సహోదర అనురాగానికి కీలకాన్ని కనుగొనుట
“భక్తియందు సహోదర అనురాగమును . . . అమర్చుకొనుడి.”— 2 పేతురు 1:5-7, NW.
1. యెహోవాసాక్షుల సమావేశాలు ఆనందదాయకమైన సమయాలుగా నుండుటకు గల ముఖ్యకారణాలలో ఒకటేమిటి?
ఒకప్పుడు యెహోవాసాక్షికాని ఒక వైద్యుడు, తన కుమార్తె వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ నందు మిషనరీ ట్రైనింగ్ పొంది పట్టభద్రురాలగుతున్నప్పుడు హాజరయ్యాడు. ఆ సంతోషభరితమైన గుంపును చూచి ఎంతో ప్రభావితుడై, ఈ ప్రజలలో కేవలం అనారోగ్యమే వుండదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ గుంపును ఏది అంత సంతోషభరితులను చేసింది? సంఘాలలో, ప్రాంతీయ సమావేశాలలో, జిల్లా సమావేశాలలో, యెహోవా ప్రజల సమావేశాలనన్నిటినీ ఏది సంతోషభరితం చేస్తుంది? వారు ఒకరి యెడల ఒకరు చూపించుకొనే సహోదర అనురాగం కాదా? నిస్సందేహంగా, యెహోవాసాక్షులు మతం నుండి పొందుతున్నంత ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని మరే మతవర్గాలు తమ మతం నుండి పొందడం లేదని చెప్పబడుటకు సహోదర అనురాగమే ఒక కారణం.
2, 3. మనం ఒకరి గురించి ఒకరం ఎలా భావించాలి అనేదానితో ఏ రెండు గ్రీకు పదాలు వ్యవహరిస్తాయి, వాటి విలక్షణమైన గుణాలు ఏమిటి?
2 “నిష్కపటమైన సహోదర అనురాగం కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను, మిక్కటముగానూ ప్రేమించుడి,” అని 1 పేతురు 1:22 నందలి అపొస్తలుడైన పేతురు మాటల దృష్ట్యా మనమలాంటి ప్రేమను చూచుటకు నిరీక్షించాలి. ఇక్కడ “సహోదర అనురాగం” అని అనువదించబడిన దాని గ్రీకు పదము మూలాంశాలలో ఒకటి ఫిలియ (అనురాగం). సాధారణంగా “ప్రేమ” అని అనువదింపబడిన అగాపె అనే పదానికున్న అర్థానికి దీని అర్థానికి దగ్గర సంబంధం వుంది. (1 యోహాను 4:8) సహోదర అనురాగం, ప్రేమ రెండు మార్చిమార్చి వాడినప్పడికీ, వాటికి ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. అనేకమంది బైబిలు అనువాదకులు చేస్తున్నట్లు, మనం వాటిని ఒకదానితో ఒకటి గందరగోళపరచ కూడదు. (ఈ శీర్షికలోను, దీని తర్వాతి శీర్షికలోను ఈ రెండు పదాలను గూర్చి మనం చర్చిద్దాము.)
3 ఈ రెండు గ్రీకు పదాల మధ్యగల తేడాను గూర్చి, ఒక పండితుడు ఫిలియా అంటే “కచ్చితంగా స్నేహం, సన్నిహితత్వం, అనురాగం”తో నిండిన పదమని తెలియజేసాడు. అగాపే అనేది మనస్సుకు సంబంధించిన పదం. కాబట్టి మనం మన శత్రువులను ప్రేమించమని (అగాపే) చెప్పబడినప్పుడు, వారి యెడల మనకు అనురాగం ఉండదు. ఎందుకు? ఎందుకంటే, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:33) వాటి మధ్య తేడావుందని సూచిస్తున్న అపొస్తలుడైన పేతురు తరువాతి మాటలు ఇలా ఉన్నాయి: “సహోదర అనురాగమందు ప్రేమను . . . అమర్చుకొనుడి.”— 2 పేతురు 1:5-7, NW; మరియు యోహాను 21:15-17, NW, పోల్చండి.a
చాలా ప్రత్యేకమైన సహోదర అనురాగానికి ఉదాహరణలు
4. యేసు, యోహాను ఒకరి యెడల ఒకరు ఎందుకు ప్రత్యేకమైన అనురాగాన్ని కలిగివున్నారు?
4 దేవుని వాక్యం చాలా ప్రత్యేకమైన సహోదర అనురాగానికి అనేక ఉదాహరణలను మనకిస్తుంది. ఈ ప్రత్యేకమైన అనురాగము ఒక మోజుపై ఆధారపడింది కాదుగాని విశేషమైన లక్షణాల మెప్పుపై ఆధారపడింది. నిస్సందేహంగా, బాగా తెలిసిన ఉదాహరణ ఏదంటే, అపొస్తలుడైన యోహాను యెడల యేసుకున్న అనురాగమే. అయితే యేసు సదుద్దేశంతో తన నమ్మకస్థులైన అపొస్తలులందరి యెడల సహోదర అనురాగమును కలిగివుండెను. (లూకా 22:28) ఆయన వినయమును గూర్చిన పాఠం నేర్పుతూ వారి కాళ్లు కడగటం ద్వారా ఒకరీతిలో దానిని ప్రదర్శించెను. (యోహాను 13:3-16) కాని యోహాను యెడల యేసుకు ప్రత్యేకమైన అనురాగముండెను, దీన్ని యోహాను అనేకసార్లు ప్రస్తావించాడు. (యోహాను 13:23; 19:26; 20:2) తన అపొస్తలులు, శిష్యుల యెడల ప్రేమ చూపించుటకు యేసుకు కారణమున్నట్లే, యేసు యెడల యోహానుకున్న ప్రగాఢమైన మెప్పు, యేసు యోహాను యందు ప్రత్యేకమైన అనురాగాన్ని కల్గియుండుటకు కారణమైంది. మనం దీన్ని యోహాను వ్రాసిన సువార్తలో, ప్రేరేపిత లేఖలలో చూడగలము. తన వ్రాతలలో ఆయన అనేక మార్లు ప్రేమను గూర్చి ప్రస్తావించాడు. ఆయన వ్రాసిన యోహాను 1, 13 నుండి 17 అధ్యాయాలలో అలాగే యేసు మానవ పూర్వ ఉనికిని గూర్చి అనేకమార్లు ఆయన ప్రస్తావించడంలో యేసు ఆత్మీయ లక్షణాల యెడల యోహాను కలిగివున్న గొప్ప మెప్పును చూడవచ్చు.—యోహాను 1:1-3; 3:13; 6:38, 42, 58; 17:5; 18:37.
5. పౌలు, తిమోతి ఒకరియెడల ఒకరు కలిగివున్న ప్రత్యేకమైన అనురాగాన్ని గూర్చి ఏమి చెప్పవచ్చు?
5 అలాగే, అపొస్తలుడైన పౌలు మరియు ఆయన క్రైస్తవ సహచరుడైన తిమోతి, నిశ్చయంగా ఒకరి గుణాలను ఒకరు మెచ్చుకోవడాన్నిబట్టి ఒకరి యెడల ఒకరికున్న ప్రత్యేకమైన అనురాగాన్ని త్రోసిపుచ్చలేము. పౌలు తన లేఖల్లో, తిమోతిని గూర్చి ఇటువంటి మంచి అభిప్రాయం చెప్పినట్లు మనము చూడగలము. “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. . . . అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవచేసెను.” (ఫిలిప్పీయులు 2:20-22) పౌలుకు తిమోతి యెడలగల నిండైన అనురాగాన్ని బయల్పరచు అనేక వ్యక్తిగత సూచనలు తిమోతికి పౌలు వ్రాసిన పత్రికలలో ఉన్నాయి. ఉదాహరణకు, 1 తిమోతి 6:20ని పరిశీలించండి: ‘ఓ తిమోతీ, నీకు అప్పగింపబడిన దానిని కాపాడుకొనుము.’ (1 తిమోతి 4:12-16; 5:23; 2 తిమోతి 1:5; 3:14, 15లను కూడా చూడండి.) పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరాలను, తీతుకు వ్రాసిన వాటితో పోలిస్తే ఈ యౌవనుడి పట్ల పౌలుకున్న ప్రత్యేకమైన అనురాగము తేటపడుతుంది. తిమోతి కూడా వారి స్నేహాన్ని గూర్చి అలాగే భావించియుండవచ్చునని 2 తిమోతి 1:3, 4 నందలి పౌలు మాటల నుండి మనం తెలుసుకోవచ్చు: “నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని . . . అపేక్షించుచున్నాను.”
6, 7. దావీదు, యోనాతాను ఒకరి యెడల ఒకరు ఎలాంటి భావాన్ని కలిగివుండిరి, మరియు ఎందుకు?
6 హెబ్రీ లేఖనాలు దావీదు యోనాతానుల వంటి మంచి ఉదాహరణలను అందిస్తున్నాయి. దావీదు గొల్యాతును చంపిన తరువాత, “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను” అని మనం చదువుతాము. (1 సమూయేలు 18:1) యెహోవా నామము పట్ల దావీదు కలిగివున్న ఆసక్తి గొల్యాతుతో పోరాడటానికి వెళ్లడంలోని అతని నిర్భయ మాదిరి పట్ల మెప్పు, దావీదు యెడల యోనాతాను ప్రత్యేకమైన అనురాగం పెంచుకొనుటకు కారణమైంది.
7 రాజైన సౌలు బారి నుండి దావీదును తప్పించటానికి తన ప్రాణాన్ని సహితం ప్రమాదంలో పడవేసుకునేంతగా యోనాతానుకు దావీదు యెడల అనురాగముంది. ఇశ్రాయేలు తరువాతి రాజుగా యెహోవా దావీదును ఎన్నుకున్నందున ఆ విషయంలో యోనాతాను ఎన్నడూ ఆగ్రహించలేదు. (1 సమూయేలు 23:17) దావీదుకు కూడా యోనాతాను యెడల అంతే ప్రగాఢ అనురాగం వుందని యోనాతాను మరణించినప్పుడు దావీదు అన్నమాటలతో స్పష్టమౌతుంది: “నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.” నిజంగా, ప్రగాఢమెప్పు వారి సంబంధానికి కారణమైంది.—2 సమూయేలు 1:26.
8. ఏ ఇద్దరు స్త్రీలు ఒకరి యెడల ఒకరు ప్రత్యేకమైన అనురాగాన్ని వ్యక్తపర్చారు, ఎందుకు?
8 నయోమి, విధవరాలైన ఆమె కోడలు రూతు అనే ఇద్దరు స్త్రీల మధ్యగల ప్రత్యేక అనురాగము, హెబ్రీ లేఖనములలో గల మరొక మంచి ఉదాహరణ. రూతు నయోమితో అన్న మాటలను గుర్తుతెచ్చుకోండి: “నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లుచోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” (రూతు 1:16) నయోమి, తన ప్రవర్తన ద్వారా, యెహోవాను గూర్చి మాట్లాడుట ద్వారా, రూతు అలాంటి మెప్పును పెంపొందింపచేసి కొనుటకు సహాయపడిందని మనం ఊహించవద్దా?—లూకా 6:40 పోల్చండి.
అపొస్తలుడైన పౌలు మాదిరి
9. సహోదర అనురాగం విషయంలో పౌలు మాదిరికరంగా వుండెనని ఏది చూపిస్తున్నది?
9 మనం చూసినట్లుగా, అపొస్తలుడైన పౌలుకు తిమోతి యెడల చాలా ప్రత్యేకమైన సహోదర అనురాగం వుంది. అయితే ఆయన సామాన్యంగా, తన సహోదరులందరి యెడల కూడా సహోదర అనురాగాన్ని చూపించుటలో అద్భుతమైన మాదిరినుంచాడు. ఎఫెసునందలి పెద్దలతో ఆయన: ‘మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి [అతను] మానక బుద్ధిచెప్పితినని’ చెప్పెను. మిక్కుటమైన సహోదర అనురాగమా? దాని గురించి సందేహం లేదు! వారు కూడా పౌలు గురించి అలాగే భావించారు. ఆయనను వారిక చూడలేరని విన్నప్పుడు, ‘అప్పుడు వారందరు చాల ఏడ్చి, విశేషముగా దుఃఖించుచు, పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొనిరి.’ (అపొస్తలుల కార్యములు 20:31, 37) సహోదర అనురాగము మెప్పుపై ఆధారపడినదా? అవును, 2 కొరింథీయులు 6:11-13 నందలి ఆయన మాటలలో కూడా ఆయన సహోదర అనురాగాన్ని చూడవచ్చు: “అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.”
10. ఏ సహోదర అనురాగం కొరవడడం పౌలు రెండవ కొరింథీయులు 11వ అధ్యాయంలోని తన శ్రమలను గురించి చెప్పటానికి దారితీసింది?
10 స్పష్టంగా, అపొస్తలుడైన పౌలు యెడల అనేకమంది కొరింథీయులలో సహోదర అనురాగము లోపించియుండెను. అందుకే, కొందరిలా ఫిర్యాదు చేశారు: “అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిది.” (2 కొరింథీయులు 10:10) అందువల్లనే పౌలు వారి “మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలుల” గురించి ప్రస్తావించి, 2 కొరింథీయులు 11:5, 22-33 నందు వ్రాయబడి యున్నట్లు తాను సహించిన శ్రమలను గూర్చి చెప్పుటకు పురికొల్పబడ్డాడు.
11. థెస్సలోనికలోని క్రైస్తవుల యెడల పౌలు చూపిన అనురాగాన్ని గూర్చి ఏ సాక్ష్యం కలదు?
11 తాను పరిచర్య చేసిన వారి యెడల పౌలు కలిగివున్న అనురాగాన్ని గురించి 1 థెస్సలొనీకయులు 2:8 నందలి అతని మాటల ద్వారా ప్రాముఖ్యంగా స్పష్టమౌతుంది: “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” వాస్తవానికి, ఆయన ఆ క్రొత్త సహోదరుల యెడల ఎంత అనురాగాన్ని కలిగివుండెనంటే, వారి యోగక్షేమాల గురించి తెలిసికొనకుండా తాళలేనివాడై—వారు శ్రమలను ఎలా సహిస్తున్నారో తెలుసుకొనుటకు ఎంతో ఆసక్తి కలిగివుండి—ఆయన తిమోతిని పంపించాడు, పౌలుకు ఎంతో ఊరట కలిగించిన మంచి సమాచారమును ఆయన అందించాడు. (1 థెస్సలొనీకయులు 3:1, 2, 6, 7) ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్ ఇలా తెలియజేస్తున్నది: “పౌలుకు, ఆయన పరిచర్య చేసిన వారికి మధ్య సన్నిహితబంధముతో కూడిన సహోదర అనురాగం నెలకొని ఉంది.”
సహోదరానురాగానికి కీలకం—మెప్పు
12. మన సహోదరుల యెడల మనం మిక్కుటమైన అనురాగాన్ని చూపించుటకు ఏ కారణాలు కలవు?
12 నిస్సందేహంగా, సహోదరానురాగానికి కీలకం మెప్పు. యెహోవాకు సమర్పించుకున్న సేవకులందరికి మన మెప్పును, అనురాగాన్ని పొందే, వారిని అభిమానించగల లక్షణాలు లేవా? మనందరం మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుతున్నాము. మనమందరం మనకున్న ముగ్గురు సాధారణ శత్రువులైన: సాతాను అతని దయ్యాలు, అతని ఆధీనంలో వున్న దుష్ట లోకం, పాపానికిలోనైన శరీరానికి వారసత్వంగా సంక్రమించిన స్వార్థప్రవృత్తులతో ధైర్యంగా పోరాడుతున్నాము. మన సహోదరులు వారి పరిస్థితుల దృష్ట్యా వారికి సాధ్యమైనంత చేస్తున్నారని మనమనుకోవద్దా? భూమిమీదవున్న ప్రతిఒక్కరు యెహోవా వైపు లేదా సాతాను వైపు వుంటారు. మన సమర్పిత సహోదర సహోదరీలందరు యెహోవా వైపు, అవును మన వైపు వున్నారు గనుక మన సహోదర అనురాగాన్ని పొందుటకు వారు పాత్రులు.
13. పెద్ద యెడల మనమెందుకు మిక్కుటమైన అనురాగాన్ని కలిగివుండాలి?
13 మన పెద్దలను మెచ్చుకొను విషయమేమి? సంఘ విషయాల కొరకు వారు పడుతున్న కష్టం దృష్ట్యా వారి యెడల మన హృదయంలో ప్రత్యేక అభిమానం వుండవద్దా? మనందరిలాగే వారు కూడా తమ కొరకు, తమ కుటుంబం కొరకు సమకూర్చుకోవాలి. వ్యక్తగత పఠనం, సంఘ కూటాలకు హాజరగుట, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుట వంటివి చేయవలసిన వ్యక్తిగత బాధ్యత మనందరిలాగే వారికి కూడా వుంది. దానికి తోడు, కూటాల భాగాలను సిద్ధపడటం, బహిరంగ ప్రసంగాలివ్వడం, సంఘంలో ఏర్పడే సమస్యల గురించి శ్రద్ధ వహించడం, కొన్నిసార్లు గంటల తరబడి న్యాయవిచారణలు చేయడం, వంటి బాధ్యతలు కూడా వారికుంటాయి. నిజంగా, మన మలాంటి వారిని ‘ఘనపరచాలి.’—ఫిలిప్పీయులు 2:29.
సహోదర అనురాగాన్ని వ్యక్తపరచుట
14. సహోదర అనురాగాన్ని చూపించమని ఏ లేఖనాలు మనకాజ్ఞాపిస్తున్నాయి?
14 యేసుక్రీస్తు మరియు పౌలు చేసినట్లుగా, యెహోవాను సంతోషపరచాలంటే, మనం మన తోటి విశ్వాసుల యెడల సహోదర అనురాగాన్ని వ్యక్తపర్చాలి. మనమిలా చదువుతాము: ‘[సహోదర ప్రేమ] విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై యుండుడి.’ (రోమీయులు 12:10, కింగ్‌డమ్ ఇంటర్లీనియర్) “సహోదర అనురాగమును గూర్చి మేము మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.” (1 థెస్సలొనీకయులు 4:9, ఇంట్) “మీ సహోదర అనురాగము నిలువరముగా ఉండనీయుడి.” (హెబ్రీయులు 13:1, ఇంట్) మనం తన భూసంబంధులైన పిల్లల యెడల సహోదర అనురాగాన్ని కనపరిస్తే నిజంగా మన పరలోకపు తండ్రి సంతోషిస్తాడు!
15. సహోదర అనురాగాన్ని కనపర్చటానికి కొన్ని మార్గాలేవి?
15 అపొస్తలుల కాలంలో క్రైస్తవులు “పవిత్రమైన ముద్దుపెట్టుకొని” లేక “ప్రేమగల ముద్దుతో” ఒకరికొకరు అభివాదం చేసుకునేవారు. (రోమీయులు 16:16; 1 పేతురు 5:14) నిజంగా సహోదర అనురాగాన్ని వ్యక్తపరచుట అంటే అదే! ఈనాడు, భూమి యందలి చాలా ప్రాంతాల్లో స్నేహపూరితమైన చిరునవ్వు, పటిష్ఠమైన కరచాలనం అందుకు యుక్తమైన వ్యక్తీకరణగా ఉన్నది. మెక్సికో లాంటి లాటిన్ దేశాలలో ఆలింగనం చేసుకోవడం ద్వారా అభివాదం చేసుకుంటారు, నిజంగా అది అనురాగాన్ని వ్యక్తపరచుటే. వారి దేశాలలో జరుగుతున్న గొప్ప అభివృద్ధికి ఈ సహోదరుల నిండైన అనురాగము కారణమౌతుండవచ్చును.
16. రాజ్యమందిరం వద్ద సహోదర అనురాగాన్ని కనపర్చటానికి మనకే అవకాశాలున్నాయి?
16 మనం రాజ్యమందిరంలో ప్రవేశించగానే, సహోదర అనురాగాన్ని వ్యక్తపర్చటానికి మనం ప్రత్యేకంగా ప్రయత్నిస్తామా? ముఖ్యంగా కృంగియున్నవారితో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడటానికి మనకు అవకాశం దొరుకుతుంది. “ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి” అని మనకు చెప్పబడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:14) మన సహోదర అనురాగాన్ని వ్యక్తపరచటానికి అది ఒక మార్గం. మంచి బహిరంగ ప్రసంగం ఇచ్చినందుకు, కార్యక్రమ భాగాన్ని చక్కగా నిర్వహించినందుకు, దైవపరిపాలనా పాఠశాలలో ఒక విద్యార్థి ప్రసంగీకుడు మంచి కృషి మున్నగు వాటిని చేసినందుకు మెచ్చుకోవడం మరో మంచి మార్గం.
17. ఒక పెద్ద సంఘ అనురాగాన్ని ఎలా సంపాదించుకోగల్గాడు?
17 కూటము అయిన తరువాత మరీ ఎక్కువ ఆలస్యం కాకపోతే భోజనానికి లేక టీకి ఇతరులను ఇంటికి ఆహ్వానించే విషయమేమి? లూకా 14:12-14 నందలి యేసు ఉపదేశాన్ని మనం పాటించవద్దా? ఒకసారి గతంలో మిషనరీగానున్న వ్యక్తి ఇతరులందరూ వేరే జాతీయులైవున్న ఒక సంఘంలో అధ్యక్షునిగా నియమింపబడ్డాడు. సహోదర అనురాగము కొరవడినట్లు ఆయన భావించాడు, అందుకని పరిస్థితిని మార్చటానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఎలా? ప్రతి ఆదివారం ఆయన ఒకొక్క కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించాడు. సంవత్సరాంతానికి అందరూ ఆయన యెడల నిండైన సహోదర అనురాగాన్ని కనపర్చారు.
18. అనారోగ్యులైన మన సహోదర సహోదరీలకు మనమెలా సహోదర అనురాగాన్ని కనపర్చవచ్చు?
18 ఒక సహోదరుడు లేక సహోదరి అనారోగ్యంతో ఇంటివద్దగాని, ఆసుపత్రిలోగాని వుంటే సహోదర అనురాగము మనకు వారి యెడల శ్రద్ధ వుందని తెలియజేయుటకు కారణమౌతుంది. నర్సింగ్‌హోమ్‌లలో జీవిస్తున్నవారి సంగతేమిటి? వ్యక్తిగతంగా వెళ్లడం, ఫోనుచేయడం, లేక అనురాగంతో కూడిన భావాలను వ్యక్తపరుస్తూ కార్డును పంపించడం వంటివి ఎందుకు చేయకూడదు?
19, 20. మన సహోదర అనురాగం విస్తరింపబడిందని మనమెలా చూపించవచ్చు?
19 అలాంటి సహోదర అనురాగాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నా సహోదర అనురాగము పక్షపాతం గలదైయుందా? రంగు, చదువు, లేక వస్తుసంబంధ సంపత్తి నేను వ్యక్తపర్చే సహోదర అనురాగాన్ని ప్రభావితం చేస్తున్నాయా? కొరింథులోని క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు కోరినట్లు నేను నా సహోదర అనురాగాన్ని విశాలపరచుకోవలసిన అవసరత వుందా?’ సహోదర అనురాగం మనం మన సహోదరులను సరిగా దృష్టించుటకు, వారి మంచి విషయాల గురించి వారిని మెచ్చుకొనుటకు మనల్ని పురికొల్పుతుంది. మన సహోదరుల ఆత్మీయ అభివృద్ధినిబట్టి ఈర్ష్య చెందకుండా, సంతోషించుటకు సహోదర అనురాగం మనకు సహాయం చేస్తుంది.
20 సహోదర అనురాగం పరిచర్యలో మన సహోదరులకు సహాయం చేయుటకు మనల్ని అప్రమత్తంగా వుంచుతుంది. మన పాటలలో ఒకటి (సంఖ్య 92) చెప్పునట్లు అది ఇలా వుండాలి:
“బలహీనులందరికీ దయాపూర్వక సహాయాన్నిచ్చి,
వారు కూడా ధైర్యంగా మాట్లాడగలిగేలా చేయండి.
చిన్న వయస్సులోవున్న వారిని నిర్లక్ష్యం చేయకండి,
వారు బలంగా పెరిగి భయాలను పోగొట్టుకొనుటకు సహాయం చేయండి.”
21. మనం సహోదర అనురాగాన్ని కనపర్చినప్పుడు మనమే ప్రతిస్పందనను ఆశించవచ్చు?
21 సహోదర అనురాగాన్ని వ్యక్తపరచుటలో, యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన సూత్రం కూడా వర్తిస్తుందని మనం మరచిపోకుందము: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.” (లూకా 6:38) సహోదర అనురాగాన్ని కనపరుస్తూ, మనలాగే యెహోవాసేవకులైన వారి యెడల గౌరవం చూపించడం ద్వారా మనం మేలు పొందుతాము. సహోదర అనురాగాన్ని కనపర్చుటలో ఆనందించేవారు నిజంగా ధన్యులు!
[అధస్సూచీలు]
a “ప్రేమ (అగాపె)— ఏమి కాదు, ఏమైయుంది” అనే తరువాతి శీర్షికను చూడండి.
మీరెలా జవాబిస్తారు
◻ మన భావాలతో ఏ గ్రీకు పదాలు వ్యవహరిస్తాయి, మరియు అవి ఎలా విలక్షణంగా వున్నాయి?
◻ సహోదర అనురాగానికి కీలకమేమిటి?
◻ ప్రత్యేకమైన సహోదర అనురాగం విషయంలో మనకు ఏ లేఖన మాదిరులున్నాయి?
◻ మన సహోదరుల యెడల, పెద్దల యెడల మనమెందుకు మిక్కుటమైన అనురాగాన్ని కలిగివుండాలి?
[15వ పేజీలోని చిత్రం]
సహోదర అనురాగానికి విశ్వాసాన్ని మరియు ఇతర క్రైస్తవ లక్షణాలను అమర్చుకొనుమని అపొస్తలుడైన పౌలు తన సహోదరులను కోరాడు