కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 3/1 పేజీలు 16-21
  • రాజ్య నిరీక్షణయందు సంతోషించుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్య నిరీక్షణయందు సంతోషించుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన సంతోషము—హృదయముయొక్క ఒక లక్షణము
  • సమస్యలున్నను నిరీక్షణయందు సంతోషించుట
  • మన నిరీక్షణను సన్నిహితంగా మనస్సునందుంచుకొనుట
  • పరదైసు నిరీక్షణయందు ఇప్పుడు సంతోషించుట
  • జీవితమును జీవించుటకు యోగ్యమైనదానిగా చేయు నిరీక్షణ
  • నిరీక్షణ మనల్ని నిరాశపర్చదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవాకొరకు నిరీక్షిస్తూ ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవా యందు ఆనందించుడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 3/1 పేజీలు 16-21

రాజ్య నిరీక్షణయందు సంతోషించుడి!

‘నిరీక్షణయందు సంతోషించుచు . . . శ్రమయందు ఓర్పు గలవారైయుండుడి.’—రోమీయులు 12:12.

1. యెహోవా సహవాసమునందు మనమెందుకు సంతోషమును కనుగొనగలము, అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఏమి చేయవలెనని గట్టిగా కోరెను?

“శ్రీమంతుడగు (సంతోషముగల NW) దేవుడు.” (1 తిమోతి 1:11) యెహోవాను అది ఎంత చక్కగా వర్ణించుచున్నది! ఎందుకు? ఎందుకనగా ఆయన కార్యములన్నియు తనకు మహా సంతోషమును కలిగించును. సంతోషకరమైన మరియు మంచివైన సమస్త విషయములకు యెహోవాయే మూలమైయున్నందున, ఆయనచే సృజించబడిన జ్ఞానముగల ప్రాణులందరు ఆయన సహవాసమునందు సంతోషమును పొందగలరు. అందుకే అపొస్తలుడైన పౌలు యుక్తమైనరీతిలో, యెహోవాదేవుని తెలుసుకొనుటలోని వారి సంతోషభరితమైన ఆధిక్యతను గుణగ్రహించి, ఆయన అద్భుతమైన వరములన్నిటియెడల కృతజ్ఞత కలిగియుండి, వారియెడల ఆయన చూపు మితిలేని కృపయందు సంతోషించుడని క్రైస్తవులను కోరెను. పౌలు ఇలా వ్రాసెను: “ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలిప్పీయులు 4:4; కీర్తన 104:31.

2. ఏ నిరీక్షణ గొప్ప సంతోషమును తెచ్చును, ఈ నిరీక్షణ విషయంలో క్రైస్తవులు ఏమి చేయవలెనని ప్రోత్సహించబడిరి?

2 పౌలు అందించిన ఈ ఉద్బోధను క్రైస్తవులు గైకొంటున్నారా? అవును, వారు అలా చేయుచున్నారు. యేసుక్రీస్తుయొక్క ఆత్మీయ సహోదరులు దేవుడు వారికొరకు అందించిన మహిమావంతమైన నిరీక్షణయందు ఆనందించుచున్నారు. (రోమీయులు 8:19-21; ఫిలిప్పీయులు 3:20, 21) అవును, ఆయనయొక్క పరలోక రాజ్యప్రభుత్వములో క్రీస్తుతో పాటు సేవచేయుటద్వారా, సజీవులు మరియు మృతులైయున్న మానవజాతియొక్క భవిష్యత్తు నిమిత్తమైయున్న గొప్ప నిరీక్షణను నెరవేర్చుటలో వంతు కలిగియున్నారని వారికి తెలుసును. సహవారసులుగా, రాజులగాను, యాజకులగాను సేవచేయు ఆధిక్యతలో వారు ఎంతగా సంతోషించెదరో ఊహించుము! (ప్రకటన 20:6) నమ్మకస్థులైన మానవజాతి పరిపూర్ణతను సంపాదించుటకు సహాయపడుట, భూమిపై పరదైసును తిరిగి స్థాపించునట్లు చేయుటలో సహాయపడి నడిపింపునిచ్చుటలో వారు ఎటువంటి సంతోషమును పొందుదురు! నిశ్చయముగా, దేవుని సేవకులందరు ‘అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే ప్రమాణముచేసిన నిత్యజీవమును పొందు నిరీక్షణకు ఆధారమును కలిగియున్నారు.’ (తీతు 1:2) ఈ నిరీక్షణ దృష్ట్యా, క్రైస్తవులందరిని అపొస్తలుడైన పౌలు: ‘నిరీక్షణయందు సంతోషించుడి’ అని ప్రోత్సహించుచున్నాడు.—రోమీయులు 12:12.a

నిజమైన సంతోషము—హృదయముయొక్క ఒక లక్షణము

3, 4. (ఎ) “సంతోషించుట” అను పద భావమేమి, ఎంత తరచుగా క్రైస్తవులు సంతోషిస్తూ ఉండవలెను? (బి) నిజమైన ఆనందమేమి, అది దేనిపై ఆధారపడియున్నది?

3 “సంతోషించుట” అనగా ఆనందమైన భావనను పొంది, దానిని వ్యక్తపరచుటయని భావము; ఎప్పుడూ ఊరకనే ఉత్సాహంగా పొంగిపోతూ పుష్కలంగా ఉండుటయని దాని భావము కాదు. బైబిలులో “ఆనందము,” “ఉత్సాహము,” “సంతోషము” అను వాటికి సారూప్యముగా ఉపయోగించబడిన హెబ్రీ మరియు గ్రీకు పదములు సంతోషమును అంతర్గతంగా భావించుకొంటూ, బయటకు ప్రదర్శించుటను తెలియజేయుచున్నవి. క్రైస్తవులు “సంతోషమందు కొనసాగుతుండాలని”, “ఎల్లప్పుడు సంతోషించుడని” ప్రోత్సహించబడుచున్నారు.—2 కొరింథీయులు 13:11 NW; 1 థెస్సలొనీకయులు 5:16.

4 అయితే ఒకరు ఎల్లప్పుడు ఎట్లు సంతోషిస్తూ ఉండగలరు? నిజమైన సంతోషము హృదయముయొక్క లక్షణమై, ఆత్మసంబంధమైనది మరియు లోతైన అంతర్గత లక్షణమైయున్నందున ఇది సాధ్యము. (ద్వితీయోపదేశకాండము 28:47; సామెతలు 15:13; 17:22) అది దేవుని ఆత్మఫలమై, పౌలువలన ప్రేమ తరువాత లిఖించబడియున్నది. (గలతీయులు 5:22) ఒక అంతర్గత లక్షణముగా, అది బయటివిషయములపైన లేక సహోదరులపైనయైనను ఆధారపడదు. అది దేవుని పరిశుద్ధాత్మపై ఆధారపడును. నీవు సత్యమును, రాజ్యనిరీక్షణను కలిగియుండి యెహోవాను సంతోషపెట్టుదానిని చేయుచున్నావను లోతైన అంతర్గత తృప్తినుండి అది వచ్చును. కావున, సంతోషమనేది పుట్టుకతో వచ్చే వ్యక్తిత్వపు లక్షణము కాదు; యేసుక్రీస్తును ప్రత్యేకపరచినట్టి సకలలక్షణములతో కూర్చబడిన “నవీన స్వభావములో” అది భాగమైయున్నది.—ఎఫెసీయులు 4:24; కొలొస్సయులు 3:10.

5. ఎప్పుడు మరియు ఎట్లు సంతోషమును బయటకు వ్యక్తముచేయునవి యుండవచ్చును?

5 సంతోషము హృదయముయొక్క లక్షణమైనను, సందర్భాన్నిబట్టి దానిని బయటకు చూపించవచ్చును. సందర్భానుసారంగా, ఈ సంతోషమును బయటకు వ్యక్తపరచునవి ఏవి? అవి ముఖములో కన్పించు నిర్మలమైన స్థితినుండి ఆనందముతో గంతులువేయుట వరకు ఏదైనా కావచ్చును. (1 రాజులు 1:40; లూకా 1:44; అపొస్తలుల కార్యములు 3:8; 6:15) అందుచేత, బాగా మాట్లాడకుండా ఉండేవారికి లేక ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండనివారికి సంతోషములేదని దీని భావమా? కాదు. నిజమైన సంతోషము ఎప్పుడూ ఊరక మాట్లాడుటలోను, నవ్వులోను, ముసిముసి నవ్వు లేక ఇగిలింతలు పెట్టుటలోను వ్యక్తము కాదు. పరిస్థితులు సంతోషము దానంతటదే వివిధరీతులలో వ్యక్తమవునట్లు చేయును. రాజ్యమందిరములో మనలను అందరితో కలసిపోవునట్లు చేయునది కేవలము సంతోషమేగాక, మన సహోదర అనురాగము మరియు ప్రేమయైయున్నది.

6. క్రైస్తవులు అసంతోషకర పరిస్థితులను ఎదుర్కొనునప్పుడును, ఎందుకు ఎల్లప్పుడు సంతోషముగా ఉండగలరు?

6 సంతోషముయొక్క నిలకడైన ఆకృతియేమనగా క్రైస్తవ నవీన స్వభావములోని ఒక హృదయపూర్వకమైన అంశముగా దాని అంతర్గత దృఢత్వము. ఎల్లప్పుడు సంతోషిస్తూయుండుటకు సాధ్యమయ్యేలా చేయునది ఇదియే. అవును, కొన్నిసార్లు ఏదైనా ఒకదానివలన మనము కలతచెందవచ్చును లేక మనము అసంతోషకర పరిస్థితులను ఎదుర్కొనవచ్చును. అయితే, అప్పటికిని మనము హృదయమందు సంతోషమును కలిగియుండవచ్చును. తొలి క్రైస్తవులలో కొందరు సంతోషపెట్టుటకు మహాకష్టమైన యజమానుల క్రింద దాసులైయుండిరి. మరి అటువంటి క్రైస్తవులు ఎల్లప్పుడు సంతోషముగా ఉండగలిగిరా? ఔను, వారు కలిగియున్న రాజ్యనిరీక్షణనుబట్టి, మరియు హృదయములయందలి సంతోషమునుబట్టి వారు అలా ఉండగలిగిరి.—యోహాను 15:11; 16:24; 17:13.

7. (ఎ) శ్రమయందు సంతోషమునుగూర్చి యేసు ఏమి చెప్పెను? (బి) శ్రమయందు సహించుటకు ఏమి సహాయముచేయును, ఈ విషయంలో శ్రేష్టమైన మాదిరిని ఎవరు ఉంచారు?

7 “నిరీక్షణయందు సంతోషించుడి” అని చెప్పిన వెంటనే అపొస్తలుడైన పౌలు “శ్రమయందు ఓర్పు కలిగియుండుడి” అని చెప్పెను. (రోమీయులు 12:12) మత్తయి 5:11, 12లో యేసు కూడా శ్రమయందు సంతోషమునుగూర్చి ఇట్లు చెప్పెను: “జనులు మిమ్మును నిందించి హింసించినప్పుడు . . . సంతోషించి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” అవును, ఇచ్చట సంతోషించి, ఆనందించుటయనేది అక్షరార్థముగా బయటకు ప్రత్యక్షమయ్యేదిగా ఉండనవసరములేదు. ముఖ్యముగా అది శోధనయందు స్థిరముగా నిలబడి యెహోవాను మరియు యేసుక్రీస్తును సంతోషపెట్టుటలో ఒకడుపొందు లోతైన అంతర్గత తృప్తియైయున్నది. (అపొస్తలుల కార్యములు 5:41) వాస్తవానికి, శ్రమయందు సహించుటకు మనకు సహాయముచేయునది సంతోషమే. (1 థెస్సలొనీకయులు 1:6) ఈ విషయంలో యేసు మంచి మాదిరినుంచెను. లేఖనములు మనకు ఇలా చెప్పుచున్నవి: “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై ఆయన అవమానమును నిర్లక్షపెట్టి, హింసా మ్రానును సహించెను.”—హెబ్రీయులు 12:2 NW.

సమస్యలున్నను నిరీక్షణయందు సంతోషించుట

8. ఏ సమస్యలను క్రైస్తవులు ఎదుర్కొనవచ్చును, అయితే సమస్యలు క్రైస్తవ సంతోషమును ఎందుకు తీసివేయవు?

8 ఒకడు యెహోవా సేవకుడైనంతమాత్రమున అది అతనిని సమస్యలనుండి స్వతంత్రుని చేయదు. కుటుంబ సమస్యలు, ఆర్ధిక కష్టములు, దెబ్బతినిన ఆరోగ్యము, లేక ప్రియమైనవారిని మరణమందు కోల్పోవుట ఉండవచ్చును. అలాంటివి దుఃఖమును కలుగజేసినను, రాజ్యనిరీక్షణయందు సంతోషించుటకుగల ఆధారమును, హృదయమందు మనకుగల అంతర్గత ఆనందమును అవి తీసివేయవు.—1 థెస్సలొనీకయులు 4:13.

9. అబ్రాహాము ఏ సమస్యలను కలిగియుండెను, ఆయన హృదయమందు ఆనందమును కలిగియుండెనని మనకెట్లు తెలియును?

9 ఉదాహరణకు అబ్రాహామును పరిశీలించుము. జీవితము ఆయనకు ఎల్లప్పుడు ఆనందముగా లేదు. ఆయనకు కుటుంబ సమస్యలున్నవి. తన ఉపపత్నియైన హాగరు, భార్యయైన శారాలు ఒద్దికగా కలసివెళ్లుట లేదు. వారి మధ్య జగడమున్నది. (ఆదికాండము 16:4, 5) ఇష్మాయేలు అపహాస్యముచేయుచు ఇస్సాకును హింసించుచున్నాడు. (ఆదికాండము 21:8, 9; గలతీయులు 4:29) చివరకు అబ్రాహాముకు ప్రియమైన భార్యయగు శారా మరణించినది. (ఆదికాండము 23:2) ఈ సమస్యలన్ని ఉన్నను, భూలోకమందలి జనములందరు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడుదురో ఆ అబ్రాహాము సంతానమందు, అనగా రాజ్యసంతానమందలి నిరీక్షణయందు ఆయన సంతోషించెను. (ఆదికాండము 22:15-18) హృదయమందున్న సంతోషమునుబట్టి, తన స్వంత పట్టణమైన ఊరును విడిచివెళ్లిన తరువాత యెహోవా సేవలో నూరు సంవత్సరములు ఆయన సహించెను. అందుకే ఆయనను గూర్చి ఇలా వ్రాయబడినది: “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.” రానైయున్న మెస్సియా రాజ్యమందు అబ్రాహాము కలిగియున్న విశ్వాసమునుబట్టి, ప్రభువైన యేసు, రాజుగా దేవునిచే నియమించబడినప్పుడు ఇట్లు చెప్పగలిగెను: “అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను.”—హెబ్రీయులు 11:10; యోహాను 8:56.

10, 11. (ఎ) క్రైస్తవులుగా మనము ఏ పోరాటమును కలిగియున్నాము, మనమెట్లు రక్షించబడితిమి? (బి) మన పాపపు శరీరమునకు వ్యతిరేకముగా పరిపూర్ణముగా పోరాడు మన అశక్తతను ఏది పూర్తిచేయును?

10 అసంపూర్ణులైన మానవులుగా మనము కూడా పోరాడుటకు మన పాపపు శరీరములను కలిగియున్నాము. సరియైన దానిని చేయుటకైన ఈ పోరాటము ఎంతో బాధాకరముగా ఉండగలదు. మన బలహీనతయెడల మనము పోరాడుట అనగా మనలో నిరీక్షణ లేదని దాని భావము కాదు. ఈ పోరాటముయెడల పౌలు దౌర్భాగ్యునిగా యెంచుకొని ఇలా అనెను: “ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:24, 25) యేసుక్రీస్తుద్వారా మరియు ఆయన అందించిన విమోచన క్రయధనము ద్వారా మనము రక్షించబడియున్నాము.—రోమీయులు 5:9-21.

11 పోరాటమును పరిపూర్ణముగా పోరాడలేని మన అశక్తతను క్రీస్తుయొక్క విమోచన క్రయధనపు బలి సంపూర్ణముచేయును. అది మనకు పవిత్రమైన మనస్సాక్షినిచ్చి, మన పాపములకు క్షమాపణను సాధ్యపరచును గనుక మనము ఈ విమోచన క్రయధనమునందు సంతోషించగలము. హెబ్రీయులు 9:14 నందు, పౌలు ‘మన నిర్జీవ క్రియలనుండి . . . మన మనస్సాక్షిని శుద్ధిచేయు’ “క్రీస్తుయొక్క రక్తమునుగూర్చి” మాట్లాడుచున్నాడు. కావున, క్రైస్తవుల మనస్సాక్షి ఖండింపబడుట లేక దోషపూరితమైన భావనలచేత బరువెక్కి క్రుంగిపోనవసరములేదు. ఇది మరియు మనము కలిగియున్న నిరీక్షణ ఆనందభరితమైన సంతోషమునకు బలమైన శక్తినిస్తుంది. (కీర్తన 103:8-14; రోమీయులు 8:1, 2, 32) మన నిరీక్షణను తలపోయుట ద్వారా ఆ పోరాటమును విజయవంతముగా సాగించుటకు మనమందరము ప్రోత్సహించబడుదుము.

మన నిరీక్షణను సన్నిహితంగా మనస్సునందుంచుకొనుట

12. అభిషక్త క్రైస్తవులు ఏ నిరీక్షణను తలపోయవచ్చును?

12 ఆత్మాభిషేకపు శేషము మరియు గొప్పసమూహము ‘రక్షణయను నిరీక్షణను’ మనస్సునందుంచుకొని, దానిని రక్షణకరమైన శిరస్త్రాణముగా ధరించుకొనియుండుట ప్రాముఖ్యము. (1 థెస్సలొనీకయులు 5:8) అభిషక్త క్రైస్తవులు, యెహోవాదేవునియొద్దకు వెళ్లుట, మహిమపర్చబడిన యేసుక్రీస్తు, అపొస్తలులు, శతాబ్దముల కాలములలో తమ యథార్థతను కాపాడుకొనిన ఇతర 1,44,000 మందితో వ్యక్తిగత సహవాసములో పరలోకమందు అమర్త్యతను పొందు ఆధిక్యతను తలపోయవచ్చును. వర్ణింపశక్యముగాని ఎంతటి విలువైన సహవాసము!

13. ఇంకను భూమిపైనున్న అభిషక్త క్రైస్తవులు వారి నిరీక్షణనుగూర్చి ఎట్లు భావింతురు?

13 ఇంకను భూమిపైయున్న అభిషక్తులైన కొద్దిమంది తమ రాజ్య నిరీక్షణనుగూర్చి ఎట్లు భావింతురు? 1913లో బాప్తిస్మము పొందిన ఒకరి మాటలలో దీనిని ఇట్లు క్లుప్తీకరించవచ్చును: “మా నిరీక్షణ నిశ్చయమైనది. చిన్నమందయొక్క 1,44,000 లోని చివరి సభ్యునివరకు మేము ఊహించినదానికంటే ఎంతో ఉన్నతముగా అది నెరవేరును! మేము పరలోకమునకు వెళ్తామని కనిపెట్టిన 1914వ సంవత్సరమున జీవించియున్నట్టి మాలో ఆ నిరీక్షణయొక్క విలువ ఏ మాత్రము గతించలేదు. మేము ఎప్పుడూ ఉన్నంత బలంగానే ఉన్నాము. మేము దానిని గూర్చి ఎంత ఎక్కువకాలము కనిపెట్టవలసియుంటే అంత ఎక్కువగా దానిని గుణగ్రహిస్తున్నాము. చివరకు 10 లక్షల సంవత్సరములు కనిపెట్టవలసియున్నను అది కనిపెట్టుటకు యోగ్యమైనది. క్రితమెన్నటికంటెను మా నిరీక్షణను ఉన్నతమైనదానిగా నేను ఎంచుతున్నాను. మరియు దాని కొరకైన గుణగ్రహణను నేనెన్నడు పోగొట్టుకొన కోరుకొనను. చిన్నమందయొక్క నిరీక్షణ వేరేగొర్రెలలోని గొప్పసమూహపు నిరీక్షణకూడ ఎట్టి విఫలతలేకుండా మన ఊహకుమించి నెరవేరునని అభయమిచ్చుచున్నది. అందుకే ఈ ఘడియవరకు దానిని హత్తుకొనియున్నాము. దేవుడు తన “అమూల్యములును, అత్యధికములునైన వాగ్దానములను” నెరవేర్చువాడని రుజువయ్యేంతవరకు వారు దానికి హత్తుకొనియుందురు.—2 పేతురు 1:4; సంఖ్యాకాండము 23:19; రోమీయులు 5:5.

పరదైసు నిరీక్షణయందు ఇప్పుడు సంతోషించుట

14. గొప్పసమూహము ఏ నిరీక్షణను మనస్సునందుంచుకొనవలెను?

14 జయమునొసంగు అట్టి సంతోషభరితమైన సంగతే వేరేగొర్రెలలోని గొప్పసమూహము సంతోషించుటకు గొప్పకారణములను అందించుచున్నది. (ప్రకటన 7:15, 16) అటువంటివారు ఆర్మగెద్దోనునందు రక్షింపబడు నిరీక్షణను మనస్సునందుంచుకొనవలెను. అవును, దేవుని రాజ్యము యెహోవాదేవుని సార్వభౌమాధిపత్యపు సత్యత్వమును రుజువుపరచి, అపవాదిని దేవునిగా కలిగియున్న దుష్టులైనవారిని భూమిమీదనుండి తుడిచివేయు మహాశ్రమలను తెచ్చుటద్వారా ఆయన మహిమగల నామమును ఘనపరచుటను చూచుటకు ఎదురుచూడుము. ఆ మహాశ్రమలయందు తప్పించబడుట ఎంతటి ఆనందము!—దానియేలు 2:44; ప్రకటన 7:14.

15. (ఎ) యేసు భూమిమీదనున్నప్పుడు స్వస్థపరచు ఏ పనిని చేసెను, ఎందుకు? (బి) ఆర్మగెద్దోనునందు రక్షించబడినవారి ఆరోగ్య అవసరతలు ఏమైయుండును, మరియు పునరుత్థానమగువారికి వారు ఎందుకు భిన్నముగా ఉందురు?

15 గొప్పసమూహమునుగూర్చి ప్రకటన 7:17 ఇట్లు చెప్పుచున్నది: “గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” ప్రస్తుతము ఈ ప్రవచనము ఆత్మీయ నెరవేర్పును కలిగియున్నను ఆర్మగెద్దోనులో రక్షించబడువారు అది అక్షరార్ధముగా నెరవేరుటను చూచుదురు. ఎట్లు? భూమిపైనున్నప్పుడు యేసు ఏమి చేసెను? అంగవైకల్యముగలవారిని బాగుచేసెను. కుంటివారికి నడకనిచ్చెను. చెవిటివారికి చెవులను, గ్రుడ్డివారికి చూపును ఇచ్చెను. కుష్టరోగము, పక్షవాతముతో సహా “ప్రతివిధమైన రోగమును, ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచెను.” (మత్తయి 9:35; 15:30, 31) ఈనాడు క్రైస్తవులకు అవసరమైనది అదే కాదా? గొప్పసమూహము వారికున్న అంగవైకల్యములు, రోగములతోనే నూతనలోకములోనికి ప్రవేశింతురు. వాటిని గూర్చి గొఱ్ఱెపిల్ల ఏమిచేయవలెనని మనము కోరుకొందుము? ఆర్మగెద్దోనులో రక్షించబడినవారి అవసరతలు పునరుత్థానమగువారి అవసరతలకు ఎంతో భిన్నముగా ఉండును. చాలావరకు పునరుత్థానమైనవారు మానవ పరిపూర్ణతను ఇంకా పొందకున్నను, వారు మంచివైన, పూర్ణమైన, ఆరోగ్యవంతమైన శరీరములతో తిరిగి సృజింపబడుదురురు. అద్భుతకరమగు పునరుత్థానమును పొందుచున్నందుచేత, వారు గతమందలి అంగవైకల్యములతో అద్భుతంగా స్వస్థపరచబడనక్కరలేదు. అయితే, ఆర్మగెద్దోనునందు రక్షించబడు అద్వితీయమైన అనుభవమును పొందుచున్నందువలన, గొప్పసమూహములోని అనేకులకు అద్భుతకరమైన స్వస్థత అవసరమవుతుంది. వారు దానిని పొందుదురు. స్పష్టముగా, గతమందలి యేసు స్వస్థతల ముఖ్య ఉద్దేశ్యము, గొప్పసమూహము రక్షించబడుటయేగాక, ఆ తదుపరి వారు స్వస్థపరచబడుదురను సంతోషకరమైన ఉత్తరాపేక్షను ప్రోత్సహకరముగా వారికి ప్రదర్శించుటయే.

16. (ఎ) ఆర్మగెద్దోనునందు రక్షించబడువారి అద్భుతమైన స్వస్థత ఎప్పుడు జరగవచ్చును, ఏ ఫలితముతో? (బి) వెయ్యేండ్లకాలములో ఏ నిరీక్షణయందు సంతోషించుటలో మనము కొనసాగుదుము?

16 ఆర్మగెద్దోనునందు రక్షించబడువారిలో అటువంటి అద్భుతకర స్వస్థత సహేతుకంగా దాదాపు ఆర్మగెద్దోను అయిన వెంటనే, పునరుత్థానము ప్రారంభమగుటకు బాగా ముందుగా జరుగును. (యెషయా 33:24; 35:5, 6; ప్రకటన 21:4; మార్కు 5:25-29ని పోల్చుము.) ప్రజలు ఇక కళ్లద్దాలను, చేతి కఱ్ఱలను, చంకల క్రింది కర్రలను, వీల్‌ ఛైర్లను, కట్టుడు పళ్లను, వినుటకు చెవులకు పెట్టుకొన్న యంత్రములు మొదలగువాటిని విసిరిపారవేతురు. సంతోషించుటకు ఎంత మంచి కారణము! నూతన భూమియొక్క పునాదిగా ఆర్మగెద్దోనునందు రక్షించబడువారి పాత్రకు యేసుయొక్క పునరుద్ధరించు ఆ తొలి చర్య ఎంతగా సరిపోతుంది! వారిని అంగవికలులుగాచేయు దుఃఖకరవిషయములు గతించుటతో ఈ రక్షించబడువారలు వేలకొలది సంవత్సరములకు తమయెదుట ఉంచబడిన కార్యముకొరకు ఆసక్తితో ఎదురుచూస్తూ, ఈ పాతలోకము వారికి కలుగజేసిన నొప్పులను బట్టి వెనుకకు లాగబడరు. అవును, చివరకు ఆర్మగెద్దోను తరువాత కూడా గొప్పసమూహము వెయ్యిసంవత్సరముల అంతమునకు మానవజీవిత పరిపూర్ణతను పొందు అద్భుతకర నిరీక్షణయందు సంతోషించుటలో కొనసాగుదురు. వేయ్యేండ్ల పరిపాలనా కాలమందంతటిలో ఆ సంతోషకరమైన గురిని పొందు నిరీక్షణయందు సంతోషిస్తూ ఉందురు.

17. పరదైసును పునరుద్ధరించు పని జరుగుతుండగా ఏ ఆనందములు ఉండును?

17 నీ నిరీక్షణ అదేయైతే, భూమిని పరదైసుగా పునరుద్ధరించుటలో పాల్గొనుటయందలి సంతోషమును తలపోయుము. (లూకా 23:42, 43) ఆర్మగెద్దోనునందు రక్షించబడువారలు భూమిని శుభ్రముగా చేయుటలో సహాయపడుతూ, నిశ్చయముగా, పునరుత్థానము కాబోవు మృతులకు ఆహ్లాదకరమైన స్థలములను సిద్ధపరచుదురు. అంత్యక్రియల కార్యక్రమముల స్థానములో మరణించిన మన ప్రియమైనవారితో సహా, పునరుత్థానమందు తేబడు వారిని ఆహ్వానించు కార్యక్రమములు ఉండును. గత శతాబ్దములనాటి నమ్మకస్థులైన స్త్రీ, పురుషులతో బలపరచునట్టి సహవాసమునుగూర్చి తలంచుము! ప్రత్యేకంగా నీవు ఎవరితో మాట్లాడుటకు ఇష్టపడుదువు? హేబెలు, హనోకు, నోవహు, యోబు, అబ్రాహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ, రాహాబు, దెబోరా, సంసోను, దావీదు, ఏలియా, ఎలీషా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, లేకా బాప్తిస్మమిచ్చు యోహాను తోనా? అట్లయిన, ఈ ఆనందదాయకమైన ఉత్తరాపేక్ష కూడా నీ నిరీక్షణలో భాగమే. నీవు వారితో మాట్లాడగలిగి, వారినుండి నేర్చుకొని, ఈ భూమినంతటిని పరదైసుగా మార్చుటలో వారితో కలిసి పనిచేయుదువు.

18. ఏ ఇతర ఆనందములను మనము తలపోయవచ్చును?

18 ఆరోగ్యవంతమైన ఆహారము, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన గాలితో, భూమి ఏవిధముగా ఉండాలని యెహోవాదేవుడు సృష్టించాడో అట్టి పర్యావరణ సమతూకమునకు భూమి తిరిగి తేబడుటను ఊహించుము. పరిపూర్ణతయందు జీవితము ఏదో స్తబ్దతతో కూడినది కాక, ఆనందదాయకమైన కార్యములలో చురుకుగా అర్ధవంతముగా పాల్గొనేదైయుండును. ప్రపంచమంతట నేరము, అతిశయభావము, ఈర్ష్య, జగడము లేకయున్నట్టి ప్రజలుగల సమాజమును,—అందరివలన ఆత్మఫలములు సాధకముచేయబడి, ఫలింపచేయబడుటద్వారా ఏర్పడిన సహోదరత్వమును తలపోయుము. ఎంతటి పులకరింతను కలుగజేయునది!—గలతీయులు 5:22, 23.

జీవితమును జీవించుటకు యోగ్యమైనదానిగా చేయు నిరీక్షణ

19. (ఎ) రోమీయులు 12:12లో చెప్పబడిన సంతోషము ఎప్పుడు అనుభవించవలసినది? (బి) జీవిత భారములు మన నిరీక్షణను ప్రక్కకు త్రోసివేయునట్లు అనుమతించకుండా మనమెందుకు తీర్మానించుకొనవలెను?

19 నెరవేరిన ఆశ ఇక ఎంతమాత్రము నిరీక్షణ కాదు. అందుచేత రోమీయులు 12:12 నందు పౌలుచే ప్రోత్సహించబడిన సంతోషము ప్రస్తుతము అనువభవించవలసినదే. (రోమీయులు 8:24) కేవలము భవిష్యత్తులో దేవునిరాజ్యము తెచ్చు ఆశీర్వాదములను తలంచుటయే ఆ నిరీక్షణయందు ఇప్పుడు సంతోషించుటకు కారణమగును. కావున మలినమైన లోకములోని జీవిత భారములు మహిమాయుక్తమైన నీ నిరీక్షణను ప్రక్కకు నెట్టివేయుటను అనుమతించకుండునట్లు తీర్మానించుకొనుము. అలసిపోయి, ముందున్న నిరీక్షణను చూడలేనివానిగా దానిని వదలివేయకుము. (హెబ్రీయులు 12:3) క్రైస్తవ విధానమును విడిచిపెట్టుట నీ సమస్యలను పరిష్కరించదు. ఒకరు ప్రస్తుత జీవిత భారములనుబట్టి దేవుని ఇప్పుడు సేవించుటను మానివేసినట్లయిన, అతను ఇంకను ఆ భారములతోనే యుండి, నిరీక్షణను కోల్పోయి, ముందున్న అద్భుతకర ఉత్తరాపేక్షలయందు సంతోషించు అవకాశమును పోగొట్టుకొనునని గుర్తుంచుకొనుము.

20. దానిని హత్తుకొనువారిపై రాజ్య నిరీక్షణ ఏ ప్రభావమును కలిగియుండును, ఎందుకు?

20 సంతోషభరితమైన జీవితములను కలిగియుండుటకు యెహోవాప్రజలు ప్రతి కారణమును కలిగియున్నారు. తేజోవంతమైన, ప్రేరేపణకరమైన వారి నిరీక్షణ జీవితమును జీవించుటకు యోగ్యమైనదానిగా చేయుచున్నది. ఈ సంతోషభరితమైన నిరీక్షణను వారు తమమట్టుకు తమలోనే ఉంచుకొనరు. దానిని ఇతరులతో పంచుకొనుటకు వారు ఆతురపడుదురు. (2 కొరింథీయులు 3:12) అందువలన రాజ్యనిరీక్షణను హత్తుకొను వారు నమ్మకముగల ప్రజలై, దేవుని నుండి వచ్చు సువార్తను చెప్పుటద్వారా ఇతరులను ప్రోత్సహించుటకు చూచెదరు. ఇది వర్తమానమును అంగీకరించు ప్రజల జీవితములను, మానవజాతికి సాధారణముగా ఎల్లప్పుడూ ఇవ్వబడియున్న అద్భుతకర నిరీక్షణతో అనగా భూమిని పరదైసుగా తిరిగితెచ్చు రాజ్యముయొక్క నిరీక్షణతో నింపును. ఒకవేళ ప్రజలు దానిని అంగీకరించకపోయినను, మనము ఆ నిరీక్షణను కలిగియున్నందున దానియందు సంతోషించుటలో కొనసాగుదుము. దానిని పెడ చెవినబెట్టువారు పోగొట్టుకొందురు. మనము అట్లు పోగొట్టుకొనము.—2 కొరింథీయులు 4:3, 4.

21. ఏమి సమీపముగా ఉన్నది, మనము మన నిరీక్షణను ఎట్లు ఉన్నతపరచుకొనవలెను?

21 దేవుని వాగ్దానము ఇట్లున్నది: “ఇదిగో! నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను.” (ప్రకటన 21:5) నూతనలోకము దాని పులకరింపజేయు, నిత్య ఆశీర్వాదములతో సమీపముగా ఉన్నది. మన నిరీక్షణ—పరలోక జీవితమైనను, లేక భూపరదైసు జీవితమైనను—అది ప్రశస్తమైనది; దానికి హత్తుకొనియుండుము. క్లిష్టమైన ఈ అంత్యదినములలో, క్రితమెన్నటికంటెను, దానిని ‘మన ఆత్మకు నిశ్చలమైన, స్థిరమైన లంగరువలె’ దృష్టించుము. ‘నిత్యాశ్రయ బండ, యుగయుగములకు దుర్గమైన’ యెహోవాయందు లంగరువలె పాతుకుపోయిన నిరీక్షణతో, నిశ్చయముగా మనయెదుట ఉంచబడిన “నిరీక్షణయందు సంతోషించుటకు” మనకు బలమైన మరియు ఉల్లాసభరితమైన కారణమున్నది.—హెబ్రీయులు 6:19; యెషయా 26:4, ది ఏంప్లిఫైడ్‌ బైబిలు. (w91 12/15)

[అధస్సూచీలు]

a యెహోవాసాక్షులు 1992వ సంవత్సరము, ప్రపంచవ్యాప్తముగా “నిరీక్షణయందు సంతోషించుచు . . . ప్రార్థనయందు పట్టుదలగలిగియుండుడి” అనుదానిని సాంవత్సరిక వచనముగా కలిగియుందురు.—రోమీయులు 12:12.

పునఃసమీక్ష ప్రశ్నలు

◻ మానవజాతి గొప్ప నిరీక్షణ ఏమి?

◻ నిజమైన సంతోషము ఏమి?

◻ చాలావరకు ఆర్మగెద్దోనునందు రక్షించబడువారి అద్భుతకర స్వస్థత ఎప్పుడు జరుగును?

◻ జీవిత భారములు మన నిరీక్షణను ప్రక్కకు త్రోసివేయునట్లు మనమెందుకు అనుమతించకూడదు?

◻ నూతనలోకములోని ఏ ఆనందములకొరకు నీవు ఎదురు చూచుదువు?

[17వ పేజీలోని చిత్రాలు]

యేసు చేసినలాంటి స్వస్థతలను చూచుట మీ హృదయమును సంతోషముతో నింపదా?

[18వ పేజీలోని చిత్రాలు]

రాజ్యమునందు సంతోషించువారు వారి నిరీక్షణను పంచుకొనుటద్వారా ఇతరులను ప్రోత్సహింతురు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి