యెహోవా సంకల్పం నెరవేరుతుంది
“నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.” —యెష. 46:11.
1, 2. (ఎ) యెహోవా మనకు ఏమి తెలియజేశాడు? (బి) యెషయా 46:10, 11; 55:11 వచనాల్లో ఏ వాగ్దానం ఉంది?
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అనే సూటియైన, శక్తివంతమైన మాటలతో బైబిల్లోని మొదటి పుస్తకం మొదలౌతుంది. (ఆది. 1:1) దేవుడు ఈ విశ్వంలో ఎన్నో సృష్టించాడు, వాటిలో కొన్నిటిని మాత్రమే మనం చూశాం. అంతేకాదు అంతరిక్షం, వెలుతురు, గురుత్వాకర్షణ వంటివాటి గురించి మనం ఇప్పటివరకు అర్థం చేసుకోగలిగింది కేవలం కొంతే. (ప్రసం. 3:11) కానీ భూమిపట్ల, మనుషులపట్ల తన సంకల్పమేమిటో యెహోవా మనకు తెలియజేశాడు. ఆయన తన స్వరూపంలో సృష్టించిన మనుషులు భూమ్మీద ఆనందంగా జీవించాలన్నదే ఆయన సంకల్పం. (ఆది. 1:26) అంతేకాదు వాళ్లు ఆయనకు పిల్లలుగా ఉండాలని, ఆయన వాళ్లకు తండ్రిగా ఉండాలని యెహోవా కోరుకున్నాడు.
2 యెహోవా సంకల్పానికి సవాలు ఎదురైందని ఆదికాండము మూడవ అధ్యాయంలో చూస్తాం. (ఆది. 3:1-7) అయితే, యెహోవా పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు. ఆయన చేసేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. (యెష. 46:10, 11; 55:11) కాబట్టి యెహోవా ఆది సంకల్పం సరైన సమయానికే ఖచ్చితంగా నెరవేరుతుందని మనం నమ్మవచ్చు.
3. (ఎ) బైబిల్లోని సందేశాన్ని అర్థంచేసుకోవడానికి ప్రాముఖ్యమైన ఏ సత్యాలు సహాయం చేస్తాయి? (బి) ఈ సత్యాల గురించి మనం ఇప్పుడెందుకు పరిశీలిస్తాం? (సి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
3 భూమిపట్ల, మనుషులపట్ల దేవుని సంకల్పం ఏమిటో, దానిలో యేసు పాత్ర ఏమిటో మనకు తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన బైబిలు సత్యాలు. బహుశా మనం బైబిలు స్టడీ ప్రారంభించినప్పుడు నేర్చుకున్న మొదటి సత్యాలు కూడా అవే అయ్యుండవచ్చు. ఇప్పుడు ఇతరులు కూడా వాటిని నేర్చుకోవడానికి మనం సహాయం చేయాలనుకుంటున్నాం. అలా చేయడానికి మనకు దొరికిన ఓ ప్రత్యేక అవకాశం ఏంటంటే, ఈ సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజలను ఆహ్వానించడం. (లూకా 22:19, 20) వాళ్లు ఒకవేళ ఈ ప్రాముఖ్యమైన ఆచరణకు వస్తే, దేవుని అద్భుతమైన సంకల్పం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వమని ప్రజల్ని ప్రోత్సహించేందుకు సహాయం చేసే కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం. ఈ ఆర్టికల్‌లో మూడు ప్రశ్నల్ని పరిశీలిస్తాం: భూమిపట్ల, మనుషులపట్ల దేవుని సంకల్పం ఏమిటి? ఆ సంకల్పం ఎందుకు నెరవేరలేదు? దేవుని సంకల్పం నెరవేరేందుకు యేసు విమోచన క్రయధనం ఎలా ఓ మార్గం తెరిచింది?
సృష్టికర్త సంకల్పం ఏమిటి?
4. సృష్టి “దేవుని మహిమను” ఎలా తెలియజేస్తుంది?
4 యెహోవా ఓ గొప్ప సృష్టికర్త. ఆయన ప్రతీదాన్ని ఉన్నత ప్రమాణాల ప్రకారం చేశాడు. (ఆది. 1:31; యిర్మీ. 10:12) సృష్టిలోని అందాల్ని, క్రమాన్ని చూసి మనమేమి నేర్చుకోవచ్చు? చిన్నవాటి నుండి పెద్దవాటి వరకు యెహోవా చేసిన ప్రతీదీ ఉపయోగకరమైనదే. ఉదాహరణకు, మనిషి కణం గురించి ఆలోచించినప్పుడో, చంటిబిడ్డను చూసినప్పుడో, అందమైన సూర్యాస్తమయాన్ని చూసినప్పుడో మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఏవి నిజంగా అందమైనవో గుర్తించే సామర్థ్యంతో యెహోవా మనల్ని సృష్టించాడు.—కీర్తన 19:1; 104:24 చదవండి.
5. విశ్వంలో ఉన్నవన్నీ సరైన క్రమంలో పనిచేయడానికి యెహోవా ఏమి చేశాడు ?
5 యెహోవా ప్రేమతో తన సృష్టిలో ఉన్న వాటన్నిటికీ హద్దుల్ని ఏర్పాటు చేశాడు. విశ్వంలో ఉన్నవన్నీ సరిగ్గా పనిచేయడానికి ప్రకృతి నియమాల్ని, నైతిక సూత్రాల్ని పెట్టాడు. (కీర్త. 19:7-9) అందుకే విశ్వంలో ఉన్నవన్నీ వాటికి నియమించిన స్థానంలో ఉంటూ, వాటి పనిని అవి చేస్తున్నాయి. ఉదాహరణకు, గురుత్వాకర్షణ నియమంవల్ల వాయు మండలం భూమికి దగ్గరగా ఉంటుంది. దానివల్లే మహా సముద్రాలు, అలలు నియంత్రణలో ఉంటున్నాయి, ప్రాణులు భూమ్మీద మనుగడ సాగించగలుగుతున్నాయి. యెహోవా ప్రకృతికి హద్దులు ఏర్పాటు చేయడం వల్లే విశ్వంలో ఉన్నవన్నీ సరైన క్రమంలో పనిచేస్తున్నాయి. దీన్నిబట్టి భూమిపట్ల, మనుషులపట్ల దేవునికి ఓ సంకల్పం ఉందని అర్థమౌతుంది. ఈ అద్భుతమైన విశ్వాన్ని చేసిన సృష్టికర్త గురించి పరిచర్యలో మనం ఇతరులకు చెప్పవచ్చు.—ప్రక. 4:11.
6, 7. యెహోవా ఆదాముహవ్వలకు ఇచ్చిన కొన్ని బహుమతులు ఏమిటి?
6 మనుషులు భూమ్మీద నిత్యం జీవించాలనే సంకల్పంతో యెహోవా వాళ్లను చేశాడు. (ఆది. 1:28; కీర్త. 37:29) ఆయనకున్న ఉదారతను బట్టి, ఆదాముహవ్వలకు ఎన్నో విలువైన బహుమతుల్ని ఇచ్చాడు. (యాకోబు 1:17 చదవండి.) ఉదాహరణకు ఆయన వాళ్లకు స్వేచ్ఛాచిత్తాన్ని, ఆలోచించే, ప్రేమించే, స్నేహం చేసే సామర్థ్యాల్ని ఇచ్చాడు. అంతేకాదు దేవుడు స్వయంగా ఆదాముతో మాట్లాడాడు, తనకు ఎలా లోబడాలో నేర్పించాడు. దాంతోపాటు జంతువులను, నేలను అలాగే తననుతాను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో కూడా యెహోవా ఆదాముకు నేర్పించాడు. (ఆది. 2:15-17, 19, 20) అంతేకాదు ఆయన ఆదాముహవ్వలకు రుచిచూసే సామర్థ్యాన్ని, స్పర్శజ్ఞానాన్ని, చూపును, వినికిడి శక్తిని, వాసన చూసే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ విధంగా, వాళ్లు జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు. ఆదాముహవ్వలు చేయడానికి చేతినిండా ఆసక్తికరమైన పని ఉండేది. అంతేకాదు, వాళ్లు కొత్తకొత్త విషయాలను ఎప్పటికీ నేర్చుకుంటూ కనుగొంటూ ఉండే అవకాశం ఉండేది.
7 దేవుని సంకల్పంలో ఇంకా ఏమి కూడా ఉంది? యెహోవా ఆదాముహవ్వలకు, పరిపూర్ణమైన పిల్లల్ని కనే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ పిల్లలు కూడా తమ సంతానంతో ఈ భూమిని నింపే అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. యెహోవా తన మొదటి మానవ పిల్లలైన ఆదాముహవ్వల్ని ప్రేమించినట్లే తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మనుషులకు భూమినీ, దానిమీదున్న విలువైన, అందమైన వాటన్నిటినీ ఇచ్చాడు. ఈ భూమి వాళ్లకు ఇల్లు అవుతుంది, వాళ్లు దాంట్లో శాశ్వతంగా ఉండవచ్చు.—కీర్త. 115:16.
ఆ సంకల్పం ఎందుకు నెరవేరలేదు?
8. ఆదికాండము 2:16, 17లో ఉన్న ఆజ్ఞను దేవుడు ఆదాముహవ్వలకు ఎందుకు ఇచ్చాడు?
8 యెహోవా సంకల్పం వెంటనే నెరవేరలేదు. ఇంతకీ ఏమి జరిగింది? ఆదాముహవ్వలు తమ స్వేచ్ఛకు ఉన్న హద్దుల్ని గుర్తించేలా యెహోవా వాళ్లకు ఓ తేలికైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనిలా చెప్పాడు, “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆది. 2:16, 17) ఆ ఆజ్ఞను అర్థంచేసుకోవడం వాళ్లకు కష్టమేమీ కాదు. అంతేకాదు ఆ ఆజ్ఞను పాటించడం కూడా వాళ్లకు కష్టంకాదు ఎందుకంటే ఆ తోటలో వాళ్లు తినడానికి రుచికరమైన వేరే పండ్లు కావాల్సినన్ని ఉన్నాయి.
9, 10. (ఎ) సాతాను ఏ అబద్ధం చెప్పాడు? (బి) ఆదాముహవ్వలు ఏమి నిర్ణయించుకున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
9 హవ్వను మోసం చేసి ఆమె తన తండ్రియైన యెహోవా మాట వినకుండా చేసేందుకు సాతాను ఒక పామును ఉపయోగించుకున్నాడు. (ఆదికాండము 3:1-5 చదవండి; ప్రక. 12:9) “చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా” అని అడుగుతూ సాతాను ఓ సమస్యను సృష్టించాడు. ఒక విధంగా, ‘మీకు ఇష్టమొచ్చింది మీరు చేయకూడదా?’ అని సాతాను అడిగాడు. ఆ తర్వాత, “మీరు చావనే చావరు” అని హవ్వకు అబద్ధం చెప్పాడు. పైగా దేవుని మాట వినాల్సిన అవసరం లేదని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. సాతాను, ‘మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయని దేవునికి తెలుసు’ అని అన్నాడు. అంటే ఆ పండు తింటే వాళ్లకు ప్రత్యేక జ్ఞానం వస్తుంది కాబట్టి వాళ్లు ఆ పండు తినకూడదని యెహోవా చెప్పాడని అన్నాడు. ఆఖరికి అతను, ‘మీరు మంచి చెడ్డలు ఎరిగిన వాళ్లై దేవతలవలె ఉంటారు’ అని తప్పుడు వాగ్దానం చేశాడు.
10 ఇప్పుడు ఆదాముహవ్వలు ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి. వాళ్లు దేవుని మాట వింటారా లేదా పాము మాట వింటారా? విచారకరంగా, వాళ్లు దేవుని మాట వినకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్లు యెహోవాను తమ తండ్రిగా తిరస్కరించి, సాతానుతో చేతులు కలిపారు. దాంతో తమంతట తామే యెహోవా సంరక్షణకు దూరమయ్యారు.—ఆది. 3:6-13.
11. ఆదాముహవ్వలు చేసిన పాపాన్ని యెహోవా ఎందుకు చూసీచూడనట్లు వదిలేయలేదు?
11 ఆదాముహవ్వలు దేవుని ఆజ్ఞను మీరడంతో తమ పరిపూర్ణతను పోగొట్టుకున్నారు. అంతేకాదు, దేవుడు చెడుతనాన్ని ద్వేషిస్తాడు కాబట్టి వాళ్లు ఆయనకు శత్రువులయ్యారు. అవును, ఆయన “కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది.” (హబ. 1:13) ఆదాముహవ్వలు పాపం చేసినందుకు దేవుడు వాళ్లను శిక్షించకపోయుంటే, పరలోకంలో అలాగే భూమ్మీదున్న సృష్టి ప్రాణుల సమాధానం, ఐక్యత దెబ్బతినివుండేవి. ఆయన మాటను నమ్మవచ్చో లేదోననే సందిగ్ధంలో దేవదూతలు, మనుషులు ఉండేవాళ్లు. కానీ యెహోవా తాను ఏర్పాటు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడు, ఆయన ఎన్నడూ వాటిని మీరడు. (కీర్త. 119:142) తమకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఆదాముహవ్వలకు ఉన్నప్పటికీ, యెహోవాకు ఎదురుతిరగడం వల్ల వచ్చే పర్యవసానాల్ని వాళ్లు తప్పించుకోలేరు. వాళ్లు చివరికి చనిపోయి, దేనితో చేయబడ్డారో తిరిగి ఆ మట్టిలోనే కలిసిపోయారు.—ఆది. 3:19.
12. ఆదాము పిల్లలకు ఏమి జరిగింది?
12 ఆదాముహవ్వలు ఆ పండు తిన్నారు కాబట్టి యెహోవా వాళ్లను ఇక తన కుటుంబ సభ్యులుగా ఎంచలేదు. ఆయన వాళ్లను ఏదెను తోట నుండి బయటకు పంపించేశాడు, వాళ్లు ఎప్పటికీ అక్కడికి తిరిగి రాలేరు. (ఆది. 3:23, 24) వాళ్లు తమ నిర్ణయానికి తగిన పర్యవసానాల్ని అనుభవించడానికి యెహోవా అనుమతించాడు. (ద్వితీయోపదేశకాండము 32:4-5 చదవండి.) దానివల్ల వాళ్లు ఆయన లక్షణాలను పరిపూర్ణంగా అనుకరించలేరు. అద్భుతమైన భవిష్యత్తును ఆదాము కోల్పోవడమే కాదు తన పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా చేశాడు. అతను తన పిల్లలకు అపరిపూర్ణతను, పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా ఇచ్చాడు. (రోమా. 5:12) వాళ్లకిక నిరంతరం జీవించే అవకాశం లేకుండా చేశాడు. ఆదాముహవ్వలు పరిపూర్ణులైన పిల్లలను కనలేరు, ఆ పిల్లల సంతానం కూడా అపరిపూర్ణతతోనే పుడతారు. ఆదాము కాలం నుండి ఇప్పటి వరకు కూడా మనుషులు దేవునిపై తిరుగుబాటు చేసేలా పురికొల్పడానికి సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడు.—యోహా. 8:44.
విమోచన క్రయధనం వల్ల దేవునితో స్నేహం సాధ్యమైంది
13. మనుషుల విషయంలో యెహోవా సంకల్పం ఏమిటి?
13 అంత జరిగినా యెహోవా మనుషులను ప్రేమించాడు. ఆదాముహవ్వలు ఆయనను కాదనుకున్నా, వాళ్ల పిల్లలు తనతో స్నేహం చేయాలని ఆయన కోరుకున్నాడు. అంతేకాదు వాళ్లలో ఏ ఒక్కరూ చనిపోవడం ఆయనకు ఇష్టంలేదు. (2 పేతు. 3:9) అందుకే, మనుషులు తనతో తిరిగి స్నేహం చేయగలిగేలా కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేశాడు. తన ప్రమాణాల విషయంలో రాజీపడకుండానే ఆయన దాన్ని ఎలా చేయగలిగాడు? దీనిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.
14. (ఎ) యోహాను 3:16 చెప్తున్నట్లు మనుషుల్ని పాపమరణాల నుండి కాపాడడానికి దేవుడు ఏమి చేశాడు? (బి) మనం ఏ ప్రశ్నల గురించి ఇతరులతో మాట్లాడవచ్చు?
14 యోహాను 3:16 చదవండి. మనం జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే చాలామందికి ఈ లేఖనం బాగా తెలుసు. కానీ యేసు బలి వల్ల మనం నిరంతరం జీవించడం ఎలా సాధ్యమౌతుంది? మనం ప్రజలను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించినప్పుడు, ఆ ఆచరణలో ఉన్నప్పుడు, దాని తర్వాత వాళ్లను మళ్లీ కలిసినప్పుడు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేలా వాళ్లకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. వాళ్లు విమోచన క్రయధనం గురించి ఎంత ఎక్కువగా అర్థంచేసుకుంటే, యెహోవా మనుషుల్ని ప్రేమిస్తున్నాడనీ, ఆయన జ్ఞానవంతుడనీ అంత ఎక్కువగా గ్రహించగలుగుతారు. విమోచన క్రయధనం గురించిన ఏ విషయాలను మనం వాళ్లకు చెప్పవచ్చు?
15. యేసు ఆదాముకన్నా వేరుగా ఉన్నాడని ఎలా చెప్పవచ్చు?
15 ఓ పరిపూర్ణ వ్యక్తి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేలా యెహోవా ఏర్పాటు చేశాడు. పరిపూర్ణుడైన ఆ వ్యక్తి యెహోవాకు నమ్మకంగా ఉండాలి. ఆయన మనుషుల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. (రోమా. 5:17-19) యెహోవా మొట్టమొదట సృష్టించిన యేసును పరలోకం నుండి భూమ్మీదకు పంపించాడు. (యోహా. 1:14) ఆ విధంగా యేసు ఆదాములాగే పరిపూర్ణ మనిషిగా పుట్టాడు. అయితే ఓ పరిపూర్ణ వ్యక్తి ఏ ప్రమాణాల్ని పాటించాలని యెహోవా కోరుకున్నాడో వాటిని ఆదాము మీరాడు, కానీ యేసు మాత్రం వాటిని పాటించాడు. ఆయనకు తీవ్రమైన పరీక్షలు ఎదురైనప్పుడు కూడా, దేవుని ఆజ్ఞలను ఎన్నడూ మీరలేదు.
16. విమోచన క్రయధనం ఓ విలువైన బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
16 పరిపూర్ణ వ్యక్తిగా మరణించడం ద్వారా, యేసు మనుషులందర్నీ పాపమరణాల నుండి కాపాడగలడు. ఆదాము ఎలా ఉండాల్సి ఉందో యేసు సరిగ్గా అలాగే ఉన్నాడు. ఆయన పరిపూర్ణ వ్యక్తిగా, దేవునికి మాత్రమే నమ్మకంగా ఉంటూ విధేయత చూపించాడు. (1 తిమో. 2:6) ఆయన మనకోసం చనిపోవడం వల్ల, పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు అందరికీ నిత్యం జీవించే అవకాశం దొరికింది. (మత్త. 20:28) దేవుని సంకల్పం నెరవేరడానికి యేసు బలి ఓ మార్గాన్ని తెరిచింది.—2 కొరిం. 1:19, 20.
మనం ఆయన దగ్గరకు తిరిగి వచ్చేందుకు యెహోవా మార్గం తెరిచాడు
17. విమోచన క్రయధనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
17 విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడానికి యెహోవా ఎంతో మూల్యాన్ని చెల్లించాడు. (1 పేతు. 1:19) ఆయన మనల్ని ఎంతో విలువైనవాళ్లలా చూస్తున్నాడు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి మనకోసం చనిపోవడానికి మనస్ఫూర్తిగా అనుమతించాడు. (1 యోహా. 4:9, 10) ఒక విధంగా, ఆదాముకు బదులు యేసు మనకు తండ్రి అయ్యాడు. (1 కొరిం. 15:45) యేసు మనకు నిత్యజీవం మాత్రమేకాదు దేవుని కుటుంబ సభ్యులమయ్యే అవకాశం కూడా ఇచ్చాడు. విమోచన క్రయధనం వల్ల మనుషులు పరిపూర్ణులౌతారు, అప్పుడు యెహోవా తన నియమాల విషయంలో రాజీపడకుండానే మనల్ని తిరిగి తన కుటుంబంలోకి చేర్చుకుంటాడు. యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్లందరూ పరిపూర్ణులైనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! చివరికి, పరలోకంలో అలాగే భూమ్మీద ఉన్న ప్రతీఒక్కరూ ఒకే కుటుంబం అవుతారు. మనందరం దేవుని పిల్లలం అవుతాం.—రోమా. 8:21.
18. యెహోవా “అన్నిటికీ అధికారి” ఎప్పుడు అవుతాడు?
18 మన మొదటి తల్లిదండ్రులు యెహోవాను వద్దనుకున్నప్పటికీ ఆయన మాత్రం మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ యెహోవాకు మనం నమ్మకంగా ఉండకుండా సాతాను మనల్ని ఆపలేడు. మనం పూర్తిస్థాయిలో నీతిమంతులవ్వడానికి విమోచన క్రయధనం ద్వారా యెహోవా మనకు సహాయం చేస్తాడు. ప్రతీఒక్కరూ యేసును “అంగీకరించి, ఆయనమీద విశ్వాసం” చూపించినప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. (యోహా. 6:40) ప్రేమగల, జ్ఞానంగల మన తండ్రి తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అంతేకాదు మనుషులు పరిపూర్ణులవ్వడానికి సహాయం చేస్తాడు. అప్పుడు యెహోవాయే “అన్నిటికీ అధికారి” అవుతాడు.—1 కొరిం. 15:28.
19. (ఎ) విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత మనల్ని ఏమి చేసేలా ప్రోత్సహించాలి? (“అర్హులైన వాళ్ల కోసం వెదుకుతూ ఉందాం” అనే బాక్సు చూడండి.) (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?
19 విమోచన క్రయధనంపట్ల మనకు కృతజ్ఞత ఉంటే, వెలకట్టలేని ఈ బహుమతి గురించి ఇతరులకు చెప్తాం. యేసు బలి ద్వారా మనుషులకు నిత్యం జీవించే అవకాశాన్ని యెహోవా ప్రేమతో ఇస్తున్నాడని ప్రజలు తెలుసుకోవాలి. అయితే, విమోచన క్రయధనం నిత్యజీవం ఇవ్వడమేకాదు ఏదెను తోటలో సాతాను లేవదీసిన సవాళ్లకు జవాబిస్తుంది కూడా. అదెలాగో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.