బైబిలు ఉద్దేశము
పిల్లలు తమ మతాన్ని తామే ఎంచుకోవాలా?
పిల్లవాడు పుట్టినది మొదలుకొని యుక్త వయస్సుకు వచ్చే వరకూ తలిదండ్రులే వాని కొరకు ఎంపికలను చేస్తారు. అదే సమయంలో, సాధ్యమైనప్పుడెల్లా పిల్లవాని ఇష్టాన్ని పరిగణిస్తూ పట్టువిడుపుగలవారిగా ఎప్పుడుండాలో తెలివైన తలిదండ్రులకు తెలుసు.
అయినప్పటికీ, ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యాన్ని పిల్లవానికి ఎంత మేరకు ఇవ్వాలన్న విషయం తలిదండ్రుల ముందు ఒక సవాలుగా ఉండవచ్చు. పిల్లలు సరైన ఎంపిక చేసుకుని, కొంత మేరకు స్వాతంత్ర్యం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం పొందవచ్చన్నది నిజమే అయినప్పటికీ, వారు తప్పుడు ఎంపికలు చేసుకోగలరన్నది, అది విషాదకరమైన సంఘటనకు దారితీయగలదన్నది కూడా నిజమే.—2 రాజులు 2:23-25; ఎఫెసీయులు 6:1-3.
ఉదాహరణకు, పిల్లలు తరచూ పోషకాహారాని కన్నా చిరుతిండినే కోరుకుంటారు. ఎందుకని? ఎందుకంటే వారు చిన్న వయస్సులో ఉన్నప్పుడు తమకు తాముగా సరైన నిర్ణయాన్ని చేసుకునే స్థితిలో ఉండరు. తమ పిల్లలు చివరికి పోషకాహారాన్ని ఎంచుకుంటారులే అని ఆశిస్తూ తలిదండ్రులు ఈ విషయంలో వారిని యథేచ్చగా వదిలేయడం తెలివైన పనిగా ఉంటుందా? లేదు. బదులుగా, తలిదండ్రులు తమ పిల్లల దీర్ఘకాలిక క్షేమాన్ని మనస్సులో ఉంచుకుని వారి కొరకు తప్పకుండా తామే ఎంపికలు చేయాలి.
కనుక, ఆహార విషయాల్లో, వస్త్రాల విషయాల్లో, అలంకరణ విషయాల్లో, నైతిక విషయాల్లో తలిదండ్రులే తమ పిల్లల కొరకు నిర్ణయం తీసుకోవాలి. అయితే మతం విషయం ఏమిటి? ఆ ఎంపికను కూడా తలిదండ్రులే చేయాలా?
ఎంపిక
తలిదండ్రులు తమ మత సంబంధ నమ్మకాలను తమ పిల్లలపై రుద్దకూడదని కొందరు వాదిస్తారు. నిజానికి, “ఏదో ఒక ప్రత్యేక మతంవైపుకు తమ పిల్లల మనస్సు ఒగ్గుతుందేమోనన్న భయంతో పిల్లలకు మతాన్ని బోధించకూడదు. వారు ఎంపిక చేసుకోగలిగేంతవరకు, వారు ఒక మతాన్ని ఎంపిక చేసుకునే వయస్సు వచ్చే వరకు వారినలా వదిలిపెట్టాలి” అన్న తలంపును 160 సంవత్సరాల క్రితం, క్రైస్తవులని చెప్పుకున్న కొందరు పెంపొందించారు.
అయినప్పటికీ, ఈ తలంపు బైబిలు దృక్కోణంతో సరిపోలడం లేదు. పిల్లలు పుట్టినప్పటి నుండే వారి మనస్సుల్లో మత సంబంధ విశ్వాసాలను నాటవలసిన ప్రాముఖ్యతను బైబిలు నొక్కిచెబుతుంది. సామెతలు 22:6 ఇలా చెబుతుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”
“బాలుడు” అని అనువదించబడిన హెబ్రీ పదంలో శైశవం మొదలుకొని, యుక్తవయస్సు వరకున్న ప్రాయం ఇమిడి ఉంది. చిన్న వయస్సులోనే నేర్చుకోవలసిన ప్రాముఖ్యతను గూర్చి అమెరికాలోని ఇలినోయిస్ విశ్వవిద్యాలయంలోని డా. జోసఫ్ ఎమ్. హన్ట్ ఇలా చెప్పారు: “జీవితంలోని మొదటి నాలుగైదేండ్ల వయస్సులోనే పిల్లవాని పురోభివృద్ధి అతి వేగంగా ఉంటుంది. మార్పులు చాలా వస్తాయి. . . . బహుశా [వాని] 20 శాతం సామర్థ్యాలు వాని మొదటి జన్మదిన వార్షికానికన్నా ముందే అభివృద్ధి చెంది ఉంటాయి, బహుశా వానికి నాలుగేండ్లు నిండక ముందే వాని సగం సామర్థ్యాలు అభివృద్ధి చెంది ఉంటాయి.” తలిదండ్రులు తమ పిల్లవాని జీవితంలోని తొలి దశలోనే వానికి వివేకయుక్తమైన నడిపింపును ఇవ్వడం, దేవుని మార్గాల్లో తమ పిల్లవానికి తర్ఫీదునివ్వడం చాలా ప్రాముఖ్యమన్న బైబిలులోని ప్రేరేపిత ఉపదేశాన్ని ఇది కేవలం నొక్కి చెబుతుందంతే.—ద్వితీయోపదేశకాండము 11:18-21.
మరి ముఖ్యంగా, తమ పిల్లల్లో యెహోవా ఎడల ప్రేమని అలవర్చాలని దైవభయంగల తలిదండ్రులకు లేఖనాలు నిర్దేశమిస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము 6:5-7 ఇలా చెబుతుంది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” ‘అభ్యసింపజేయవలెను’ అని అనువదించబడిన హెబ్రీ పదం సాన మీద అన్నట్లుగా ఒక ఉపకరణాన్ని పదునుచేయడం అనే భావాన్ని ఇస్తుంది. ఏదో కొన్నిసార్లు రుద్దడం వల్ల ఇది సాధ్యం కాదు. చాలా శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ “మళ్ళీ చేయడం” అనే క్రియా పదాన్ని అనువదిస్తుంది. సరళంగా చెబితే, ‘అభ్యసింపజేయడం’ అన్నది, చెరగని ముద్రను వేయడాన్ని సూచిస్తుంది.—సామెతలు 27:17 పోల్చండి.
కనుక, నిజక్రైస్తవ తలిదండ్రులు తమ మత విశ్వాసాలను తమ పిల్లల మనస్సుల్లో నాటే బాధ్యతను గంభీరంగా తీసుకుని తీరవలసిందే. తమ పిల్లలు తమకై తాము ఎన్నుకునేందుకు అనుమతిస్తూ, తమ బాధ్యతనుండి న్యాయబద్ధంగా విరమించలేరు. ఇందులో తమ ‘పిల్లలను’ కూటాలకు తీసుకువెళ్ళడం కూడా ఇమిడి ఉంటుంది. అక్కడ తలిదండ్రులు తమ పిల్లల ప్రక్కనే కూర్చుని లేఖనాధార చర్చలకు శ్రద్ధనివ్వడం ద్వారా, వాటిలో పాల్గొనడం ద్వారా ఐక్య కుటుంబం పొందగల ఆత్మీయ ప్రయోజనాన్ని గుణగ్రహించేందుకు వారికి సహాయపడగలరు.—ద్వితీయోపదేశకాండము 31:12, 13; యెషయా 48:17-19; 2 తిమోతి 1:5; 3:14.
తలిదండ్రుల బాధ్యత
ఇది పోషకాహారం కనుక దీనినే భుజించాలి అని చెప్పినంత మాత్రాన పిల్లవాడు దానిని తిని ఆనందించాలని లేదు. కనుక, ఈ అత్యవసర ఆహార పదార్థాలను పిల్లవాని అభిరుచికి తగినట్లు సాధ్యమైనంత మేరకు ఆకలి కలిగించేదిగా ఉండేలా వండడం తెలివైన తల్లికి తెలుసు. తప్పకుండా, పిల్లవాని జీర్ణ శక్తికి తగ్గట్లుగా ఆమె ఆహారం తయారు చేస్తుంది.
అలాగే, పిల్లవాడు మొదట్లో మత ఉపదేశాన్ని నిరాకరించవచ్చు, ఒక తల్లి/తండ్రి పిల్లవానితో ఆ విషయాన్ని గూర్చి తర్కించడానికి ప్రయత్నించడం వృథాయేనని కనుగొనవచ్చు. అయితే, బైబిలులో ఉన్న నిర్దేశం చాలా స్పష్టంగా ఉంది—తలిదండ్రులు తమ పిల్లలకు శైశవం నుండే తర్ఫీదునిచ్చేందుకు తమ శాయశక్తులా కృషి చెయ్యాలి. కనుక, పిల్లవాడు గ్రహించగల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, పిల్లవానికి ఆసక్తికరమైనదిగా ఉండేలా వివరిస్తూ మత ఉపదేశం పిల్లవాని మనస్సుకు ఇంపైన విధంగా ఉండేలా తెలివైన తలిదండ్రులు చేస్తారు.
ప్రేమగల తలిదండ్రులు తమ పిల్లల జీవితావసరాలను తీర్చే బాధ్యతను నిర్వర్తించడంలో జాగ్రత్త వహిస్తారు. చాలా వరకు, పిల్లవాని అవసరాలు ఏమిటో తలిదండ్రులకు కాక మరెవరికీ అంతగా తెలియదు. దీనికి అనుగుణ్యంగా, బైబిలు పిల్లల భౌతిక, అలాగే, ఆత్మీయ అవసరతలను తీర్చే బాధ్యతను తలిదండ్రుల భుజస్కందాలపైనే—ముఖ్యంగా తండ్రి భుజస్కందాలపైనే ఉంచుతుంది. (ఎఫెసీయులు 6:4) కనుక తలిదండ్రులు తమ బాధ్యతను ఇతరులపై పెట్టేందుకు ప్రయత్నిస్తూ తమ కర్తవ్యాన్ని తప్పించుకోకూడదు. తమకు అందివ్వబడిన సహాయం నుండి వారు ప్రయోజనం పొందినప్పటికీ, అది అదనపు సహాయమే అవుతుందే గానీ, తలిదండ్రుల నుండి లభించే మత సంబంధ విద్యాభ్యాసానికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు.—1 తిమోతి 5:8.
ప్రతి ఒక్కరూ తాము ఏదైనా ఒక మతాన్ని అవలంబించాలని అనుకుంటున్నట్లయితే, ఏ మత నమ్మకాలను అవలంబించాలన్న నిర్ణయాన్ని జీవితంలో ఏదో ఒక సమయాన తీసుకుంటారు. క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలకు శైశవ దశ నుండే మత ఉపదేశాన్ని ఇచ్చేందుకు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లయితే, సరైన సూత్రాల ఆధారంగా ఆలోచించేందుకు వారికి ఉపదేశించేందుకు వారు ఈ సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే, పిల్లలు తమ జీవితంలో తర్వాత చేసే ఎంపిక చాలా మటుకు సరైనదే అయ్యుంటుంది.—2 దినవృత్తాంతములు 34:1, 2; సామెతలు 2:1-9.
[14వ పేజీలోని చిత్రం]
The Doré Bible Illustrations/Dover Publications, Inc.