అధ్యాయం 28
“నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి”
1, 2. వెన్నుపోటుకు బలవ్వడం దావీదు రాజుకు కొత్తేమీ కాదని ఎలా చెప్పవచ్చు?
వెన్నుపోటుకు బలవ్వడం దావీదు రాజుకు కొత్తేమీ కాదు. ఒకానొక గడ్డుకాలంలో, తన సొంత దేశ ప్రజలే అతన్ని రాజుగా తీసేయడానికి కుట్ర పన్నారు. అదీగాక, నా అనుకున్నవాళ్లే దావీదుకు ద్రోహం చేశారు. దావీదు మొదటి భార్య మీకాలు గురించి చూడండి. మొదట్లో ఆమె “దావీదును ప్రేమించింది,” కాబట్టి రాజుగా అతను చేసే పనుల్లో తప్పకుండా చేదోడువాదోడుగా ఉండివుంటుంది. కానీ తర్వాత “తన హృదయంలో అతన్ని నీచంగా చూసింది.” ఎంతగా అంటే, అతన్ని ఒక ‘పిచ్చివాడిలా’ చూసింది.—1 సమూయేలు 18:20; 2 సమూయేలు 6:16, 20.
2 దావీదుకు వెన్నుపోటు పొడిచిన ఇంకో వ్యక్తి, అతని సలహాదారుడైన అహీతోపెలు. అప్పట్లో అహీతోపెలు సలహాకు ఎంత విలువ ఇచ్చేవాళ్లంటే, అది స్వయంగా దేవుని నుండే వచ్చిన మాటగా చూసేవాళ్లు. (2 సమూయేలు 16:23) కానీ సమయం గడుస్తుండగా, నమ్మకస్థుడైన ఈ స్నేహితుడు నమ్మకద్రోహిగా మారి, దావీదుకు ఎదురుతిరిగిన గుంపుతో చేతులు కలిపాడు. వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరో తెలుసా? దావీదు సొంత కొడుకైన అబ్షాలోమే! అవకాశం కోసం గుంటనక్కలా కాచుకొని కూర్చున్న ఈ అబ్షాలోము, “ఇశ్రాయేలీయుల హృదయాల్ని దోచుకుంటూ” దావీదుకు బదులు తననే రాజుగా చేసుకున్నాడు. అబ్షాలోము పన్నిన ఈ కుట్ర ఎంతగా ఊపు అందుకుందంటే, దావీదు రాజు తన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది.—2 సమూయేలు 15:1-6, 12-17.
3. దావీదుకు ఏ నమ్మకం ఉంది?
3 అయితే దావీదుకు విశ్వసనీయంగా ఉన్నవాళ్లు ఒక్కరు కూడా లేరా? తనకు ఎదురైన గడ్డు పరిస్థితులన్నిటిలో ఒకరు తోడుగా ఉన్నారని దావీదుకు తెలుసు. ఎవరది? మరెవరో కాదు యెహోవా దేవుడే. దావీదు యెహోవా గురించి ఇలా అన్నాడు: “విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు.” (2 సమూయేలు 22:26) ఇంతకీ విశ్వసనీయత అంటే ఏంటి? విశ్వసనీయంగా ఉండే విషయంలో యెహోవాకు మించినవాళ్లే లేరని ఎలా చెప్పవచ్చు?
విశ్వసనీయత అంటే ఏంటి?
4, 5. (ఎ) ‘విశ్వసనీయత’ అంటే ఏంటి? (బి) విశ్వసనీయంగా ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి తేడా ఏంటి?
4 హీబ్రూ లేఖనాల్లో “విశ్వసనీయత” అంటే, ఒక దానికి ప్రేమగా అంటిపెట్టుకుని ఉండి, దాని విషయంలో మనం అనుకున్నది పూర్తయ్యేవరకు వదిలిపెట్టకుండా చూపించే దయ. విశ్వసనీయతలో నమ్మకంగా ఉండడం కంటే ఎక్కువే ఉంది. ఎందుకంటే, ఒక వ్యక్తి కేవలం పనిలా ఫీలయ్యి కూడా నమ్మకంగా ఉండవచ్చు. కానీ విశ్వసనీయతకు మాత్రం ప్రేమే మూలం.a అంతేకాదు, ప్రాణంలేని వస్తువులు కూడా ‘నమ్మకంగా’ ఉండవచ్చు. ఉదాహరణకు, కీర్తనకర్త చంద్రుణ్ణి “ఆకాశంలో నమ్మకమైన సాక్షి” అని అన్నాడు. ఎందుకంటే, అది క్రమం తప్పకుండా ప్రతీరోజు రాత్రి కనిపిస్తుంది. (కీర్తన 89:37) అంతమాత్రాన చంద్రుడు విశ్వసనీయంగా ఉంటున్నాడని మనం అనలేం. ఎందుకు? ఎందుకంటే, విశ్వసనీయత అనేది ప్రేమ నుండి పుడుతుంది. ప్రాణంలేని వస్తువులు ప్రేమను చూపించలేవు కదా.
చంద్రుణ్ణి నమ్మకమైన సాక్షి అంటారు. కానీ మనుషులు, దేవదూతలు మాత్రమే యెహోవాలాంటి విశ్వసనీయతను చూపించగలరు
5 బైబిలు వర్ణించే విశ్వసనీయతలో ఆప్యాయత ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి విశ్వసనీయంగా ఉంటున్నాడు అంటేనే, వాళ్లిద్దరి మధ్య ఒక బంధం ఉందని అర్థం. అలాంటి విశ్వసనీయత, గాలిచేత రేపబడే సముద్ర కెరటాల్లా ఊగిసలాడదు. బదులుగా, విశ్వసనీయత లేదా విశ్వసనీయ ప్రేమ అనేది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా స్థిరంగా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది.
6. (ఎ) విశ్వసనీయత మనుషుల్లో ఎంతగా కరువైపోయింది? దాని గురించి బైబిలు ఏం చెప్పింది? (బి) విశ్వసనీయత అంటే ఏంటో తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఎందుకు?
6 నిజమే, అలాంటి విశ్వసనీయత ఈరోజుల్లో కరువైపోయింది. ఇప్పుడు దగ్గరి స్నేహితులే, అవకాశం దొరికితే “ఒకరినొకరు నాశనం చేసుకోవాలని” చూస్తున్నారు. అలాగే, భర్తను లేదా భార్యను వదిలేసేవాళ్ల గురించి ఈమధ్య ఎక్కువగా వింటున్నాం. (సామెతలు 18:24; మలాకీ 2:14-16) నమ్మకద్రోహం ఎంత మామూలు అయిపోయిందంటే, మీకా ప్రవక్త చెప్పిన ఈ మాటల్నే మనమూ అంటాం: “భూమ్మీద విశ్వసనీయుడు అనేవాడే లేకుండా పోయాడు.” (మీకా 7:2) మనుషులైతే విశ్వసనీయత చూపించకపోవచ్చు గానీ, ఆ అమూల్యమైన లక్షణం యెహోవాలో మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిజానికి, ఆ లక్షణం గురించి బాగా తెలుసుకోవాలంటే, యెహోవా ప్రేమలో ఒక ముఖ్య భాగమైన విశ్వసనీయతను ఆయన ఎలా చూపిస్తాడో పరిశీలించాల్సిందే.
యెహోవా విశ్వసనీయత సాటిలేనిది
7, 8. యెహోవా మాత్రమే విశ్వసనీయుడు అని ఎందుకు చెప్పవచ్చు?
7 బైబిలు యెహోవా గురించి ఇలా చెప్తుంది: “నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి.” (ప్రకటన 15:4) అదెలా? మనుషులు, దేవదూతలు కూడా కొన్నిసార్లు గొప్ప విశ్వసనీయతను చూపించారు కదా? (యోబు 1:1; ప్రకటన 4:8) మరి యేసుక్రీస్తు సంగతేంటి? ఆయన దేవుని ముఖ్యమైన ‘విశ్వసనీయుడు’ కాదా? (కీర్తన 16:10) మరి అలాంటప్పుడు, యెహోవా మాత్రమే విశ్వసనీయుడు అని బైబిలు ఎందుకు అంటుంది?
8 మొదటిగా, విశ్వసనీయత అనేది ప్రేమలో ఒక కోణం అని గుర్తుంచుకోండి. “దేవుడు ప్రేమ,” అంటే దానికి ఆయనే నిలువెత్తు రూపం. కాబట్టి విశ్వసనీయతను యెహోవా కన్నా బాగా ఎవరు చూపించగలరు? (1 యోహాను 4:8) నిజమే దేవదూతలు, మనుషులు దేవుని లక్షణాల్ని కొంతవరకు చూపించవచ్చు. కానీ యెహోవా మాత్రమే పూర్తిస్థాయిలో విశ్వసనీయుడు. పైగా ఆయన “మహా వృద్ధుడు” కాబట్టి అటు భూమ్మీదైనా, ఇటు పరలోకంలోనైనా, వేరే ఏ ప్రాణి కన్నా ఎక్కువ కాలం నుండి యెహోవా విశ్వసనీయత చూపిస్తూ ఉన్నాడు. (దానియేలు 7:9) కాబట్టి, విశ్వసనీయతలో యెహోవాకు మించినవాళ్లే లేరు. దాన్ని ఆయన చూపించినంత బాగా ఎవ్వరూ చూపించలేరు. కొన్ని ఉదాహరణలు చూడండి.
9. యెహోవా ఎలా “తన పనులన్నిట్లో విశ్వసనీయుడు”?
9 యెహోవా “తన పనులన్నిట్లో విశ్వసనీయుడు.” (కీర్తన 145:17) అదెలా? దానికి జవాబు 136వ కీర్తనలో ఉంది. అందులో ఎర్రసముద్రం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల్ని అద్భుతరీతిలో కాపాడడంతో పాటు, ఆయన చేసిన ఎన్నో రక్షణ కార్యాల గురించి మనం చదువుతాం. ఆసక్తికరంగా ఆ కీర్తనలోని ప్రతీ వచనం, “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అనే మాటతో ముగుస్తుంది. 289వ పేజీలో ఉన్న “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సులో కూడా ఈ కీర్తన ఉంది. మీరు ఆ వచనాల్ని చదువుతున్నప్పుడు, యెహోవా ఎన్ని విధాలుగా తన ప్రజల మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడో ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. అవును, తన నమ్మకమైన సేవకుల ప్రార్థనల్ని వినడం ద్వారా, సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోవడం ద్వారా యెహోవా విశ్వసనీయత చూపిస్తాడు. (కీర్తన 34:6) వాళ్లు తనకు నమ్మకంగా ఉన్నంతవరకు, ఆయన విశ్వసనీయ ప్రేమ చెక్కుచెదరదు.
10. తన ప్రమాణాల విషయంలో యెహోవా ఎలా విశ్వసనీయత చూపిస్తాడు?
10 అంతేకాదు, యెహోవా తన ప్రమాణాల్ని మార్చకుండా ఉండడం ద్వారా కూడా తన సేవకుల మీద విశ్వసనీయత చూపిస్తున్నాడు. కొంతమంది మనుషులైతే, ఆ క్షణం వాళ్లకు ఏమనిపిస్తుంది అనేదాన్ని బట్టి, ఏది తప్పు-ఏది ఒప్పు అనే విషయంలో అభిప్రాయాలు మార్చేసుకుంటారు. కానీ యెహోవా అలా కాదు. ఉదాహరణకు వేల సంవత్సరాల నుండి మంత్రతంత్రాలు, విగ్రహారాధన, హత్య విషయంలో ఆయన అభిప్రాయం ఏమాత్రం మారలేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఒకే మాట మీద ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఇలా చెప్పాడు: “మీరు ముసలివాళ్లు అయ్యేవరకు నేను ఒకేలా ఉంటాను.” (యెషయా 46:4) కాబట్టి, బైబిల్లో ఉన్న స్పష్టమైన ప్రమాణాల్ని పాటిస్తే మనకే మంచిది అనే నమ్మకంతో ఉండవచ్చు.—యెషయా 48:17-19.
11. యెహోవా మాట మీద నిలబడతాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
11 మాట మీద నిలబడడం ద్వారా కూడా యెహోవా విశ్వసనీయత చూపిస్తాడు. ఆయన ఏదైనా చెప్పాడంటే, అది జరిగి తీరుతుంది. అందుకే ఆయన ఇలా అన్నాడు: “నా నోటి నుండి వచ్చే మాట . . . ఫలితాలు సాధించకుండా నా దగ్గరికి తిరిగి రాదు; బదులుగా అది నాకు నచ్చిన ప్రతీదాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది, నేను ఏ పని కోసం దాన్ని పంపించానో ఆ పనిని చేసి తీరుతుంది.” (యెషయా 55:11) మాట మీద నిలబడడం ద్వారా యెహోవా తన ప్రజల మీద విశ్వసనీయత చూపిస్తున్నాడు. అదెలా? తనకు చేసే ఉద్దేశంలేని వాటి గురించి చెప్పి, అనవసరంగా వాళ్లలో ఆశలు రేపడు. ఆయన ఈ విషయాన్ని ఎంతగా నిరూపించుకున్నాడంటే, యెహోషువ ఇలా చెప్పాడు: “యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు; అవన్నీ నిజమయ్యాయి.” (యెహోషువ 21:45) కాబట్టి, యెహోవా మాట తప్పడం వల్ల మన ఆశలు అడియాశలు అయ్యే సందర్భాలు ఎప్పటికీ రావు.—యెషయా 49:23; రోమీయులు 5:5.
12, 13. యెహోవా విశ్వసనీయ ప్రేమ ఏయే విధాలుగా ఎప్పటికీ ఉంటుంది?
12 పైన చూసినట్టు, యెహోవా విశ్వసనీయ ప్రేమ “ఎప్పటికీ ఉంటుంది” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 136:1) అదెలా? ఒకటి ఏంటంటే, యెహోవా మన పాపాల్ని పూర్తిగా క్షమిస్తాడు. 26వ అధ్యాయంలో చూసినట్టు, యెహోవా ఒక వ్యక్తిని క్షమించేశాక ఇక గతంలో చేసిన తప్పుల్ని తవ్వితీయడు. ‘అందరం పాపం చేసి, దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నాం’ కాబట్టి, యెహోవా విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటున్నందుకు మనలో ప్రతీఒక్కరం ఎంతో రుణపడి ఉండాలి.—రోమీయులు 3:23.
13 అయితే, యెహోవా విశ్వసనీయ ప్రేమ ఇంకో విధంగా కూడా ఎప్పటికీ ఉంటుంది. నీతిమంతుడు “నీటి కాలువల పక్కనే నాటబడి, దాని కాలంలో ఫలాలు ఇచ్చే పచ్చని చెట్టులా ఉంటాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 1:3) ఊహించుకోండి, ఆకులు ఎప్పుడూ వాడిపోకుండా పచ్చగా కళకళలాడే చెట్టు ఎంత బాగుంటుందో కదా! అదేవిధంగా మనం బైబిల్ని ఇష్టంగా చదివి, అధ్యయనం చేస్తే ఎక్కువకాలం జీవిస్తాం, ప్రశాంతంగా ఉంటాం, మంచి పనులు చేస్తాం. యెహోవా విశ్వసనీయతతో తన నమ్మకమైన సేవకులకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి. అవును, నీతి విలసిల్లే కొత్తలోకాన్ని యెహోవా తీసుకొస్తాడు, అందులో ఆయన మాట వినే మనుషులు ఆయన విశ్వసనీయ ప్రేమను కలకాలం రుచి చూస్తారు.—ప్రకటన 21:3, 4.
యెహోవా “తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు”
14. తన సేవకులు చూపించే విశ్వసనీయతను యెహోవా ఎలా చూస్తాడు?
14 యెహోవా పదేపదే విశ్వసనీయత చూపిస్తూ వచ్చాడు. యెహోవా మార్పులేనివాడు కాబట్టి, తన నమ్మకమైన సేవకుల మీద చూపించే విశ్వసనీయత ఎప్పటికీ చెక్కుచెదరదు. కీర్తనకర్త ఇలా రాశాడు: “ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గానీ, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు. ఎందుకంటే, యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, ఆయన తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు.” (కీర్తన 37:25, 28) నిజమే, సృష్టికర్తగా యెహోవా మన ఆరాధన పొందడానికి అర్హుడు. (ప్రకటన 4:11) అయినప్పటికీ ఆయన విశ్వసనీయుడు కాబట్టి, మనం నమ్మకంతో చేసే పనుల్ని ఆయన భద్రంగా దాచుకుంటాడు.—మలాకీ 3:16, 17.
15. యెహోవా ఇశ్రాయేలీయుల మీద ఎలా విశ్వసనీయత చూపించాడో వివరించండి.
15 తన ప్రజలకు కష్టం వస్తే, యెహోవా తన విశ్వసనీయ ప్రేమతో మళ్లీమళ్లీ వాళ్లకు సహాయం చేస్తాడు. కీర్తనకర్త ఇలా రాశాడు: “తన విశ్వసనీయుల ప్రాణాల్ని ఆయన కాపాడుతున్నాడు; దుష్టుల చేతి నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.” (కీర్తన 97:10) ఇశ్రాయేలీయుల విషయంలో ఏం జరిగిందో చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల్ని అద్భుతరీతిలో ఎర్రసముద్రం గుండా నడిపించిన తర్వాత వాళ్లు ఇలా పాడారు: “నీ విశ్వసనీయ ప్రేమతో, నువ్వు విడిపించిన ప్రజల్ని నడిపించావు.” (నిర్గమకాండం 15:13) అవును, ఎర్రసముద్రం దగ్గర వాళ్లను విడిపించడం అనేది, యెహోవా నిజంగా విశ్వసనీయ ప్రేమతో చేసిన పని. అందుకే, మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “యెహోవా మీ మీద అనురాగం చూపించింది, మిమ్మల్ని ఎంచుకుంది మీరు జనాలన్నిట్లో ఎక్కువ జనాభాగల జనమని కాదు. ఎందుకంటే మీరు జనాలన్నిట్లో అత్యంత చిన్న జనం. బదులుగా, యెహోవాకు మీ మీద ఉన్న ప్రేమ వల్ల, మీ పూర్వీకులకు తాను వేసిన ఒట్టును నిలబెట్టుకున్నందు వల్ల యెహోవా మిమ్మల్ని బలమైన చేతితో బయటికి తీసుకొచ్చాడు. దాస్య గృహం నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన అలా చేశాడు.”—ద్వితీయోపదేశకాండం 7:7, 8.
16, 17. (ఎ) యెహోవా వాళ్ల కోసం ఇంత చేసినా, ఇశ్రాయేలీయులు కృతజ్ఞత లేకుండా ఏం చేశారు? అయినా యెహోవా వాళ్లమీద ఎలా కనికరపడ్డాడు? (బి) చాలామంది ఇశ్రాయేలీయులు “ఇక బాగుపడని స్థితికి” ఎలా చేరుకున్నారు? దీంట్లో మనకు ఏంటి పాఠం?
16 అంత చేసినా, ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా యెహోవా విశ్వసనీయ ప్రేమ మీద కృతజ్ఞత చూపించలేదు. వాళ్లను విడిపించిన తర్వాత, వాళ్లు “సర్వోన్నతుని మీద తిరుగుబాటుచేసి [యెహోవాకు] వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు.” (కీర్తన 78:17) వందల సంవత్సరాలుగా, వాళ్లు మాటిమాటికి ఆయనకు ఎదురుతిరిగారు, ఆయన్ని వదిలేసి అబద్ధ దేవుళ్లను పూజించారు, అన్యమత ఆచారాల్ని పాటించారు. వాటివల్ల వాళ్లు అపవిత్రులు అవ్వడం తప్ప వాళ్లకు ఒరిగిందేమీ లేదు. అయినా సరే, యెహోవా వాళ్లతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేదు. బదులుగా, యిర్మీయా ప్రవక్త ద్వారా ఆయన తన ప్రజల్ని ఇలా బతిమాలాడు: “భ్రష్టురాలైన ఇశ్రాయేలూ, తిరిగి రా . . . నేను విశ్వసనీయుణ్ణి కాబట్టి నీ మీద కోపం చూపించను.” (యిర్మీయా 3:12) కానీ 25వ అధ్యాయంలో చూసినట్టు, చాలామంది ఇశ్రాయేలీయులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. నిజానికి “వాళ్లు సత్యదేవుని సందేశకుల్ని హేళన చేస్తూ, ఆయన మాటల్ని తిరస్కరిస్తూ, ఆయన ప్రవక్తల్ని ఎగతాళి చేస్తూ వచ్చారు. వాళ్లు ఇక బాగుపడని స్థితికి చేరుకునేవరకు అలా చేస్తూ ఉన్నారు.” చివరికి ఏమైంది? “యెహోవా ఆగ్రహం తన ప్రజల మీదికి వచ్చింది.”—2 దినవృత్తాంతాలు 36:15, 16.
17 దీంట్లో మనకు ఏంటి పాఠం? యెహోవా విశ్వసనీయత గుడ్డిది కాదు, అమాయకమైనది కాదు. నిజమే, యెహోవాకు “అపారమైన విశ్వసనీయ ప్రేమ” ఉంది. కరుణ చూపించడానికి ఆధారం ఉన్నప్పుడు, ఆయన సంతోషంగా కరుణ చూపిస్తాడు. కానీ, ఒక వ్యక్తి మారడానికి ఏమాత్రం ఇష్టపడకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే అప్పుడేంటి? అలాంటప్పుడు యెహోవా తన నీతి ప్రమాణాలకు కట్టుబడి ఉండి, ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. మోషే చెప్పినట్టు, యెహోవా “దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు.”—నిర్గమకాండం 34:6, 7.
18, 19. (ఎ) అసలు యెహోవా చెడ్డవాళ్లను శిక్షిస్తున్నాడు అంటేనే, ఆయనకు విశ్వసనీయత ఉందని ఎందుకు చెప్పవచ్చు? (బి) హింసలు అనుభవించి చనిపోయిన తన సేవకుల మీద యెహోవా విశ్వసనీయత ఎలా చూపిస్తాడు?
18 అసలు యెహోవా చెడ్డవాళ్లను శిక్షిస్తున్నాడు అంటేనే, ఆయనకు విశ్వసనీయత ఉందని అర్థం. అదెలా? దానికి జవాబు ప్రకటన పుస్తకంలో ఉంది. యెహోవా ఏడుగురు దూతలకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, దేవుని కోపంతో నిండిన ఏడు గిన్నెలు భూమ్మీద కుమ్మరించండి.” మూడో దూత తన గిన్నెను “నదుల మీద, నీటి ఊటల మీద” కుమ్మరించినప్పుడు అవి రక్తంలా మారిపోయాయి. అప్పుడు ఆ దూత యెహోవాతో ఇలా అన్నాడు: “ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడా, విశ్వసనీయుడా, ఈ తీర్పులు జారీ చేశావు కాబట్టి నువ్వు నీతిమంతుడివి. వాళ్లు పవిత్రుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని చిందించారు. అందుకే నువ్వు వాళ్లకు తాగడానికి రక్తాన్ని ఇచ్చావు. వాళ్లకు అలా జరగాల్సిందే.”—ప్రకటన 16:1-6.
19 ఆ దేవదూత తీర్పు సందేశాన్ని చెప్తున్నప్పుడు, మధ్యలో యెహోవాను “విశ్వసనీయుడా” అని పిలవడం గమనించారా? అలా ఎందుకు పిలిచాడు? ఎందుకంటే, యెహోవా చెడ్డవాళ్లను నాశనం చేయడం ద్వారా, హింసలు అనుభవించి చనిపోయిన తన నమ్మకమైన సేవకుల మీద విశ్వసనీయత చూపిస్తున్నాడు. విశ్వసనీయ ప్రేమతోనే, యెహోవా అలాంటివాళ్లను తన జ్ఞాపకంలో పదిలంగా పెట్టుకుంటాడు. కన్ను మూసిన ఈ నమ్మకస్థుల్ని మళ్లీ కళ్లారా చూడాలని ఆయన మనసారా కోరుతున్నాడు. ఆయన వాళ్లను పునరుత్థానం చేసి, ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు అని బైబిలు మనకు భరోసా ఇస్తుంది. (యోబు 14:14, 15) తన విశ్వసనీయ సేవకులు ప్రాణాలతో లేనంత మాత్రాన, యెహోవా వాళ్లను మర్చిపోడు. బదులుగా, “వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు.” (లూకా 20:37, 38) తన జ్ఞాపకంలో ఉన్నవాళ్లను బ్రతికించాలన్న యెహోవా కోరికే, ఆయన విశ్వసనీయతకు తిరుగులేని రుజువు.
చనిపోవాల్సి వచ్చినా విశ్వసనీయతను విడిచిపెట్టని వాళ్లను యెహోవా విశ్వసనీయంగా గుర్తుంచుకుంటాడు, తిరిగి బ్రతికిస్తాడు
బెర్నార్డ్ లూమెస్‌ను (ఎడమ), వుల్ఫ్‌గాంగ్ కుస్సేరోను (మధ్యలో) నాజీలు చంపేశారు
మోసెస్ న్యాముస్సావ్‌ను (కుడి) ఒక రాజకీయ గుంపువాళ్లు పొడిచి చంపారు
యెహోవా విశ్వసనీయ ప్రేమ రక్షణకు దారి తెరుస్తుంది
20. “కరుణా పాత్రలు” అంటే ఎవరు? యెహోవా వాళ్లమీద ఎలా విశ్వసనీయత చూపిస్తాడు?
20 చరిత్ర అంతటిలో, నమ్మకమైన మనుషుల మీద యెహోవా గొప్ప విశ్వసనీయతను చూపించాడు. నిజానికి వేల సంవత్సరాలుగా, యెహోవా ‘నాశనానికి తగిన ఉగ్రతా పాత్రల్ని ఓర్పుతో సహిస్తున్నాడు.’ ఎందుకు? “మహిమ కోసం తాను ముందే సిద్ధం చేసిన కరుణా పాత్రల మీద తన గొప్ప మహిమను చూపించడానికే.” (రోమీయులు 9:22, 23) ఎవరు ఈ “కరుణా పాత్రలు”? వాళ్లు పవిత్రశక్తితో అభిషేకించబడిన మంచి మనసున్న ప్రజలు. వాళ్లు దేవుని రాజ్యంలో క్రీస్తుతో కలిసి పరిపాలిస్తారు. (మత్తయి 19:28) రక్షణ పొందేలా ఈ కరుణా పాత్రలకు దారి తెరవడం ద్వారా, యెహోవా అబ్రాహాముకు చేసిన ఈ ఒప్పందానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నాడు: “నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.”—ఆదికాండం 22:18.
యెహోవా విశ్వసనీయతను బట్టి, ఆయన నమ్మకమైన సేవకులందరూ మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు
21. (ఎ) “మహాశ్రమను” దాటి వచ్చే “గొప్పసమూహం” మీద యెహోవా ఎలా విశ్వసనీయత చూపిస్తాడు? (బి) ఆయన విశ్వసనీయ ప్రేమను బట్టి మీకు ఏం చేయాలనిపిస్తుంది?
21 యెహోవా “గొప్పసమూహం” మీద కూడా అలాంటి విశ్వసనీయతే చూపిస్తాడు. వాళ్లు “మహాశ్రమను” దాటి వచ్చి, పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే అవకాశం పొందుతారు. (ప్రకటన 7:9, 10, 14) తన సేవకులు అపరిపూర్ణులైనా, యెహోవా విశ్వసనీయ ప్రేమతో వాళ్లకు పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని ఇస్తాడు. అదెలా? విమోచన క్రయధనం ద్వారా! అది యెహోవా విశ్వసనీయతకు గొప్ప రుజువు. (యోహాను 3:16; రోమీయులు 5:8) కాబట్టి, నీతి కోసం ఆకలిదప్పులతో ఉన్నవాళ్లను యెహోవా విశ్వసనీయత దగ్గరికి తీసుకుంటుంది. (యిర్మీయా 31:3) యెహోవా ఇప్పటివరకు చూపించిన, అలాగే ఇకముందు చూపించబోయే గొప్ప విశ్వసనీయతను బట్టి ఆయనకు దగ్గరైనట్టు మీకు అనిపించట్లేదా? మనం దేవునికి దగ్గరవ్వాలని కోరుకుంటాం కాబట్టి, ఆయన ఇంత ప్రేమ చూపించినందుకు తిరిగి ఆయన్ని విశ్వసనీయంగా సేవించాలని గట్టిగా నిర్ణయించుకుందాం.
a ఆసక్తికరంగా, 2 సమూయేలు 22:26 లో ఉన్న ‘విశ్వసనీయత’ అనే పదాన్ని వేరే లేఖనాల్లో “విశ్వసనీయ ప్రేమ” అని అనువదించారు.