-
మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
ప్రపంచవ్యాప్తంగా, మందు తాగే విషయంలో ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు తాగుతారు, ఇంకొంతమంది అస్సలు తాగకూడదు అనుకుంటారు, మరికొంతమంది మత్తెక్కే దాకా తాగుతారు. ఇంతకీ మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
1. మందు తాగడం తప్పా?
మందు తాగడం తప్పని బైబిలు చెప్పట్లేదు. నిజానికి దేవుడు మనకిచ్చిన ఎన్నో బహుమానాల్లో, “మనిషి హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం” కూడా ఉందని బైబిలు చెప్తుంది. (కీర్తన 104:14, 15) బైబిల్లో ఉన్న కొంతమంది దైవభక్తి గల స్త్రీలు, పురుషులు కూడా మద్యం తీసుకున్నారు.—1 తిమోతి 5:23.
2. మందు తాగాలని నిర్ణయించుకునే వాళ్లకు బైబిలు ఏం చెప్తుంది?
అతిగా తాగడం అలాగే తాగుబోతుతనం తప్పని యెహోవా చెప్తున్నాడు. (గలతీయులు 5:21) “ద్రాక్షారసం ఎక్కువగా తాగేవాళ్లతో . . . సహవసించకు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 23:20) కాబట్టి, మనం వేరేవాళ్లతో కలిసి తాగాలనుకున్నా లేదా ఒంటరిగా తాగాలనుకున్నా జాగ్రత్తగా ఉండాలి. అంటే సరిగ్గా ఆలోచించలేనంతగా, మన మాటల్ని-పనుల్ని అదుపులో పెట్టుకోలేనంతగా, మన ఆరోగ్యం పాడైపోయేంతగా తాగకూడదు. తాగే విషయంలో మనల్ని మనం అదుపు చేసుకోలేకపోతుంటే దాన్ని పూర్తిగా మానేయడం మంచిది.
3. మనం వేరేవాళ్ల నిర్ణయాల్ని ఎలా గౌరవించవచ్చు?
మందు తాగాలా వద్దా అనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. మితంగా మందు తాగాలని నిర్ణయించుకున్న వ్యక్తిని మనం తప్పుపట్టకూడదు, అలాగే మందు తాగకూడదని నిర్ణయించుకున్న వ్యక్తిని తాగమని బలవంతపెట్టకూడదు. (రోమీయులు 14:10) మనం మందు తాగడం వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు అనిపిస్తే, మనం తాగకూడదని నిర్ణయించుకుంటాం. (రోమీయులు 14:21 చదవండి.) మనం మన ‘సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తాం.’—1 కొరింథీయులు 10:23, 24 చదవండి.
ఎక్కువ తెలుసుకోండి
మందు తాగాలా వద్దా, తాగితే ఎంత తాగాలి వంటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్ని పరిశీలించండి. అంతేకాదు, తాగుడు అలవాటును మానుకోవడం కష్టంగా ఉంటే ఏం చేయవచ్చో తెలుసుకోండి.
4. మందు తాగాలో వద్దో నిర్ణయించుకోండి
మద్యం విషయంలో యేసుకు ఎలాంటి అభిప్రాయం ఉంది? జవాబు తెలుసుకోవడానికి, ఆయన చేసిన మొదటి అద్భుతం పరిశీలించండి. యోహాను 2:1-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
ఈ అద్భుతాన్ని బట్టి మద్యం విషయంలో, దాన్ని తాగేవాళ్ల విషయంలో యేసుకు ఎలాంటి అభిప్రాయం ఉందని అర్థమౌతుంది?
మద్యం తీసుకోవడం తప్పని యేసు చెప్పలేదు, కాబట్టి మందు తాగాలనుకునే వాళ్లను ఒక క్రైస్తవుడు ఎలా చూడాలి?
అయితే మందు తాగడంలో తప్పు లేదు కాబట్టి, ఒక క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాగవచ్చని దానర్థం కాదు. సామెతలు 22:3 చదవండి, తర్వాత ఈ పరిస్థితుల్లో మందు తాగడం సరైనదో కాదో ఆలోచించండి:
వాహనం నడిపే ముందు, పెద్దపెద్ద మెషిన్లతో పనిచేసే ముందు.
మీరు గర్భిణి అయితే.
డాక్టర్ మిమ్మల్ని తాగొద్దని చెప్తే.
మీరు కొంచెం తాగి ఊరుకోలేకపోతుంటే.
మందు తాగడం చట్ట ప్రకారం నేరమైతే.
తాగుడును అతి కష్టం మీద మానుకున్న వ్యక్తితో మీరు ఉంటే.
పెళ్లిలో, పార్టీలో మందు ఏర్పాటు చేయవచ్చా? మీరు ఎలా సరైన నిర్ణయం తీసుకోవచ్చో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.
రోమీయులు 13:13; 1 కొరింథీయులు 10:31, 32 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం తీసుకోవడానికి ఈ సూత్రం మీకెలా సహాయం చేస్తుంది?
మందు తాగాలా వద్దా అని క్రైస్తవులు ఎవరికి వాళ్లే నిర్ణయించుకుంటారు. ఒక క్రైస్తవుడు కొన్ని సందర్భాల్లో మందు తాగినా, మరికొన్ని సందర్భాల్లో తాగకూడదని నిర్ణయించుకోవచ్చు
5. ఎంత తాగాలో నిర్ణయించుకోండి
మీరు మందు తాగాలనుకుంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి: మందు తాగడం తప్పు అని యెహోవా చెప్పట్లేదు గానీ, అతిగా తాగడం తప్పు అని చెప్తున్నాడు. ఎందుకు? హోషేయ 4:11, 18 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఒక వ్యక్తి అతిగా తాగితే ఏం జరగవచ్చు?
అతిగా తాగకుండా ఉండాలంటే మనం ఏం చేయవచ్చు? మనం అణకువ చూపించాలి, అంటే మన పరిమితులు ఏంటో మనకు తెలిసుండాలి. సామెతలు 11:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఎంత తాగాలో హద్దులు పెట్టుకోవడం ఎందుకు మంచిది?
6. తాగుడు అలవాటు నుండి ఎలా బయటపడవచ్చు?
తాగుడు అలవాటును మానుకోవడానికి ఒకాయనకు ఏది సహాయం చేసిందో పరిశీలించండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
దిమిత్రి తాగినప్పుడు ఎలా ప్రవర్తించేవాడు?
ఆయన ఒక్కసారిగా తాగుడు అలవాటును మానుకోగలిగాడా?
చివరికి ఆయన ఆ అలవాటు నుండి ఎలా బయటపడ్డాడు?
1 కొరింథీయులు 6:10, 11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
తాగుబోతుతనాన్ని యెహోవా ఎలా చూస్తాడు?
తాగుడుకు బానిసైన వాళ్లు దాన్నుండి బయటపడగలరని ఎలా చెప్పవచ్చు?
మత్తయి 5:30 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఇక్కడ చేయి నరికేసుకోవడం అంటున్నప్పుడు, యెహోవాను సంతోషపెట్టడానికి మనం కొన్నిటిని వదులుకోవాలి అని అర్థం. ఒకవేళ మీరు తాగుడు అలవాటును మానుకోలేకపోతుంటే, ఎంతగా కృషి చేయాలని ఈ వచనం చెప్తోంది?a
1 కొరింథీయులు 15:33 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
అతిగా తాగేవాళ్లతో సహవసిస్తే ఏం జరిగే ప్రమాదం ఉంది?
కొంతమంది ఇలా అడుగుతారు: “తాగడం తప్పా?”
వాళ్లకు మీరేం చెప్తారు?
ఒక్కమాటలో
యెహోవా మన సంతోషం కోసమే మద్యాన్ని ఇచ్చాడు. అయితే, అతిగా తాగడం అలాగే తాగుబోతుతనం తప్పని ఆయన చెప్తున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
అతిగా తాగడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి?
మద్యం విషయంలో మనం వేరేవాళ్ల నిర్ణయాల్ని ఎలా గౌరవించవచ్చు?
ఇవి కూడా చూడండి
మద్యం గురించి యౌవనులు ఏం తెలుసుకోవాలి?
తాగుడు అలవాటు నుండి బయటపడడానికి ఏమేం చేయవచ్చో తెలుసుకోండి.
క్రైస్తవులు మందు గ్లాసులు పైకెత్తి టోస్టింగ్ చేయవచ్చా?
ఒకతను అతిగా తాగడాన్ని ఎలా మానుకున్నాడో తెలుసుకోవడానికి, “ఒకప్పుడు నేను సీసాలుసీసాలు తాగేవాణ్ణి” అనే అనుభవం చదవండి.
a మద్యానికి బానిసైన వాళ్లకు దాన్నుండి బయటపడాలంటే వైద్య సహాయం అవసరం కావచ్చు. ఈ వ్యసనం నుండి బయటపడిన వాళ్లు ఇక అస్సలు తాగకపోవడమే మంచిదని చాలామంది డాక్టర్లు చెప్తున్నారు.
-
-
మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
52వ పాఠం
మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?
బట్టలు, కనబడే తీరు విషయంలో మనందరికీ వేర్వేరు ఇష్టాలు ఉంటాయి. అయితే, మనం కొన్ని బైబిలు సూత్రాల్ని పాటిస్తే మనకు నచ్చిన బట్టలు, హెయిర్ స్టైల్స్ వేసుకుంటూనే యెహోవాను కూడా సంతోషపెట్టవచ్చు. ఇప్పుడు ఆ బైబిలు సూత్రాల్ని పరిశీలిద్దాం.
1. కనబడే తీరు విషయంలో మనకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?
మనం “అణకువ, మంచి వివేచన ఉట్టిపడే గౌరవప్రదమైన బట్టలు” ఎంచుకోవాలి, అలాగే “దైవభక్తిగల” వాళ్లకు తగ్గట్టు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. (1 తిమోతి 2:9, 10) ఈ లేఖనంలో ఉన్న నాలుగు సూత్రాలు ఆలోచించండి: (1) మనం “అణకువ” చూపించే బట్టలు వేసుకోవాలి. అంటే మన బట్టలు, కనబడే తీరు ఎదుటివాళ్లలో తప్పుడు కోరికల్ని కలిగించేలా, అందరూ మనల్నే చూసేలా ఉండకూడదు. (2) మనం “మంచి వివేచన” చూపిస్తాం, అంటే కొత్తగా వచ్చే ప్రతీ స్టైల్‌ని మనం అనుసరించం. (3) మనం “గౌరవప్రదమైన” బట్టలు వేసుకోవాలి. యెహోవా ప్రజల బట్టలు, హెయిర్ స్టైల్స్ రకరకాలుగా ఉన్నా, అవి దేవుని మీద వాళ్లకు గౌరవం ఉందని చూపిస్తాయి. మీరు ఆ విషయాన్ని మీటింగ్స్‌లో గమనించే ఉంటారు. (4) మనం కనబడే తీరు ఎప్పుడూ “దైవభక్తిగల” వాళ్లకు తగ్గట్టు ఉండాలి. అంటే, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్లమని చూపించేలా ఉండాలి.—1 కొరింథీయులు 10:31.
2. మనం కనబడే తీరు మన తోటి ఆరాధకుల మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?
మనకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉన్నా, మనం కనబడే తీరు వేరేవాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి. మనం ఎవ్వర్నీ నొప్పించకుండా, ‘ఇతరుల్ని బలపర్చడానికి, మంచి చేస్తూ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం.’—రోమీయులు 15:1, 2 చదవండి.
3. మనం కనబడే తీరు ఇతరుల్ని ఎలా సత్యం వైపు ఆకర్షించవచ్చు?
మనం ఎప్పుడూ సందర్భానికి తగినట్టు, మంచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మరిముఖ్యంగా మీటింగ్స్‌కి వెళ్లేటప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. మనం కనబడే తీరు వల్ల, ప్రజల దృష్టి మంచివార్త నుండి పక్కకు మళ్లాలని మనం కోరుకోం. బదులుగా, మనం కనబడే తీరు ఇతరుల్ని సత్యం వైపు ఆకర్షించాలని, ‘మన రక్షకుడైన దేవుని బోధను అలంకరించాలని’ కోరుకుంటాం.—తీతు 2:10.
ఎక్కువ తెలుసుకోండి
మన బట్టలు, కనబడే తీరు క్రైస్తవులకు తగినట్టు ఉండేలా ఎలా చూసుకోవచ్చో పరిశీలించండి.
మనం కనబడే తీరు మనకు అధికారుల మీద గౌరవం ఉందో లేదో చూపిస్తుంది. నిజమే యెహోవా మన పైరూపాన్ని చూడడు, అయినా మనం కనబడే తీరు ద్వారా ఆయన మీద గౌరవం చూపించవచ్చు
4. మనం కనబడే తీరు మనకు యెహోవా మీద గౌరవం ఉందని చూపిస్తుంది
మనం కనబడే తీరు గురించి ఎందుకు ఆలోచించుకోవాలి? అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటో చూద్దాం. కీర్తన 47:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి?
మీటింగ్స్‌కి వెళ్లేటప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మనం కనబడే తీరు ఎలా ఉందో చూసుకోవడం ప్రాముఖ్యం అంటారా? ఎందుకు?
5. బట్టలు, హెయిర్ స్టైల్స్ విషయంలో ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు?
మన బట్టలు ఖరీదైనవైనా కాకపోయినా అవి శుభ్రంగా, సందర్భానికి తగినట్టుగా ఉండాలి. 1 కొరింథీయులు 10:24; 1 తిమోతి 2:9, 10 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
మనం ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోకూడదు . . .
నలిగిన, మురికిగా ఉన్న బట్టలు, లేదా ఇష్టమొచ్చినట్టుగా ఎలా పడితే అలా ఉండే బట్టలు?
టైటుగా, ఒళ్లు కనిపించేలా, తప్పుడు కోరికల్ని కలిగించేలా ఉండే బట్టలు?
క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కింద లేకపోయినా, దాని ద్వారా యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 22:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మగవాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగవాళ్లలా కనిపించే లాంటి బట్టలు, హెయిర్ స్టైల్స్ మనం ఎందుకు వేసుకోకూడదు?
1 కొరింథీయులు 10:32, 33; 1 యోహాను 2:15, 16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
కనబడే తీరు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజంలో ఉన్నవాళ్ల గురించి, సంఘంలో ఉన్నవాళ్ల గురించి ఎందుకు ఆలోచించాలి?
సాధారణంగా మీ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి బట్టలు, హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు?
వాటిలో ఏవైనా క్రైస్తవులకు తగవు అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?
మనం మనకు నచ్చినట్టు రకరకాల బట్టలు, హెయిర్ స్టైల్స్ వేసుకుంటూనే యెహోవాను కూడా సంతోషపెట్టవచ్చు
కొంతమంది ఇలా అంటారు: “నా బట్టలు నా ఇష్టం. ఎవరు ఏమనుకుంటే నాకేంటి?”
మీరేమంటారు? ఎందుకు?
ఒక్కమాటలో
కనబడే తీరు విషయంలో మనం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు యెహోవా మీద, ఇతరుల మీద గౌరవం ఉందని చూపిస్తాం.
మీరేం నేర్చుకున్నారు?
మన బట్టలు, హెయిర్ స్టైల్ ఎలా ఉన్నాయో యెహోవా పట్టించుకుంటాడా? ఎందుకు?
కనబడే తీరు విషయంలో మనకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?
మనం కనబడే తీరు వల్ల ప్రజలకు మన ఆరాధన మీద ఎలాంటి అభిప్రాయం కలగవచ్చు?
ఇవి కూడా చూడండి
మన బట్టలు మన గురించి ఏం చెప్తాయి?
టాటూ వేయించుకునే ముందు మనం ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసుకోండి.
“పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?” (jw.org ఆర్టికల్)
కనబడే తీరు విషయంలో మనకు సహాయం చేసే ఇంకొన్ని సూత్రాలు చూడండి.
“మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?” (కావలికోట, సెప్టెంబరు 2016)
-