అందరిని సన్మానించుడి
“అందరిని సన్మానించుడి, . . . దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.”—1 పేతురు 2:17.
1. (ఎ) దేవుడు మరియు క్రీస్తుతోపాటు ఎవరినికూడా సరిగా సన్మానించవలెను? (బి) 1 పేతురు 2:17 ప్రకారము ఏయే రంగములలో మానవులను సన్మానించవలెను?
యెహోవా దేవున్ని మరియు యేసుక్రీస్తును ఘనపరచు బాధ్యతను మనము కలిగియున్నామని చూశాము. అటువంటిది చేయుట సరియైనది, జ్ఞానయుక్తమైనది మరియు ప్రేమపూర్వకమైనది. కానీ మనము తోటిమానవులను కూడా సన్మానించవలెనని దేవుని వాక్యము చూపించుచున్నది. “అందరిని సన్మానించుడి” అని మనము చెప్పబడితిమి. (1 పేతురు 2:17) ఈ వచనము “రాజును సన్మానించుడి” అను ఆజ్ఞతో ముగించబడినందున, వారి స్థానమునుబట్టి దానిని పొందవలసియున్న వారిని సన్మానించవలెనని దాని భావము. కాబట్టి, మనము ఎవరిని సరియైన రీతిలో సన్మానించవలెను? సన్మానమునకు పాత్రులైన వారి సంఖ్య కొందరు తలంచు దానికంటే ఎక్కువగా ఉండవచ్చును. ఇతర వ్యక్తులకు మనము సన్మానము చూపవలసిన రంగములు నాలుగు కలవని మనము చెప్పవచ్చును.
రాజకీయ పాలకులను సన్మానించుము
2. మొదటి పేతురు 2:17లో ప్రస్తావించబడిన “రాజు” ఏ మానవ రాజునైనను లేక రాజకీయ పాలకునినైనను సూచించునని మనకెట్లు తెలియును?
2 వీటిలో మొదటి రంగము లౌకిక ప్రభుత్వములకు సంబంధించినది. మనము రాజకీయ పాలకులను సన్మానించవలసిన అవసరము కలదు. “రాజును సన్మానించుడి” అని పేతురు సలహానిచ్చినప్పుడు, పేతురు రాజకీయ పాలకులను మనస్సులో కలిగియున్నాడని మనమెందుకు చెప్పుదుము? ఎందుకనగా ఆయన క్రైస్తవ సంఘము వెలుపటి పరిస్థితినిగూర్చి మాట్లాడుచున్నాడు. “మనుష్యులు నియమించు ప్రతికట్టడకును . . . లోబడియుండుడి రాజు అందరికిని అధిపతియనియు, . . . రాజువలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి,” అని చెప్పుటను ఆయనప్పుడే ముగించెను. “దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి” అని చెప్పుచు, పేతురు “రాజు”కు భిన్నమైన స్థానములో దేవుని ఉంచుటను కూడా గమనించుము. (1 పేతురు 2:13, 14) కావున సన్మానించుమని పేతురు మనకు ఉద్బోధించుచున్న “రాజు” మానవ రాజులను మరియు రాజకీయ పాలకులను సూచిస్తున్నాడు.
3. “పై అధికారులు” ఎవరు, మరియు వారు దేనికి తగియున్నారు?
3 అపొస్తలుడైన పౌలుకూడా అదే ప్రకారము ఆజ్ఞాపించుచున్నాడు: “పై అధికారులకు లోబడియుండుడి.” ఈ “పై అధికారులు” యెహోవా దేవుడు లేక యేసుక్రీస్తు కాదుగానీ, వారు రాజకీయ పాలకులు, ప్రభుత్వాధికారులై యున్నారు. వీరిని మనస్సులో ఉంచుకొని, పౌలు ఇంకను ఇట్లనుచున్నాడు: “ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారివారి ఋణములను తీర్చుడి.” అవును, రాజకీయ పాలనచేయుటకు దేవునిచే అనుమతించబడిన అటువంటివారు సన్మానింప తగినవారై యున్నారు.—రోమీయులు 13:1, 7.
4. (ఎ) రాజకీయ పాలకులను ఎట్లు సన్మానించవచ్చును? (బి) పాలకులను సన్మానించుటలో అపొస్తలుడైన పౌలు ఏ మాదిరినుంచెను?
4 రాజకీయ పాలకులను మనమెట్లు సన్మానించుదుము? ఒక మార్గమేదనగా వారిని మిక్కిలి గౌరవించుటద్వారా. (1 పేతురు 3:15 పోల్చుము.) మరియు వారు దుష్ట మనుష్యులైనను వారి స్థానమునుబట్టి అట్టి గౌరవమిచ్చుట తగినదే. “శిక్షపడకుండా తానెటువంటి కీడైననూ చేయగలనని తలంచిన” వ్యక్తిగా గవర్నరయిన ఫేలిక్సును రోమా చరిత్రకారుడైన టాసిటస్ వర్ణించెను. అయినను పౌలు ఫేలిక్సు ఎదుట తన వాదమును గౌరవపూర్వకముగా ప్రారంభించెను. అదేప్రకారము, అగ్రిప్ప రక్తసంబంధపు లైంగికత్వములో జీవించుచున్నాడని పౌలు ఎరిగియున్ననూ, పౌలు గౌరవపూర్వకముగా రాజైన హేరోదు అగ్రిప్ప IIతో ఇట్లనెను, “తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను.” అదేవిధముగా, ఫేస్తు విగ్రహారాధికుడైనను, పౌలు గవర్నరయిన ఫేస్తును “మహాఘనత వహించిన” అని సంబోధించి సన్మానించెను.—అపొ. కార్యములు 24:10; 26:2, 3, 24, 25.
5. ఇంకేవిధముగా ప్రభుత్వాధికారులను సన్మానించుట చూపించబడినది, మరియు దీనిని చేయుటలో యెహోవాసాక్షులు ఎట్లు మంచి మాదిరినుంచారు?
5 ప్రభుత్వాధికారులను మనము సన్మానించు మరొక మార్గము ప్రభుత్వాధికారులకు వారి ఋణములను తీర్చుటనుగూర్చి అపొస్తలుడైన పౌలు వ్రాసినదాని ద్వారా సూచించబడెను. “యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి” అని ఆయనచెప్పెను. (రోమీయులు 13:7) ప్రపంచములో వారు ఏ దేశములో జీవించినను యెహోవాసాక్షులు అటువంటి రుణాలను చెల్లిస్తారు. ఇటలీలో వార్తాపత్రికయగు లా స్టాంపా గమనించిన దేమనగా, “వారు ఎవరైనను కోరుకొనగల అత్యంత యథార్థపరులైన పౌరులైయున్నారు. వారు పన్నులు ఎగవేయరు లేక తమ స్వంత ప్రయోజనము కొరకు అనుకూలముగాలేని నియమాలను ఉల్లంఘించరు.” అమెరికా, ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ నందలి ది పోస్ట్ యెహోవాసాక్షులను గూర్చి ఇలా వ్రాసింది: “వారు తమ పన్నులు చెల్లిస్తారు. దేశములో వారు అత్యంత నిజాయితీగల పౌరులై యున్నారు.”
యజమానులను సన్మానించుట
6. మరెవరినికూడా సన్మానించవలెనని అపొస్తలులైన పౌలు మరియు పేతురు చెప్పారు?
6 మనము సన్మానము చూపవలసిన రెండవ రంగమేదనగా మన ఉద్యోగ స్థలములు. ఉద్యోగ సంబంధమందు మనకు పైగా ఉన్నవారిని క్రైస్తవులు సన్మానించు ప్రాముఖ్యతను అపొస్తలులైన పౌలు మరియు పేతురు, ఈ ఇద్దరూ నొక్కితెల్పారు. పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, . . . మరి యెక్కువగా వారికి సేవచేయవలెను.” మరియు పేతురు ఇట్లు చెప్పెను: “పనివారలారా, మంచి వారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.”—1 తిమోతి 6:1, 2; 1 పేతురు 2:18; ఎఫెసీయులు 6:5; కొలొస్సయులు 3:22, 23.
7. (ఎ) “దాసులు” “యజమానులను” సన్మానించవలెనని బైబిలు చెప్పిన సలహా ఈనాడు ఎట్లు సరిగా అన్వయించును? (బి) క్రైస్తవ యజమానులను కలిగిన క్రైస్తవ ఉద్యోగులు దేనిని గమనించుటలో జాగ్రత్తగా ఉండవలెను?
7 ఈనాడు బానిసత్వము అంతవ్యాప్తిలో లేదనుకోండి. అయితే బానిస-యజమాని సంబంధములో క్రైస్తవులను నడిపించిన సూత్రములు ఉద్యోగి-యజమాని సంబంధమునకు అన్వయించును. ఆ విధముగా, సంతోషపరచుటకు కష్టమైన యజమానులను సహితము సన్మానించవలసిన బాధ్యత క్రైస్తవ ఉద్యోగులకు కలదు. ఆ యజమానే తోటి విశ్వాసియై ఉన్నట్లయిన అప్పుడు సంగతేమి? ఆ సంబంధాన్నిబట్టి ప్రత్యేక ప్రతిఫలాన్ని లేక ప్రాధాన్యతను ఆశించుటకు బదులు, ఆ ఉద్యోగి తన క్రైస్తవ యాజమాని విషయములో ఎన్నడును ఏ విధమైన అలుసు తీసికొనకుండా మరియెక్కువగా అతనికి సేవచేయవలెను.
కుటుంబ వలయములో సన్మానము
8, 9. (ఎ) పిల్లలు ఎవరిని సన్మానించ బద్ధులైయున్నారు? (బి) పిల్లలెందుకు ఈ సన్మానము చూపవలెను, మరియు దీనిని వారెట్లు చూపగలరు?
8 సన్మానము చూపవలసిన మూడవ రంగమేదనగా కుటుంబ వలయము. ఉదాహరణకు, పిల్లలు తమ తలిదండ్రులను సన్మానించు బాధ్యత క్రింద ఉన్నారు. ఇది మోషే కివ్వబడిన ధర్మశాస్త్రములో ఒక అవసరతయే గాకుండ అది క్రైస్తవులకు కూడా ఒక బాధ్యతయై యున్నది. అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. . . . నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.”—ఎఫెసీయులు 6:1, 2; నిర్గమకాండము 20:12.
9 పిల్లలు తమ తలిదండ్రులను ఎందుకు సన్మానించవలెను? ఎందుకనగా దేవుడు వారికిచ్చిన అధికారమును బట్టి, అంతేకాకుండా జన్మనిచ్చి చిన్నతనమునుండి పెంచిపోషించుట ద్వారా తలిదండ్రులు చేసినదానిని బట్టి వారు వారి తలిదండ్రులను సన్మానించవలెను. పిల్లలెట్లు తలిదండ్రులను సన్మానించవలెను? ప్రత్యేకంగా వారికి విధేయులై లోబడియుండుట ద్వారా వారు దీనిని చేయవలెను. (సామెతలు 23:22, 25, 26; కొలొస్సయులు 3:20) అలా సన్మానించుటకు పెరిగిపెద్దవారైన పిల్లలు వృద్ధులైన తమ తలిదండ్రులు లేక తాతఅవ్వలకు వస్తుదాయకమైన, ఆలాగే ఆత్మీయ మద్దతునిచ్చుట అవసరమై యుండవచ్చును. తమ పిల్లలు, క్రైస్తవ సహవాసము మరియు ప్రాంతీయ పరిచర్యలో పూర్తిగా భాగము వహించుటవంటి ఇతర బాధ్యతలతో దీనిని జ్ఞానయుక్తముగా సమతూకము చేయుట అవసరము.—ఎఫెసీయు 5:15-17; 1 తిమోతి 5:8; 1 యోహాను 3:17.
10. భార్యలు ఎవరిని సన్మానించు బాధ్యతను కలిగియున్నారు, మరియు వారు దీనిని ఏయే విధములుగా చేయగలరు?
10 అయితే కుటుంబములో ఇతరులను సన్మానించు బాధ్యతను కేవలము పిల్లలు మాత్రమే కలిగిలేరు. భార్యలు తమ భర్తలను సన్మానించవలెను. “భార్యయైతే తన భర్తయందు భయము [ప్రగాఢ గౌరవమును NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను” అని కూడా అపొస్తలుడైన పౌలు చెప్పెను. (ఎఫెసీయులు 5:33; 1 పేతురు 3:1, 2) భర్తలకు “ప్రగాఢ గౌరవము” చూపుటలో వారిని సన్మానించుట నిశ్చయముగా ఇమిడియున్నది. శారా తన భర్తయగు అబ్రాహామును “యజమానుడని” పిలిచి ఆయనను సన్మానించెను. (1 పేతురు 3:6) కావున స్త్రీలారా, శారాను అనుకరించండి. వారి నిర్ణయాలను అంగీకరించి, వాటిని విజయవంతము చేయుటకు పనిచేయుటద్వారా మీ భర్తలను సన్మానించండి. వారిపై మరి యెక్కువ భారము మోపుటకు బదులు, మీ భర్తలు వారి బరువుబాధ్యతలు నిర్వహించుటకు మీరు చేయగలిగినంతా చేయుటద్వారా, మీరు వారిని సన్మానించుదురు.
11. సన్మానించు విషయములో, భర్తలు ఏ బాధ్యతను కలిగియున్నారు, ఎందుకు?
11 భర్తల విషయమేమి? దేవుని వాక్యమందు వారు ఇలా ఉపదేశింపబడ్డారు: “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై యున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానముచొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) అది ప్రతి భర్త ఆలోచించునట్లు చేయవలెను. అనగా “అమూల్యమైనది. సున్నితమైనది. జాగ్రత్తగా చూడుము! సన్మానించుము!” వంటి మాటలు [లేబుల్స్] భార్యపై వ్రాయబడియున్నట్లు దాని అర్థము. కాబట్టి తమ భార్యల యెడల తగిన శ్రద్ధచూపిస్తూ వారిని సన్మానించనట్లయిన, తమ ప్రార్థనలు అడ్డగింపబడుటతో యెహోవా దేవునితో తమకుగల సంబంధము చెడిపోవునని భర్తలు గుర్తుంచుకొనవలెను. నిజముగా, కుటుంబ సభ్యులు ఒకరినొకరు సన్మానించుకొనుట పరస్పరము ప్రయోజనకరము.
సంఘములో
12. (ఎ) సంఘములో సన్మానము చూపవలసిన బాధ్యతను ఎవరు కలిగియున్నారు? (బి) సన్మానము పొందుట సరియేనని యేసు ఎట్లు చూపించెను?
12 క్రైస్తవ సంఘములో సన్మానము చూపవలసిన బాధ్యతకూడా ప్రతిఒక్కరిపై ఉన్నది. మనకిట్లు సలహా ఇవ్వబడినది: “ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) సన్మానమును అంగీకరించుట సరియేనని యేసు తన ఒకానొక ఉపమానములో సూచించెను. మనమొక విందుకు ఆహ్వానింపబడినప్పుడు మనము కడపటి స్థానమును తీసికొనవలెను, అప్పుడు మనలను పిలిచిన అతిథేయి మనలను అగ్రస్థానము తీసికొమ్మని అడిగినప్పుడు, మనము తోటి అతిథులందరిలో సన్మానింపబడిన వారమగుదుము. (లూకా 14:10) మనమందరమిప్పుడు సన్మానించబడుటను మెచ్చుకొందుము గనుక, మనము సహానుభూతిని కలిగియుండి ఒకరినొకరము సన్మానించుకోవలదా? మనము దీనినెట్లు చేయగలము?
13. సంఘములోని ఇతరులను మనము సన్మానించగల కొన్ని మార్గములేమై యున్నవి?
13 చక్కగా చేసిన పనిని మెచ్చుకొను మాటలు సన్మానించుటకు సరిసమానమై యుండును. కాబట్టి, సంఘములో ఎవరైనా ప్రసంగించినప్పుడు లేక వ్యాఖ్యానించినప్పుడు వారిని మెచ్చుకొనుటద్వారా మనము ఒకరినొకరము సన్మానించుకొనగలము. దీనికితోడు, మన క్రైస్తవ సహోదర సహోదరీల యెడల దీనమనస్సు ధరించుకొని, వారిని మిక్కిలి గౌరవించుటద్వారా, మనము పరస్పరము సన్మానించుకొనగలము. (1 పేతురు 5:5) ఆ విధముగా, మనము వారిని తోటి యెహోవా దేవుని సేవకులుగా సన్మానించ విలువగలవారని ఎంచుదుము.
14. (ఎ) సంఘమందలి సహోదరులు సహోదరీలకు తగిన సన్మానమునెట్లు చూపగలరు? (బి) బహుమతులనిచ్చుట సన్మానించుటకొక మార్గమని ఏది చూపించుచున్నది?
14 క్రైస్తవ వృద్ధ స్త్రీలను తల్లులుగాను, యౌవన స్త్రీలను “పూర్ణపవిత్రతతో” స్వంత చెల్లెండ్రుగాను చూడవలెనని అపొస్తలుడైన పౌలు యౌవనుడైన తిమోతికి సలహానిచ్చెను. అవును, అనవసరముగా చనువుచూపుట వంటి వాటిద్వారా సహోదరులు తమ క్రైస్తవ సహోదరీలతో ఇష్టంవచ్చినట్లు వ్యవహరించకుండా జాగ్రత్తపడినప్పుడు, వారు వారిని సన్మానించిన వారగుదురు. పౌలు ఇంకను ఇట్లు వ్రాసెను: “నిజముగా అనాధలైన విధవరాండ్రను సన్మానించుము.” అవసరతయందున్న ఒక విధవరాలిని సన్మానించు ఒక విధమేదనగా ఆమెకు వస్తుదాయక సహాయము చేయుటయే. అయితే దీనికి అర్హురాలగుటకు, ఆమె ‘సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలై’ యుండవలెను. (1 తిమోతి 5:2-10) వస్తుదాయక బహుమతుల సంబంధముగా, లూకా మెలితే ద్వీపమందలి ప్రజలను గూర్చి ఇట్లు వ్రాసెను: “వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాదచేసి, మేము ఓడఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి ఓడలో ఉంచిరి.” (అపొ. కార్యములు 28:10) ఆ విధముగా వస్తుదాయక బహుమతులద్వారా వేరేవారిని సన్మానించవచ్చును.
15. (ఎ) ఎవరియెడల సన్మానము చూపవలసిన ప్రత్యేక బాధ్యతను మనము కలిగియున్నాము? (బి) నాయకత్వం తీసికొనుచున్న వారియెడల మనము సన్మానము చూపగల ఒక మార్గమేమైయున్నది?
15 తిమోతికి తన పత్రికను కొనసాగించుచు, పౌలు ఇలా వ్రాయుచున్నాడు: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.” (1 తిమోతి 5:17) పెద్దలను, లేక పైవిచారణకర్తలను మనమేవిధముగా సన్మానించగలము? పౌలు ఇట్లనెను: “నేను క్రీస్తునుపోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్నుపోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:1) తనను పోలి నడుచుకొనుమనిన పౌలు మాటలను మనము లక్ష్యపెట్టినప్పుడు, మనమాయనను సన్మానించిన వారమగుదుము. ఇది మనమధ్య ఈనాడు నాయకత్వము వహించుచున్న వారికి అన్వయించును. వారి మాదిరిని అనుసరించి వారినిపోలి నడుచుకొనినంత మేరకు, మనము వారిని సన్మానించు వారమైయుందుము.
16. నాయకత్వం తీసికొనుచున్న వారియెడల ఇంకా ఏ విధములుగా సన్మానము చూపవచ్చును?
16 పైవిచారణకర్తలను మరొక విధముగా సన్మానించుటకు మనము ఈ ఉద్బోధను గైకొనవచ్చును: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; . . . గనుక . . . వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) పిల్లలు తమ తలిదండ్రులకు లోబడియుండుట ద్వారా వారిని సన్మానించినట్లే, మనమూ నాయకత్వము తీసికొనువారి మాటవిని వారికి లోబడియుండుట ద్వారా వారిని సన్మానించుదుము. వస్తుదాయక బహుమతులచే మెలితే నివాసులు పౌలును, ఆయన సహవాసులను సత్కరించిన ప్రకారమే అనేకమార్లు సొసైటియొక్క ప్రయాణ ప్రతినిధులు సత్కరింపబడిరి. అయితే, అవి మెచ్చుకొనబడునని లేక కావలెనని వారెన్నడును అటువంటి బహుమతులను అడుగరు లేక సూచనప్రాయముగా తెల్పరు.
17. సన్మానము చూపవలసిన ఏ బాధ్యతను పైవిచారణచేయు ఆధిక్యతగలవారు కలిగియున్నారు?
17 మరొకవైపున, దైవపరిపాలనా సంస్థలో పైవిచారణచేయు స్థానములందున్న వారందరు—అనగా వారు స్థానిక సంఘములో, వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయ పరిధిలోని ప్రాంతము లేక జిల్లాలో ప్రయాణ పైవిచారణకర్తగా, లేక కుటుంబ వలయములో ఉన్ననూ వారు—వారి ఆధీనంలో ఉన్నవారిని సన్మానించు బాధ్యతను కలిగియున్నారు. దీనికి వారు తదనుభూతిని ఆలాగే సానుభూతిని కలిగియుండుట అవసరము. తానుటువంటి వాడనని యేసుక్రీస్తు చెప్పినట్లుగా, సాత్వికులుగా మరియు దీనమనస్సుగల వారిగా వారు అన్ని సమయాలలో సమీపించదగిన వారై యుండవలెను.—మత్తయి 11:29, 30.
ఒకరినొకరు సన్మానించుకొనుటకు పనిచేయుము
18. (ఎ) అర్హులైన వారిని సన్మానించుటనుండి మనలను ఏది అడ్డగించగలదు? (బి) ప్రతికూలమైన, విమర్శనాత్మకమైన మానసిక వైఖరి ఎందుకు సమర్థనీయము కాదు?
18 ఒకరినొకరము సన్మానించుకొనుటకు మనమందరము కష్టించి పనిచేయు అవసరము కలదు, ఏలయనగా మనమలా చేయుటకు ఒక శక్తివంతమైన ఆటంకము కలదు. మన అసంపూర్ణ హృదయమే ఆ ఆటంకము, లేక అడ్డంకుయై యున్నది. “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు చెప్పుచున్నది. (ఆదికాండము 8:21) ఇతరులకు మనము తగిన రీతిలో సన్మానించుటను అడ్డగించు ఒకానొక మానవ ఉద్దేశ్యము ఏమనగా, ప్రతికూలమైన విమర్శనాత్మకమైన మానసిక విధానమును కలిగియుండుటయే. మనమందరము యెహోవా కనికరము మరియు కృప అవసరమైన బలహీన, అసంపూర్ణ మానవులమై యున్నాము. (రోమీయులు 3:23, 24) దీనిని గుణగ్రహించిన వారిగా మనము, మన సహోదరుల బలహీనతలనుగూర్చి అదేపనిగా తలంచకుండుటకు లేక మన సహోదరులపై సందేహాస్పద ఉద్దేశములను రుద్దకుండుటకు జాగ్రత్తపడుదుము గాక.
19. ఎటువంటి ప్రతికూల దృక్పధమునైనను త్రిప్పికొట్టుటకు మనకేది సహాయము చేయును?
19 అటువంటి ఏ ప్రతికూల ఉద్దేశమునకైనను ప్రేమ మరియు ఆశానిగ్రహమే తగినమందు. మన సహోదరుల చక్కని లక్షణములను గమనిస్తూ, మనము వారి విషయమై సానుభూతిని, యథార్థతను, అనుకూల దృక్పధమును కలిగియుండు అవసరము కలదు. మనకు అర్థముకానిదేదైనా ఉంటే, అన్ని సమయములలో మనము మన సహోదరులను నమ్ముటకు ఇష్టపడి పేతురు సలహాను లక్ష్యపెట్టవలెను: “ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.” (1 పేతురు 4:8) మన సహోదరులను మనము తగినరీతిన సన్మానించవలెనంటె మనము తప్పక అటువంటి ప్రేమను కలిగియుండవలెను.
20, 21. ఒకరినొకరము సన్మానించుకొనుటలో కలుగజేసికొను మరొక దృక్పధమేమై యున్నది? (బి) ఈ దృక్పధమును త్రిప్పికొట్టుటకు మనకేది సహాయము చేయును?
20 ఇతరులను తగిన రీతిగా సన్మానించుటలో మనకు అడ్డుతగులు మరొక లక్షణమేమనగా సుతిమెత్తని (ఊరకనే కోపగించుకొను) హృదయం, లేక అతి సున్నిత (sensitive) స్వభావమే. ఈ సున్నితత్వమునకు ఒక స్థానము కలదు. కళాకారులు వారి వృత్తిలో భాగంగా శబ్దములు లేక రంగుల విషయమై (sensitive) సూక్ష్మమముగా ఉండాలి. అయితే ఇతరులతో మన సంబంధములయందు అతి సున్నిత స్వభావమును లేక సుతిమెత్తని హృదయమును కలిగియుండుట మన సమాధానమును దోచుకొను స్వార్థ విధానమైయుండి ఇతరులను సన్మానించకుండా అది మనలను అడ్డగించును.
21 ఈ సంబంధముగా మనకు చక్కని సలహానిచ్చు మాటలను ప్రసంగి 7:9లో కనుగొనవచ్చును: “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” కాబట్టి అతి సున్నిత స్వభావమును కలిగియుండుట లేక త్వరగా అభ్యంతరపడుట జ్ఞానము, మంచి వివేకం లేకపోవుటను ఆలాగే ప్రేమ లేకపోవుటను బయల్పరచును. ప్రతికూలముగా ఉండుట, అతిగా విమర్శించుట, లేక అతి సున్నిత స్వభావమును కలిగియుండుట వంటి మన వ్యర్థ తలంపులు అర్హులైన వారందరిని సన్మానించుటనుండి మనలను ఆపుజేయకుండా జాగ్రత్తపడవలెను.
22. సన్మానించు మన బాధ్యతను ఎట్లు క్లుప్తీకరించవచ్చును?
22 ఇతరులను సన్మానించు అనేక కారణములను మనము నిజముగా కలిగియున్నాము. మరియు మనము చూసినట్లుగా మనమట్లు సన్మానించ గల్గుటకు అనేకానేక మార్గములును కలవు. మనము సన్మానించకుండా ఏ స్వార్థము లేక ప్రతికూల దృక్పధము అడ్డుతగులకుండా మనమన్ని సమయములలో జాగ్రత్తగా ఉండవలెను. ప్రత్యేకముగా, మన కుటుంబ వలయమందలి వారిని, అనగా భార్యాభర్తలు పరస్పరము మరియు పిల్లలు తలిదండ్రులను సన్మానించుటలో శ్రద్ధకలిగి యుండవలెను. సంఘములో, మనతోటి ఆరాధికులను, ప్రత్యేకముగా మనమధ్య పైవిచారణ స్థానములలో కష్టించి పనిచేయు వారిని సన్మానించు బాధ్యతను మనము కలిగియున్నాము. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పినందున, ఈ రంగములన్నింటిలో పైన ప్రస్తావించబడిన వారిని సరియైన రీతిగా సన్మానించుట మనకు ప్రయోజనకరమగును.—అపొ. కార్యములు 20:35. (w91 2/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ మనము ఎందుకు మరియు ఎట్లు ప్రభుత్వాధికారులను సన్మానించవలెను?
◻ ఉద్యోగి-యజమాని సంబంధమునకు ఏ బైబిలు సలహాను అన్వయించవచ్చును?
◻ కుటుంబ వలయములో సన్మానమునెట్లు చూపవలెను?
◻ సంఘములో ఏ ప్రత్యేకమైన సన్మానమును చూపవచ్చును, ఎందుకు?
◻ ఇతరులను సన్మానించుటలో మానవ బలహీనతను ఎట్లు అధిగమించవచ్చును?