“వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
“కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటన్నిటిలో గొప్పది ప్రేమ.”—1 కొరింథీయులు 13:13.
1. ఒక మానవ శరీర శాస్త్రజ్ఞుడు ప్రేమనుగూర్చి ఏమి చెప్పియున్నాడు?
ప్రపంచములో పేరుగాంచిన మానవశరీర శాస్త్రజ్ఞులలో ఒకరు ఒకసారి ఇలా అన్నారు: “మన జాతి జీవుల చరిత్రలో మొట్టమొదటిసారిగా మనము, మానవునికి కావలసిన మానసిక మూల అవసరతలలో ప్రేమ అత్యంత ముఖ్యమైనదని అర్థము చేసుకొనుచున్నాము. సౌరవిధానములో సూర్యుడు తనచుట్టు తిరుగు గ్రహములతో ఎలా కేంద్రస్థానమొహించియున్నాడో, అలాగే మానవ అవసరతలన్నిటిలో అది కేంద్రస్థానమందున్నది. ప్రేమించబడని పిల్లవాడు జీవరసాయనపరంగాను, భౌతికంగాను, మానసికంగాను ప్రేమించబడిన పిల్లవానికి చాలా భేదాన్ని కలిగియుండును. మొదటివాడు తరువాత వానికంటె భిన్నముగా కూడ పెరుగును. మనకు ప్రస్తుతము తెలిసినదేమనగా జీవించటం, ప్రేమించటం ఒక్కటైయున్నట్లుగా జీవించుటకే మానవుడు జన్మించియున్నాడు. అయితే ఇది క్రొత్తదేమికాదు. కొండమీది ప్రసంగమందు ఇది ఒక విలువైన కట్టడైయున్నది.
2. (ఎ) అపొస్తలుడైన పౌలు ప్రేమయొక్క ప్రాముఖ్యతను ఎట్లు చూపించెను? (బి) ఇప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలనా యోగ్యమైనవి?
2 అవును, ప్రపంచ విద్యగల ఈ మనుష్యుడు ఒప్పుకొనినట్లు, మానవ సంక్షేమమునకు ప్రేమయొక్క ప్రాముఖ్యతను గూర్చిన సత్యము క్రొత్తసంగతేమి కాదు. ప్రాపంచిక విద్యాపరులవలన ఇది కేవలము ఇప్పుడు మెచ్చుకొనబడుచున్నను, దేవునివాక్యమందు 19 శతాబ్దములకు పూర్వమే ఇది కనపడినది. అందుచేతనే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయగలిగెను: “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.” (1 కొరింథీయులు 13:13) అయితే ప్రేమ విశ్వాసము మరియు నిరీక్షణలకంటె ఎందుకు గొప్పదో మీకు తెలియునా? దేవుని లక్ష్యణములలో మరియు ఆత్మఫలములలో ప్రేమయే గొప్పదని ఎందుకు చెప్పవచ్చును?
నాలుగు విధములైన ప్రేమ
3. వ్యామోహపు ప్రేమ సంబంధముగా ఏ లేఖన ఉదాహరణములున్నవి?
3 ప్రేమను ప్రదర్శించగల మానవ శక్తి, మానవజాతియెడల దేవునియొక్క ప్రేమగల శ్రద్ధ మరియు ఆయన జ్ఞానమును ప్రదర్శించునదైయున్నది. ఆసక్తిదాయకంగా, పురాతన గ్రీకులు, “ప్రేమ”కు నాలుగు పదములను కలిగియున్నారు. వాటిలో ఒకటి ఎ’రోస్. ఇది లైంగిక ఆకర్షణపై ఆధారపడిన వ్యామోహపు ప్రేమను సూచించుచున్నది. సెప్టుజెంట్ దీని రూపములను సామెతలు 7:18 మరియు 30:16 నందు ఉపయోగించుచున్నను, గ్రీకులేఖనముల వ్రాతగాళ్లు ఎ’రోస్‌ను ఉపయోగించు సందర్భమును పొందలేదు. మరియు ఈ వ్యామోహపు ప్రేమకు హెబ్రీలేఖనములలో ఇతర ప్రస్తావనలు కూడ ఉన్నను, ఉదాహరణకు ఇస్సాకు రిబ్కాయందు “ప్రేమలో పడినట్లు” మనము చదువుదుము. (ఆదికాండము 24:67 NW) ఇటువంటి ప్రేమకు నిజముగా గుర్తింపదగిన ఉదాహరణ యాకోబు విషయంలో కనబడుతుంది. మొదటి చూపులోనే ఆయన రాహేలుపై ప్రేమను పెంచుకొనెను. వాస్తవమునకు “యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.” (ఆదికాండము 29:9-11, 17, 20) పరమగీతము కూడ గొర్రెలకాపరికి, చిన్నదానికి మధ్యగల వ్యామోహపు ప్రేమను వివరించుచున్నది. అయితే ఇటువంటి ప్రేమ సంతృప్తికి, ఆనందమునకు మూలమైనను దీనికి మరెక్కువ బలంగా ప్రాధాన్యత ఇవ్వబడజాలదు, ఎందుకనగా ఇది, కేవలము దేవుని ఉన్నత నైతిక ప్రమాణములకు అనుగుణ్యంగానే చూపబడవలెను. ఎందుకనగా దానిని గూర్చి బైబిలు పురుషుడు కేవలం తాను చట్టబద్ధముగా పెండ్లాడిన తన భార్యయొక్క ప్రేమ నుండియే “ఎల్లప్పుడు తృప్తినొందుచుండ” వచ్చునని చెప్పుచున్నది.—సామెతలు 5:15-20.
4. కుటుంబ ప్రేమ లేఖనములలో ఎట్లు ఉదహరించబడియున్నది?
4 తదుపరి బలమైన కుటుంబ ప్రేమ లేక సహజమైన అనురాగము కలదు. అది రక్తసంబంధముపై ఆధారపడినది. దానికి గ్రీకులు స్టార్’గే’ అను పదమును కలిగియున్నారు. “నీళ్లకంటె రక్తము చిక్కన” అను సామెతకు ఇదియే కారణము. ఇందుకు మరియ మరియు మార్త తమ సహోదరుడైన లాజరుయెడల కలిగియున్న ప్రేమలో మనకు మంచి ఉదాహరణ కలదు. ఆయన ఆకస్మిక మరణమునుబట్టి వారు పొందిన అమిత దుఃఖములో ఆయన వారికి ఎంతగానో కావలసియున్నాడని మనము చూడగలము. యేసు తమ ప్రియమైన లాజరును జీవమునకు తిరిగితెచ్చినప్పుడు వారు ఎంతగా ఆనందించారు! (యోహాను 11:1-44) తల్లి తన బిడ్డయెడల కలిగియుండు ప్రేమ ఇటువంటి ప్రేమకు మరొక ఉదాహరణ. (1 థెస్సలొనీకయులు 2:7ను పోల్చుము.) ఆవిధముగా, సీయోనుయెడల తనకు ఎంతో గొప్పప్రేమ కలదని సూచించుటకు యెహోవా, దానిని ఆయన తల్లి తన బిడ్డయెడల కలిగినదానికంటె అది చాలా గొప్పదని తెలియజేసెను.—యెషయా 49:15.
5. ఈనాడు సహజమైన అనురాగలోపము ఎట్లు స్పష్టమగుచున్నది?
5 మనము “వ్యవహరించుటకు క్లిష్టమైన అంత్యదినములలో” జీవించుచున్నామనుటకు ఒక సూచన ఏమనగా “సహజమైన అనురాగము” లోపించుట. (2 తిమోతి 3:1, 3 NW) ఇట్టి కుటుంబ ప్రేమ లోపించుటవలన కొందరు యువకులు గృహములను విడిచి పారిపోవుచున్నారు. కొందరు ఎదిగిన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయుచున్నారు. (సామెతలు 23:22 ను పోల్చుము) మరియు సహజమైన అనురాగ లోపము పిల్లలను శ్రమలపాలు చేయుటలోను కన్పించుచున్నది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రిలో చేర్పించవలసినంతటి స్థితి తలెత్తురీతిగా కొట్టుచున్నారు. మరియు తల్లిదండ్రుల ప్రేమా లోపము తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టుటయందు విఫలమగుటలోను స్పష్టమగుచున్నది. పిల్లలను తమకిష్టమొచ్చిన మార్గములో వెళ్లనిచ్చుట ప్రేమను రుజువుచేయునదికాక, అది నిరోధించలేని అతి బలహీనమార్గమును అనుసరించుటయైయుండును. తమ పిల్లలను నిజముగా ప్రేమించు తండ్రి, అవసరమైనప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టును.—సామెతలు 13:24; హెబ్రీయులు 12:5-11.
6. స్నేహితుల మధ్య ఉండు అనురాగమునకు లేఖన ఉదాహరణ లిమ్ము.
6 తరువాత ఫి.లి’యా అను గ్రీకు పదము కలదు. ఇది పరిపక్వత కెదిగిన ఇద్దరు పురుషులు, లేక స్త్రీల మధ్యయుండునట్టి స్నేహితుల మధ్యగల ప్రేమను (ఏవిధమైన లైంగిక ఉద్దేశ్యములేని) సూచించుచున్నది. ఇందుకు దావీదు మరియు యోనాతాను ఒకరియెడల ఒకరు కలిగియున్న ప్రేమయందు మనకు మంచి ఉదాహరణ ఉన్నది. యోనాతాను యుద్ధములో చంపబడినప్పుడు, దావీదు ఆయనను గూర్చి ప్రలాపిస్తూ, ఇట్లనెను: “నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.” (2 సమూయేలు 1:26) అంతేగాక “యేసు ప్రేమించిన శిష్యుడు” అని పిలువబడిన అపొస్తలుడైన యోహానుయెడలను క్రీస్తుకు ప్రత్యేక యిష్టమున్నట్లు మనము నేర్చుకొందుము.—యోహాను 20:2.
7. అ.గా’పే యొక్క స్వభావమేమిటి, మరియు ఈ ప్రేమ ఎట్లు చూపబడియున్నది?
7 విశ్వాసము, నిరీక్షణ, మరియు ప్రేమనుగూర్చి చెప్పి, “వీటన్నిటిలో గొప్పది ప్రేమయే” అని చెప్పిన 1 కొరింథీయులు 13:13 నందు, పౌలు ఏ గ్రీకు పదమును ఉపయోగించెను? ఇచ్చట అ.గా’పే, అను పదము వాడబడినది. అపొస్తలుడైన యోహాను “దేవుడు ప్రేమా స్వరూపి” అని చెప్పిన చోటను ఇదే పదమును ఉపయోగించెను. (1 యోహాను 4:8, 16) ఇది సూత్రముచే నడిపించబడిన లేక అదుపుచేయబడిన ప్రేమయైయున్నది. దీనిలో అనురాగము, యిష్టత ఇమిడియుండవచ్చును లేక ఉండకపోవచ్చును. అయితే అది, దానిని పొందువారి అర్హతలు, లేక ఇచ్చువారికిగల ప్రయోజనములను చూడకుండ ఇతరులకు మేలుచేయవలెనను శ్రద్ధలో ఏర్పడు నిస్వార్థమైన భావప్రేరణ లేక భావనయైయున్నది. ఇటువంటి ప్రేమయే తన హృదయమునకు అత్యంత ప్రియ నిధియైన తన అద్వితీయకుమారుడగు యేసుక్రీస్తును “ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అనుగ్రహించుటకు” దేవుని నడిపించెను. (యోహాను 3:16) పౌలు మనకు చక్కగా గుర్తుచేయుచున్నట్లు: “నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మనయెడల తనప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:7, 8) అవును, అ.గా’పే యితరుల జీవిత స్థాయి యెట్టిదైనను లేక ప్రేమను వ్యక్తపరచువానినుండి ఎంతటి విలువను కోరునదైనను అది వారికి మేలుచేయును.
విశ్వాసము మరియు నిరీక్షణకంటె ఎందుకు గొప్పది?
8. అ.గా’పే ఎందుకు విశ్వాసముకంటె గొప్పదైయున్నది?
8 అయితే ఇటువంటి ప్రేమ (అ.గా’పే) విశ్వాసముకంటె గొప్పదని పౌలు ఎందుకు చెప్పెను? 1 కొరింథీయులు 13:2 లో ఆయనిట్లు వ్రాసెను: “ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.” (మత్తయి 17:20 ని పోల్చుము) అవును, జ్ఞానము సంపాదించుటకు మరియు విశ్వాసమందు ఎదుగుటకు మనముచేయు ప్రయత్నములు స్వార్థపరమైన ఉద్దేశ్యముతో కూడినవైతే, ఇది దేవునినుండి మనకు ఎట్టి ప్రయోజనమును చేకూర్చదు. అలాగే యేసు కూడ, ‘కొందరు ఆయన నామమున ప్రవచించినను, ఆయన నామమున దయ్యములను వెళ్లగొట్టినను, లేక ఆయన నామమున అనేక అద్భుతక్రియలు చేసినను’ తన అంగీకారమును పొందరని చూపెను.—మత్తయి 7:22, 23.
9. ప్రేమ నిరీక్షణకంటెను ఎందుకు గొప్పదైయున్నది?
9 అ.గా’పే రూపమందలి ప్రేమ నిరీక్షణకంటె కూడ ఎందుకు గొప్పదైయున్నది? ఎందుకనగా నిరీక్షణ తనపైనే కేంద్రీకరించబడునదై, ఒక వ్యక్తి ముఖ్యముగా తన మట్టుకు తన ప్రయోజనములయందే శ్రద్ధ వహింపజేయునదై యుండవచ్చును. అయితే ప్రేమ మాత్రము “స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:4, 5) అంతేగాక “మహాశ్రమలను” సజీవముగా తప్పించుకొనే నిరీక్షణలాంటిది కూడ, ఆ నిరీక్షణ గుర్తించబడుటతోడనే ఆగిపోవును. (మత్తయి 24:21) పౌలు చెప్పుచున్నట్లుగా: “ఏలయనగా మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చుడని దానికొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.” (రోమీయులు 8:24, 25) ప్రేమయే అన్నిటిని ఓర్చును, శాశ్వత కాలముండును. (1 కొరింథీయులు 13:7, 8) ఆవిధముగా నిస్వార్థమైన ప్రేమ (అ.గా’పే) విశ్వాసముకంటెను లేక నిరీక్షణకంటెను గొప్పదైయున్నది.
జ్ఞానము, న్యాయము, మరియు శక్తికంటెను గొప్పదా?
10. దేవుని నాలుగు ప్రధాన లక్ష్యణములలో ప్రేమయే గొప్పదని ఎందుకు చెప్పవచ్చును?
10 మనము ఇప్పుడు యెహోవాదేవుని ప్రధానమైన నాలుగు విశేష గుణములను పరిశీలించుదము. అవి: జ్ఞానము, న్యాయము, శక్తి, మరియు ప్రేమ. అయితే వీటన్నిటిలోకెల్ల ప్రేమ గొప్పదని చెప్పబడగలదా? నిజముగా చెప్పవచ్చును. ఎందుకు? ఎందుకనగా దేవుడు చేయుదానికి వెనుకపురికొల్పు శక్తి ప్రేమయైయున్నది. అందుకే అపొస్తలుడైన యోహాను: “దేవుడు ప్రేమా స్వరూపి” యని వ్రాసెను. అవును, యెహోవా ప్రేమకు వ్యక్తిత్వమైయున్నాడు. (1 యోహాను 4:8, 16) లేఖనములో ఎక్కడను దేవుడు జ్ఞానమైయున్నాడని, న్యాయమైయున్నాడని, లేక శక్తియైయున్నాడని మనము చదువము. బదులుగా దేవుడు ఈ లక్ష్యణములను కలిగియున్నాడని చదువుదుము. (యోబు 12:13; కీర్తన 147:5; దానియేలు 4:37) ఆయనలో ఈ నాలుగు లక్ష్యణములు పరిపూర్ణ సమతూకములో ఉన్నవి. ప్రేమచే పురికొల్పబడినవాడై, ఇతర మూడు లక్ష్యణములను ఉపయోగించుచు లేక వాటిని పరిగణనలోకి తీసుకొని యెహోవా తన సంకల్పములను నెరవేర్చును.
11. విశ్వమును, ఆత్మీయ మరియు మానవప్రాణులను సృష్టించుటకు యెహోవాను కదలించినదేమి?
11 కావున, విశ్వమును, మరియు వివేచనగల ఆత్మీయ మరియు మానవప్రాణులను సృష్టించుటకు యెహోవాను పురికొల్పిన దేమి? జ్ఞానము లేక శక్తియా? కాదు, దేవుడు సృష్టిలో ఆయన జ్ఞానమును మరియు శక్తిని కేవలము ఉపయోగించెను. ఉదాహరణకు మనమిట్లు చదువుదుము: “జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను.” (సామెతలు 3:19) అంతేగాక, ఆయన లక్షణమైన న్యాయమునుబట్టి ఆయన నైతిక స్వతంత్రతను వినియోగించుకొనగలిగినవారిని సృష్టించనవసరములేదు. వివేకయుక్తమైన ఉనికియందలి ఆనందమును ఇతరులతో పంచుకొనుటకు దేవుని ప్రేమ ఆయనను నడిపించినది. ఆదాము దోషము మూలముగా మానవజాతిపై న్యాయము విధించిన శిక్షను తీసివేయుటకు మార్గమును చూపినది ప్రేమయే. (యోహాను 3:16) అవును, ప్రేమయే రానైయున్న భూ పరదైసులో విధేయులైన మానవజాతి జీవించాలని సంకల్పించునట్లు యెహోవాను కదిలించినది.—లూకా 23:43.
12. దేవుని శక్తి, న్యాయము మరియు ప్రేమలకు మనమెట్లు ప్రతిస్పందించవలెను?
12 అందువలననే దేవునియొక్క సర్వశక్తినిబట్టి ఆయనకు అసూయ పుట్టించుటకు మనము తెగించకూడదు. పౌలు ఇలా అడిగెను: “యెహోవాకు మనము అసూయ (రోషము) కలిగించెదమా? ఆయనకంటె మనము బలవంతులమా?” (1 కొరింథీయులు 10:22 NW) అవును యెహోవా “అసూయ” గల దేవుడైయున్నాడు, అయితే ఇది చెడు భావములో కాదు గాని, “సంపూర్ణమైన భక్తిని శాశించుటలో” ఆయన దానిని కలిగియున్నాడు. (నిర్గమకాండము 20:5; కింగ్ జేమ్సు వర్హన్) క్రైస్తవులుగా గ్రహింపశక్యముగాని ఆయన జ్ఞాన ప్రదర్శనలనుబట్టి మనము ఆశ్చర్యముతో భీతినొందుచున్నాము. (రోమీయులు 11:33-35) ఆయన న్యాయముయెడల మనకు గల గొప్పగౌరవము బుద్ధిపూర్వకమైన పాపమునుండి మనలను బహుగా దూరపరచవలెను. (హెబ్రీయులు 10:26-31) అయితే ఏ ప్రశ్నయులేక దేవుని ప్రధానమైన నాలుగు లక్ష్యణములలో ప్రేమ గొప్పదైయున్నది. అట్టి యెహోవాయొక్క నిస్వార్థమైన ప్రేమయే మనలను ఆయనకు సమీపస్థులనుగాచేసి, ఆయనను సంతోషపెట్టుటకును, ఆరాధించుటకును, ఆయన నామమును పరిశుద్ధపరచుటలో భాగము వహించుటకును యిష్టపడునట్లుచేయును.—సామెతలు 27:11.
ఆత్మఫలములలో గొప్పది
13. దేవుని ఆత్మఫలములలో ప్రేమ ఏ స్థానమును పొందును?
13 గలతీయులు 5:22, 23 లలో ప్రస్తావించబడిన తొమ్మిది దేవుని ఆత్మఫలములలో ప్రేమ ఏ స్థానమును పొందును? ఇవి, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” మంచి కారణమునుబట్టియే పౌలు ప్రేమను మొదటగా లిఖించెను. ఆయన తదుపరి ప్రస్తావించు సంతోషముకంటె ప్రేమ గొప్పదైయున్నదా? అవును, ప్రేమలేనిదే సహించగలిగిన ఆనందము ఉండజాలదు. వాస్తమునకు లోకముదానియొక్క స్వార్థత్వము, మరియు ప్రేమలేనితనమునుబట్టియే ఆనందములేనిదైయున్నది. అయితే యెహోవాసాక్షులు తమమధ్య తమలోను, తమ పరలోకపు తండ్రియైన యెహోవాయెడలను ప్రేమ కలిగియున్నారు. కావున వారిని మనము ఆనందముగలవారైయుంటారని ఆశించవలెను. మరియు వారిని గూర్చి ఇట్లు ప్రవచింపబడినది: “నా సేవకులు వారికి కలిగియున్న మంచి హృదయపరిస్థితినిబట్టి ఆనందముచేత కేకలు వేయుదురు.”—యెషయా 65:14 NW.
14. ఆత్మఫలమైన సమాధానముకంటెను ప్రేమ గొప్పదని ఎందుకు చెప్పవచ్చును?
14 ప్రేమ ఆత్మఫలమైన సమాధానముకంటెను గొప్పదైయున్నది. ప్రేమ లేకపోవుటచేతనే లోకము విభాగములతో, జగడముతో నిండియున్నది. అయితే యెహోవా ప్రజలు భూమియందంతట ఒకరితో ఒకరు సమాధానమును కలిగియున్నారు. వారి విషయములో కీర్తనల రచయిత మాటలు వాస్తవమైయున్నవి. అవేమనగా: “యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.” (కీర్తన 29:11) ఇంకనూ వారు నిజమైన క్రైస్తవులను గుర్తించగల గురుతైన ప్రేమను కలిగియున్నందున వారు ఈ సమాధానమును కలిగియున్నారు. (యోహాను 13:35) జాతి, దేశ, లేక సాంసృతిక సంబంధమైనవాటితోసహా, సమస్త వేర్పాటు కారణములను ఒక్క ప్రేమ మాత్రమే అధికమించగలదు. ప్రేమ “ఐక్యతకు పరిపూర్ణ బంధమైయున్నది.”—కొలొస్సయులు 3:14 NW.
15. ఆత్మఫలమైన దీర్ఘశాంతమునకు పోలికగా ప్రేమయొక్క అత్యున్నత పాత్రను ఎట్లు చూడగలము?
15 ప్రేమయొక్క అత్యున్నత పాత్ర చెడును, లేక కోపమును ఓపికతో సహించుటయైన దీర్ఘశాంతముతో పోల్చినప్పుడుకూడ కనపడుతుంది. దీర్ఘశాంతము కలిగియుండుట అనగా ఓపిక మరియు కోపపడుటకు నిదానించుట అని భావము. ప్రజలు ఓపికలేనివారై త్వరగా కోపపడుటకు కారణము ఏమి? అది ప్రేమయొక్క లోపము కాదా? అయినను మన పరలోకపు తండ్రిమాత్రము దీర్ఘశాంతము గలవాడై “కోపపడుటకు నిదానించువాడునైయున్నాడు.” (నిర్గమకాండము 34:6 NW; లూకా 18:7) ఎందుకు? ఎందుకనగా ఆయన మనలను ప్రేమించుచు, “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక” ఉన్నాడు.—2 పేతురు 3:9.
16. దయ, మంచితనము, సాత్వికము, మరియు ఆశానిగ్రహములకు ప్రేమను ఎట్లు పోల్చబడును?
16 ముందు మనము విశ్వాసముకంటె ప్రేమ ఎందుకు గొప్పదో చూశాము. అయితే చూపబడిన అవేకారణములు ఇతర ఆత్మఫలములైన దయ, మంచితనము, సాత్వికము, మరియు ఆశానిగ్రహమునకు అన్వయించును. అవన్నియు అవసరమైన లక్ష్యణములే. కాని ప్రేమ లేనట్లయిన అవి మనకు ప్రయోజనకరము కావు. దీనిని పౌలు కూడ గుర్తించుచు ఇలా వ్రాసెను: “ఇతరుల పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.” మరొకప్రక్క ప్రేమయే దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహము మొదలగు లక్ష్యణములను పైకితెచ్చునది. ఆవిధముగా పౌలు ఇంకను ప్రేమ దయగలదై అది “అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చు” ననియు చెప్పుచున్నాడు. అవును, “ప్రేమ శాశ్వతకాలముండును.” (1 కొరింథీయులు 13:4, 7, 8) కావున ఆత్మయొక్క ఇతర ఫలములు మొదట ప్రస్తావించబడిన ప్రేమయొక్క ప్రదర్శనలు మరియు వివిధ ఆకృతులైయున్నట్లు గమనించబడినది. నిజముగా తొమ్మిది ఆత్మఫలములలోకెల్ల ప్రేమ నిశ్చయముగా గొప్పదైయున్నది.
17. ఆత్మఫలములలో ప్రేమయే గొప్పనైనదను ముగింపును ఏ లేఖన వాక్యములు బలపరచును?
17 ఆత్మఫలములలోకెల్ల ప్రేమ గొప్పదను ముగింపును బలపరస్తూ, పౌలు మాటలు ఇలా ఉన్నవి: “ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా ధర్మశాస్త్రమంతయు . . . నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదుగనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.” (రోమీయులు 13:8-10) అందుకే ఎంతో యుక్తమైనరీతిలో శిష్యుడైన యాకోబు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించుమను ఆజ్ఞను “ప్రాముఖ్యమైన” ఆజ్ఞగా (ఆజ్ఞలలో రాజులాంటిదిగా) సూచించుచున్నాడు.—యాకోబు 2:8.
18. ప్రేమ అత్యంతగొప్ప లక్షణమనుటకు ఏ ఇతర సాక్ష్యమున్నది?
18 ప్రేమ అత్యున్నత లక్షణమనుటకు ఇంకేదైనా సాక్ష్యము కలదా? అవును, నిజముగా ఉన్నది. ఒక శాస్త్రి యేసును “ఆజ్ఞలన్నిటలో ప్రధానమైనదేదని” అడిగినప్పుడు ఏమి జరిగిందో విచారించుము. బహుశా యేసు, పది ఆజ్ఞలలో ఒకదానిని ఎత్తిచెప్పవచ్చునని ఆయన తలంచియుండవచ్చును. అయితే యేసు ద్వితీయోపదేశకాండము 6:4, 5 ను ఎత్తిచెప్పుచూ ఇట్లనెను: “ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.” తదుపరి యేసు దానికి చేర్చుచు: “రెండవది, ‘నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది’ వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను.”—మార్కు 12:28-31.
19. అ.గా’పే యొక్క కొన్ని ప్రాముఖ్యమైన ఫలములేమి?
19 నిజముగా పౌలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను ప్రస్తావించుచు, “వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే” అనినప్పుడు ఆయన చిన్నదానిని పెద్దగా అతిశయముచేసి చెప్పుటలేదు. ప్రేమను ప్రదర్శించుట మన పరలోకపుతండ్రితోను మరియు ఇతరులతోను, చివరకు సంఘ మరియు మన కుటుంబ సభ్యులతోను మంచిసంబంధములు కలిగియుండుటకు కారణమగును. ప్రేమ మనపై నిర్మాణాత్మకమైన ప్రభావమును కలిగియున్నది. మరియు తదుపరి శీర్షిక ప్రేమ ఎంత ప్రతిఫలదాయకమైనదిగా ఉండగలదో చూపును. (w90 11/15)
మీరెట్లు ప్రత్త్యుత్తరమిత్తురు?
◻ ప్రేమ విశ్వాసము మరియు నిరీక్షణలకంటె ఎట్లు గొప్పదైయున్నది?
◻ అ.గా’పే ఏమైయున్నది, అట్టి ప్రేమ ఎట్లు చూపబడియున్నది?
◻ దేవుని ప్రధానమైన నాలుగు లక్ష్యణములలో ప్రేమ ఎందుకు గొప్పది?
◻ ఏయేవిధములుగా ప్రేమ ఇతర ఆత్మఫలములన్నిటి కంటెను గొప్పదైయున్నది?
[13వ పేజీలోని చిత్రాలు]
దేవుని ప్రేమ మానవజాతి భూపరదైసులో జీవించునట్లు సృష్టించుటకు పురికొల్పినది. మీరు దానిలో ఉండుటకు నిరీక్షింతురా?