ఇప్పుడు మరణించియున్న కోట్లకొలది ప్రజలు తిరిగి జీవించెదరు
ఇప్పుడు మరణించిన కోట్లకొలది ప్రజలు తిరిగి జీవించెదరు—ఎంతగా హృదయమును ఉప్పొంగజేయు నిరీక్షణ! కాని అది వాస్తవికముగా ఉన్నదా? నిన్ను నమ్మించుటకు ఏమి అవసరము? ఒక వాగ్దానమును నమ్ముటకు, ఆ వాగ్దానమును చేయువాడు దానిని నెరవేర్చు శక్తిగలవాడని మరియు ఆ విషయమై ఇష్టతను కలిగియున్నాడని నీకు నిశ్చయత ఉండాలి. అయితే ఇప్పుడు చనిపోయిన కోట్లకొలది ప్రజలు తిరిగి జీవిస్తారని ఎవరు వాగ్దానము చేస్తున్నారు?
సా.శ. 31 వసంతకాలములో యేసుక్రీస్తు, చనిపోయిన వారిని లేపుటకు యెహోవా దేవుడు తనను బలపరిచాడని ధైర్యముతో ప్రకటించెను. యేసు ఇట్లు వాగ్దానము చేసెను: “తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో, ఆలాగే కుమారుడు తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటకు వచ్చెదరు.” (యోహాను 5:21, 28, 29) అవును, ఇప్పుడు చనిపోయిన కోట్లకొలది ప్రజలు తిరిగి జీవించి, ఈ భూమిపైనే నిరంతరము జీవించు ఉత్తరాపేక్షను యేసుక్రీస్తు వాగ్దానము చేసెను. (యోహాను 3:16, 17:3; కీర్తన 37:29 మరియు మత్తయి 5:5 పోల్చుము.) యేసు ఈ వాగ్దానమును చేసెను గనుక ఆయన దానిని నెరవేర్చుటకు ఇచ్ఛను కలిగియున్నాడని కూడా మనము అనుకొనవచ్చును. అయితే ఆయన అలాచేయగలడా?
బైబిలు వృత్తాంతము ప్రకారముగా, యేసు ఆ వాగ్దానముచేసిన సమయము వరకు, ఆయన ఎవరిని పునరుత్థానము చేయలేదు. అయితే రెండు సంవత్సరములకంటే తక్కువ సమయము తరువాతనే, పునరుత్థానము చేయుటకు ఆయన ఇచ్ఛను మరియు సామర్థ్యమును కలిగియున్నాడని, శక్తివంతమైన విధంగా ప్రదర్శించాడు.
“లాజరు, బయటకురా!”
అది హృదయములను తట్టు సన్నివేశమై యుండెను. లాజరు తీవ్రముగా రోగగ్రస్తుడయ్యెను. అతని ఇద్దరు సహోదరీలు మరియ మరియు మార్త యోర్దాను అవతల ఉన్న యేసుకు సందేశము పంపిరి. “ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు.” (యోహాను 11:3) అవును, యేసు ఈ కుటుంబమును ఎంతో ప్రేమించెను, బహుశ బేతనియలోని వారి గృహములో ఆయన తరచు ఆతిథ్యము పొందెను. (లూకా 10: 38-42; లూకా 9:58 పోల్చుము.) కాని ఇప్పుడు యేసుయొక్క ప్రియస్నేహితుడు రోగియైయుండెను.
అయితే, మరియ, మార్తలు యేసు ఏమిచేయవలెనని అపేక్షించిరి? ఆయన బేతనియకు రావలెనని వారు అడుగలేదు. అయితే యేసు లాజరును ప్రేమించెనని వారికి తెలుసు. రోగియైన తన స్నేహితుని చూడవలెనని యేసు కోరడా? నిస్సందేహముగా యేసు లాజరును అద్భుతరీతిన బాగుచేయునని ఆశించిరి. ఇంతమట్టుకు యేసు తన పరిచర్యలో అద్భుతముగా ఎన్నో స్వస్థతలను చేసెను మరియు అతనికి దూరముకూడా ఒక సమస్య కాదు. (మత్తయి 8:5-13 పోల్చుము.) తన ప్రియ స్నేహితుని కొరకు ఆయన ఏమైనా తక్కువ చేయునా? ఆశ్చర్యకరముగా, వెంటనే బేతనియకు వెళ్లే బదులు, యేసు తానున్న చోటనే రెండు రోజులు గడిపాడు.—యోహాను 11:5, 6.
సందేశము పంపిన కొద్దిసమయము తరువాతే, బహుశ యేసుకు ఆ సందేశము అందిన సమయములోనే లాజరు చనిపోయెను. (యోహాను 11:3, 6, 17 పోల్చుము.) అయితే మరియొక సందేశముయొక్క అవసరత లేకుండెను. లాజరు ఎప్పుడు చనిపోయెనో యేసు ఎరిగియుండెను మరియు దానినిగూర్చి ఆయన ఏదోచేయాలని నిర్ణయించెను. లాజరుయొక్క మరణమునుగూర్చి తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఇట్లనెను: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.” (యోహాను 11:11) ఇంతకుముందు చనిపోయిన ఇద్దరిని లేపినప్పుడు, ఆయన వారు చనిపోయిన కొద్ది సమయమునకే వారిని లేపెను.a ఈసారి మాత్రం వేరుగా ఉంది. యేసు చివరికి బేతనియలోనికి వచ్చేసరికి అతని ప్రియస్నేహితుడు చనిపోయి నాలుగు దినములైనది. (యోహాను 11: 17, 39) అంత సమయము చనిపోయివుండి, అతని శరీరము కుళ్లిపోవుట ఆరంభించిన తరువాత, అతనిని యేసు తిరిగి జీవమునకు తీసుకురాగలడా?
యేసు వస్తున్నాడని విన్నప్పుడు క్రియాశీలియైన మార్త, ఆయనను కలిసికొనుటకు పరుగెత్తెను. (లూకా 10:38-42 పోల్చుము.) యేసును కలిసిన వెంటనే, ఆమె హృదయము ఇలా అనుటకు ఆమెను పురికొల్పెను: “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.” ఇంకా ఆమె తన విశ్వాసమును ఇలా వ్యక్తపరిచింది: “ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని యెరుగుదును.” ఆమె దుఃఖముతో తట్టబడినవాడై యేసు ఇట్లు హామి ఇచ్చెను: “నీ సహోదరుడు మరల లేచును.” భవిష్యత్ పునరుత్థానముపై ఆమె విశ్వాసముచూపిన తరువాత, యేసు స్పష్టముగా ఇలాచెప్పెను: “పునరుత్థానమును, జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.”—యోహాను 11:20-25.
సమాధినొద్దకు వచ్చిన తరువాత, యేసు దాని ద్వారాముయొద్ద ఉన్న రాయిని తొలగించుమని చెప్పెను. మొదట మార్త ఇట్లు అభ్యంతరము చెప్పెను: “ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టును.” కాని యేసు ఇట్లు హామియిచ్చెను: “నీవు నమ్మినయెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా?” తరువాత గట్టిగా ప్రార్థనచేసి, ఇట్లు ఆజ్ఞాపించెను, “లాజరూ బయటికి రా!” చనిపోయి నాలుగురోజులైనను, యేసు ఆజ్ఞనువిని లాజరు బయటికి వచ్చెను!—యోహాను 11:38-44.
అది నిజముగా జరిగెనా?
లాజరును లేపుట అను సంఘటన యోహాను సువార్తలో చరిత్రాత్మక వాస్తవముగా వ్రాయబడినది. అది కేవలము ఒక దృష్టాంతము కాదనుటకు దానిలో వివరములు చాలా సజీవముగా ఉన్నవి. దాని చరిత్రాత్మకతను ప్రశ్నించుట, యేసుయొక్క పునరత్థానముతో సహా బైబిలులోని ప్రతి అద్భుతమును ప్రశ్నించినట్లే.b యేసుయొక్క పునరుత్థానము ఒప్పుకొనకపోతే పూర్తి క్రైస్తవ విశ్వాసమునే ఒప్పుకొననట్లవుతుంది.—1 కొరింథీయులు 15:13-15.
వాస్తవముగా నీవు దేవుడు ఉన్నాడని నమ్మినట్లయితే పునరుత్థానముపై విశ్వాసముంచుట సమస్య కాదు. దృష్టాంతమునకు ఒక వ్యక్తి తన చివరి వీలునామాను వీడియో టేపు చేయవచ్చును. అతడు చనిపోయిన తరువాత అతని బంధువులు మరియు స్నేహితులు, తన ఆస్తిని ఎట్లు వాడాలని ఆయన చెప్పుటను విని చూడగలరు. ఒక వంద సంవత్సరముల క్రితం అది ఆలోచించశక్యం కానిదైయుండెను, మరియు మారుమూల ప్రాంతములలో జీవించు కొందరికి వీడియో టేపులో రికార్డు చేయడం ఊహించలేని అద్భుతం. సృష్టికర్త స్థాపించిన వైజ్ఞానిక సూత్రములను వాడి మనుష్యుడు అటువంటి వినగల చూడగల చిత్రమును పునర్నిర్మించ గలిగితే, సృష్టికర్త దానికంటే ఎక్కువగా చేయలేడా? జీవమును సృష్టించిన వాడు, ఒకని వ్యక్తిత్వమును క్రొత్తగా చేసిన శరీరముతో పునర్నిర్మించుట ద్వారా అతనిని పునరుత్థానము చేయగలడనునది కారణసహితముగా లేదా?
లాజరును జీవమునకు పునరుద్ధరించు అద్భుతము యేసుపై మరియు పునరుత్థానముపై విశ్వాసమును పెంపొందించును. (యోహాను 11:41, 42; 12:9-11, 17-19) యెహోవా మరియు ఆయన కుమారుడు పునరుత్థానమును చేయుటకు ఇష్టపడుతున్నారని అది హృదయములను తట్టురీతిగా చూపించుచున్నది.
‘దేవుడు ఇష్టపడును’
లాజరు మరణమునకు యేసు ప్రతిక్రియ, దేవుని కుమారుని అతి సున్నిత పక్షమును బయలుపరచుచున్నది. ఈ సందర్భములో ఆయనయొక్క ప్రగాఢ భావనలు, చనిపోయిన వారిని పునరుత్థానము చేయవలెనని ఆయనకున్న మిక్కుటమైన కోరికను స్పష్టముగా చూపించుచున్నది. మనము ఇలా చదువుదుము: “అంతట మరియ యేసు ఉన్నచోటికివచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీద పడి, ‘ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను.’ ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసుచూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, ‘అతనినెక్కడ నుంచితిరని’ అడుగగా, వారు ‘ప్రభువా, వచ్చిచూడుమని’ అతనితో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు, ‘అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని’ చెప్పుకొనిరి.”—యోహాను 11:32-36.
యేసుయొక్క హృదయపూర్వకమైన కనికరము ఇక్కడ మూడు పదములద్వారా చూపించబడినది: “మూలుగుచు,” “కలవరపడి,” మరియు “కన్నీళ్లు విడిచెను.” హృదయములను తట్టు ఈ సన్నివేశమును వ్రాయుటలో అపొస్తలుడైన యోహాను వాడిన మూలభాషలోని వాక్యములు, యేసు ఎంత మట్టుకు భావనాత్మంగా కదిలించబడ్డాడో చూపించుచున్నది.
“మూలుగుచు” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదము (ఎంబ్రిమాఓమాయి) బాధాకరంగా, లోతుగా కదిలించబడుట అని అర్థమును కలిగియున్నది. బైబిలు వ్యాఖ్యాత విలియం బార్క్లే ఇట్లు గమనించెను. “సామాన్య సంప్రదాయకమైన గ్రీకులో [ఎంబ్రిమాఓమాయి] యొక్క సాధారణ వాడుక ఒక గుర్రముయొక్క గుర్రును సూచించెను. ఇక్కడ మాత్రము దాని అర్థము ఏదనగా, యేసు ఒక లోతైన భావనకులోనై అప్రయత్నపూర్వకముగా అతని హృదయమునుండి ఒక మూలుగు వెలువడింది.”
“కలవరపడెను” అని అనువదించబడిన మాట కలతను సూచించు గ్రీకు పదమునుండి (టారస్సొ) వచ్చుచున్నది. ది న్యూ థాయర్స్ గ్రీక్-ఇంగ్లీషు లిక్సికన్ ఆఫ్ ది న్యూ టెస్ట్‌మెంట్, ప్రకారముగా దాని అర్థము, “ఒకనిలో అంతర్గిత అల్లకల్లోలమును కలుగజేయుట, . . . అధిక నొప్పి మరియు కలతతో ప్రభావితమగుట.” “కన్నీళ్లు విడిచెను” అను మాట “కన్నీళ్లు కార్చుట, మౌనముగా ఏడ్చుట” అను అర్థమిచ్చు గ్రీకు (డాక్రియో) క్రియా పదమునుండి వచ్చెను. ఇది యోహాను 11:33 లో చెప్పిన విధముగా మరియ మరియు యూదులు ఏడ్చుటకు వత్యాసముగా ఉన్నది. అక్కడ వాడబడిన గ్రీకు పదము (క్లేయో నుండి) యొక్క అర్థము పెద్దగా లేక వినబడే విధముగా ఏడ్చుటయైయున్నది.c
కావున తన ప్రియ స్నేహితుడైన లాజరుయొక్క మరణము మరియు లాజరు సహోదరి ఏడ్చుటయు యేసును లోతుగా కదిలించినవి, యేసుయొక్క హృదయము భావనలతో ఎంతగా నిండినదంటే అతని కన్నులు కన్నీటితో నిండి పొరలినవి. గుర్తింపదిగిన విషయమేమనగా యేసు ఇంతకుముందే ఇద్దరు ఇతరులను తిరిగి జీవానికి తెచ్చెను. మరియు ఈ సందర్భములో కూడా ఆయన లాజరుతో అదే చేయుటకు పూర్తి నిశ్చయమును కలిగియుండెను. (యోహాను 11:11, 23, 25) అయినను, ఆయన “కన్నీళ్లు విడిచెను.” మనుష్యులను తిరిగి జీవమునకు పునరుద్ధరించుట యేసుకు కేవలము ఒక పనికాదు. ఈ సందర్భములో ఆయన వ్యక్తపరచిన, సున్నితమైన మరియు లోతైన భావనలు, మరణముయొక్క దుష్పరిణామములను తీసివేయుటకు ఆయనకుగల మిక్కుటమైన ఇచ్ఛను స్పష్టముగా చూపించుచున్నవి.
యేసు, ‘యెహోవాయొక్క మూర్తిమంతమై యున్నాడు’ గనుక, మన పరలోకపు తండ్రినుండి మనము ఏ తక్కువయు అపేక్షించము. (హెబ్రీయులు 1:3) పునరుత్థానము చేయుటకు యెహోవాయొక్క స్వంత ఇష్టతనుగూర్చి విశ్వాసపాత్రుడైన మనుష్యుడు, యోబు ఇట్లనెను: “మరణమైన తరువాత నరులు బ్రదుకుదురా? . . . నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను, నీ హస్తకృత్యము యెడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:14, 15) “నీకు ఇష్టము కలుగును” అని అనువదించబడిన మూల భాషాపదము మనఃపూర్వకమైన వాంఛ లేక ఆశను సూచించుచున్నది. (ఆదికాండము 31:30; కీర్తన 84:2) స్పష్టముగా, యెహోవా తీక్షణముగా పునరుత్థానము కొరకు ఎదురు చూస్తుండవచ్చును.d
మనము నిజముగా పునరుత్థాన వాగ్దానమును నమ్మగలమా? అవును, యెహోవా మరియు యేసు ఇచ్ఛను కలిగి, దానిని చేయు సామర్థ్యమును కలిగియున్నారనుటకు ఏ అనుమానము లేదు. నీకు దీని అర్థమేమైయున్నది? మరణించిన నీ ప్రియమైన వారితో ఈ భూమిపైనే శాంతియుతమైన పరిస్థితులతో తిరిగి కలిసికొను ఉత్తరాపేక్షను నీవు కలిగియున్నావు!
అది ఇప్పుడు రాబర్టాయొక్క నిరీక్షణయై యున్నది (ముందరి శీర్షికలో ప్రస్తావించబడెను). ఆమె తల్లి చనిపోయిన అనేక సంవత్సరముల తరువాత, యెహోవా సాక్షులు బైబిలును జాగ్రత్తగా చదువుటకు ఆమెకు సహాయము చేసారు. ఆమె ఇట్లు గుర్తు చేసికొనుచున్నది: “పునరుత్థాన నిరీక్షణను గూర్చి నేర్చుకొన్న తరువాత నేను ఏడ్చాను. నా తల్లిని నేను తిరిగి చూడగలనని తెలిసికొనుట ఎంతో అద్భుతముగా అనిపించింది.” నీ ప్రియమైన వారిని తిరిగి చూడవలెనని నీ హృదయము ఇష్టపడినట్లయితే నీవు నిస్సందేహముగా ఈ అద్భుత ఉత్తరాపేక్షనుగూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు ఇష్టపడుదువు. (w90 5/1)
[అధస్సూచీలు]
a See the article “Exercise Faith for Everlasting Life,” pages 23-8.
b యోహాను 5:28, 29 లోని మాటలుచెప్పిన తరువాత లాజరు మరణము వరకు గడచిన సమయములో, యేసు నాయీనులోని విధవరాలి కొడుకును మరియు యాయీరు కూతురును లేపెను.—లూకా 7:11-17; 8:40-56.
c మిరకల్స్—డిడ్ దె రియల్లీ హెపెన్? అను 6వ అధ్యాయమును ది బైబిల్—మాన్స్ వర్డ్ ఆర్ గాడ్స్ వర్డ్? అను పుస్తకములో చూడుము. ప్రకాశకులు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి.
d ఆసక్తికరంగా వినబడే విధంగా ఏడ్చుట అనుదానిని సూచించు గ్రీకు పదము (క్లేయో) యెరూషలేముయొక్క రానైయున్న నాశనమును గూర్చి ప్రవచించినప్పుడు యేసు విషయములో వాడబడింది. లూకా వర్ణన ఇట్లు చెప్పుచున్నది: “ఆయన పట్టణమును సమీపించినప్పుడు, దానిని [యెరూషలేమును] చూచి దాని విషయమై ఏడ్చెను.”—లూకా 19:41.
[5వ పేజీలోని చిత్రాలు]
యేసు యాయీరు కూతురును లేపుట భవిష్యత్తులో మరణించినవారి పునరుత్థానమును విశ్వసించుటకు ఆధారమునిచ్చుచున్నది
[6వ పేజీలోని చిత్రాలు]
లాజరుయొక్క మరణముతో యేసు లోతుగా కదిలించబడ్డాడు
[7వ పేజీలోని చిత్రాలు]
పునరుత్థానమును చూచువారి ఆనందము, చనిపోయిన తన కుమారుని యేసు పునరుత్థానము చేసినప్పుడు నాయీనులోని విధవరాలు పొందిన ఆనందమువలె ఉండును