దేవుని వాక్యాన్ని ప్రేమించటంలోని ప్రయోజనాలు
“జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది. . . . జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చిపెడుతుంది.—సామెతలు 4:6, 8, పరిశుద్ధ బైబల్.
1. దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించటంలో ఏమి ఇమిడివుంది?
క్రైస్తవునికి బైబిలు చదవటం ఆవశ్యకం. అయితే, కేవలం దాన్ని చదవటమే మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామని చూపించదు. ఎవరైనా ఒక ప్రక్క బైబిలును చదువుతూనే, మరో ప్రక్క బైబిలు ఖండించే పనుల్ని అభ్యసిస్తుంటే అప్పుడేమిటి? ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని, 119వ కీర్తన రచయిత ప్రేమించినట్లు ప్రేమించటం లేదని స్పష్టమౌతుంది. దేవుని వాక్యంపట్ల ఆ కీర్తన రచయితకున్న ప్రేమ, ఆయన అందులోని నియమాలకు అనుగుణ్యంగా జీవించటానికి నడిపించింది.—కీర్తన 119:97, 101, 105.
2. దేవుని వాక్యంపై ఆధారపడిన జ్ఞానం నుండి ఏ ప్రయోజనాలు చేకూరుతాయి?
2 దేవుని వాక్యానికి అనుగుణ్యంగా జీవించాలంటే, ఒక వ్యక్తి తన ఆలోచనా విధానంలోనూ జీవనరీతిలోనూ నిరంతర మార్పులు చేసుకుంటూ ఉండటం అవసరం. అలాంటి జీవనమార్గం దైవిక బుద్ధిని ప్రతిబింబిస్తుంది, అంటే దానర్థం బైబిలును పఠించటం మూలంగా లభించిన జ్ఞానాన్నీ అవగాహననూ అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టడం అన్నమాట. “జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చిపెడుతుంది. ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీ తల మీద ఉంచుతుంది. సొగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.” (సామెతలు 4:6, 8, 9, పరిశుద్ధ బైబల్) దేవుని వాక్యంపట్ల ప్రేమను పెంపొందించుకోవటానికీ దాని నిర్దేశంలో నడవటానికీ ఎంత చక్కని ప్రోత్సాహమో కదా! భద్రంగా కాపాడబడాలనీ, హెచ్చించబడాలనీ, ఘనపర్చబడాలనీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?
శాశ్వతమైన హానిజరుగకుండా భద్రంగా కాపాడబడటం
3. మునుపెన్నటి కన్నా ఇప్పుడు, క్రైస్తవులు ఎందుకు భద్రంగా కాపాడబడాలి, ఎవరి నుండి?
3 దేవుని వాక్యాన్ని చదివి, అన్వయించుకోవటం ద్వారా ఒకరు జ్ఞానంచే ఏవిధంగా భద్రంగా కాపాడబడతారు? ఒక విషయం ఏమిటంటే, అతడు అపవాదియగు సాతాను నుండి భద్రంగా కాపాడబడతాడు. దుష్టుడైన సాతాను నుండి తప్పించబడటానికి ప్రార్థించమని యేసు తన అనుచరులకు బోధించాడు. (మత్తయి 6:13) నేడు, మన ప్రార్థనల్లో ఈ విన్నపాన్ని చేయడం నిజంగా అత్యవసరం. సాతాను అతని దయ్యాలు 1914 తర్వాత పరలోకం నుండి పడద్రోయబడ్డారు, ఫలితంగా సాతాను “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై” ఉన్నాడు. (ప్రకటన 12:9, 10, 12) “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమి”స్తున్న వారితో చేసే యుద్ధంలో విజయం సాధించలేక, ఈ చివరి సమయంలో అతని క్రోధం తారాస్థాయికి చేరుకుని ఉండవచ్చు.—ప్రకటన 12:17.
4. క్రైస్తవులు సాతాను తెచ్చే ఒత్తిళ్ల నుండి, ఉరుల నుండి ఎలా భద్రంగా కాపాడబడగలరు?
4 సాతాను క్రోధంతో ఈ క్రైస్తవ పరిచారకులకు కష్టాలను తెస్తూ, వారికి దౌర్జన్యపూరితమైన శ్రమను లేదా వారి కార్యకలాపాలకు ఇతర అవాంతరాలను కల్గిస్తున్నాడు. రాజ్య ప్రచారకులు రాజ్య ప్రకటనపనిపై కేంద్రీకరించే బదులు లోకసంబంధమైన పేరు ప్రతిష్ఠలను, విశ్రాంతితో కూడిన జీవితాన్ని ప్రేమించడం, వస్తుసంబంధమైన ఆస్తులు సంపాదించుకోవడం, సుఖభోగాల వెంబడిపడటం వంటివాటిపై కేంద్రీకరించేలా వారిని ప్రలోభ పెట్టాలని కూడా అతడు కోరుకుంటాడు. సాతాను ఒత్తిడికి లొంగిపోకుండా లేదా అతని ఉరిలో చిక్కుకుపోకుండా ఉండేలా దేవుని నమ్మకమైన సేవకులను ఏది భద్రంగా కాపాడుతుంది? ప్రార్థన, యెహోవాతో వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధం, ఆయన వాగ్దానాలు తప్పక నెరవేరుతాయన్న విశ్వాసం ఆవశ్యకం. కానీ ఇవన్నీ దేవుని వాక్యాన్ని గూర్చిన జ్ఞానంతోనూ, దాని జ్ఞాపికలను అనుసరించాలన్న నిశ్చయతతోనూ ముడిపడి ఉన్నాయి. బైబిలును బైబిలు పఠన సహాయకాలను చదవడం ద్వారా, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం ద్వారా, ఒక తోటి విశ్వాసినుండి వచ్చే లేఖనాధార ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా, లేదా దేవుని ఆత్మ మన మనస్సుకు తెచ్చే బైబిలు సూత్రాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం ద్వారా ఈ జ్ఞాపికలు మనకు లభిస్తాయి.—యెషయా 30:21; యోహాను 14:26; 1 యోహాను 2:15-17.
5. దేవుని వాక్యంపై ఆధారపడిన జ్ఞానం మనల్ని ఏ విధాలుగా భద్రంగా కాపాడగలదు?
5 దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఇతర విధాలుగా కూడా భద్రంగా కాపాడబడతారు. ఉదాహరణకు, వాళ్లు మాదకద్రవ్యాల దుర్వినియోగం, పొగాకు ఉపయోగించడం, లైంగిక దుర్నీతి వంటివాటి ఫలితంగా వచ్చే మానసిక వేదనను, శారీరక రోగాలను తప్పించుకోవచ్చు. (1 కొరింథీయులు 5:11; 2 కొరింథీయులు 7:1) వాళ్లు ఊసుపోక కబుర్లు చెప్పుకోవడం ద్వారా లేక నిర్దయతో కూడిన సంభాషణ ద్వారా సంబంధాలు పాడవ్వడానికి దోహదపడరు. (ఎఫెసీయులు 4:31) లోకసంబంధమైన జ్ఞానానికి సంబంధించిన మోసకరమైన తత్త్వాలలోకి చొచ్చుకుపోవడం మూలంగా ఎదురయ్యే అనుమానాలకు వాళ్లు బలవ్వరు. (1 కొరింథీయులు 3:19) దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, దేవునితో తమకున్న సంబంధానికీ, నిత్యజీవ నిరీక్షణకూ ముప్పు తెచ్చే వాటి నుండి భద్రంగా కాపాడబడతారు. బైబిల్లో ఉన్న అద్భుతమైన వాగ్దానాలలో విశ్వాసముంచేందుకు తమ పొరుగువారికి సహాయం చేయడంలో బిజీగా ఉంటారు, అలా తాము ‘తమనూ తమ బోధను వినేవారినీ రక్షించుకోగలమని’ వాళ్లకు తెలుసు.—1 తిమోతి 4:16.
6. దేవుని వాక్యంపై ఆధారపడిన జ్ఞానము, కష్టసమయాల్లో కూడా మనల్ని ఎలా భద్రంగా ఉంచగలదు?
6 ప్రతి ఒక్కరూ, చివరికి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు కూడా, ‘కాలానికి, అనూహ్య సంఘటనలకు’ గురౌతారు. (ప్రసంగి 9:11, NW) మనలో కొందరం ప్రకృతి వైపరీత్యాలకు, గంభీరమైన అనారోగ్యాలకు, దుర్ఘటనలకు, లేక అకాల మరణాలకు గురవ్వడమన్నది అనివార్యమే. అయినప్పటికీ, మనం భద్రంగా ఉన్నాము. దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తికి ఏ విపత్తూ శాశ్వతమైన హాని కల్గించలేదు. కాబట్టి, భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే దాని గురించి మనం అధికంగా చింతించకూడదు. మనం సహేతుకమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్న తర్వాత, విషయాల్ని యెహోవా చేతిలో విడిచిపెట్టి, ఈనాటి అభద్రతాభావం మన జీవితంలోని శాంతిని హరించి వేసేందుకు మనం అనుమతించకూడదు. (మత్తయి 6:33, 34; ఫిలిప్పీయులు 4:6, 7) పునరుత్థాన నిరీక్షణ యొక్క కచ్చితత్వాన్ని, దేవుడు “సమస్తమును నూతనమైనవిగా” చేసినప్పుడు లభించే శ్రేష్ఠమైన జీవితాన్ని మనస్సులో ఉంచుకోండి.—ప్రకటన 21:5; యోహాను 11:25.
మిమ్మల్ని మీరు “మంచి నేల”గా నిరూపించుకోండి
7. తాను చెప్పేది వినడానికి వచ్చిన సమూహాలకు యేసు ఏ ఉపమానం చెప్పాడు?
7 దేవుని వాక్యాన్ని గురించి సరైన దృక్పథం కల్గివుండటం యొక్క ప్రాముఖ్యత యేసు ఉపమానాల్లో ఉన్నతపర్చబడింది. యేసు పాలస్తీనా అంతటిలో సువార్తను ప్రకటిస్తుండగా, ఆయన చెప్పేది వినడానికి ప్రజలు సమూహాలుగా సమకూడారు. (లూకా 8:1, 4) అయితే అందరూ దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించలేదు. చాలామంది అద్భుతాలను చూడాలని లేదా ఆయన బోధించే విధానం అమోఘంగా ఉండేది గనుక ఆయన చెప్పేది వినడానికి వచ్చేవారనడంలో సందేహం లేదు. కాబట్టి, యేసు వారికొక ఉపమానం చెప్పాడు: “విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమపడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటినణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించె[ను].”—లూకా 8:5-8.
8. యేసు ఉపమానంలోని, విత్తనము ఏమిటి?
8 వినేవారి హృదయ స్థితి మీద ఆధారపడి, సువార్త ప్రకటనకు వివిధ రకాలైన ప్రతిస్పందనలు ఉంటాయని యేసు ఉపమానం చూపించింది. విత్తబడుతున్న విత్తనము “దేవుని వాక్యము.” (లూకా 8:11) లేదా ఆ ఉపమానం యొక్క మరో వృత్తాంతం చెప్తున్నట్లుగా, విత్తనము “రాజ్యమునుగూర్చిన వాక్యము.” (మత్తయి 13:19) యేసు ఏ పదబంధాన్నైనా ఉపయోగించవచ్చు, ఎందుకంటే దేవుని వాక్య మూలాంశం యేసుక్రీస్తు రాజుగా ఉండే పరలోక రాజ్యమే, దాని ద్వారానే యెహోవా తన సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చి, తన నామాన్ని పవిత్రపర్చుకుంటాడు. (మత్తయి 6:9, 10) కాబట్టి, విత్తనము దేవుని వాక్యమైన బైబిలులోవున్న సువార్త సందేశమే. యెహోవాసాక్షులు మూల విత్తువాడైన యేసు క్రీస్తును అనుకరిస్తూ విత్తనములు విత్తుతూ, ఈ రాజ్య సందేశాన్ని ఉన్నతపరుస్తారు. వాళ్లకెలాంటి ప్రతిస్పందన లభిస్తుంది?
9. (ఎ) త్రోవప్రక్కను పడే, (బి) రాతినేలపై పడే, (సి) ముండ్ల పొదలలో పడే, విత్తనములు ఏమి సూచిస్తాయి?
9 కొన్ని విత్తనాలు త్రోవప్రక్కను పడి త్రొక్కబడతాయని యేసు చెప్పాడు. రాజ్య విత్తనము తమ హృదయాల్లో వేళ్లూనకుండా వేరే విషయాల్లో నిమగ్నమై ఉండే ప్రజలను ఇది సూచిస్తుంది. వారు దేవుని వాక్యంపట్ల ప్రేమను పెంపొందింపజేసుకోక మునుపే, “నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును.” (లూకా 8:12) కొన్ని విత్తనములు రాతినేలపై పడతాయి. ఇది, బైబిలు సందేశానికి ఆకర్షితులైనా, అది తమ హృదయాలను ప్రభావితం చేయడానికి అనుమతించని ప్రజలను సూచిస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు లేదా బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడం తమకు కష్టమైనప్పుడు, వారికి వేరు లేనందున వారు, “తొలగిపోవుదురు.” (లూకా 8:13) వాక్యాన్ని వింటారు గాని, “యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను” ఉక్కిరిబిక్కిరైపోయే వారూ ఉన్నారు. చివరికి, ముండ్లతో ఆక్రమించుకొనబడిన మొక్కల్లా, వారు ‘అణచివేయబడతారు.’—లూకా 8:14.
10, 11. (ఎ) ఎవరు మంచి నేలను సూచిస్తారు? (బి) దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నిలిపి ఉంచుకోవడానికి మనం ఏమి చేయాలి?
10 చివరికి, మంచి నేలపై పడే విత్తనములు కూడా ఉన్నాయి. “యోగ్యమైన మంచి మనస్సుతో” సందేశాన్ని స్వీకరించే ప్రజలను ఇది సూచిస్తుంది. సహజంగానే, మనలో ప్రతి ఒక్కరం ఈ వర్గంలోకి వస్తామని అనుకుంటాము. అయితే, చివరి విశ్లేషణలో, లెక్కలోకి వచ్చేది దేవుని దృక్కోణమే. (సామెతలు 17:3; 1 కొరింథీయులు 4:4, 5) మనం “యోగ్యమైన మంచి మనస్సు” కల్గివుండటమన్నది మనం ఇప్పటి నుండి మన మరణం వరకు లేదా ఈ దుష్టవిధానానికి దేవుడు అంతం తీసుకువచ్చే వరకు మనం చేసే చర్యల ద్వారా నిరూపించుకుంటామని ఆయన వాక్యం చెబుతుంది. రాజ్య సందేశానికి మనం మొదట్లోనే అనుకూలంగా ప్రతిస్పందిస్తే, అది మంచిది. అయితే, యోగ్యమైన మంచి మనస్సుగలవారు దేవుని వాక్యాన్ని అంగీకరించి, ‘దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారు.’—లూకా 8:15.
11 దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలిపి ఉంచుకోవడానికి కచ్చితమైన ఏకైక మార్గం ఏకాంతంలోనూ, తోటి విశ్వాసుల సహవాసంలోనూ దాన్ని చదివి, అధ్యయనం చేయడమే. యేసు నిజ అనుచరుల ఆధ్యాత్మిక ఆసక్తుల పట్ల శ్రద్ధ వహించడానికి నియమించబడిన మాధ్యమం ద్వారా అందజేయబడుతున్న ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందడం కూడా దానిలో ఇమిడి ఉంది. (మత్తయి 24:45-47) అలాంటి మాధ్యమాల ద్వారా, దేవుని వాక్యాన్ని తమ హృదయాల్లో నిలిపి ఉంచుకునే వారు ‘ఓపికతో ఫలించడానికి’ ప్రేమచే పురికొల్పబడతారు.
12. మనం సహనంతో ఫలించవలసిన ఫలం ఏమిటి?
12 మంచి నేల ఏ ఫలాలను ఫలిస్తుంది? ప్రకృతిలో, విత్తనములు అదే రకమైన విత్తనములు గల పండ్లనిచ్చే మొక్కలుగా పెరుగుతాయి, మరిన్ని ఫలాలను ఫలించేలా ఆ విత్తనములను వెదజల్లవచ్చు. అలాగే, యోగ్యమైన మంచి హృదయమున్నవారిలో ఆ వాక్య విత్తనము మొలకెత్తి, వాళ్లు తమ వంతుగా ఇతరుల హృదయాల్లో విత్తనాలను విత్తగలిగేంతగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది. (మత్తయి 28:19, 20) వారి విత్తే పని సహనంతో సూచించబడుతుంది. “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని చెప్పినప్పుడు యేసు విత్తడంలో సహనానికి ఉన్న ప్రాముఖ్యతను చూపించాడు.—మత్తయి 24:13, 14.
‘ప్రతి సత్కార్యములో సఫలమవ్వడం’
13. దేవుని వాక్య జ్ఞానమును సఫలమవ్వడంతో ముడిపెట్టిన ఏ ప్రార్థనను పౌలు చేశాడు?
13 అపొస్తలుడైన పౌలు కూడా సఫలమవ్వడం గురించి మాట్లాడాడు, ఆయన సఫలమవ్వడాన్ని దేవుని వాక్యంతో ముడిపెట్టాడు. తన తోటి విశ్వాసులు “ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని” ఆయన ప్రార్థించాడు.—కొలొస్సయులు 1:9, 10; ఫిలిప్పీయులు 1:9-11.
14-16. పౌలు ప్రార్థనకు అనుగుణంగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఏ ఫలాలను ఫలిస్తారు?
14 అలా, బైబిలు జ్ఞానాన్ని పొందడమే తుది లక్ష్యం కాదని పౌలు చూపించాడు. బదులుగా, దేవుని వాక్యంపట్ల ప్రేమ, ‘ప్రతి సత్కార్యములో సఫలులమౌతూ,’ “ప్రభువును సంతోషపెట్టునట్లు” నడుచుకునేందుకు మనల్ని పురికొల్పుతుంది. ఏ సత్కార్యము? ఈ అంత్య దినాల్లో రాజ్య సువార్తను ప్రకటించడం క్రైస్తవులకు విశేషమైన నియామకం. (మార్కు 13:10) అంతేగాక, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ఈ పనికి క్రమంగా ఆర్థికపరమైన సహాయాన్ని ఇవ్వడానికి తాము చేయగల్గినదంతా చేస్తారు. వాళ్లు, “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని తెలుసుకుని, ఇచ్చే ఆ ఆధిక్యతను బట్టి ఆనందిస్తారు. (2 కొరింథీయులు 9:7) వందకన్న ఎక్కువగా ఉన్న బేతేలు సౌకర్యాలను చూసుకోవడానికయ్యే ఖర్చులకు వారి విరాళాలే ఉపయోగపడతాయి, ఆ బేతేలు గృహాలే రాజ్య ప్రకటన కార్యకలాపానికి నడిపింపు ఇస్తున్నాయి, వాటిలో కొన్నింటిలో బైబిళ్లు, బైబిలు సాహిత్యాలు ముద్రించబడుతున్నాయి. పెద్ద పెద్ద క్రైస్తవ సమావేశాల ఖర్చులకు, ప్రయాణ పైవిచారణకర్తలను మిషనరీలను ఇతర పూర్తికాల సువార్తికులను పంపించడానికి కూడా ఆ విరాళాలు సహాయపడతాయి.
15 ఇతర మంచి పనుల్లో సత్యారాధనా కేంద్రాలను నిర్మించడం, వాటి గురించి శ్రద్ధ వహించడం ఇమిడివున్నాయి. దేవుని వాక్యంపట్ల ప్రేమ, సమావేశ హాళ్లను, రాజ్యమందిరాలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఆరాధకులను పురికొల్పుతుంది. (పోల్చండి నెహెమ్యా 10:39.) అలాంటి భవనాల మీద దేవుని నామము కనిపిస్తుంది గనుక, వాటిని లోపలా వెలుపలా శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచడం ఆవశ్యకం, అలాంటి మందిరాలలో ఆరాధించేవారి ప్రవర్తన నిందాస్పదమైనదిగా ఉండకూడదు. (2 కొరింథీయులు 6:3) కొంతమంది క్రైస్తవులు అంతకంటే ఎక్కువే చేయగల్గుతున్నారు. పేదరికం మూలంగానూ, నైపుణ్యాల కొరత మూలంగానూ ఆరాధనా స్థలాలను నిర్మించవలసిన అవసరం ఉన్న ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి క్రొత్త ఆరాధనా స్థలాలను నిర్మించడంలో భాగం వహించేందుకు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి దేవుని వాక్యంపట్లనున్న ప్రేమ పురికొల్పుతుంది.—2 కొరింథీయులు 8:14.
16 ‘ప్రతి సత్కార్యములో సఫలమవ్వడంలో’ కుటుంబ బాధ్యతల గురించి శ్రద్ధ వహించడం, తోటి క్రైస్తవులపట్ల శ్రద్ధ చూపించడం ఇమిడి ఉన్నాయి. దేవుని వాక్యంపట్ల ప్రేమ “విశ్వాసగృహమునకు చేరినవారి” అవసరాల గురించి శ్రద్ధ తీసుకోవడానికి, మన “యింటివారియెడల భక్తి కనుపరచుటకు” మనల్ని పురికొల్పుతుంది. (గలతీయులు 6:10; 1 తిమోతి 5:4, 8) ఈ విషయంలో, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించడమూ దుఃఖిస్తున్నవారిని ఓదార్చడమూ మంచిది. సవాలుదాయకమైన ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కుంటున్నవారికి సహాయం చేయడంలో సంఘ పెద్దలు, ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లోని సహోదరులు ఎంత చక్కని పనిని నిర్వర్తిస్తున్నారు! (అపొస్తలుల కార్యములు 15:28) దుర్ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి—కొన్ని ప్రకృతి వైపరీత్యాలైతే, మరికొన్ని మానవుడు స్వయంగా సృష్టించుకున్నవి. ప్రకృతి వైపరీత్యాలకు, దుర్ఘటనలకు గురైన తోటి విశ్వాసులకూ ఇతరులకూ ఉపశమనాన్ని చేకూర్చడంలో యెహోవాసాక్షులు దేవుని ఆత్మ సహాయంతో, భూవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చక్కని పేరును సంపాదించుకున్నారు. ఇవన్నీ దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ప్రదర్శించే చక్కని ఫలాలు.
మహిమాన్వితమైన భవిష్యద్ ప్రయోజనాలు
17, 18. (ఎ) రాజ్య విత్తనమును విత్తడం ద్వారా ఏమి సాధించబడుతుంది? (బి) దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు భూమిని కంపింపజేసే ఏ సంఘటనలను చూస్తారు?
17 రాజ్య విత్తనములను విత్తే పని మానవజాతికి గొప్ప ప్రయోజనాలను తీసుకువస్తూనే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 3,00,000 కన్నా ఎక్కువమంది, బైబిలు సందేశం తమ హృదయాల్లో ఎంతగా వేళ్లూనడానికి అనుమతించారంటే, వాళ్లు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని, దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. వారి కోసం ఎంత మహిమాన్విత భవిష్యత్తు వేచి ఉంది!
18 త్వరలోనే, యెహోవా దేవుడు తన నామాన్ని మహిమపరుస్తాడని దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి తెలుసు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” నాశనం చేయబడుతుంది. (ప్రకటన 18:2, 8) తర్వాత, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి నిరాకరించేవారిని రాజైన యేసుక్రీస్తు తుదముట్టిస్తాడు. (కీర్తన 2:9-11; దానియేలు 2:44) ఆ తర్వాత, దేవుని రాజ్యం నేరం, యుద్ధం, మరితర విపత్తుల నుండి శాశ్వత ఉపశమనాన్ని తెస్తుంది. బాధ, అనారోగ్యం, మరణం వంటివాటి మూలంగా ప్రజలను ఇక ఓదార్చవలసిన అవసరం ఉండదు.—ప్రకటన 21:3, 4.
19, 20. దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించేవారి కోసం ఏ మహిమాన్విత భవిష్యత్తు వేచి ఉంది?
19 దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎంత మహిమాన్వితమైన సత్కార్యాలను నెరవేరుస్తారో కదా! అర్మగిద్దోనును తప్పించుకుని జీవించేవారు ఈ భూమిని పరదైసుగా మార్చే ఆనందభరితమైన పనిని ప్రారంభిస్తారు. ఇప్పుడు సమాధిలో విశ్రాంతి తీసుకుంటూ, మృతుల పునరుత్థానములో బయటికి వచ్చే ఉత్తరాపేక్షతో దేవుని స్మృతిలో ఉన్న మృతులైన మానవుల అవసరాల కోసం సిద్ధం చేసే అద్భుతమైన ఆధిక్యత వారికుంటుంది. (యోహాను 5:28, 29) ఆ సమయంలో, సర్వోన్నత ప్రభువైన యెహోవా నుండి, ఉన్నతపర్చబడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా భూ నివాసులకు పరిపూర్ణమైన నడిపింపు లభిస్తుంది. నూతన లోక నివాసం కోసం యెహోవా ఇచ్చే ఉపదేశాలను బయల్పరుస్తూ, ‘గ్రంథములు విప్పబడతాయి.’—ప్రకటన 20:12.
20 యెహోవా నియమిత కాలంలో, నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల వర్గమంతా, ‘క్రీస్తుతోడి వారసులుగా’ తమ పరలోక ప్రతిఫలాన్ని పొందడానికి లేపబడుతుంది. (రోమీయులు 8:17) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, భూమిపైనున్న దేవుని వాక్యాన్ని ప్రేమించే మానవులంతా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణతకు తీసుకురాబడతారు. చివరి పరీక్షలో నమ్మకమైనవారిగా నిరూపించుకున్న తర్వాత, వాళ్లు నిత్యజీవమనే ప్రతిఫలాన్ని పొంది, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”ను అనుభవిస్తారు. (రోమీయులు 8:20-21; ప్రకటన 20:1-3, 7-10) అదెంత అద్భుతమైన సమయమై ఉంటుందో కదా! నిజంగా, యెహోవా మనకు పరలోక నిరీక్షణను అనుగ్రహించినా, భూ నిరీక్షణను అనుగ్రహించినా, ఆయన వాక్యం పట్లగల అజరామరమైన ప్రేమ, దైవిక జ్ఞానం అనుసారంగా జీవించాలన్న మన నిశ్చయత మనల్ని భద్రంగా కాపాడతాయి. ‘మనం దాని కౌగలిస్తాము గనుక’ భవిష్యత్తులో ‘అది మనకు ఘనతను తెస్తుంది.’—సామెతలు 4:6, 8.
మీరు వివరించగలరా?
◻ దేవుని వాక్యంపట్ల ప్రేమ మనల్ని ఎలా భద్రంగా కాపాడుతుంది?
◻ యేసు ఉపమానంలోని విత్తనం ఏమిటి, అది ఎలా విత్తబడుతుంది?
◻ మనం “మంచి నేల”గా ఎలా నిరూపించుకోగలం?
◻ దేవుని వాక్య ప్రేమికులు ఏ ప్రయోజనాల కోసం ఎదురు చూడవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
యేసు ఉపమానంలోని విత్తనములు దేవుని వాక్యంలోవున్న సువార్త సందేశాన్ని సూచిస్తాయి
[క్రెడిట్ లైను]
Garo Nalbandian
[17వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు మహాగొప్ప విత్తువానిని అనుకరిస్తారు
[18వ పేజీలోని చిత్రాలు]
అర్మగిద్దోనును తప్పించుకుని జీవించేవారు భూ ఫలాలను అనుభవిస్తారు