కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 అక్టోబరు పేజీలు 7-11
  • ‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన ప్రేమ అంటే ఏమిటి?
  • ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి—ఎలా?
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ప్రేమ విలువైన లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మీ ప్రేమను చల్లారనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 అక్టోబరు పేజీలు 7-11
రాజ్యమందిరంలో కలిసి పనిచేస్తున్న యెహోవాసాక్షులు

‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’

“మన ప్రేమను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి.”—1 యోహా. 3:18.

పాటలు: 106, 100

మీరు గుర్తుచేసుకోగలరా?

  • అత్యున్నతమైన ప్రేమ ఏమిటి?

  • “వేషధారణలేని ప్రేమ” అంటే ఏమిటి?

  • మన ప్రేమలో నిజాయితీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?

1. అత్యున్నతమైన ప్రేమ అంటే ఏమిటి? దాన్ని మీరెలా వర్ణిస్తారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

యెహోవాయే ప్రేమకు మూలం. (1 యోహా. 4:7) అత్యున్నతమైన ప్రేమ సరైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. బైబిలు అలాంటి ప్రేమను అగాపే అనే గ్రీకు పదంతో వర్ణిస్తోంది. ఒకరిపై చూపించే అనురాగం, ఆప్యాయత కూడా ఆ ప్రేమలో భాగమే. కానీ అది కేవలం భావాలకే పరిమితం కాదు. బదులుగా ఇతరుల ప్రయోజనం కోసం నిస్వార్థంగా పనిచేసేలా ఆ ప్రేమ నడిపిస్తుంది. అంతేకాదు ఇతరులకు మేలు చేసేలా ప్రోత్సహిస్తుంది. అలాంటి ప్రేమ మనకు సంతోషాన్ని, జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది.

2, 3. మనుషులపట్ల యెహోవా నిస్వార్థమైన ప్రేమను ఎలా చూపించాడు?

2 ఆదాముహవ్వలను సృష్టించకముందే మనుషులపట్ల యెహోవా ప్రేమ చూపించాడు. ఆయన భూమిని చేసినప్పుడు, మనం బ్రతకడానికి అవసరమైన ప్రతీదీ అందులో ఉండేలా చూశాడు. మరిముఖ్యంగా, మనం ఆనందంగా జీవించడానికి వీలుగా ఉండే ఇల్లులా దాన్ని చేశాడు. యెహోవా అవన్నీ తనకోసం కాదు, కేవలం మనకోసమే చేశాడు. మనకోసం తయారుచేసిన ఇల్లు సిద్ధమయ్యాక, ఆయన మనుషులను సృష్టించి భూమ్మీద శాశ్వతకాలం జీవించి ఉండమని దీవించాడు.

3 కొంతకాలం తర్వాత, యెహోవా మనుషులపట్ల తన నిస్వార్థమైన ప్రేమను సాటిలేని విధంగా చూపించాడు. ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసినప్పటికీ, వాళ్లకు పుట్టే పిల్లల్లో కొందరు తనను ప్రేమిస్తారనే నమ్మకం ఆయన కలిగివున్నాడు. అందుకే వాళ్ల సంతానాన్ని కాపాడడం కోసం తన కుమారుణ్ణి విమోచనా క్రయధనంగా అర్పిస్తానని యెహోవా మాటిచ్చాడు. (ఆది. 3:15; 1 యోహా. 4:10) అలా మాటిచ్చిన క్షణమే, అది ఆయన దృష్టిలో చెల్లించబడినట్టు భావించాడు. అయితే 4,000 సంవత్సరాల తర్వాత, మనుషుల కోసం యెహోవా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇచ్చాడు. (యోహా. 3:16) యెహోవా చూపించిన ఆ ప్రేమకు మనమెంతో రుణపడి ఉన్నాం.

4. అపరిపూర్ణ మనుషులు నిస్వార్థమైన ప్రేమ చూపించగలరని మనకెలా తెలుసు?

4 మనం అపరిపూర్ణులమైనా నిస్వార్థ ప్రేమను చూపించగలమా? ఖచ్చితంగా చూపించగలం. యెహోవా మనల్ని తన స్వరూపంలో, తనను అనుకరించగల సామర్థ్యంతో సృష్టించాడు. నిస్వార్థమైన ప్రేమ చూపించడం సులభం కాకపోయినా, అది సాధ్యమే. హేబెలు తన దగ్గర ఉన్నవాటిలో శ్రేష్ఠమైనది నిస్వార్థంగా అర్పించడం ద్వారా దేవుని పట్ల ప్రేమ చూపించాడు. (ఆది. 4:3, 4) నోవహు, దేవుని సందేశాన్ని ప్రజలు వినకపోయినా ఎన్నో సంవత్సరాలపాటు ప్రకటిస్తూ ఉండడం ద్వారా నిస్వార్థమైన ప్రేమ చూపించాడు. (2 పేతు. 2:5) అబ్రాహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి సిద్ధమవ్వడం ద్వారా అన్నిటికన్నా ఎక్కువగా దేవున్ని ప్రేమిస్తున్నానని చూపించాడు. (యాకో. 2:21) మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఆ నమ్మకమైన పురుషుల్లాగే ప్రేమ చూపించాలి.

నిజమైన ప్రేమ అంటే ఏమిటి?

5. మనం నిజమైన ప్రేమను ఏయే విధాలుగా చూపించవచ్చు?

5 నిజమైన ప్రేమను ‘మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’ అని బైబిలు చెప్తోంది. (1 యోహా. 3:18) దానర్థం ప్రేమను మాటల్లో వ్యక్తం చేయలేమని కాదు. (1 థెస్స. 4:18) ‘మీరంటే నాకు ఇష్టం’ అని కేవలం చెప్తే సరిపోదుగానీ ఆ ప్రేమను చేతల్లో చూపించాలి. ఉదాహరణకు, మన సహోదరసహోదరీల్లో ఎవరైనా సరిపడా ఆహారంగానీ, బట్టలుగానీ లేక ఇబ్బందిపడుతుంటే, వాళ్లతో దయగా మాట్లాడితే సరిపోదుగానీ వీలైన సహాయం చేయాలి. (యాకో. 2:15, 16) అదేవిధంగా మనం యెహోవాను, సాటి మనుషులను ప్రేమిస్తాం కాబట్టి ప్రకటనా పని చేయడానికి ఎక్కువమంది కావాలని ప్రార్థన చేయడంతోపాటు మనం కూడా కష్టపడి ప్రకటనాపని చేస్తాం.—మత్త. 9:38.

6, 7. (ఎ) “వేషధారణలేని ప్రేమ” అంటే ఏమిటి? (బి) బూటకపు ప్రేమకు ఉదాహరణలు చెప్పండి.

6 మనం ‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’ అని అపొస్తలుడైన యోహాను అన్నాడు. కాబట్టి మనం “వేషధారణలేని ప్రేమ” చూపించాలి. (రోమా. 12:9; 2 కొరిం. 6:6) కొన్నిసార్లు ఒక వ్యక్తి ప్రేమ చూపిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ అతని ప్రేమ నిజమైనదా? దానిలో నిజాయితీ ఉందా? ఏ ఉద్దేశంతో ప్రేమ చూపిస్తున్నాడు? నిజానికి, వేషధారణతో కూడిన ప్రేమ అనేది లేదు. బూటకపు ప్రేమకు విలువ ఉండదు.

7 బూటకపు ప్రేమకు కొన్ని ఉదాహరణల్ని చూద్దాం. ఏదెను తోటలో సాతాను హవ్వతో మాట్లాడినప్పుడు, అతని మాటలు హవ్వ మంచిని కోరుతున్నట్లు అనిపించాయి. కానీ అతని పనులు వేరేలా ఉన్నాయి. (ఆది. 3:4, 5) రాజైన దావీదుకు అహీతోపెలు అనే స్నేహితుడు ఉండేవాడు. అతను స్వార్థంతో దావీదుకు నమ్మకద్రోహం చేశాడు. అహీతోపెలు పనులు అతను నిజమైన స్నేహితుడు కాదని చూపించాయి. (2 సమూ. 15:31) నేడు కూడా, మతభ్రష్టులు అలాగే సంఘంలో విభజనలు సృష్టించేవాళ్లు ‘ఇంపైన మాటలు, పొగడ్తలు’ ఉపయోగిస్తారు. (రోమా. 16:17, 18) అలాంటివాళ్లు ఇతరుల మీద శ్రద్ధ ఉన్నట్టు నటిస్తారు కానీ నిజానికి వాళ్లు స్వార్థపరులు.

8. మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

8 బూటకపు ప్రేమ చూపిస్తూ ప్రజల్ని మోసం చేయడం సిగ్గుకరమైన విషయం. అయితే మనం ప్రజల్ని మోసం చేయగలమేమోగానీ యెహోవాను కాదు. వేషధారులు ‘కఠినంగా శిక్షించబడతారని’ యేసు చెప్పాడు. (మత్త. 24:51) యెహోవా సేవకులమైన మనం వేషధారులుగా ఉండాలని ఎన్నడూ కోరుకోం. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నా ప్రేమ నిజమైనదేనా? లేదా నాలో స్వార్థం, మోసం ఉన్నాయా?’ “వేషధారణలేని ప్రేమ” చూపించడానికి సహాయపడే తొమ్మిది మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి—ఎలా?

9. నిజమైన ప్రేమ ఉంటే మనం ఏమి చేయాలనుకుంటాం?

9 మీరు చేసే పనిని ఎవ్వరూ చూడకపోయినా సంతోషంగా చేయండి. మనం ఇతరులకు ప్రేమతో, దయతో చేసే సహాయాన్ని ఎవ్వరూ చూడకపోయినా దాన్ని ఇష్టంగా చేయాలి. (మత్తయి 6:1-4 చదవండి.) అననీయ, సప్పీరా విషయాన్నే తీసుకోండి. వాళ్లు డబ్బును విరాళంగా ఇస్తున్న విషయం అందరికీ తెలియాలని కోరుకున్నారు. ఎంత డబ్బు ఇస్తున్నారనే దానిగురించి కూడా అబద్ధం చెప్పారు. అలా వేషధారణ చూపించినందుకు చివరికి శిక్ష అనుభవించారు. (అపొ. 5:1-10) ఒకవేళ మనం నిజంగా సహోదరుల్ని ప్రేమిస్తే, వాళ్లకు దయతో సహాయం చేయాలనుకుంటాం, అలా చేసిన సహాయం ఇతరులకు తెలియాలని కోరుకోం. ఉదాహరణకు, ఆధ్యాత్మిక ఆహారాన్ని తయారుచేసే విషయంలో పరిపాలక సభకు సహాయం చేస్తున్న సహోదరుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్లు తమకు పేరు రావాలని కోరుకోరు, అంతేకాదు వాళ్లు చేసిన ప్రాజెక్టుల గురించి ఇతరులకు చెప్పుకోరు.

10. మనం ఇతరుల్ని ఎలా ఘనపర్చవచ్చు?

10 ఇతరుల్ని ఘనపర్చండి. (రోమీయులు 12:10 చదవండి.) యేసు తన శిష్యుల పాదాలు కడగడం ద్వారా వాళ్లను ఘనపర్చాడు. (యోహా. 13:3-5, 12-15) మనం యేసులా వినయంగా ఉంటూ ఇతరులకు సేవచేయడానికి కృషిచేయాలి. ఈ విషయాన్ని అపొస్తలులు పవిత్రశక్తి తమ మీదకు వచ్చేవరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. (యోహా. 13:7) మన చదువును బట్టి, మన దగ్గరున్న డబ్బునుబట్టి లేదా మనకున్న ప్రత్యేక నియామకాల్ని బట్టి మనం ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకోకూడదు. ఆ విధంగా మనం ఇతరుల్ని ఘనపరుస్తాం. (రోమా. 12:3) ఎవరైనా ఇతరుల్ని పొగిడినప్పుడు మనం ఈర్ష్యపడంగానీ వాళ్లతో కలిసి సంతోషిస్తాం. ఒకవేళ ఆ పొగడ్తలలో కొంత పొందడానికి మనం కూడా అర్హులమని అనిపించినా వాళ్లతో కలిసి సంతోషిస్తాం.

11. మనమెందుకు నిజాయితీగా మెచ్చుకోవాలి?

11 నిజాయితీగా మెచ్చుకోండి. ఇతరుల్ని మెచ్చుకోవడానికి ఉన్న అవకాశాల కోసం వెదకండి. మెచ్చుకోవడం ద్వారా ఒకరినొకరం ‘బలపర్చుకుంటామని’ మనందరికీ తెలుసు. (ఎఫె. 4:29) అయితే కేవలం ముఖస్తుతి చేయాలనే ఉద్దేశంతో కాదుగానీ మనం నిజాయితీగా మెచ్చుకోవాలి. మనకు అనిపించనివాటిని చెప్పకూడదు లేదా అవసరమైన సలహా ఇవ్వడానికి వెనకాడకూడదు. (సామె. 29:5) ఒకవేళ మనం ఎవరినైనా మొదట మెచ్చుకుని, ఆ తర్వాత అతను లేనప్పుడు విమర్శిస్తూ మాట్లాడితే వేషధారణ చూపించినట్టు అవుతుంది. అపొస్తలుడైన పౌలు ప్రేమ చూపించే విషయంలో నిజాయితీగా ఉన్నాడు. అతను కొరింథులోని క్రైస్తవులకు ఉత్తరం రాసినప్పుడు, వాళ్లు చక్కగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నాడు. (1 కొరిం. 11:2) కానీ వాళ్లను సరిదిద్దాల్సి వచ్చినప్పుడు దానికిగల కారణాన్ని దయగా, స్పష్టంగా వివరిస్తూ సరిదిద్దాడు.—1 కొరిం. 11:20-22.

ఒక సహోదరి కవరులో డబ్బులు పెట్టి అవసరంలో ఉన్న సహోదరికి పంపిస్తుంది

మనం ప్రేమను, ఆతిథ్య స్ఫూర్తిని చూపించగల ఒక మార్గమేమిటంటే అవసరంలో ఉన్న మన సహోదరులకు సహాయం చేయడం (12వ పేరా చూడండి)

12. ఆతిథ్యమిచ్చేటప్పుడు మన ప్రేమలో నిజాయితీ ఉందని ఎలా చూపించవచ్చు?

12 ఆతిథ్యం ఇవ్వండి. మన సహోదరసహోదరీల పట్ల ఉదారతను చూపించాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (1 యోహాను 3:17 చదవండి.) అయితే ఆతిథ్యం ఇచ్చే ఉద్దేశం సరైనదై ఉండాలి. మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు, ‘నా సన్నిహిత స్నేహితుల్ని లేదా సంఘంలో నాకు కావాల్సినవాళ్లను మాత్రమే మా ఇంటికి పిలుస్తానా? తిరిగి నాకు ఏదోకటి చేయగలవాళ్లను మాత్రమే ఇంటికి ఆహ్వానిస్తానా? లేదా నాకు అంతగా పరిచయంలేనివాళ్ల పట్ల, తిరిగి ఏమి చేయలేనివాళ్ల పట్ల ఉదారంగా ఉంటానా?’ (లూకా 14:12-14) ఒకసారి ఊహించుకోండి: తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లోపడిన ఒక సహోదరునికి సహాయం అవసరమైతే, మీరేమి చేస్తారు? లేదా మీరు ఇంటికి పిలిచిన ఒకరు మీకు ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పకపోతే, మీరేమి చేస్తారు? యెహోవా ఇలా చెప్తున్నాడు, “గొణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి.” (1 పేతు. 4:9) మనం సరైన ఉద్దేశంతో ఆతిథ్యమిచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం.—అపొ. 20:35.

13. (ఎ) మనకు మరింత ఓర్పు ఎప్పుడు అవసరం కావచ్చు?(బి)బలహీనులకు మనమెలా సహాయం చేయవచ్చు?

13 బలహీనులకు సహాయం చేయండి. “బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని” బైబిలు ఇస్తున్న ఆజ్ఞ మన ప్రేమలో ఉన్న నిజాయితీని పరీక్షిస్తుంది. (1 థెస్స. 5:14) ఒకప్పుడు విశ్వాసంలో బలహీనంగా ఉన్న చాలామంది కొంతకాలం తర్వాత బలపడ్డారు. కానీ ఇంకొందరికి మనం ఓర్పుతో, ప్రేమతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? బైబిల్ని ఉపయోగిస్తూ వాళ్లను ప్రోత్సహించవచ్చు, మనతో ప్రీచింగ్‌కు రమ్మని పిలవవచ్చు లేదా వాళ్లు మనసువిప్పి మాట్లాడుతున్నప్పుడు వినవచ్చు. ఒక సహోదరుడు లేదా సహోదరి ‘బలవంతులా’ లేదా ‘బలహీనులా’ అని ఆలోచించే బదులు మనందరికీ బలాలు, బలహీనతలు రెండూ ఉంటాయని అర్థంచేసుకోవాలి. పౌలు కూడా తనలో బలహీనతలు ఉన్నాయని ఒప్పుకున్నాడు. (2 కొరిం. 12:9, 10) మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి.

14. మన సహోదరులతో ఎల్లప్పుడూ శాంతిగా ఉండడానికి ఏమి చేయాలి?

14 శాంతిగా ఉండండి. మన సహోదరులతో శాంతిగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నా లేదా మనకు అన్యాయం జరిగినా, వాళ్లతో శాంతిగా ఉండడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. (రోమీయులు 12:17, 18 చదవండి.) ఒకవేళ మనం ఎవరినైనా బాధపెడితే, వాళ్లకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది, కానీ అది హృదయం నుండి రావాలి. ఉదాహరణకు, “మీకు అలా అనిపించింది కాబట్టి నన్ను క్షమించండి” అని అనే బదులు మీ తప్పును ఒప్పుకుంటూ “నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి” అని అనవచ్చు. వివాహ జీవితంలో ప్రశాంతత ఉండడం చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలు అందరి ముందు ప్రేమగా ఉంటున్నట్లు నటిస్తూ, ఎవరూ లేనప్పుడు మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉండడం లేదా బాధపెట్టేలా మాట్లాడుకోవడం, లేదా దురుసుగా ప్రవర్తించడం తప్పు.

15. మనల్ని బాధపెట్టిన వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

15 మనస్ఫూర్తిగా క్షమించండి. ఎవరైనా మనల్ని బాధపెడితే వాళ్లను క్షమిస్తాం, ఆ విషయాన్ని వదిలేస్తాం. ఒకవేళ మనల్ని బాధపెట్టిన విషయం అవతలి వ్యక్తి గ్రహించకపోయినా అతన్ని క్షమించి, దాన్ని మర్చిపోవాలి. “ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగే ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ” ఉండడం ద్వారా మనం ఒకరినొకరం మనస్ఫూర్తిగా క్షమించుకుంటాం. (ఎఫె. 4:2, 3) అలా క్షమించుకోవాలంటే, అవతలి వ్యక్తి చేసిన దానిగురించి ఆలోచించడం మానేయాలి. ప్రేమ “హానిని మనసులో పెట్టుకోదు.” (1 కొరిం. 13:4, 5) ఒకవేళ ఎవరిమీదైనా కోపాన్ని మనసులో ఉంచుకుంటే మన సహోదరునితో లేదా సహోదరితోనే కాదు యెహోవాతో ఉన్న స్నేహాన్ని కూడా పాడుచేసుకునే అవకాశం ఉంది. (మత్త. 6:14, 15) మనల్ని బాధపెట్టిన వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు అతన్ని మనస్ఫూర్తిగా క్షమించామని చూపిస్తాం.—లూకా 6:27, 28.

16. యెహోవా సేవలో మనం ప్రత్యేక నియామకాలు పొందినప్పుడు ఎలా భావించాలి?

16 మన సొంత ప్రయోజనాలను త్యాగం చేయడం. మనం యెహోవా సేవలో ఏదైన ప్రత్యేక నియామకం పొందినప్పుడు “సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి” ఆలోచించడం ద్వారా మన ప్రేమలో నిజాయితీ ఉందని చూపిస్తాం. (1 కొరిం. 10:24) ఉదాహరణకు, సమావేశాల సమయంలో హాల్లోకి ముందుగా అటెండెంట్లు వెళ్తారు. అప్పుడు తమ కోసం, తమ కుటుంబసభ్యుల కోసం సీట్లు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లు అలా చేయరు. బదులుగా తమకు నియమించిన స్థలంలో ఏదోక చోట సీట్లు పెట్టుకుంటారు. ఆ విధంగా వాళ్లు నిస్వార్థమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ల మంచి ఆదర్శాన్ని మనమెలా అనుకరించవచ్చు?

17. ఘోరమైన పాపం చేసినప్పుడు తన ప్రేమలో నిజాయితీ ఉన్న వ్యక్తి ఏమి చేస్తాడు?

17 రహస్యంగా చేసిన పాపాలను ఒప్పుకొని, వాటిని మానేయండి. ఘోరమైన పాపం చేసిన కొంతమంది క్రైస్తవులు దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. బహుశా వాళ్లు అవమానంగా భావించో లేదా ఇతరుల్ని నిరుత్సాహపర్చకూడదనో అలా చేసివుంటారు. (సామె. 28:13) కానీ పాపాన్ని దాచిపెడితే ప్రేమ చూపించినట్లు అవ్వదు. ఎందుకంటే దానివల్ల పాపం చేసిన వ్యక్తికి అలాగే ఇతరులకు హాని జరుగుతుంది. ఎలా? యెహోవా తన పవిత్రశక్తిని ఆ సంఘానికి ఇవ్వడం ఆపేయవచ్చు. ఫలితంగా సంఘంలో శాంతి ఉండకపోవచ్చు. (ఎఫె. 4:30) కాబట్టి ఒక క్రైస్తవుడు ఘోరమైన పాపం చేసినప్పుడు, అతని ప్రేమలో నిజాయితీ ఉంటే చేసిన పాపం గురించి సంఘపెద్దలతో మాట్లాడి, కావాల్సిన సహాయం తీసుకుంటాడు.—యాకో. 5:14, 15.

18. ప్రేమలో నిజాయితీ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

18 లక్షణాలన్నింటిలో ప్రేమే గొప్పది. (1 కొరిం. 13:13) యేసు నిజ అనుచరులు ఎవరో, ప్రేమకు మూలమైన యెహోవాను నిజంగా ఎవరు అనుకరిస్తున్నారో ప్రజలు గుర్తించడానికి ప్రేమే సహాయం చేస్తుంది. (ఎఫె. 5:1, 2) ఒకవేళ “ప్రేమ లేకపోతే నేను పనికిరానివాణ్ణే” అని పౌలు అన్నాడు. (1 కొరిం. 13:2) మనలో ప్రతీఒక్కరం “ప్రేమను మాటల్లో” మాత్రమే కాదు ఎల్లప్పుడూ ‘చేతల్లో చూపిస్తూ, ఆ ప్రేమలో నిజాయితీ ఉండేలా’ చూసుకుందాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి