కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/1 పేజీలు 21-26
  • యెహోవాయందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాయందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాపంచిక జ్ఞానమందు నమ్మకాన్ని విడనాడండి
  • సందేహించే ప్రవృత్తితో పోరాడండి
  • వివాహం విషయంలో యెహోవా నడిపింపును అనుసరించడం
  • యౌవనులారా—దేవుని వాక్యాన్ని వినండి
  • యౌవనులారా—మీరు వెంబడించేదేమిటి?
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • సత్యాన్ని మీ సొంతం చేసుకున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సందేహాలు మీ విశ్వాసాన్ని నశింపజేయనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/1 పేజీలు 21-26

యెహోవాయందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచండి

“నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”—కీర్తన 9:10.

1. మన ఆధునిక కాలంలో మనమింకా యెహోవాయందు ఆయన వాక్యమందు ఎందుకు నమ్మకం ఉంచగలం?

ఈ ఆధునిక ప్రపంచంలో దేవునియందు, ఆయన వాక్యమైన బైబిలునందు నమ్మకం ఉంచండనే ఆహ్వానం అనాచరణీయమైనదిగానూ అవాస్తవికమైనదిగానూ కన్పించవచ్చు. కాని, దేవుని జ్ఞానం కాల పరీక్షకు తాళుకొని నిలబడింది. స్త్రీ పురుషులను సృజించినవాడే వివాహానికి కుటుంబానికి మూలకర్త, మరి వేరెవ్వరికన్నా మన అవసరతల గురించి ఆయనకే బాగా తెలుసు. మానవ ప్రాథమిక అవసరతలు మారనట్లే, ఆ అవసరతలను తీర్చుకొనే ప్రాథమిక విధానాలూ మారలేదు. శతాబ్దాల క్రితం వ్రాయబడినప్పటికీ బైబిలు యొక్క జ్ఞానయుక్తమైన సలహా, జీవిత విధానంలోనూ సమస్యల్ని పరిష్కరించుకోవడంలోనూ విజయం కొరకు మంచి నడిపింపును ఇప్పటికీ ఇస్తోంది. దానిని లక్ష్యపెట్టడమనేది, మనం జీవిస్తున్న ఈ విద్యావంతమైన వైజ్ఞానిక ప్రపంచంలో కూడా అత్యంత సంతోషానికి కారణమౌతుంది!

2. (ఎ) దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం యెహోవా ప్రజల జీవితాల్లో ఏ మంచి ఫలాల్ని ఫలింపజేసింది? (బి) ఆయనకు ఆయన వాక్యానికి విధేయత చూపించేవారి కొరకు యెహోవా అధికంగా దేనిని వాగ్దానం చేశాడు?

2 యెహోవాయందు నమ్మకం ఉంచడం మరియు బైబిలు సూత్రాల్ని అన్వయించుకోవడం, అనుదినమూ ఆచరణీయమైన ప్రయోజనాల్ని తీసుకొస్తాయి. దీనికి నిదర్శనం బైబిలు సలహాను అన్వయించుకొనే నిశ్చయత మరియు ధైర్యంగల, ప్రపంచవ్యాప్తంగానున్న లక్షలాది మంది యెహోవాసాక్షుల జీవితాల్లో కన్పిస్తుంది. సృష్టికర్తయందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచడం వారి విషయంలో సరియైనదేనని రుజువైంది. (కీర్తన 9:9, 10) పరిశుభ్రత, నిజాయితీ, కష్టించి పనిచేయడం, జీవాన్ని మరితరుల ఆస్తుల్ని గౌరవించడం మరియు తగుమాత్రంగా తినడం త్రాగడం వంటి విషయాలకు వచ్చేసరికి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడమనేది వారిని మంచి ప్రజలుగా చేసింది. అది కుటుంబ వలయంలో సరియైన ప్రేమ కల్గివుండేందుకు మరియు ఆతిథ్యమిచ్చేవారిగానూ సహనంగలవారిగానూ దయామయులుగానూ క్షమాగుణంగలవారిగానూ అలాగే అనేకమైన ఇతర విషయాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు నడిపించింది. కోపం, ద్వేషం, హత్య, ఈర్ష్య, భయం, సోమరితనం, గర్వం, అబద్ధాలాడడం, కొండెములు చెప్పడం, విచ్ఛలవిడితనం మరియు లైంగిక దుర్నీతి వంటి యొక్క చెడ్డ ఫలాల్ని వారు చాలా మేరకు విడనాడగల్గుతున్నారు. (కీర్తన 32:10) అయితే తన చట్టాల్ని అనుసరించే వారి కొరకు దేవుడు మంచి ప్రతిఫలాన్ని వాగ్దానం చేయడం కన్నా ఎక్కువే చేశాడు. క్రైస్తవ విధానాన్ని అనుసరించే వారు “ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా . . . తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును,” పొందుదురని యేసు తెలియజేశాడు.—మార్కు 10:29, 30.

ప్రాపంచిక జ్ఞానమందు నమ్మకాన్ని విడనాడండి

3. యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకం కల్గివుంటూండడంలో క్రైస్తవులు కొన్నిసార్లు ఎదుర్కోవల్సి వచ్చిన సమస్యలు ఏవి?

3 దేవుడు కోరుతున్న దాన్ని తక్కువ చేసే లేక మర్చిపోయే ప్రవృత్తికి లోనవ్వడమనే సమస్య అపరిపూర్ణ మానవులకు ఉంది. వారు తమకే బాగా తెలుసని లేక ఈ ప్రపంచ మేధావి వర్గం నుండి వచ్చిన జ్ఞానం దేవుని జ్ఞానం కన్నా ఉన్నతమైనదని మరింత అధునాతనమైనదని సులభంగా ఆలోచించనారంభిస్తారు. దేవుని సేవకులు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు గనుక వారు కూడా ఈ దృక్పథాన్ని పెంపొందించుకొనగలరు. కాబట్టి, మన పరలోకపు తండ్రి తన సలహాను వినమనే ప్రేమపూర్వకమైన ఆహ్వానమందు తగిన హెచ్చరికల్ని కూడా ఇలా చేర్చాడు: “నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము.”—సామెతలు 3:1, 2, 5-7.

4. ‘ప్రపంచ జ్ఞానం’ ఎంత విస్తృతంగా ఉంది, మరది “దేవుని దృష్టికి వెఱ్ఱితనం”గా ఎందుకుంది?

4 ఈ ప్రపంచ జ్ఞానం అధికంగానూ అనేక మూలాల నుండీ లభ్యమౌతుంది. అనేకమైన విద్యా సంస్థలు ఉన్నాయి మరియు “పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు.” (ప్రసంగి 12:12) ఇప్పుడు కంప్యూటర్‌ ప్రపంచం యొక్క సమాచార సూపర్‌హైవేగా పిలువబడుతున్నది, ఇంచుమించు ఏ అంశంపైనైనా అపరిమితమైన దత్తాంశాన్ని అందించేందుకు వాగ్దానం చేస్తోంది. కాని లభ్యమౌతున్న ఈ జ్ఞానమంతటినీ కల్గివుండడమనేది ఈ ప్రపంచాన్ని జ్ఞానవంతమైనదానిగా చేయదు లేక దాని సమస్యలను పరిష్కరించదు. బదులుగా, ప్రపంచ పరిస్థితి దిన దినానికి చెడిపోతుంది. “ఈ లోక జ్ఞానము [“ప్రపంచ జ్ఞానం,” NW] దేవుని దృష్టికి వెఱ్ఱితనమే,” అని బైబిలు మనకు చెబుతున్న దానిని మనం అర్థం చేసుకొనగలం.—1 కొరింథీయులు 3:19, 20.

5. ఈ ‘ప్రాపంచిక జ్ఞానానికి’ సంబంధించి బైబిలు ఏ హెచ్చరికలను ఇస్తోంది?

5 అంత్యదినాల యొక్క ఈ చివరి భాగంలో ప్రధాన మోసగాడును అపవాదియునైన సాతాను బైబిలు సత్యసంధతయందలి నమ్మకాన్ని తగ్గించివేసే ప్రయత్నంలో భాగంగా అబద్ధాల ప్రవాహాన్ని ప్రారంభిస్తాడు. బైబిలు వాస్తవికతను, విశ్వసనీయతను సవాలుచేసే అనేకమైన ఊహాకల్పిత పుస్తకాల్ని బైబిలు విమర్శకులు తయారు చేశారు. తనతోటి క్రైస్తవున్ని పౌలు ఇలా హెచ్చరించాడు: “ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి.” (1 తిమోతి 6:20, 21) బైబిలు ఇంకా ఇలా హెచ్చరిస్తోంది: “ఆయనను [క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.

సందేహించే ప్రవృత్తితో పోరాడండి

6. హృదయంలో సందేహాలు వేళ్లూనకుండా అరికట్టేందుకు మెలకువగా ఉండడం ఎందుకు అవసరం?

6 అపవాది యొక్క మరొక కుయుక్తి ఏమిటంటే మనస్సులో సందేహాల్ని నాటడం. విశ్వాసం విషయంలో కొంత బలహీనత ఉంటే గమనించి, దానిని ఉపయోగించుకోవాలని అతడు ఎప్పుడూ మెలకువగా ఉంటాడు. సందేహాలున్న వారెవరైనా అటువంటి సందేహాల వెనుక ఉన్నది హవ్వను మోసగించిన సాతానేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. అతడు హవ్వతో ఇలా అన్నాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” శోధకుడు ఆమె మనస్సులో సందేహాన్ని ఒక్కసారి నాటితే, ఇక తర్వాత చేయాల్సిందల్లా ఆమె నమ్మిన ఒక అబద్ధాన్ని ఆమెకు చెప్పడమే. (ఆదికాండము 3:1, 4, 5) సందేహం హవ్వ విశ్వాసాన్ని పాడుచేసినట్లుగానే మన విశ్వాసాన్ని పాడుచేయనివ్వకుండా ఉండడాన్కి మనం మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. యెహోవాను గూర్చి, ఆయన వాక్యాన్ని గూర్చి లేక ఆయన సంస్థను గూర్చి కొద్దిపాటి సందేహమేదైనా మీ హృదయంలో మెదలనారంభిస్తే, అది మీ విశ్వాసాన్ని పాడుచేయగల్గేంతగా పెరగక మునుపే దానిని తొలగించుకోవడానికి సత్వర చర్యలు తీసుకోండి.—1 కొరింథీయులు 10:12, పోల్చండి.

7. సందేహాల్ని నిర్మూలించుకోవడానికి ఏమి చేయవచ్చు?

7 చెయ్యగలిగేందేమిటి? మరలా యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకం ఉంచాలనేదే జవాబు. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్రతరంగమును పోలియుండును.” (యాకోబు 1:5, 6; 2 పేతురు 3:17, 18) కాబట్టి పట్టుదలతో యెహోవాకు ప్రార్థించడం మొదటి మెట్టు. (కీర్తన 62:8) అటుతర్వాత, సంఘంలోని ప్రేమపూర్వకమైన కాపరుల సలహాను అడగడానికి వెనుదీయకండి. (అపొస్తలుల కార్యములు 20:28; యాకోబు 5:14, 15; యూదా 22) బహుశా గర్వం లేక తప్పుగా ఆలోచించడం మూలంగా వచ్చిన మీ సందేహాల యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి వారు మీకు సహాయపడ్తారు.

8. భ్రష్టత్వ ఆలోచనా విధానమనేది తరుచూ ఎలా ఆరంభమౌతుంది మరి తరుణోపాయం ఏమిటి?

8 భ్రష్ట అభిప్రాయాల్ని లేక ప్రాపంచిక తత్వజ్ఞానాన్ని చదవడం లేక వినడం విషపూరితమైన సందేహాల్ని ప్రవేశపెట్టాయా? జ్ఞానయుక్తంగా బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును.” (2 తిమోతి 2:15-18) భ్రష్టత్వ బాధితులైన అనేకులు యెహోవా సంస్థలో తాము వ్యవహారించబడిన రీతిని గురించి తామెలా భావించామనే దానికి సంబంధించి మొదట ఫిర్యాదు చేయడం ద్వారా తప్పు దిశగా వెళ్లడం ఆరంభించారన్నది గమనించదగిన విషయం. (యూదా 16) నమ్మకాల్లో లోపాల్ని కనుగొనడం తరువాత వస్తుంది. కొరుకుపుండును తొలగించడానికి శస్త్ర చికిత్సా నిపుణుడు త్వరగా చర్యగైకొన్నట్లే, ఫిర్యాదు చేసే మరియు క్రైస్తవ సంఘంలో విషయాలు జరిగిన తీరుకి అసంతృప్తి చెందే ఏ ప్రవృత్తినైనా మనస్సులో నుండి పెరికి వేయడానికి త్వరగా చర్యగైకొనాలి. (కొలొస్సయులు 3:13, 14) అలాంటి సందేహాల్ని పోషించే దేన్నైనా తొలగించండి.—మార్కు 9:43.

9. మంచి దైవ పరిపాలనా క్రమం విశ్వాసమందు ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకెలా సహాయపడ్తుంది?

9 యెహోవాను ఆయన సంస్థను సన్నిహితంగా అంటిపెట్టుకోండి. తీర్మానపూర్వకంగా ఇలా తెలియజేసిన పేతురును యథార్థంగా అనుసరించండి: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.” (యోహాను 6:52, 60, 66-68) ‘దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పగలిగే’ పెద్ద డాలువలె మీ విశ్వాసాన్ని బలమైనదిగా ఉంచుకునేందుకు యెహోవా వాక్య పఠన కార్యక్రమ పట్టికను కల్గివుండండి. (ఎఫెసీయులు 6:16) ఇతరులతో రాజ్య వర్తమానాన్ని ప్రేమపూర్వకంగా పంచుకోవడం ద్వారా క్రైస్తవ పరిచర్యయందు చురుకుగా ఉండండి. యెహోవా మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాడనే దానిని గురించి అనుదినమూ ప్రశంసాపూర్వకంగా ధ్యానించండి. మీరు సత్యం యొక్క జ్ఞానాన్ని కల్గివున్నందుకు కృతజ్ఞులై ఉండండి. ఈ విషయాలన్నింటినీ మంచి క్రైస్తవ క్రమంలో చేయడమనేది మీరు సంతోషంగా ఉండేందుకు, సహించేందుకు మరియు సందేహాల నుండి స్వతంత్రులై ఉండడానికి మీకు తోడ్పడుతుంది.—కీర్తన 40:4; ఫిలిప్పీయులు 3:15, 16; హెబ్రీయులు 6:10-12.

వివాహం విషయంలో యెహోవా నడిపింపును అనుసరించడం

10. క్రైస్తవ వివాహంలో నడిపింపు కొరకు విశేషంగా యెహోవావైపు చూడడం ఎందుకు ప్రాముఖ్యం?

10 స్త్రీ పురుషులు, వివాహ దంపతులుగా కలిసి జీవించేందుకు ఏర్పాటు చేయడం ద్వారా, సరిపోయినంతమేరకు భూమిని నింపడం మాత్రమే గాక వారి సంతోషాన్ని పెంపొందింపజేయాలని కూడా యెహోవా ఉద్దేశించాడు. అయితే, పాపం మరియు అపరిపూర్ణత వివాహ సంబంధమందు గంభీరమైన సమస్యల్ని తీసుకొచ్చాయి. క్రైస్తవులు కూడా అపరిపూర్ణులు మరియు ఆధునిక దిన జీవిత ఒత్తిళ్లను అనుభవిస్తున్నారు గనుక వారు కూడా వీటినుండి మినహాయింపబడలేదు. అయినప్పటికీ, క్రైస్తవులు యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకం ఉంచినంత మేరకు వారు వివాహ జీవితంలో మరియు తమ పిల్లల్ని పెంచడంలో మంచి విజయాన్ని సాధించగలరు. ప్రాపంచిక ఆచారాలకు, ప్రవర్తనకు క్రైస్తవ వివాహ జీవితంలో తావులేదు. దేవుని వాక్యం మనకిలా ఉద్బోధిస్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.”—హెబ్రీయులు 13:4.

11. వివాహా సమస్యల్ని పరిష్కరించుకోవడంలో దంపతులు ఇరువురూ గుర్తించవలసినది ఏమిటి?

11 బైబిలు సలహా ప్రకారం కొనసాగే వివాహ జీవితంలో ప్రేమ కర్తవ్యం మరియు భద్రతలతో కూడిన వాతావరణం ఉంటుంది. భార్యా భర్తలు ఇరువురూ శిరస్సత్వ సూత్రాన్ని అవగాహన చేసుకుని గౌరవిస్తారు. కష్టాలు వచ్చాయంటే, తరచూ దానికి కారణం బైబిలు సలహాను అన్వయించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయడమే. కొనసాగుతున్న సమస్యను పరిష్కరించడంలో దంపతులు ఇరువురూ సమస్య నిజంగా ఏమైవుందనే దానిపై నిజాయితీగా కేంద్రీకరించడం, సమస్య లక్షణాలపై గాక కారణాలతో వ్యవహరించడం ప్రాముఖ్యం. ఇటీవల చేసిన చర్చలు కొంత అంగీకారానికైనా లేక అనంగీకారానికైనా దారి తీసినట్లైతే, దంపతులు ఓ ప్రేమపూర్వకమైన కాపరి నుండి నిష్పక్షపాతమైన సహాయాన్ని కోరవచ్చు.

12. (ఎ) వివాహ జీవితంలోని ఏ సాధారణ సమస్యలపై బైబిలు సలహాను ఇస్తోంది? (బి) వివాహ దంపతులు ఇరువురూ విషయాల్ని యెహోవా మార్గంలో మార్పుల్ని చేసుకోవాల్సిన అవసరత ఎందుకుంది?

12 పరస్పర సంభాషణ, ఒకరి భావాలకు మరొకరు గౌరవం చూపడం, శిరస్సత్వం ఎడల గౌరవం, లేక నిర్ణయాలెలా చేయబడ్డాయి అనే విషయాలు సమస్యలో చేరివున్నాయా? అది పిల్లల్ని పెంచడానికి సంబంధించినదా లేక లైంగికావసరాలకు సంబంధించి సమతుల్యంగా ఉండడానికి సంబంధించినదా? లేక అది కుటుంబ జమా లెక్కలకు, వినోదానికి, సహవాసానికి, భార్య ఉద్యోగం చెయ్యాలా వద్దా అనే దానికి లేక మీరు ఎక్కడ జీవించాలి అనే దానికి సంబంధించినదా? సమస్య ఏదైనప్పటికీ, బైబిలు ఆచరణీయమైన సలహాను చట్టాల ద్వారా సూటిగా గాని లేక సూత్రాల ద్వారా పరోక్షంగా గాని ఇస్తోంది. (మత్తయి 19:4, 5, 9; 1 కొరింథీయులు 7:1-40; ఎఫెసీయులు 5:21-23, 28-33; 6:1-4; కొలొస్సయులు 3:18-21; తీతు 2:4, 5; 1 పేతురు 3:1-7) దంపతులు ఇరువురూ స్వార్థపరమైన కోరికలు కోరకుండా, తమ వివాహ జీవితంలో ప్రేమను పూర్ణంగా వ్యక్తపర్చినప్పుడు గొప్ప సంతోషం కల్గుతుంది. విషయాల్ని యెహోవా మార్గంలో చేసేందుకు అవసరమైన మార్పుల్ని చేసుకోవాలనే ప్రగాఢమైన కోరికను వివాహ దంపతులు ఇరువురూ కల్గివుండాలి. “ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.”—సామెతలు 16:20.

యౌవనులారా—దేవుని వాక్యాన్ని వినండి

13. క్రైస్తవ యౌవనులు యెహోవాయందు ఆయన వాక్యమందు విశ్వాసంలో బలంగా ఎదగడం ఎందుకు సులభమైన విషయం కాదు?

13 దుష్ట ప్రపంచం తమ చుట్టూ ఉన్నప్పుడు విశ్వాసమందు బలంగా ఎదగడం క్రైస్తవ యౌవనులకు సులభమైన విషయంకాదు. ఒక కారణమేమిటంటే “లోకమంతయు దుష్టునియందు” అంటే అపవాదియగు సాతానుయందు ఉండడమే. (1 యోహాను 5:19) చెడును మంచిగా కన్పించేలా చేయగల ఈ దుష్టుడైన శత్రువు యౌవనులపై దాడి చేస్తున్నాడు. నేను ముందు అనే దృక్పథాలు, స్వార్థపరమైన కోరికలు, దుర్నీతి క్రూరత్వం వంటివాటి ఎడల తృష్ణ, సుఖాల కొరకైన అసహజమైన అన్వేషణ—ఇవన్నీ “అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి [“ఆత్మ,”NW]”గా బైబిలులో వర్ణించబడిన ఒక సాధారణమైన ప్రబలమైన ఆలోచనా విధానమందు చేరతాయి. (ఎఫెసీయులు 2:1-3) పాఠశాల పాఠ్య పుస్తకాల్లో, లభ్యమౌతున్న సంగీతమందలి ఎక్కువ భాగంలో, క్రీడల్లో మరితర రకాలైన వినోదాల్లో ఈ “ఆత్మ”ను సాతాను మోసపూరితంగా పెంపొందింపజేశాడు. యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకం ఉంచడంలో తమ పిల్లలు ఎదగడానికి సహాయం చేయడం ద్వారా అటువంటి ప్రభావాల్ని అరికట్టడానికి తలిదండ్రులు మెలకువగా ఉండాల్సిన అవసరముంది.

14. యౌవనులు ఎలా ‘యౌవనేచ్ఛల నుండి పారిపోగలరు’?

14 తన యౌవన సహవాసియైన తిమోతికి పౌలు తండ్రి ఇచ్చే ఉపదేశం వంటి దానిని ఇలా ఇచ్చాడు: “నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.” (2 తిమోతి 2:22) ‘యౌవనేచ్ఛలన్నీ’ వాటంతటవే చెడ్డవేమీ కాకపోయినప్పటికీ, దైవిక గమ్యాలను వెంబడించడానికి కేవలం కొంత సమయమే మిగిలేలా లేక సమయం లేకుండా వాటిలోనే పూర్తిగా నిమగ్నమై ఉండడాన్ని వారు అనుమతించకూడదు అనే భావంలో యౌవనులు వాటి నుండి ‘పారిపోవాలి.’ బాడీబిల్డింగ్‌, క్రీడలు, సంగీతం, వినోదం, హాబీలు మరియు ప్రయాణం అనేవి తప్పేమీ కాకపోయినా అవే జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలైతే అవి ఉరికాగలవు. లక్ష్యంలేని సంభాషణల నుండి, కాలవిలంబనం చేయడాన్నుండి, లైంగికత విషయంలో అస్వాభావికమైన ఆసక్తి నుండి, ఊరకనే కూర్చొని, విసుగ్గా ఉండడం నుండి మరియు మీ తలిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని ఫిర్యాదులు చేయడం నుండి పూర్తిగా పారిపొండి.

15. యౌవనులు ద్వంద జీవితం జీవించడానికి దోహదపడే ఏ విషయాలు ఇంటిలో ఒంటరిగా ఉండడంలో జరగవచ్చు?

15 ఇంట్లో ఒంటరిగా ఉండడంలో కూడా యౌవనులకు అపాయం పొంచివుండవచ్చు. దుర్నీతికరమైన లేక హింసాత్మకమైన దూరదర్శిని కార్యక్రమాలు మరియు వీడియోలను చూడడం, చెడ్డ పనులు చెయ్యాలనే కోరికను నాటగలవు. (యాకోబు 1:14, 15) బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.” (కీర్తన 97:10; 115:11) ఎవరైనా ద్వంద జీవితం జీవించడానికి ప్రయత్నిస్తే అది యెహోవాకు తెలుస్తుంది. (సామెతలు 15:3) క్రైస్తవ యౌవనులారా, మీ గది చుట్టూ పరికించండి. క్రీడా ప్రపంచం లేక సంగీత ప్రపంచంలోని దుర్నీతిపరులైన తారల యొక్క వాల్‌ పోస్టర్లను మీరు ప్రదర్శిస్తున్నారా లేక మంచి జ్ఞాపికలుగా ఉండే హితకరమైన వాటిని మీరు ప్రదర్శిస్తున్నారా? (కీర్తన 101:3) మీ అల్మారాలో, మీరు వినమ్రత దుస్తులను కల్గివున్నారా లేక మీ దుస్తుల్లో కొన్ని ఈ ప్రపంచపు విపరీతమైన దుస్తుల స్టయిళ్లను ప్రతిబింబిస్తున్నాయా? చెడ్డదానిని కొంచెం రుచిచూసే శోధనలో మీరు పడితే అపవాది, మోసపూరితమైన రీతుల్లో మీరు చిక్కుకొనేలా చేయగలడు. జ్ఞానయుక్తంగా బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.

16. తనకు ప్రాముఖ్యమైన ప్రతి ఒక్కరూ తననుబట్టి గర్వించేలా చేయడానికి ఓ యౌవనునికి బైబిలు సలహా ఎలా సహాయపడగలదు?

16 మీ సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండమని మీకు బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 15:33) మీ సహవాసులు యెహోవా ఎడల భయంగలవారై ఉండాలి. సహవాసుల ఒత్తిడికి లోనవ్వకండి. (కీర్తన 56:11; సామెతలు 29:25) దైవ భయంగల మీ తలిదండ్రులకు విధేయులై ఉండండి. (సామెతలు 6:20-22; ఎఫెసీయులు 6:1-3) నడిపింపు ప్రోత్సాహాల కొరకు పెద్దలవైపు చూడండి. (యెషయా 32:1, 2) మీ మనస్సును నేత్రాలనూ ఆత్మీయ విలువలు, గమ్యాలపై ఉంచండి. ఆత్మీయ పురోభివృద్ధి చేసుకొనే, సంఘ కార్యకలాపాల్లో భాగం వహించే అవకాశాల కొరకు చూడండి. మీ చేతులతో పనుల్ని ఎలా చేయాలో నేర్చుకోండి. విశ్వాసమందు బలంగానూ ఆరోగ్యకరంగానూ ఎదగండి, అప్పుడు మీరు నిజంగా ప్రముఖులని అంటే యెహోవా యొక్క నూతన ప్రపంచంలో జీవించే యోగ్యతగల ప్రముఖులని రుజువు చేసుకుంటారు! మన పరలోకపు తండ్రి మిమ్మల్నిబట్టి గర్విస్తాడు, మీ భూసంబంధమైన తలిదండ్రులు మీయందు సంతోషిస్తారు మరి మీ క్రైస్తవ సహోదర సహోదరీలు మీచే ప్రోత్సహించబడ్తారు. అదే ప్రాముఖ్యమైనది!—సామెతలు 4:1, 2, 7, 8.

17. యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకం ఉంచేవారికి ఏ ప్రయోజనాలు వస్తాయి?

17 కీర్తనల గ్రంథకర్త పద్యశైలిలో ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.” (కీర్తన 84:11, 12) అవును, యెహోవాయందు ఆయన వాక్యమైన బైబిలునందు నమ్మికయుంచు వారందరికీ ధన్యత సాఫల్యాలే లభిస్తాయిగాని నిరుత్సాహ వైఫల్యాలు కాదు.—2 తిమోతి 3:14, 16, 17.

మీరెలా జవాబిస్తారు?

◻ ఈ ‘ప్రాపంచిక జ్ఞానమందు’ క్రైస్తవులు తమ నమ్మకాన్ని ఎందుకు ఉంచకూడదు?

◻ ఒకనికి సందేహాలు వస్తే ఏమి చేయాల్సి ఉంటుంది?

◻ విషయాల్ని యెహోవా మార్గంలో చేయడం వివాహ జీవితంలో సాఫల్యాన్ని సంతోషాన్ని ఎలా తెస్తుంది?

◻ యౌవనులు ‘యౌవనేచ్ఛల నుండి పారిపోవడానికి’ బైబిలు ఎలా సహాయపడ్తుంది?

[23వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు ఈ ‘ప్రాపంచిక జ్ఞానాన్ని’ వెఱ్ఱి దానిగా నిరాకరిస్తూ యెహోవావైపు, ఆయన వాక్యంవైపు మరలుతారు

[25వ పేజీలోని చిత్రం]

యెహోవాయందు ఆయన వాక్యమందు నమ్మకముంచిన కుటుంబాలు మంచి సాఫల్యాన్ని సంతోషాన్ని పొందుతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి