తక్కువ స్వాతంత్ర్యం గల విశాలమైన మార్గం
ఆస్ట్రేలియానందలి సిడ్నీలోని ఒక ఇంటికి నిప్పంటుకున్నప్పుడు ముగ్గురు అంటే తండ్రి, తల్లి, చిన్న కుమార్తెగల ఒక కుటుంబం ఇంట్లో ఉంది. వాళ్లు కిటికీలలో నుండి దూకడానికి ప్రయత్నించారు కాని వాటికి కమ్మీలున్నాయి. భద్రతా కమ్మీల మూలంగా, అగ్నిమాపక దళంవారు వారిని కాపాడలేకపోయారు. తల్లి, తండ్రి పొగ మంటల్లో కాలిపోయారు. కుమార్తె ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది.
వారికి భద్రత కలుగజేసేందుకు ఏర్పాటు చేయబడినవాటి మూలంగానే ఈ కుటుంబం మరణించిందంటే ఎంత దుఃఖకరం! కమ్మీలు మరియు భద్రతా తాళాలతో సురక్షితం చేయబడిన ఇల్లు కేవలం ఈ కుటుంబానిది మాత్రమే కాదన్నది మన కాలంపై ఒక ఆక్షేపణగా ఉంది. పొరుగువారనేకులకు కూడా కోటలను పోలిన గృహాలు, ఆస్తులు ఉన్నాయి. ఎందుకు? వారు భద్రత, మనశ్శాంతి కావాలనుకుంటున్నారు. తమ స్వంత గృహాల్లోనే ఖైదీలవలె బంధించుకున్నప్పుడు మాత్రమే ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుంటే, “స్వతంత్ర” సమాజం పైన అది ఎంతటి చీడ! అనేక ఇరుగుపొరుగు ప్రాంతాల్లో, దగ్గరలో ఉన్న పార్కులో పిల్లలు క్షేమంగా ఆడుకోలేరు లేదా తల్లి లేక తండ్రి లేక మరెవరైనా పెద్దవాళ్లు తోడులేకుండా బడికి నడిచి వెళ్లలేరు. జీవితంలోని అనేక అంకాల్లో, స్వాతంత్ర్యమన్నది ఉదయకాల మంచులా కరిగిపోతోంది.
మారిన జీవన విధానం
మన తాతామామ్మల కాలం వేరుగా ఉండేది. పిల్లలుగా వారు సాధారణంగా ఏ భయం లేకుండా తమకు ఇష్టమైనచోట ఆడుకోగలిగేవారు. పెద్దవారిగా, వారికి తాళాలు, కమ్మీలతో గొడవ లేదు. వారు స్వతంత్రంగా ఉన్నట్లు భావించేవారు, కొంతమేరకు వారు స్వతంత్రంగా ఉండేవారు. కాని తమ జీవితకాలంలో సమాజపు దృక్పథం మారడాన్ని మన తాతామామ్మలు చూశారు. అది భావరహితంగా, మరింత స్వార్థపూరితంగా తయారైంది; అనేక ప్రాంతాల్లో పొరుగువారి ఎడల ప్రేమకున్న స్థానాన్ని పొరుగువారి భయం ఆక్రమించింది, అది పైన చెప్పిన దుఃఖకరమైన సంఘటనకు దారితీసింది. స్వాతంత్ర్య లేమి పెరిగిపోవడంతోపాటు నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. సమాజం “క్రొత్త నైతికత”ను ఆశించింది, కాని వాస్తవానికి పరిస్థితి ఇప్పుడు అసలు నైతికతే లేని స్థితికి దిగజారిపోయింది.
క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయ మాజీ విద్యా అధ్యాపకుడైన డా. రూపెర్ట్ గుడ్‌మాన్ ఇలా వ్రాస్తున్నాడు: “యౌవనస్థులు ఇప్పుడు భిన్నమైన, ఆనందవాదాన్ని . . . అనుసరిస్తున్నారు అది ‘స్వయం’ అన్నది కేంద్రమైన జీవనవిధానం: స్వయం లాలసత్వం, స్వయం పరిచితత్వం, స్వయం నెరవేర్పు, స్వార్థపరత్వం.” ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఆశానిగ్రహం, స్వయంత్యాగం, కష్టించి పనిచేయడం, పొదుపు, అధికారం ఎడల గౌరవం, తల్లిదండ్రుల ఎడల ప్రేమ మరియు గౌరవం వంటి విలువలు . . . అనేకులకు అపరిచిత విషయాలు.”
వాస్తవంగా ఒక విశాలమైన మార్గం
బైబిలు ప్రవచనాలు తెలిసినవారు ఈ విస్తృతమైన స్వార్థపరత్వాన్ని బట్టి ఆశ్చర్యపోరు, ఎందుకంటే యేసుక్రీస్తు తన శ్రోతలను ఇలా హెచ్చరించాడు: “నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి [“మార్గం,” NW] విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13, 14) అనేకమంది ప్రయాణికులకు సరిపోయేంత స్థలం ఉన్న మొదటి మార్గం “విశాలము” అయినది ఎందుకంటే బైబిలు సూత్రాలచే నడిపించబడే నైతికత మరియు అనుదిన జీవనంతో అది నిర్బంధం చేయబడలేదు. ఏ సూత్రాలు, ఏ బాధ్యతలు లేకుండా తమకిష్టమైనట్లు తలంచి, తమకిష్టమైనట్లు జీవించాలని కోరుకునే వారిని అది ఆకర్షిస్తుంది.
నిజమే, విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్న అనేకులు తాము స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని చెబుతారు. కాని వారిలో అనేకులు స్వార్థమనే సాధారణ దృక్పథంచే పురికొల్పబడుతున్నారు. “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి” చేత వారు నడిపించబడుతున్నారని బైబిలు చెబుతుంది. లైంగిక దుర్నీతి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, లేక ధనం, పేరుప్రతిష్ఠలు, లేదా అధికారం కొరకు కనికరం లేకుండా ప్రయాసపడడం వంటివేవైనా సరే ‘శరీరము యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరాన్ని అనుసరించి’ జీవించడానికి ఈ శక్తి వారిని పురికొల్పుతుంది.—ఎఫెసీయులు 2:2, 3.
విశాలమైన మార్గం నాశనానికి నడిపిస్తుంది
విశాలమైన మార్గాన ప్రయాణించేవారు ‘శరీరము యొక్క కోరికలను’ తీర్చుకోవడానికి నడిపించబడతారని గమనించండి. వారు ఎంతమాత్రం స్వతంత్రంగా లేరని ఇది చూపిస్తుంది, వారికి ఒక యజమాని ఉన్నాడు. వారు శరీరానికి దాసులు. ఈ యజమానికి సేవ చేయడం అనేక సమస్యలకు దారితీయగలదు: లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తి, విచ్ఛిన్నమైపోయిన గృహాలు, మాదకద్రవ్యం మరియు మద్యం యొక్క దుర్వినియోగం వల్ల కృశించిపోయిన శరీరాలు, మనస్సులు ఇవన్నీ పేర్కొనడానికి కేవలం కొన్ని మాత్రమే. దౌర్జన్య కార్యాలు, దోపిడి, అత్యాచారం వంటివాటికి మూలం కూడా ఈ స్వేచ్ఛాయుత విశాలమైన మార్గాన పోషించబడే స్వార్థపూరిత ఆలోచనా విధానమే. మరియు, “నాశనమునకు పోవు మార్గం” ఉనికిలో ఉన్నంతవరకు, దాని ఫలాలు మరింత హానికరమైనవవుతూనే ఉంటాయి.—సామెతలు 1:22, 23; గలతీయులు 5:19-21; 6:7.
ఆస్ట్రేలియాలోని రెండు నిజ జీవిత ఉదాహరణలను పరిశీలించండి. వ్యసనపూరిత మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేస్తూ అలాగే లైంగిక దుర్నీతినవలంబిస్తూ మేరి శోధనకు లొంగిపోయింది.a కాని ఆమె కోరుకున్న సంతోషం ఆమెకు దొరకలేదు. ఇద్దరు పిల్లలు కలిగాక కూడా ఆమె జీవితం శూన్యంగా ఉన్నట్లనిపించేది. తనకు ఎయిడ్స్ సోకిందని తెలుసుకోవడంతో ఆమె మరీ కృంగిపోయింది.
టామ్ మరో విధంగా దెబ్బ తిన్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “నేను ఉత్తర క్వీన్స్‌లాండ్‌నందు ఒక చర్చి కాంపౌండ్‌లో పెరిగాను. పదహారేళ్ల వయస్సులో నేను విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాను. మా నాన్న, మామయ్యలు, స్నేహితులు అందరూ త్రాగుబోతులే, కాబట్టి అది చేయదగిన సహజమైన పనిలా అనిపించింది. బీరు మొదలుకొని మిథలేటడ్ స్పిరిట్ వరకు ఏదైనా త్రాగే స్థితికి నేను దిగజారాను. కొన్నిసార్లు, కష్టపడి సంపాదించిన ఎంతో డబ్బు పోగొట్టుకుంటూ, నేను గుర్రము పందాలు కూడా ఆడడం మొదలుపెట్టాను. ఇది ఏమంత తక్కువ మొత్తం కాదు, ఎందుకంటే చెరుకుగడలు కోసే నా పనికి వేతనం బాగానే లభించేది.
“ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నాను, మాకు పిల్లలు కలిగారు. నేను నా బాధ్యతలను చేపట్టే బదులు, నా స్నేహితులు చేసిందే నేను చేశాను—త్రాగడం, జూదమాడడం, కొట్లాడడం. నేను తరచూ స్థానిక జైలులో వేయబడేవాణ్ణి. కాని ఇది నాపై ఏ ప్రభావాన్ని చూపేదికాదు. నా జీవితం దిగజారిపోయింది. అది పూర్తిగా సమస్యలతో నిండివుంది.”
అవును, తప్పుడు కోరికలకు లొంగిపోవడం ద్వారా, టామ్ మరియు మేరి తమను తామే కాక తమ కుటుంబాలను కూడా గాయపర్చుకున్నారు. దుఃఖకరంగా, అనేకమంది ఇతర యౌవనస్థులు విశాలమైన మార్గం యొక్క స్వాతంత్ర్యపు స్వేచ్ఛాయుత, తప్పుదోవ పట్టించే దృక్పథాలతో మోసగించబడతారు. యౌవనస్థులు ఈ స్వాతంత్ర్యం యొక్క మోసకరమైన రూపాన్ని చూడగలిగితే ఎంతో బాగుంటుంది. విశాలమైన మార్గం యొక్క వాస్తవాలను—దానిపై ప్రయాణించే వారందరు చివరికి ఎదుర్కొనవలసిన కఠోరమైన పరిణామాలను వారు చూడగలిగితే ఎంతో బాగుంటుంది. నిజమే, అది విశాలమైనది, దానిపై ప్రయాణించడం సులభమే. కాని దాని విశాలతే దాని శాపం. “తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును” అనే తిరుగులేని నిజాన్ని గంభీరంగా తీసుకోవడం జ్ఞానయుక్తం.—గలతీయులు 6:8.
అయితే, ఒక మంచి ఎంపిక ఉంది. అది ఇరుకు మార్గం. కాని ఈ మార్గం ఎంత నిర్బంధకరమైనది, ఎంత సంకుచితమైనది, ఎంత ఇరుకైనది? అది ఎక్కడికి నడిపిస్తుంది?
[అధస్సూచీలు]
a పేర్లు మార్చబడ్డాయి.