కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/1 పేజీలు 5-8
  • యేసు చేసిన అద్భుతాల నుండి పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు చేసిన అద్భుతాల నుండి పాఠాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్రాంతి దినాన మంచి చేయుట
  • కరుణను గూర్చిన ఒక పాఠం
  • అద్భుతాల యొక్క పాఠాలు
  • యేసు చేసిన అద్భుతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • క్రీస్తు—దేవుని శక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఆయన ప్రజల్ని ప్రేమించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/1 పేజీలు 5-8

యేసు చేసిన అద్భుతాల నుండి పాఠాలు

“మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. . . . యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి-వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పెను.” ఈ సంఘటన యేసు మొదటి అద్భుతం చేయడానికి సందర్భాన్ని కలుగజేసింది.—యోహాను 2:1-3.

యేసు దృష్టికి తేవడానికి అలాంటి సమస్య మరీ అప్రాముఖ్యమైనది, మరీ సామాన్యమైనది కాదా? ఒక బైబిలు పండితుడు ఇలా వివరిస్తున్నాడు: “తూర్పుదేశాల్లో ఆతిథ్యమివ్వడం ఒక గొప్ప బాధ్యతయై ఉండేది . . . నిజమైన ఆతిథ్యమంటే, ప్రాముఖ్యంగా వివాహ వేడుక సమయంలో, ఆహారపానీయాదులు పుష్కలంగా ఉండడమే. వివాహ వేడుక సమయంలో ఆహారపానీయాదులు [నిండుకుంటే] ఆ కుటుంబం మరియు ఆ క్రొత్త జంట ఆ అవమానాన్ని ఎన్నటికీ భరించలేకపోయేవారు.”

అందుకే, యేసు చర్య గైకొన్నాడు. “యూదుల శుద్ధీకరణాచార ప్రకారము . . . ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడి” ఉండడాన్ని ఆయన గమనించాడు. భోజనానికి ముందు ఆచారం ప్రకారం కడుగుకోవడం యూదులలో ఒక సాంప్రదాయంగా ఉండేది. వచ్చిన వారి అవసరతలకు తగినట్లు చాలా మోతాదులో నీళ్లు అవసరమయ్యేవి. అతిథులకు సపర్యలు చేస్తున్నవారికి యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “బానలు నీళ్లతో నింపుడి.” యేసు “విందు ప్రధాని” కాదు, కాని ఆయన సూటిగా, అధికారపూర్వకంగా మాట్లాడాడు. వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: ‘ఆ విందు ప్రధాని నీళ్లను రుచిచూచినప్పుడు, అవి ద్రాక్షారసముగా మారివుండెను.’—యోహాను 2:6-9; మార్కు 7:3.

వివాహమంత సర్వసాధారణమైనది యేసు మొదటి అద్భుతం చేయడానికి సందర్భమంటే అది విచిత్రంగా అనిపించవచ్చు, కాని ఆ సంఘటన యేసు గురించి ఎంతో తెలియజేస్తుంది. ఆయన ఒంటరివాడు, అనేక సందర్భాలలో ఆయన తన శిష్యులతో ఒంటరితనం యొక్క ప్రయోజనాలను గూర్చి చర్చించాడు. (మత్తయి 19:12) అయితే, ఆయన వివాహ వేడుక యొద్ద ఉండడం ఆయన వివాహ వ్యతిరేకి కాదని తెలియజేస్తుంది. ఆయన సమతూకం కలిగి, వివాహ ఏర్పాటును సమర్థించేవానిగా ఉన్నాడు; ఆయన దానిని దేవుని దృష్టిలో గౌరవనీయమైనదిగా దృష్టించాడు.—హెబ్రీయులు 13:4 పోల్చండి.

ఆ తర్వాత చర్చి కళాకారులు ఆయనను చిత్రీకరించినట్లుగా యేసు కఠినమైన సన్యాసి కాడు. ఆయన ప్రజలతో కలవడాన్ని స్పష్టంగా ఆనందించాడు, సామాజికంగా కలిసిమెలిసి ఉండడాన్ని ఆయన వ్యతిరేకించలేదు. (లూకా 5:29 పోల్చండి.) అందుకే ఆయన చర్యలు ఆయన అనుచరులకు ఒక మాదిరిని ఏర్పరచాయి. నీతి అంటే ఆనందం లేకపోవడమేమోనని భావించేలా, వారు అనవసరంగా గంభీరంగా లేక ముఖం ముడుచుకొని ఉండకూడదని యేసు వ్యక్తిగతంగా చూపించాడు. దానికి వ్యతిరేకంగా, క్రైస్తవులు తర్వాత ఇలా ఆజ్ఞాపించబడ్డారు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి.” (ఫిలిప్పీయులు 4:4) వినోదాన్ని కారణసహితమైన హద్దుల్లో ఉంచడానికి క్రైస్తవులు నేడు జాగ్రత్త వహిస్తారు. వారు దేవుని సేవలో తమ ఆనందాన్ని కనుగొంటారు, కాని యేసు ఉదాహరణను అనుసరిస్తూ, సామాజిక కలయికలలో ఒకరి సహవాసాన్ని ఒకరు ఆనందించడానికి అప్పుడప్పుడు సమయం తీసుకుంటారు.

యేసు భావాల మృదుత్వాన్ని కూడా గమనించండి. ఆయనకు అద్భుతం చేయవలసిన బాధ్యతేమీ లేదు. ఈ విషయంలో నెరవేరవలసిన ప్రవచనమేది లేదు. సాక్ష్యాధారంగా, యేసు కేవలం తన తల్లి శ్రద్ధనుబట్టి, వివాహమౌతున్న జంట అవస్థనుబట్టి కదిలింపబడ్డాడు. ఆయన వారి భావాల యెడల శ్రద్ధ కలిగి, వారిని అవమానం నుండి తప్పించాలని కోరుకున్నాడు. క్రీస్తుకు మీయందు నిజమైన శ్రద్ధ ఉందని, చివరికి మీ ప్రతిదిన సమస్యలలో సహితం శ్రద్ధ ఉందని అది మీ నమ్మకాన్ని దృఢపర్చడంలేదా?—హెబ్రీయులు 4:14-16 పోల్చండి.

ఒక్కొక్క బాన “రెండేసి మూడేసి తూముల” నీళ్లు పట్టేంతవి గనుక, యేసు చేసిన అద్భుతంలో చాలా ఎక్కువ మోతాదులో అంటే బహుశా 390 లీటర్ల (105 గాలన్ల) ద్రాక్షారసం ఇమిడివుంది. (యోహాను 2:6) ఎందుకు అంత ఎక్కువ మోతాదు అవసరం? దేవుడు వ్యతిరేకించేదైన త్రాగుబోతుతనాన్ని యేసు ప్రోత్సహించడంలేదు. (ఎఫెసీయులు 5:18) బదులుగా, ఆయన దేవుని వంటి ఉదారతను చూపిస్తున్నాడు. ద్రాక్షారసం సాధారణ పానీయం గనుక, మిగిలినదాన్ని ఇతర సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు.—మత్తయి 14:14-20; 15:32-37 పోల్చండి.

తొలి క్రైస్తవులు యేసు యొక్క ఉదారతా మాదిరిని అనుకరించారు. (అపొస్తలుల కార్యములు 4:34, 35 పోల్చండి.) అలాగే యెహోవా ప్రజలు నేడు “ఇయ్యుడి” అని ప్రోత్సహించబడుతున్నారు. (లూకా 6:38) అయితే, యేసు మొదటి అద్భుతానికి ప్రవచనార్థక ప్రాముఖ్యత కూడా ఉంది. దేవుడు ఉదారంగా ‘మడ్డిమీదనున్న ద్రాక్షారసముతోను, మూలుగుగల క్రొవ్వినవాటితోను విందుచేసి,’ ఆకలిని పూర్తిగా నిర్మూలించే భవిష్యత్‌ కాలం వైపుకు శ్రద్ధను మళ్లిస్తుంది.—యెషయా 25:6.

అయితే, శారీరక స్వస్థత ఇమిడివున్న యేసు చేసిన అనేక అద్భుతాల విషయమేమిటి? వాటినుండి మనమేం నేర్చుకోగలం?

విశ్రాంతి దినాన మంచి చేయుట

“నీవు లేచి నీ పరుపెత్తికొని నడువు.” యేసు ఈ మాటలను 38 సంవత్సరాల నుండి అనారోగ్యంగానున్న వ్యక్తితో చెప్పాడు. సువార్త వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.” ఆశ్చర్యకరంగా, సంఘటనలు ఇలా మలుపు తిరగడాన్ని బట్టి అందరూ ఆనందించలేదు. వృత్తాంతం ఇలా చెబుతుంది: “ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.”—యోహాను 5:1-9, 16.

విశ్రాంతి దినం అందరూ విశ్రాంతి తీసుకోడానికి, ఆనందించడానికి ఉద్దేశించబడిన దినం. (నిర్గమకాండము 20:8-11) అయితే, యేసు కాలం నాటికి అది అణచివేతకు, మనుష్యులు కల్పించిన కట్టడలకు ఒక వ్యూహంగా తయారయ్యింది. టాల్‌ముడ్‌నందలి విశ్రాంతి దిన దీర్ఘ చట్టాల విభాగాలలో “ఒక సరైన జ్ఞానంగల వ్యక్తి గంభీరమైనవని ఎంతో అరుదుగా పరిగణించగల విషయాలు మతప్రాముఖ్యావశ్యకత గల విషయాలంత గంభీరంగా చర్చించబడేవని” పండితుడైన ఆల్‌ఫ్రెడ్‌ ఎడర్‌షైమ్‌ వ్రాశాడు. (ది లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ జీసస్‌ ది మెస్సీయ) రబ్బీలు, ఒక యూదుని జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని—తరచూ మానవ భావాల యెడల నిర్థయాత్మకమైన లెక్కచేయనితనంతో అదుపులో ఉంచిన తుచ్ఛమైన, నిర్హేతుకమైన చట్టాలకు జీవన్మరణ ప్రాముఖ్యతను ఆపాదించారు. ఒక విశ్రాంతి దిన చట్టం ఇలా శాసించింది: “ఒక భవనం ఒక వ్యక్తిపై కూలితే, అతడు అక్కడ ఉన్నాడా లేదా అని, లేక అతడు జీవించివున్నాడా లేదా అని, లేక అతడు అన్యుడా లేక ఇశ్రాయేలీయుడా అని అనుమానం ఉంటే వారు అతనిపై నుండి ఆ శిథిలాలను తీసివేయవచ్చు. అతడు జీవించివున్నట్లు వారు కనుగొంటే, అతనిపైనుండి వారు దాన్ని మరింత తీసివేయవచ్చు; కాని [అతడు] మరణించివుంటే, వారు అతన్ని విడిచిపెడతారు.”—ట్రాక్టేట్‌ యోమా 8:7, ది మిష్నా, హర్‌బర్ట్‌ డానబ్‌ అనువదించినది.

అలాంటి కఠినమైన వితండవాదాన్ని యేసు ఎలా దృష్టించాడు? విశ్రాంతి దినమందు స్వస్థపరచినందుకు విమర్శించినప్పుడు, ఆయనిలా అన్నాడు: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.” (యోహాను 5:17) యేసు తనను తాను సంపన్నునిగా చేసుకోడానికి లౌకిక ఉద్యోగం చేయడంలేదు. బదులుగా, ఆయన దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. లేవీయులు విశ్రాంతి దినాన తమ పరిశుద్ధ సేవను చేయడానికి అనుమతించబడినట్లుగానే, మెస్సీయగా యేసు కూడా దేవుని చట్టాన్ని మీరకుండానే దేవుడు అప్పగించిన బాధ్యతలను న్యాయబద్ధంగా నెరవేర్చగలడు.—మత్తయి 12:5.

యేసు విశ్రాంతి దినాన చేసిన స్వస్థతలు, యూదా శాస్త్రులు మరియు పరిసయ్యులు ‘అధికమైన నీతి’ గలవారని, తమ ఆలోచనా విధానమందు కఠినమైనవారని, సమతుల్యతలేని వారని కూడా బయల్పర్చాయి. (ప్రసంగి 7:16) కచ్చితంగా, మంచి పనులు వారంలోని కొన్ని రోజులకే పరిమితమై ఉండాలన్నది దేవుని చిత్తం కాదు; విశ్రాంతి దినం అంటే నిరుపయోగమైన చట్ట విధానాన్ని అనుసరించేదై ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. మార్కు 2:27నందు యేసు ఇలా చెప్పాడు: “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.” యేసు నిరంకుశమైన కట్టడలను కాదుగాని, ప్రజలను ప్రేమించాడు.

క్రైస్తవులు నేడు తమ ఆలోచనా విధానమందు అతి కఠినంగా ఉండకపోవడం లేక సూత్ర నిర్ణయబద్ధంగా ఉండకపోవడం మంచిది. సంఘంలో అధికారంగల స్థానంలో ఉన్నవారు ఇతరులపై మనుష్యులు కల్పించిన కట్టడలు, సూత్రాల భారాన్ని పెట్టడాన్ని నివారించాలి. యేసు యొక్క మాదిరి మనల్ని మంచి చేయడానికి అవకాశాల కొరకు వెదకమని కూడా ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, కేవలం ఇంటింటి పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు లేక ప్రసంగిస్తున్నప్పుడు మాత్రమే నేను బైబిలు సత్యాలు పంచుకుంటానని ఒక క్రైస్తవుడు ఎన్నడూ తలంచకూడదు. క్రైస్తవుడు “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని . . . సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండాలని అపొస్తలుడైన పేతురు చెబుతున్నాడు. (1 పేతురు 3:15) మంచి చేయడానికి కాలపరిమితులు లేవు.

కరుణను గూర్చిన ఒక పాఠం

మరో విశేషమైన అద్భుతం లూకా 7:11-17నందు వ్రాయబడింది. ఆ వృత్తాంతం ప్రకారం, యేసు “నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహు జనసమూహమును ఆయనతో కూడ వెళ్లుచుండిరి.” నేటి వరకు, ఆధునిక అరబ్బు గ్రామమైన నాయీనుకు ఆగ్నేయంగా శ్మశాన వాటికలు కనిపిస్తాయి. “ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు” కోలాహలంతో కూడిన ఒక దృశ్యాన్ని ఆయన గమనించాడు. “చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.” పూర్వకాలం నుండి “సమాధి చేసే ఆచారం మారలేదు,” అని చెబుతూ, హెచ్‌. బి. ట్రెస్‌ట్రామ్‌ ఇలా తెలియజేశాడు: “వృత్తిరీత్యా సంతాపపడే స్త్రీలతో కలిసి శవపేటిక ముందు నడిచే స్త్రీలను నేను చూశాను. వారు తమ చేతులు విసురుతూ, వెండ్రుకలు లాక్కుంటూ, బాధతో కూడిన అనాగరికమైన చేష్టలు చేస్తూ, మరణించిన వ్యక్తి పేరును కీచుమని అరుస్తుంటారు.”—ఈస్టర్న్‌ కస్టమ్స్‌ ఇన్‌ బైబిల్‌ లాండ్స్‌.

అలాంటి అల్లరితోకూడిన గందరగోళం మధ్యన తీవ్రమైన వేదనకు మరో రూపంలా ఉన్న దుఃఖిస్తున్న విధవరాలు నడుస్తున్నది. రచయితయైన హెర్‌బర్ట్‌ లాకేయర్‌ మాటల్లో చెప్పాలంటే, అప్పటికే భర్తను కోల్పోయిన ఆమె, తన కుమారున్ని “తన వృద్ధాప్యమందు తనకొక ఆధారంగా, తన ఒంటరితనానికి ఓదార్పుగా, ఇంటికి ఒక మద్దతుగా, ఒక స్తంభంగా దృష్టించింది. తన ఏకైక కుమారుని కోల్పోవడం ద్వారా, ఆమెకు మిగిలివున్న చివరి ఆధారం కూడా తీసివేయబడింది.” (ఆల్‌ ది మిరాకల్స్‌ ఆఫ్‌ ది బైబిల్‌) యేసు ప్రతిస్పందన ఎలా ఉంది? లూకా యొక్క విశేషమైన మాటల్లో, “ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి—ఏడువవద్దని ఆమెతో చెప్పెను.” “కనికరపడి” అనే పదం “ప్రేవులు” అనే అక్షరార్థ భావం గల గ్రీకు పదం నుండి తీసుకొనబడింది. “అంతరాంతరాళ్లాల్లో కదిలింపబడుట” అని దానర్థం. (వైన్స్‌ ఎక్స్‌పోసిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌) అవును, యేసు తన అంతరంగంలో కదిలింపబడ్డాడు.

యేసు స్వంత తల్లి కూడా ఈ సమయానికి విధవరాలు గనుక, తన పెంచిన తండ్రియైన యోసేపును కోల్పోవడం వల్ల కలిగిన దుఃఖం ఆయనకు కచ్చితంగా తెలుసు. (యోహాను 19:25-27 పోల్చండి.) విధవరాలు వేడుకోవలసి రాలేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శవాన్ని ముట్టుకోవడం ఒకరిని అశుద్ధుని చేస్తుందన్నది వాస్తవమైనప్పటికీ, యేసు తక్షణమే ‘దగ్గరకు వచ్చి పాడెను ముట్టెను.’ (సంఖ్యాకాండము 19:11) తన అద్భుత శక్తుల ద్వారా, యేసు అశుద్ధత యొక్క మూలాన్నే తీసివేయగలిగాడు! “ఆయన-చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.”

కరుణను గూర్చిన ఎంతటి పురికొల్పే పాఠం! ఈ “అంత్యదినాల్లో” వ్యక్తపర్చబడే ప్రేమలేని, నిరాసక్త దృక్పథాలను క్రైస్తవులు అనుకరించకూడదు. (2 తిమోతి 3:1-5) దానికి వ్యతిరేకంగా, 1 పేతురు 3:8 ఇలా కోరుతుంది: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” పరిచయమున్న ఒకరు మరణాన్ని లేక తీవ్రమైన అస్వస్థతను ఎదుర్కొన్నప్పుడు, మనం పునరుత్థానం చేయడం లేక అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపర్చడం వంటివి చేయలేము. కాని బహుశా కేవలం అక్కడ ఉండి, వారితో కలిసి ఏడ్వడం ద్వారా మనం ఆచరణయోగ్యమైన సహాయాన్ని, ఓదార్పును ఇవ్వగలము.—రోమీయులు 12:15.

యేసు చేసిన నాటకీయమైన పునరుత్థానం భవిష్యత్తును, అంటే “సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చే” ఒక కాలాన్ని కూడా సూచిస్తుంది! (యోహాను 5:28, 29) భూవ్యాప్తంగా, విడిపోయిన తల్లులు, తండ్రులు, పిల్లలు, స్నేహితులు సమాధుల నుండి తిరిగి వచ్చినప్పుడు, దుఃఖపడే వారందరు యేసు యొక్క కరుణను వ్యక్తిగతంగా అనుభవిస్తారు!

అద్భుతాల యొక్క పాఠాలు

అయితే స్పష్టంగా, యేసు చేసిన అద్భుతాలు శక్తి యొక్క ఉత్తేజకరమైన వ్యక్తీకరణల కంటే ఎక్కువైనవి. అవి, ‘దేవున్ని ఘనపర్చమని’ కోరబడిన క్రైస్తవులకు ఒక మాదిరినిస్తూ దేవున్ని ఘనపర్చాయి. (రోమీయులు 15:6) అవి మంచి చేయడాన్ని, ఉదారతను చూపించడాన్ని, కరుణను కనపర్చడాన్ని ప్రోత్సహించాయి. మరింత ప్రాముఖ్యంగా అవి, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో చేయబడబోయే శక్తివంతమైన పనులను గూర్చిన ముంగుర్తుగా పనిచేశాయి.

భూమి మీద ఉన్నప్పుడు, యేసు తన శక్తివంతమైన పనులను కేవలం పరిమిత భూ పరిధిలోనే చేసాడు. (మత్తయి 15:24) మహిమపర్చబడిన రాజుగా, ఆయన ఆధిపత్యం భూమంతటికీ విస్తరిస్తుంది! (కీర్తన 72:8) పూర్వం, ఆయన చేసిన అద్భుతమైన స్వస్థతలను, పునరుత్థానాలను పొందినవారు చివరికి మరణించారు. ఆయన పరలోక రాజరికం క్రింద, నిత్యజీవానికి మార్గాన్ని తెరుస్తూ, పాప మరణాలు పూర్తిగా నిర్మూలింపబడతాయి. (రోమీయులు 6:23; ప్రకటన 21:3, 4) అవును, యేసు చేసిన అద్భుతాలు మహిమాన్వితమైన భవిష్యత్తును సూచిస్తాయి. దానిలో భాగమై ఉండే నిజమైన నిరీక్షణను పెంపొందింప జేసుకోడానికి యెహోవాసాక్షులు లక్షలాదిమందికి సహాయం చేశారు. ఆ సమయం వచ్చే వరకు, త్వరలో సంభవించబోయే వాటి రుచిని ముందే చూసే అవకాశాన్ని యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అందజేస్తాయి.

[7వ పేజీలోని చిత్రం]

యేసు నీళ్లను ద్రాక్షారసముగా మారుస్తున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి