యెహోవాకు సన్నిహితముగా ఉండుము
“ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.”—రోమీయులు 12:12.
1. ప్రార్థన విషయంలో యెహోవా చిత్తమేమి, ప్రార్థించుటను గూర్చి అపొస్తలుడైన పౌలు ఏ ప్రోత్సాహము నిచ్చెను?
యెహోవా నమ్మకమైన తన ప్రజలందరికి “నిరీక్షణకర్తయగు దేవుడు.” వారియెదుట ఆయన ఉంచిన సంతోషభరితమైన నిరీక్షణను పొందునట్లు, సహాయముకొరకై వారు చేయు విన్నపములను “ప్రార్థన ఆలకించువానిగా” ఆయన వినును. (రోమీయులు 15:13; కీర్తన 65:2) ఆయన తన వాక్యమైన బైబిలుద్వారా, వారు కోరుకొన్న ఏ సమయములోనైనా తనయొద్దకు రమ్మని తనసేవకులందరిని ప్రోత్సహించుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు వారి ఆంతర్యమందలి శ్రద్ధలను వినుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. వాస్తమునకు, వారిని “ప్రార్థనయందు పట్టుదలకలిగియుండుడని,” “యెడతెగక ప్రార్థనచేయుడని” ఆయన ప్రోత్సహించుచున్నాడు.a (రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17) క్రైస్తవులందరు ప్రార్థనలో యెడతెగక ఆయనను అడుగుతూ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుద్వారా తమ హృదయములను ఆయన యెదుట క్రుమ్మరించుట యెహోవా చిత్తము.—యోహాను 14:6, 13, 14.
2, 3. (ఎ) “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడని” దేవుడు మనకెందుకు ఉద్బోధించెను? (బి) దేవుడు మనలను ప్రార్థించమని కోరుతున్నట్లు ఏ అభయము మనకు ఉన్నది?
2 దేవుడెందుకు ఇట్టి ఉద్బోధను మనకు దయచేయుచున్నాడు? ఎందుకనగా జీవిత వత్తిడులు, బాధ్యతలు ప్రార్థనను మనము మరచునంతగా మనలను క్రుంగదీయగలవు. లేక సమస్యలు మనము నిరీక్షణయందు సంతోషించుటలో ఆగిపోవునంతగా అధికము కాగా ప్రార్థనచేయకుండా మానుకొందుము. ఈ విషయముల దృష్ట్యా, ప్రార్థనచేయుటకు ప్రోత్సహించి, సమస్త ఆదరణ మరియు సహాయమునకు మూలమైన యెహోవా దేవునితో సన్నిహితముగా మనలను చేరవేయు జ్ఞాపికలు మనకు అవసరము.
3 శిష్యుడైన యాకోబు ఇట్లు వ్రాసెను: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:8) మన అసంపూర్ణ మానవ స్థితియందును, మనము ఆయనకు చేయు మొరలను వినుటకు ఆయన ఎంతో పైగా ఉన్నవాడు లేక దూరముగా ఉన్నవాడు కాదు. (అపొస్తలుల కార్యములు 17:27) అంతేకాక, ఆయన ఉదాసీనతతోయుంటూ శ్రద్ధలేనివాడు కాదు. కీర్తన రచయిత ఇట్లనుచున్నాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.”—కీర్తన 34:15; 1 పేతురు 3:12.
4. ప్రార్థన పట్ల యెహోవా చూపు అవధానమును ఎట్లు దృష్టాంతపరచవచ్చును
4 యెహోవా ప్రార్థనను ఆహ్వానించును. దీనిని మనము అనేకమంది కూడుకొని మాట్లాడుకొనుచున్న ఒక కూడికకు పోల్చవచ్చును. ఇతరులు మాట్లాడుకొనేదాన్ని వింటూ నీవక్కడ ఉన్నావు. గమనించువానిగా ఉండుటే అచ్చట నీ పాత్ర. అయితే ఒకరు నీ వైపు తిరిగి, నీ పేరు పిలిచి, నీతో మాట్లాడం ప్రారంభించారు. ఇది ఒక ప్రత్యేకమైనరీతిలో నీ అవధానాన్ని ఆకట్టుకొంటుంది. ఆలాగే, వారు ఎక్కడున్నను తన ప్రజలనుగూర్చి దేవుడు శ్రద్ధకలిగియున్నాడు. (2 దినవృత్తాంతములు 16:9; సామెతలు 15:3) కావున ఆయన మన మాటలను విని, రక్షణ కల్పించుటకు ఆసక్తితో వాటిని గమనించును. మనము దేవుని నామమున ప్రార్థనచేసినప్పుడు, దానిచే ఆయన అవధానము ఆకట్టుకొనబడి, విస్తారమైన రీతిలో ఆయన దృష్టి కేంద్రీకృతము చేయబడుతుంది. బయటకు పలుకబడక, మానవ హృదయమందు, మనస్సునందు చేయబడిన విన్నపమును సహితము యెహోవా తన శక్తినిబట్టి తెలుసుకొని అర్థము చేసికొనగలడు. తన నామమున అడుగుతూ, ఆయనకు సమీపస్థులు కావలెనని యథార్థముగా వెదకువారందరికి ఆయన సమీపస్థుడనగుదునని దేవుడు మనకు అభయమిచ్చుచున్నాడు.—కీర్తన 145:18.
దేవుని సంకల్ప ప్రకారము ప్రత్త్యుత్తరము
5. (ఎ) “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అను ఉపదేశము మన ప్రార్థనలనుగూర్చి దేనిని సూచించుచున్నది? (బి) ప్రార్థనలకు దేవుడు ఎట్లు జవాబిచ్చును?
5 ఒక విషయమునుగూర్చి ఆయన జవాబు స్పష్టమయ్యేంతవరకు కొంతకాలము మనము ప్రార్థిస్తూనేయుండునట్లు యెహోవా మనలను చేయవచ్చునని ప్రార్థనయందు పట్టుదలకలిగియుండుడి అను హెచ్చరిక సూచిస్తూ ఉన్నది. మనకు ఎంతో అవసరమైనను చాలా కాలము ఆలస్యమైనందున దేవుని అనుగ్రహము లేక కృప కొరకు దేవుని అడుగుటయందు మనము అలసిపోయామనే భావన పొందవచ్చును. అందుకే యెహోవాదేవుడు అటువంటి విధానమునకు లొంగిపోక ప్రార్థనచేస్తూనే యుండాలని మనలను కోరుచున్నాడు. కేవలం మనం తర్కించుకొన్నట్లుగాక ఆయన మన ప్రార్థనను గౌరవించి మన అవసరతను తీర్చునను నమ్మకముతో మన శ్రద్ధలను గూర్చి విన్నవించుకొనుటయందు మనము కొనసాగవలెను. యెహోవాదేవుడు నిశ్చయంగా మన విన్నపములను తన సంకల్పమునకు తగినట్లు సమతూకముచేయును. ఉదాహరణకు, మన విన్నపమునుబట్టి ఇతరులు ప్రభావితము చెందవచ్చును. ఆ విషయమును మనము తన కుమారుడు తనను ఒక సైకిలు కొనిపెట్టమని అడిగిన తండ్రికి పోల్చవచ్చును. ఆ కుమారునికి సైకిలు కొనిపెడితే, మరొక కుమారుడు తనకు కూడా ఒకటి కావాలని అడుగుతాడని తండ్రికి తెలుసు. అయితే ఈ కుమారునికి సైకిలును కొని ఇచ్చుటకు తగినంత వయస్సులేనందున, ఆ సమయానికి ఎవరికీ కొనకూడదని తండ్రి నిర్ణయించుకొనవచ్చును. అదేరీతిగా, ఆయన సంకల్పము మరియు కాలప్రమాణాన్ని బట్టి మనకు మరియు ఇతరులకు ఏది శ్రేష్టమో మన పరలోకపు తండ్రి నిర్ణయించును.—కీర్తన 84:8, 11; హబక్కూకు 2:3ను పోల్చుము.
6. ప్రార్థననుగూర్చి యేసు ఏ ఉపమానము నిచ్చెను, మరియు ప్రార్థనయందు పట్టుదలకలిగియుండుట దేనిని ప్రదర్శించును?
6 “విసుకక నిత్యము ప్రార్థించు” అవసరతనుగూర్చి యేసు తన శిష్యులకు ఇచ్చిన ఉపమానము ఎంతో గుర్తించదగినది. న్యాయమును పొందలేకపోయిన విధవరాలు, తాను న్యాయమును పొందేంతవరకు మానవ న్యాయాధిపతికి పట్టువిడువక విన్నవించుకొనెను. యేసు ఇలా అనెను: “దేవుడు తాను ఏర్పరచుకొనిన . . . వారికి న్యాయము తీర్చడా?” (లూకా 18:1-7) ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుట మన విశ్వాసమును, యెహోవాపై మన ఆధారమును, ఫలితమును ఆయన చేతిలోకి వదలిపెట్తూ ఆయనకు సన్నిహితముగాయుండు మన కోరికను ప్రదర్శించును.—హెబ్రీయులు 11:6.
యెహోవాకు సన్నిహితముగా ఉన్న మాదిరులు
7. యెహోవాకు సన్నిహితముగా ఉండుటలో హేబెలు విశ్వాసమును మనమెట్లు అనుకరించగలము?
7 దేవుని సేవకులు చేసిన ప్రార్థనా వృత్తాంతములతో బైబిలు నిండియున్నది. ఇవి, “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణకలుగుటకై . . . మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:4) యెహోవాకు సన్నిహితముగా ఉన్నవారి కొన్ని మాదిరులను పరిశీలించుట ద్వారా మన నిరీక్షణ బలపరచబడును. హేబెలు దేవునికి అంగీకృతమైన అర్పణను చేసినప్పుడు, అచ్చట ఏ ప్రార్థనగూర్చియు చెప్పబడనప్పటికి, ఆయన నిశ్చయంగా తన అర్పణ అంగీకారమగుటకు యెహోవాను ప్రార్థనలో విన్నవించుకున్నాడు. హెబ్రీయులు 11:4 ఇట్లు చెప్పుచున్నది: “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. . . . అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను.” ఆదికాండము 3:15 నందలి వాగ్దానము హేబెలుకు తెలియును. అయితే, ఇప్పుడు మనకు తెలిసియున్న దానితో పోలిస్తే, ఆయనకు చాలా కొంచెమే తెలియును. అయినను, హేబెలు తాను కలిగియున్న జ్ఞానముపైననే పనిచేసెను. ఆలాగే ఈనాడు, దేవుని సత్యముయెడల క్రొత్తగా ఆసక్తిచూపు కొందరు ఇంకా ఎక్కువ జ్ఞానమును కలిగియుండకపోవచ్చును. అయితే వారు వారికి కలిగియున్న జ్ఞానమునే హేబెలువలె బాగుగా ఉపయోగింతురు. ఔను, వారు విశ్వాసముతో పనిచేయుదురు.
8. అబ్రాహాము యెహోవాకు సన్నిహితముగా ఉన్నాడని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము, మరియు మనకై మనము ఏ ప్రశ్నను అడుగుకొనవలెను?
8 మరొక నమ్మకమైన దేవుని సేవకుడు “నమ్మిన వారందరికి తండ్రియైన” అబ్రాహాము. (రోమీయులు 4:11) క్రితమెన్నటికంటెను, నేడు మనకు బలమైన విశ్వాసము అవసరము. అబ్రాహామువలె విశ్వాసముతో ప్రార్థించుట మనకు అవసరము. ఆదికాండము 12:8 ఆయన “యెహోవాకు బలిపీఠమునుకట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను” అని చెప్పుచున్నది. అబ్రాహాము దేవుని నామమును ఎరిగియుండి దానిని ప్రార్థనలో ఉపయోగించెను. అనేకమారులు ఆయన యథార్థతతో ప్రార్థనయందు పట్టుదల కలిగియుండి “నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన” చేయుచుండెను. (ఆదికాండము 13:4; 21:33) అబ్రాహాము విశ్వాసముతో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అందుకే ఆయన దానికి ప్రసిద్ధికెక్కెను. (హెబ్రీయులు 11:17-19) ప్రార్థన అబ్రాహామునకు రాజ్యనిరీక్షణయందు బహుగా సంతోషిస్తూ ఉండునట్లు సహాయపడినది. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుటలో మనము అబ్రాహాము మాదిరిని అనుసరిస్తున్నామా?
9. (ఎ) దావీదు ప్రార్థనలు దేవుని ప్రజలకెందుకు ఈనాడు ఎంతో ప్రయోజనకరముగా ఉండగలవు? (బి) యెహోవాకు సన్నిహితముగా ఉండుటకు దావీదువలె ప్రార్థనచేయుటద్వారా మనకు ఏ ఫలితముండవచ్చును?
9 ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుటలో దావీదు ఉన్నతముగా గుర్తించబడినవాడు. ప్రార్థన ఏమైయుండాలో ఆయన కీర్తనలు వర్ణించుచున్నవి. ఉదాహరణకు, దేవుని సేవకులు రక్షణ లేక విడుదల (3:7, 8; 60:5), నడిపింపు (25:4, 5), భద్రత (17:8), పాపముల క్షమాపణ (25:7, 11, 18), శుద్ధ హృదయము (51:10) మొదలగు వాటినిగూర్చి ప్రార్థించుట యుక్తమైనదైయుండగలదు. దావీదు బాధనొందునప్పుడు “నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము” అని ప్రార్థించెను. (86:4) ఆలాగే మనము కూడా యెహోవా మనలను మన నిరీక్షణయందు సంతోషించమని కోరుతున్నాడని తెలిసికొని హృదయ సంతోషముకొరకు ప్రార్థించవచ్చును. దావీదు యెహోవాకు సన్నిహితముగా ఉండి ఇట్లు ప్రార్థించెను: “నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.” (63:8) దావీదువలె మనమును యెహోవాకు సన్నిహితముగా ఉందుమా? అట్లయిన మనలను కూడ ఆయన ఆదుకొనును.
10. ఒక సమయమందు ఏ తప్పిదమైన ఆలోచనలను గాయకుడైన ఆసాపు కలిగియుండెను, అయితే ఆయన దేనిని గుర్తించెను?
10 మనము యెహోవాకు సన్నిహితులముగా ఉండవలెనన్న, దుష్టులను వారి నిశ్చింతగల లేక వస్తుసంబంధమైన జీవితమందు చూచి మనము మత్సరపడకూడదు. ఒకసారి గాయకుడైన ఆసాపు దుష్టులు “ఎల్లప్పుడు నిశ్చింత” గలవారైయుండుటనుబట్టి, యెహోవాను సేవించుట వ్యర్థమేనని తలంచెను. అయినను, తన తర్కము తప్పుగా ఉన్నదని గ్రహించుకొని, దుష్టులు కేవలము “కాలు జారు చోటనే” ఉన్నారని గ్రహించెను. దేవునికి సన్నిహితముగా ఉండుటకంటే ఏదియు శ్రేష్టముకాదని గుర్తించి, దేవునికి తననుతాను ఇట్లు వ్యక్తపరచుకొనెను: “నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను, నా కుడిచెయ్యి నీవు పట్టుకొనియున్నావు. నిన్ను విసర్జించువారు నశించెదరు . . . నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.” (కీర్తన 73:12, 13, 18, 23, 27, 28) నిరీక్షణలేని ప్రజలగు, దుష్టుల నిశ్చింతగల జీవితములను చూచి మత్సరపడుటకు బదులు, యెహోవాకు సన్నిహితులుగా యుండుటలో ఆసాపును అనుకరించుదము.
11. యెహోవాకు సన్నిహితముగా ఉండుటలో దానియేలు ఎందుకు శ్రేష్టమైన మాదిరియై యున్నాడు, ఆయనను మనమెట్లు అనుకరించగలము?
11 ప్రార్థనా విషయంలో రాజాజ్ఞలను ఉల్లంఘించినయెడల సింహముల గుహలో వేయబడు అపాయమున్నను, దానియేలు తీర్మానపూర్వకంగా ప్రార్థనయందు పట్టుదలతో కొనసాగెను. అయితే యెహోవా “తన దూత నంపించి, . . . సింహముల నోళ్లు మూయించుట” ద్వారా దానియేలును రక్షించెను. (దానియేలు 6:7-10, 22, 27) ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుట ద్వారా దానియేలు గొప్పగా దీవించబడెను. మనము కూడా ప్రత్యేకముగా మన రాజ్య ప్రకటన పనికి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రార్థనలో పట్టుదల కలిగియుందుమా?
యేసు, మన మాదిరికర్త
12. (ఎ) ఆయన పరిచర్య ప్రారంభములో ప్రార్థనా విషయంలో యేసు ఏ మాదిరినుంచెను, ఇది క్రైస్తవులకు ఎట్లు ప్రయోజనకరము కాగలదు? (బి) ప్రార్థననుగూర్చి యేసుయొక్క మాదిరి ప్రార్థన దేనిని వెల్లడించుచున్నది?
12 ఆయన భూపరిచర్యయందలి ప్రారంభమునుండి కూడా యేసు ప్రార్థనలో యుంటున్నట్లు గమనించబడెను. బాప్తిస్మము పొందబోవునప్పుడు ఆయనయొక్క ప్రార్థనాపూర్వకమైన మనోవైఖరి ఆధునిక కాలములో నీటి బాప్తిస్మము తీసికొనుటకు నడచివెళ్లు వారందరికి మంచి మాదిరినుంచుచున్నది. (లూకా 3:21, 22) నీటి బాప్తిస్మము దేనినైతే గుర్తించుచున్నదో దానిని నెరవేర్చుటకై దేవుని సహాయమును ఒకరు అడుగవచ్చును. ప్రార్థనలో యెహోవాను సమీపించుటకు యేసు ఇతరులకు కూడా సహాయముచేసెను. ఒక సందర్భములో యేసు ఒక చోట ప్రార్థనచేయుచుండగా, ఆయన చాలించిన తరువాత శిష్యులలో ఒకరు ఆయనను: “ప్రభువా, ప్రార్థనచేయ నేర్పుమని అడిగెను.” అప్పుడు సామాన్యముగా మాదిరి ప్రార్థన అని పిలువబడుతున్న ప్రార్థనను యేసు చెప్పెను. దీనిలోని అంశముల వరుస క్రమమును బట్టి దేవుని నామము ఆయన సంకల్పమునకు మొదట ప్రాధాన్యత ఇవ్వబడవలెను. (లూకా 11:1-4) ఆవిధముగా, మనము మన ప్రార్థనలలో “ఎక్కువ ప్రాముఖ్యమైన విషయములను” నిర్లక్ష్యపరచకుండా సమతూకమును, దీర్ఘదృష్టితోకూడిన మనోభావనను కాపాడుకొనవలెను. (ఫిలిప్పీయులు 1:9, 10 NW) అయినను, ఒక ప్రత్యేక అవసరత లేక నిర్దిష్టమైన సమస్యను చెప్పుకొనవలసిన సమయములు ఉండవచ్చును. యేసుక్రీస్తువలె, కొన్ని అప్పగించబడిన పనులను నెరవేర్చుటకు, శోధనలు లేక అపాయములను ఎదుర్కొనుటకు కావలసిన బలమును కోరుతూ క్రైస్తవులు ప్రార్థనలో దేవుని సమీపించవచ్చును. (మత్తయి 26:36-44) వాస్తవమునకు, వ్యక్తిగత ప్రార్థనలు జీవితములోని ప్రతి కోణమునకు సంబంధించియుండవచ్చును.
13. ఇతరుల కొరకు ప్రార్థించు ప్రాముఖ్యతను యేసు ఎట్లు చూపించెను?
13 తన మంచి మాదిరి ద్వారా యేసు, ఇతరులకొరకు ప్రార్థనచేయు ప్రాముఖ్యతను చూపించెను. ఆయనవలెనే తన శిష్యులును ద్వేషించబడి హింసింపబడుదురని ఆయనకు తెలియును. (యోహాను 15:18-20; 1 పేతురు 5:9) అందుచేత దేవునికి ఆయన, “దుష్టుని నుండి వారిని కాపాడుమని” విన్నవించుకొనెను. (యోహాను 17:9, 11, 15, 20) పేతురు యెదుట ఉన్న ప్రత్యేక శోధనను ఎరిగినవాడై ఆయనతో ఇట్లనెను: “నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.” (లూకా 22:32) మనము కూడా కేవలము మన సమస్యలు లేక మన శ్రద్ధలగూర్చియే కాక, ఇతరులనుగూర్చి తలస్తూ, మన సహోదరులకొరకు ప్రార్థించుటలో పట్టుదలకలిగియుంటే ఎంత ప్రయోజనకరము!—ఫిలిప్పీయులు 2:4; కొలొస్సయులు 1:9, 10.
14. యేసు తన భూపరిచర్య కాలమంతటిలో యెహోవాకు సన్నిహితముగా ఉన్నాడని మనకెట్లు తెలియును, మనమెట్లు ఆయనను అనుకరించగలము?
14 ఆయన పరిచర్యయంతటిలో యెహోవాకు సన్నిహితముగా ఉంటూ యేసు, ప్రార్థనలో పట్టుదలతో కొనసాగెను. (హెబ్రీయులు 5:7-10) అపొస్తలుడైన పేతురు అపొస్తలుల కార్యములు 2:25-28లో కీర్తన 16:8 ని ఎత్తిచూపుచు దానిని ప్రభువైన యేసుక్రీస్తుకు ఇట్లు అన్వయించుచున్నాడు: “ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను—నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును (యెహోవాను NW) చూచు చుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను.” మనము కూడా అట్లే చేయవచ్చును. దేవుడు మనకు సన్నిహితముగా ఉండునట్లు మనము ప్రార్థించవచ్చును. ఆయనను ఎల్లప్పుడు మనస్సుతో మన కండ్లయెదుట ఉంచుకొనుటచేత యెహోవాయెడల మన నమ్మకమును చూపవచ్చును. (పోల్చుము కీర్తన 110:5; యెషయా 41:10, 13.) అప్పుడు మనము సమస్తవిధములైన కష్టములను నిరోధించగలము, యెహోవా మనలను ఆదుకొనును గనుక, మనమెన్నటికిని కదల్చబడము.
15. (ఎ) ఏ విషయమునుగూర్చి ప్రార్థనలో పట్టుదల కలిగియుండుటకు మనము ఎన్నటికిని తప్పిపోకూడదు? (బి) మన కృతజ్ఞతను గూర్చి ఏ హెచ్చరిక ఇవ్వబడినది?
15 యెహోవా మన యెడల చూపిన మంచితనమునకు, ఔను, మనపాపములకు విమోచన బలిగా తన కుమారుని అర్పించిన వరముతో పాటు “దేవుని అత్యధికమైన కృపకు” యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించకుండా మనమెప్పుడు తప్పిపోకుందుము గాక. (2 కొరింథీయులు 9:14, 15; మార్కు 10:45; యోహాను 3:16; రోమీయులు 8:32; 1 యోహాను 4:9, 10) నిజముగా, యేసు నామమున “సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు” ఉండుడి. (ఎఫెసీయులు 5:19, 20; కొలొస్సయులు 4:2; 1 థెస్సలొనీకయులు 5:18) మనకు లేనివాటిని గూర్చిన తపనలో మునిగిపోయినవారమై లేక మన వ్యక్తిగత సమస్యలనుబట్టి మనకు కలిగియున్న వాటియెడల కృతజ్ఞతను చూపలేనంత కఠినులము కాకుండునట్లు మనము జాగ్రత్తపడవలెను.
మన భారములను యెహోవాపై మోపుట
16. ఏదైన ఒక భారము మనలను కష్టపెట్టినప్పుడు, మనమేమి చేయవలెను?
16 ప్రార్థనయందు పట్టువదలకయుండుట మన భక్తియొక్క ప్రగాఢతను చూపును. మనము దేవుని పిలిచినప్పుడు, ఆయన సమాధానము రాక ముందే దాని ఫలితము మనపై మంచిగా ఉండును. ఏదైన ఒక భారము మన మనస్సును కష్టపెడుతున్నట్లయిన ఈ క్రింది ఉపదేశమును అనుసరిస్తూ, యెహోవాకు మనము సన్నిహితముగా ఉండవచ్చును. ఏమనగా: “నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్తన 55:22) మన భారములన్నిటిని అనగా—చింతలను, వ్యధలను, నిరుత్సాహములను, భయములు మొదలగు వాటిని—ఆయనయందలి పూర్తి విశ్వాసముతో దేవునిపై మోపుటద్వారా, “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును,” నిమ్మళమైన హృదయమును పొందుదుము.—ఫిలిప్పీయులు 4:4, 7; కీర్తన 68:19; మార్కు 11:24; 1 పేతురు 5:7.
17. దేవుని సమాధానమును మనమెట్లు పొందవచ్చును?
17 దేవునియొక్క ఈ సమాధానము అప్పటికప్పుడు తక్షణమే వస్తుందా? ఒకవేళ వెంటనే కొంత ఉపశమనమును పొందినను, పరిశుద్ధాత్మకొరకు ప్రార్థించుటను గూర్చి యేసు చెప్పినది ఇక్కడ కూడ సత్యమవుతుంది: “అడుగుతూ ఉండుడి, మీకియ్యబడును; వెదకుతూ ఉండుడి, మీకు దొరకును; తట్టుతూ ఉండుడి, మీకు తీయబడును.” (లూకా 11:9-13 NW) పరిశుద్ధాత్మ మూలముగానే మనము చింతను తొలగించుకొనుదుము గనుక, దేవుని సమాధానము మరియు మన భారముల విషయములో ఆయన సహాయముకొరకు అడుగుటలో పట్టుదలతో కొనసాగవలెను. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుట ద్వారా మనము కోరుకొను ఉపశమనము పొంది, నిమ్మళమైన హృదయమును పొందుదుమను నిశ్చయత కలిగియుండగలము.
18. ఏదైన ఒక పరిస్థితిలో దేనికొరకు ప్రార్థించవలెనో మనకు తెలియనప్పుడు యెహోవా మనకొరకు ఏమి చేయును?
18 అయితే దేనినిగూర్చి ఖచ్చితముగా ప్రార్థించవలెనో మనకు తెలియనప్పుడు సంగతేమి? మన పరిస్థితిని మనము పూర్తిగా అర్థము చేసికొనలేదు గనుక ఆంతర్యమందలి మూలుగులు వ్యక్తపరచబడనివిగా ఉండును. లేక యెహోవాకు చెప్పాల్సింది ఏమిలేనివారమైనట్లుగాయుందుము. ఈ స్థితిలోనే మననిమిత్తము పరిశుద్ధాత్మ విన్నవించు మధ్యవర్తిగా పనిచేయును. పౌలు ఇట్లు వ్రాసెను: “ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.” (రోమీయులు 8:26) ఎట్లు? దేవుని వాక్యములో మన పరిస్థితిని వివరించునట్టి ప్రేరేపించబడిన ప్రవచనములు, ప్రార్థనలు ఉన్నవి. ఆయన వీటిని, మనపరిస్థితిని ఉన్నరీతిగా విజ్ఞాపనచేయునట్లు చేయును. అయితే మన విషయమందు వాటి భావము మనము తెలిసికొనియున్నప్పుడే, అవి మనము ప్రార్థించువాటిగా ఆయన అంగీకరించి, అందుకు తగినట్లు వాటిని ఆయన నెరవేర్చును.
ప్రార్థన, నిరీక్షణ కొనసాగును
19. ప్రార్థన, నిరీక్షణ నిరంతరము ఎందుకు కొనసాగును?
19 మన పరలోకపు తండ్రికి ప్రార్థించుట, ప్రత్యేకముగా నూతనలోకము దాని సకల ఆశీర్వాదముల విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా నిరంతరము కొనసాగును. (యెషయా 65:24; ప్రకటన 21:5) నిరీక్షణయందు సంతోషించుటలోను మనము కొనసాగుదుము, ఎట్లనగా నిరీక్షణ ఏదో ఒక రూపములో నిరంతరము ఉండును. (1 కొరింథీయులు 13:13ను పోల్చుము.) భూమి విషయంలో తనకై తాను ఏర్పరచుకొనిన విశ్రాంతి దినము ముగిసిన తరువాత యెహోవా ఏ క్రొత్త విషయములను తెచ్చునో మనము ఊహించనైన ఊహించలేము. (ఆదికాండము 2:2, 3) సదాకాలము తరతరములు ఆయన తన ప్రజలముందు ప్రేమగల ఆశ్చర్యకరమైన వాటిని కలిగియుండును. ఆయన చిత్తమును చేయుచు పోవుటలో భవిష్యత్తు వారికి దివ్యమైన సంగతులను కలిగియుండును.
20. మన తీర్మానమేమైయుండవలెను, ఎందుకు?
20 అట్టి పులకరింపు కలుగజేయు నిరీక్షణను మనముందు కలవారమై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుట ద్వారా మనమందరము యెహోవాకు సన్నిహితముగా ఉందుము గాక. మనము పొందిన దీవెనలన్నిటికి మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతను చెల్లించుటను ఎన్నటికిని మానకుందుము గాక. తగిన సమయములో మనము ఆశతో కనిపెట్టునవన్నియు ఆనందభరితముగా గుర్తించబడును. అవి మనము ఊహించినవాటన్నిటికంటె లేక ఎదురుచూచినదానికంటె ఎంతో మిన్నగా నెరవేరును. ఎందుకనగా యెహోవా “మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటె అత్యధికముగా చేయగల” వాడు. (ఎఫెసీయులు 3:20) ఇందుచేత, “ప్రార్థన ఆలకించువాడైన” మన యెహోవా దేవునికి సమస్త స్తుతి, ఘనత, కృతజ్ఞతలు సదా నిత్యము చెల్లించుదము! (w91 12/15)
[అధస్సూచీలు]
a వెబ్‌స్టర్స్ న్యూ డిక్షనరి ఆఫ్ సినోనిమ్స్, ప్రకారము “పట్టుదల (Persevere) దాదాపు అన్ని సమయములలో ఒక ఆశ్చర్యకరమైన లక్షణమును సూచిస్తూ ఉన్నది; వైఫల్యమువలన, సందేహములవలన లేక కష్టములవలన నిరుత్సాహపరచబడుటకు తిరస్కరించుటను మరియు చేపట్టిన పనిని లేక గురిని స్థిరంగా, గట్టిగా పట్టువదలక వెంబడించుటను అది సూచించుచున్నది.”
నీవు ఎట్లు జవాబిచ్చెదవు?
◻ మనమెందుకు ప్రార్థనలో పట్టుదల కలిగియుండవలెను?
◻ క్రైస్తవ కాలమునకు ముందటి ప్రార్థనా మాదిరిలనుండి మనమేమి నేర్చుకొందుము?
◻ ప్రార్థననుగూర్చి యేసు మాదిరి మనకు ఏమి బోధించుచున్నది?
◻ మన భారములను యెహోవాపై ఎట్లు మోపగలము, ఏ ఫలితముతో?
[25వ పేజీలోని చిత్రాలు]
సింహపు గుహలో పడవేయబడు అపాయమున్నను దానియేలు ప్రార్థనయందు పట్టుదల కలిగియుండెను