 25, ఇండియా బైబిల్ లిటరేచర్‌వారి పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ఇక్కడ ప్రస్తావించబడిన “వారములు” అంటే వారముల సంవత్సరాలని యూదా, క్యాథలిక్, ప్రొటెస్టెంట్ పండితులు సాధారణంగా ఏకీభవిస్తారు. సా.శ.పూ. 455లో “పట్టణమును తిరిగి కట్టు”టకు పారసీక రాజైన అర్తహషస్త నెహెమ్యాకు అధికారమిచ్చినప్పుడు దానియేలు 9:25లోని 69 “వారములు” (483 సంవత్సరాలు) ఆరంభమయ్యాయి. (నెహెమ్యా 2:1-8) అవి 483 సంవత్సరాల తర్వాత అంటే యేసు బాప్తిస్మం తీసుకొని, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి మరావిధంగా మెస్సీయాగా లేదా క్రీస్తుగా అయిన సంవత్సరమైన సా.శ. 29లో ముగిసిపోయాయి.—మత్తయి 3:13-17.
17 మొదటి శతాబ్దంలోని యూదులకు 483 సంవత్సరాలు ఖచ్చితంగా ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా లేదా అనే విషయం ఇదమిద్ధంగా తెలియదు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, “ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయ యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుం[డిరి].” (లూకా 3:15) ఈ విధంగా ఎదురుచూడడాన్ని కొంతమంది బైబిలు పండితులు దానియేలు ప్రవచనంతో ముడిపెట్టారు. ఆ లేఖనంపై వ్యాఖ్యానిస్తూ, మాథ్యూ హెన్రీ ఇలా రాశాడు: “యోహాను చేసిన పరిచర్య నుండీ, ఇచ్చిన బాప్తిస్మం నుండీ మెస్సీయాను గురించి ఆలోచించడానికీ, ద్వారం దగ్గరే ఉన్నట్టుగా ఆయన గురించి ఆలోచించడానికీ ప్రజలా సందర్భాన్ని ఎలా తీసుకున్నారో . . . మనకిక్కడ చెప్పబడింది. . . . దానియేలు డెబ్బదివారములు ఇప్పుడు గతించిపోయాయి.” వెగురు, భాక్వస్, బ్రాసాక్‌లు రాసిన ఫ్రెంచ్ భాషలోని మాన్యుల్ బిబ్లిక్ ఇలా తెలియజేస్తోంది: “దానియేలు స్థిరపర్చిన డెబ్బది వారముల సంవత్సరాలు ముగియబోతున్నాయని ప్రజలకు తెలుసు; దేవుని రాజ్యము సమీపిస్తోందని బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించడాన్ని విని ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు.” యూదా పండితుడైన అబ్బా హిలాల్ సిల్వర్ ఆనాటి “జనావళిలో ప్రసిద్ధిగాంచిన కాలవృత్తాంతము” ప్రకారంగా “దాదాపుగా సా.శ. మొదటి శతాబ్దపు రెండవ పాదంలో మెస్సీయా వస్తాడని ఎదురు చూశారు” అని రాశాడు.
సంఘటనలపైనేగాని కాల గణనలపై కాదు
18. మెస్సీయా ఎప్పుడు కనిపిస్తాడనే విషయాన్ని గుర్తించేందుకు యూదులకు దానియేలు ప్రవచనం సహాయపడినప్పటికీ, యేసే మెస్సీయా అని మరింతగా ఒప్పింపచేసే రుజువు ఏది?
18 కాలవృత్తాంతం, మెస్సీయా ఎప్పుడు కనిపిస్తాడనే విషయంలో ఒక సాధారణ అభిప్రాయాన్ని కల్గివుండేలా యూదులకు సహాయపడినట్టు కనబడినప్పటికీ, అది యేసే మెస్సీయా అని వారిలో అనేకులు ఒప్పించబడేలా చేయలేకపోయిందని అటు తర్వాత జరిగిన సంఘటనలు చూపించాయి. యేసు తానిక ఓ సంవత్సరంలోపు చనిపోతాడనగా ఆయన తన శిష్యుల్ని “నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నా[రు]”? అని అడిగాడు. దానికి వాళ్లు, “బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు— ఏలీయాయనియు, కొందరు—పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారని” ప్రత్యుత్తరమిచ్చారు. (లూకా 9:18, 19) తాను మెస్సీయానని రుజువుచేసుకునేందుకు సూచనార్థక వారముల ప్రవచనాన్ని యేసు ఎప్పుడైనా ఎత్తిచెప్పాడా అనే దాన్ని గురించి మనకేవిధమైన రికార్డూ లేదు. కానీ ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నాడు: “యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.” (యోహాను 5:36) బయల్పర్చబడిన ఏ విధమైన కాలవృత్తాంతంకన్నా యేసు ప్రకటనాపనీ, ఆయన చేసిన అద్భుతాలూ, ఆయన మరణానికి ముందూ ఆ తర్వాతా జరిగిన సంఘటనలూ (అద్భుతంగా చీకటికమ్మడం, దేవాలయపు తెర చినిగిపోవడం, భూకంపం) ఆయన దేవుడు పంపించిన మెస్సీయాయని రుజువుపర్చాయి.—మత్తయి 27:45, 51, 54; యోహాను 7:31; అపొస్తలుల కార్యములు 2:22.
19. (ఎ) యెరూషలేము నాశనం సమీపించిందని క్రైస్తవులకు ఎలా తెలియవలసి ఉంది? (బి) యెరూషలేమును విడిచి పారిపోయిన తొలి క్రైస్తవులకు మరింత విశ్వాసం ఎందుకు అవసరం?
19 అదే విధంగా యేసు మరణించిన తర్వాత, రాబోయే యూదా విధానాంతం ఎప్పుడు వస్తుందో లెక్కగట్టేందుకు తొలి క్రైస్తవులకు ఏ విధమైన మాధ్యమాలూ ఇవ్వబడలేదు. నిజమే, సూచనార్థక వారాల్ని గూర్చిన దానియేలు ప్రవచనం ఆ విధాన నాశనాన్ని గురించి ప్రస్తావించింది. (దానియేలు 9:26బి, 27బి) కానీ ఆ నాశనం “డెబ్బది వారములు” ముగిసిన తర్వాతనే సంభవిస్తుంది. (సా.శ.పూ. 455-సా.శ. 36) మరో మాటల్లో చెప్పాలంటే, సా.శ. 36లో మొదటి అన్యులు యేసు అనుచరులుగా మారిన తర్వాత, క్రైస్తవులు దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న కాలవృత్తాంత మైలురాళ్లను దాటిపోయారు. వారికైతే యూదా విధానం త్వరలోనే అంతంకానైవుందనే విషయాన్ని కాలవృత్తాంతంకాదుగానీ సంఘటనలు సూచించనై ఉన్నాయి. రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించి, వెనుదిరిగి వెళ్లిపోయినప్పుడు అంటే సా.శ. 66 నుండీ యేసు ప్రవచించిన ఆ సంఘటనలు తారాస్థాయికి చేరుకోనారంభించాయి. యెరూషలేము, యూదాల్లో ఉన్న నమ్మకమైన శ్రద్ధగల క్రైస్తవులు ‘కొండలకు పారిపోవడానికి’ ఇది అవకాశమిచ్చింది. (లూకా 21:20-22) ఏ విధమైన కాలవృత్తాంతపు సంకేతాలూ లేకపోవడంతో, యెరూషలేము నాశనం ఎప్పుడొస్తుందనే విషయాన్ని ఆ తొలి క్రైస్తవులు తెలుసుకోలేరు. తమ గృహాల్నీ, పొలాల్నీ, దుకాణాల్నీ విడిచిపెట్టేందుకూ యెరూషలేముకు దూరంగా దాదాపు నాలుగేళ్లు ఉండేలా అంటే సా.శ. 70లో రోమా సైన్యంవచ్చి యూదా విధానాన్ని తుడిచిపెట్టేంతవరకూ ఉండడానికీ వారికెంత విశ్వాసం అవసరమో కదా!—లూకా 19:41-44.
20. (ఎ) నోవహు, మోషే, యూదాలోని మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరుల నుండి మనమెలా ప్రయోజనం పొందగలం? (బి) తర్వాత శీర్షికలో మనమేం చర్చించబోతున్నాం?
20 నోవహు, మోషేలవలే, యూదయలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులవలే, నేడు మనం కూడా కాలాల్నీ, రుతువుల్నీ నిశ్చయంగా యెహోవా చేతుల్లో విడిచిపెట్టవచ్చు. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే, మన విడుదల సమీపిస్తుందనే మన ఒప్పుదల కేవలం కాలవృత్తాంతపు లెక్కలపైగాక బైబిలు ప్రవచనాల నెరవేర్పులోని వాస్తవికమైన సంఘటనలపై ఆధారపడాలి. అంతేగాక, మనం క్రీస్తు ప్రత్యక్షతాకాలంలో జీవిస్తున్నప్పటికీ, విశ్వాసాన్ని అలవర్చుకుంటూ, మెలకువగా ఉండాల్సిన అవసరత నుండి మనం తప్పించుకోలేం. లేఖనాల్లో ప్రవచించబడిన ఉత్తేజిత సంఘటనలను ఆతురతతో కనిపెడుతూ జీవించాలి. తర్వాతి శీర్షిక విషయాంశమదే.
[అధస్సూచీలు]
a కావలికోట, ఆగస్టు 1, 1996 30-1 పేజీలను చూడండి.
పునఃసమీక్షించడం ద్వారా
◻ యెహోవా కాలాల్ని గురించీ, రుతువుల్ని గురించీ యేసు తన అపొస్తలులతో ఏమి చెప్పాడు?
◻ జలప్రళయం ఎప్పుడు ఆరంభమౌతుందనే విషయాన్ని గురించి నోవహుకు ఎంత కాలం ముందు తెలుసు?
◻ ఐగుప్తునుండి తామెప్పుడు విడుదల చేయబడతారో అనే విషయం మోషేకూ, ఇశ్రాయేలీయులకూ ఖచ్చితంగా తెలియదని ఏది చూపిస్తోంది?
◻ యెహోవా కాలాలూ, రుతువులూ చేరివున్న బైబిలు మాదిరుల నుండి మనమెలా ప్రయోజనం పొందగలం?
[11వ పేజీలోని చిత్రం]
నోవహుకున్న విశ్వాసం, కాలానికి సంబంధించిన కారకాల్ని యెహోవా చేతుల్లో విడిచిపెట్టేలా చేసింది