కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతతో జీవించడం
    తేజరిల్లు!—1997 | మార్చి 8
    • నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతతో జీవించడం

      ఆరు సంవత్సరాల డేవిడ్‌కి రోజు మొత్తంలో కథలు వినే సమయమే చాలా ఇష్టం. వాడి తల్లి వాడికి చదివి వినిపిస్తున్నప్పుడు చాలా ఆనందిస్తాడు, తాను విన్నది జ్ఞాపకముంచుకోవడంలో వాడికి ఏ కష్టమూ లేదు. కానీ డేవిడ్‌కి ఒక సమస్య ఉంది. వాడు తనకు తానుగా చదవలేడు. నిజానికి, దృష్టి అవసరమయ్యే ఎటువంటి పనియైనా వాడికి బాధను కల్గిస్తుంది.

      సారా అనే పాప స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టి మూడు సంవత్సరాలయ్యింది, అయినా ఆమె వ్రాత చాలా వంకరటింకరగా ఉంటుంది. ఆమె వ్రాసే అక్షరాల ఆకృతి సరిగా ఉండదు, వాటిలో కొన్నింటిని ఆమె తిరగవేసి వ్రాస్తుంది. తన తలిదండ్రుల చింతను ఎక్కువచేసేదేమంటే సారా తన స్వంత పేరు వ్రాయడంలోనే కష్టాన్ని అనుభవించడం.

      జాష్‌ టీనేజ్‌లో ఉన్న ఒక యౌవనుడు, స్కూలులో లెక్కలు తప్పించి మిగతా సబ్జెక్టులన్నీ బాగా చదువుతాడు. లెక్కలను గూర్చి ఆలోచిస్తేనే ఆయనకు తలతిరిగిపోతుంది. అంకెల్ని చూస్తే జాష్‌కు కోపం వస్తుంది, ఆయన తన లెక్కల హోమ్‌వర్కును చేయడానికి కూర్చున్నప్పుడు చాలా త్వరగా ఆయన మూడ్‌ పాడౌతుంది.

      డేవిడ్‌, సారా, జాష్‌లకి ఏమయ్యింది? వాళ్లు కేవలం బద్ధకంగానూ, మొండిగానూ, బహుశ మానసికంగా మందులుగానూ ఉన్నారా? ఎంతమాత్రం కాదు. ఈ పిల్లలందరూ సాధారణ తెలివితేటలో లేదా అసాధారణమైన తెలివితేటలో గలవారే. అయినా, ఒక్కొక్కరిని నేర్చుకోవడానికి సంబంధించిన ఒక్కొక్క అశక్తత నిరోధిస్తోంది కూడానూ. డేవిడ్‌ డిస్‌లెక్జియాతో బాధపడుతున్నాడు, చదవడానికి సంబంధించిన అనేక సమస్యలకు ఆ పదం అన్వయింపబడుతుంది. సారా వ్రాయడంలో ఎదుర్కునే తీవ్రమైన కష్టాన్ని డిస్‌గ్రాఫియా అంటారు. గణితశాస్త్రంలోని మౌలిక భావనల్ని ఆకళింపు చేసుకోవడంలో జాష్‌కివున్న అశక్తత డిస్‌కాల్‌క్యులియా అని పిలువబడుతుంది. ఇవి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతల్లో కేవలం మూడు మాత్రమే. ఇంకా ఎన్నోవున్నాయి, అవన్నీ కలిసి అమెరికాలోని కనీసం 10 శాతంమంది పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు.

      నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతల నిర్వచనం

      నిజమే, అప్పుడప్పుడు యౌవనుల్లో చాలామంది నేర్చుకోవడం అనేది సవాలుగా ఉన్నట్లు కనుగొంటారు. అయితే, సాధారణంగా వారికి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఒకటి ఉందని ఇది సూచించదు. దానికి బదులుగా, నేర్చుకోవడంలో పిల్లలందరికీ వివిధ సామర్థ్యాలూ, బలహీనతలూ ఉంటాయని చూపిస్తోంది అంతే. కొంతమందికి వినికిడి చాలా శక్తిమంతంగా ఉంటుంది; వారు వినడం ద్వారా సమాచారాన్ని చక్కగా గ్రహించగల్గుతారు. ఇతరులకు దృశ్యాలు చూడడం ఆనందకరంగా ఉంటుంది; వారు చదవడం ద్వారా బాగా నేర్చుకోగలరు. అయితే, స్కూల్లో విద్యార్థులందరూ ఒక తరగతిగదిలో ఒక్క గుంపుగా చేర్చబడతారు, మరి ఎటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించినప్పటికీ అందరూ నేర్చుకుంటారని అపేక్షించబడుతుంది. అందువలన, నేర్చుకునే విషయంలో కొందరికి తప్పకుండా సమస్యలుంటాయి.

      అయితే, కొంతమంది అధికారుల ప్రకారం, సామాన్యంగా ఉండే నేర్చుకోవడానికి సంబంధించిన సమస్యలకూ, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలకూ తేడావుంది. నేర్చుకోవడానికి సంబంధించిన సమస్యల్ని ఓర్పుతోనూ, ప్రయత్నంతోనూ అధిగమించవచ్చని వివరించబడుతుంది. దానికి విరుద్ధంగా, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు మరింత లోతుగా పాతుకుపోయివుంటాయని చెప్పబడుతుంది. “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న పిల్లవాని మెదడు, కొన్ని రకాలైన మానసిక పనుల్ని గ్రహించడంలోనూ, ప్రక్రియలో పెట్టడంలోనూ, లేక గుర్తుంచుకోవడంలోనూ తప్పు పద్ధతిలో పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది” అని డా. పాల్‌ వెండర్‌, డా. ఎస్తేర్‌ వెండర్‌లు వ్రాస్తున్నారు.a

      అయినప్పటికీ, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉండడమంటే పిల్లవాడు మనోవైకల్యం గలవాడని అర్థంకాదు. దీన్ని వివరించడానికి, పాల్‌ వెండర్‌, ఎస్తేర్‌ వెండర్‌లు సంగీత స్వరాల్లో భేదాల్ని గుర్తించలేని ప్రజలైన సంగీత-బధిరులతో ఒక సామ్యాన్ని చూపించారు. “సంగీత-బధిరులంటే మెదడుకు హానికల్గినవారు కాదు, వారి వినికిడిలో ఏ లోపమూ లేదు” అని పాల్‌ వెండర్‌, ఎస్తేర్‌ వెండర్‌లు వ్రాస్తున్నారు. “వారు బద్ధకం మూలాన, బోధన సరిగ్గా పొందకపోవడం మూలాన, లేక సరైన ప్రేరణ లేకపోవడం మూలాన సంగీత బధిరులుగా అయ్యారని ఎవరూ అనరు.” నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్నవారి విషయం కూడా అంతే అని వారు అంటున్నారు. తరచూ, వారికెదురయ్యే కష్టం నేర్చుకోవడంలోని ఒక్క అంశంపై కేంద్రీకరించబడివుంటుంది.

      నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న చాలామంది పిల్లలకు సాధారణ తెలివితేటలో లేదా అసాధారణమైన తెలివితేటలో ఎందుకు ఉంటాయో దీన్నిబట్టి అర్థమౌతుంది; నిజానికి, కొంతమందికి అసామాన్యమైన తెలివితేటలుంటాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పించే ఈ వాస్తవం నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉండవచ్చని వైద్యులు అనుకునేందుకు దోహదపడుతుంది. నా పిల్లవాడు స్కూల్లో ఎందుకు కష్టాన్ని అనుభవిస్తున్నాడు? (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడు, అపేక్షించబడుతున్న స్థాయికన్నా తన వయస్సుకూ, తన నిర్ధారిత ఐక్యూకూ రెండు లేక మూడు సంవత్సరాలు తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాడు.” వేరే మాటల్లో చెప్పాలంటే, పిల్లవాడు తన తోటివారి స్థాయికి సమానంగా ఉండడంలో కష్టాన్ని అనుభవిస్తున్నాడనేదే కాదు అసలు సమస్య. బదులుగా, అతడు కనపర్చే నైపుణ్యం తన స్వంత సామర్థ్యానికే సమానమైనది కాదన్నదే అసలైన సమస్య.

      అవసరమైన సహాయాన్ని అందించడం

      నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతవల్ల వచ్చే భావోద్రేక ప్రభావాలు తరచూ సమస్యను మరింత జటిలంచేస్తాయి. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న పిల్లలు స్కూలులో సరిగా చదవకపోతే వారి ఉపాధ్యాయులూ, తోటిపిల్లలూ, చివరికి బహుశ తమ స్వంత కుటుంబంలోని వారూ వారిని మొద్దులుగా పరిగణించవచ్చు. విషాదకరంగా, అటువంటి పిల్లల్లో చాలామంది తమ గురించి తాము ప్రతికూల అభిప్రాయాలు ఏర్పర్చుకుంటారు, ఇవి వారు పెరుగుతుండగా వారిలో ఆలాగే ఉండిపోగలవు. ఇది యుక్తమైన చింతే, ఎందుకంటే సాధారణంగా నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు పోవు.b “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు అనేవి జీవితాంతం ఉండే అశక్తతలు” అని డా. లారీ బి. సిల్‌వర్‌ వ్రాస్తున్నాడు. “చదవడంలో, వ్రాయడంలో, గణితశాస్త్రంలో జోక్యంచేసుకునే అశక్తతలే క్రీడలూ, మరితర కార్యకలాపాలూ, కుటుంబజీవితమూ, స్నేహితులతో ఆహ్లాదకరమైన సంబంధాలూ వంటివాటిలో కూడా జోక్యంచేసుకుంటాయి.”

      అందువలన, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలు తలిదండ్రుల సానుభూతిపూర్వకమైన మద్దతును పొందడం ప్రాముఖ్యం. “తమ తలిదండ్రులు తమకు బలమైన మద్దతునిస్తారని తెల్సిన పిల్లలకు, తాము ప్రతిభావంతులనే ఒక విధమైన భావాన్నీ, ఆత్మగౌరవాన్నీ పెంపొందించుకోవడానికి ఒక ఆధారముంటుంది” అని నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడిని పెంచడం (ఆంగ్లం) అనే పుస్తకం అంటుంది.

      కానీ మద్దతునిచ్చేవారిగా ఉండాలంటే, తలిదండ్రులు తమ స్వంత భావాలను మొదట పరీక్షించుకోవాలి. తమ పిల్లల పరిస్థితికి ఏదోవిధంగా తామే నిందార్హులన్నట్లు కొంతమంది తలిదండ్రులకు అపరాధ భావన కలుగుతుంది. ఇతరులు తమ ముందున్న సవాళ్లవలన ముంచెత్తబడుతున్నట్లుగా భావించి ఖంగారుపడతారు. ఈ రెండు ప్రతిక్రియలూ సహాయకరమైనవి కావు. అవి తలిదండ్రులను కదలకుండా కట్టిపడవేసినట్లుగా చేసి, పిల్లవాడు తనకు అవసరమైన సహాయాన్ని పొందకుండా వాడిని నిరోధిస్తాయి.

      అందువలన నిపుణుడైన ఒక స్పెషలిస్టు మీ పిల్లవానికి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉందని నిర్ధారిస్తే నిరాశ చెందవద్దు. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకు నేర్చుకునే ఒకానొక నైపుణ్యంలో కాస్త అదనపు మద్దతు మాత్రమే అవసరమనేది గుర్తుంచుకోండి. మీ ప్రాంతంలో నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకొరకైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని గురించి తెలుసుకోవడానికి సమయం వెచ్చించండి. అటువంటి పరిస్థితులతో వ్యవహరించడంలో చాలా స్కూళ్లు సంవత్సరాల క్రితంకంటే ఇప్పుడు ఎక్కువ సంసిద్ధంగా ఉన్నాయి.

      మీ పిల్లవాడు ఏదైనా సాధించినప్పుడు, అది ఎంత చిన్నదైనప్పటికీ దానిగురించి మీరు వాణ్ణి మెచ్చుకోవాలని నిపుణులు నొక్కిచెబుతున్నారు. ప్రశంసించడంలో ఔదార్యాన్ని కనపర్చండి. అదే సమయంలో, క్రమశిక్షణను అలక్ష్యం చేయకండి. పిల్లలకు సరైన వ్యవస్థీకరణ అవసరం, మరి నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లల విషయంలో ఇది మరింత వాస్తవం. మీ పిల్లవానినుండి మీరు ఏమి ఆశిస్తున్నారో మీ పిల్లవానికి తెలియనియ్యండి, మీరు పెట్టిన ప్రమాణాలకు వాడు కట్టుబడివుండేలా చూడండి.

      చివరిగా, మీ పరిస్థితిని వాస్తవికంగా దృష్టించేందుకు నేర్చుకోండి. నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తత ఉన్న ఒక పిల్లవాడిని పెంచడం అనే పుస్తకం దాన్నిలా దృష్టాంతపరుస్తుంది: “మీకిష్టమైన రెస్టారెంటుకు వెళ్లి తందూరీ చికెన్‌కొరకు ఆర్డరు ఇచ్చారని ఊహించుకోండి. వెయిటర్‌ ప్లేటును మీ ముందు పెట్టినప్పుడు అవి మటన్‌ ముక్కలు అని మీరు గ్రహిస్తారు. రెండూ రుచికరమైన వంటకాలే, కానీ మీరేమో తందూరీ చికెన్‌ కొరకు ఎదురుచూస్తూవున్నారు. చాలామంది తలిదండ్రులు తమ ఆలోచనలో మార్పు చేసుకోవలసి ఉంటుంది. మీరు మటన్‌ కొరకు సిద్ధపడివుండకపోవచ్చు, కానీ దాని రుచి అద్భుతంగా ఉందని మీరు కనుగొంటారు. ప్రత్యేక ఆవశ్యకతలున్న పిల్లలను పెంచుతున్నప్పుడూ విషయం అదే.”

  • “కదలకుండా కూర్చుని అవధానం నిల్పు!”
    తేజరిల్లు!—1997 | మార్చి 8
    • “కదలకుండా కూర్చుని అవధానం నిల్పు!”

      అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో జీవించడం

      “ఇంతకాలమూ, కాల్‌ గారాబంవల్ల చెడిపోయిన పిల్లవాడు మాత్రమేననీ, మనం —అంటే నేనని అసలు అర్థం—క్రమశిక్షణలో పెడితే వాడు దారిలోకొస్తాడనీ జిమ్‌ అంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ డాక్టరు తప్పు నాది కాదనీ, మాది కాదనీ, కాల్‌ అధ్యాపకులదీ కాదనీ చెబుతున్నాడు: మా చిన్ని అబ్బాయిలో నిజంగా ఏదో లోపం ఉంది.”

      అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)తో కాల్‌ బాధపడుతున్నాడు, ఈ పరిస్థితిలో అవధానలోపం, అనాలోచిత ప్రవర్తన, హైపర్‌యాక్టివిటీ వంటివి ప్రదర్శితమౌతాయి. ఈ రుగ్మత స్కూలుకెళ్లే వయస్సున్న పిల్లల్లో 3 నుండి 5 శాతం పిల్లల్ని ప్రభావితం చేస్తుందని అంచనా. “వారి మెదళ్లు ఛానెల్‌ను ఎంచుకునే పరికరాల్లో లోపాలున్న టీవీ సెట్లవంటివి” అని నేర్చుకునే రంగంలో నిపుణురాలైన ప్రిసిల్లా ఎల్‌. వేల్‌ అంటుంది. “ఎటువంటి వ్యవస్థీకరణా లేదా క్రమశిక్షణా లేకుండా ఒక ఆలోచన మరో ఆలోచనకు నడుపుతుంది.”

      మనం ADHDకున్న మూడు ప్రధాన లక్షణాలను క్లుప్తంగా పరిశీలిద్దాము.

      అవధానలోపం: ADHD ఉన్న పిల్లవాడు అనవసరమైన వివరాలను వదిలిపెట్టి, ఒకే అంశంపై కేంద్రీకరించలేడు. అందువలన, బాహ్య దృశ్యాలూ, శబ్దాలూ, వాసనలూ సులభంగా అతడి అవధానాన్ని మళ్లిస్తాయి.a అతడు అవధానాన్ని కనపరుస్తున్నాడు, కానీ తన చుట్టూవున్నవాటిలో నిర్దిష్టమైన ఏ ఒక్క అంశమూ అతని అవధానాన్ని ఆకర్షించదు. తాను ప్రధానంగా ఏ అంశానికి అవధానాన్నివ్వాలో అతడు నిర్ధారించుకోలేడు.

      అనాలోచిత ప్రవర్తన: ADHDవున్న పిల్లవాడు తానేదైనా చేసేముందు ఆలోచించడు, దాని పరిణామాల గురించీ పట్టించుకోడు. అతనికి సరైన ప్రణాళిక ఉండదు, సరైన వివేచనా చూపించడు, మరి కొన్నిసార్లు అతని చర్యలు ప్రమాదకరంగా ఉంటాయి. “అతడు వీధిలోకి పరుగెడతాడు, కిటికీ అంచులపైకీ, చెట్లమీదికీ ఎక్కుతాడు” అని డా. పాల్‌ వెండర్‌ వ్రాస్తున్నాడు. “దాని ఫలితంగా అతడు తన వంతు గాయాలూ, దెబ్బలూ, పుండ్లూ కంటే ఎక్కువే అనుభవించాల్సివస్తుంది, డాక్టరు దగ్గరికి ఎక్కువసార్లు వెళ్లాల్సివస్తుంది.”

      హైపర్‌యాక్టివిటీ: అతిచురుకుగావుండే (హైపర్‌యాక్టివ్‌) పిల్లలు ఎప్పుడూ అవిశ్రాంతంగా కదులుతూనే ఉంటారు. వారు కదలకుండా కూర్చోలేరు. “వారు పెద్దవారయ్యాక కూడా, జాగ్రత్తగా పరిశీలిస్తే వారి కాళ్లూ, పాదాలూ, చేతులూ, అరచేతులూ, పెదాలూ లేదా నాలుకా వంటివి ఎప్పుడూ ఏదోకరకంగా కదులుతూనేవుంటాయని తెలుస్తుంది” అని డా. గోర్డన్‌ సెర్‌ఫోన్‌టైన్‌ తన పుస్తకమైన దాగివున్న వైకల్యతలో (ఆంగ్లం) వ్రాశాడు.

      అయితే, అవధానలోపంతోనూ, అనాలోచితంగానూ ఉండే పిల్లల్లో కొంతమంది అతిచురుకుగా ఉండరు. వారి రుగ్మత కొన్నిసార్లు అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌, లేదా ADD అని మాత్రం పిలువబడుతుంది. ADD అనేది “హైపర్‌యాక్టివిటీ అసలు ఏమాత్రం లేకుండానే రావచ్చు. లేక అది గమనార్హంగానూ, చిరాకు కల్గించేదిగానూ, పూర్తి అశక్తతతోనూ—ఏ మోతాదులోని హైపర్‌యాక్టివిటీతోనైనా రావచ్చు” అని డా. రానల్డ్‌ గోల్డ్‌బర్గ్‌ వివరిస్తున్నాడు.

      ADHDని కలుగజేసేదేమిటి?

      సంవత్సరాలుగా, అవధాన సమస్యలకు పెంపకం సరిగ్గా లేకపోవడంనుండి మొదలుకొని ఫ్లోరోసెంట్‌ లైటింగ్‌ వరకు అన్నింటినీ నిందించారు. మెదడు పనిచేసే కొన్ని విధానాలలో అలజడుల మూలంగా ADHD వస్తుందని ఇప్పుడు తలంచబడుతుంది. 1990లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, ADHD లక్షణాలు ఉన్న 25 మంది వ్యక్తులకు పరీక్షలు జరిపింది. వారిలో కదలికనూ, అవధానాన్ని నియంత్రించే మెదడులోని ఆ ప్రాంతాల్లోనే గ్లూకోజు విషయంలో చాలా నెమ్మదిగా జీవప్రక్రియ జరుగుతుందని కనుగొంది. 40 శాతం ADHD కేసుల్లో వ్యక్తియొక్క జన్యు నిర్మాణం ఒక పాత్రను పోషిస్తున్నట్లుగా కనబడుతుంది. ద హైపర్‌యాక్టివ్‌ చైల్డ్‌ బుక్‌ అనే పుస్తకం ప్రకారం, ADHDతో జతచేయగల్గే ఇతర కారకాల్లో గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి మద్యపానీయాలు లేక మాదకద్రవ్యాలు వినియోగించడమూ, పిల్లవానికి లెడ్‌ పాయిజనింగ్‌ జరగడమూ, మరి కొన్ని కేసుల్లో ఆహార నియమాలూ ఉన్నాయి.

      ADHDవున్న కౌమారదశలోని పిల్లవాడు, యుక్తవయస్కుడు

      ADHD అనేది కేవలం బాల్యంలో మాత్రమే ఉండే స్థితి కాదని ఇటీవలి సంవత్సరాల్లో వైద్యులు కనుగొన్నారు. “చికిత్సకొరకు పిల్లవాడిని తీసుకువచ్చి, ‘నా చిన్నప్పుడు నేనూ అలాగే ఉండేవాడిని’ అని తలిదండ్రులు అనడం చాలా తరచుగా జరుగుతుంది. క్యూలో నిలబడడమూ, కూటాల్లో నిలకడగా కూర్చోవడమూ, మొదలుపెట్టిన పనిని ముగించడమూ వంటి విషయాల్లో తమకు ఇప్పటికీ సమస్యలున్నాయని వారు ఒప్పుకుంటారు” అని డా. లారీ సిల్వర్‌ అంటున్నాడు. ADHDవున్న పిల్లలందర్లో దాదాపు సగంమంది తమ లక్షణాల్లో కనీసం కొన్నింటిని కౌమారదశలోనికీ తర్వాత యుక్తవయస్సులోనికీ తీసుకువెళ్తారని ఇప్పుడు నమ్మబడుతుంది.

      కౌమారదశలో, ADHD ఉన్నవారు ప్రమాదకరమైన ప్రవర్తనగలవారి నుండి నేరప్రవృత్తిగలవారిగా మారగలరు. ADHDవున్న కౌమారదశలోని ఒకరి తల్లి, “వాడికి కాలేజీకి వెళ్లే యోగ్యత ఉండదేమోనని నేను కలవరపడేదాన్ని” అని అంటుంది, “ఇప్పుడు వాడు జైలుకెళ్లకుండా ఉంటే చాలు అని నేను ప్రార్థిస్తున్నాను.” అటువంటి భయాలు యుక్తమైనవై ఉండవచ్చనే విషయం, 103 హైపర్‌యాక్టివ్‌ యౌవనులతో అటువంటి రుగ్మతలు లేని 100 మందివున్న ఒక కంట్రోల్‌ గుంపును పోల్చిన ఒక అధ్యయనంలో వెల్లడి అయింది. “20వ పడి మొదలయ్యేసరికి, హైపర్‌యాక్టివ్‌ గుంపులోని పిల్లలకు రెండు రెట్లు ఎక్కువగా అరెస్టు రికార్డులు ఉండే సాధ్యతా, ఐదు రెట్లు ఎక్కువగా ఘోరాపరాధిగా శిక్షపొందే సాధ్యతా, తొమ్మిది రెట్లు ఎక్కువగా కారాగార శిక్షను అనుభవించే సాధ్యతా ఉంది” అని న్యూస్‌వీక్‌ నివేదిస్తుంది.

      ADHD ఒక యుక్తవయస్కునికి విశేషమైన సమస్యలను ముందుంచుతుంది. డా. ఎడ్నా కోప్‌లాండ్‌ ఇలా అంటుంది: “ఒక హైపర్‌యాక్టివ్‌ అబ్బాయి పెద్దయ్యాక ఉద్యోగాలను చాలా తరచుగా మార్చేవానిగా, ఎప్పుడూ ఉద్యోగం పోగొట్టుకునేవానిగా, రోజంతా వృథాగా కాలాన్ని వెళ్లబుచ్చేవానిగా, అవిశ్రాంతంగా తయారవ్వగలడు.” దీనికి కారణం అర్థం కానప్పుడు ఈ లక్షణాలు వివాహజీవితంలోని ఆనందాన్ని పీల్చివేయగలవు. “మామూలు సంభాషణల్లో నేను చెబుతున్నదాన్నంతటినీ అతడు కనీసం వినను కూడా వినడు. ఆయనెప్పుడూ ఎక్కడో ఉంటాడన్నట్లుగా ఉంటుంది” అని ADHD ఉన్న ఒక వ్యక్తి భార్య అంటుంది.

      నిజమే, ఈ లక్షణాలు చాలామందిలో కనీసం కొంత మోతాదులో అయినా సాధారణంగా ఉంటాయి. “ఈ లక్షణాలు ఎప్పుడూ ఉంటూవచ్చాయా అని మీరు కనుక్కోవాలి” అని డా. జార్జ్‌ డోరి అంటున్నాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఉద్యోగం పోయినప్పటి నుండి మాత్రమే మతిమరపుతో ఉన్నట్లైతే, లేక తన భార్యకు ఒక బాబు పుట్టినప్పటినుండి మాత్రమే అలా ఉన్నట్లైతే అది ఒక రుగ్మత కాదని అతడు అంటున్నాడు.

      అంతేగాక, ఎవరికైనా నిజంగానే ADHD ఉంటే, ఈ లక్షణాలు సర్వవ్యాపితంగా ఉంటాయి—అంటే ఆ వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక తెలివైన, శక్తిమంతమైనవాడైన 38 సంవత్సరాల గారీ కేసు అలాంటిదే, అతడు అవధానం కోల్పోకుండా ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోతున్నట్లుగా ఉంటాడు. అతడు ఇప్పటికే 120 కన్నా ఎక్కువ ఉద్యోగాలు చేశాడు. “నేను ఏమాత్రం సఫలీకృతుడను కాలేనన్న వాస్తవాన్ని నేను ఇప్పటికే అంగీకరించేశాను” అన్నాడాయన. కానీ గారీ, అలాగే చాలామంది—పిల్లలూ, యౌవనులూ, పెద్దలూ—ADHDని ఎదుర్కోవడానికి సహాయాన్ని పొందారు. ఎలా?

      [అధస్సూచీలు]

      a అమ్మాయిలకన్నా ఎక్కువగా అబ్బాయిలు దీని వలన ప్రభావితమౌతారు గనుక మేము బాధితున్ని పురుష లింగముతో సంబోధిస్తున్నాము.

  • సవాలును ఎదుర్కోవడం
    తేజరిల్లు!—1997 | మార్చి 8
    • సవాలును ఎదుర్కోవడం

      సంవత్సరాలుగా ADHD కొరకు ఎన్నో రకాల చికిత్సలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో కొన్ని ఆహార నియమాలపై కేంద్రీకరించబడ్డాయి. అయితే, తిండి పదార్థాల్లో కలిపే మిశ్రమాలు సాధారణంగా హైపర్‌యాక్టివిటీనీ కలుగజేయవనీ, పోషక సంబంధ పరిష్కారాలు తరచూ ప్రభావరహితంగా ఉన్నాయనీ కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మందులు తీసుకోవడం, ప్రవర్తనా పరివర్తన, దీన్ని గూర్చిన జ్ఞానాన్ని అందిస్తూ శిక్షణనివ్వడం వంటివి ADHDకి చికిత్స చేసే ఇతర పద్ధతులు.a

      మందులు. స్పష్టంగా ADHDలో మెదడు సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఇమిడివుంది గనుక, సరైన రసాయనిక సమతౌల్యాన్ని పునఃస్థాపించడానికి మందులు తీసుకోవడం అనేకమందికి సహాయకరంగా ఉన్నట్లు రుజువైంది.b అయితే, మందులు తీసుకోవడం అనేది నేర్చుకోవడంయొక్క స్థానాన్ని ఆక్రమించదు. అది క్రొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక పునాదిని వేస్తూ పిల్లవాడు కేవలం తన అవధానాన్ని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.

      ADHDవున్న చాలామంది పెద్దవారు అదేవిధంగా మందులద్వారా సహాయం పొందారు. అయినా, ADHDకి చికిత్స చేయడానికి ఉపయోగించబడే కొన్ని ప్రేరేపక మందులు వ్యసనంగా తయారయ్యేవిగా ఉండగలవు గనుక యౌవనులూ, పెద్దలూ జాగ్రత్తగా ఉండడం మంచిది.

      ప్రవర్తనా పరివర్తన. ఒక పిల్లవానికి ADHD ఉండడం క్రమశిక్షణనివ్వాల్సిన బాధ్యతనుండి వాని తలిదండ్రులను విముక్తులను చేయదు. ఈ విషయంలో పిల్లవానికి ప్రత్యేక అవసరతలు ఉన్నప్పటికీ, బైబిలు తలిదండ్రులను ఇలా ఉద్బోధిస్తుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6) మీ హైపర్‌యాక్టివ్‌ బిడ్డ (ఆంగ్లం) అనే తన పుస్తకంలో బార్బ్ర ఇంగర్‌సోల్‌ ఇలా అంటుంది: “ఒక తండ్రి చేతులెత్తేసి, హైపర్‌యాక్టివ్‌ పిల్లవాడు ‘విచ్చలవిడిగా’ ప్రవర్తించేందుకు విడిచిపెడితే అది వానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. వేరే పిల్లలందరిలాగానే హైపర్‌యాక్టివ్‌ పిల్లవానికి—ఒక వ్యక్తిగా ఆ పిల్లవాడి ఎడల గౌరవాన్ని ప్రదర్శిస్తూనే—నిరంతర క్రమశిక్షణ అవసరం. స్పష్టమైన పరిమితులూ, ఉచితమైన బహుమతులూ, జుర్మానాలూ అని దీనర్థం.”

      తలిదండ్రులు స్పష్టమైన నియమాలను విధించాలనీ, పిల్లవాడి ప్రవర్తనను అదుపులో పెట్టడంలో కచ్చితంగా ఉండాలనీ దీనర్థం. అంతేగాక, దైనందిన కార్యకలాపాల్లో కచ్చితమైన రోటీను ఉండాలి. ఈ పట్టికను వేసుకోవడంలో పిల్లవానికి కాస్తంత స్వేచ్ఛనివ్వాలని తలిదండ్రులు కోరుకోవచ్చు, దీనిలో హోమ్‌వర్కు, చదువులు, స్నానాలు వగైరా పనుల కొరకు సమయం ఇమిడివుంది. తర్వాత దీనిని పాటించడంలో కచ్చితంగా ఉండేలా చూడండి. దైనందిన రోటీనును అనుసరిస్తున్నారని రూఢీపర్చుకోండి. ఫై డెల్టా కప్పా ఇలా అంటుంది: “ఒక పిల్లవానికి ADD లేక ADHDవున్నట్లు వర్గీకరించబడడం అనేది, క్రమశిక్షణ పొందకుండా ఏమైనా చేయడానికి వాడిని వదిలిపెట్టివేయడానికి ఒక లైసెన్సు కాదని పిల్లవానికీ, వాని తలిదండ్రులకూ వివరించవల్సిన బాధ్యత ఫిజీషియన్లకూ, మనస్తత్వశాస్త్రజ్ఞులకూ, స్కూలు అధికారులకూ, ఉపాధ్యాయులకూ ఉంది. దానికి బదులుగా ఆ వర్గీకరణ ADD లేక ADHDవున్న పిల్లవానికి తగిన సహాయం చేయడానికి నడిపించే వివరణగా పరిగణించబడాలి.”

      జ్ఞానాన్ని అందిస్తూ శిక్షణనివ్వడం. ఇందులో తనను గురించీ, తన రుగ్మతను గురించీ తనకున్న దృష్టికోణాన్ని మార్చుకోవడానికి పిల్లవానికి సహాయం చేయడం ఇమిడి ఉంది. “అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ ఉన్నవారు తాము ఆకర్షణీయంగా, తెలివిగలవారిగా, సహృదయులుగా ఉన్నప్పటికీ ‘అసహ్యంగా, మూర్ఖులుగా, అయోగ్యులుగా’ ఉన్నట్లు భావిస్తారు” అని డా. రానల్డ్‌ గోల్డ్‌బర్గ్‌ చెబుతున్నాడు. అందువలన, ADD లేక ADHDవున్న పిల్లవాడు తన విలువను గురించిన సరైన దృక్కోణం కలిగివుండాల్సిన అవసరం ఉంది, అవధానం కనపర్చడంలో తాను పడే కష్టాలను ఎదుర్కోవచ్చని తెల్సుకోవల్సిన అవసరం ఉంది. కౌమారదశలో ఇది మరీ ప్రాముఖ్యం. ADHDవున్న పిల్లవాడు టీనేజ్‌ వయస్సుకు చేరుకునేటప్పటికి, తన తోటివారినుండీ, ఉపాధ్యాయులనుండీ, తోబుట్టువులనుండీ, బహుశ తలిదండ్రులనుండి కూడా ఎంతో విమర్శను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడాయన వాస్తవిక లక్ష్యాలను పెట్టుకుని, తనను గురించి తాను కఠినంగా కాక, ఉచితమైన విధంగా అంచనా వేసుకోవల్సిన అవసరం ఉంది.

      ADHDవున్న పెద్దలు కూడా పైనున్న చికిత్సా పద్ధతులను పాటించవచ్చు. “వయస్సు ఆధారంగా మార్పులు అవసరం, కానీ చికిత్సకు మూలాధారాలు—యుక్తమైనప్పుడు మందులు వాడడం, ప్రవర్తనా పరివర్తన, జ్ఞానాన్ని అందిస్తూ [శిక్షణనివ్వడం] వంటివి—పూర్తి జీవిత చక్రమంతటిలో సుస్థాపితమైన పద్ధతులుగా ఉండిపోతాయి” అని డా. గోల్డ్‌బర్గ్‌ వ్రాస్తున్నాడు.

      మద్దతును అందించడం

      ADHDవున్న కౌమారదశలోని ఒక వ్యక్తి తండ్రి అయిన జాన్‌, అటువంటి పరిస్థితిలో ఉన్న తలిదండ్రులతో ఇలా అంటున్నాడు: “ఈ సమస్యను గురించి మీకు సాధ్యమైనంత నేర్చుకోండి. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు చేయండి. అన్నింటికీపైగా, మీ పిల్లవాడిని ప్రేమించండి, ఆయన ఆత్మగౌరవాన్ని వృద్ధిచేయండి. ఆత్మాభిమానం కొరవడడం ఆయన స్ఫూర్తిని నాశనం చేస్తుంది.”

      ADHDవున్న పిల్లవానికి తగినంత మద్దతును ఇవ్వడానికి తలిదండ్రులు ఇద్దరూ సహకరించుకోవాలి. ADHDవున్న పిల్లవాడు “ఇంట్లో తాను ప్రేమించబడుతున్నాడనీ, ఆ ప్రేమ తన తలిదండ్రుల మధ్యనున్న ప్రేమనుండి ఉద్భవిస్తోందనీ” తెల్సుకోవాల్సిన అవసరం ఉంది అని డా. గోర్డన్‌ సెర్‌ఫోన్‌టైన్‌ వ్రాస్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.) దుఃఖకరంగా, అటువంటి ప్రేమ అన్నివేళలా ప్రదర్శించబడడం లేదు. డా. సెర్‌ఫోన్‌టైన్‌ ఇలా కొనసాగిస్తున్నాడు: “[ADHDవున్న పిల్లవాడు] ఉన్న కుటుంబంలో మామూలు కుటుంబంలో కన్నా దాదాపు మూడువంతులు ఎక్కువగా వైవాహిక వైషమ్యాలూ, విచ్ఛిన్నాలూ ఉన్నాయన్నది సుస్థాపితమైన విషయం.” అటువంటి వైషమ్యాలను నివారించడానికి, ADHDవున్న పిల్లవాడిని పెంచడంలో తండ్రి ప్రాముఖ్యమైన పాత్రను పోషించాలి. ఆ బాధ్యత కేవలం తల్లిపై మాత్రమే మోపకూడదు.—ఎఫెసీయులు 6:4; 1 పేతురు 3:7.

      కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ సన్నిహిత మిత్రులు గొప్ప మద్దతును అందించగలరు. ఎలా? “దయాపూర్వకంగా ఉండండి” అంటున్నాడు ఇంతకు ముందు పేర్కొనబడిన జాన్‌. “మీ కళ్లు చూడగలదానికన్నా లోతుగా చూడండి. పిల్లవాడిని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. తలిదండ్రులతో కూడా మాట్లాడండి. వారెలా కొనసాగగల్గుతున్నారు? వారు ప్రతిదినం సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారు?”—సామెతలు 17:17.

      క్రైస్తవ సంఘంలోని సభ్యులు ఇటు ADHDవున్న పిల్లవానికీ, అటు తలిదండ్రులకూ ఇద్దరికీ మద్దతుగా ఉండడానికి ఎంతో చేయవచ్చు. ఎలా? తాము అపేక్షించేదాని విషయమై సహేతుకంగా ఉండడం ద్వారా. (ఫిలిప్పీయులు 4:5) కొన్నిసార్లు, ADHDవున్న పిల్లవాడు భంగం కల్గించేవానిగా ఉండవచ్చు. వివేచనాయుక్తమైన తోటి విశ్వాసి, “మీరు మీ పిల్లవాడిని అదుపులో ఎందుకు పెట్టరు?” అనీ, లేక “వాడిని కాస్త క్రమశిక్షణలో ఎందుకు పెట్టరు?” అనీ నిర్దయగా వ్యాఖ్యానించడానికి బదులుగా, ADHDవున్న పిల్లవాడిని పెంచడంలో ఆ తలిదండ్రులు ప్రతిదినం ఎదుర్కోవలసివచ్చే కష్టతరమైన పనులతో ముంచెత్తబడుతున్నట్లు భావిస్తుండవచ్చని గ్రహిస్తాడు. నిజమే, పిల్లవాని భంగకరమైన ప్రవర్తనను పరిమితం చేయడానికి తలిదండ్రులు చేయగల్గినంతా చేయాలి. అయినప్పటికీ, చిరాకుతో కొరడా దెబ్బల్లాంటి మాటలు అనడానికి బదులుగా విశ్వాసగృహానికి చెందినవారు “యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి,” ‘దీవెనను’ ఇవ్వడానికి ప్రయత్నించాలి. (1 పేతురు 3:8, 9) నిజానికి, వాత్సల్యపూరితమైన తోటి విశ్వాసుల ద్వారా తరచూ దేవుడు ‘దీనులను ఆదరిస్తాడు.’—2 కొరింథీయులు 7:5-7.

      నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలూ, ADHD వంటివాటితోపాటు మానవ అపరిపూర్ణత అంతా కూడా మొదటి మానవుడైన ఆదామునుండి వారసత్వంగా వచ్చిందని బైబిలు విద్యార్థులు గ్రహిస్తారు. (రోమీయులు 5:12) పీడించే రుగ్మతలు ఇక ఎంతమాత్రం ఉనికిలో ఉండని నీతియుక్త నూతన లోకాన్ని తాను తీసుకువస్తాడనే తన వాగ్దానాన్ని సృష్టికర్త అయిన యెహోవా నెరవేరుస్తాడని కూడా వారికి తెలుసు. (యెషయా 33:24; ప్రకటన 21:1-4) ADHDవంటి రుగ్మతలతో పీడించబడుతున్న వారికి ఈ హామీ నమ్మదగినది. “మా కుమారుడు తన రుగ్మతను అర్థం చేసుకోవడానికీ, దానితో సరైన విధంగా వ్యవహరించడానికీ వయస్సు, శిక్షణ, అనుభవం సహాయం చేస్తున్నాయి” అంటున్నాడు జాన్‌. “కానీ ఈ లోక విధానంలో అతను ఎప్పటికీ పూర్తిగా స్వస్థత పొందలేడు. మాకు ప్రతిరోజూ ఆదరణపూర్వకంగా ఉండే విషయం ఏమంటే నూతన లోకంలో యెహోవా మా కుమారుని రుగ్మతను సరిచేసి, జీవితాన్ని సంపూర్తిగా ఆనందించడం అతనికి సాధ్యమయ్యేలా చేస్తాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి