రక్షణ పొందడానికి మనం ఏమి చేయాలి?
ఒకసారి ఒక వ్యక్తి యేసును ఇలా అడిగాడు: “ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా?” యేసు ఎలా సమాధానమిచ్చాడు? ఆయన, ‘నన్ను నీ ప్రభువుగా రక్షకునిగా, కేవలం అంగీకరించు, నీవు రక్షణ పొందుతావు’ అని చెప్పాడా? లేదు! యేసు ఇలా చెప్పాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.”—లూకా 13:23, 24.
ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమివ్వడంలో యేసు విఫలమయ్యాడా? లేదు, రక్షణ పొందడం ఎంత కష్టమని ఆ వ్యక్తి అడగలేదు; కొద్దిమంది మాత్రమే అయ్యుంటుందా అని అడిగాడు. కాబట్టి, ఒకరు అపేక్షించేంతకంటే తక్కువమంది మాత్రమే ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందడానికి తీవ్రంగా పోరాడుతారని యేసు సూచించాడు.
‘నాకు అలా చెప్పబడలేదు’ అని కొంతమంది పాఠకులు అభ్యంతరం చెప్పవచ్చు. వాళ్లు, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని చెబుతున్న యోహాను 3:16ను ఉదహరించవచ్చు. అయితే మేమిలా సమాధానమిస్తాము: ‘మరి మనమేమి విశ్వసించాలి? యేసు నిజంగా జీవించాడనా? అవును. ఆయన దేవుని కుమారుడనా? తప్పకుండా! బైబిలు యేసును “బోధకుడు” మరియు “ప్రభువు” అని పిలుస్తుంది గనుక, ఆయన బోధించినదాన్ని కూడా మనం విశ్వసించవద్దా, ఆయనకు విధేయత చూపించవద్దా, ఆయనను వెంబడించవద్దా?’—యోహాను 13:13; మత్తయి 16:16.
యేసును వెంబడించడం
ఆహ్, ఇక్కడే సమస్య తలెత్తుతోంది! వారు “రక్షణ” పొందారని ఎవరికి చెప్పబడిందో వారిలో అనేకులు యేసును అనుసరించడం గురించి లేక ఆయనకు విధేయత చూపడం గురించి ఎక్కువ ఆసక్తి కల్గిలేనట్లుగా అనిపిస్తుంది. వాస్తవానికి, ఒక ప్రొటెస్టెంటు మత నాయకుడు ఇలా వ్రాశాడు: “నిజమే, క్రీస్తునందలి మన విశ్వాసం కొనసాగ వలసినదే. కాని అది కచ్చితంగా ఉండాలి లేక తప్పకుండా కొనసాగాలని చెప్పడానికి బైబిలులో ఆధారమేమీలేదు.”
బదులుగా, తాము “రక్షణ” పొందామని భావించే కొంతమంది ప్రజల మధ్య సర్వసాధారణమైయున్న అవినీతికరమైన ఆచారాల గురించి బైబిలు తెలియజేస్తుంది. అలాంటి మార్గాల్లో కొనసాగిన ఒకరి గురించి, అది క్రైస్తవులకు ఇలా ఉపదేశించింది: “ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” తన క్రైస్తవ సంఘాన్ని దుర్మార్గులు కలుషితం చేయడం దేవునికి నిజంగా ఇష్టం లేదు!—1 కొరింథీయులు 5:11-13.
కాబట్టి, మరి యేసును అనుసరించడం అంటే భావమేమిటి, మనమది ఎలా చేయగలం? సరే, యేసు ఏం చేశాడు? ఆయన అనీతిమంతుడా? వ్యభిచారా? త్రాగుబోతా? అబద్ధికుడా? ఆయన వ్యాపారంలో అవినీతిగా ఉన్నాడా? ఎంతమాత్రం కాదు! మీరిలా అడుగవచ్చు, ‘కానీ నేను నా జీవితంలో నుండి అవన్నీ తీసివేసుకోవాలా?’ సమాధానం కొరకు, ఎఫెసీయులు 4:17 నుండి 5:5 వరకు పరిశీలించండి. మనమేమి చేసినప్పటికీ దేవుడు మనల్ని అంగీకరిస్తాడని అది చెప్పడం లేదు. బదులుగా, “తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొను” లోకసంబంధమైన జనాంగాల నుండి మనం వేరుగా ఉండాలని, “మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు . . . మునుపటి ప్రవర్తన విషయములో . . . మీ ప్రాచీనస్వభావమును వదలుకొని . . . దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది . . . వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును” అని అది మనకు చెబుతుంది.
యేసు మాదిరి కనుగుణ్యంగా జీవించడానికి మనం కనీసం ప్రయత్నం కూడా చేయకపోతే మనం ఆయనను వెంబడిస్తున్నట్లేనా? మన జీవితాలను క్రీస్తును పోలినవిగా చేసుకోవడానికి మనం కృషి చేయనవసరం లేదా? ఒక మత సంబంధమైన కరపత్రం చెబుతున్నట్లుగా, “మీరు ఎలా ఉన్నారో అలాగే, ఇప్పుడే క్రీస్తు వద్దకు రమ్మని” చెప్పే ప్రజలు ఆ ప్రాముఖ్యమైన ప్రశ్నను చాలా అరుదుగా పరిగణిస్తారు.
దైవభక్తిలేని పురుషులు “భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు” అని యేసు శిష్యుల్లో ఒకరు హెచ్చరించారు. (యూదా 4) వాస్తవానికి, దేవుని దయను మనం ఎలా “కామాతురత్వమునకు దుర్వినియోగ”పరిచే అవకాశం ఉంది? క్రీస్తు యొక్క బలి మనం విడనాడాలని ప్రయత్నించే, మానవ అపరిపూర్ణతవల్ల చేసే పాపాలను కప్పుతుందని భావించే బదులు మనం ఉద్దేశపూర్వకంగా, క్రమంగా చేస్తూ ఉండే పాపాలను కప్పుతుందని భావించడం ద్వారా మనమలా చేయవచ్చు. మీరు “శుభ్రపరచుకోవడం, విడిచిపెట్టడం, లేక మార్పులు చేసుకోవడం” వంటివి చేయనవసరం లేదని చెప్పిన, అమెరికాలోని పేరుపొందిన సువార్తికులలో ఒకరితో ఏకీభవించాలని మనం ఎంతమాత్రం కోరుకోము.—అపొస్తలుల కార్యములు 17:30; రోమీయులు 3:25; యాకోబు 5:19, 20, వ్యత్యాసం చూడండి.
నమ్మకం చర్యగైకొనడానికి పురికొల్పుతుంది
“యేసును నమ్మడం” కేవలం ఒక్కసారే చేసే చర్య అని, మన విశ్వాసం విధేయత చూపడానికి పురికొల్పేంత బలంగా ఉండనవసరం లేదని అనేకమంది ప్రజలకు చెప్పబడింది. కానీ బైబిలు దీనితో సమ్మతించడం లేదు. క్రైస్తవ జీవన విధానాన్ని ప్రారంభించిన ప్రజలు రక్షణ పొందారని యేసు చెప్పలేదు. బదులుగా ఆయనిలా చెప్పాడు: “అంతమువరకును సహించినవాడు రక్షింపబడును.” (మత్తయి 10:22) మన క్రైస్తవ జీవన విధానాన్ని బైబిలు పరుగు పందెంతో పోలుస్తుంది, దాని ముగింపులో లభించే బహుమానమే రక్షణ. మరియు అదిలా పురికొల్పుతుంది: “మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరింథీయులు 9:24.
కాబట్టి, “క్రీస్తును అంగీకరించడం”లో యేసు యొక్క సర్వోత్కృష్టమైన బలి అనుగ్రహించే ఆశీర్వాదాలను అంగీకరించడంకంటే ఎంతో ఎక్కువ ఇమిడి ఉంది. విధేయత అవసరం. అపొస్తలుడైన పేతురు, తీర్పు “దేవుని ఇంటియొద్ద ఆరంభమగు”నని చెబుతూ, ఇంకా ఇలా కొనసాగించాడు: “అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?” (ఇటాలిక్కులు మావి, 1 పేతురు 4:17.) కాబట్టి మనం కేవలం విని నమ్మడంకంటే ఎక్కువే చేయాలి. మనం ‘వినువారం మాత్రమైయుండి [మనల్ని మనం] మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారమై’ ఉండాలని బైబిలు చెబుతుంది.—యాకోబు 1:22.
యేసు స్వంత వర్తమానాలు
బైబిలు పుస్తకమగు ప్రకటనలో, ఏడు తొలి క్రైస్తవ సంఘాలకు యోహాను ద్వారా అందజేయబడిన యేసు వర్తమానాలు ఉన్నాయి. (ప్రకటన 1:1, 4) ఈ సంఘాల్లోని ప్రజలు తనను అప్పటికే “అంగీకరించారు” గనుక అది చాలని యేసు చెప్పాడా? లేదు. ఆయన వారి క్రియలను, వారి శ్రమను, వారి సహనాన్ని మెచ్చుకొని, వారి ప్రేమా విశ్వాస పరిచర్యల గురించి మాట్లాడాడు. అయితే, అపవాది వారిని శోధిస్తాడని, వారు “వానివాని క్రియల చొప్పున” ప్రతిఫలం పొందుతారని ఆయన చెప్పాడు.—ప్రకటన 2:2, 10, 19, 23.
ఒక మతసంబంధమైన సమావేశంలో ఆయనను “అంగీకరించిన” వెంటనే వారి రక్షణ ఒక “ముగిసిన క్రియ” అయ్యిందని అనేకమంది ప్రజలకు చెప్పబడినప్పుడు వారు అర్థం చేసుకొనే దానికంటే ఎంతో పెద్ద బాధ్యత గురించి యేసు వివరించాడు. యేసు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.”—మత్తయి 16:24, 25.
మనల్ని మనం ఉపేక్షించుకోవడమా? యేసును వెంబడించడమా? దానికి ప్రయత్నం అవసరం. అది మన జీవితాలను మార్చగలదు. అయితే, మనలో కొందరం ‘మన ప్రాణమును పోగొట్టుకో’వలసి ఉంటుందని, అంటే ఆయన కొరకు మరణించ వలసి ఉంటుందని యేసు నిజంగా చెప్పాడా? అవును, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మీరు నేర్చుకొనే అద్భుతమైన విషయాలను గూర్చిన జ్ఞానంతోనే ఆ విధమైన విశ్వాసం ఏర్పడుతుంది. “మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను [ఎ]దిరింపలేక” పోయిన మతోన్మాదులచే స్తెఫను రాళ్లతో కొట్టబడిన రోజున అది స్పష్టమయ్యింది. (అపొస్తలుల కార్యములు 6:8-12; 7:57-60) తమ బైబిలు శిక్షిత మనస్సాక్షులను భంగపర్చుకొనే బదులు, నాజీ నిర్బంధ శిబిరాల్లో మరణించిన వేలాదిమంది యెహోవాసాక్షుల ద్వారా మన కాలంలో కూడా అలాంటి విశ్వాసం ప్రదర్శించబడింది.a
క్రైస్తవ ఆసక్తి
మనం మన క్రైస్తవ విశ్వాసాన్ని దృఢంగా చేపట్టాలి ఎందుకంటే, కొన్ని చర్చీల్లో లేక మత సంబంధమైన దూరదర్శిని కార్యక్రమాల్లో మీరు వింటున్నట్లుగా కాకుండా, మనం పడిపోగలం అని బైబిలు చెబుతుంది. “తిన్ననిమార్గమును” విడిచిపెట్టిన క్రైస్తవుల గురించి అది చెబుతుంది. (2 పేతురు 2:1, 15) కాబట్టి మనం ‘భయముతోను వణకుతోను మన సొంతరక్షణను కొనసాగించుకోవలసిన’ అవసరం ఉంది.—ఫిలిప్పీయులు 2:12; 2 పేతురు 2:20.
యేసు మరియు ఆయన అపొస్తలులు బోధించినది వాస్తవంగా విన్న ప్రజలైన మొదటి శతాబ్దపు క్రైస్తవులు విషయాన్ని అలాగే అర్థం చేసుకున్నారా? అవును. తాము ఏదో చేయవలసి ఉందని వారికి తెలుసు. యేసు ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
యేసు ఆ మాటలు చెప్పిన కొన్ని వారాల తర్వాత, కేవలం ఒక్కరోజులోనే 3,000 మంది బాప్తిస్మం పొందారు. విశ్వాసుల సంఖ్య త్వరగా 5,000కు పెరిగింది. నమ్మినవారు ఇతరులకు బోధించారు. హింస వారిని చెదరగొట్టినప్పుడు, అది వారి వర్తమానాన్ని వ్యాప్తి చేయడానికే తోడ్పడింది. కేవలం కొద్దిమంది నాయకులే కాదుగాని “చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి” అని బైబిలు చెబుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు ఇంచుమించు 30 సంవత్సరాల తర్వాత, సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింప”బడిందని వ్రాయగలిగాడు.—అపొస్తలుల కార్యములు 2:41; 4:4; 8:4; కొలొస్సయులు 1:23.
‘యేసును ఇప్పుడే అంగీకరించండి, మీరు నిరంతరానికి రక్షణ పొందుతారు’ అని చెప్పడం ద్వారా మతమార్పిడి చేసే కొంతమంది దూరదర్శిని సువార్తికులవలె పౌలు మతమార్పిడి చేయలేదు. “యౌవనునిగా . . . నేను అప్పటికే రక్షణ పొందాను” అని వ్రాసిన అమెరికాకు చెందిన మతనాయకునికి ఉన్న నమ్మకం కూడా ఆయనకు లేకుండినది. అన్యజనుల వద్దకు క్రైస్తవ వర్తమానాన్ని తీసుకువెళ్లడానికి యేసు పౌలును వ్యక్తిగతంగా ఎంపిక చేసుకొన్న 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత, కష్టించి పనిచేసేవాడైన ఈ అపొస్తలుడు ఇలా వ్రాశాడు: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 9:27; అపొస్తలుల కార్యములు 9:5, 6, 15.
రక్షణ దేవుని నుండి లభించే ఉచిత బహుమానం. దాన్ని సంపాదించుకోలేము. అయినప్పటికీ మనవైపు నుండి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎవరైనా మీకు చాలా విలువైన బహుమానం ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని మీ దగ్గర ఉంచుకోవడానికి మీరు తగినంత మెప్పుదలను చూపకపోతే మీ కృతఘ్నత, దాత దాన్ని తీసి మరెవరికైనా ఇచ్చివేసేలా పురికొల్పవచ్చు. యేసుక్రీస్తు యొక్క జీవరక్తం ఎంత విలువైనది? అది ఉచిత బహుమానమే, కాని మనం దాని కొరకు ప్రగాఢమైన మెప్పుదలను చూపించాలి.
నిజ క్రైస్తవులు రక్షణ పొందిన స్థితిలో ఉన్నారంటే, వారు దేవుని ఎదుట అంగీకారం పొందిన స్థితిలో ఉన్నారని భావం. ఒక గుంపుగా, వారి రక్షణ కచ్చితమైనది. వ్యక్తిగతంగా, వారు దేవుడు ఏర్పరచిన యోగ్యతలకు తగినట్లు ఉండాలి. అయితే, మనం విఫలం కావచ్చు, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును.”—యోహాను 15:6.
‘దేవుని వాక్యము సజీవమైనది’
గత శీర్షికారంభంలో ప్రస్తావించబడిన సంభాషణ దాదాపు 60 సంవత్సరాల క్రితం జరిగింది. రక్షణ కేవలం యేసు క్రీస్తు ద్వారానే లభిస్తుందని జానీ ఇప్పటికీ నమ్ముతున్నాడు కానీ, దాని కొరకు మనం ప్రయత్నం చేయాలని ఆయన గుర్తించాడు. మానవజాతి కొరకు నిజమైన నిరీక్షణకు మూలాన్ని బైబిలు చూపిస్తుందని, ఆ అద్భుతమైన పుస్తకాన్ని మనం చదవాలని, దానిచే కదిలింపబడాలని, ప్రేమ విశ్వాసం దయ విధేయత సహనం గల క్రియలను చేసేందుకు అది మనల్ని పురికొల్పడానికి మనం అనుమతించాలని ఆయన తెలుసుకున్నాడు. అవే విషయాలను నమ్మేలా ఆయన తన పిల్లలను పెంచాడు, ఇప్పుడు వారు కూడా తమ పిల్లలను అదే విధంగా పెంచడాన్ని చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ అదేలాంటి విశ్వాసం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఇతరుల హృదయాల్లోనూ మనస్సుల్లోను దాన్ని నాటేందుకు ఆయన తాను చేయగలిగినదంతా చేస్తున్నాడు.
అపొస్తలుడైన పౌలు, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉందని వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు. (హెబ్రీయులు 4:12) అది జీవితాలను మార్చగలదు. ప్రేమ విశ్వాస విధేయతలతో కూడిన హృదయపూర్వక క్రియలను చేయడానికి అది మిమ్మల్ని పురికొల్పగలదు. కాని, బైబిలు చెబుతున్నది కేవలం మానసికంగా “అంగీకరించడం” కంటే మీరు ఎక్కువే చేయాలి. దాన్ని పఠించి, దానిచే మీ హృదయం పురికొల్పబడనివ్వండి. దాని జ్ఞానం మీకు నడిపింపునిచ్చేందుకు అనుమతించండి. 230 కంటే ఎక్కువ దేశాల్లోవున్న దాదాపు 50,00,000 మంది సుముఖతగల యెహోవాసాక్షులు ఉచిత గృహబైబిలు పఠనాలను ప్రతిపాదిస్తున్నారు. అటువంటి పఠనం నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి, ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి. మీరు పొందే విశ్వాసం మరియు ఆత్మీయ బలం మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి!
[అధస్సూచీలు]
a నాజీ రాజ్యం మరియు క్రొత్త మతాలు: అవిధేయతకు సంబంధించిన ఐదు కేసు అధ్యయనాలు అనే తన పుస్తకంలో డా. క్రిస్టీన్ ఇ. కింగ్ ఇలా నివేదించింది: “జర్మన్ [యెహోవా]సాక్షుల్లోని ప్రతి ఇద్దరిలో ఒకరు చెరసాలలో వేయబడ్డారు, ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితాలు కోల్పోయారు.”
[7వ పేజీలోని బాక్సు]
‘విశ్వాసము కొరకు ఎందుకు తీవ్రంగా పోరాడాలి?’
బైబిలు పుస్తకమైన యూదా, “యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి” ఉద్దేశించబడింది. వారు ‘యేసును అంగీకరించారు’ గనుక వారి రక్షణ కచ్చితమని అది చెబుతుందా? లేదు, ‘విశ్వాసము కొరకు తీవ్రంగా పోరాడమని’ యూదా అలాంటి క్రైస్తవులకు చెప్పాడు. అలా చేయడానికి ఆయన వారికి మూడు కారణాలను తెలియజేశాడు. మొదటిదిగా, దేవుడు ‘ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించాడు’ కాని తర్వాత వారిలో చాలామంది పడిపోయారు. రెండవదిగా, దేవదూతలు కూడా తిరుగుబాటు చేసి దయ్యాలయ్యారు. మూడవదిగా, సొదొమ గొమొఱ్ఱాలలో ఆచరింపబడుతున్న తీవ్రమైన లైంగిక దుర్నీతినిబట్టి దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు. యూదా ఈ బైబిలు వృత్తాంతాలను ‘హెచ్చరిక దృష్టాంతముగా’ అందజేస్తున్నాడు. అవును, “యేసుక్రీస్తునందు భద్రము చేయబడి”నవారు కూడా నిజమైన విశ్వాసము నుండి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.—యూదా 1-7.
[8వ పేజీలోని బాక్సు]
ఏది ఒప్పు?
“ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని” బైబిలు చెబుతుంది. “మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని” కూడా అది చెబుతుంది. ఏది ఒప్పు? మనం విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడతామా లేక క్రియలమూలముగానా?—రోమీయులు 3:28; యాకోబు 2:24.
రెండూ ఒప్పేనన్నదే బైబిలు ఇచ్చే సమైక్యమైన సమాధానం.
మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, శతాబ్దాల పాటు యూదా ఆరాధికులు ప్రత్యేకమైన బలులు అర్పణలు చేయాలని, పండుగ దినాలను ఆచరించాలని, ఆహారసంబంధ నియమాలను పాటించాలని ఇతర యోగ్యతలను కలిగి ఉండాలని కోరింది. యేసు పరిపూర్ణ బలిని అర్పించిన తర్వాత అలాంటి “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు” లేక క్లుప్తంగా “క్రియలు” అనవసరం అయ్యాయి.—రోమీయులు 10:4.
మోషే ధర్మశాస్త్రం క్రింద నిర్వహించబడే ఈ క్రియల స్థానాన్ని యేసు యొక్క ఉత్కృష్టమైన బలి వహించిందన్న వాస్తవం యొక్క భావం, మనం బైబిలు ఉపదేశాల్ని నిర్లక్ష్యం చేయవచ్చని కాదు. అదిలా చెబుతుంది: “క్రీస్తుయొక్క రక్తము, [పాత] నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు [మన] మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.”—హెబ్రీయులు 9:14.
మనమెలా “జీవము గల దేవుని సేవించ”గలము? ఇతర విషయాలతోపాటు, శరీరసంబంధమైన క్రియలతో పోరాడమని, లోకం యొక్క అవినీతిని ఎదిరించమని, దాని ఉరులను తప్పించుకొనుమని బైబిలు మనకు తెలియజేస్తుంది. అదిలా చెబుతుంది: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము,” “మనలను . . . సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” మనం ‘అలసట పడకయు మన ప్రాణములు విసుకకయు’ ఉండాలని బైబిలు మనల్ని పురికొల్పుతుంది.—1 తిమోతి 6:12; హెబ్రీయులు 12:1-3; గలతీయులు 5:19-21.
ఈ పనులు చేయడం ద్వారా మనం రక్షణను సంపాదించుకోలేము, ఎందుకంటే ఆ విశేషమైన ఆశీర్వాదాన్ని పొందడానికి తగినంత ఏ మానవుడూ ఎన్నడూ చేయలేడు. ఒకవేళ, దేవుడు మరియు క్రీస్తు మనం ఏ పనులు చేయాలని కోరుతున్నారని బైబిలు చెబుతుందో ఆ పనులను చేయడం ద్వారా మన ప్రేమను విధేయతను చూపించడానికి మనం విఫలమౌతే, ఈ అద్భుతమైన బహుమానాన్ని పొందడానికి మనం అనర్హులం. మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి కావలసిన క్రియలు లేకపోతే, యేసును అనుసరిస్తున్నామని మనం చెప్పుకోవడం కచ్చితంగా సరైనది కాదు, ఎందుకంటే బైబిలు స్పష్టంగా ఇలా తెలియజేస్తుంది: “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.”—యాకోబు 2:17.
[7వ పేజీలోని చిత్రం]
బైబిలును పఠించి, దానిచే పురికొల్పబడండి