క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
జనవరి 1-7
దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 32-33
ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాళ్లను ఓదార్చండి
it-1-E 710వ పేజీ
ఎలీహు
ఎలీహు ఎవరి మీదా పక్షపాతం చూపించలేదు, ఎవర్నీ పొగడ్తలతో ముంచెత్తలేదు. యోబులాగే తాను కూడా బంకమట్టి నుండే తయారు చేయబడ్డానని, సర్వశక్తిమంతుడైన దేవుడే తన సృష్టికర్త అని ఎలీహు ఒప్పుకున్నాడు. ఎలీహు యోబును భయపెట్టాలనుకోలేదు గానీ ఒక నిజమైన స్నేహితునిలా ఉండాలనుకున్నాడు. అందుకే ఎలీఫజు, బిల్దదు, జోఫరుల్లా కాకుండా యోబును ఆప్యాయంగా పేరుపెట్టి పిలుస్తూ మాట్లాడాడు.—యోబు 32:21, 22; 33:1, 6.
w14 6/15 25వ పేజీ, 8-10 పేరాలు
మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?
8 అనారోగ్యం, సత్యంలో లేని కుటుంబ సభ్యులతో జీవించడం, కృంగుదల వంటి కష్టాల కారణంగా మన ప్రియమైన సహోదరసహోదరీలు బలహీనులు అవుతున్నారని గుర్తుపెట్టుకుంటే, వాళ్లను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఏదో ఒక రోజు మనకు కూడా ఆ కష్టాలు రావచ్చు. ఒకప్పుడు ఐగుప్తులో బీదలుగా, బలహీనులుగా ఉన్న ఇశ్రాయేలీయులు, కష్టాల్లో ఉన్న తమ సహోదరుల పట్ల తమ ‘హృదయం కఠినపరుచుకోకూడదు’ అని వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు యెహోవా వాళ్లకు గుర్తుచేశాడు. బీదలుగా, బలహీనులుగా ఉన్న తోటి సహోదరులకు ఇశ్రాయేలీయులు సహాయం చేయాలని యెహోవా కోరుకున్నాడు.—ద్వితీ. 15:7, 11; లేవీ. 25:35-38.
9 కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను విమర్శించే బదులు, అనుమానించే బదులు వాళ్లకు మనం ఆధ్యాత్మిక సేదదీర్పు అందించాలి. (యోబు 33:6, 7; మత్త. 7:1) ఓ ఉదాహరణ చెప్పుకోవాలంటే, మోటార్‌సైకిల్ నడుపుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడితే, ఆయన్ను హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారని అనుకోండి. అప్పుడు డాక్టర్లు, నర్సులు ఆ ప్రమాదానికి కారణం ఎవరైవుంటారోనని చర్చిస్తూ కాలయాపన చేస్తారా? లేదు, వాళ్లు వెంటనే వైద్యసహాయం అందిస్తారు. అలాగే తోటి విశ్వాసి వ్యక్తిగత సమస్యలవల్ల బలహీనపడితే మనం చేయాల్సిన మొదటి పని, వాళ్లకు ఆధ్యాత్మిక సహాయం అందించడమే.—1 థెస్సలొనీకయులు 5:14 చదవండి.
10 మనం ఒక్కక్షణం ఆగి మన సహోదరుల పరిస్థితి గురించి ఆలోచిస్తే, వాళ్ల బలహీనతను వేరే కోణంలోనుండి చూడగలుగుతాం. సంవత్సరాల తరబడి కుటుంబంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న సహోదరీల గురించి ఆలోచించండి. వాళ్లలో చాలామంది చూడ్డానికి దీనంగా, బలహీనంగా ఉండవచ్చు, అయినా వాళ్లు అసాధారణమైన విశ్వాసాన్ని, మనోబలాన్ని చూపించడం లేదా? తన పిల్లలతో క్రమంగా కూటాలకు వస్తున్న ఓ ఒంటరి తల్లిని చూసినప్పుడు, ఆమె విశ్వాసాన్ని, దృఢసంకల్పాన్ని చూసి మీరు ప్రేరణ పొందట్లేదా? పాఠశాలలో, కాలేజీలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సత్యాన్ని హత్తుకుని ఉన్న యౌవనుల మాటేమిటి? అలాంటివాళ్లు చూడ్డానికి బలహీనంగా ఉండవచ్చుగానీ, అనుకూల పరిస్థితులు ఉన్న మనలో కొంతమందివలె వాళ్లు కూడా “విశ్వాసమందు భాగ్యవంతులుగా” ఉన్నారని మనం వినయంగా ఒప్పుకుంటాం.—యాకో. 2:5.
మాట్లాడడానికి ఏది సరైన సమయం?
17 యోబు దగ్గరికి వచ్చిన నాలుగో వ్యక్తి పేరు ఎలీహు, అతను అబ్రాహాము బంధువు. యోబు, మిగతా ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నాడు. ఆయన వాళ్ల మాటల్ని జాగ్రత్తగా విన్నాడు కాబట్టే యోబు తన ఆలోచనను సరిదిద్దుకునేలా మృదువుగా, నిజాయితీగా సలహా ఇవ్వగలిగాడు. (యోబు 33:1, 6, 17) ఎలీహు ముఖ్యంగా యెహోవాను ఘనపర్చడం గురించి ఆలోచించాడు; కానీ తనను ఘనపర్చుకోవడం గురించో, వేరేవాళ్లను ఘనపర్చడం గురించో ఆలోచించలేదు. (యోబు 32:21, 22; 37:23, 24) కొన్ని సమయాల్లో మౌనంగా ఉంటూ వినాలని ఎలీహు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. (యాకో. 1:19) సలహా ఇస్తున్నప్పుడు మనం ముఖ్యంగా యెహోవాను ఘనపర్చడం గురించే ఆలోచించాలి కానీ, మనల్ని మనం ఘనపర్చుకోకూడదు.
18 ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేవాటి విషయంలో బైబిలు సలహాల్ని పాటించడం ద్వారా మనం మాట్లాడే వరాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించవచ్చు. తెలివిగల రాజైన సొలొమోను దేవుని ప్రేరణతో ఇలా రాశాడు: “సరైన సమయంలో మాట్లాడిన మాట వెండి పళ్లెంలో ఉన్న బంగారు ఆపిల్ పండ్ల లాంటిది.” (సామె. 25:11) మనం వేరేవాళ్లు చెప్పేది జాగ్రత్తగా విన్నప్పుడు, మాట్లాడే ముందు ఆలోచించినప్పుడు మన మాటలు ఆ బంగారు ఆపిల్ పండ్లలా విలువైనవిగా, అందమైనవిగా ఉంటాయి. మనం తక్కువ మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా మన మాటలు ఇతరులను బలపరుస్తాయి, యెహోవా మనల్ని చూసి గర్వపడతాడు. (సామె. 23:15; ఎఫె. 4:29) మాట్లాడే వరాన్ని ఇచ్చిన యెహోవాకు కృతజ్ఞత చూపించడానికి ఇదే సరైన మార్గం!
దేవుని వాక్యంలో రత్నాలు
యెహోవాకు దగ్గరౌతూ ఉండండి
10 అలాగే, మనం చక్కగా కనిపించాలని కోరుకోవడం కూడా సరైనదే. కానీ, వృద్ధాప్య ఛాయలను పూర్తిగా తీసివేయడానికి మనం అతిగా కష్టపడాల్సిన పనిలేదు. అవి కొన్నిసార్లు మనలో ఉన్న పరిణతికి, హుందాతనానికి, అంతర్గత సౌందర్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అందుకే, “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును” అని బైబిలు చెబుతోంది. (సామె. 16:31) యెహోవా పైరూపం కన్నా వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. మనం కూడా అలానే ఉండాలి. (1 పేతురు 3:3, 4 చదవండి.) కాబట్టి, మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో అనవసరమైన, హానికరమైన సర్జరీలు చేయించుకోవడం లేదా వైద్య చికిత్సలను తీసుకోవడం తెలివైన పనే అంటారా? వయసుతో, ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా ‘యెహోవా వల్ల కలిగే ఆనందమే’ మన ముఖాల్లో కనిపించే అసలైన సౌందర్యానికి రహస్యం. (నెహె. 8:10) నూతనలోకంలో మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని, యౌవన సౌందర్యాన్ని తిరిగి పొందుతాం. (యోబు 33:25; యెష. 33:24) అప్పటివరకు, ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ సరైన వివేచనను, విశ్వాసాన్ని చూపిస్తే యెహోవాకు సన్నిహితంగా ఉండగలుగుతాం.—1 తిమో. 4:8.
జనవరి 8-14
దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 34-35
అన్యాయం రాజ్యమేలుతుంటే
దేవుడు ఎలాంటివాడు?
దేవుడు ఎప్పుడూ సరైనదే చేస్తాడు. నిజానికి “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) ఆయన తీర్పులన్నీ న్యాయములు, కీర్తనకర్త యెహోవా గురించి ఇలా చెప్తున్నాడు: “న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు.” (కీర్తన 67:3) ఎందుకంటే “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును,” ఆయన్ని ఎవరూ వేషధారణతో మోసం చేయలేరు, ఆయన ఎప్పుడూ సత్యాన్ని కనిపెట్టి ఖచ్చితమైన తీర్పులు ఇవ్వగలడు. (1 సమూయేలు 16:7) అంతేకాదు, దేవుడికి భూమి మీద జరుగుతున్న ప్రతీ అన్యాయం, అక్రమం గురించి తెలుసు. త్వరలో ఆయన “భక్తిహీనులు దేశములో నుండకుండ” నిర్మూలం అవుతారని వాగ్దానం చేశాడు.—సామెతలు 2:22.
దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది?
5 యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? ఇప్పుడైతే, చెడ్డవాళ్లు మారేందుకు యెహోవా అవకాశమిస్తున్నాడు. (యెష. 55:7) ఈ చెడ్డ లోకాన్ని త్వరలో నాశనం చేయాలని ఆయన నిర్ణయించాడుగానీ, చివరి తీర్పు ఇంకా జరగలేదు. మరి మారడానికి ఇష్టపడకుండా, మహాశ్రమ మొదలయ్యే వరకు ఈ లోకానికి మద్దతిచ్చేవాళ్లకు ఏమి జరుగుతుంది? చెడ్డవాళ్లందర్నీ భూమ్మీద లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. (కీర్తన 37:10 చదవండి.) నేడు చాలామంది దొంగచాటుగా చెడ్డ పనులు చేయడం నేర్చుకున్నారు, దానివల్ల చాలాసార్లు శిక్షను తప్పించుకుంటున్నారు. (యోబు 21:7, 9) కానీ బైబిలు ఇలా గుర్తుచేస్తుంది, “ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.” (యోబు 34:21, 22) కాబట్టి యెహోవా నుండి తప్పించుకోవడం మాత్రం కుదరదు. చెడ్డవాళ్లు చేస్తున్న ప్రతీదీ ఆయన చూడగలడు. హార్‌మెగిద్దోను తర్వాత, వాళ్లు ఒకప్పుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి వెదికినా వాళ్లు కనిపించరు. చెడ్డవాళ్లు భూమ్మీద ఇక ఎప్పటికీ ఉండరు.—కీర్త. 37:12-15.
తడబడకుండా యేసును అనుసరించండి
19 ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఉందా? ఉంది. మనం రాజకీయాల్లో పాల్గొనం కాబట్టి నేడు చాలామంది మనల్ని ఇష్టపడరు. మనం ఎన్నికల్లో ఓటు వేయాలని వాళ్లు కోరుకుంటారు. కానీ మనం మానవ పరిపాలకుణ్ణి ఎంచుకుంటే, యెహోవాను తిరస్కరించినట్టే. (1 సమూ. 8:4-7) అంతేకాదు మనం స్కూళ్లు-హాస్పిటళ్లు కట్టాలని, సమాజ సేవ చేయాలని ప్రజలు అనుకోవచ్చు. ప్రపంచంలో ఇప్పుడున్న సమస్యల్ని పరిష్కరించడం మీద కాకుండా, మనం ప్రకటించడం మీదే దృష్టి పెడతాం. అందుకే వాళ్లు మనల్ని ఇష్టపడరు.
20 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? (మత్తయి 7:21-23 చదవండి.) మనం యేసు అప్పగించిన పని మీదే దృష్టి పెట్టాలి. (మత్త. 28:19, 20) లోకంలోని రాజకీయ, సామాజిక విషయాల వల్ల మన దృష్టి ఎన్నడూ పక్కకు మళ్లకూడదు. మనం ప్రజల్ని ప్రేమిస్తాం, వాళ్ల సమస్యల్ని పట్టించుకుంటాం, వాళ్లకు సహాయం చేయాలనుకుంటాం. కానీ అందుకు చక్కని మార్గం, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ యెహోవాకు స్నేహితులయ్యేలా వాళ్లకు సహాయం చేయడమే అని గుర్తుంచుకుంటాం.
దేవుని వాక్యంలో రత్నాలు
మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!
3 యోబుకు, ఆ ముగ్గురు వ్యక్తులకు మధ్య జరుగుతున్న సంభాషణ అంతా ఎలీహు అనే యువకుడు వింటున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడడం అయిపోయాక ఎలీహు యోబును యెహోవా గురించి ఇలా అడిగాడు, “నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?” (యోబు 35:7) యెహోవాను సేవించడానికి మనం చేసే కృషి అంతా వృథా అని చెప్పడానికి ఎలీహు ప్రయత్నిస్తున్నాడా? లేదు. యెహోవా ఆ ముగ్గురు వ్యక్తుల్ని సరిదిద్దినట్లు ఎలీహును సరిదిద్దలేదు. ఎలీహు వేరే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం తనను ఆరాధించడం వల్ల యెహోవాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని ఎలీహు చెప్తున్నాడు. యెహోవాకు ఏ కొరత లేదు. యెహోవాను మరింత మెరుగ్గా లేదా ధనవంతునిగా లేదా శక్తివంతునిగా చేసేలా మనమేమీ చేయలేం. నిజానికి మనకున్న ఏ మంచి లక్షణమైనా లేదా సామర్థ్యమైనా దేవుడు మనకు ఇచ్చిందే. మనం వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో యెహోవా గమనిస్తుంటాడు.
జనవరి 15-21
దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 36-37
శాశ్వత జీవితం గురించి దేవుడిచ్చిన మాటను ఎందుకు నమ్మవచ్చు?
మనం దేవున్ని తెలుసుకోగలమా?
దేవుడు ఎప్పుడూ ఉన్నాడు: దేవుడు “యుగయుగములు” నుండి ఉన్నాడు అని బైబిల్లో ఉంది. (కీర్తన 90:2) ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి ఆది లేదు, అంతం ఉండదు. ఆయన ఎన్ని సంవత్సరాలు నుండి ఉన్నాడనే విషయాన్ని మనుషులు తెలుసుకోలేరు.—యోబు 36:26.
మీరెలా ప్రయోజనం పొందుతారు: మనం ఆయన్ని నిజంగా తెలుసుకుంటే దేవుడు మనకు నిరంతర జీవితం ఇస్తానని మాటిచ్చాడు. (యోహాను 17:3) దేవుడే నిరంతరం ఉండనివాడైతే ఆ మాటను మనం నమ్మగలమా? యుగములకు రాజు మాత్రమే అలాంటి వాగ్దానం నెరవేర్చగలడు.—1 తిమోతి 1:17.
దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి
6 మన భూగ్రహం సూర్యుని నుండి సరైన దూరంలో ఉండడం వల్లే, భూమ్మీదున్న నీరు ద్రవరూపంలో ఉంది. ఒకవేళ భూమి సూర్యునికి కాస్త దగ్గరగా ఉంటే నీరంతా ఆవిరైపోతుంది, ప్రాణులు జీవించడానికి వీల్లేనంత వేడిగా మారిపోతుంది. ఒకవేళ భూమి సూర్యునికి కాస్త దూరంగా ఉంటే నీరంతా గడ్డకట్టిపోతుంది, భూమి పెద్ద ఐస్‌గడ్డలా మారిపోతుంది. కానీ యెహోవా భూమిని సరైన దూరంలో ఉంచాడు కాబట్టే, నీటిచక్రం అనే ప్రక్రియ జరిగి ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఇంతకీ నీటిచక్రం అంటే ఏంటి? సూర్యుని వేడికి సముద్రాల్లో, అలాగే భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతీ సంవత్సరం కొన్ని కోట్ల లీటర్ల నీరు ఆవిరిగా మారుతోంది. అలా ఆవిరిగా మారిన నీరు సుమారు పది రోజుల తర్వాత వర్షం రూపంలో లేదా మంచు రూపంలో భూమ్మీద పడి తిరిగి సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో కలిసిపోతుంది. మళ్లీ ఆ నీరు ఆవిరిగా మారడం, వర్షం పడడం ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. యెహోవా ఏర్పాటు చేసిన ఈ చక్రం వల్ల ప్రాణులన్నిటికీ అవసరమైన నీరు భూమ్మీద ఎల్లప్పుడూ ఉంటోంది. యెహోవాకు ఎంత తెలివి, శక్తి ఉన్నాయో నీటిచక్రం రుజువు చేస్తుంది.—యోబు 36:27, 28; ప్రసం. 1:7.
మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి
16 దేవుడు మాటిచ్చిన శాశ్వత జీవితమనే నిరీక్షణ నిజంగా ఎంతో అమూల్యమైన బహుమతి. ఆ అద్భుతమైన భవిష్యత్తు కోసం మనం ఎదురుచూస్తున్నాం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నిరీక్షణ ఒక లంగరులా పనిచేస్తూ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. అది కష్టాల్ని సహించేలా; హింసల్ని, చివరికి మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేలా మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు నిరీక్షణ ఒక హెల్మెట్‌లా మన ఆలోచనల్ని కాపాడుతుంది. అది చెడు విషయాల్ని అసహ్యించుకునేలా, మంచిని అంటిపెట్టుకునేలా మనకు సహాయం చేస్తుంది. బైబిలు ఇచ్చే నిరీక్షణ యెహోవాతో మనకున్న స్నేహాన్ని ఇంకా బలపరుస్తుంది, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేస్తుంది. అవును, మన నిరీక్షణను బలంగా ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 492వ పేజీ
వేరే ప్రాంతాల సమాచారం తెలియడం
అప్పట్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సమాచారం వేర్వేరు విధాలుగా చేరేది. ఎక్కువశాతం స్వదేశీ, విదేశీ వార్తలు నోటిమాటతోనే చేరేవి. (2స 3:17, 19; యోబు 37:20) చాలావరకు గుంపులుగుంపులుగా ప్రయాణించే వర్తకులు ఆహారం కోసం, నీళ్ల కోసం, ఇతర వస్తువుల కోసం నగరాల్లో అలాగే వేరేచోట్ల ఆగినప్పుడు దూరదేశాల వార్తల్ని చెప్పేవాళ్లు. పాలస్తీనా ప్రాంతం ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ల మధ్య ఉండడం వల్ల తరచూ చాలామంది ప్రయాణికులు అక్కడికి వస్తూపోతూ ఉండేవాళ్లు. దానివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు వేరేదేశాల్లో జరిగిన విషయాలు ఇట్టే తెలిసిపోయేవి. అంతేకాదు నగర సంతల్లో కూడా జాతీయ, అంతర్జాతీయ వార్తలు తెలిసేవి.
జనవరి 22-28
దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 38-39
సృష్టిని చూడడానికి మీరు సమయం తీసుకుంటున్నారా?
మీరు యెహోవా కోసం వేచి ఉంటారా?
7 యెహోవా ఈ భూమిని ఎలా సృష్టించాడో వివరిస్తున్నప్పుడు ఆయన “దానికి కొలతలు” నిర్ణయించాడని, “దాని పునాదులు” వేశాడని, “దాని మూలరాయి” వేశాడని బైబిలు చెప్తుంది. (యోబు 38:5, 6) తన పని ఎలా ఉందో చూడడానికి కూడా ఆయన సమయం వెచ్చించాడు. (ఆది. 1:10, 12) యెహోవా తయారుచేస్తున్న ఒక్కోదానిని దేవదూతలు చూస్తున్నప్పుడు, వాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి. వాళ్లు ‘సంతోషంతో స్తుతిగీతాలు పాడారు.’ (యోబు 38:7) దాన్నుండి మనమేం నేర్చుకుంటాం? భూమిని, నక్షత్రాలను, జీవ ప్రాణులన్నిటినీ సృష్టించడానికి యెహోవాకు వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఆయన వాటినన్నిటినీ జాగ్రత్తగా చూసినప్పుడు “చాలా బాగుంది” అని అన్నాడు.—ఆది. 1:31.
పునరుత్థానం దేవుని ప్రేమను, తెలివిని, ఓర్పును తెలియజేస్తుంది
2 యెహోవా ముందుగా తన కుమారుడైన యేసును సృష్టించాడు. తర్వాత ఆ మొదటి కుమారుని ద్వారా కోట్లాది దేవదూతలతో సహా “మిగతా వాటన్నిటినీ” సృష్టించాడు. (కొలొ. 1:16) తన తండ్రితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు యేసు సంతోషించాడు. (సామె. 8:30) యెహోవా తన ప్రధానశిల్పి అయిన యేసుతో కలిసి భూమ్యాకాశాల్ని సృష్టించడం దేవుని కుమారులైన దేవదూతలు చూశారు. అప్పుడు వాళ్లకు ఎలా అనిపించింది? భూమిని సృష్టించినప్పుడు వాళ్లు ‘సంతోషంతో స్తుతిగీతాలు పాడారు.’ యెహోవా మిగతా వాటన్నిటినీ, ముఖ్యంగా మనుషుల్ని చేసినప్పుడు కూడా వాళ్లు ఖచ్చితంగా స్తుతిగీతాలు పాడి ఉంటారు. (యోబు 38:7; సామె. 8:31, అధస్సూచి) యెహోవా సృష్టించిన ప్రతీదానిలో ఆయన ప్రేమ, తెలివి కనిపిస్తాయి.—కీర్త. 104:24; రోమా. 1:20.
సృష్టిని చూసి యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోండి
8 యెహోవాను మనం పూర్తిగా నమ్మవచ్చు. తన మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి యెహోవా యోబుకు సహాయం చేశాడు. (యోబు 32:2; 40:6-8) ఆయన యోబుతో మాట్లాడుతున్నప్పుడు సృష్టిలోని చాలా వాటిని అంటే నక్షత్రాల గురించి, మబ్బుల గురించి, మెరుపుల గురించి చెప్పాడు. అలాగే యెహోవా అడవి ఎద్దు, గుర్రం లాంటి జంతువుల గురించి కూడా మాట్లాడాడు. (యోబు 38:32-35; 39:9, 19, 20) అవన్నీ యెహోవాకున్న అపారమైన శక్తికే కాదు ఆయనకున్న ప్రేమకు, తెలివికి నిలువెత్తు నిదర్శనం. అలా యెహోవా మాట్లాడడంవల్ల యోబుకు ఆయన మీద ఇంతకుముందుకన్నా ఎక్కువ నమ్మకం పెరిగింది. (యోబు 42:1-6) అదేవిధంగా, మనం కూడా సృష్టిని బాగా గమనించినప్పుడు యెహోవాకు మన ఊహకు అందనంత తెలివి, శక్తి ఉన్నాయని అర్థమౌతుంది. మనకున్న సమస్యల్ని ఆయన తీసేయగలడు, తీసేస్తాడు కూడా. ఇది యెహోవా మీద మన నమ్మకాన్ని పెంచట్లేదా?
దేవుని వాక్యంలో రత్నాలు
it-2-E 222వ పేజీ
శాసనకర్త
యెహోవా మన శాసనకర్త. ఈ విశ్వంలో ఎవరికైనా శాసనాలు లేదా నియమాలు పెట్టే అధికారం ఉందంటే, అది యెహోవాకే. ఆయన ప్రాణంలేని వాటికి (యోబు 38:4-38; కీర్త 104:5-19) అలాగే జంతువులకు కొన్ని భౌతిక నియమాలు పెట్టాడు. (యోబు 39:1-30) యెహోవా సృష్టించిన మనుషులు కూడా ఆయన భౌతిక నియమాలకు, నైతిక నియమాలకు లోబడాలి. (రోమా 12:1; 1కొ 2:14-16) ఆఖరికి, పరలోక ప్రాణులైన దేవదూతలు కూడా యెహోవా నియమాలకు కట్టుబడి ఉండాలి.—కీర్త 103:20; 2పే 2:4, 11.
యెహోవా పెట్టిన భౌతిక నియమాల్ని ఎవరూ దాటలేరు. (యిర్మీ 33:20, 21) అవి మారకుండా ఎంత స్థిరంగా ఉన్నాయంటే చంద్రుడు, గ్రహాలు, ఇతర నక్షత్రాల కదలికల్ని సైంటిస్టులు ఖచ్చితంగా లెక్కపెట్టగలుగుతున్నారు. ఎవరైనా ఆ భౌతిక నియమాలకు ఎదురుతిరిగితే వెంటనే పరిణామాలు చూస్తారు. అదేవిధంగా, దేవుని నైతిక నియమాలు కూడా మారకుండా స్థిరంగా ఉంటాయి, వాటిని మీరితే పరిణామాలు తప్పవు. ఆ పరిణామాలు వెంటనే రాకపోవచ్చు గానీ ఖచ్చితంగా వచ్చి తీరతాయి. “దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు” అని బైబిలు చెప్తుంది.—గల 6:7; 1తి 5:24.
జనవరి 29–ఫిబ్రవరి 4
దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 40-42
యోబు జీవితం నుండి నేర్చుకునే పాఠాలు
w10 10/15 3-4 పేజీలు, 4-6 పేరాలు
‘యెహోవా మనసును’ ఎవరు అర్థం చేసుకోగలరు?
4 యెహోవా పనుల గురించి ధ్యానిస్తున్నప్పుడు, మన సొంత ప్రమాణాల ఆధారంగా ఆయన గురించి ఒక అభిప్రాయానికి రాకుండా చూసుకోవాలి. ఆ విషయం, కీర్తన 50:21 లోని యెహోవా మాటల్లో పరోక్షంగా సూచించబడింది: “నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి.” ఇవి, 175 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఒక బైబిలు పండితుడు చెప్పిన మాటల్లాగే ఉన్నాయి: “మనుష్యులు తమ సొంత ప్రమాణాలను బట్టే దేవుని గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అంతేగాక మనుష్యులకు వర్తించే నియమాలే దేవునికి కూడా వర్తిస్తాయని వాళ్లు అనుకుంటారు.”
5 మన సొంత ప్రమాణాలను బట్టి, ఇష్టాల్ని బట్టి యెహోవామీద మనకున్న అభిప్రాయం మారకుండా చూసుకోవాలి. ఇదెందుకు ప్రాముఖ్యం? అపరిపూర్ణ మానవులముగా మనం పరిమితంగా ఆలోచిస్తాం కాబట్టి, లేఖనాలను చదువుతున్నప్పుడు, యెహోవా చేసిన కొన్ని పనులు సరైనవి కావని మనకు అనిపించవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలీయులు అలాగే ఆలోచించి, యెహోవా తమతో వ్యవహరించిన తీరు విషయంలో ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారు. యెహోవా వాళ్లతో ఏమన్నాడో చూడండి: “యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?”—యెహె. 18:25.
6 మన ఆలోచన పరిమితమైనదనీ కొన్నిసార్లు పూర్తిగా తప్పుదోవ పడుతుందనీ గుర్తుంచుకుంటే, మన సొంత ప్రమాణాలను బట్టి యెహోవా విషయంలో ఒక అభిప్రాయానికి రాకుండా ఉంటాం. యోబు ఈ పాఠమే నేర్చుకోవాల్సి వచ్చింది. బాధను అనుభవించిన సమయంలో యోబు కృంగిపోయి, కొంతమట్టుకు తన గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ప్రాముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోలేదు. అయితే యోబు వాటి గురించి ఆలోచించేలా ప్రేమతో యెహోవా సహాయం చేశాడు. యెహోవా యోబును 70 కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగాడు కానీ యోబు వాటిలో దేనికీ జవాబు చెప్పలేకపోయాడు. యెహోవా అలా అడగడం ద్వారా యోబు ఆలోచన ఎంత పరిమితమైనదో ఆయన తెలుసుకునేలా చేశాడు. దానికి యోబు వినయంగా స్పందించి, తన వైఖరిని సరిదిద్దుకున్నాడు.—యోబు 42:1-6 చదవండి.
అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి
12 యోబు కష్టాలుపడ్డాడనే జాలి లేకుండా యెహోవా మాట్లాడాడా? లేదు, యెహోవా అలా మాట్లాడలేదు. నిజానికి యోబు కూడా అలా అనుకోలేదు. బదులుగా యెహోవా చెప్పినది అర్థంచేసుకుని, దానికి విలువిచ్చాడు. యోబు ఇలా అన్నాడు, ‘నేను పలికిన మాటలకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము, బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుతున్నాను.’ (యోబు 42:1-6, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) అంతకుముందు, ఎలీహు అనే యువకుడు కూడా యోబు తన ఆలోచనను మార్చుకునేలా సహాయం చేశాడు. (యోబు 32:5-10) యోబు ఆ తెలివైన సలహాను పాటించి, తన ఆలోచనను మార్చుకున్నాడు. యోబులో వచ్చిన ఆ మార్పును యెహోవా చూశాడు, తనకు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా సంతోషించాడని ఇతరులు తెలుసుకునేలా చేశాడు.—యోబు 42:7, 8.
“యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
17 తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొని, ధైర్యంగా ఉన్న యెహోవా సేవకుల్లో యోబు ఒక్కడు మాత్రమే. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో ఇంకా చాలామంది గురించి చెప్తూ, మేఘంలా ఉన్న “పెద్ద సాక్షుల సమూహం” అని వాళ్లని పిలుస్తున్నాడు. (హెబ్రీ. 12:1) తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొన్నా, వాళ్లు కూడా జీవించినంతకాలం యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. (హెబ్రీ. 11:36-40) అయితే వాళ్లు జీవించి ఉన్నప్పుడు యెహోవా చేసిన వాగ్దానాలన్నీ నిజమవ్వడాన్ని చూడలేకపోయారు. కానీ వాళ్లు చూపించిన సహనం, వాళ్లు పడ్డ కష్టం వృథా కాలేదు. యెహోవా వాళ్లను చూసి సంతోషిస్తున్నాడని వాళ్లకు తెలుసు కాబట్టి ఆయన తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని వాళ్లు నమ్మారు. (హెబ్రీ. 11:4, 5) మనం కూడా యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలని గట్టిగా నిర్ణయించుకోడానికి వాళ్ల ఆదర్శం సహాయం చేస్తుంది.
18 మనం జీవిస్తున్న ఈ లోకం రోజురోజుకు ఇంకా చెడ్డగా తయారౌతుంది. (2 తిమో. 3:13) సాతాను దేవుని ప్రజలకు ఒకదాని తర్వాత మరొక కష్టాన్ని తెస్తూనే ఉన్నాడు. ముందుముందు మనకెలాంటి కష్టాలు వచ్చినాసరే, “మనం జీవంగల దేవుని మీద నిరీక్షణ” ఉంచుతున్నాం అనే నమ్మకంతో యెహోవా కోసం కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుందాం. (1 తిమో. 4:10) అలాగే యెహోవా యోబును ఎలా దీవించాడో గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన “ఎంతో వాత్సల్యం గలవాడని, కరుణామయుడని” మనకు తెలుస్తుంది. (యాకో. 5:11) కాబట్టి మనం కూడా యెహోవాకు నమ్మకంగా ఉంటూ, “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు” ఆయన ప్రతిఫలం ఇస్తాడనే ఆశతో ఉందాం.—హెబ్రీయులు 11:6 చదవండి.
దేవుని వాక్యంలో రత్నాలు
it-2-E 808వ పేజీ
ఎగతాళి
ఎన్ని అవమానాలు ఎదురైనా యోబు యథార్థంగా ఉన్నాడు. కాకపోతే ఆయన తప్పుగా ఆలోచించి ఒక పొరపాటు చేశాడు, దాన్ని ఎలీహు సరిదిద్దాడు. ఎలీహు యోబు గురించి ఇలా అన్నాడు: “యోబు లాంటి మనిషి ఎవరైనా ఉన్నారా? అతను అవమానాల్ని నీళ్లలా తాగుతున్నాడు.” (యోబు 34:7) యోబు దేవుని కంటే తనను తాను ఎక్కువగా సమర్థించుకున్నాడు, దేవుని కంటే తనే ఎక్కువ నీతిమంతుణ్ణి అన్నట్టు మాట్లాడాడు. (యోబు 35:2; 36:24) తన ముగ్గురు స్నేహితులు దేవుని మీద కాదుగానీ, తనమీదే అబద్ధాలు చెప్తున్నట్టు యోబు తీసుకున్నాడు. నిజానికి వాళ్లు తన గురించే అబద్ధాలు చెప్పారని దేవుడు ఆ తర్వాత వివరించాడు. (యోబు 42:7; 1స 8:7 అలాగే మత్త 24:9 కూడా చూడండి) ఈ విషయాలు గుర్తుంచుకుంటే క్రైస్తవులు సంతోషంగా ఎగతాళిని తట్టుకోవచ్చు, తమ సహనానికి తగిన బహుమానం పొందవచ్చు.—లూకా 6:22, 23.
ఫిబ్రవరి 5-11
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 1-4
దేవుని రాజ్యం వైపు నిలబడండి
“నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను”
8 ఈ సందేశానికి ప్రజలు ఎలా స్పందించారు? ఎక్కువమంది దానిని వ్యతిరేకించారు. (కీర్తన 2:1-3 చదవండి.) చాలా దేశాలకు కోపమొచ్చింది. యెహోవా నియమించిన పరిపాలకుడ్ని వాళ్లు అంగీకరించట్లేదు. మనం ప్రకటించే రాజ్య సందేశాన్ని వాళ్లు ‘మంచివార్తగా’ అనుకోవట్లేదు. నిజానికి, కొన్ని ప్రభుత్వాలు మన ప్రకటనాపనిని నిషేధించాయి. చాలామంది నాయకులు దేవున్ని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నా, తమ అధికారాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. మొదటి శతాబ్దంలోని పరిపాలకుల్లాగే నేడున్న పరిపాలకులు కూడా, యేసు అనుచరుల మీద దాడి చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు.—అపొ. 4:25-28.
ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి
11 వస్తువులపై ప్రేమ. డబ్బును, మన దగ్గరున్న వస్తువులను మనం ఎక్కువగా ప్రేమిస్తే, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం కష్టంగా ఉండవచ్చు. 1970వ సంవత్సరం తర్వాత మలావీలోని చాలామంది యెహోవాసాక్షులు ఒక రాజకీయ పార్టీలో చేరనందుకు వాళ్ల దగ్గరున్న వస్తువులన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది. అయితే, కొంతమంది తమ సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకోలేకపోయారు. రూతు అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంటుంది, “కొంతమంది మాతోపాటు క్యాంపుకు వచ్చారు. కానీ ఆ క్యాంపులో సౌకర్యవంతమైన జీవితం లేకపోవడంతో వాళ్లు రాజకీయ పార్టీలో చేరి, ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.” కానీ చాలామంది దేవుని ప్రజలు అలా చేయరు. వాళ్లు తమ డబ్బును, తమ దగ్గరున్న వాటన్నిటినీ పోగొట్టుకోవాల్సి వచ్చినా ఎవ్వరి పక్షం వహించకుండా ఉంటారు.—హెబ్రీ. 10:34.
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 425వ పేజీ
పొట్టు
పొట్టు అంటే బార్లీ, గోధుమ వంటి ధ్యానపు గింజల మీద ఉండే పల్చటి పొర. బైబిల్లో పొట్టును సూచనార్థకంగా ఉపయోగించినా, దాన్నిబట్టి అప్పట్లో ధాన్యాన్ని ఎలా నూర్చేవాళ్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పొర తినడానికి పనికిరాదు, కాబట్టి దేనినుండైనా వేరుచేసి పడేసేవాటిని, పనికిరానివాటిని పొట్టు అనే పదం సూచిస్తుంది.
ముందుగా ధాన్యాన్ని నూర్చినప్పుడు, ధాన్యం నుండి పొట్టు వేరైపోతుంది. తర్వాత, తూర్పారబట్టినప్పుడు పొట్టు తక్కువ బరువు ఉంటుంది కాబట్టి గాలికి కొట్టుకుపోతుంది. అదేవిధంగా యెహోవా తన ప్రజల నుండి మతభ్రష్టుల్ని వేరుచేస్తాడు, దుష్టుల్ని-వ్యతిరేకించే దేశాల్ని తీసిపారేస్తాడు. (యోబు 21:18; కీర్త 1:4; 35:5; యెష 17:13; 29:5; 41:15; హోషే 13:3) దేవుని రాజ్యం దాని శత్రువుల్ని ఎంత పిండిపిండి చేస్తుందంటే, వాళ్లు పొట్టులా గాలికి కొట్టుకుపోతారు.—దాని 2:35.
ఆ పనికిరాని పొట్టు మళ్లీ గాలికి కొట్టుకొచ్చి ధాన్యపు కుప్పల్లో కలిసిపోకుండా ఉండడానికి, దాన్ని కాల్చేసేవాళ్లు. చెడ్డ మతనాయకుల్ని దేవుడు అలాగే నాశనం చేస్తాడని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు. ధాన్యాన్ని నూర్చిన తర్వాత యేసుక్రీస్తు గోధుమల్ని సమకూరుస్తాడు, “పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.”—మత్త 3:7-12; లూకా 3:17.
ఫిబ్రవరి 12-18
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 5-7
వేరేవాళ్ల పనులు మిమ్మల్ని బాధపెట్టినా యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి
బైబిలు చదవడం సమస్యల్ని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?
7 మీ స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ మీకు నమ్మకద్రోహం చేశారా? అలాగైతే, దావీదు రాజు కొడుకైన అబ్షాలోము గురించి పరిశీలించడం వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. అబ్షాలోము తన తండ్రికి నమ్మకద్రోహం చేశాడు, ఆయన సింహాసనాన్ని లాక్కోవాలని చూశాడు.—2 సమూ. 15:5-14, 31; 18:6-14.
8 (1) ప్రార్థించండి. ఆ లేఖనాల్ని మనసులో ఉంచుకుని, మీకు జరిగిన అన్యాయం గురించి మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. (కీర్త. 6:6-9) మీకు ఏమనిపిస్తుందో స్పష్టంగా చెప్పండి. తర్వాత, మీ సమస్యను తట్టుకోవడానికి ఉపయోగపడే సూత్రాల్ని కనుగొనేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.
మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకంతో ఉండండి
3 మన విశ్వాసం దేవుని ప్రజలు చూపించే ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే అలాంటి విశ్వాసం బలంగా ఉండదు. ఉదాహరణకు ఒక ప్రచారకుడు గానీ, సంఘపెద్ద గానీ, పయినీరు గానీ ఘోరమైన పాపం చేస్తే మనం అభ్యంతరపడి యెహోవా సేవ ఆపేసే ప్రమాదం ఉంది. తోటి విశ్వాసి ఎవరైనా మనల్ని బాధపెడితే లేదా మతభ్రష్టునిగా మారి మన నమ్మకాలు తప్పని చెప్తే, మనం యెహోవాకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన విశ్వాసం యెహోవాతో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటేనే, అది బలంగా ఉంటుంది. అలాకాకుండా, వేరే వాళ్ల పనుల్ని చూసి మీరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, అది బలంగా ఉండదు. నిజమే, యెహోవా మీద, ఆయన ప్రజల మీద మీకు ఏర్పడిన అభిప్రాయం మీలో విశ్వాసాన్ని కలిగించవచ్చు. కానీ ఆ విశ్వాసం బలంగా ఉండాలంటే బైబిల్ని లోతుగా అధ్యయనం చేయాలి, అందులోని విషయాలు అర్థం చేసుకోవాలి, పరిశోధన చేయాలి. యెహోవా గురించి మీరు నేర్చుకుంటున్న విషయాలు సత్యమనే నమ్మకం కుదుర్చుకోవాలి. బైబిలు యెహోవా గురించి సత్యాన్ని బోధిస్తుందని మీరే పరీక్షించి తెలుసుకోవాలి.—రోమా. 12:2.
4 కొంతమంది సత్యాన్ని “సంతోషంగా” అంగీకరిస్తారు కానీ, సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలేస్తారని యేసు చెప్పాడు. (మత్తయి 13:3-6, 20, 21 చదవండి.) యేసును అనుసరించే వాళ్లకు కష్టాలు వస్తాయని వాళ్లు అర్థంచేసుకుని ఉండకపోవచ్చు. (మత్త. 16:24) లేదా క్రైస్తవులకు ఆశీర్వాదాలు తప్ప కష్టాలు ఉండవని వాళ్లు అనుకుని ఉంటారు. కానీ ఈ లోకంలో కష్టాలు అందరికీ వస్తాయి. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల వల్ల మనం సంతోషాన్ని కోల్పోవచ్చు.—కీర్త. 6:6; ప్రసం. 9:11.
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 995వ పేజీ
సమాధి
రోమీయులు 3:13లో పౌలు కీర్తన 5:9 లో ఉన్న మాటల్నే ఎత్తిచెప్పాడు. అక్కడ ఆయన దుష్టుల, మోసగాళ్ల గొంతు “తెరిచివున్న సమాధి” అని అన్నాడు. తెరిచివున్న సమాధి శవాలతో, కుళ్లిపోయిన వాటితో నిండివున్నట్టే, వాళ్ల గొంతు కూడా విషపూరితమైన మాటలతో, కుళ్లు-కుతంత్రంతో నిండివుంటుంది.—మత్త 15:18-20 పోల్చండి.
ఫిబ్రవరి 19-25
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 8-10
‘యెహోవా, నిన్ను స్తుతిస్తాను’!
యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా చూడండి
6 యెహోవా మన కోసం ఒక ప్రత్యేకమైన ఇంటిని సిద్ధపరిచాడు. మనిషిని తయారు చేయడానికి చాలాకాలం ముందే మనుషుల కోసం యెహోవా భూమిని సిద్ధపరిచాడు. (యోబు 38:4-6; యిర్మీ. 10:12) ఆయనకు దయ, ఉదారత ఉన్నాయి కాబట్టి మనం సంతోషించడానికి ఎన్నో మంచివాటిని సృష్టించాడు. (కీర్త. 104:14, 15, 24) కొన్నిసార్లు తాను చేసిన సృష్టి గురించి ఆలోచించడానికి ఆయన సమయం తీసుకొని “దాన్ని చూసినప్పుడు అది బాగుంది.” (ఆది. 1:10, 12, 31) ఆయన భూమ్మీద సృష్టించిన అద్భుతమైన వాటన్నిటి మీద మనుషులకు “అధికారం” ఇవ్వడం ద్వారా వాళ్లను గౌరవించాడు. (కీర్త. 8:6) తాను చేసిన అందమైన సృష్టిని పరిపూర్ణ మనుషులు జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికీ ఆనందించాలనేది దేవుని ఉద్దేశం. ఆ విషయంలో మీరు తరచూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నారా?
దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి
10 మాట్లాడే సామర్థ్యం పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? దేవుడే అన్నిటినీ సృష్టించాడు అనడానికి గల కారణాల్ని, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే ప్రజలకు వివరించాలి. (కీర్త. 9:1; 1 పేతు. 3:15) భూమిని, దాని మీదున్న ప్రాణుల్ని ఒక సృష్టికర్త చేశాడని వాళ్లు నమ్మరు. కాబట్టి మనం బైబిల్ని, ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన కొన్ని విషయాల్ని ఉపయోగించి మన పరలోక తండ్రి గురించి వాళ్లతో మాట్లాడవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆసక్తి చూపిస్తే, దేవుడే భూమిని, ఆకాశాన్ని చేశాడని మనం ఎందుకు నమ్ముతున్నామో వివరించవచ్చు.—కీర్త. 102:25; యెష. 40:25, 26.
మీరు ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా’ ఉన్నారా?
13 మనస్ఫూర్తిగా పాడండి. మీటింగ్స్‌లో పాటలు పాడడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం యెహోవాను స్తుతించడం. సారా అనే సహోదరి పాటలు బాగా పాడలేనని అనుకునేది. అయినా పాడడం ద్వారా ఆమె యెహోవాను స్తుతించాలని కోరుకుంది. దానికోసం ఇంటి దగ్గర మీటింగ్‌కు సిద్ధపడుతున్నప్పుడు, ఆమె ఇతర భాగాలకు సిద్ధపడినట్టే పాటల్ని కూడా సిద్ధపడుతుంది. ఆమె పాటల్ని ప్రాక్టీసు చేస్తూ, పాటలోని పదాలకు మీటింగ్‌లో చర్చించే అంశాలకు ఎలాంటి సంబంధం ఉందో ఆలోచిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది: “అలా చేయడం ద్వారా నేను బాగా పాడుతున్నానా లేదా అని కంగారుపడకుండా అక్కడున్న పదాల మీద మనసు పెడుతున్నాను.”
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 832వ పేజీ
వేలు
దేవుడు వేర్వేరు పనులు చేయడానికి తన ‘చేతివేళ్లను’ ఉపయోగిస్తున్నట్టుగా బైబిలు మాట్లాడుతుంది. ఉదాహరణకు పది ఆజ్ఞలు రాయడానికి (నిర్గ 31:18; ద్వితీ 9:10), అద్భుతాలు చేయడానికి (నిర్గ 8:18, 19), ఆకాశాన్ని సృష్టించడానికి (కీర్త 8:3) ఆయన తన సూచనార్థక చేతివేళ్లను ఉపయోగించాడు. సృష్టిని చేస్తున్నప్పుడు, దేవుని చురుకైన శక్తి నీళ్ల మీద అటూఇటూ కదులుతూ ఉందని ఆదికాండం పుస్తకం చెప్తుంది. (ఆది 1:2) దేవుని వేలు గురించి బాగా అర్థం చేసుకోవడానికి క్రైస్తవ గ్రీకు లేఖనాలు సహాయం చేస్తాయి. యేసు “దేవుని పవిత్రశక్తితో” చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడని మత్తయి చెప్పాడు. దాన్నే ఇంకోలా “దేవుని వేలితో” యేసు వాళ్లను వెళ్లగొట్టాడని లూకా చెప్పాడు.—మత్త 12:28; లూకా 11:20.
ఫిబ్రవరి 26–మార్చి 3
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 11-15
శాంతి విలసిల్లే కొత్తలోకంలో మిమ్మల్ని ఊహించుకోండి
కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
11:3—ఏ పునాదులు పాడైపోయాయి? మానవ సమాజానికి ఆధారంగావున్న శాసనం, చట్టం, న్యాయం అనేవే ఆ పునాదులు. ఇవి గందరగోళానికి గురైనప్పుడు, సామాజిక అక్రమం అధికమై, న్యాయం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో “నీతిమంతులు” దేవుని మీద పూర్తి నమ్మకముంచాలి.—కీర్తన 11:4-7.
హింస లేని ప్రపంచం వస్తుందా?
దేవుడు త్వరలో భూమి మీద హింస లేకుండా చేస్తాడని బైబిలు చెప్తుంది. దైవభక్తిలేని ప్రజలు నాశనమయ్యే తీర్పు రోజును హింసతో నిండిన ఈ లోకం ఎదుర్కొంటుంది. (2 పేతురు 3:5-7) ఆ తర్వాత ఎవరూ ఇతరుల్ని హింసించరు. దేవుడు జోక్యం చేసుకుని హింస లేకుండా చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
“బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అని దేవుని గురించి బైబిలు చెప్తుంది. (కీర్తన 11:5) సృష్టికర్త శాంతిని, న్యాయాన్ని ప్రేమిస్తాడు. (కీర్తన 33:5; 37:28) అందుకే ఆయన హింసించేవాళ్లను ఇంక ఉండనివ్వడు.
మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?
15 దావీదు ఎందుకు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూశాడు? ‘ఎంతకాలం’ అని ఐదుసార్లు ప్రశ్నిస్తూ దావీదు రాసిన అదే కీర్తనలో దానికిగల కారణం ఉంది. దావీదు ఇలా చెప్పాడు, “నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.” (కీర్త. 13:5) తనమీద యెహోవాకు ప్రేమ ఉందని, ఆయన తనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడని దావీదుకు తెలుసు. గతంలో ఆయన సహాయం చేసిన సందర్భాల్ని దావీదు గుర్తుచేసుకున్నాడు. తానున్న కష్టాలనుండి యెహోవా తనను బయటపడేసే సమయం కోసం ఎదురుచూశాడు. అందుకు తగిన దీవెనల్ని యెహోవా ఇస్తాడని దావీదుకు తెలుసు.
రాజ్యం భూమ్మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది
16 భద్రత. ఎట్టకేలకు, యెషయా 11:6-9 లో ఉన్న ప్రవచనం ఆధ్యాత్మిక భావంలోనే కాక అక్షరార్థంగా కూడా పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఈ భూమ్మీద ఎక్కడికి వెళ్లినా సురక్షితంగా ఉంటారు. మనుషుల వల్ల గానీ, జంతువుల వల్ల గానీ ఇతరులకు ఎలాంటి హాని జరగదు. ఒక్కసారి ఊహించండి. ఈ భూగ్రహంలో ఎక్కడున్నా, అంటే నదుల్లో, సరస్సుల్లో, సముద్రాల్లో ఈత కొడుతున్నా; కొండల్ని అధిరోహిస్తున్నా; పచ్చిక బయళ్ల మీద సంచరిస్తున్నా మీరు పూర్తి భద్రతతో ఉంటారు. చీకటి పడినా మీరు భయపడరు. యెహెజ్కేలు 34:25 చెప్తున్నట్లుగా, మీరు ఎడారిలోనైనా అరణ్యంలోనైనా ‘నిర్భయంగా నివసిస్తారు.’
దేవుని వాక్యంలో రత్నాలు
మీరు రూపాంతరం పొందారా?
12 విచారకరంగా, నేడు మన చుట్టూ ఉన్న ప్రజల్లో పౌలు వర్ణించినలాంటి చెడ్డ లక్షణాలే ఉన్నాయి. ప్రమాణాల ప్రకారం, సూత్రాల ప్రకారం జీవించడం పాతకాలపు విషయమని అలాంటి జీవితం భరించలేమని వాళ్లు అనుకుంటారు. పిల్లలు ఏమి చేసినా చాలామంది టీచర్లు, తల్లిదండ్రులు పట్టించుకోరు. పైగా, తప్పొప్పులను నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉందని కూడా వాళ్లకు నేర్పిస్తారు. ఏది సరైనది, ఏది కాదో తెలుసుకోవడం నిజంగా సాధ్యంకాదని అలాంటి వాళ్లు నమ్ముతుంటారు. ఆఖరికి, దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పే ప్రజలు కూడా దేవునికి, ఆయన ఆజ్ఞలకు ఏమాత్రం లోబడకుండా, తమ దృష్టికి సరైనదాన్ని చేయవచ్చని భావిస్తారు. (కీర్త. 14:1) ఇలాంటి వైఖరి క్రైస్తవులకు ముప్పుగా పరిణమించవచ్చు. జాగ్రత్తగా లేకపోతే ఓ క్రైస్తవుడు దైవిక ఏర్పాట్ల పట్ల అలాంటి వైఖరినే కనబర్చే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లు సంఘంలోని ఏర్పాట్లకు సహకరించరు, తమకు నచ్చని వాటి గురించి ఫిర్యాదు కూడా చేస్తుంటారు. లేదా వినోదం, ఇంటర్నెట్, ఉన్నత విద్య వంటి విషయాల్లో బైబిలు ఆధారిత సలహాలను పూర్తిగా పాటించడానికి ఇష్టపడరు.