కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?
    కావలికోట—1995 | అక్టోబరు 15
    • తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?

      “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.”—మత్తయి 25:31.

      1-3. న్యాయం విషయంలో ఆశాభావ దృక్పథాన్ని కల్గివుండేందుకు మనకు ఏ కారణాలున్నాయి?

      ‘అపరాధా లేక నిరపరాధా?’ కొన్ని కోర్టు కేసులను గూర్చిన నివేదికలను విన్నప్పుడు అనేకులు ఇలా ఆలోచిస్తారు. న్యాయాధిపతులూ న్యాయ నిర్ణయ సభ్యులు యథార్థంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు, కానీ సామాన్యంగా న్యాయం నిలుస్తుందా? న్యాయాన్నివ్వడంలో మీరు అన్యాయం అనుచితాలను గూర్చి వినలేదా? లూకా 18:1-8 నందున్న ఉపమానంలా అలాంటి అన్యాయం క్రొత్తేమీ కాదని మనం చూస్తాం.

      2 మానవ న్యాయం విషయంలో మీ అనుభవం ఎలావున్నా, చివరిలో యేసు చెప్పినవాటిని గమనించండి: “దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; . . . అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమ్మీద విశ్వాసము కనుగొనునా?”

      3 అవును, తన సేవకులు చివరికి న్యాయం పొందేలా యెహోవా చూస్తాడు. యేసు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇందులో ఇమిడివున్నాడు, ఎందుకంటే మనం ప్రస్తుత దుష్టవిధానంలోని “అంత్యదినములలో” జీవిస్తున్నాము కనుక. భూమ్మీదినుండి దుష్టత్వాన్ని తీసివేసేందుకు యెహోవా తన శక్తిమంతుడైన కుమారుని ఉపయోగించుకుంటాడు. (2 తిమోతి 3:1; 2 థెస్సలొనీకయులు 1:7, 8; ప్రకటన 19:11-16) మేకలూ గొఱ్ఱెల ఉపమానమని తరచు అనబడే యేసు ఇచ్చిన చివరి దృష్టాంతం నుండి ఆయన వహించే పాత్రను గూర్చి మనం జ్ఞానాన్ని పొందగలం.

      4. మేకలూ గొఱ్ఱెల ఉపమానపు సమయాన్ని గూర్చి మనం ఎలా అర్థంచేసుకున్నాము, అయితే మనం ఈ ఉపమానానికి ఎందుకు అవధానమిస్తాము? (సామెతలు 4:18)

      4 ఆ ఉపమానం యేసు 1914లో రాజుగా కూర్చుని ఆ నాటినుండి తీర్పులను—అంటే, గొఱ్ఱెల్లాంటి ప్రజలకు నిత్యజీవితం, మేకలవంటివారికి నిత్య నాశనం అని తీర్చడాన్నే సూచిస్తోందని ఎంతకాలంగానో మనం భావిస్తున్నాము. అయితే ఈ ఉపమానాన్ని పునఃపరిశీలించడం దాని సమయం మరియు అది దేన్ని దృష్టాంతపరుస్తుంది అన్న విషయాలను గూర్చి సరిచేయబడిన అవగాహనను అందిస్తుంది. ఈ క్రొత్త అవగాహన మన ప్రకటన పని ప్రాముఖ్యతను మరియు దాని ఎడల ప్రజల ప్రతిస్పందనను మరింత బలపరుస్తుంది. ఈ ఉపమానాన్ని గూర్చి అధిక అవగాహన కొరకు ఆధారాన్ని చూసేందుకు రాజులు న్యాయాధిపతులుగా యెహోవా యేసుక్రీస్తులిరువురిని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.

      సర్వోన్నత న్యాయాధిపతిగా యెహోవా

      5, 6. యెహోవాను రాజుగానూ న్యాయాధిపతిగానూ దృష్టించడం ఎందుకు సమంజసం?

      5 అన్నింటిమీద అధికారంతో యెహోవా విశ్వాన్ని పరిపాలిస్తాడు. ఆది అంతం లేకుండ ఆయన ‘సకలయుగములలో రాజు.’ (1 తిమోతి 1:17; కీర్తన 90:2, 4; ప్రకటన 15:3) ఆయన శాసనాలు లేక నియమాలు చేసి వాటిని అమలుపర్చే అధికారం గలవాడు. అయితే ఆయన అధికారంలో ఆయన ఓ న్యాయాధిపతి. యెషయా 33:22 ఇలా అంటోంది: “యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.”

      6 వాదాలూ వివాదాంశాలకు యెహోవా న్యాయాధిపతియని దేవుని సేవకులు ఎన్నడో గుర్తించారు. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱాల దుష్టత్వాలకు గల రుజువులను ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు’ పరిశీలించిన తర్వాత, దానిలో నివసించేవారు నాశనం చేయబడాలని తీర్పుతీర్చాడు మరియు ఆ నీతియుక్త తీర్పును అమలుపర్చాడు. (ఆదికాండము 18:20-33; యోబు 34:10-12) యెహోవా తన తీర్పులను ఎల్లప్పుడూ అమలుపర్చగల నీతియుక్తమైన న్యాయాధిపతియని అది మనకు కచ్చితంగా హామీనిస్తుంది!

      7. ఇశ్రాయేలుతో వ్యవహరించేటప్పుడు యెహోవా న్యాయాధిపతిగా ఎలా ప్రవర్తించాడు?

      7 ప్రాచీన ఇశ్రాయేలు నందు, కొన్నిసార్లు యెహోవా నేరుగా తీర్పుతీర్చేవాడు. ఆ నాడు ఓ పరిపూర్ణ న్యాయాధిపతి విషయాలను నిర్ణయిస్తున్నాడని తెలుసుకోవడం మీకు ఓదార్పుకరంగా ఉండి ఉండేది కాదా? (లేవీయకాండము 24:10-16; సంఖ్యాకాండము 15:32-36; 27:1-11) దేవుడు, తీర్పుతీర్చేందుకు నియమాలుగా, అన్ని విధాలా మంచివైన ‘న్యాయ విధులను’ కూడా అందించాడు. (లేవీయకాండము 25:18, 19; నెహెమ్యా 9:13; కీర్తన 19:9, 10; 119:7, 75, 164; 147:19, 20) ఆయన “అందరి న్యాయాధిపతి” కనుక అది మనందరి మీద ప్రభావం చూపుతుంది.—హెబ్రీయులు 12:23.

      8. దానియేలు ఎలాంటి యుక్తమైన దర్శనం చూశాడు?

      8 ఈ విషయాన్ని గూర్చి సాక్ష్యాన్నిస్తూ మనకు “ప్రత్యక్షసాక్షి” ఉన్నాడు. ప్రభుత్వాలకూ లేక సామ్రాజ్యాలకు సూచనయైన భయంకరమైన క్రూరమృగాల దర్శనం ప్రవక్తైన దానియేలుకు ఇవ్వబడింది. (దానియేలు 7:1-8, 17) ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా . . . ఉండెను.” (దానియేలు 7:9) దానియేలు సింహాసనాలనూ ‘మహా వృద్ధుడొకడు [యెహోవా] కూర్చుండడాన్ని’ చూశాడని గమనించండి. ‘ఇక్కడ దానియేలు దేవుడు రాజు కాబోతున్నాడనే సాక్ష్యమిస్తున్నాడా,’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

      9. సింహాసనంపై ‘కూర్చోవడం’ అంటే ఒక అర్థమేమిటి? ఉదాహరణలివ్వండి.

      9 ఎవరో సింహాసనంపై “కూర్చు”న్నారు అని మనం చదివినప్పుడు, అతను రాజు కాబోతున్నాడని మనం అనుకోవచ్చు, ఎందుకంటే బైబిలు కొన్నిసార్లు అలాంటి భాషను ఉపయోగించింది. ఉదాహరణకు: “అతడు [జిమ్రీ] సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే . . . ” (1 రాజులు 16:11; 2 రాజులు 10:30; 15:12; యిర్మీయా 33:17) మెస్సీయను గూర్చిన ఓ ప్రవచనం ఇలా చెప్పింది: “అతడు . . . సింహాసనాసీనుడై యేలును.” కాబట్టి, ‘సింహాసనాసీనుడు’ కావడం అంటే రాజుకావడం అన్నమాట. (జెకర్యా 6:12, 13) సింహాసనంపై కూర్చునేవానిగా యెహోవా వర్ణించబడ్డాడు. (1 రాజులు 22:19; యెషయా 6:1; ప్రకటన 4:1-3) ఆయన ‘యుగయుగములకు రాజు.’ అయినప్పటికీ, సర్వాధిపత్యంలో ఓ నూతన విషయాన్ని నొక్కి చెప్పాడు కనుక, మరలా తన సింహాసనంపై కూర్చుంటున్నట్లుగా ఆయన రాజు అయ్యాడని ఆయనను గూర్చి చెప్పవచ్చు.—1 దినవృత్తాంతములు 16:1, 31; యెషయా 52:7; ప్రకటన 11:15-17; 15:3; 19:1, 2, 6.

      10. ఇశ్రాయేలీయుల రాజుల ప్రాముఖ్యమైన పని ఏమిటి? ఉదహరించండి.

      10 అయితే ఇక్కడ ఓ కీలకాంశం ఉంది: ప్రాచీన రాజుల ప్రాముఖ్యమైన పని వాదాలను వినడం, తీర్పుతీర్చడం. (సామెతలు 29:14) ఇద్దరు స్త్రీలు ఒకే బిడ్డను కావాలని కోరినప్పుడు సొలొమోను ఇచ్చిన జ్ఞానయుక్తమైన తీర్పును జ్ఞాపకముంచుకోండి. (1 రాజులు 3:16-28; 2 దినవృత్తాంతములు 9:8) వారి ప్రభుత్వ కట్టడాల్లో ఒకటి ‘ఆయన తీర్పుతీర్చే సింహాసనా మంటపము,’ అది “తీర్పు మంటపము” అని కూడా పిలువబడింది. (1 రాజులు 7:7) “న్యాయము తీర్చుటకై సింహాసనములు . . . స్థాపించబడియున్నవి” అని యెరూషలేము వర్ణించబడింది. (కీర్తన 122:5) స్పష్టంగా, ‘సింహాసనంపై కూర్చోవడం’ అంటే న్యాయాధికారాన్ని అమలుపర్చడం అనే భావం కూడా ఉంది.—నిర్గమకాండము 18:13; సామెతలు 20:8.

      11, 12. (ఎ) దానియేలు 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన యెహోవా కూర్చోవడంలో ఉన్న భావమేమిటి? (బి) యెహోవా తీర్పుతీర్చేందుకు కూర్చుంటాడనేందుకు ఇతర లేఖనాలు ఎలా ధృవపరుస్తున్నాయి?

      11 ‘మహా వృద్ధుడొకడు కూర్చోవడాన్ని’ దానియేలు చూసిన ఆ సన్నివేశానికి మనమిప్పుడు మరలా వెళదాం. దానియేలు 7:10, NW ఇంకా ఇలా చెబుతోంది: “న్యాయసభ కూర్చుండగా తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరవబడెను.” అవును, లోక పరిపాలనను గూర్చి తీర్పుతీర్చేందుకూ మరియు మనుష్య కుమారుడు పరిపాలించేందుకు అర్హుడని తీర్పుతీర్చేందుకు మహా వృద్ధుడు కూర్చున్నాడు. (దానియేలు 7:13, 14) మనుష్య కుమారునితో పరిపాలించేందుకు తీర్పుతీర్చబడినవారిని ‘మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చె’ను అని మనం చదువుతాము. (దానియేలు 7:22) చివరికి ‘న్యాయసభ కూర్చుని’ చివరి ప్రపంచాధిపత్యంపై ప్రతికూల తీర్పును తీర్చింది.—దానియేలు 7:26 NW.a

      12 కాబట్టి, దేవుడు ‘సింహాసనంపై కూర్చుని’ ఉండడాన్ని దానియేలు చూడడం ఆయన తీర్పుతీర్చేందుకు వస్తున్నాడన్న భావాన్ని కల్గివుంది. దానికి ముందు దావీదు ఇలా పాడాడు: “నీవు [యెహోవా] నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు.” (కీర్తన 9:3, 7) మరి యోవేలు ఇలా వ్రాశాడు: “నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను [యెహోవా] యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను.” (యోవేలు 3:12; యెషయా 16:5ను పోల్చండి.) యేసు మరియు పౌలు, వాదాన్ని వినేందుకు ఓ మానవుడు కూర్చుని తీర్పుతీర్చిన పరిస్థితుల్లో ఉన్నారు.b—యోహాను 19:12-16; అపొస్తలుల కార్యములు 23:3; 25:6.

      యేసు స్థానం

      13, 14. (ఎ) యేసు రాజు అవుతాడనేందుకు దేవుని ప్రజలకు ఏ అభయముండెను? (బి) యేసు సింహాసనంపై ఎప్పుడు కూర్చున్నాడు మరియు ఆయన సా.శ. 33 నుండి ఆయన ఏ భావంలో పరిపాలించడం ప్రారంభించాడు?

      13 యెహోవా రాజు మరియు న్యాయాధిపతి. మరి యేసు విషయమేమిటి? ఆయన జననాన్ని ప్రకటించిన దూత ఇలా చెప్పాడు: “ప్రభువైన [“యెహోవా,” NW] దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. . . . ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) దావీదు రాజరికానికి యేసే శాశ్వత వారసుడు. (2 సమూయేలు 7:12-16) ఆయన పరలోకంనుండి పరిపాలిస్తాడు, ఎందుకంటే దావీదు ఇలా చెప్పాడు: “ప్రభువు నా ప్రభువుతో [యేసుతో] సెలవిచ్చినవాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.”—కీర్తన 110:1-4.

      14 అది ఎప్పుడు జరుగుతుంది? మానవునిగా ఉన్నప్పుడు యేసు రాజుగా పరిపాలించలేదు. (యోహాను 18:33-37) సా.శ. 33లో ఆయన మరణించాడు, పునరుత్థానమయ్యాడు, పరలోకానికి వెళ్లాడు. హెబ్రీయులు 10:12 ఇలా చెబుతోంది: “ఈయన . . . పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి . . . దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.” యేసుకు ఏ అధికారముంది? “సమస్తమైన అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, . . . ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున [దేవుడు] కూర్చుండబెట్టుకొనియున్నాడు.” (ఎఫెసీయులు 1:20-22) ఎందుకంటే అప్పుడు యేసుకు క్రైస్తవులపై రాజ్యాధికారం ఉండేది కనుకనే, యెహోవా “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను” అని పౌలు వ్రాయగల్గాడు.—కొలొస్సయులు 1:13; 3:1.

      15, 16. (ఎ) సా.శ. 33 నందు యేసు దేవుని రాజ్యపు రాజు కాలేదని ఎందుకు చెబుతాము? (బి) దేవుని రాజ్యంలో యేసు పరిపాలనను ఎప్పుడు ప్రారంభించాడు?

      15 అయితే ఆ సమయంలో, జనాంగాలపై యేసు రాజుగాగానీ లేక న్యాయాధిపతిగాగానీ పనిచేయలేదు. దేవుని రాజ్యంలో రాజుగా పనిచేసేందుకు ఎదురుచూస్తూ ఆయన దేవుని ప్రక్కన కూర్చున్నాడు. పౌలు ఆయనను గూర్చి ఇలా వ్రాశాడు: “నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?”—హెబ్రీయులు 1:13.

      16 యేసు వేచివుండే కాలం, అదృశ్యపరలోకంలో ఆయన దేవుని రాజ్యానికి పాలకుడైన 1914 నందు అంతమైందనేందుకు యెహోవాసాక్షులు ఎంతో రుజువును ప్రచురించారు. ప్రకటన 11:15, 18 ఇలా చెబుతోంది: “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలును.” “జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను.” అవును, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్యాలు ఒకదానిపై మరియొకటి కోపాన్ని కనపర్చాయి. (లూకా 21:24) 1914 నుండి మనం చూసిన యుద్ధాలూ భూకంపాలూ తెగుళ్లు ఆహారకొరతలూ మరియు అలాంటి సంఘటనలూ నేడు యేసు దేవుని రాజ్యమందు పరిపాలిస్తున్నాడని మరియు లోకాంతం సమీపంలో ఉందని నిశ్చయపరుస్తున్నాయి.—మత్తయి 24:3-14.

      17. ఇంతవరకు మనం ఏ ప్రాముఖ్యమైన విషయాలను స్థాపించాము?

      17 ఓ క్లుప్తమైన పునఃసమీక్ష: దేవుడు రాజుగా సింహాసనంపై కూర్చున్నాడని, కానీ మరో భావంలో ఆయన సింహాసనంపై తీర్పుతీర్చేందుకు కూర్చొనగలడని చెప్పవచ్చును. సా.శ. 33 నందు యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మరి ఇప్పుడు ఆ రాజ్యానికి ఆయన రాజు. అయితే ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్న యేసు న్యాయాధిపతిగా కూడా సేవచేస్తాడా? ప్రత్యేకంగా ఈ సమయంలో మనం అందులో ఎందుకు ఆసక్తిని కల్గివుండాలి?

      18. యేసు కూడా న్యాయాధిపతి అవుతాడనేందుకు ఏ రుజువుంది?

      18 న్యాయాధిపతులను నియమించే హక్కుగల యెహోవా, తన ప్రమాణాలకు సరితూగే వానిగా యేసును ఎన్నుకున్నాడు. ఆత్మీయంగా సజీవులైన ప్రజలను గూర్చి మాట్లాడినప్పుడు యేసు దీన్ని చూపాడు: “తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు.” (యోహాను 5:22) అయితే, న్యాయంలో యేసు వహించే పాత్ర అలాంటి తీర్పుకంటే ఎంతో ఉన్నతమైనది, ఎందుకంటే ఆయన మృతులకూ సజీవులకూ న్యాయాధిపతి. (అపొస్తలుల కార్యములు 10:42; 2 తిమోతి 4:1) పౌలు ఒకసారి ఇలా ప్రకటించాడు: “తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును [దేవుడు] నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”—అపొస్తలుల కార్యములు 17:31; కీర్తన 72:2-7.

      19. యేసు న్యాయాధిపతిగా కూర్చున్నాడనడం ఎందుకు సరైనది?

      19 యేసు తన మహిమాన్వితమైన సింహాసనంపై ఓ న్యాయాధిపతి యొక్క ప్రధాన పాత్రలో కూర్చుంటాడని తేల్చిచెప్పడాన్ని మనం న్యాయంగా చెప్పగలమా? అవును. యేసు అపొస్తలులతో ఇలా చెప్పాడు: “(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.” (మత్తయి 19:28) నేడు యేసు ఆ రాజ్యానికి రాజైనప్పటికీ, మత్తయి 19:28 నందు ప్రస్తావించిన అతని తదుపరి కార్యాల్లో, వెయ్యేండ్లకాలంలో సింహాసనంపై కూర్చుని తీర్పుతీర్చడం ఇమిడివుంది. ఆ సమయంలో ఆయన యావత్‌ మానవజాతికి తీర్పుతీరుస్తాడు, నీతిమంతులకూ అనీతిమంతులకు తీర్పుతీరుస్తాడు. (అపొస్తలుల కార్యములు 24:15) మన కాలాలనూ మరియు మన జీవితాలనూ సూచించే యేసు ఉపమానాల్లో ఒకదానివైపు మనం మన అవధానాన్ని మళ్లించినప్పుడు దీన్ని మనస్సులో ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది.

      ఉపమానం ఏమి చెబుతోంది?

      20, 21. మన కాలానికి సంబంధించిన దేన్ని యేసు అపొస్తలులు ఆయనను అడిగారు, మరి అది ఏ ప్రశ్నకు నడిపించింది?

      20 యేసు చనిపోవడానికి కొద్ది కాలం ముందు ఆయన అపొస్తలులు ఆయనను ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:3) ‘అంతము వచ్చే’ ముందు భూమ్మీద జరుగబోయే ప్రాముఖ్యమైన పరిణామములను గూర్చి యేసు ముందుగానే చెప్పాడు. ఆ అంతానికి కొద్ది ముందుగా, “మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట” జనాంగములు చూస్తాయి.—మత్తయి 24:14, 29, 30.

      21 అయితే, మహిమతో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆ జనాంగముల ప్రజలు ఏమి అనుభవిస్తారు? “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును” అనే మాటలతో ప్రారంభమయ్యే, మేకలూ గొఱ్ఱెల ఉపమానం నుండి మనం దాన్ని కనుగొందాము.—మత్తయి 25:31, 32.

      22, 23. మేకలూ గొఱ్ఱెల ఉపమానం, 1914 నందు నెరవేరడం ప్రారంభంకాలేదని ఏ అంశాలు సూచిస్తున్నాయి?

      22 మనం ఎంతో కాలంగా అర్థంచేసుకున్నట్లుగా, 1914 నందు యేసు రాజ్యాధికారంతో కూర్చున్నప్పటి సమయానికి ఈ ఉపమానం అన్వయించబడగలదా? మత్తయి 25:34 ఆయనను రాజు అని పేర్కొంటోంది, కనుక 1914 నందు యేసు రాజు అయినప్పటినుండి ఈ ఉపమానం సహేతుకంగా అన్వయించబడగలదు. అయితే దాని వెంటే ఆయన ఏ తీర్పునుతీర్చాడు? అది ‘అన్ని జనాంగముల’ తీర్పుకాదు. బదులుగా, “దేవుని ఇంటి”వారమని చెప్పుకునే వారిపై ఆయన అవధానం మరలుతుంది. (1 పేతురు 4:17) మలాకీ 3:1-3 ప్రకారంగా, యెహోవా దూతగా భూమ్మీది శేషించబడినవారిని న్యాయబద్ధముగా పరిశీలించేందుకు యేసు వచ్చాడు. ‘దేవుని ఇల్లు’ అని అబద్ధముగా చెప్పుకొనిన క్రైస్తవమత సామ్రాజ్యంపై తీర్పుకుకూడా అదే సమయం.c (ప్రకటన 17:1, 2; 18:4-8) అయితే ఆ సమయంలో లేక ఆ సమయం నుండి సమస్త జనాంగాల ప్రజలను గొర్రెలుగా లేక మేకలుగా తీర్పుతీర్చేందుకు యేసు కూర్చున్నాడని ఏదీ సూచించడంలేదు.

      23 ఉపమానంలో యేసు కార్యాలను విశ్లేషిస్తే, చివరికి సమస్త జనాంగాలకు తీర్పు తీరుస్తాడని గమనిస్తాము. అలాంటి తీర్పు, గత దశాబ్దాలుగా చనిపోతున్న వ్యక్తులను నిత్య నాశనానికి లేక నిత్య జీవానికి తీర్పుతీరుస్తున్నాడన్నట్లుగా, అలాంటి తీర్పు అనేక సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఆ ఉపమానం కనపర్చడంలేదు. ఈ ఆధునిక కాలంలో మరణించిన అనేకమంది ప్రజలు మానవజాతి సామాన్య సమాధిలోకి వెళ్లినట్లుగానే ఉంది. (ప్రకటన 6:8; 20:13) అయితే, జీవించి ఉండి తన న్యాయ తీర్పును ఎదుర్కొనే ‘సమస్త జనాంగముల’ ప్రజలకు యేసు తీర్పు తీర్చే కాలాన్ని ఈ ఉపమానం సూచిస్తుంది.

      24. మేకలూ గొఱ్ఱెల ఉపమానం ఎప్పుడు నెరవేరుతుంది?

      24 మరో మాటల్లో, మనుష్య కుమారుడు మహిమతో వచ్చేటప్పటి భవిష్యత్‌ పరిస్థితిని ఈ ఉపమానం సూచిస్తోంది. అప్పుడు జీవించి ఉన్న ప్రజలకు తీర్పు తీర్చేందుకు ఆయన కూర్చుంటాడు. వారు తమను తాము ఏమని కనపర్చుకున్నారో దాని మీద ఆయన తీర్పు ఆధారపడివుంటుంది. ఆ సమయంలో “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో” స్పష్టంగా నిర్ణయించబడుతుంది. (మలాకీ 3:1, 8) తీర్పు ప్రకటించడం మరియు దాన్ని అమలుపర్చడం పరిమిత సమయంలో జరుగుతుంది. ఆయా వ్యక్తులను గూర్చి స్పష్టమైనవాటి ఆధారంగా యేసు న్యాయవంతమైన నిర్ణయాలనిస్తాడు.—2 కొరింథీయులు 5:10 కూడా చూడండి.

      25. మత్తయి 25:31, మనుష్య కుమారుడు మహిమాన్విత సింహాసనంపై కూర్చోవడాన్ని గూర్చి మాట్లాడుటలో దేన్ని వర్ణిస్తోంది?

      25 కాబట్టి, మత్తయి 25:31 నందు ప్రస్తావించినట్లుగా, తీర్పు తీర్చేందుకు యేసు ‘తన మహిమగల సింహాసనంపై కూర్చోవడం,’ ఈ శక్తివంతమైన రాజు జనాంగములపై తీర్పును ప్రకటించి అమలుపర్చే భవిష్యత్‌ కాలానికి అన్వర్తిస్తుందని భావం. అవును, యేసు ఇమిడియున్న మత్తయి 25:31-33, 46 తీర్పు దృశ్యం నందలి దానియేలు 7వ అధ్యాయంలోని సన్నివేశానికి పోలినది, అక్కడ మహావృద్ధుడైన పరిపాలిస్తున్న రాజు న్యాయాధిపతిగా తన పాత్రను నిర్వహించేందుకు కూర్చున్నాడు.

      26. ఉపమానం యొక్క ఏ నూతన వివరణ దృష్టిలోకి వస్తోంది?

      26 మేకలూ గొఱ్ఱెల ఉపమానాన్ని ఈ విధంగా అర్థంచేసుకోవడం, మేకలూ గొఱ్ఱెల గూర్చిన తీర్పు భవిష్యత్తుకు చెందినదని సూచిస్తోంది. అది మత్తయి 24:29, 30 నందు ప్రస్తావించబడిన “మహా శ్రమ” సంభవించిన తర్వాత మరియు మనుష్య కుమారుడు ‘తన మహిమలో’ వచ్చిన తర్వాత జరుగుతుంది. (మార్కు 13:24-26 పోల్చండి.) ఆ తర్వాత, దుష్టవిధానమంతా దాని అంతానికి చేరుకున్నప్పుడు యేసు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, తీర్పును చెప్పి, దాన్ని అమలుపరుస్తాడు.—యోహాను 5:30; 2 థెస్సలొనీకయులు 1:7-10.

      27. యేసు చివరి ఉపమానాన్ని గూర్చి ఏమి తెలుసుకోవడంలో మనం ఆసక్తిని కల్గివుండాలి?

      27 మేకలూ గొఱ్ఱెలు ఎప్పుడు తీర్పుతీర్చబడతాయి అన్న విషయాన్ని చూపిస్తూ, ఇది యేసు ఉపమానం ఎప్పుడు నెరవేరుతుందన్న దాన్ని గూర్చిన అవగాహనను స్పష్టపరుస్తుంది. అయితే ఆసక్తిగా రాజ్య సువార్తను ప్రకటించేవారిని అదెలా ప్రభావితం చేస్తుంది? (మత్తయి 24:14) అది మన పనిని తక్కువ ప్రాధాన్యం గలదానిగా చేస్తుందా లేక అది మరింత భారమైన బాధ్యతను తెస్తుందా? దీని వల్ల మనమెలా ప్రభావితమౌతామన్న విషయాన్ని మనం తదుపరి శీర్షికలో చూద్దాము.

  • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?
    కావలికోట—1995 | అక్టోబరు 15
    • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?

      ‘గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును.’—మత్తయి 25:32.

      1, 2. మేకల మరియు గొఱ్ఱెల ఉపమానం మనకు ఎందుకు ఆసక్తి కల్గి ఉంచాలి?

      యేసుక్రీస్తు భూమిమీద నిశ్చయంగా ఓ మహా గొప్ప బోధకుడే. (యోహాను 7:46) ఆయన బోధించే పద్ధతుల్లో ఒకటి ఉపమానాలను లేక దృష్టాంతాలను ఉపయోగించడం. (మత్తయి 13:34, 35) ఎంతో సరళమైనవే అయినా గంభీరమైన ఆత్మీయ మరియు ప్రవచనార్థక సత్యాలను అందించేందుకు ఇవి ఎంతో శక్తివంతమైనవి.

      2 మేకలూ గొఱ్ఱెల ఉపమానంలో ప్రత్యేక సామర్థ్యంతో తాను చర్యగైకొనే సమయాన్ని గూర్చి యేసు సూచించాడు: “తన మహిమతో మనుష్యకుమారుడు . . . వచ్చునప్పుడు . . .” (మత్తయి 25:31) “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి” అన్న ప్రశ్నకు ఇచ్చిన జవాబును ఈ దృష్టాంతముతో ముగించాడు కనుక మనకు ఇది ఆసక్తికరం కావాలి. (మత్తయి 24:3) అయితే అది మన కొరకు ఏ భావాన్ని కల్గివుంది?

      3. ఆయన ప్రసంగారంభంలో మహాశ్రమ ప్రారంభమైన వెంటనే ఏ పరిణామం సంభవిస్తుందని యేసు చెప్పాడు?

      3 మహా శ్రమ ప్రారంభమైన “వెంటనే” మనం ఎదురుచూస్తున్న ప్రాముఖ్యమైన పరిణామాలు సంభవిస్తాయని యేసు ముందే చెప్పాడు. అప్పుడు “మనుష్య కుమారుని సూచన” కనిపిస్తుందని చెప్పాడు. “ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి”న “భూమిమీదనున్న సకల గోత్రముల” వారిపై అది ఎంతో ప్రభావాన్ని కల్గివుంటుంది. మనుష్య కుమారునితో ‘తన దూతలును’ ఉంటారు. (మత్తయి 24:21, 29-31)a మేకలూ గొఱ్ఱెల ఉపమానం విషయమేమిటి? ఆధునిక బైబిళ్లు దాన్ని 25వ అధ్యాయంలో పెడుతున్నాయి కానీ, అది యేసు జవాబులో భాగమే, అది ప్రభావము మహిమతో ఆయన రాకను గూర్చి మరియు “సమస్త జనుల”కు ఆయన తీర్పు తీర్చడం గూర్చి మరిన్ని వివరాలనిస్తుంది.—మత్తయి 25:32.

      ఉపమానంలోని వ్యక్తులు

      4. మేకలూ గొఱ్ఱెల ఉపమానం ప్రారంభంలో యేసును గూర్చి ఏమి ప్రస్తావించబడింది, ఇంకా ఎవరు ప్రస్తావించబడ్డారు?

      4 “మనుష్య కుమారుడు . . . వచ్చునప్పుడు” అని అంటూ యేసు తన ఉపమానాన్ని ప్రారంభిస్తాడు. “మనుష్య కుమారుడు” ఎవరో మీకు తెలిసే ఉండవచ్చు. సువార్త రచయితలు తరచూ ఈ వాక్యాన్ని యేసుకు ఉపయోగించారు. యేసు తాను కూడా ఆలాగే చేశాడు, మరి “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” పొందేందుకు “మనుష్యకుమారుని పోలిన యొకడు” మహా వృద్ధుని సమీపించడం చూసిన దానియేలు దర్శనం ఆయన మనస్సులో నిస్సందేహంగావుండవచ్చు. (దానియేలు 7:13, 14; మత్తయి 26:63, 64; మార్కు 14:61, 62) ఈ ఉపమానంలో యేసు ప్రాముఖ్యమైన పాత్రను వహించినప్పటికీ అందులో ఉన్నది ఆయన ఒక్కడు మాత్రమే కాదు. మత్తయి 24:30, 31 నందు ఎత్తి వ్రాసినట్లుగా మనుష్య కుమారుడు ‘ప్రభావముతోను మహిమతోను’ వచ్చునప్పుడు ఆయన దూతలు ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తారని ఈ ప్రసంగ ఆరంభంలో ఆయన చెప్పాడు. అదే విధంగా, తీర్పుతీర్చేందుకు ‘సింహాసనము మీద కూర్చు’న్నప్పుడు యేసుతో దూతలు కూడా ఉంటారని మేకలూ గొఱ్ఱెల ఉపమానం చూపిస్తుంది. (మత్తయి 16:27 పోల్చండి.) అయితే న్యాయాధిపతి మరియు ఆయన దూతలు పరలోకంలో ఉన్నారు కనుక ఆ ఉపమానంలో మానవులను గూర్చి చర్చించడం జరిగిందా?

      5. మనం యేసు “సహోదరు”లను ఎలా గుర్తించగలం?

      5 ఆ ఉపమానాన్ని ఒకసారి పరిశీలించడం మనం గుర్తించాల్సిన మూడు గుంపులను గూర్చి బయల్పరుస్తుంది. మేకలూ గొఱ్ఱెలకు తోడుగా, మనుష్య కుమారుడు ఓ మూడవ గుంపును చేరుస్తున్నాడు, దాని గుర్తింపు మేకలూ గొఱ్ఱెలను గుర్తించేందుకు ఎంతో అవసరం. యేసు ఈ మూడవ గుంపును తన ఆత్మీయ సహోదరులని పిలుస్తున్నాడు. (మత్తయి 25:40, 45) వారు ఆయనకు నిజమైన ఆరాధికులై ఉండాలి ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు: “పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు.” (మత్తయి 12:50; యోహాను 20:17) దాన్ని మరింత ధ్రువపరుస్తూ, ‘అబ్రాహాము సంతానం’లో భాగమైన క్రైస్తవులను గూర్చి మరియు దేవుని కుమారుల్లోనూ భాగమైన క్రైస్తవులను గూర్చి పౌలు వ్రాశాడు. వీరిని ఆయన “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన” యేసు ‘సహోదరులు’ అని పిలిచాడు.—హెబ్రీయులు 2:9–3:1; గలతీయులు 3:26, 29.

      6. యేసు సహోదరుల్లో “అలులైన” వారు ఎవరు?

      6 యేసు తన సహోదరుల్లో “మిక్కిలి అల్పులైన” వారిని గూర్చి ఎందుకు ప్రస్తావించాడు? ఆ మాటలు, అంతకుముందు ఆయన చెబుతుండగా అపొస్తలులు విన్న వాటిని ప్రతిధ్వనిస్తున్నాయి. యేసుకంటే ముందే మరణించడం వల్ల భూనిరీక్షణ గల బాప్తిస్మమిచ్చు యోహానుకు, పరలోక జీవితాన్ని పొందేవారికి మధ్య తేడాను చెప్పేటప్పుడు యేసు ఇలా చెప్పాడు: “బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు.” (మత్తయి 11:11) పరలోకానికి వెళ్లే కొందరు అంటే అపొస్తలులవలె సంఘంలో అతి ప్రాముఖ్యులై ఉండివుండవచ్చు, మరితరులు తక్కువ అయ్యుండవచ్చు, అయితే వారందరూ యేసు ఆత్మీయ సహోదరులే. (లూకా 16:10; 1 కొరింథీయులు 15:9; ఎఫెసీయులు 3:8; హెబ్రీయులు 8:11) ఆ విధంగా, భూమ్మీది కొందరు అంత ప్రాముఖ్యులుగా కనిపించకపోయినప్పటికీ, వారు ఆయన సహోదరులే మరియు వారు దానికి తగిన రీతిలో చూడబడాలి.

      మేకలు ఎవరు గొఱ్ఱెలు ఎవరు?

      7, 8. గొఱ్ఱెలను గూర్చి యేసు ఏమని చెప్పాడు, కనుక వారిని గూర్చి మనం ఏ నిర్థారణకు రావచ్చు?

      7 గొఱ్ఱెలకు తీర్పు తీర్చడం గూర్చి మనం ఇలా చదువుతాము: “[యేసు] తన కుడివైపున ఉన్నవారిని చూచి—నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి; పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు—ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? ఎప్పుడు రోగివైయుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు—మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.”—మత్తయి 25:34-40.

      8 స్పష్టంగా, దయా ఘనతలను పొందగల యేసు యొక్క కుడిపార్శ్వమున ఉండేందుకు అర్హతపొందిన గొఱ్ఱెలు మానవ తరగతిని సూచిస్తున్నాయి. (ఎఫెసీయులు 1:20; హెబ్రీయులు 1:3) వారు ఏమి చేశారు, మరి దాన్ని ఎప్పుడు చేశారు? వారు దయతో, గౌరవంతో మరియు ఉదారంగా ఆయనకు ఆహారపానీయాలనూ, దుస్తులనూ అందించారని మరియు ఆయన అస్వస్థంగా ఉన్నప్పుడు లేక చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకు సహాయపడ్డారని యేసు చెబుతున్నాడు. తాము వీటిని యేసుకు వ్యక్తిగతంగా చేయలేదని గొఱ్ఱెలు చెప్పినప్పుడు, అభిషక్తులైన క్రైస్తవుల్లో శేషించిన తన ఆత్మీయ సహోదరులకు సహాయపడ్డారని ఆయన సూచించాడు తద్వారా ఆ భావంలో వారు ఆయనకు చేశారని చెప్పాడు.

      9. వెయ్యేండ్ల కాలంలో ఈ ఉపమానం ఎందుకు అన్వయించబడదు?

      9 ఈ ఉపమానం వెయ్యేండ్ల కాలంలో అన్వయించబడదు, ఎందుకంటే అప్పుడు అభిషక్తులు ఆకలి, దాహం, రోగం, లేక చెరను అనుభవించే మానవులుగా ఉండరు. అయితే వారిలో అనేకులు ఈ విధానాంతంలో అలాంటివాటిని అనుభవించారు. సాతాను భూమిమీదికి పడద్రోయబడినప్పటి నుండి, శేషించినవారిపై అవహేళనను, హింసను, మృత్యువును తీసుకురావడం ద్వారా, తన కోపానికి ముఖ్యంగా గురిచేశాడు.—ప్రకటన 12:17.

      10, 11. (ఎ) యేసు సహోదరులకు సహాయం చేసే ప్రతిఒక్కరు గొఱ్ఱెల్లో చేరివున్నారని ఆలోచించడం ఎందుకు సహేతుకంకాదు? (బి) గొఱ్ఱెలు ఎవరికి సరిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

      10 తన సహోదరుల్లో ఒకరికి చిన్న సహాయం చేసే ప్రతివారూ అంటే బహుశ ఒక రొట్టె ముక్కను లేక ఒక గ్లాసు మంచి నీళ్లనూ ఇచ్చినవారు ఈ గొఱ్ఱెలయ్యేందుకు అర్హులవుతారని యేసు చెబుతున్నాడా? అలాంటి సహాయం మానవత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నది నిజమే, కానీ వాస్తవానికి ఈ ఉపమానపు గొఱ్ఱెల విషయంలో ఇంకా ఎక్కువ ఇమిడి ఉందన్నట్లు అనిపిస్తోంది. ఉదాహరణకు, తన సహోదరుల్లో ఒకరికి ఓ సహాయంచేసిన నాస్తికులనో లేక మత నాయకులనో సూచించడంలేదు. దానికి భిన్నంగా, రెండు సార్లు యేసు ఆ గొఱ్ఱెలను ‘నీతిమంతులు’ అని పిలిచాడు. (మత్తయి 25:37, 46) కనుక కొంతకాలం పాటు క్రైస్తవ సహోదరులకు సహాయపడి అంటే చురుకుగా వారికి మద్దతునిచ్చి, దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని పొందేంతగా విశ్వాసాన్ని కల్గివున్నవారై ఉండాలి.

      11 సంవత్సరాలుగా అబ్రాహాము వంటి అనేకులు ఓ నీతియుక్త స్థానాన్ని అనుభవించారు. (యాకోబు 2:21-23) నోవహు, అబ్రాహాము మరియు ఇతర నమ్మకమైనవారు, దేవుని రాజ్యంలో పరదైసునందు జీవాన్ని పొందే “వేరే గొఱ్ఱె”ల్లో చేరివుంటారు. ఇటీవలికాలంలో ఇంకా లక్షలాదిమంది వేరే గొఱ్ఱెలుగా సత్యారాధనను చేపట్టారు మరియు అభిషక్తులతో “ఒక మంద”లో భాగమయ్యారు. (యోహాను 10:16; ప్రకటన 7:9) భూ నిరీక్షణగల వీరు యేసు సహోదరులను రాజ్యానికి ప్రతినిధులుగా గుర్తించి, అలా వారికి అక్షరార్థంగానూ ఆత్మీయంగానూ సహాయపడ్డారు. వేరే గొఱ్ఱెలు భూమిమీద తన సహోదరులకు చేసిన వాటిని తనకు చేసినట్లుగానే యేసు పరిగణిస్తాడు. బ్రతికివున్న అలాంటివారు, ఆయన జనాంగాలకు తీర్పుతీర్చేందుకు వచ్చినప్పుడు గొఱ్ఱెలుగా తీర్పుతీర్చబడతారు.

      12. గొఱ్ఱెలు తాము యేసుకు ఎలా సహాయం చేశామని ఎందుకు అడుగుతారు?

      12 మరి వేరే గొఱ్ఱెలు అభిషక్తులతో ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ, వారికి సహాయపడుతున్నట్లైతే, “ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి?” అని ఎందుకు ప్రశ్నిస్తారు. (మత్తయి 25:37) అందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. ఇది ఓ ఉపమానం. దాని ద్వారా, తన ఆత్మీయ సహోదరుల ఎడల ఆయనకు గల ప్రగాఢమైన శ్రద్ధను యేసు కనపరుస్తున్నాడు; ఆయన వారి భావనలను పంచుకుంటాడు, ఆయన వారితో బాధపడతాడు. అంతకు ముందు యేసు ఇలా చెప్పాడు: “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.” (మత్తయి 10:40) తన సహోదరులకు చేసేది (అది మంచైనా చెడైనా) పరలోకం వరకు చేరుకుంటుందని; అది పరలోకంలో ఆయనకు చేసినట్లేనని కనపరుస్తూ ఈ దృష్టాంతంలో యేసు ఓ సూత్రాన్ని అందిస్తున్నాడు. అంతేకాకుండ, యేసు ఇక్కడ తీర్పుతీర్చడంలో యెహోవా ప్రమాణాన్ని నొక్కిచెబుతున్నాడు, అనుకూలమైనదైనా లేక దండనార్హమైనదైనా దేవుని తీర్పు అన్నది సయుక్తికం న్యాయవంతం. ‘అయ్యో మేము నిన్ను నేరుగా చూసివుంటే ఎంత బాగుండును,’ అని మేకలు సాకులు చెప్పలేరు.

      13. మేకలాంటి వారు యేసును “ప్రభువా” అని ఎందుకు పిలుస్తారు?

      13 ఈ ఉపమానంలో కనపర్చిన తీర్పు ఎప్పుడు అమలుపర్చబడుతుందన్న విషయాన్ని మనం ఒకసారి గుణగ్రహిస్తే, మేకలు ఎవరు అనే విషయాన్ని గూర్చి మనకు స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. దాని నెరవేర్పు, “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొను”నప్పుడు జరుగుతుంది. (మత్తయి 24:29, 30) రాజు సహోదరులను చిన్నచూపు చూసిన మహా బబులోనుపై వచ్చే శ్రమనుండి తప్పించుకున్నవారు ఇప్పుడు ఆ న్యాయాధిపతిని “ప్రభువా” అని దయనీయంగా పిలుస్తారు.—మత్తయి 7:22, 23; ప్రకటన 6:15-17 పోల్చండి.

      14. మేకలు గొఱ్ఱెలను యేసు ఏ ఆధారంపై తీర్పుతీరుస్తాడు?

      14 మునుపు చర్చికి వెళ్లేవారు, నాస్తికులు లేక ఇతరులు నిరాశతో చెప్పేవాటిని ఆధారం చేసుకుని యేసు తీర్పుతీర్చడు. (2 థెస్సలొనీకయులు 1:8) బదులుగా, “అల్పులైన వీరిలో [తన సహోదరులలో] ఒకని” ఎడలైనా ప్రజలు గతంలో వ్యవహరించిన విధం మరియు వారి వారి హృదయ పరిస్థితిని న్యాయాధిపతి పునఃపరిశీలిస్తాడు. భూమిమీద జీవిస్తున్న అభిషక్త క్రైస్తవుల సంఖ్య తగ్గుతోందన్నది వాస్తవం. అయితే, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసుడు” అయ్యే అభిషక్తులు ఆత్మీయ ఆహారాన్ని నడిపింపును అందిస్తూ ఉన్నంతకాలం, ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోని ప్రజలలోని ఆ యా భాషలు మాటలాడువారిలోని గొప్ప సమూహము’ చేసినట్లుగానే గొఱ్ఱెలు కాబోయేవారు దాసుని తరగతికి మంచి చేసే అవకాశాన్ని కల్గివున్నారు.—ప్రకటన 7:9, 14.

      15. (ఎ) అనేకులు తాము మేకలని ఎలా కనపర్చుకున్నారు? (బి) ఒకరు మేకా లేక గొఱ్ఱె అన్న విషయంపై వ్యాఖ్యానించడాన్ని మనం ఎందుకు విడనాడాలి?

      15 క్రైస్తవ సహోదరులు మరియు వారితో కలిసిన లక్షలాది మంది వేరే గొఱ్ఱెలు ఒక మందగా ఎలా చూడబడతారు? అనేకమంది ప్రజలు క్రైస్తవ ప్రతినిధులపై దాడిచేసివుండకపోవచ్చు, అలాగే వారు ఆయన ప్రజలను అటు ప్రేమపూర్వకంగా కూడా చూడలేదు. దుష్టలోకాన్నే ఇష్టపడుతూ మేకవంటివారు రాజ్య వర్తమానాన్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగాగానీ విన్నా దాన్ని తిరస్కరిస్తారు. (1 యోహాను 2:15-17) చివరి విశ్లేషణలో, తీర్పును తీర్చేందుకు నియమించబడేది యేసే అన్న విషయంలో సందేహంలేదు. ఎవరు మేకలు ఎవరు గొఱ్ఱెలన్న విషయాన్ని తీర్మానించాల్సింది మనం కాదు.—మార్కు 2:8; లూకా 5:22; యోహాను 2:24, 25; రోమీయులు 14:10-12; 1 కొరింథీయులు 4:5.

      ప్రతి గుంపుకు ఏ భవిష్యత్తుంది?

      16, 17. గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?

      16 యేసు గొఱ్ఱెల విషయంలో తన తీర్పునిచ్చాడు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” “రండి”—ఎంతటి ప్రేమపూర్వకమైన ఆహ్వానం! దేనికొరకు? ‘నీతిమంతులు నిత్యజీవమునకు పోవుదురు’ అని ఆయన చివరిలో వ్యక్తపర్చినట్లుగా నిత్యజీవానికే.—మత్తయి 25:34, 46.

      17 తలాంతుల ఉపమానంలో పరలోకంలో ఆయనతో జీవించేవారికి ఏమి అవసరం అన్న విషయాన్ని యేసు చూపాడు, అయితే ఈ ఉపమానంలో రాజ్య పౌరులనుండి ఏమి అపేక్షించబడుతుందనే విషయాన్ని ఆయన చూపుతున్నాడు. (మత్తయి 25:14-23) సూటిగా చెప్పాలంటే, వారు యేసు సహోదరులకు పూర్ణంగా మద్దతునివ్వడం ద్వారా, ఈ గొఱ్ఱెలు ఆయన రాజ్యపు భూ లోకంలో ఓ స్థానాన్ని స్వతంత్రించుకుంటారు. వారు పరదైసు భూమిపై జీవాన్ని అనుభవిస్తారు—అది విమోచనను పొందగల మానవుల “లోకము పుట్టినది మొదలుకొని” దేవుడు ఏర్పాటు చేసిన ఉత్తరాపేక్ష.—లూకా 11:50, 51.

      18, 19. (ఎ) మేకలను గూర్చి యేసు ఏ తీర్పులను తీరుస్తాడు? (బి) మేకలు నిత్య బాధను అనుభవించరనే నిశ్చయాన్ని మనం ఎందుకు కల్గివుండగలం?

      18 మేకలపై తీర్చబడిన తీర్పు ఎంత భిన్నమైనది! “అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి—శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినైయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినైయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును—ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొని యుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివైయుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.”—మత్తయి 25:41-45.

      19 మేకవంటివారి అమర్త్యమైన ప్రాణములు నిత్యాగ్నిలో బాధననుభవిస్తాయని దాని భావం కాదని బైబిలు విద్యార్థులకు తెలుసు. ఎందుకంటే మానవులే ప్రాణములు; వారిలో వేరే ప్రాణములు లేవు. (ఆదికాండము 2:7; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) మేకలను ‘నిత్యాగ్నికి’ న్యాయాధిపతి తీర్పుతీర్చడం అంటే, భవిష్యత్‌ నిరీక్షణ లేకుండా నాశనమవ్వడమని అతని ఉద్దేశం. దానిలో అపవాదీ వాని దయ్యముల నిత్య నాశనం కూడా ఉంది. (ప్రకటన 20:10, 14) కనుక, యెహోవా న్యాయాధిపతి వేరువేరు తీర్పులను తీరుస్తాడు. అయితే ఆయన తన గొఱ్ఱెలతో “రండి” అని మేకలతో “నన్ను విడిచి . . . పోవుడి” అని చెబుతాడు. గొఱ్ఱెలు ‘నిత్యజీవమును’ పొందుతారు. మేకలు “నిత్యశిక్ష”ను పొందుతారు.—మత్తయి 25:46.b

      అది మనకే భావం కలిగివుంది?

      20, 21. (ఎ) క్రైస్తవులు చేయాల్సిన ఏ ప్రాముఖ్యమైన పని ఉంది? (బి) నేడు ఏ వేరుపర్చే పని జరుగుతోంది? (సి) మేకలు మరియు గొఱ్ఱెల ఉపమానం నెరవేరడం ప్రారంభమైనప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది?

      20 తన ప్రత్యక్షత మరియు ఈ విధానాంతం గూర్చి యేసు ఇచ్చిన జవాబును విన్న నలుగురు అపొస్తలులు పరిశీలించేందుకు ఎంతో ఉంది. వారు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. (మత్తయి 24:42) మార్కు 13:10 నందు ప్రస్తావించిన సాక్ష్యపు పనిని కూడా వారు చేయాల్సిన అవసరం ఉంది. నేడు యెహోవాసాక్షులు చురుకుగా ఈ పనిలో పాల్గొంటున్నారు.

      21 అయితే మేకలూ గొఱ్ఱెల ఉపమానాన్ని గూర్చిన ఈ నూతన అవగాహన మనకు ఏ భావాన్ని కల్గివుంది? ప్రజలు ఇప్పటికీ ఏదొక ప్రక్కకు వెళ్తున్నారు. కొందరు ‘నాశనానికి నడిపించే విశాలమార్గంలో’ ఉన్నారు అయితే ఇతరులు ‘జీవానికి నడిపించే ఇరుకు మార్గంలో’ కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. (మత్తయి 7:13, 14) అయితే ఉపమానంలో చిత్రించబడిన మేకలూ గొఱ్ఱెలపై యేసు ప్రకటించబోయే అంతిమ తీర్పు మున్ముందుంది. మనుష్య కుమారుడు న్యాయాధిపతి పాత్రలో వచ్చినప్పుడు, అనేకమంది నిజమైన క్రైస్తవులు—వాస్తవానికి సమర్పిత గొఱ్ఱెల “గొప్ప సమూహము”—“మహా శ్రమ” చివరి భాగంనుండి నూతన లోకంలోకి ప్రవేశించేందుకు అర్హతను పొందుతారు. ఆ ఉత్తరాపేక్ష ఇప్పుడు ఆనందానికి కారణం కావాలి. (ప్రకటన 7:9, 14) మరో వైపు, “సమస్త జనాంగముల” నుండి అనేకమంది మొండి మేకలని నిరూపించుకున్నవారైయుంటారు. వారు “నిత్యశిక్షకు . . . పోవుదురు.” భూమికి ఎంతటి ఉపశమనం!

      22, 23. ఉపమానం ఇంకా భవిష్యత్తులో నెరవేరాల్సి ఉంది కనుక, మన ప్రకటనాపని నేడు ఎందుకు ప్రాముఖ్యం?

      22 ఉపమానంలో వర్ణించబడిన తీర్పు సమీప భవిష్యత్తులో ఉండగా, ఇప్పుడు కూడా ప్రాముఖ్యమైనదొకటి జరుగబోతోంది. ప్రజల్లో వేర్పాటును కలుగజేసే జీవాన్ని రక్షించే వర్తమానాన్ని ప్రకటించడంలో క్రైస్తవులమైన మనము పాల్గొంటున్నాము. (మత్తయి 10:32-39) పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమీయులు 10:13, 14) దేవుని నామంతో మరియు ఆయన రక్షణ సమాచారంతో మన బహిరంగ ప్రకటన 230 పైగా దేశాల్లో ప్రజలను చేరుతోంది. క్రీస్తు అభిషక్త సహోదరులు ఈ పనిని ఇంకా వేగిరం చేస్తున్నారు. సుమారు 50 లక్షల వేరే గొఱ్ఱెలు ఇప్పుడు వారితో చేరారు. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, యేసు సహోదరులు ప్రకటించే సమాచారానికి ప్రతిస్పందిస్తున్నారు.

      23 మనం ఇంటింట మరియు అనియతంగా ప్రకటించడంవల్ల ఈ వర్తమానాన్ని అనేకులు తెలుసుకున్నారు. యెహోవాసాక్షులను గూర్చి మరియు మనం ప్రాతినిధ్యం వహించడాన్ని గూర్చి మనకు తెలియని విధాల్లో తెలుసుకోగలరు. తీర్పు సమయం ఆసన్నమైనప్పుడు, సమాజపు బాధ్యతను మరియు కుటుంబ ప్రతిష్ఠను యేసు ఎంత మట్టుకు పరిగణిస్తాడు? మనం చెప్పలేము మరియు దాన్ని గూర్చి ఊహించడం వ్యర్థం. (1 కొరింథీయులు 7:14 పోల్చండి.) నేడు అనేకులు దేవుని ప్రజలు చెప్పినవాటిని పెడచెవిన పెట్టి, అపహసించి లేక వారిని హింసించడంలో పాల్గొంటారు. కాబట్టి, ఇది అతి నిర్ణయాత్మక కాలం; అలాంటి వారు యేసు మేకలుగా తీర్పుతీర్చేవారిగా వృద్ధి చెందవచ్చు.—మత్తయి 10:22; యోహాను 15:20; 16:2, 3; రోమీయులు 2:5, 6.

      24. (ఎ) మన ప్రకటనా పనికి వ్యక్తులు ప్రతిస్పందించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఈ పఠనం మీరు మీ పరిచర్య విషయంలో వ్యక్తిగతంగా ఏ దృక్పథాన్ని కల్గివుండేందుకు సహాయపడింది?

      24 అయితే అనేకులు అనుకూలంగా ప్రతిస్పందిస్తారు, దేవుని వాక్యాన్ని పఠిస్తారు మరియు యెహోవాకు సాక్షులౌతారు. ఇప్పుడు మేకల్లా కనిపించే వారు మారి గొఱ్ఱెలాంటివారుకావచ్చు. క్రీస్తు సహోదరుల్లోని శేషించినవారికి ప్రతిస్పందిస్తూ వారికి చురుకుగా మద్దతునిచ్చేవారు, యేసు తీర్పుతీర్చేందుకు కూర్చున్నప్పుడు అంటే సమీప భవిష్యత్తులో ఆయన కుడిపార్శ్వమున ఉండేందుకు ఆధారాన్నందించే రుజువును ఇప్పుడు ఇస్తున్నారు. వీరు ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నారు మరియు ఆశీర్వదించబడతారు. ఆ విధంగా, ఈ ఉపమానం మనం మరింత ఆసక్తితో క్రైస్తవ పరిచర్యలో పనిచేసేందుకు మనలను పురికొల్పాలి. ఆలస్యం కాకముందే, మనం రాజ్య సువార్తను ప్రకటించేందుకు మనకు వీలున్నంతమట్టుకు చేసేందుకు మనం ఇష్టపడాలి మరియు ఆ విధంగా ఇతరులు ప్రతిస్పందించేందుకు మనం అవకాశమివ్వాలి. ఆ తర్వాత తీర్పుతీర్చడం యేసు పని, అది శిక్షవిధించేటువంటిదైనా అనుకూలమైనదైనా అది ఆయన బాధ్యతే.—మత్తయి 25:46.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి