కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/15 పేజీలు 8-13
  • యెహోవాయొక్క ప్రేమగల కుటుంబ ఏర్పాటు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాయొక్క ప్రేమగల కుటుంబ ఏర్పాటు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు కాలములలోని కుటుంబము
  • క్రైస్తవ భర్తల పాత్ర
  • మద్దతునిచ్చే క్రైస్తవ భార్యలు
  • మెప్పుగల పిల్లలు
  • మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రగాఢ గౌరవాన్ని పొందే భర్త
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/15 పేజీలు 8-13

యెహోవాయొక్క ప్రేమగల కుటుంబ ఏర్పాటు

‘ఈ హేతువుచేత పరలోకమందును భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి యెదుట నేను మోకాళ్లూనెదను.’—ఎఫెసీయులు 3:14.

1, 2. (ఎ) యెహోవా ఏ సంకల్పము కొరకు కుటుంబ వ్యవస్థను సృష్టించాడు? (బి) యెహోవా ఏర్పాటులో ఈనాడు కుటుంబము ఏ భాగమును కలిగియుండవలెను?

కుటుంబ వ్యవస్థను యెహోవా దేవుడు సృష్టించెను. దానిద్వారా తోడు, మద్దతు, సన్నిహితత్వము మొదలగు మానవ అవసరతలను తీర్చుటకంటె ఆయన ఇంకా ఎక్కువే చేశాడు. (ఆదికాండము 2:18) భూమిని నింపాలనే దేవుని మహిమాన్విత సంకల్పము, కుటుంబము ద్వారానే నెరవేరవలసి ఉండెను. ఎట్లనగా మొదటి వివాహదంపతులతో ఆయన: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అని చెప్పెను. (ఆదికాండము 1:28) అనురాగముతో పెంచిపోషించే కుటుంబ వాతావరణము ఆదాము హవ్వలకు, వారి సంతతికి జన్మించే కోట్లాది మంది పిల్లలకు, ఎంతో ప్రయోజనకరముగా ఉండును.

2 అయిననూ, ఆ మొదటి దంపతులు వారితోపాటు వారి సంతానానికిని వినాశకర ఫలితాలనిచ్చే, తిరుగుబాటు విధానాన్ని ఎన్నుకున్నారు. (రోమీయులు 5:12) అందుచేతనే ఈనాటి కుటుంబ జీవితము, దేవుడు ఊహించిన దానికంటె ఎంతో భిన్నంగా ఉన్నది. అయినను, క్రైస్తవ సమాజములో అది ఒక ప్రధానమైన వ్యవస్థగానేవుంటూ యెహోవా ఏర్పాటునందు ఒక ప్రముఖ పాత్రను ఇంకను కలిగియున్నది. అయితే, మన మధ్య వివాహం కాకుండా ఉన్న అనేకమంది క్రైస్తవులుచేసే మంచి పనియెడల మెప్పులేనందువలన చెప్పేమాట కాదిది. మొత్తం మీద క్రైస్తవ సంస్థయొక్క ఆత్మీయ ఆరోగ్యానికి కుటుంబములు కూడా గొప్పగా దోహదపడే విషయాన్ని మనము గుర్తిస్తున్నాము. బలమైన కుటుంబాలు ఒక మొత్తంగా బలమైన సంఘాలను ఏర్పాటుచేస్తాయి. అట్లయితే, నేటి వత్తిడుల మధ్య మీ కుటుంబము ఎట్లు వర్థిల్లగలదు? ఇందుకు సమాధానంగా కుటుంబ ఏర్పాటును గూర్చి బైబిలేమి చెబుతుందో పరిశీలిద్దాము.

బైబిలు కాలములలోని కుటుంబము

3. పితరుల కుటుంబములో భర్త మరియు భార్య ఏ పాత్రను కలిగియుండేవారు?

3 ఆదాము హవ్వలు దేవుని శిరసత్వపు ఏర్పాటును ధిక్కరించినను, విశ్వాసులైన నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోబులైతే కుటుంబ శిరస్సులుగా తమస్థానమును సరిగా కాపాడుకొన్నారు. (హెబ్రీయులు 7:4) పితరుల కుటుంబము ఒక చిన్న ప్రభుత్వమువలె ఉండేది. తండ్రి మతనాయకునిగా, ఉపదేశకునిగా, న్యాయాధిపతిగా వ్యవహరించేవాడు. (ఆదికాండము 8:20; 18:19) భార్యలు కూడ దాసీలవలెకాక, సహాయ గృహనిర్వాహకులుగా ప్రముఖ పాత్ర కలిగియుండేవారు.

4. (ఎ) మోషే ధర్మశాస్త్రము క్రింద కుటుంబ జీవితము ఎలా మారింది, అయినను తల్లిదండ్రులు ఎటువంటి పాత్ర నిర్వహించారు?

4 సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు ఒక జనాంగముగా ఏర్పడినప్పుడు, మోషేద్వారా ఒక జనాంగముగా వారికివ్వబడిన ధర్మశాస్త్రమునకు కుటుంబ కట్టడ ఉపనియమముగా మారింది. (నిర్గమకాండము 24:3-8) జీవన్మరణములకు సంబంధించిన విషయములన్నిటిలో నిర్ణయాధికారము నియమిత న్యాయాధిపతుల కియ్యబడెను. (నిర్గమకాండము 18:13-26) ఆరాధనయొక్క బలి అర్పణా సంబంధిత విషయాలు లేవీయుల యాజకత్వమున కప్పగింపబడెను. (లేవీయకాండము 1:2-5) అయినను తండ్రి ప్రముఖ పాత్రను నిర్వహిస్తూనే ఉండేవాడు. మోషే, తండ్రులకు ఇలా ఉద్బోధించాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) తల్లులు కూడా తగినంత ప్రభావాన్ని చూపారు. యౌవనులకు సామెతలు 1:8 ఇట్లు ఆజ్ఞాపించుచున్నది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” అంటే తన భర్త అధికార ఏర్పాటుకు లోబడుతూనే, హెబ్రీ గృహిణి కుటుంబ కట్టడను ఏర్పరచి, అమలుచేయగలదు. వృద్ధురాలైనప్పటికిని ఆమె పిల్లలు ఆమెను గౌరవించవలసి ఉండిరి.—సామెతలు 23:22.

5. కుటుంబ ఏర్పాటులో పిల్లల స్థానమును మోషే ధర్మశాస్త్రమెలా వర్ణిస్తుంది?

5 దేవుని ధర్మశాస్త్రములో పిల్లల స్థానము స్పష్టముగా వర్ణించబడినది. ద్వితీయోపదేశకాండము 5:16 ఇట్లు చెప్పినది: “నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.” తల్లిదండ్రులను అగౌరపరచుట మోషే ధర్మశాస్త్రము క్రింద తీవ్రమైన అపరాధము. (నిర్గమకాండము 21:15, 17) “ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష (నిశ్చయంగా NW) విధింపవలెనని” ధర్మశాస్త్రము చెప్పినది. (లేవీయకాండము 20:9) తల్లిదండ్రులకు వ్యతిరేకముగా తిరుగుబాటుచేయుట దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేయుటతో సమానంగా ఎంచబడెను.

క్రైస్తవ భర్తల పాత్ర

6, 7. ఎఫెసీయులు 5:23-29లో పౌలు వ్రాసిన మాటలు మొదటి శతాబ్దపు పాఠకులకు ఎందుకు సంచలనాత్మకంగా కనిపించాయి?

6 క్రైస్తవత్వము కుటుంబ ఏర్పాటునుగూర్చి, ప్రత్యేకంగా భర్తయొక్క పాత్రనుగూర్చి ఎంతో సమాచారమునందిస్తున్నది. మొదటి శతాబ్దములో క్రైస్తవ సంఘస్తులు కాని భర్తలు తమ భార్యలతో కఠినంగా వ్యవహరిస్తూ, బాధించేరీతిగా ప్రవర్తించేవారు. స్త్రీలకు ప్రాథమిక హక్కులుండేవి కావు, ఘనత ఇవ్వబడేది కాదు. ది ఎక్స్‌పొజిటర్స్‌ బైబిల్‌ ఇలా చెబుతుంది: “సంస్కృతిగల గ్రీసు దేశస్థుడు భార్యను పిల్లలను కనడానికి స్వీకరించేవాడు. అతని కామకోరికలను ఏవిధంగాను నిర్భందించే హక్కు ఆమెకు లేదు. ఆ వివాహ ఏర్పాటులో ప్రేమకు చోటులేదు. . . . దాసియైన-స్త్రీకి ఎలాంటి హక్కులు లేవు. ఆమె శరీరమెప్పుడూ తన యజమాని యిష్టా అయిష్టాలకే పరిమితమై ఉండేది.”

7 అలాంటి వాతావరణములో పౌలు ఎఫెసీయులు 5:23-29 లోని మాటలను వ్రాశాడు: “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. . . .. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకొనినట్లు. . .పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై యున్నారు.” నిజముగా మొదటి శతాబ్దములోని పాఠకులకు ఈ మాటలు సంచలనాత్మకమైనవి. ది ఎక్స్‌పొజిటర్స్‌ బైబిలు చెప్పునట్లు: “ఆ కాలమునాటి క్షీణించిపోతున్న నైతికతకు పోలిస్తే, వివాహముయెడల క్రైస్తవ దృక్పథమంత నూతనమైనది అంత కచ్చితమైనది మరొకటిలేదు. . . అది మానవజాతికి క్రొత్త యుగాన్ని ప్రారంభించింది.”

8, 9. స్త్రీలపట్ల పురుషులలో ఏ అనుచితమైన స్వభావాలు సాధారణంగా ఉన్నాయి, అయితే క్రైస్తవ పురుషులు అలాంటి దృక్పథములను విసర్జించుట ఎందుకు ప్రాముఖ్యము?

8 భర్తలకు బైబిలు ఈనాడిచ్చే ఉపదేశము ఎంతమాత్రము సంచలనాత్మకమైనది కాకపోలేదు. స్త్రీ స్వాతంత్ర్యమునుగూర్చి ఎంత మాట్లాడుతున్నను, స్త్రీలు ఇంకనూ అనేకమంది పురుషుల వలన కేవలం కామవాంఛకు ఉపయోగించుకునే పరికరాలవలె ఎంచబడుతున్నారు. స్త్రీలపై ఆధిపత్యం వహించుటనుబట్టి, వారిని అదుపులో ఉంచుకొనుటనుబట్టి, బెదరింపుతో బాధిస్తూ లొంగదీసుకునేదాన్నిబట్టి, నిజంగా స్త్రీలు ఆనందిస్తారనే పుక్కిటిపురాణాన్ని నమ్ముతూ, అనేకమంది పురుషులు శారీరకంగాను మానసికంగాను భార్యలను కష్టపెడుతుంటారు. ఒక క్రైస్తవ పురుషుడు లౌకిక తలంపుతో నింపబడి భార్యను చెడుగా బాధించుట ఎంతటి అవమానకరము! “నా భర్త పరిచారకునిగా ఉండేవాడు. బహిరంగ ప్రసంగాలిచ్చేవాడు” అని ఒక క్రైస్తవ స్త్రీ చెబుతుంది. అయినా, “భర్తల వలన కొట్టబడే భార్యలలో నేనొకదాన్నైయుంటిన”ని ఆమె బయలుపరచింది. నిశ్చయముగా అటువంటి క్రియలు దేవుని ఏర్పాటుకు పొందికలేనివి. అటువంటి వ్యక్తి ఉండటం చాలా అరుదైన విషయము. దేవుని అనుగ్రహము కావాలంటే తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయన సహాయమునర్థించ వలసియుండెను.—గలతీయులు 5:19-21.

9 భర్తలు తమ భార్యలను వారి స్వంతశరీరమువలె ప్రేమించాలని దేవుని వలన ఆజ్ఞాపించబడిరి. అలా చేయకపోవడం దేవుని ఏర్పాటుకే తిరుగుబాటు చేసేదైయుండి దేవునితోగల ఒకని సంబంధాన్ని బలహీనపరచగలదు. అపొస్తలుడైన పేతురు మాటలు ఇలా స్పష్టంగా ఉన్నవి: “అటువలెనే పురుషులారా (భర్తలారా NW), జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) ఒకడు తన భార్యతో కఠినంగా వ్యవహరించడమనేది ఆమె ఆత్మీయతపైన, పిల్లల ఆత్మీయతపైన వినాశకర ప్రభావాన్ని చూపగలదు.

10. భర్తలు క్రీస్తువలె తమ శిరసత్వమును ప్రయోగించగల కొన్ని మార్గాలేవి?

10 భర్తలారా, మీరు మీ శిరసత్వాన్ని క్రీస్తువలె నిర్వహిస్తే, మీ కుటుంబము దానిక్రింద వర్థిల్లగలదు. క్రీస్తు ఎప్పుడూ కఠినంగా ప్రవర్తించలేదు. చెడుగా బాధించలేదు. అందుకు భిన్నంగా ఆయన ఇలా అనగలిగాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి.” (మత్తయి 11:29) మిమ్మునుగూర్చియు మీ కుటుంబము అలానే చెప్పగలదా? క్రీస్తు తన శిష్యులను స్నేహితులవలె చూచి, వారియందు నమ్మికయుంచెను. (యోహాను 15:15) నీవు నీ భార్యకు అదే ఘనతనిస్తావా? బైబిలు “గుణవతియైన (సామర్ధ్యముగల NW) భార్య”ను గూర్చి చెప్పినది. “ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును.” (సామెతలు 31:10, 11) అనగా సహేతుకముకాని ఆంక్షలతో నిర్భందించ కుండా ఆమెకు కొంత స్వేచ్ఛా స్వాతంత్ర్యమునిచ్చుట ఇందులో ఇమడివున్నది. అంతేగాక యేసు వారి భావాలను, వారి అభిప్రాయాలను వ్యక్తపరచేలా ప్రోత్సహించాడు. (మత్తయి 9:28; 16:13-15) మీరును మీ భార్యయెడల అలాగే ప్రవర్తిస్తారా? యథార్థంగా ఒక విషయంలో అనంగీకారము తెల్పితే దానిని నీ అధికారాన్ని సవాలుచేస్తున్నట్లు దృష్టిస్తావా? నిర్లక్ష్యంచేయకుండా, నీ భార్య భావాలను పరిగణలోకి తీసుకొనుటను బట్టి, నిజముగా నీ శిరసత్వముయెడల ఆమెలో గౌరవాన్ని పెంపొందించెదవు.

11. (ఎ) తండ్రులు తమ పిల్లల ఆత్మీయ అవసరతల యెడల ఎట్లు శ్రద్ధ తీసుకొనవచ్చును? (బి) పెద్దలు, పరిచారకులు తమ కుటుంబాలనుగూర్చి శ్రద్ధవహించుటలో ఎందుకు మాదిరి నుంచాలి?

11 మీరు తండ్రేయైతే మీపిల్లల ఆత్మీయ, భావోద్రేక, భౌతిక అవసరతలను తీర్చవలసిన బాధ్యత మీపై ఉన్నది. దానికొరకు మీకుటుంబానికి ఒక మంచి ఆత్మీయ క్రమము అవసరము. ప్రాంతీయ సేవలో వారితో పనిచేయుట, గృహబైబిలు పఠనమును నిర్వహించుట, దినవచనమును చర్చించుట వాటిలో భాగము. ఆసక్తిదాయకంగా, ఒక పెద్ద లేక పరిచారకుడు “తన యింటివారిని బాగుగా ఏలువాడైయుండవలెనని” బైబిలు చూపుతుంది. ఈ స్థానాలలో పనిచేసే పెద్దలు కుటుంబ శిరస్సులుగా మంచి మాదిరి చూపేవారై ఉండాలి. సంఘము యొక్క భారమైన బాధ్యతలను మోస్తూనే, వారు తమ కుటుంబములకు ప్రాధాన్యతనివ్వవలెను. పౌలు ఇది ఎందు కవసరమో చూపియున్నాడు: “ఎవడైనను, తన యింటివారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?”—1 తిమోతి 3:4, 5, 12.

మద్దతునిచ్చే క్రైస్తవ భార్యలు

12. క్రైస్తవ ఏర్పాటులో భార్య పాత్ర ఏమిటి?

12 నీవు ఒక క్రైస్తవ భార్యవా? అట్లయితే నీవు కూడా కుటుంబ ఏర్పాటులో ఒక ప్రముఖ పాత్రను నిర్వహించవలసియున్నావు. క్రైస్తవ భార్యలు “తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని” ఉద్భోధించబడిరి. (తీతు 2:4, 5) కాబట్టి నీవు నీ కుటుంబము కొరకు గృహమును పరిశుభ్రంగా మనోహరంగా ఉంచుతూ ఒక మాదిరికరమైన గృహిణిగా ఉండుటకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఇంటిపని అలసటగా ఉండవచ్చేమోగాని అది అగౌరవమైనది, నీచమైనది మాత్రము కాదు. భార్యగా “గృహ పరిపాలన”లో ఆమె కొంత స్వాతంత్ర్యమును కలిగియుండవచ్చును. (1 తిమోతి 5:14) ఉదాహరణకు “గుణవతియైన భార్య (సామర్థ్యముగల భార్య, NW)” ఇంటికి కావలసినవాటిని కొంటూ, గృహ నిర్మాణ సంబంధిత వ్యాపార విషయమును చూస్తూ, చివరకు చిన్నచిన్న వర్తకముచేస్తూ, కుటుంబ ఆదాయమునకు కూడా తోడ్పడుతుంది. తన భర్తచేత ఆమె పొగడబడెననుటలో ఆశ్చర్యము లేదు! (సామెతలు 31వ అధ్యాయము) సహజంగా, ఆమె తనస్వంతగా ముందుకెళ్లి చేసే అలాంటి పనులన్ని శిరస్సుగా తన భర్త యిచ్చిన మార్గనిర్దేశకాల పరిధిలోనే ఉండెను.

13. (ఎ) కొంతమంది స్త్రీలకు లోబడియుండటం ఎందుకు కష్టం కావచ్చు? (బి) క్రైస్తవ స్త్రీలు తమ భర్తలకు లోబడియుండుట ఎందుకు ప్రయోజనకరము కాగలదు?

13 ఏమైననూ నీవు నీ భర్తకు లోబడి ఉండుట ఎప్పుడూ అంత సులభంగా ఉండకపోవచ్చు. మగవారంతా గౌరవపాత్రులు కారు. డబ్బును వ్యయపరచుట, పథకం వేయుట, సరిగా క్రమబద్ధం చేయుటలో మీరు మంచి సమర్థులు కావచ్చు. ఉద్యోగంచేస్తూ, కుటుంబ ఆదాయానికి మీరు బాగా తోడ్పడుచుండవచ్చును. లేక ఒకప్పుడు పురుషాధిపత్యము క్రింద ఏదోరీతిలో బాధననుభవించి ఇప్పుడు పురుషునికి లోబడాలంటే మీకు కష్టంగా ఉండవచ్చు. అయినను, భర్తకు “ప్రగాఢమైన గౌరవము చూపుట,” లేక “భయపడుట” దేవుని శిరసత్వానికి మీరు చూపే గౌరవాన్ని ప్రదర్శిస్తుంది. (ఎఫెసీయులు 5:33, కింగ్‌డం ఇంటర్లీనియర్‌; 1 కొరింథీయులు 11:3) లోబడియుండుటనేది కూడా మీ కుటుంబ విజయానికి కీలకమైనదే; అది మీ వివాహమును అనవసరమైన వత్తిడులకు, వేదనలకు గురికాకుండా చేస్తుంది.

14. తన భర్త చేసిన తీర్మానము ఆమెకు అంగీకృతము కానప్పుడు భార్య ఏమిచేయవచ్చును?

14 అంటే, మీ కుటుంబ శ్రేయస్సుకు హానికరంగా పరిణమించే తీర్మానాన్ని మీ భర్త చేస్తున్నప్పుడును మీరు మౌనంగా ఉండాలని దీని భావమా? అలా వుండనవసరం లేదు. తన కుమారుడైన ఇస్సాకు క్షేమానికి హాని వాటిల్లబోతుందని గ్రహించినప్పుడు అబ్రాహాము భార్యయైన శారా మౌనంగా ఉండలేదు. (ఆదికాండము 21:8-10) ఆలాగే, కొన్నిసార్లు మీ భావాలను వ్యక్తపరచవలసిన కర్తవ్యం మీపైనున్నట్లు మీరు భావించ వచ్చును. దీనిని మర్యాదపూర్వకమైన ధోరణిలో వ్యక్తపరచినప్పుడు, దైవభక్తిగల క్రైస్తవ పురుషుడు దానిని ‘సమయానుకూలంగా’ వింటాడు. (సామెతలు 25:11) మీ సలహాను అనుసరించకుండా ఉండి, తద్వారా గంభీరమైన బైబిలు సూత్రమును ఉల్లంఘించేదేమిలేనప్పుడు నీ భర్త అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లటం స్వయంగా కలతను సృష్టించుకొనడమే గాదా? గుర్తుంచుకొనండి, “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును.” (సామెతలు 14:1) నీ భర్త శిరసత్వానికి మద్ధతునిస్తూ పొరపాట్లకు కలత చెందకుండా వాటిని మౌనంగా సవరించుకొంటూపోతూ ఆయన సాధించిన మంచివాటిని పొగడుతూవుంటే ఒక రకంగా నీ యిల్లు కట్టుకొనుటై యుంటుంది.

15. తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టుటలోను, వారికి తర్ఫీదునిచ్చుటలోను ఏ యే విధాలుగా భార్య వంతు కలిగియుండవచ్చును?

15 నీ యిల్లు కట్టుకొనే మరొకమార్గమేమనగా నీ పిల్లలను క్రమశిక్షణలో పెడుతూ వారికి తర్ఫీదునిచ్చుట. ఉదాహరణకు కుటుంబ బైబిలు పఠనము క్రమముగా సాగుతూ అది నిర్మాణాత్మకంగా ఉండేందుకు నీవంతు నీవు చేయవచ్చును. ప్రయాణించునప్పుడేగాని లేక వస్తువులు కొనే సమయంలోనేగాని—ప్రతి సమయములో దేవుని సత్యాలను మీ పిల్లలతో చెప్పేవిషయంలో “నీ చెయ్యి వెనుక తియ్య”వద్దు. (ప్రసంగి 11:6) కూటములలో వ్యాఖ్యానించుటకు, దైవపరిపాలన పరిచర్యపాఠశాల భాగాలను సిద్ధపడుటకు వారికి సహాయమందించండి. వారి సహావాసాలను కనిపెట్టి చూడండి. (1 కొరింథీయులు 15:33) దేవుని ప్రామాణికాలు, క్రమశిక్షణా విషయాలలో నీది, నీ భర్తది ఒకేమాటన్నట్లు మీ పిల్లలకు తెలియనివ్వండి. వాళ్లనుకున్నదాన్ని సాధించుటకు నీకు నీభర్తకు మధ్య విభేదము పెట్టుటకు వారిని అనుమతించవద్దు.

16. (ఎ) అవిశ్వాసులతో వివాహమైనవారికి, ఒంటరియైన తల్లి లేక తండ్రికి బైబిలులోగల ఏ ఉదాహరణ ప్రోత్సాహకరంగా ఉండగలదు? (బి) అలాంటివారికి సంఘములోని ఇతరులెట్లు సహాయకరంగా ఉండగలరు?

16 నీవు ఒంటరివైన తల్లి లేక తండ్రివైయుంటే లేక నీ జత అవిశ్వాసియైయుంటే, ఆత్మీయంగా నీవే నాయకత్వం వహించుట సరైనదైవుంటుంది. కొన్నిసార్లు అది కష్టమైనదిగా నిరుత్సాహకరమైనదిగా ఉండవచ్చు. అయినా ప్రయాసపడుటకు మానుకోవద్దు. తిమోతి తల్లియైన యునీకే అవిశ్వాసియైనవానికి భార్యగా ఉన్నను, “బాల్యమునుండే” తిమోతికి పరిశుద్ధ లేఖనములను బోధించుటలో విజయము సాధించినది. (2 తిమోతి 1:5; 3:15) మన మధ్యలో కూడా అనేకులు అలాగే విజయం సాధిస్తున్నారు. ఈ విషయాలలో మీకేదైన సహాయమవసరమైతే మీ అవసరతలను పెద్దలకు తెలుపవచ్చును. మీరు కూటములకు, ప్రాంతీయ సేవకు వచ్చేందుకు సహాయమందించే లాగున ఎవరినైనా వారు ఏర్పాటు చేయవచ్చును. వినోదము కొరకు అలా బయటకు వెళ్లునప్పుడు లేక కూడుకొనునప్పుడు వారితో పాటు మీ కుటుంబమును కూడా కలుపుకొమ్మని ఇతరులను వారు ప్రోత్సహించవచ్చును. లేక మీ కుటుంబ బైబిలు పఠనము ప్రారంభమగుటకు సహాయపడేందుకు ఒక అనుభవముగలిగిన ప్రచారకుని వారు ఏర్పాటు చేయవచ్చును.

మెప్పుగల పిల్లలు

17. (ఎ) కుటుంబ సంక్షేమం కొరకు యౌవనులెట్లు దోహదపడగలరు? (బి) ఈ విషయంలో యేసు ఏ మాదిరిని ఉంచెను?

17 ఎఫెసీయులు 6:1-3లో గల ఉపదేశమును అనుసరించుటద్వారా క్రైస్తవ యౌవనులు కుటుంబ క్షేమముకొరకు దోహదపడవచ్చును. అదేమనగా: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. ‘నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు.’” మీ తలిదండ్రులతో సహకరించుటద్వారా యెహోవా యెడల మీకు గల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. యేసుక్రీస్తు పరిపూర్ణుడైయుండెను గనుక అసంపూర్ణులైన మానవులకు లోబడియుండుట తనకు అవమానకరమని ఆయన తర్కించియుండేవాడే. అయినను, “ఆయన . . . వారికి లోబడియుండెను. . . . యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థిల్లుచుండెను.”—లూకా 2:51, 52.

18, 19. (ఎ) ఒకని తల్లిదండ్రులను సన్మానించడం అంటే అర్థమేమిటి? (బి) ఆ గృహము ఎట్లు ఒక సేదతీర్చే స్థలంగా మారగలదు?

18 మరి మీరును మీ తల్లిదండ్రులను అలాగే సన్మానించవద్దా? ఇచ్చట “సన్మానము” అనేదానికి మనపై ఉన్న అధికారమును సరిగా గుర్తించుట అని దాని అర్థము. (1 పేతురు 2:17ను పోల్చుము) ఒకరి తల్లిదండ్రులు అవిశ్వాసులైనను, లేక మంచిమాదిరిగా లేకపోయినను అట్టి సన్మానము అనేక సందర్భాలలో యుక్తమైనది. మీ తల్లిదండ్రులిచ్చే క్రమశిక్షణ, నడిపింపు మిమ్ములను అనవసరంగా నిర్భంధించుటకు కాదని జ్ఞాపకముంచుకోండి. బదులుగా, “నీవు సదాకాలము బ్రతుకునట్లు” వారు నిన్ను కాపాడవలసియున్నారు.—సామెతలు 7:1, 2 NW.

19 కావున కుటుంబమనేది ఎంత ప్రేమగల ఏర్పాటు! భార్యాభర్తలు, పిల్లలు అందరు కుటుంబ జీవితముకై దేవుడిచ్చు కట్టడలను అనుసరించినప్పుడు గృహము ఒక ఆశ్రయస్థానంగా, సేదతీర్చుకొనే విశ్రాంతి స్థలంగా మారగలదు. అయినను పరస్పర సంభాషణ, పిల్లల తర్ఫీదు మొదలగు విషయాలలో సమస్యలుత్పన్నము కాగలవు. వీటిలో కొన్ని సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో మా తదుపరి శీర్షిక చర్చిస్తుంది.

మీకు జ్ఞాపకమున్నవా?

◻ బైబిలు కాలములలో దైవభయముగల భార్యా భర్తలు, మరియు పిల్లలు ఏ మాదిరి ఉంచారు?

◻ క్రైస్తవ భర్తయొక్క పాత్రపై క్రైస్తవత్వము ఏ సమాచారము నందించినది?

◻ క్రైస్తవ కుటుంబములో భార్య నిర్వహించే పాత్ర ఏమిటి?

◻ క్రైస్తవ యౌవనులు కుటుంబ సంక్షేమము కొరకు ఎట్లు దోహదపడవచ్చును?

[9వ పేజీలోని చిత్రం]

“ఆ కాలమునాటి క్షీణించిపోతున్న నైతికతకు పోలిస్తే, వివాహము యెడల క్రైస్తవ దృక్పథమంత నూతనమైనది అంత కచ్చితమైనది మరొకటిలేదు. . . [అది] మానవజాతికి ఒక క్రొత్త యుగాన్ని ప్రారంభించినది.”

[10వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ భర్తలు తమ భార్యల భావాలను పరిగణలోనికి తీసుకుని తమ భావాలను వ్యక్తపరచుటకు వారిని ప్రోత్సహిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి