ఇష్టపూర్వకముగా దేవుని మందను కాయుడి
“బలిమిచేతకాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దాని కాయుడి.”—1 పేతురు 5:2.
1. క్రైస్తవ సంఘపెద్దలు “దేవుని మందను ఇష్టపూర్వకంగా” కాయుదురని మనమెందుకు నిరీక్షించెదము?
యెహోవా తన ప్రజలను ఇష్టపూర్వకంగా కాయుచున్నాడు. (కీర్తన 23:1-4) “మంచికాపరియైన” యేసుక్రీస్తు, గొర్రెలాంటి ప్రజల నిమిత్తం తన పరిపూర్ణ మానవజీవితాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. (యోహాను 10:11-15) అందుకే, అపొస్తుల పేతురు ‘ఇష్టపూర్వకంగా మందను కాయుడని’ క్రైస్తవ సంఘపెద్దలకు ఉద్బోధించాడు.—1 పేతురు 5:2.
2. క్రైస్తవ సంఘపెద్దలు చేసే కాపుదల కార్యాలకు సంబంధించి పరిశీలించుటకు యోగ్యమైన ప్రశ్నలేవి?
2 ఇష్టత అనేది దేవుని సేవకుల గుర్తింపు. (కీర్తన 110:3) అధ్యక్షునిగా లేదా సహకాపరిగా నియమించబడాలంటే ఒకడు క్రైస్తవునిగాచూపే ఇష్టత కంటే ఎక్కువ అవసరమైయుంది. అటువంటి కాపరులుగా అర్హత పొందగలవారెవరు? వారి కాపుదలలో ఏమి యిమిడివుంది? దాన్నెలా శ్రేష్టమైన పద్ధతిలో నెరవేర్చవచ్చును?
ఇంటివారిని బాగుగా ఏలవలెను
3. ఒక క్రైస్తవుడు తన యింటిని ఏవిధంగా పోషిస్తున్నాడనేది, ఆవ్యక్తి సంఘంలో కాపరిగానుండుటకు అర్హుడా అనేదానిపై ప్రభావం కల్గివుందని ఎందుకు చెప్పవచ్చును?
3 ఒక వ్యక్తి “అధ్యక్షుడుగా” నియమించబడక మునుపు, అతడు లేఖనార్హతలను కల్గినవాడై యుండాలి. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) ఒక విషయం గమనించండి, అపొస్తుల పౌలు చెప్పినదేమంటే, ఒక అధ్యక్షుడు “తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.” ఇందుకు మంచి కారణం వుంది, ఎందుకంటే, పౌలు యిలా చెప్పాడు: “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?” (1 తిమోతి 3:4, 5) క్రేతు ద్వీపంలోని సంఘాలలో పెద్దలను నియమించునపుడు, “ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నెపము పెట్టబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాని” కొరకువెదకవలెనని తీతు ఉపదేశింపబడ్డాడు. (తీతు 1:6) ఔను, ఒక క్రైస్తవ పురుషుడు సంఘమును కాయుట అనే బరువైన బాధ్యత స్వీకరించడానికి అర్హుడాయని నిర్ధారించుటకు, ఏమార్గంలో తన కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడో అనేదాన్నికూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
4. క్రమమైన బైబిలు పఠనం, ప్రార్థనతోపాటు, మరేవిధంగా క్రైస్తవ తలిదండ్రులు తమ కుటుంబంయెడల ప్రేమను కనబరుస్తారు?
4 తన యింటిని బాగుగా ఏలువారైన పురుషులు వారి కుటుంబాలతో కలసి ప్రార్థించడం, క్రమంగా బైబిలును పఠించడం కంటే ఎక్కువే చేస్తారు. వారు వారికి ప్రియమైన వ్యక్తులకు సహాయపడుటలో ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తలిదండ్రులైన వారికి, పిల్ల జన్మించినప్పుడే ఇది మొదలవుతుంది. దైవీకమైన రోజువారీ కార్యకలాపాలకు ఎంత సన్నిహితంగా హత్తుకొని ఉంటే, అంత తొందరగా వారి పిల్లలు ప్రతిదిన జీవితంలోని క్రైస్తవ కార్యకలాపాల నిర్ధిష్టపట్టికకు యోగ్యులుకాగలరని క్రైస్తవ తలిదండ్రులకు తెలుసు. ఈ పరిస్థితులలో క్రైస్తవ తండ్రి నడిపించేపద్ధతి, సంఘపెద్దగా తన అర్హతలలో ప్రతిబింబిస్తుంది.—ఎఫెసీయులు 5:15, 16; ఫిలిప్పీయులు 3:16.
5. ఒక క్రైస్తవ తండ్రి ఏవిధంగా తన పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచగలడు?
5 మనస్సాక్షికి లోబడిన ఒక క్రైస్తవ తండ్రి, యింటిని ఏలుటలో పౌలు సలహాను వింటాడు: “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) భార్యాపిల్లలతో కలిపి కుటుంబంతో చేసే క్రమబైబిలు పఠనం, ప్రేమపూర్వక ఉపదేశాన్నిచ్చుటకు మంచి తరుణములనిస్తుంది. ఆవిధంగా పిల్లలు “క్రమశిక్షణను,” గద్దింపుతో కూడిన ఉపదేశాన్ని పొందుతారు. ఆ సమయంలో జరిగే మానసిక “బోధన,” ప్రతీపిల్లవాడు యెహోవా దృక్కోణాన్ని తెలుసుకొనుటకు సహాయపడుతుంది. (ద్వితీయోపదేశకాండము 4:9; 6:6, 7; సామెతలు 3:11; 22:6) స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణమున్న యీ ఆత్మీయ కూడికలో, తన పిల్లలు చెప్తుండగా తండ్రి శ్రద్ధగా వింటాడు. వారి అభిరుచులు, అభిప్రాయాలను యధేచ్చగా వెలిబుచ్చునట్లు ప్రేమగల ప్రశ్నలనుపయోగిస్తాడు. ఆ చిన్నారి మనస్సులలోని ఆలోచనలన్నీ తనకు తెలుసని తండ్రి ఊహించడు. నిజంగా, “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును” అని సామెతలు 18:13 చెబుతుంది. వారి పిల్లలు ఎదుర్కొనే పరిస్థితులు తాము యౌవనులుగా నున్నప్పుడు స్వయంగా అనుభవించిన వాటికన్నా ఎంతో భిన్నంగా ఉన్నాయని యీనాడు చాలామంది తలిదండ్రులు గమనిస్తున్నారు. దీనిఫలితంగా, ఒక తండ్రి ఒక సమస్యను ఏవిధంగా సరిచేయాలనే దానికంటేముందు దానికి సంబంధించిన గతవిషయాలను, వివరాలను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు.—యాకోబు 1:19 పోల్చండి.
6. తన కుటుంబానికి సహాయమందించునపుడు ఒక క్రైస్తవ తండ్రి ఎందుకు దేవుని వాక్యాన్ని సంప్రదించాలి?
6 పిల్లల సమస్యలు, అవసరాలు, భావాలు తెలుసుకున్న తర్వాత ఏంచేయాలి? బాగుగా ఏలువాడైన తండ్రి “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైన” లేఖనాలను సంప్రదిస్తాడు. బైబిలుయొక్క ప్రేరేపిత నియమాలను అన్వయించుకునే పద్ధతిని పిల్లలకు బోధిస్తాడు. ఈవిధంగా, లేతవయస్కులు “సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి” ఉంటారు.—2 తిమోతి 3:16, 17; కీర్తన 78:1-4.
7. ప్రార్థన విషయంలో క్రైస్తవ తండ్రులు ఏ మాదిరినుంచాలి?
7 దైవభక్తిగల యౌవనులు యిహలోక సహావిద్యార్ధుల మూలంగా కష్టపరిస్థితుల నెదుర్కొనెదరు. మరి క్రైస్తవ తండ్రులు వారి పిల్లల భయాలనెలా తొలగించగలరు? ఒక మార్గమేదనగా క్రమంగా వారితోకలసి, వారికొరకు ప్రార్థించడమే. ఈ యౌవనులు శ్రమతోకూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, వారి తలిదండ్రులు దేవునిపై ఆధారపడినట్లే, వారును అలాగే ఆధారపడతారు. ఒక 13 సంవత్సరాల బాలికను బాప్తిస్మం తీసుకునేముందు ఇంటర్వ్యూ చేయగా, ఆమెను తన తోటివిద్యార్థులు వెక్కిరించి, తిట్టారని చెప్పింది. రక్తము పవిత్రమైనదని బైబిలుపై ఆధారపడిన తన విశ్వాసాన్ని గురించి వాదించినపుడు, ఇతర బాలికలు ఆ అమ్మాయిని కొట్టి తనపై ఉమ్మివేశారు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆమె తిరిగి ప్రతీకారం తీర్చుకుందా? లేదు. “నేను నిశ్శబ్దంగా ఉండేలా సహాయపడుమని యెహోవాకు ప్రార్థించాను. కీడును సహించువారంగా ఉండవలసిన అవసరతను గూర్చి మా కుటుంబ పఠనంలో నా తలిదండ్రులు నాకు నేర్పించినది కూడా నేను జ్ఞాపకము తెచ్చుకున్నాను” అని ఆమె వివరించింది.—2 తిమోతి 2:24.
8. పిల్లలులేని ఒక సంఘపెద్ద ఎలా తన యింటిని బాగుగా ఏలగలడు?
8 పిల్లలులేని ఒక సంఘపెద్ద తన కుటుంబమంతటికిని సరియైన ఆత్మీయ, భౌతిక సదుపాయాలు చేయవచ్చును. అంటే దీనిలో తన వివాహపుజత, బహుశా అతనిపై ఆధారపడి తన యింటిలోనే జీవిస్తున్న యితర క్రైస్తవ బంధువులు యిమిడియున్నారు. (1 తిమోతి 5:8) కాబట్టి ఒక సంఘపెద్దగా బాధ్యత వహించుటకు నియమింపబడిన పురుషునకు ఉండవలసిన లక్షణాలలో ఒకటి కుటుంబాన్ని సరిగా పాలించుటయే. అయితే, నియమింపబడిన పెద్దలు వారి ఆధిక్యతతో కూడిన బాధ్యతలను ఎలా దృష్టించాలి?
“చిత్తశుద్ధితో” కాయుడి
9. క్రైస్తవ సంఘపెద్దలు వారికివ్వబడ్డ సేవాపనులయెడల ఏదృక్పథాన్ని కల్గియుండాలి?
9 సామాన్య శకము మొదటి శతాబ్దంలో, క్రీస్తు అధికారం క్రిందనున్న దేవుని గృహమైన క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు గృహనిర్వాహకుడుగా సేవచేశాడు. (ఎఫెసీయులు 3:2, 7; 4:15) అందుకే, పౌలు రోములోని తన తోటివిశ్వాసులకు ఈవిధంగా ఉపదేశించాడు: “మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.”—రోమీయులు 12:6-8.
10. దేవుని మందను కాయుటలో, ఈనాటి సంఘపెద్దలకు పౌలు ఏ మాదిరినుంచాడు?
10 పౌలు థెస్సలొనీకయులకు మరలా ఇలా జ్ఞాపకం చేశాడు: “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివాని హెచ్చరించుచు, ధైర్యము తెలుపుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.” (1 థెస్సలొనీకయులు 1:1; 2:11, 12) ప్రేమపూర్వకంగా, మృదువైన పద్ధతిలో ఉద్బోధించాడు గనుకనే, పౌలు ఇలా వ్రాయగల్గాడు: “అయితే స్తన్యమిచ్చు తల్లి తన స్వంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులై యుంటిరి గనుక మీయందు విశేషాపేక్షగలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:7, 8) పౌలు చూపిన తండ్రిలాంటి ఉదాహరణకు అనుగుణ్యంగా, యథార్ధవంతులైన పెద్దలు సంఘంలోని అందరి యెడల గాఢమైన శ్రద్ధకల్గియుంటారు.
11. నియమింపబడ్డ సంఘపెద్దలు సిద్ధమనస్సును ఎలా కనుపర్చగలరు?
11 నమ్మకమైన మన క్రైస్తవ కాపరుల కాపుదలయందు, సిద్ధమనస్సుతోపాటు, కనికరంతోకూడిన ప్రేమపూర్వక లక్షణాలుండాలి. వారు వ్యవహరించే విధానం వీటినిగూర్చి తెల్పుతుంది. “బలిమిచేతకాక,” లేదా “దుర్లాభాపేక్షతో” కాకుండా దేవుని మందను కాయుడని పేతురు సంఘపెద్దలకు హెచ్చరిస్తున్నాడు. (1 పేతురు 5:2) ఈ విషయాన్ని గూర్చి విలియమ్ బార్‌క్లే అనే విద్వాంసుడు ఇలా హెచ్చరిస్తున్నాడు: “అధికారపదవిని స్వీకరించినప్పుడు, సేవ చేయునప్పుడు దానిని ఒక అప్రియమైందిగాను కఠోరమైందిగాను, అలసటతోకూడినదిగాను, అవమానపరచే భారంగాను భావించవచ్చును. ఒక మనిషిని ఏదైనా పని చేయమని అడగటానికి, అతడు చేయడానికి సులభమే, కాని అతడు దానిని నిర్దయతో చేసినట్లయితే పనిమొత్తం పాడవుతుంది. . . . అయితే [పేతురు] చెప్పేదేమంటే, క్రైస్తవుడు సేవ చేయుటకు యోగ్యుడుకాదని తాను పూర్తిగా ఎరిగినప్పటికి, ప్రతివాడు తనకు సాధ్యమైనంతమట్టుకు గడగడ వణకుచు అట్టి సేవను చేయాలి.”
ఇష్టపూర్వకమైన కాపరులు
12. క్రైస్తవ సంఘపెద్దలు యేవిధంగా ఇష్టతను ప్రదర్శించగలరు?
12 “ఇష్టపూర్వకంగా . . . మీ మధ్యనున్న దేవుని మందను కాయుడని” పేతురు కూడా పురికొల్పుచున్నాడు. గొర్రెలను కాయు క్రైస్తవ అధ్యక్షుడు ఆలాగునే మంచికాపరియైన యేసుక్రీస్తు ఆదేశంక్రింద, మనస్పూర్తిగా ఇష్టపూర్వకంగా సేవ చేస్తాడు. ఇష్టపూర్వకంగా సేవచేయడమంటే మన ‘ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన’ యెహోవా అధికారానికి క్రైస్తవ కాపరి లోబడటమనికూడా దాని భావమైయుంది. (1 పేతురు 2:25) ఒక క్రైస్తవ ఉపకాపరి దైవీక ఏర్పాట్లకు ఇష్టపూర్వకంగా గౌరవాన్ని ప్రదర్శిస్తాడు. సలహా నిమిత్తం దేవునివాక్యం తట్టుతిరిగేవారికి నడిపింపునిచ్చేటప్పుడు అతడు ఆవిధంగా చేస్తాడు. ఒక సంఘపెద్ద బైబిలు ఆధారిత సలహానంతటిని కూడబెట్టుటకు తన అనుభవం అతనికి సహాయపడినప్పటికి, ప్రతిసమస్యకు లేఖన పరిష్కారం తక్షణమే తనకు లభిస్తుందని దీనిభావంకాదు. ఆయనకు ఒక ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికి, ప్రశ్నించే వ్యక్తితోపాటుకలసి వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇండెక్స్ లేదా తత్సమాన ఇండెక్స్‌లను సంప్రదించుట వివేకమైనది. ఆవిధంగా అతడు రెండు విధాలుగా బోధిస్తాడు: సహాయకరమగు సమాచారాన్ని ఏవిధంగా కనుగొనాలో ఆయన చూపిస్తాడు మరియు దేవుని సంస్థ ప్రచురించిన వాటిపై అవధానాన్ని మళ్లించడంద్వారా నమ్రతతో గౌరవాన్ని చూపెడతాడు.
13. సంఘపెద్దలు మంచి సలహానిచ్చుటకు సహాయపడే ఏ చర్యలను తీసుకొనవచ్చును?
13 ప్రస్తుతం ఎదురైన ప్రత్యేక సమస్యకు సంబంధించి సొసైటి సాహిత్యాలలో ప్రచురించకపోయినట్లైతే ఒక సంఘపెద్ద ఏమి చేయగలడు? అతడు నిశ్చయంగా, జ్ఞానంకొరకు ప్రార్థన చేస్తాడు, ఆ విషయానికి అనువర్తించే కొన్ని బైబిలు నియమాల కొరకుకూడా అన్వేషిస్తాడు. ఆయన సహాయంకోరే వ్యక్తికి యేసు ఉదాహరణను పరిశీలించుమని సలహానివ్వడం కూడా ప్రయోజనకరమని అనుకుంటాడు. సంఘపెద్ద ఈవిధంగా అడుగవచ్చును: “ఒకవేళ గొప్ప బోధకుడైన యేసు, మీ పరిస్థితిలో ఉంటే, ఆయన ఏమి చేస్తాడని మీరనుకుంటారు?” (1 కొరింథీయులు 2:16) అలాంటి యోచన, ప్రశ్నించే వ్యక్తి వివేకమైన నిర్ణయం చేయడానికి సహాయపడగలదు. కాని, ఒక సంఘపెద్ద తన స్వంత వట్టి అభిప్రాయాన్ని లేఖనానుసారమైన సలహా అన్నట్టుగానే అందించడం ఎంత అవివేకమో కదా! అలాకాకుండా, సంఘపెద్దలు కష్టమైన సమస్యలను ఒకరితో నొకరు చర్చించవచ్చును. వారు సంఘపెద్దల కూటమిలో చర్చించుటకుకూడా ప్రాముఖ్యమైన విషయాలను అందజేయవచ్చును. (సామెతలు 11:14) అందుమూలంగా వెలువడే నిర్ణయాలు వారందరూ ఏకగ్రీవంగా మాట్లాడటానికి సహకరిస్తాయి.—1 కొరింథీయులు 1:10.
సాత్వికం అవశ్యం
14, 15. ఒక క్రైస్తవుడు ‘ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల’ అతనిని సరిదిద్దునపుడు సంఘపెద్దలకు ఏది అవసరము?
14 ఒక క్రైస్తవ సంఘపెద్ద ఇతరులకు బోధించునపుడు, ప్రాముఖ్యంగా సలహానిచ్చునపుడు సాత్వికమును ప్రదర్శించవలసిన అవసరతవుంది. పౌలు యిలా సలహానిస్తున్నాడు: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి [సరిదిద్ది] తీసికొని రావలెను.” (గలతీయులు 6:1) “సరిదిద్దుట” అని యిక్కడ అనువదించబడిన గ్రీకుపదం జీవితకాలమంతా అంగవైకల్యంతో నుండకుండ కాపాడుటకు ఎముకను సరిచేయు శస్త్రచికిత్సలో ఉపయోగించే పదమునకు సంబంధంకల్గివుందనుట ఆసక్తి కల్గిస్తుంది. నిఘంటురచయిత డబ్ల్యు. ఇ. వైన్ దీనిని, “ఆత్మీయ శరీరంలో స్థానంభ్రంశంచెందిన, పాపం చేసిన వ్యక్తి, ఆత్మీయవ్యక్తుల ద్వారా తిరిగి సరిచేయబడు క్రియతో” పోల్చాడు. “సరియైన స్థానానికి తిరిగితెచ్చుట; సరియైన రీతిగా అమర్చుట” అనేవి దీనికి సమానమైన భాషాంతరాలు.
15 ఒకని స్వంత ఆలోచనలను సరిదిద్దడమనేది సులభమైందికాదు, మరి తప్పుచేసిన వ్యక్తి భావాలను సరియైన అమరికకు తీసుకు రావడమనేది మరింత కష్టం కావచ్చు. సాత్వికముతో అందించిన సహాయం సామాన్యంగా కృతజ్ఞతతో స్వీకరించబడుతుంది. గనుక, క్రైస్తవ సంఘపెద్దలు పౌలు సలహాను లక్ష్యపెట్టాలి: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:12) సరిదిద్ద వలసివచ్చిన వ్యక్తి చెడు భావాలను కల్గివున్నట్లయితే సంఘపెద్దలు ఏం చేయాలి? వారు “సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాస” పడవలెను.—1 తిమోతి 6:11.
జాగృతతో కాయుట
16, 17. ఇతరులకు సలహానిచ్చునపుడు, సంఘపెద్దలు ఏ అపాయముల నుండి కాపాడుకోవలసి యున్నారు?
16 పౌలు గలతీయులు 6:1 లో యిచ్చిన సలహాకు అర్థం చాలావుంది. ఆయన ఆత్మీయంగా సిద్ధులైన పురుషులను యిలా పురికొల్పుతున్నాడు: “ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో [తప్పిదస్థుని] మంచిదారికి తీసికొని రావలెను.” (ఇటాలిక్కులు మావి.) ఇటువంటి సలహాను అలక్ష్యంచేస్తే ఎలాంటి గంభీర పరిణామాలు రాగలవో కదా! ఆంగ్లికన్ మతాధికారులు వారి సంఘపరిధిలోనున్న యిద్దరితో వ్యభిచార పాపంతో పట్టుబడ్డ నివేదనలనుగూర్చి తెల్పుతూ, లండన్‌లోని ది టైమ్స్ పత్రిక, “దీనికి ఒక సమయమంటూ లేదు: సలహాలను పొందేవారంతా సలహాదారుని నమ్ముతారు కాబట్టే ఆయన పాపానికి లొంగిపోతున్నాడు” అని చెప్పింది.తరువాత పత్రికా రచయిత్రి, “రోగులు, వారి మగసలహాదారులైన వైద్యులు, న్యాయవాదులు, మతగురువులు, ఉద్యోగుల మధ్యనున్న దోపిడీ వ్యవహారాలు, లైంగికతకు అవకాశమిచ్చే మన సమాజంలో, గుర్తించని నష్టాన్నికల్గించే అపకీర్తితోకూడిన అంటురోగంలా తయారయ్యాయని” డాక్టర్ పీటర్ రటర్ చేసిన వాదనను గూర్చి వ్యాఖ్యానించింది.
17 యెహోవా ప్రజలు అటువంటి శోధనలకు లోబడరని మనం ఊహించకూడదు. సంవత్సరాల తరబడి నమ్మకంగా సేవచేసిన ఒక సంఘపెద్ద అవినీతిలో పడ్డాడు, ఎందుకంటే ఆయన ఒక వివాహిత సహోదరిని ఒంటరిగానున్న సమయంలో కాపరి సందర్శనాలు చేసేవాడు. పశ్చాత్తాపపడినప్పటికి, ఈ సహోదరుడు తన సేవా ఆధిక్యతలన్నింటిని కోల్పోయాడు. (1 కొరింథీయులు 10:12) అయితే నియమింపబడిన పెద్దలు వారు శోధనలో పడకుండా ఎలా కాపరి సందర్శనాలు చేయగలరు? ప్రార్థించుటకు, దేవునివాక్యాన్ని, క్రైస్తవ ప్రచురణలను సంప్రదించుటకు, సరియైన ఏకాంతత కొరకు ఎలా ఏర్పాటుచేసికొనగలరు?
18. (ఎ) శిరస్సత్వ నియమమును అన్వయించుకొనడం వలన, సంఘపెద్దలు అవమానకర పరిస్థితులను ఎలా విసర్జించగలరు? (బి) ఒక సహోదరిని ప్రోత్సహించుటకు చేయు సందర్శనానికి యేవిధమైన ఏర్పాట్లు చేయవచ్చును?
18 శిరస్సత్వ నియమమనేది సంఘపెద్దలు పరిగణనలోకి తీసుకోవలసిన ఒక అంశమైయుంది. (1 కొరింథీయులు 11:3) ఒక యౌవనుడు నడిపింపును కోరినట్లయితే, తగినసమయంలో అతని తలిదండ్రులు కూడ చర్చజరుగునపుడు అక్కడ ఉండునట్లు ప్రయత్నించండి. ఒక వివాహిత సహోదరి ఆత్మీయ సహాయం కోరినపుడు, దర్శించే సమయంలో ఆమె భర్తకూడా అక్కడవుండేటట్లు ఏర్పాటుచేయగలరా? ఒకవేళ యిది అసాధ్యమైతే లేదా ఆయన ఆమెను ఏదోవిధంగా వేధించే అవిశ్వాసియైతే అప్పుడేం చేయాలి? అప్పుడు, అవివాహిత సహోదరిని ప్రోత్సహించుటకు వెళ్లునప్పుడు చేసే ఏర్పాట్లనే చేయండి. ఆత్మీయార్హతగల్గిన యిద్దరు సహోదరులు కలసి ఆమెను దర్శించడం వివేకమైనదై యుంటుంది. ఇదికూడ వీలుకాకపోతే, యిద్దరు సహోదరులు కలసి ఒకవేళ రాజ్యమందిరంలోనే ఏకాంతతకు అనుకూలించే ఒక గదిని ఎన్నుకొని, సరియైన సమయంలో ఆమెతో చర్చించవచ్చును. హాలులోనున్న ఇతర సహోదర సహోదరీలు ఈ చర్చను చూచి, దూరంనుండి వినేటట్లు ఉండకూడదు, తొట్రిల్లే ఏవిధమైన ఆటంకమైననూ ఉండరాదు.—ఫిలిప్పీయులు 1:9, 10.
19. దేవుని మందను ఇష్టపూర్వకంగా కాయుటయనేది ఎటువంటి మంచి ఫలితాలను తెస్తుంది, అలాంటి ఇష్టపూర్వక కాపరులను దయచేసినందుకు మనమెవరికి మన కృతజ్ఞతలు చెల్లించాలి?
19 దేవుని మందను ఇష్టపూర్వకంగా కాయుటవలన మంచి ఫలితాలు వస్తాయి, అనగా ఒక మంచి నడిపింపు పొందిన, ఆత్మీయ బలంగల మంద తయారౌతుంది. అపొస్తలుడైన పౌలు వలెనే, ప్రస్తుతకాల క్రైస్తవ సంఘపెద్దలు తోటివిశ్వాసుల యెడల ఎంతో శ్రద్ధగల్గియున్నారు. (2 కొరింథీయులు 11:28) ప్రాముఖ్యంగా ఈ అపాయకరమైన కాలంలో దేవుని మందను కాయుట చాలా బరువైన బాధ్యతయైయుంది. కాబట్టి, సంఘపెద్దలుగా సేవచేస్తున్న మన సహోదరుల శ్రేష్ఠమైనపనికి నిజంగా, మనమెంతో కృతజ్ఞులమైయున్నాము. (1 తిమోతి 5:17) ఇష్టపూర్వకంగా మందను కాయుచూ “ఈవులను పొందిన మనుష్యులతో” మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి, “శ్రేష్టమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” దయచేస్తున్న, మన ప్రేమపూర్వక పరలోక కాపరియగు యెహోవాకు మనం స్తుతులు చెల్లిస్తాము.—ఎఫెసీయులు 4:8; యాకోబు 1:17. (w93 5/15)
మీరెలా సమాధానమిస్తారు?
▫ ఒక పురుషుడు యేవిధంగా తన యింటిని బాగుగా ఏలగలడు?
▫ క్రైస్తవ సంఘపెద్దల కాపుదలయందు ఏ లక్షణాలు కల్గియుండాలి?
▫ సలహానిచ్చునపుడు సంఘపెద్దలు సాత్వికము, వినయమును ఎలా వ్యక్తపరచవచ్చును?
▫ ఆత్మీయంగా సరిదిద్దుటయనేది ఫలవంతంగా ఉండటానికి ఏది సహకరిస్తుంది?
▫ మందను ప్రోత్సహించుటలో సంఘపెద్దలు అవమానకర పరిస్థితులను ఎలా విసర్జించగలరు?
[బాక్సు]
క్రైస్తవ సంఘపెద్ద తన యింటిని బాగుగా ఏలువాడై యుండవలెను
[బాక్సు]
క్రైస్తవ కాపుదల సందర్శన సాత్వికము, మంచి వివేకముతో జరుగవలెను