కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 69 పేజీ 16-పేజీ 165 పేరా 2
  • వాళ్ల తండ్రి అబ్రాహామా? అపవాదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్ల తండ్రి అబ్రాహామా? అపవాదా?
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • పితృత్వమును గూర్చిన ప్రశ్న
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • పితృత్వమును గూర్చిన ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 69 పేజీ 16-పేజీ 165 పేరా 2
యూదులు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు, కానీ యేసు సురక్షితంగా తప్పించుకున్నాడు

69వ అధ్యాయం

వాళ్ల తండ్రి అబ్రాహామా? అపవాదా?

యోహాను 8:37-59

  • తమ తండ్రి అబ్రాహాము అని యూదులు చెప్పుకున్నారు

  • అబ్రాహాము కన్నా ముందే యేసు ఉన్నాడు

గుడారాల (లేదా, పర్ణశాలల) పండుగ కోసం యెరూషలేములోనే ఉన్న యేసు ముఖ్యమైన సత్యాల్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడున్న కొంతమంది యూదులు ఇంతకుముందే ఆయనతో, “మేము అబ్రాహాము పిల్లలం, మేము ఎప్పుడూ ఎవ్వరికీ దాసులుగా ఉండలేదు” అన్నారు. దానికి యేసు, “మీరు అబ్రాహాము పిల్లలని నాకు తెలుసు. అయినా మీరు నన్ను చంపాలని చూస్తున్నారు, ఎందుకంటే మీరు నా బోధల్ని అంగీకరించట్లేదు. నేను నా తండ్రి దగ్గర చూసిన విషయాలే మాట్లాడుతున్నాను. కానీ మీరు మీ తండ్రి దగ్గర విన్నవాటిని చేస్తున్నారు.”—యోహాను 8:33, 37, 38.

తన తండ్రి, వాళ్ల తండ్రి ఒక్కరు కాదని యేసు స్పష్టంగా చెప్పాడు. యేసు చెప్తున్నది అర్థంకాక యూదులు, “మా తండ్రి అబ్రాహాము” అని మళ్లీ అన్నారు. (యోహాను 8:39; యెషయా 41:8) వాళ్లు అబ్రాహాము వంశంలో పుట్టారు కాబట్టి, దేవుని స్నేహితుడైన అబ్రాహాముకు ఉన్న లాంటి విశ్వాసమే తమకూ ఉందని అనుకుంటున్నారు.

అయితే యేసు వాళ్లకు ఆశ్చర్యం కలిగించే ఈ మాట అన్నాడు: “మీరు అబ్రాహాము పిల్లలైతే, అబ్రాహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్లు.” సాధారణంగా పిల్లలు తమ తండ్రిని అనుకరిస్తారు. యేసు వాళ్లతో ఇలా చెప్పాడు: “కానీ ఇప్పుడు మీరు, దేవుని దగ్గర విన్న సత్యాన్ని మీకు చెప్పిన నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రాహాము ఎప్పటికీ అలా చేసేవాడు కాదు.” తర్వాత యేసు వాళ్లను తికమకపెట్టే ఈ మాట అన్నాడు: “మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు.”—యోహాను 8:39-41.

యేసు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో యూదులకు ఇంకా అర్థం కాలేదు. తాము న్యాయబద్ధంగా అబ్రాహాము సంతానమే అని చెప్తూ వాళ్లిలా అన్నారు: “మేము అక్రమ సంతానం కాదు. మాకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు.” నిజంగా దేవుడే వాళ్ల తండ్రా? యేసు ఇలా అన్నాడు: “దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించేవాళ్లు. ఎందుకంటే నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. నా అంతట నేనే రాలేదు, ఆయనే నన్ను పంపించాడు.” యేసు ఇంకా ఇలా అన్నాడు: “మీకు నా బోధను అంగీకరించడం ఇష్టంలేదు, అందుకే నా మాటలు మీకు అర్థం కావట్లేదు.”—యోహాను 8:41-43.

తనను తిరస్కరిస్తే వచ్చే పర్యవసానాల గురించి వివరించడానికి యేసు ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు సూటిగా ఇలా అన్నాడు: “మీ తండ్రి అపవాది. మీరు మీ తండ్రి కోరికల్నే నెరవేర్చాలని కోరుకుంటున్నారు.” వాళ్ల తండ్రి ఎలాంటివాడు? అతను ఎలాంటివాడో యేసు స్పష్టం చేశాడు: “మొదటి నుండి అతను హంతకుడు. అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు.” యేసు ఇంకా ఇలా అన్నాడు: “దేవునికి చెందిన వ్యక్తి దేవుని మాటలు వింటాడు. కానీ మీరు దేవునికి చెందినవాళ్లు కాదు కాబట్టే నా మాటలు వినట్లేదు.”—యోహాను 8:44, 47.

ఆయన అలా ఖండించేసరికి యూదులకు కోపమొచ్చి ఇలా అన్నారు: “‘నువ్వు సమరయుడివి, నీకు చెడ్డదూత పట్టాడు’ అని మేము అన్న మాట నిజం కాదా?” యేసును “సమరయుడు” అనడం ద్వారా వాళ్లు ఆయన్ని అవమానించారు. అయితే యేసు దాన్ని పట్టించుకోకుండా ఇలా అన్నాడు: “నాకు చెడ్డదూత పట్టలేదు కానీ నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను, మీరు నన్ను అవమానిస్తున్నారు.” వాళ్ల మాటలు, పనులు మంచి ప్రతిఫలాన్ని తీసుకురావచ్చు లేదా చెడ్డ పర్యవసానాల్ని తీసుకురావచ్చు అని తెలియజేస్తూ ఆయన ఇలా అన్నాడు: “ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు.” అపొస్తలులు, తనను అనుసరించే ఇతరులు అస్సలు చనిపోరని యేసు చెప్పట్లేదు. బదులుగా, వాళ్లు “రెండో మరణాన్ని” అంటే పునరుత్థాన నిరీక్షణ లేని శాశ్వత నాశనాన్ని ఎప్పుడూ రుచి చూడరని యేసు చెప్తున్నాడు.—యోహాను 8:48-51; ప్రకటన 21:8.

అయితే యూదులు యేసు మాటల్ని అక్షరార్థంగా తీసుకుని ఇలా అన్నారు: “నీకు చెడ్డదూత పట్టాడని మాకు ఇప్పుడు అర్థమైంది. అబ్రాహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నువ్వేమో, ‘ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు’ అంటున్నావు. నువ్వు మా తండ్రైన అబ్రాహాము కన్నా గొప్పవాడివా? అతను చనిపోయాడు . . . ఇంతకీ నువ్వు ఎవరు?”—యోహాను 8:52, 53.

ఒకవిధంగా, తానే మెస్సీయ అని యేసు ఆ మాటల్లో స్పష్టం చేశాడు. అయితే, తాను ఎవరని వాళ్లు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చే బదులు యేసు ఇలా అన్నాడు: “నన్ను నేనే మహిమపర్చుకుంటే, నా మహిమకు అర్థంలేదు. నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు, ఆయన్నే మీరు మీ దేవుడని చెప్పుకుంటున్నారు. అయినా మీరు ఆయన్ని తెలుసుకోలేదు, కానీ నాకు ఆయన తెలుసు. ఒకవేళ ఆయన నాకు తెలీదని నేను చెప్తే, మీలాగే నేను కూడా అబద్ధాలకోరును అవుతాను.”—యోహాను 8:54, 55.

యేసు ఇప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ల పూర్వీకుని గురించి మళ్లీ మాట్లాడాడు: “మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు.” అవును, అబ్రాహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి మెస్సీయ కోసం ఎదురుచూశాడు. అయితే నమ్మకంలేని ఆ యూదులు ఇలా అన్నారు: “నీకు 50 ఏళ్లు కూడా లేవు, నువ్వు అబ్రాహామును చూశావా?” అందుకు యేసు, “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, అబ్రాహాము పుట్టకముందే నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు. తాను భూమ్మీదికి రాకముందు పరలోకంలో శక్తివంతమైన దూతగా ఉండడం గురించి యేసు చెప్తున్నాడు.—యోహాను 8:56-58.

నేను అబ్రాహాము కన్నా ముందే ఉన్నానని యేసు అనడంతో యూదులకు చాలా కోపమొచ్చి, ఆయన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారు. అయితే యేసు అక్కడ నుండి తప్పించుకున్నాడు.

  • తన తండ్రి, తన శత్రువుల తండ్రి ఒక్కరు కాదని యేసు ఎలా తెలియజేశాడు?

  • అబ్రాహాము తమ తండ్రి అని యూదులు వాదించడం ఎందుకు సరైనది కాదు?

  • యేసు అనుచరులు ఏవిధంగా ‘ఎప్పటికీ చనిపోరు’?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి