“సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి”
“నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా . . . మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”—1 పేతురు 1:14-16.
1. పరిశుద్ధంగా ఉండుడని పేతురు క్రైస్తవులను ఎందుకు ప్రోత్సహించాడు?
అపొస్తలుడైన పేతురు పై ఉపదేశాన్ని ఎందుకిచ్చాడు? ఎందుకంటే, ప్రతి క్రైస్తవుడు తనను తాను యెహోవాకు అనుగుణ్యంగా, పరిశుద్ధంగా ఉంచుకునేందుకు తన తలంపులను, క్రియలను కాపాడుకోవలసిన అవసరం ఉందని ఆయన గమనించాడు. అందుకే ఆయన పైమాటలకు ముందు, ‘మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, . . . మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపవద్దని’ చెప్పాడు.—1 పేతురు 1:13, 14.
2. మనం సత్యం నేర్చుకోకముందు మన కోరికలు ఎందుకు అపరిశుద్ధంగా ఉండినవి?
2 మునుపటి మన కోరికలు అపరిశుద్ధమైనవి. ఎందుకు? ఎందుకంటే మనలో అనేకులము క్రైస్తవ సత్యాన్ని అంగీకరించక ముందు క్రియల విషయంలో లోక సంబంధమైన విధానాన్ని అనుసరించాము. పేతురు, “మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును” అని స్పష్టంగా వ్రాసినప్పుడు, ఆయనకు దీని గురించి తెలుసు. అయితే మన ఆధునిక ప్రపంచంలో ప్రత్యేకమైనవిగా ఉన్న అపరిశుద్ధ క్రియలు ఆ కాలంలో తెలియదు గనుక పేతురు వాటి గురించి వ్రాయలేదు.—1 పేతురు 4:3, 4.
3, 4. (ఎ) మనం తప్పుడు కోరికలను ఎలా ఎదిరించవచ్చు? (బి) క్రైస్తవులు భావోద్రేకాలు లేకుండా ఉండాలా? వివరించండి.
3 ఈ కోరికలు మన శరీరానికి, మన ఇంద్రియాలకు, మన భావాలకు ఆకర్షణీయమైనవని మీరు గమనించారా? ఇవి మనల్ని అధిగమించేందుకు మనం అనుమతించినప్పుడు, మన తలంపులు మరియు క్రియలు చాలా సులభంగా అపరిశుద్ధమౌతాయి. మన తార్కిక శక్తి మన క్రియల్ని అదుపు చేసేందుకు అనుమతించవలసిన అవసరతను ఇది చూపిస్తుంది. దాన్ని పౌలు ఇలా వ్యక్తపరిచాడు: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.”—రోమీయులు 12:1, 2.
4 దేవునికి పరిశుద్ధ యాగాన్ని అర్పించేందుకు, భావోద్రేకాలు కాదుగాని తార్కిక శక్తి మనల్ని అధిగమించేందుకు మనం అనుమతించాలి. తమ భావాలు తమ ప్రవర్తనను అదుపు చేసేందుకు అనుమతించినందువల్ల ఎంతమంది అవినీతిలో పడిపోలేదు! అంటే దాని భావం మన భావోద్రేకాలను అణచివేయాలని కాదు; అలాగైతే, యెహోవా సేవలో మనం ఆనందాన్ని ఎలా వ్యక్తపర్చగలుగుతాము? అయితే, మనం శరీర కార్యాలకు బదులు ఆత్మ ఫలాలను ఫలించాలని ఇష్టపడితే, మనం మన మనస్సులను క్రీస్తు ఆలోచనా విధానంవైపుకు మరల్చుకోవాలి.—గలతీయులు 5:22, 23; ఫిలిప్పీయులు 2:5.
పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన మూల్యం
5. పరిశుద్ధత కలిగి ఉండవలసిన అవసరత గురించి పేతురుకు ఎందుకు తెలుసు?
5 క్రైస్తవ పరిశుద్ధత కలిగివుండవలసిన అవసరత గురించి పేతురుకు ఎందుకు అంతగా తెలుసు? ఎందుకంటే, విధేయతగల మానవజాతిని విడిపించడానికి చెల్లించబడిన పరిశుద్ధమైన మూల్యం గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయనిలా వ్రాశాడు: “పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.” (1 పేతురు 1:18, 19) అవును, పరిశుద్ధతకు మూలమైన యెహోవా దేవుడు, ప్రజలు దేవునితో మంచి సంబంధం కలిగివుండడాన్ని అనుమతించే విమోచన క్రయధనాన్ని చెల్లించేందుకు తన అద్వితీయ కుమారుడైన “పరిశుద్ధున్ని” భూమి మీదికి పంపించాడు.—యోహాను 3:16; 6:69; నిర్గమకాండము 28:36; మత్తయి 20:28.
6. (ఎ) పరిశుద్ధ ప్రవర్తన కలిగివుండడం మనకు ఎందుకు సులభం కాదు? (బి) మన ప్రవర్తనను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనకు ఏది సహాయం చేయగలదు?
6 అయితే, సాతాను యొక్క కలుషిత లోకంలో ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని గడపడం సులభం కాదని మనం గుర్తించాలి. తన విధానంలో నుండి తప్పించుకొని జీవించడానికి ప్రయత్నిస్తున్న నిజ క్రైస్తవులకు అతడు ఉరులు ఒడ్డుతాడు. (ఎఫెసీయులు 6:12; 1 తిమోతి 6:9, 10) లౌకిక ఉద్యోగం, కుటుంబ వ్యతిరేకత, పాఠశాలలో అవహేళన వంటి ఒత్తిళ్లు మరియు తోటివారి ఒత్తిడి వంటివి, ఒకరు పరిశుద్ధంగా మిగిలి ఉండడానికి బలమైన ఆత్మీయత అత్యవసరమయ్యేలా చేస్తాయి. అది మన వ్యక్తిగత పఠనం మరియు క్రైస్తవ కూటాలకు మనం క్రమంగా హాజరు కావడం యొక్క ముఖ్య పాత్రను నొక్కి చెబుతుంది. పౌలు తిమోతికి ఇలా ఉపదేశించాడు: “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము.” (2 తిమోతి 1:13) అలాంటి ఆరోగ్యకరమైన మాటలను మనం మన రాజ్యమందిరంలో వింటాము, మనం బైబిలును ఒంటరిగా పఠించేటప్పుడు చదువుతాము. మనం అనుదినం అనేక విభిన్న సందర్భాలలో మన ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండడానికి అవి మనకు సహాయం చేయగలవు.
కుటుంబంలో పరిశుద్ధ ప్రవర్తన
7. పరిశుద్ధత మన కుటుంబ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి?
7 పేతురు లేవీయకాండము 11:44ను ఉదాహరించినప్పుడు, ఆయన హాʹగి·యోస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. “పాపం నుండి వేరుచేయబడినందున దేవునికి సమర్పించబడింది, పవిత్రమైనది” అని దాని భావం. (డబ్ల్యూ. ఇ. వైన్ యొక్క ఏన్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరి ఆఫ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్) మన క్రైస్తవ కుటుంబ జీవితంలో ఇది మనల్ని ఎలా ప్రభావితం చేయాలి? “దేవుడు ప్రేమాస్వరూపి” గనుక, మన కుటుంబ జీవితం ప్రేమపై ఆధారపడి ఉండాలని కచ్చితంగా దాని భావం. (1 యోహాను 4:8) స్వయంత్యాగపూరితమైన ప్రేమ అనేది భార్యాభర్తలకు, తలిదండ్రులూ పిల్లలకు మధ్య ఉండే సంబంధాలను మెత్తబరిచే తైలం వంటిది.—1 కొరింథీయులు 13:4-8; ఎఫెసీయులు 5:28, 29, 33; 6:4; కొలొస్సయులు 3:18, 21.
8, 9. (ఎ) క్రైస్తవ గృహంలో కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి పెంపొందుతుంది? (బి) ఈ విషయంలో బైబిలు ఏ మంచి సలహా ఇస్తుంది?
8 క్రైస్తవ కుటుంబంలో అలాంటి ప్రేమను వ్యక్తపర్చడం దానంతటదే జరుగుతుందని మనమనుకోవచ్చు. అయినప్పటికీ, కొన్ని క్రైస్తవ గృహాల్లో ప్రేమ ఎల్లప్పుడూ అది చూపించవలసినంత ప్రభావాన్ని చూపించదన్న విషయాన్ని అంగీకరించవలసిందే. రాజ్యమందిరంలో మనం ప్రేమ చూపుతున్నట్లుగానే కనిపిస్తుంది, కాని గృహం వద్ద మన పరిశుద్ధత ఎంత సులభంగా తగ్గిపోతుందో కదా. అప్పుడు, భార్య ఇంకా మన క్రైస్తవ సహోదరేనని లేక భర్త ఇంకా రాజ్యమందిరం వద్ద గౌరవింపబడినట్లు కనిపించిన అదే సహోదరుడని (బహుశా పరిచర్య సేవకుడని లేక పెద్ద అని) మనం హఠాత్తుగా మరిచిపోవచ్చు. మనకు చికాకు కలుగుతుంది, ఉద్రేకపూరితమైన వాదనలు ప్రారంభం కావచ్చు. మన జీవితాల్లోకి ద్వంద్వ ప్రమాణాలు కూడా ప్రవేశించవచ్చు. అది ఇక ఎంతమాత్రం క్రీస్తువంటి భార్యాభర్తల సంబంధం కాదుగాని, పొసగని స్త్రీ పురుషులు మాత్రమే. గృహంలో పరిశుద్ధమైన వాతావరణం ఉండాలని వారు మరిచిపోతారు. బహుశా వారు లోకసంబంధమైన ప్రజలవలె మాట్లాడుకోవడం ప్రారంభించవచ్చు. అప్పుడు అసహ్యమైన, కఠినమైన వ్యాఖ్య నోట్లో నుండి ఎంత సుళువుగా వెలువడుతుందో కదా!—సామెతలు 12:18; అపొస్తలుల కార్యములు 15:37-39 పోల్చండి.
9 అయితే, పౌలు ఇలా ఉపదేశిస్తున్నాడు: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను [గ్రీకులో, లోగోస్ సాప్రోస్, “కలుషితంచేసే సంభాషణ,” కాబట్టి అపరిశుద్ధమైనది] మీ నోట రానియ్యకుడి.” పిల్లలతో సహా గృహంలో ఉండే వినువారందరినీ అది సూచిస్తుంది.—ఎఫెసీయులు 4:29; యాకోబు 3:8-10.
10. పరిశుద్ధతను గూర్చిన సలహా పిల్లలకు ఎలా వర్తిస్తుంది?
10 పరిశుద్ధతను గూర్చిన ఈ నిర్దేశక సూత్రం, క్రైస్తవ కుటుంబంలో ఉండే పిల్లలకు కూడా సమానంగా వర్తిస్తుంది. వారు పాఠశాల నుండి ఇంటికి వచ్చి లోకసంబంధమైన తమ స్నేహితుల తిరుగుబాటు ధోరణిగల, అగౌరవమైన మాటలను అనుకరించడాన్ని ప్రారంభించడం వారికి ఎంత సులభమో కదా! పిల్లలారా, యెహోవా యొక్క ప్రవక్తను అవమానించిన అనాగరిక బాలురు చూపించినలాంటి దృక్పథాలవైపుకు ఆకర్షితులు కాకండి, దుర్భాషలాడే, దేవదూషణచేసే నేటి బాలలు వారివంటి వారే. (2 రాజులు 2:23, 24) చక్కని పదాలను ఉపయోగించడానికి బద్ధకించే లేక పట్టింపులేని ప్రజల అనాగరికమైన వీధి భాషతో మీ సంభాషణ కలుషితమై ఉండకూడదు. క్రైస్తవులముగా మన సంభాషణ పరిశుద్ధంగా, ఆహ్లాదకరంగా, ప్రోత్సాహకరంగా, దయాపూర్వకంగా, “ఉప్పు వేసినట్టు” ఉండాలి. అది ఇతర ప్రజల నుండి మనం వేరని తెలియజేసేదిగా ఉండాలి.—కొలొస్సయులు 3:8-10; 4:6.
పరిశుద్ధత, అవిశ్వాసులైన మన కుటుంబ సభ్యులు
11. పరిశుద్ధంగా ఉండడమంటే, స్వనీతి కలిగివుండడం ఎందుకు కాదు?
11 మనం మనస్సాక్షిపూర్వకంగా పరిశుద్ధత కలిగివుండాలని ప్రయత్నిస్తుండగా, మనం ఉన్నతులమన్నట్లుగా, స్వనీతిపరులుగా ఉండకూడదు, ప్రాముఖ్యంగా అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు అలా కనిపించకూడదు. మనం ప్రయోజనకరమైన విధంగా భిన్నంగా ఉంటామని, యేసు ఉపమానంలోని మంచి సమరయునిలా ప్రేమా కనికరం ఎలా చూపించాలో మనకు తెలుసనీ, వారు గ్రహించేందుకు మన దయాపూర్వకమైన క్రైస్తవ ప్రవర్తన కనీసం వారికి సహాయం చేయాలి.—లూకా 10:30-37.
12. క్రైస్తవ భార్య/భర్తలు తమ వివాహ జతలకు సత్యాన్ని ఆకర్షణీయమైనదిగా ఎలా చేయగలరు?
12 “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును” అని పేతురు క్రైస్తవ భార్యలకు వ్రాసినప్పుడు, అవిశ్వాసులైన మన కుటుంబ సభ్యుల ఎడల సరైన దృక్పథం కల్గివుండవలసిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పాడు. ఒకవేళ ఒక క్రైస్తవ భార్య (లేక ఆ మాటకొస్తే భర్త) ప్రవర్తన మంచిది, దయగలది, గౌరవప్రదమైనది అయినట్లయితే ఆమె అవిశ్వాసియైన తన జతకు సత్యం మరింత ఆకర్షణీయమైనదిగా ఉండేలా చేయగలదు. అవిశ్వాసియైన జత నిర్లక్ష్యం చేయబడకుండా లేక విడిచిపెట్టబడకుండా ఉండేలా దైవపరిపాలనా కార్యక్రమ పట్టికలో పట్టువిడుపు ఉండాలని దీని భావము.a—1 పేతురు 3:1, 2.
13. అవిశ్వాసులైన భర్తలు సత్యాన్ని గుణగ్రహించేందుకు కొన్నిసార్లు పెద్దలు, పరిచర్య సేవకులు ఎలా సహాయం చేయగలరు?
13 పెద్దలు మరియు పరిచర్య సేవకులు అవిశ్వాసియైన భర్తతో పరిచయం ఏర్పరచుకొని, కలుపుగోలుగా ఉండడం ద్వారా కొన్నిసార్లు వారు సహాయం చేయవచ్చు. సాక్షులు బైబిలు నందు మాత్రమే కాకుండా ఇతర విషయాలతోసహా వివిధ అంశాల ఎడల ఆసక్తిగల సాధారణమైన, మంచి ప్రజలని ఈ విధంగా ఆయన తెలుసుకోవచ్చు. ఒక సందర్భంలో, ఒక భర్తకు చేపలు పట్టే సరదా ఉండేది, ఒక పెద్ద ఆ విషయంలో ఆసక్తి చూపించాడు. ఆరంభంలో ఉన్న అడ్డంకును తొలగించి, స్నేహాన్ని ప్రారంభించడానికి అది సరిపోయింది. ఆ భర్త చివరికి బాప్తిస్మం పొందిన సహోదరుడయ్యాడు. మరో సందర్భంలో, అవిశ్వాసియైన ఒక భర్తకు కానరీ పక్షుల ఎడల ఆసక్తి ఉండేది. పెద్దలు ఓడిపోలేదు. మరోసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆయనకు ఇష్టమైన అంశంపై సంభాషణను ప్రారంభించగలిగేలా, వారిలో ఒకరు ఆ విషయం గురించి అధ్యయనం చేశారు. కాబట్టి, పరిశుద్ధంగా ఉండడమంటే కఠినంగా ఉండడం లేక సంకుచితమైన మనస్తత్వం కలిగివుండడం కాదు.—1 కొరింథీయులు 9:20-23.
మనం సంఘంలో పరిశుద్ధంగా ఎలా ఉండవచ్చు?
14. (ఎ) సంఘాన్ని బలహీనపర్చడానికి సాతాను ఉపయోగించే పద్ధతులలో ఒకటి ఏది? (బి) సాతాను ఉరిని మనం ఎలా తప్పించుకోగలము?
14 అపవాదియగు సాతాను కొండెములు చెప్పేవాడు, ఎందుకంటే అపవాది యొక్క గ్రీకు పేరు డై·యʹబొ·లోస్, “నిందించువాడు” లేక “కొండెములు చెప్పేవాడు” అని దాని భావం. కొండెములు చెప్పడం అతని ప్రత్యేకతలలో ఒకటి, దాన్ని సంఘంలో ఉపయోగించాలని అతడు ప్రయత్నిస్తాడు. అతడికి ఇష్టమైన పద్ధతి వృథా ప్రసంగం. ఈ అపరిశుద్ధమైన ప్రవర్తనలో మనల్ని మనం అతని డూప్‌గా ఉండడానికి అనుమతిస్తామా? అదెలా సంభవించగలదు? వృథా ప్రసంగాన్ని ప్రారంభించడం ద్వారా, దాన్ని పునరుద్ఘాటించడం ద్వారా లేక దాన్ని వినడం ద్వారా. ఒక జ్ఞానవంతమైన సామెత ఇలా చెబుతుంది: “మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును.” (సామెతలు 16:28) వృథా ప్రసంగానికి, కొండెములకు విరుగుడేమిటి? మన సంభాషణ ఎల్లప్పుడు ప్రోత్సాహకరమైనదిగా, ప్రేమపై ఆధారపడినదిగా ఉండేలా మనం జాగ్రత్త వహించాలి. మన సహోదరుల దుర్గుణాలని భావించబడే వాటి కొరకు కాకుండా సద్గుణాల కొరకు చూస్తే, మన సంభాషణ ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, ఆత్మీయంగా ఉంటుంది. విమర్శించడం సులభమని గుర్తుంచుకోండి. ఇతరుల గురించి మీతో వృథా ప్రసంగం చేసే వ్యక్తి మీ గురించి ఇతరులతో కూడా వృథా ప్రసంగం చేయవచ్చు!—1 తిమోతి 5:13; తీతు 2:3.
15. సంఘంలోని వారందరూ పరిశుద్ధంగా ఉండడానికి క్రీస్తువంటి ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?
15 సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి, మనందరం క్రీస్తువంటి మనస్సును కలిగివుండవలసిన అవసరం ఉంది, ఆయన విశేషమైన గుణం ప్రేమ అని మనకు తెలుసు. అందుకే, క్రీస్తువలె కనికరం కలిగివుండమని పౌలు కొలొస్సయులకు ఇలా ఉపదేశించాడు: “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. . . . ఒకని నొకడు క్షమించుడి. . . . వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” ఆయనింకా ఇలా చెప్పాడు: “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి.” ఈ క్షమా స్ఫూర్తితో మనం తప్పకుండా సంఘ ఐక్యతను, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాము.—కొలొస్సయులు 3:12-15.
మన పరిశుద్ధత మన ఇరుగుపొరుగున కనిపిస్తుందా?
16. మన పరిశుద్ధ ఆరాధన సంతోషభరితమైన ఆరాధనగా ఎందుకుండాలి?
16 మన పొరుగువారి విషయమేమిటి? వారు మనల్నెలా దృష్టిస్తారు? మనం సత్యం యొక్క ఆనందాన్ని ప్రసరింపజేస్తామా, లేక అది భారమన్నట్లు కనిపించేలా చేస్తామా? యెహోవాలానే మనం పరిశుద్ధంగా ఉంటే, అది మన సంభాషణలోను, మన ప్రవర్తనలోను కనిపించాలి. మన పరిశుద్ధ ఆరాధన సంతోషభరితమైన ఆరాధన అని స్పష్టమవ్వాలి. ఎందుకలా? ఎందుకంటే మన దేవుడైన యెహోవా సంతోషంగల దేవుడు, తన ఆరాధికులు ఆనందభరితులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే, కీర్తనల గ్రంథకర్త ప్రాచీన కాలంనాటి యెహోవా ప్రజల గురించి ఇలా చెప్పగలిగాడు: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.” మనం అలాంటి ధన్యతను ప్రతిఫలింపజేస్తామా? రాజ్యమందిరంలోను సమావేశాల్లోను యెహోవా ప్రజలుగా ఉండడాన్నిబట్టి మన పిల్లలు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తారా?—కీర్తన 89:15, 16; 144:15బి.
17. పరిశుద్ధ ఆరాధనలో సమతూకాన్ని చూపించడానికి మనం ఆచరణయోగ్యమైన రీతిలో ఏమి చేయగలము?
17 మన సహకార స్ఫూర్తి ద్వారా, పొరుగువారి ఎడల కనికరం కలిగివుండడం ద్వారా మనం మన పరిశుద్ధ ఆరాధనలో సమతూకాన్ని కూడా చూపించవచ్చు. బహుశా పొరుగునున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి లేక, కొన్ని దేశాల్లో ఉన్నట్లుగా, రోడ్లను మరియు రహదార్లను బాగు చేసేందుకు కొన్నిసార్లు ఇరుగుపొరుగున ఉన్నవారు సహకరించుకోవడం అవసరం కావచ్చు. ఈ విషయంలో మన పరిశుద్ధత మనం మన తోటలు, ప్రాంగణాలు, లేక ఇతర వస్తువుల గురించి ఎలా శ్రద్ధ తీసుకుంటాము అనేదానిలో కూడా స్పష్టం కావచ్చు. పాడైపోయిన వాహనాలను బహుశా అందరికీ కనబడేలా, చుట్టూ చెత్త పేరుకుపోయేలా ఉంచితే లేక మన ప్రాంగణాలను అసహ్యంగా లేక రోతగా ఉంచితే, మనం మన పొరుగువారిని గౌరవంతో చూస్తున్నామని చెప్పగలమా?—ప్రకటన 11:18.
పనివద్ద, పాఠశాలవద్ద పరిశుద్ధత
18. (ఎ) నేడు క్రైస్తవులకున్న ఒక కష్టతరమైన పరిస్థితి ఏమిటి? (బి) మనం లోకం నుండి ఎలా వేరుగా ఉండగలము?
18 అపరిశుద్ధ నగరమైన కొరింథులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?” (1 కొరింథీయులు 5:9, 10) అవినీతిపరులతోను, నీతినియమాలతో సంబంధంలేని వారితోను అనుదినం మెలగవలసి వచ్చే క్రైస్తవులకు ఇది ఒక కష్టతరమైన పరిస్థితి. ప్రాముఖ్యంగా లైంగిక వేధింపు, అవినీతి, దుర్నీతి ప్రోత్సహింపబడే లేక చూసీచూడనట్టు విడిచిపెట్టబడే సంస్క్రతులలో, ఇది యథార్థతకు గొప్ప పరీక్ష. ఈ స్థలాల్లో, మన చుట్టూ ఉన్నవారికి “సామాన్యంగా” కనిపించడానికి మనం మన ప్రమాణాలను తగ్గించుకోలేము. బదులుగా, దయాపూర్వకమైనదే అయినప్పటికీ వేరుగా ఉండే మన క్రైస్తవ ప్రవర్తన, ఆలోచించే ప్రజలకు మరియు తమ ఆత్మీయ అవసరతను గుర్తించి, అంతకంటే మంచిదాని కొరకు చూస్తున్న వారికి మనల్ని ప్రత్యేకంగా చూపించాలి.—మత్తయి 5:3; 1 పేతురు 3:16, 17.
19. (ఎ) పిల్లలైన మీకు పాఠశాల వద్ద ఏ పరీక్షలున్నాయి? (బి) తమ పిల్లలకు, వారి పరిశుద్ధ ప్రవర్తనకు మద్దతునిచ్చేందుకు తలిదండ్రులు ఏమి చేయవచ్చు?
19 అలాగే, పాఠశాల వద్ద మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలెన్నో ఉన్నాయి. తలిదండ్రులైన మీరు, మీ పిల్లలు హాజరయ్యే పాఠశాలను దర్శిస్తారా? అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో మీకు తెలుసా? ఉపాధ్యాయులతో మీకు సన్నిహితత్వం ఉందా? ఈ ప్రశ్నలెందుకు ప్రాముఖ్యము? ఎందుకంటే లోకంలోని అనేక పట్టణ ప్రాంతాల్లో, పాఠశాలలు దౌర్జన్యం, మత్తుపదార్థాలు, లైంగికతలకు సంబంధించిన అరణ్యాలుగా తయారయ్యాయి. తలిదండ్రుల సానుభూతితో కూడిన పూర్తి మద్దతు మీ పిల్లలకు లభించకపోతే వారు తమ యథార్థతను ఎలా కాపాడుకోగలరు, తమ ప్రవర్తనను పరిశుద్ధంగా ఎలా ఉంచుకోగలరు? తగినరీతిగానే పౌలు తలిదండ్రులకు ఇలా ఉపదేశించాడు: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) పిల్లలకు కోపం పుట్టించే ఒక విధం ఏమిటంటే, వారి అనుదిన సమస్యలను, పరీక్షలను అర్థం చేసుకోవడంలో విఫలం కావడం. పాఠశాల వద్ద ఎదురయ్యే శోధనల కొరకు సిద్ధపడడం క్రైస్తవ గృహంలోని ఆత్మీయ వాతావరణంలో ప్రారంభమౌతుంది.—ద్వితీయోపదేశకాండము 6:6-9; సామెతలు 22:6.
20. మనందరికీ పరిశుద్ధత ఎందుకు ప్రాముఖ్యము?
20 ముగింపులో, మనందరికీ పరిశుద్ధత ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే, అది సాతాను లోకపు మరియు దాని ఆలోచనా విధానపు దాడుల నుండి ఒక రక్షణగా పనిచేస్తుంది. అది ఇప్పుడూ, భవిష్యత్తులోనూ ఒక ఆశీర్వాదమై ఉంటుంది. నీతియుక్తమైన నూతన లోకంలో నిజమైనదై ఉండే జీవితాన్ని కలిగివుండడం గురించి మనకు అభయమిచ్చేందుకు అది సహాయం చేస్తుంది. మనం కఠినమైన ఉన్మాదులుగా ఉండకుండా సమతూకం కలిగి, సమీపించదగినవారిగా ఉంటూ, సంభాషించగల క్రైస్తవులుగా ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, అది మనల్ని క్రీస్తువలె చేస్తుంది.—1 తిమోతి 6:19.
[అధస్సూచీలు]
a అవిశ్వాసులైన జతలతో యుక్తితోకూడిన సంబంధాలు కలిగివుండడం గురించి అదనపు సమాచారం కొరకు ఆగస్టు 15, 1990, కావలికోట (ఆంగ్లం) నందలి 20-2 పేజీలలో గల “మీ జతను నిర్లక్ష్యం చేయకండి!” అనేదాన్ని మరియు నవంబరు 1, 1988 నందలి 24-5 పేజీలలోని 20-2 పేరాలను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ పరిశుద్ధత గురించి క్రైస్తవులకు సలహా ఇవ్వవలసిన అవసరతను పేతురు ఎందుకు కనుగొన్నాడు?
◻ పరిశుద్ధమైన జీవితాన్ని గడపడం ఎందుకు సులభం కాదు?
◻ కుటుంబంలో పరిశుద్ధతను మెరుగుపరచడానికి మనమందరం ఏమి చేయవచ్చు?
◻ సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే, మనం ఏ అపరిశుద్ధ ప్రవర్తనను విసర్జించాలి?
◻ పనివద్ద, పాఠశాల వద్ద మనం పరిశుద్ధంగా ఎలా ఉండగలము?
[16, 17వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులుగా మనం, దేవుని సేవ చేయడంలోను ఇతర కార్యకలాపాల్లోను ఆనందంగా ఉండాలి