కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 7/8 పేజీలు 28-30
  • మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపరిపూర్ణ మానవులకు కోపం వచ్చినప్పుడు
  • క్రైస్తవులు లెక్క ఒప్పచెప్పవలసినవారై ఉన్నారు
  • కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • కోపపడడం అన్నివేళలా తప్పేనా?
    తేజరిల్లు!—1994
  • కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
తేజరిల్లు!—1997
g97 7/8 పేజీలు 28-30

బైబిలు ఉద్దేశము

మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?

అది ఓ అశుభ సూచక ప్రారంభము. “ఇప్పుడు నేను ఈ ఇంటికి శిరస్సును, కాబట్టి నీవు ఆలస్యంగా వచ్చి నన్ను సిగ్గుపరచవు” అని అనిల్‌ తన నవ వధువైన షీలపై కేకలువేశాడు.a ఆమెను మెదలకుండా సోఫాపై కూర్చోమని ఆజ్ఞాపిస్తూ, ఆయన 45 నిమిషాలకు పైగా ఆమెపై కేకలు వేశాడు. వారి వైవాహిక జీవితంలో అసభ్యకరమైన సంభాషణ సర్వసాధారణమైపోయింది. విచారకరంగా, అనిల్‌ కోపగించుకోవడం ఎక్కువయ్యింది. ఆయన తలుపులను బాదడమూ, వంటగది టేబులుపై గట్టిగా కొట్టడమూ, ఇతరుల జీవితాలను ప్రమాదానికి గురిచేస్తూ స్టీరింగ్‌ వీల్‌పై బాదుతూ ఆవేశపూరితంగా వాహనం నడపడం వంటివి చేసేవాడు.

విచారకరంగా, అలాంటి సంఘటనలు అతి తరచుగా జరుగుతాయని మీకు బాగా తెలుసన్నదానిలో సందేహం లేదు. అయితే ఆయనకలా కోపం రావడం సబబేనా, లేక ఆయన నిగ్రహాన్ని కోల్పోతున్నాడా? అసలు కోపించడం తప్పా? కోపం అదుపు తప్పిందని ఎప్పుడనవచ్చు? అది ఎప్పుడు హద్దు మీరిందనవచ్చు?

అదుపు చేయబడిన కోపం సమంజసమైందే. ఉదాహరణకు, ప్రాచీన అనైతిక పట్టణాలైన సొదొమ గొమొఱ్ఱాలపై దేవుని కోపం రగులుకొంది. (ఆదికాండము 19:24) ఎందుకు? ఎందుకంటే ఆ పట్టణాల నివాసులు హింసాత్మకమైన, దిగజారిపోయిన లైంగిక ప్రవర్తన కల్గివున్నారు, ఆ విషయం ఆ ప్రాంతమంతటా పేరుపొందింది. ఉదాహరణకు, దేవదూతలైన సందేశకులు నీతిమంతుడైన లోతును సందర్శించడానికి వచ్చినప్పుడు, పురుషులందరూ అంటే యువకులూ వృద్ధులూ లోతు అతిథులపై గుంపుగా బలాత్కారం చేయబోయారు. వారి ఘోరమైన అనైతికతను బట్టి యెహోవా దేవుడు సమంజసమైన కోపాన్నే ప్రదర్శించాడు.—ఆదికాండము 18:20; 19:4, 5, 9.

పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తూ తన తండ్రిలానే కోపాన్ని చూపించిన సందర్భముంది. యెరూషలేములో ఉన్న ఆలయం దేవుడు ఏర్పర్చుకొన్న ప్రజల ఆరాధనా కేంద్రమై ఉండవలసింది. అది, ప్రజలు వ్యక్తిగత పశుబలులను అర్పణలను దేవునికి అర్పించగల, ఆయన మార్గాలగురించి వారికి బోధించబడగల, వారి పాపములు క్షమించబడగల స్థలమైన ‘ప్రార్థనా మందిరంగా’ ఉండవలసింది. ఒక విధంగా, ఆ మందిరంలో వాళ్లు యెహోవాతో మాట్లాడగల్గేవారు. బదులుగా, యేసు కాలంలోని మత నాయకులు ఆ మందిరాన్ని “వ్యాపారపుటిల్లుగా” మరియు “దొంగల గుహగా” మార్చారు. (మత్తయి 21:12, 13; యోహాను 2:14-17) బలులుగా అర్పించే జంతువుల అమ్మకం ద్వారా వారు వ్యక్తిగత లాభాన్ని ఆర్జించేవారు. వాస్తవానికి, వారు మందను దోచుకునేవారు. అందుకనే, దేవుని కుమారుడు తన తండ్రి గృహం నుండి ఆ దొంగలను తరిమివేయడమనేది పూర్తిగా న్యాయబద్ధమైనదే. యేసు కోపగించుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు!

అపరిపూర్ణ మానవులకు కోపం వచ్చినప్పుడు

అపరిపూర్ణ మానవులు కూడా కొన్ని సందర్భాలలో యుక్తరీతిలో కోపోద్రేకులౌతారు. మోషేకు ఏం జరిగిందో పరిశీలించండి. ఇశ్రాయేలు జనాంగం అప్పుడే ఐగుప్తు నుండి అద్భుతరీతిలో విడిపించబడ్డారు. యెహోవా ఐగుప్తీయులపై పది తెగుళ్లను కుమ్మరించడం ద్వారా ఐగుప్తు అబద్ధ దేవతలపై అద్భుతరీతిలో తన శక్తిని ప్రదర్శించాడు. ఆయన అప్పుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా విడదీసి మార్గాన్ని ఏర్పర్చడం ద్వారా ఇశ్రాయేలీయులను తప్పించాడు. ఆ తర్వాత, సీనాయి పర్వతం అడుగు భాగంవరకు తీసుకు వెళ్లబడి, అక్కడ వారు ఒక జనాంగంగా సంస్థీకరించబడ్డారు. మోషే మధ్యవర్తిగా ఉంటూ, దేవుని శాసనాలను తీసుకోవడానికి పర్వతంపైకి వెళ్లాడు. ఇతర శాసనాలన్నిటితోపాటుగా, పర్వతం నుండి దేవుడు తానే చెక్కితీసిన రాతి పలకలపై “దేవుని వ్రేలితో” వ్రాయబడిన పది ఆజ్ఞలను యెహోవా మోషేకు ఇచ్చాడు. అయితే, మోషే దిగివచ్చిన తర్వాత, ఏం కనుగొన్నాడు? ప్రజలు బంగారు దూడ ప్రతిమను ఆరాధిస్తున్నారు! వారెంత తొందరగా మరిచిపోయారో! కేవలం కొన్ని వారాలే గడిచాయి. సరైన విధంగానే, ‘మోషే కోపము మండెను.’ ఆయన ఆ రాతి పలకలను పగులగొట్టి, ఆ దూడ ప్రతిమను నాశనం చేశాడు.—నిర్గమకాండము 31:18; 32:16, 19, 20.

ఆ తర్వాత మరో సందర్భంలో, ప్రజలు నీటి కొరతను గురించి ఫిర్యాదు చేసినప్పుడు మోషే తన నిగ్రహాన్ని కోల్పోయాడు. దీనత్వానికి లేక సాత్వికతకు తనకు తానే సాటి అనిపించుకున్న ఆయన విసుగు చెంది ఓ క్షణం ఆ లక్షణాలను కోల్పోయాడు. అది ఓ గంభీరమైన తప్పిదానికి కారణమైంది. ఇశ్రాయేలీయులకు అనుగ్రహించేవానిగా యెహోవాను మహిమపర్చే బదులు, మోషే ప్రజలతో కఠినంగా మాట్లాడి వారి అవధానాన్ని తన సహోదరుడైన అహరోనువైపుకు తనవైపుకు మళ్లించాడు. అందువల్ల, దేవుడు మోషేను శిక్షించడం యుక్తమని భావించాడు. ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి అనుమతించబడడు. మెరీబా వద్ద జరిగిన ఈ సంఘటన తర్వాత, మరి ఇంకెన్నడూ మోషే తన నిగ్రహాన్ని కోల్పోయినట్లు చెప్పబడలేదు. సుస్పష్టంగా, ఆయన ఓ గుణపాఠాన్ని నేర్చుకున్నాడు.—సంఖ్యాకాండము 20:1-12; ద్వితీయోపదేశకాండము 34:4; కీర్తనలు 106:32, 33.

ఆ విధంగా, దేవునికీ మానవునికీ మధ్య వ్యత్యాసముంది. యెహోవా ‘దీర్ఘశాంతముగలవాడని’ యుక్తరీతిలో వర్ణించబడ్డాడు మరియు ఆయన తన కోపాన్ని అదుపు చేనుకోగలడు, ఎందుకంటే ఆయన ప్రధానగుణం ప్రేమే గాని కోపం కాదు. ఆయన కోపం ఎల్లప్పుడూ నీతియుక్తంగా న్యాయబద్ధంగా ఉంటుంది. ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది. (నిర్గమకాండము 34:6; యెషయా 48:9; 1 యోహాను 4:8) పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు కోపాన్ని ప్రదర్శించడాన్ని అన్ని వేళలా అదుపు చేసుకోగలిగాడు; ఆయన “సాత్వికుడ”ని వర్ణించబడ్డాడు. (మత్తయి 11:29) మరో వైపున, అపరిపూర్ణ మానవులకు చివరికి మోషేవంటి విశ్వాసులకు సహితం తమ కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టతరంగా ఉండింది.

అంతేకాకుండా, సాధారణంగా మానవులు కోపాన్ని అదుపుచేసుకోక పోవడం వల్ల వచ్చే ఫలితాల గురించి తగినంతగా ఆలోచించరు. ఒకరు తమ కోపాన్ని నిగ్రహించుకోకపోవడం మూలంగా తగిన వెలను చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక భర్త తన భార్య ఎడల నిగ్రహాన్ని కోల్పోయి గోడలో రంధ్రం పడేంతగా తన పిడికిలితో దానిపై గుద్దేంతవరకు వచ్చినప్పుడు కలిగే స్పష్టమైన ఫలితాలు ఏమై ఉంటాయి? ఆస్తి నష్టమౌతుంది. ఆయన చేతికి గాయం కావచ్చు. కాని అంతకు మించి, అయన భార్యకు ఆయనపై ఉన్న ప్రేమా గౌరవాలపై ఆయన దుష్‌ప్రవర్తన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? గోడను కొన్ని రోజుల్లో బాగుచేయవచ్చు, ఆయన చెయ్యి కొన్ని వారాల్లో నయం కావచ్చు; కాని ఆయన తన భార్య నమ్మకాన్ని గౌరవాన్ని తిరిగి పొందేందుకు ఎంత కాలం పడుతుంది?

నిజానికి, మానవులు తమ కోపాన్ని అదుపు చేసుకోవడంలో విఫలమై, తద్వారా ఏర్పడే పర్యవసానాలను అనుభవించిన అనేక ఉదాహరణలు బైబిలు నందున్నాయి. కొన్నింటిని పరిశీలించండి. కయీను తన సహోదరుడైన హేబెలును చంపినందుకు దేశభ్రష్టునిగా చేయబడ్డాడు. షెకెము పురుషులను చంపినందుకు షిమియోను, లేవి తమ తండ్రిచే శపించబడ్డారు. ఉజ్జియా, యాజకులు తన తప్పిదాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారిపై కోపోద్రేకుడైనందుకు యెహోవా ఉజ్జియాకు కుష్ఠరోగం వచ్చేలా చేశాడు. యోనా ‘కోపగించుకొన్నప్పుడు,’ యెహోవా ఆయనను గద్దించాడు. వారందరూ వారి కోపానికి లెక్క ఒప్పచెప్పవలసి ఉండింది.—ఆదికాండము 4:5, 8-16; 34:25-30; 49:5-7; 2 దినవృత్తాంతములు 26:19; యోనా 4:1-11.

క్రైస్తవులు లెక్క ఒప్పచెప్పవలసినవారై ఉన్నారు

అదే ప్రకారంగా, ఈనాడు క్రైస్తవులు తమ క్రియల విషయమై దేవునికి మరియు కొంతమేరకు తమ తోటి విశ్వాసులకు లెక్క ఒప్పచెప్పవలసి ఉంది. కోపాన్ని సూచించే గ్రీకు పదాల యొక్క బైబిలు ఉపయోగం నుండి ఇది స్పష్టమౌతుంది. అతి తరచుగా ఉపయోగించబడిన రెండు పదాలలో ఒకటి ఓర్‌గే. ఇది సాధారణంగా “ఆగ్రహం” అని అనువదించబడుతుంది. తరచూ, పగ తీర్చుకోవాలనే దృక్పథంతో తెలిసీ ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేయడమనే భావాన్ని కొంత మేరకు కల్గివుంది. అందుకే, పౌలు రోమా క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు [ఓర్‌గే] చోటియ్యుడి—పగతీర్చుట నాపని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు [యెహోవా] చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.” వారు తమ సహోదరుల ఎడల శత్రుత్వాన్ని పెంచుకోవడానికి బదులు ఇలా చేయాలని ప్రోత్సహించబడ్డారు: “మేలు చేత కీడును జయించుము.”—రోమీయులు 12:19, 21.

తరచూ ఉపయోగించబడిన మరోపదం తుమొస్‌. దాని మూల పదం “ప్రాథమికంగా గాలి, నీరు, భూమి, జంతువులు, లేక మనుష్యుల ప్రచండమైన కదలికను సూచిస్తుంది.” అందుకే ఆ పదం, “శత్రుత్వ భావాన్ని క్రోధంగా వెళ్లగక్కడం,” “ఆవేశానికి లోనుకావడం” లేక “కుటుంబపరమైన సంఘపరమైన సంక్షోభాలనూ ఆందోళనలనూ సృష్టిస్తూ మనశ్శాంతి లేకుండా చేసే కలతకల్గించే ఉద్రేకాలు” అని వివిధ రకాలుగా వర్ణించబడింది. గాయపర్చి వికలాంగులను చేసి చంపే, వేడి బూడిదను రాళ్లను లావాను ఎగజిమ్ముతూ హెచ్చరించకుండా బ్రద్దలయ్యే అగ్ని పర్వతం ఎలా ఉంటుందో, తమ కోపాన్ని అదుపు చేసుకోలేని పురుషుడు లేక స్త్రీ అలా ఉంటారు. గలతీయులు 5:20 నందు తుమొస్‌ యొక్క బహువచన రూపం ఉపయోగించబడింది. అక్కడ పౌలు ‘క్రోధములను,’ [“క్రోధపూరిత ప్రవృత్తి,” NW] (19వ వచనం) జారత్వము, కాముకత్వము, మత్తతలు వంటి ఇతర “శరీరకార్యముల”తో పాటూ పేర్కొన్నాడు. నిశ్చయంగా, ప్రారంభంలో వివరించబడిన అనిల్‌ ప్రవర్తన “క్రోధపూరిత ప్రవృత్తి”ని చక్కగా వర్ణిస్తుంది.

అయితే, ఇతరులపై లేక ఇతరుల ఆస్తిపై తరచూ దౌర్జన్యం చేస్తూ, క్రైస్తవ సంఘంతో సహవసించే వ్యక్తులను క్రైస్తవ సంఘం ఎలా దృష్టించాలి? అదుపులేని కోపం నాశనకరమైనది. అది సుళువుగా హింసకు నడిపిస్తుంది. సరైన కారణంతోనే యేసు ఇలా చెప్పాడు: “నేను మీతో చెప్పునదేమనగా—తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును.” (మత్తయి 5:21, 22) “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టకుడి” అని భర్తలకు సలహా ఇవ్వబడింది. ఒకడు “ముక్కోపి” అయిన ఎడల సంఘంలో పైవిచారణకర్తగా ఉండడానికి యోగ్యుడు కాదు. అందుకే, ఎవరైతే కోపాన్ని అదుపుచేసుకోలేరో అట్టి వారిని సంఘానికి మంచి మాదిరికర్తలుగా పరిగణించకూడదు. (కొలొస్సయులు 3:19; తీతుకు 1:7; 1 తిమోతి 2:8) వాస్తవంగా, ఒక వ్యక్తి మెలిగే విధానాన్ని, ఇతరుల జీవితాలకు ఆయన చేసిన నష్టతీవ్రతను పరిశీలించిన తరువాత, అదుపులేని క్రోధాన్ని వ్యక్తపరిచే వ్యక్తిని సంఘంనుండి బహిష్కరించాలి—నిజంగా అదొక ఘోరమైన పర్యవసానమే.

మొదట చెప్పబడిన అనిల్‌, ఎన్నడైనా తన భావోద్రేకాలను అదుపులోనికి తెచ్చుకున్నాడా? ఆయన తాను నాశనం వైపుకు నెట్టబడుతున్నట్లు ఎప్పుడైనా పరిశీలించుకోగలిగాడా? దుఃఖకరంగా, అరవడం చివరకు నెట్టే వరకూ గెంటే వరకూ వెళ్లింది. వేలెత్తి చూపడం, అక్షరార్థంగా బాధాకరమైన విధంగా వేలితో గాయం చేయడానికి దారి తీసింది. సులభంగా కన్పించే ప్రాంతాల్లో గాయపర్చకుండా జాగ్రత్త వహిస్తూ అనిల్‌ తన ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే చివరికి ఆయన తన్నడం, గుద్దడం, జుట్టు పట్టిలాగడం, అంతకన్నా ఘోరంగా వ్యవహరించడం అలవాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు షీల అనిల్‌ నుండి విడిపోయింది.

అది ఇలా జరగవలసిన అవసరంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోవున్న అనేకమంది కోపాన్ని అదుపు చేసుకోగల్గారు. అయితే, పరిపూర్ణ మాదిరికర్తయైన యేసుక్రీస్తును అనుకరించడం, అత్యంత ప్రాముఖ్యమైయున్నది. ఆయన ఎన్నడూ అదుపులేని కోపోద్రేకానికి లోనుకాలేదు. ఆయన కోపం అన్నివేళలా నీతియుక్తమైనది; ఆయన ఎన్నడూ అదుపు తప్పలేదు. జ్ఞానయుక్తంగా, పౌలు మనందరికీ ఇలా సలహా ఇచ్చాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” (ఎఫెసీయులు 4:26) అందుకే, మనము విత్తిన దానినే కోస్తామన్న విషయాన్నీ, మానవులంగా మనకు పరిమితులున్నాయనీ వినయంతో గుర్తిస్తూ, కోపాన్ని అదుపు చేసుకోవడానికి మనకు తగినన్ని కారణాలున్నాయి.

[అధస్సూచి]

a పేర్లు మార్చబడ్డాయి.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు/The Doré Bible Illustrations/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి