వారు యెహోవా చిత్తాన్ని చేశారు
వివేచనగల ఒక స్త్రీ వినాశనాన్ని తప్పిస్తుంది
బుద్ధిగల భార్య, పనికిమాలిన భర్త—అబీగయీలు నాబాలుల పరిస్థితి అలాగుంది. అబీగయీలు “సుబుద్ధిగలదై రూపసియైయుండెను.” దానికి విరుద్ధంగా, నాబాలు “మోటువాడును దుర్మార్గుడునై యుండెను.” (1 సమూయేలు 25:3) ఏమాత్రం సరిజోడికాని ఈ దంపతులు ఇమిడివున్న సన్నివేశాలు బైబిలు చరిత్రలో వారి పేర్లు చెరపరాని విధంగా ముద్రించబడేలా చేశాయి. ఎలాగో మనం చూద్దాం.
సహాయం పొందినా ప్రశంస లేదు
అది సా.శ.పూ. 11వ శతాబ్దం. దావీదు ఇశ్రాయేలు భవిష్యద్ రాజుగా అభిషిక్తుడయ్యాడు, కానీ పరిపాలించడానికి బదులుగా ఆయన పరిగెత్తుతున్నాడు. అప్పుడు పరిపాలిస్తున్న రాజైన సౌలు ఆయనను చంపడానికి పూనుకున్నాడు. తత్ఫలితంగా, దావీదు పలాయితుడుగా జీవించడం తప్పనిసరైంది. ఆయనా, ఆయనతోపాటు దాదాపు 600 మంది సహచరులు చివరికి పారాను అరణ్యంలో ఆశ్రయాన్ని పొందారు, ఇది యూదాకు దక్షిణాన సీనాయి అరణ్యంవైపుగా ఉంది.—1 సమూయేలు 23:13; 25:1.
వారక్కడున్నప్పుడు, నాబాలనబడిన ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్న గొఱ్ఱెలకాపరులను కలిశారు. కాలేబు వంశస్థుడైన ఈ వ్యక్తి సంపన్నుడు, ఈయన దగ్గర 3,000 గొఱ్ఱెలూ, 1,000 మేకలూ ఉండేవి. ఈయన పారాను నుండి బహుశ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో హెబ్రోనుకు దక్షిణాన ఉన్న ఒక పట్టణమైన కర్మెలులో తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించేవాడు.a నాబాలుకు చెందిన గొఱ్ఱెలకాపరులు తమ మందలను ఆ అరణ్యంలో తిరుగాడే దొంగలనుండి కాపాడుకోవడానికి దావీదూ, ఆయన మనుష్యులూ సహాయం చేశారు.—1 సమూయేలు 25:14-16.
ఈలోగా కర్మెలులో గొఱ్ఱెల బొచ్చు కత్తిరించడం ప్రారంభమైంది. వ్యవసాయదారునికి కోతసమయం ఎలా పండుగో ఆలాగే ఇది ఒక పండుగ సందర్భం. గొఱ్ఱెల యజమానులు తమకొరకు పనిచేసినవారికి ప్రతిఫలమిచ్చే సమయమిది. ఇది ఔదార్యంతో చేతికందినంత ఇచ్చే సమయం కూడానూ. అందుకని తాము నాబాలు మంద విషయంలో చేసిన సేవ నిమిత్తం ఆహారాన్ని ప్రతిఫలంగా ఇమ్మని దావీదు కర్మెలు పట్టణానికి పదిమంది మనుష్యులను పంపినప్పుడు ఆయన తన హద్దులు దాటి ప్రవర్తించడం లేదు.—1 సమూయేలు 25:4-9.
నాబాలు ఔదార్యంతో ప్రతిస్పందించలేదు గానీ మరోవిధంగా ప్రతిస్పందించాడు. “దావీదు ఎవడు?” వెటకారం ధ్వనిస్తూ అడిగాడు. తర్వాత, దావీదూ ఆయన మనుష్యులూ పారిపోయిన సేవకులే తప్ప మరెవరూ కాదని సూచిస్తూ వ్యంగ్యంగా ఇలా అడిగాడు: “నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా?” దావీదు ఇది విన్నప్పుడు తన మనుష్యులతో ఇలా అన్నాడు: ‘మీరందరు మీ కత్తులను ధరించుకొనుడి!’ అలా దాదాపు 400 మంది పురుషులు యుద్ధానికి సిద్ధమయ్యారు.—1 సమూయేలు 25:10-13.
అబీగయీలు వివేచన
నాబాలు పలికిన దూషణకరమైన మాటలు ఆయన భార్యయైన అబీగయీలు చెవినపడ్డాయి. బహుశ ఆమె జోక్యం చేసుకుని నాబాలు తరపున శాంతిదూతగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాకపోవచ్చు. ఏమైతేనేమి, అబీగయీలు సత్వరంగా చర్యగైకొంది. నాబాలుకు చెప్పకుండానే ఐదు గొఱ్ఱెలూ, సమృద్ధియైన ఆహార పదార్థాలనూ తీసుకుని దావీదును అరణ్యంలో కలుసుకోవడానికి బయలుదేరింది.—1 సమూయేలు 25:18-20.
అబీగయీలు దావీదును చూసినప్పుడు ఆమె ఒక్కసారిగా ఆయనముందు సాష్టాంగపడింది. “దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు” అని ఆమె ఆయనకు విజ్ఞప్తి చేసింది. ‘అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించుము.’ ఆమె ఇంకా ఇలా జోడించింది: “[నాబాలుకు సంబంధించిన ఈ పరిస్థితివలన] నా యేలినవాడవగు నీవు పగతీర్చుకొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంతమాత్రమును కలుగక పోవును గాక.” ఇక్కడ ‘మనోవిచారము’ అని అనువదించబడిన హెబ్రీ పదము మనస్సాక్షి నిందించడాన్ని సూచిస్తుంది. కాబట్టి దావీదు తర్వాత పశ్చాత్తాపపడేటువంటి చర్యను త్వరపడి తీసుకోవద్దని అబీగయీలు ఆయనను హెచ్చరించింది.—1 సమూయేలు 25:23-31.
దావీదు అబీగయీలు చెప్పింది విన్నాడు. “ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక” అని ఆమెతో అన్నాడాయన. “నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన యెడల, . . . తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడునుb విడువబడడన్న మాట నిశ్చయము.”—1 సమూయేలు 25:32-34.
మనకు గుణపాఠాలు
దైవభక్తిగల ఒక స్త్రీ అవసరమైతే యుక్తమైన రీతిలో చొరవ తీసుకోవడం ఎంతమాత్రం తప్పుకాదని ఈ బైబిలు వృత్తాంతము చూపిస్తుంది. అబీగయీలు తన భర్తయైన నాబాలు ఇష్టానికి వ్యతిరేకంగా చర్యతీసుకుంది, కానీ ఇలా చేసినందుకు బైబిలు ఆమెను ఖండించడంలేదు. బదులుగా, అది ఆమెను వివేచనగల, బుద్ధిగల స్త్రీగా మెచ్చుకుంటుంది. ఈ సంక్షోభ సమయంలో చొరవ తీసుకోవడం ద్వారా అబీగయీలు చాలామంది జీవితాలను కాపాడింది.
ఒక భార్య సాధారణంగా దైవిక విధేయత చూపవల్సి ఉన్నప్పటికీ, సరియైన సిద్ధాంతాలు ప్రమాదంలో పడుతున్నప్పుడు ఆమె తన భర్తతో ఏకీభవించకపోవడం యుక్తమే. నిజమే, ఆమె ‘సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణాలను’ వికసించుకోవడానికి కృషిచేయాలి, ద్వేషమూ, గర్వమూ, లేక తిరుగుబాటుతనమూ వంటివాటివల్ల ఆమె స్వతంత్రంగా వ్యవహరించకూడదు. (1 పేతురు 3:4) అయితే, దైవభక్తిగల ఒక భార్య పూర్తి తెలివితక్కువ పననీ లేక బైబిలు నియమాలను ఉల్లంఘించేదనీ తనకు తెల్సిన దానిని చేయాలనే ఒత్తిడికి లొంగిపోకూడదు. నిజమే, స్త్రీలను బైబిలు వట్టి బానిసలుగా మాత్రమే చిత్రిస్తుందని మొండిగా వాదించేవారికి విరుద్ధంగా అబీగయీలు వృత్తాంతం గట్టి వాదనను అందిస్తుంది.
ఈ వృత్తాంతం ఆత్మనిగ్రహం గురించి కూడా మనకు నేర్పిస్తుంది. దావీదు ఈ గుణాన్ని కొన్నిసార్లు సంపూర్ణంగా ప్రతిఫలించాడు. ఉదాహరణకు, ప్రతికారంతో రగిలిపోతున్న రాజైన సౌలును చంపడానికి ఆయన తిరస్కరించాడు. చివరికి సౌలును చంపడానికి ఆయనకు మంచి అవకాశం లభించినప్పటికీ, సౌలు మరణం ఆయనకు శాంతిని తీసుకొచ్చేదైనప్పటికీ దావీదు అలా చేయలేదు. (1 సమూయేలు 24:2-7) బదులుగా, నాబాలు అవమానకరంగా తనను తిరస్కరించినప్పుడు, దావీదు అప్రమత్తంగా లేనందున, పగతీర్చుకుంటానని శపథం చేశాడు. ‘కీడుకు ప్రతి కీడెవనికిని చేయకుండా’ ఉండడానికి గట్టి ప్రయత్నం చేసే క్రైస్తవులకు ఇది స్పష్టమైన హెచ్చరిక. అన్ని పరిస్థితుల్లోనూ వారు పాటించవలసిన పౌలు ఇచ్చిన హెచ్చరిక: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి.”—రోమీయులు 12:17-19.
[అధస్సూచీలు]
a పారాను అరణ్యం ఉత్తరాన బెయేర్షెబా వరకూ విస్తరించివుందని తలంచబడుతుంది. ఈ భూభాగంలో అనేక పచ్చిక బయళ్లు ఉన్నాయి.
b ఇక్కడ నూతన లోక అనువాదము (ఆంగ్లం) “గోడమీద మూత్రము పోయువాడెవడైనా” అన్న పదబంధాన్ని ఉపయోగిస్తుంది. ఇది మగవారికొరకు ఉపయోగించబడే హెబ్రీ నుడికారం. తృణీకారాన్ని వ్యక్తం చేయడానికి దీన్ని ఉపయోగించేవారని స్పష్టమౌతుంది.—1 రాజులు 14:10 పోల్చండి.
[15వ పేజీలోని చిత్రం]
అబీగయీలు దావీదు కొరకు కానుకలను తెస్తుంది