“పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడండి”
యేసు ఈ మాటలను 19 సంవత్సరాలకు పూర్వం చెప్పినప్పుడు, ఆయన తన శిష్యులను హానికరమైన మతపర బోధలనుండి మరియు ఆచారాలనుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. (మత్తయి 16:6, 12) మార్కు 8:15 నందున్న వృత్తాంతం ఇలా వివరిస్తోంది: “చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్తపడుడి.” హేరోదు ఎందుకు ప్రస్తావించబడ్డాడు? ఎందుకంటే, సద్దూకయ్యుల్లో కొందరు ఒక రాజకీయ గుంపైన హేరోదీయులకు చెందినవారు.
అలాంటి ప్రత్యేక హెచ్చరిక ఎందుకంత తప్పనిసరి అయ్యింది? పరిసయ్యులూ సద్దూకయ్యులిరువురూ యేసుకు తీవ్ర వ్యతిరేకులు కారా? (మత్తయి 16:21; యోహాను 11:45-50) అవును, వాళ్లు వ్యతిరేకులే. అయినప్పటికీ, పిమ్మట వారిలో కొందరు క్రైస్తవత్వాన్ని అంగీకరించి, తర్వాత క్రైస్తవ సంఘంపై తమ ఆలోచనలను రుద్దేందుకు ప్రయత్నిస్తారు.—అపొస్తలుల కార్యములు 15:5.
ఎవరి ప్రభావంలో వారు పెరిగారో ఆ మతనాయకులనే శిష్యులు అనుకరించగల అపాయం కూడా ఉంది. కొన్నిసార్లు, అలాంటి మత జీవన గమనం నుండి రావడమే వారు యేసు బోధల భావాన్ని పొందేందుకు అటంకంగా ఉండేది.
పరిసయ్యత్వమునూ సద్దూకయ్యత్వమును ఏది అంత అపాయకరం చేసింది? యేసు దినాల్లోని మత పరిస్థితులను ఒకసారి చూడడం మనకొక అభిప్రాయాన్ని అందిస్తుంది.
మత అనైక్యత
సా.శ. మొదటి శతాబ్దంలోని యూదా మతవర్గాన్ని గూర్చి చరిత్రకారుడైన మాక్స్ రాడిన్ ఇలా రాశాడు: “యూదా సంఘంలో ప్రతి ఒక్కరి స్వాతంత్ర్యం చాలా ముఖ్య విషయం మరియు దాన్ని నొక్కి చెప్పేవారు. . . . తరచూ, ఆలయం, పరిశుద్ధ పట్టణం విషయంలో భక్తిశ్రద్ధలు కల్గివుండాలని గట్టిగా నొక్కి చెప్పినప్పుడు, తమ మాతృదేశాధికారుల యెడల తీవ్రమైన ద్వేషం వ్యక్తపర్చబడేది.”
నిజంగా, అది దయనీయమైన ఆత్మీయ పరిస్థితే! దానికి తోడ్పడే కొన్ని విషయాలేమిటి? యూదులందరూ పాలస్తీనాలో నివసించలేదు. యాజకులను మతనాయకులుగా పరిగణించని గ్రీకుల నాగరికతా ప్రభావం, యెహోవా ఏర్పాటు చేసిన యాజకత్వాన్ని చిన్న చూపుచూడడంలో తన వంతును నిర్వహించింది. (నిర్గమకాండము 28:29; 40:12-15) మరి విద్యావంతులైన సామాన్య ప్రజలనూ శాస్త్రులను కూడా మినహాయించకూడదు.
పరిసయ్యులు
పరిసయ్యులు లేక పరిషిమ్ అనే పేరు భావం, “ప్రత్యేకించబడిన వారు.” తాము మోషే అనుచరులని పరిసయ్యులు తమను తాము పరిగణించేవారు. వారు తమ స్వంత సమితిని లేక సంఘాన్ని (హెబ్రీలో, చవురా) ఏర్పాటు చేసుకున్నారు. ఒక వ్యక్తి చేర్చుకోబడాలంటే, లేవీయుల పరిశుద్ధతను తప్పక పాటిస్తాననీ, అమ్హరెట్స్తో (పామర గుంపుతో) సహవసించననీ మరియు కచ్చితంగా పదియవవంతు చెల్లించేటట్లు చూస్తానని ఆ సమితిలోని ముగ్గురు వ్యక్తుల ముందు వాగ్దానం చేయాలి. మార్కు 2:16 “పరిసయ్యులలోనున్న శాస్త్రులను” గూర్చి మాట్లాడుతోంది. వీరిలో కొందరు వృత్తిరీత్యా శాస్త్రులూ బోధకులు, మరితరులు సామాన్య ప్రజలు.—మత్తయి 23:1-7.
పరిసయ్యులు సర్వవ్యాప్తియైన దేవున్ని విశ్వసించేవారు. వారు ఇలా తర్కించేవారు: “దేవుడు ప్రతిచోటా ఉంటాడు కనుక, ఆయన్ను ఆలయం లోపలా వెలుపలా ఆరాధించవచ్చని మరియు కేవలం బలి అర్పణలతో మాత్రమే వేడుకోకూడదు. ఆ విధంగా వారు, ఆరాధన, పఠనం మరియు ప్రార్థనల స్థలంగా సమాజ మందిరాలను వృద్ధి చేశారు మరియు ఆలయంతో పోటిపడే దీన్ని వారు ప్రజల జీవితాల్లో కేంద్రంగానూ ప్రాముఖ్యమైందిగానూ చేశారు.”—ఎన్సైక్లోపీడియా జుడైకా.
యెహోవా ఆలయం విషయంలో పరిసయ్యులకు మెప్పుదల లేదు. దీన్ని యేసు మాటలో చూడవచ్చు: “అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదుగాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టుపెట్టుకొంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు ‘బలిపీఠము తోడని యొకడు ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమియు లేదుగాని, దానిపైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటిన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.”—మత్తయి 23:16-20.
పరిసయ్యులు తమ తర్కంలో అంత వక్రంగా ఎలా తయారయ్యారు? వారు దేన్ని అలక్ష్యం చేస్తున్నారు? యేసు తర్వాత చెప్పినదాన్ని గమనించండి: “మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.” (మత్తయి 23:21) ఈ వచనాన్ని విద్వాంసుడైన ఇ. పి. సాన్డర్స్ ఇలా చెప్పాడు: “పరిశుద్ధ దేవుడు ఆరాధింపబడినందువల్ల మాత్రమే కాదు, ఆయన అక్కడ ఉన్నందువల్ల ఆ ఆలయం పరిశుద్ధమైయుండెను.” (జూడయిసమ్: ప్రాక్టీస్ అండ్ బిలీఫ్, 63 బి.సి.ఇ—66 సి.ఇ) అయినప్పటికీ, యెహోవా అంతటా ఉన్నాడు అనే ఆలోచన గల వారికి ఆయన ప్రత్యేక సాన్నిధ్యం అంత పెద్ద భావాన్నేమీ కల్గివుండదు.
పరిసయ్యులు, విధినిర్ణయం మరియు స్వేచ్ఛాచిత్తాల కలయికను కూడా విశ్వసించేవారు. మరో మాటలో, “ప్రతిదీ ముందుగానే నిర్ణయించబడుతుంది, అయినా స్వేచ్ఛాచిత్తం ఇవ్వబడింది.” ఆదాము హవ్వలు పాపం చేసేందుకు విధినిర్ణయించబడ్డారనీ, మరి చిన్నగా వ్రేలు తెగడం కూడా విధినిర్ణయమని వారు నమ్మేవారు.
పద్దెనిమిది మంది మరణించేందుకు కారణమైన కోట కూలిపోయిన విషయాన్ని గూర్చి యేసు మాట్లాడినప్పుడు అలాంటి అబద్ధ ఆలోచనల విషయం ఆయన మనస్సులో ఉండివుండవచ్చు. ఆయన ఇలా ప్రశ్నించాడు: “సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?” (లూకా 13:4) అనేక ప్రమాదాల్లో వలె, ఇది “కాలవశముచేతను, అనూహ్యంగాను” జరిగింది గానీ పరిసయ్యులు అనుకునేట్లుగా కర్మనుబట్టి జరిగిందికాదు. (ప్రసంగి 9:11, NW) జ్ఞానంగల వారిగా పరిగణించబడే అలాంటి వారు లేఖనాధార ఆజ్ఞలతో ఎలా వ్యవహరిస్తారు?
వారు మతంలో క్రొత్తవి చేర్చినవారు
పరిసయ్యులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికి అనుగుణ్యంగా ప్రతి తరంలోని రబ్బీలు లేఖనాధార ఆజ్ఞల భావాలను చెప్పాలని నమ్మేవారు. కాబట్టి, “తమ ప్రస్తుత ఆలోచనలతో తోరహా బోధలను అనుగుణ్యపర్చడం లేక తోరహాలోని మాటల్లో తమ ఆలోచనలను అన్వయించడం లేక వాటిని దానిలో సూచించడం అంత పెద్ద కష్టమైంది కాదని వారు కనుగొన్నారు” అని ఎన్సైక్లోపీడియా జుడైకా చెబుతున్నది.
వార్షిక పాపపరిహారార్థ దినం విషయానికొస్తే, పాపపరిహారార్థ శక్తిని ప్రధాన యాజకుని నుండి ఆ రోజుకే మార్చేశారు. (లేవీయకాండము 16:30, 33) పస్కా పండుగలో, పస్కా పశువుకంటే కూడా, ద్రాక్షారసమూ రొట్టెలో పాలుపంచుకోవడంపై నిర్గమకాండంలోని పాఠాలను వల్లించడంపైనే వారు అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవారు.
తగిన కాలంలో, ఆలయం వద్ద పరిసయ్యులు పలుకుబడిగల వారయ్యారు. పంటకూర్చు పండుగ రోజు రాత్రి సిలోయము కోనేరు నుండి నీటిని తీసుకెళ్లే ఒక ఊరేగింపును, మరుసటి రోజున ఉదయం ఆ నీటిని ప్రోక్షించడాన్ని, ఆ పండుగ ముగింపుకు వచ్చే సరికి బలిపీఠంపై ఒక గుల్మజాతి మొక్క కొమ్మలతో కొట్టడాన్ని మరియు ధర్మశాస్త్రవిరుద్ధమైన ప్రతి దిన ప్రార్థనలను వారు ప్రవేశపెట్టారు.
“ప్రత్యేకంగా, విశ్రాంతి దినం సందర్భంగా పరిసయ్యులు తెచ్చిన క్రొత్త కల్పనలు ప్రాముఖ్యంగా” ఉండేవి, అని ది జూయిష్ ఎన్సైక్లోపీడియా చెబుతోంది. భార్య దీపాలను వెలిగించడం ద్వారా విశ్రాంతి దినాన్ని ఆహ్వానించాలని అపేక్షించబడేది. ఏ కార్యమైనా ధర్మ శాస్త్రవిరుద్ధమైనపనికి దారితీస్తుందన్నట్లు కనిపిస్తే పరిసయ్యులు దాన్ని నిషేధించేవారు. వారు వైద్య చికిత్సను సహితం వ్యవస్థీకరించేంత వరకు వెళ్లారు, విశ్రాంతి దినం నాడు యేసు అద్భుత రీతిగా చేసిన స్వస్థత విషయంలో వారు తమ విసుగును వ్యక్తపర్చారు. (మత్తయి 12:9-14; యోహాను 5:1-16) అయితే, మతంలో క్రొత్త విషయాలు చేర్చే వీరు లేఖనాధార నియమాన్ని సంరక్షించేందుకు దడిని లేక కంచెను వేసే ప్రయత్నంగా క్రొత్త నియమాల్ని స్థాపించడంతో ఆగలేదు.
కొట్టివేయడం
లేఖనాధార ఆజ్ఞలను తప్పించేందుకు లేక రద్దుచేసేందుకు తమకు అధికారముందని పరిసయ్యులు చెప్పుకున్నారు. ఒక టాల్ముడ్ సిద్ధాంతంలో వారి తర్కం ప్రతిబింబించింది: “తోరహా మొత్తాన్ని మర్చిపోయేకంటే ఒక్క ఆజ్ఞను నిషేధించడం ఉత్తమం.” ఉదాహరణకు, సునాదకాలం సమీపించినప్పుడు పేదలకు డబ్బు సహాయం చేసినట్లైతే దాన్ని తిరిగి పొందలేమనే భయంవల్ల సునాదకాలాన్ని నిలిపివేయడం జరిగింది.—లేవీయకాండము 25వ అధ్యాయము.
రద్దుచేయబడిన ఇతర ఉదాహరణలేవంటే, వ్యభిచరించిందని అనుమానించబడే ఒక స్త్రీ న్యాయవిచారణను మరియు అనుమానాస్పద హత్య విషయాల్లో ప్రాయశ్చిత్త పద్ధతిని తప్పించడం. (సంఖ్యాకాండము 5:11-31; ద్వితీయోపదేశకాండము 21:1-9) అవసరతలో ఉన్న ఒకరి తలిదండ్రులకు అందించే లేఖనాధార అవసరతను పరిసయ్యులు కొట్టివేయడం ఇక కొద్ది కాలంలోనే తప్పక జరుగుతుంది.—నిర్గమకాండము 20:12; మత్తయి 15:3-6.
యేసు ఇలా హెచ్చరించాడు: “పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.” (లూకా 12:1) పరిసయ్యత్వం, దాని దైవపరిపాలనేతర ధోరణితో, తప్పకుండా వేషధారణే అవుతుంది—క్రైస్తవ సంఘంలోకి ఎన్నడూ తీసుకురాకూడనిదే అది. అయినప్పటికీ, యూదుల పుస్తకాలు సద్దూకయ్యులకంటే పరిసయ్యులను గూర్చి మరింత అనుకూలంగా రాసింది. పూర్వాచారములను మార్చవద్దనే ఈ గుంపును మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
సద్దూకయ్యులు
సద్దూకయ్యులు అనే పదం బహుశ సాదోక నుండి, అంటే సొలొమోను కాలంలోని ప్రధానయాజకుని నుండి తీసుకోబడివుండవచ్చు. (1 రాజులు 2:35, అథఃస్సూచి, NW) సద్దూకయ్యులు, ఆలయం మరియు యాజకుల ఆసక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక పూర్వాచార సంరక్షక మండలిగా తయారయ్యారు. చదువు దైవనిష్ఠ వల్ల తమకు అధికారం ఉందని చెప్పుకునే పరిసయ్యుల్లా కాక, సద్దూకయ్యులు తమ ప్రత్యాధికారం, వంశం, స్థానాలపై ఆధారపడివుందని చెప్పుకున్నారు. సా.శ. 70లో ఆలయం నాశనమయ్యే వరకూ వారు పరిసయ్యులకు మతంలో క్రొత్త విషయాలు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూనేవచ్చారు.
విధినిర్ణయాన్ని తిరస్కరించడానికి తోడు, దేవుని వాక్యంలో మరెక్కడైనా పేర్కొన్నప్పటికీ, ప్రత్యేకంగా పంచగ్రంథంలో ప్రస్తావించబడని ఏ బోధనైనా అంగీకరించేందుకు సద్దూకయ్యులు నిరాకరించారు. వాస్తవానికి, ఈ విషయాలపై “తర్కించడం మంచి గుణంగా పరిగణించేవారు.” (ది జూయిష్ ఎన్సైక్లోపీడియా) పునరుత్థాన విషయంలో వారు యేసును సవాలు చేసిన సందర్భాన్ని ఇది గుర్తుచేస్తుంది.
ఏడుగురు భర్తల విధవరాలి ఉపమానాన్ని ఉపయోగించడం ద్వారా, సద్దూకయ్యులు ఇలా అడిగారు: “పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును?” నిస్సందేహంగా, ఈ కాల్పనిక విధవరాలికి 14 లేక 21 మంది భర్తలు కూడా ఉండివుండవచ్చు. యేసు ఇలా వివరించాడు: “పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు; పెండ్లికియ్యబడరు.”—మత్తయి 22:23-30.
మోషే తప్ప వేరే ప్రేరేపిత రచయితలను సద్దూకయ్యులు తిరస్కరిస్తారని తెలిసిన యేసు, పంచగ్రంథం నుండి సూచించాడు. ఆయన ఇలా అన్నాడు: “వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు—నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.”—మార్కు 12:26, 27.
యేసు మరియు ఆయన అనుచరుల హింసకులు
మెస్సీయా వస్తాడని వారొకవేళ నమ్మివుంటే—ఆయన రాకకొరకు వేచియుండుట కంటే ఇతర జనాంగాలతో వ్యవహరించడంలో రాజ్యనీతిని ఉపయోగించడంలోనే సద్దూకయ్యులు తమ నమ్మకముంచారు. రోముతో చేసిన ఒక ఒప్పందంలో ఆలయాన్ని వారు నడిపించాలి మరియు ఈ విషయాలను పాడుచేస్తూ ఏ మెస్సీయాకూడా రంగప్రవేశం చేయడం వారు ఇష్టపడలేదు. తమ స్థానానికి యేసును ఒక అపాయంగా భావించి, ఆయనను హత్య చేయాలనే కుట్రలో వారు పరిసయ్యులతో చేతులు కలిపారు.—మత్తయి 26:59-66; యోహాను 11:45-50.
రాజకీయ ప్రవృత్తికల్గి, సద్దూకయ్యులు రోము యెడల యథార్థతను ఒక వివాదాంశం చేసి, ఇలా ఎలుగెత్తి అరిచారు: “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు.” (యోహాను 19:6, 12-15) యేసు మరణ పునరుత్థానాల తర్వాత, క్రైస్తవత్వ విస్తరణను ఆపేందుకు ప్రయత్నించింది సద్దూకయ్యులే. (అపొస్తలుల కార్యములు 4:1-23; 5:17-42; 9:14) సా.శ. 70 నందు ఆలయ నాశనం జరిగిన తర్వాత ఈ గుంపు ఉనికిలో లేకుండా పోయింది.
జాగ్రత్తగా ఉండవల్సిన అవసరత
యేసు హెచ్చరిక ఎంత సమంజసమైందో కదా! అవును, మనం “పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా” ఉండాలి. అటు యూదా మతంలోనూ ఇటు క్రైస్తవత్వంలోనూ ఒకరు దాని చెడు ఫలాలనే కనుగొనగలరు.
అయితే, దానికి పూర్తి విరుద్ధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల 75,500 కంటే ఎక్కువగల సంఘాల్లో అర్హతగల క్రైస్తవ పెద్దలు ‘తమను గూర్చి తమ బోధను గూర్చియు ఎడతెగక జాగ్రత్త కల్గివున్నారు.’ (1 తిమోతి 4:16) బైబిలంతా దైవ ప్రేరేపితమని వారు నమ్ముతారు. (2 తిమోతి 3:16) మార్పులు చేస్తూ క్రొత్త విషయాల్ని ప్రవేశపెట్టేవారిగానూ తమ స్వంత మత పద్ధతులను ప్రబోధించేవారిగాను కాకుండా వారు ఈ పత్రికను తన ప్రధాన బోధోపకరణంగా ఉపయోగించే బైబిలు ఆధారితమైన సంస్థ ఇచ్చే నడిపింపు క్రింద ఏకభావంతో పనిచేస్తారు.—మత్తయి 24:45-47.
దాని ఫలితం? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు బైబిలును అర్థంచేసుకుని, తమ జీవితాల్లో దాన్ని అన్వయించుకుని, ఇతరులకు దాన్ని బోధించినప్పుడు వారు ఆత్మీయంగా ఉన్నతినొందుతున్నారు. ఇది ఎలా సాధించబడుతుందో చూసేందుకు, మీకు అత్యంత సమీపమందున్న యెహోవాసాక్షుల సంఘాన్ని ఎందుకు దర్శించకూడదు లేక ఈ పత్రిక ప్రకాశకులకు ఎందుకు రాయకూడదు?
[26వ పేజీలోని బాక్సు]
యేసు తన ప్రేక్షకులను పరిగణలోకి తీసుకున్నాడు
యేసుక్రీస్తు, తన శ్రోతల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ స్పష్టతతో బోధించాడు. ఉదాహరణకు, పరిసయ్యుడైన నీకొదేముతో “తిరిగి జన్మించుట” విషయాన్ని గూర్చి మాట్లాడినప్పుడు ఆయన అలా చేశాడు. నీకొదేము ఇలా అడిగాడు: “ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా?” (యోహాను 3:1-5) యూదా మతంలోకి మారేవారికి తిరిగి జన్మించడం తప్పనిసరి అని పరిసయ్యులు నమ్మినప్పుడు మరియు రబ్బీల లోకోక్తి ఒకటి, యూదా మతంలోకి మారిన వ్యక్తిని “ఒక నవజాత శిశువుతో” పోల్చినప్పుడు, నీకొదేము ఎందుకు అంత విభ్రమస్థితిలోపడ్డాడు?
జాన్ లిట్ఫుట్ రాసిన ఎ కామెంటరీ ఆన్ ది న్యూ టెస్టమెంట్ ఫ్రమ్ ది టాల్మండ్ అండ్ హెబ్రైకా, ఈ క్రింది పరిజ్ఞానాన్ని అందిస్తోంది: “మొదట తనకున్న దురభిమానాన్ని పోగొట్టుకో”లేని “ఈ పరిసయ్యుని మనస్సులో . . . ఒక ఇశ్రాయేలు అర్హతలను గూర్చిన యూదుల సాధారణాభిప్రాయం ఇంకా అంటుకుని ఉంది . . . : ‘ఇశ్రాయేలీయులకు . . . మెస్సీయా రాజ్యంలోకి చేరే హక్కు ఉంది, కనుక మీరు చెప్పిన ఈ మాట భావం, ఒక క్రొత్త ఇశ్రాయేలీయునిగా అయ్యేందుకు మరలా రెండవసారి అతడు తల్లి గర్భంలోకి ప్రవేశించాలా?’”—మత్తయి 3:9 పోల్చండి.
యూదా మతంలోకి చేరిన వ్యక్తి క్రొత్తగా జన్మించడాన్ని అంగీకరిస్తూనే, అలాంటి పద్ధతి—అంటే గర్భములోకి మరలా ప్రవేశించడం సహజ యూదులకు అసాధ్యమని నీకొదేము దృష్టించాడు.
మరో సందర్భంలో, ‘తన శరీరము తిని తన రక్తము త్రాగడం’ గూర్చి యేసు మాట్లాడినప్పుడు అనేకులు అభ్యంతరపడ్డారు. (యోహాను 6:48-55) అయినప్పటికీ, అలంకార రీతిగా ‘తినడం త్రాగడం’ అనే మాటకంటే “మరీ సామాన్యమైన మాట యూదుల పాఠశాలలో వేరొకటి లేదు” అని లిట్ఫుట్ సూచిస్తున్నాడు. టాల్ముడ్ “మెస్సీయాను తినడం” గూర్చి ప్రస్తావించిందని ఆయన ప్రస్తావించాడు.
కనుక పరిసయ్యులూ సద్దూకయ్యుల ఆలోచనలు మొదటి శతాబ్దపు యూదుల ఆలోచనా విధానంపై చాలా ప్రభావాన్ని చూపించాయి. అయితే, సరియైన రీతిలో తన ప్రేక్షకుల జ్ఞానం మరియు అనుభవాన్ని యేసు ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకున్నాడు. ఆయన్ను గొప్ప బోధకుని చేసిన అనేక విషయాల్లో ఇది ఒకటి.