అధ్యాయం 24
ఏదీ ‘దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేదు’
1. చాలామందికి, ఆఖరికి కొంతమంది నిజ క్రైస్తవులకు కూడా ఏం అనిపించవచ్చు?
యెహోవా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? యోహాను 3:16 చెప్తున్నట్లు, దేవుడు మనుషులందర్నీ ప్రేమిస్తాడని కొంతమంది ఒప్పుకుంటారు. కానీ ‘దేవుడు నన్ను ఎప్పటికీ ప్రేమించడు’ అని వాళ్లు అనుకుంటారు. ఆఖరికి నిజ క్రైస్తవులకు కూడా కొన్నిసార్లు అలానే అనిపించవచ్చు. ఒకాయన నిరుత్సాహపడి ఇలా అన్నాడు: “దేవుడు నన్ను పట్టించుకుంటాడు అంటే నాకెందుకో అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు.” మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?
2, 3. యెహోవా మనకు విలువ ఇవ్వడని, మనల్ని ప్రేమించడని అనుకోవాలన్నది ఎవరి కోరిక? అలా అనిపిస్తే మనం ఏం చేయాలి?
2 యెహోవా దేవుడు మనల్ని ప్రేమించడని, మనకు విలువ ఇవ్వడని మనం అనుకోవాలన్నదే సాతాను కోరిక. నిజమే, సాతాను చాలావరకు ప్రజల్లో అహాన్ని, గర్వాన్ని నూరిపోస్తాడు. (2 కొరింథీయులు 11:3) కానీ, బలహీనంగా ఉన్నవాళ్ల ఆత్మగౌరవాన్ని నలగ్గొట్టడం కూడా సాతానుకు మహా ఇష్టం. (యోహాను 7:47-49; 8:13, 44) మరిముఖ్యంగా, ప్రమాదకరమైన ఈ “చివరి రోజుల్లో” అది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది “మమకారం లేని” కుటుంబాల్లో పెరుగుతున్నారు. ఇంకొంతమంది, పొద్దున లేస్తే క్రూరులు, స్వార్థపరులు, మూర్ఖుల మధ్యే తిరగాల్సి వస్తుంది. (2 తిమోతి 3:1-5) ఎన్నో సంవత్సరాలుగా అందరూ తమను చిన్నచూపు చూడడం, తక్కువ జాతివాళ్లు అనడం, లేదా ద్వేషించడం వల్ల వాళ్లు దేవుడు తమకు విలువ ఇవ్వడని, తమను ప్రేమించడని అనుకుంటారు.
3 మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపిస్తే, కంగారుపడకండి. అప్పుడప్పుడు మనలో చాలామందిమి మన గురించి అలానే తక్కువగా ఆలోచిస్తాం. కానీ గుర్తుంచుకోండి, దేవుని వాక్యమైన బైబిలు మనల్ని “సరిదిద్దడానికి” సహాయం చేస్తుంది, అలాగే “బలమైన కోటల్ని కూడా కూలగొట్టేంత” శక్తివంతమైనది. (2 తిమోతి 3:16; 2 కొరింథీయులు 10:4) బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన హృదయాలకు భరోసా ఇస్తాం, ఎందుకంటే కొన్ని విషయాల్లో మన హృదయాలు మనల్ని నిందించవచ్చు; దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని మనం గుర్తుంచుకుందాం.” (1 యోహాను 3:19, 20) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని “మన హృదయాలకు భరోసా” ఇవ్వడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో, ఒక నాలుగు విధానాల్ని ఇప్పుడు చూద్దాం.
యెహోవా కంటికి మీరు విలువైనవాళ్లే
4, 5. యేసు చెప్పిన పిచ్చుకల ఉదాహరణ, మనం యెహోవా కంటికి విలువైన వాళ్లమని ఎలా చూపిస్తుంది?
4 మొదటిగా, యెహోవా తన సేవకుల్లో ప్రతీ ఒక్కరిని విలువైన వాళ్లుగా చూస్తాడని బైబిలు సూటిగా చెప్తుంది. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు: “తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయినా మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు. మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.” (మత్తయి 10:29-31) ఆ మాటల్ని విన్నప్పుడు, యేసు కాలంలోని ప్రజలకు ఎలా అనిపించి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
“మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”
5 అసలు ఎవరైనా పిచ్చుకను ఎందుకు కొంటారు అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆహారం కోసం కొనే పక్షుల్లో, బాగా చవకగా దొరికేది పిచ్చుకే. గమనించండి, తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వచ్చేవి. కానీ యేసు తర్వాత చెప్పినట్టుగా, అలాంటి రెండు నాణేలు ఇస్తే నాలుగు పిచ్చుకలు రావాలి, కానీ ఐదు వచ్చేవి. అంటే, ఉచితంగా ఇచ్చేసిన ఆ ఐదో పిచ్చుకకు వాళ్ల దృష్టిలో ఏ విలువా లేదు. బహుశా మనుషుల దృష్టిలో వాటికి విలువ లేకపోవచ్చు. మరి సృష్టికర్త వాటిని ఎలా చూస్తాడు? యేసు ఇలా చెప్పాడు: “వాటిలో ఒక్కదాన్ని [అంటే ఉచితంగా ఇచ్చిన పిచ్చుకను] కూడా దేవుడు మర్చిపోడు.” (లూకా 12:6, 7) ఇప్పుడు యేసు చెప్పేదేంటో మనకు అర్థమౌతుంది కదా. యెహోవా ఒక్క పిచ్చుకకే అంత విలువ ఇస్తుంటే, మనిషికి ఇంకెంత విలువ ఇస్తాడు! అలాగే, యేసు చెప్పినట్టుగా యెహోవాకు మన గురించి ప్రతీ వివరం తెలుసు. అంతెందుకు మన తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు!
6. మన తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా యెహోవాకు తెలుసు అని చెప్పినప్పుడు, యేసు ఎక్కువ చేసి చెప్తున్నాడా?
6 ఏంటీ . . . ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా తెలుసా? యేసు కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒకసారి పునరుత్థాన నిరీక్షణ గురించి ఆలోచించండి. యెహోవా మనల్ని మనలానే తిరిగి లేపాలంటే, మన గురించి ఆయనకు ఎంత బాగా తెలిసుండాలి! ఆయన మనకు ఎంత విలువ ఇస్తున్నాడంటే, ఆయన మన గురించి ప్రతీ వివరాన్ని గుర్తుంచుకుంటాడు. అంటే మన జన్యు నిర్మాణాన్ని, మనం సంవత్సరాల తరబడి పోగేసుకున్న జ్ఞాపకాల్ని, అనుభవాల్ని ప్రతీదీ గుర్తుపెట్టుకుంటాడు.a దానితో పోలిస్తే, మన తలమీద సగటున ఉండే 1,00,000 వెంట్రుకల్ని లెక్కపెట్టడం ఆయనకు పెద్ద విషయమేమీ కాదు.
యెహోవా మనలో ఏం చూస్తాడు?
7, 8. (ఎ) మనుషుల హృదయాల్ని పరిశీలిస్తున్నప్పుడు, యెహోవా ఏ లక్షణాల్ని చూసి మురిసిపోతాడు? (బి) యెహోవా విలువిచ్చే కొన్ని మంచి పనులు ఏంటి?
7 రెండోదిగా, యెహోవా తన సేవకుల్లో దేన్ని విలువైనదిగా చూస్తాడో బైబిలు చెప్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఆయన మన మంచి లక్షణాల్ని, మనం చేసే ప్రయత్నాల్ని చూసి మురిసిపోతాడు. దావీదు రాజు తన కొడుకైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “యెహోవా హృదయాలన్నిటినీ పరిశీలిస్తాడు, ఆయన ప్రతీ ఆలోచనను, ఉద్దేశాన్ని గ్రహిస్తాడు.” (1 దినవృత్తాంతాలు 28:9) హింసతో, ద్వేషంతో నిండిపోయిన ఈ లోకంలో, యెహోవా కోటానుకోట్ల మనుషుల హృదయాల్ని పరిశీలిస్తున్నప్పుడు శాంతిని, సత్యాన్ని, నీతిని ప్రేమించే హృదయం కనిపిస్తే ఎంత సంబరపడతాడో కదా! తనమీద ప్రేమతో ఉప్పొంగిపోయే, తన గురించి తెలుసుకోవాలని తపించే, అలాగే తన గురించి వేరేవాళ్లకు చెప్పే హృదయాన్ని చూసినప్పుడు, యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఎవరైతే వేరేవాళ్లకు తన గురించి చెప్తారో, వాళ్ల పేర్లను రాసి పెట్టుకుంటానని యెహోవా అంటున్నాడు. ‘యెహోవాకు భయపడుతున్న, ఆయన పేరు గురించి ధ్యానిస్తున్న’ వాళ్లందరి కోసం ఆయన దగ్గర “ఒక జ్ఞాపకార్థ గ్రంథం” కూడా ఉంది. (మలాకీ 3:16) అలాంటి లక్షణాలు ఆయనకు చాలా విలువైనవి.
8 యెహోవా విలువిచ్చే కొన్ని మంచి పనులు ఏంటి? ఖచ్చితంగా, తన కుమారుడైన యేసుక్రీస్తులా ఉండడానికి మనం చేసే కృషిని ఆయన విలువైనదిగా చూస్తాడు. (1 పేతురు 2:21) వాటిలో ఒక ముఖ్యమైన పని ఏంటంటే, దేవుని రాజ్యం గురించి మంచివార్త ప్రకటించడం. రోమీయులు 10:15 లో ఇలా ఉంది: “మంచి విషయాల గురించిన మంచివార్త ప్రకటించేవాళ్ల పాదాలు ఎంత అందమైనవి!” మామూలుగా మన పాదాలు చూసుకొని, ‘అబ్బా, ఎంత అందంగా ఉన్నాయి’ అని అనుకోం. కానీ, ఇక్కడ యెహోవా సేవకులు మంచివార్త ప్రకటించడానికి చేసే ప్రయత్నాల్ని “పాదాలు” అనే పదం సూచిస్తుంది. అలాంటి ప్రయత్నాలన్నీ యెహోవా కంటికి అందంగా, విలువైనవిగా ఉంటాయి.—మత్తయి 24:14; 28:19, 20.
9, 10. (ఎ) రకరకాల కష్టాలు వచ్చినప్పుడు మనం చూపించే సహనాన్ని యెహోవా విలువైనదిగా చూస్తాడని ఎందుకు నమ్మవచ్చు? (బి) తన నమ్మకమైన సేవకుల విషయంలో యెహోవా ఆలోచన ఏంటి?
9 యెహోవా మన సహనాన్ని కూడా విలువైనదిగా చూస్తాడు. (మత్తయి 24:13) గుర్తుంచుకోండి, మీరు యెహోవాను వదిలిపెట్టేయాలని సాతాను కోరుకుంటున్నాడు. కానీ ప్రతీరోజు యెహోవాకు నమ్మకంగా ఉండడం ద్వారా, సాతాను వేసే నిందలకు యెహోవా జవాబు ఇచ్చేలా మీరు సహాయం చేసిన వాళ్లౌతారు. (సామెతలు 27:11) కొన్నిసార్లు సహనం చూపించడం అంటే మాటలు కాదు. ఒకపక్క అనారోగ్య సమస్యలు, డబ్బు టెన్షన్‌లు, ఒత్తిడి, మరోపక్క వేరే కష్టాల వల్ల ఒక్కో రోజు ఒక యుగంలా గడుస్తుంది. ఎదురుచూసినవి ఆలస్యమైనప్పుడు కూడా డీలా పడిపోతాం. (సామెతలు 13:12) అలాంటి పరిస్థితుల్లో మనం చూపించే సహనం, యెహోవాకు ఇంకా ఎక్కువ విలువైనది. అందుకే దావీదు రాజు తన కన్నీళ్లను “తోలుసంచిలో” ఉంచమని యెహోవాను అడుగుతూ, చాలా నమ్మకంగా ఇలా చెప్పాడు: “అవి నీ పుస్తకంలో రాసివున్నాయి.” (కీర్తన 56:8) అవును, యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనం పడే కష్టాలన్నిటినీ, అప్పుడు మనకు వచ్చే కన్నీళ్లన్నిటినీ యెహోవా గుర్తుంచుకుంటాడు, దాచుకుంటాడు. అవి కూడా ఆయన కంటికి చాలా విలువైనవి.
కష్టాల్లో మనం చూపించే సహనాన్ని యెహోవా విలువైనదిగా చూస్తాడు
10 దేవునికి మనం విలువైనవాళ్లం అని చెప్పడానికి ఇన్ని రుజువులు ఉన్నా, మన హృదయం మాత్రం అది నిజం కాదని మనల్ని నిందిస్తూ ఉండవచ్చు. ‘నాకన్నా మంచివాళ్లు బోలెడుమంది ఉన్నారు. వాళ్లతో పోలిస్తే యెహోవా కంటికి నేనెంత!’ అని మన హృదయం నసపెడుతూ ఉండవచ్చు. కానీ, యెహోవా అలా వేరేవాళ్లతో పోల్చడు, మనం చేయగలిగిన దానికి మించి ఆశించడు. (గలతీయులు 6:4) ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, అందులో రవ్వంత మంచి కనిపించినా సరే దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు.
యెహోవా చెడును జల్లెడ పట్టి, మంచిని తీస్తాడు
11. యెహోవా అబీయాకు చేసినదాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
11 మూడోదిగా, యెహోవా మన హృదయాల్ని పరిశీలిస్తున్నప్పుడు దాన్ని జల్లెడ పట్టి, మంచి కోసం వెతుకుతాడు. ఉదాహరణకు, చెడ్డ రాజైన యరొబాము కుటుంబం మొత్తాన్ని నాశనం చేయమని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు, అతని కొడుకుల్లో అబీయాను మాత్రం గౌరవంగా పాతిపెట్టమని చెప్పాడు. ఎందుకు? అతనిలో “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏదో మంచిని చూశాడు.” (1 రాజులు 14:1, 10-13) ఒక విధంగా, యెహోవా ఆ అబ్బాయి హృదయాన్ని జల్లెడ పట్టినప్పుడు “ఏదో మంచి” బయటపడింది. ఆ మంచి రవ్వంత చిన్నదైనా, లేదా ఎవరూ గమనించకపోయినా యెహోవా దాన్ని గమనించి తన వాక్యమైన బైబిల్లో రాయించాడు. చెడ్డ కుటుంబంలో ఆ ఒక్క సభ్యుడి మీద యెహోవా తగినంత కరుణ చూపించి, ఆ రవ్వంత మంచికి ప్రతిఫలం కూడా ఇచ్చాడు.
12, 13. (ఎ) మనం పాపం చేసినా యెహోవా మనలో మంచిని చూస్తాడని, యెహోషాపాతు ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (బి) ఒక ప్రేమగల తండ్రిలా యెహోవా మన మంచి పనుల్ని, లక్షణాల్ని ఎలా చూస్తాడు?
12 ఇంకో చక్కని ఉదాహరణ, మంచి రాజైన యెహోషాపాతుది. అతను ఒక పిచ్చిపని చేసినప్పుడు, యెహోవా ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “అందుకే, యెహోవాకు నీ మీద కోపం వచ్చింది.” అది గుండెలు అదిరిపోయే వార్త! కానీ ప్రవక్త మాటలు అక్కడితో అయిపోలేదు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “అయితే, నీలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయని దేవుడు చూశాడు.” (2 దినవృత్తాంతాలు 19:1-3) యెహోవాకు కోపం రావడం న్యాయమే, అయినా యెహోషాపాతులో ఉన్న మంచిని చూడకుండా అది ఆయన కళ్లను కప్పలేదు. అపరిపూర్ణ మనుషులకు, యెహోవాకు ఎంత తేడా ఉందో కదా! మనకు ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే, వాళ్లలో ఉన్న మంచిని చూడకుండా అది మన కళ్లను కప్పేస్తుంది. అలాగే మనం ఏదైనా పాపం చేసినప్పుడు అయ్యో తప్పు చేశామే అనే బాధ, సిగ్గు, నిరుత్సాహం వల్ల మనలో ఉన్న మంచిని మనం చూడలేకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనం పశ్చాత్తాపపడి ఆ తప్పుల్ని మళ్లీ చేయకుండా ఉండడానికి గట్టిగా కృషి చేసినప్పుడు, యెహోవా మనల్ని క్షమిస్తాడు.
13 యెహోవా మిమ్మల్ని జల్లెడ పడుతున్నప్పుడు ఆ పాపాల్ని అవతల పారేస్తాడు. ఎలాగంటే, బంగారాన్ని వెతికే ఒక వ్యక్తి బంగారపు ముక్కల్ని దాచుకొని, పనికిరాని మట్టి-మషాణాన్ని పారేసినట్టు. మరి మీలో ఉన్న మంచి లక్షణాలు, మంచి పనుల సంగతేంటి? యెహోవా వాటిని భద్రంగా దాచుకుంటాడు! ప్రేమగల తల్లిదండ్రులు, చిన్నప్పుడు వాళ్ల పిల్లలు గీసిన బొమ్మల్ని, తయారుచేసిన చిన్నచిన్న వస్తువుల్ని ఇష్టంగా దాచుకోవడం మీరు చూశారా? పిల్లలు వాటిని మర్చిపోతారేమో గానీ, తల్లిదండ్రులు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా వాటిని భద్రంగా దాచుకుంటారు. యెహోవా వాళ్లకన్నా ప్రేమగల తండ్రి. మనం తనకు నమ్మకంగా ఉన్నంతకాలం ఆయన మన మంచి పనుల్ని, లక్షణాల్ని ఎప్పుడూ మర్చిపోడు. నిజానికి అలా మర్చిపోవడం, ఆయన దృష్టిలో అన్యాయంతో సమానం. ఆయన ఎప్పుడూ అన్యాయస్థుడు కాదు. (హెబ్రీయులు 6:10) అయితే, ఆయన ఇంకో విధంగా కూడా మనల్ని జల్లెడ పడతాడు. అదెలా?
14, 15. (ఎ) మనలో అపరిపూర్ణతలు ఉన్నా యెహోవా మంచినే చూస్తాడని ఎందుకు చెప్పవచ్చు? ఒక ఉదాహరణ ఇవ్వండి. (బి) మనలో మంచిని చూశాక యెహోవా ఏం చేస్తాడు? ఆయన తన నమ్మకమైన ప్రజల్ని ఎలా చూస్తాడు?
14 యెహోవా మన అపరిపూర్ణతలకు మించి చూస్తాడు. మనం ప్రస్తుతం ఏంటన్నది కాదు గానీ, భవిష్యత్తులో ఏం అవ్వగలం అన్నదాని మీద మనసుపెడతాడు. ఉదాహరణకు పెయింటింగ్స్ అంటే పడిచచ్చేవాళ్లు, అవి ఎప్పుడైనా పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇంగ్లాండ్‌లో ఏం జరిగిందో చూడండి. లండన్‌లోని నేషనల్ గ్యాలరీలో, లియోనార్డో డా విన్సీ గీసిన ఒక చిత్రం ఉంది. ఎవరో ఒకాయన తుపాకీ పేల్చి దాన్ని పాడుచేశాడు. దాని విలువ దాదాపు 3 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇప్పుడు అది పాడైపోయింది కాబట్టి దాన్ని చెత్తబుట్టలో పడేయాలి అని ఎవ్వరూ అనలేదు. బదులుగా, దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటి ఆ కళాఖండాన్ని తిరిగి బాగు చేయించడానికి చకాచకా పనులు మొదలుపెట్టేశారు. ఎందుకు? పెయింటింగ్స్‌ని ప్రేమించేవాళ్ల కంటికి అది చాలా విలువైనది. సుద్దముక్కతో, బొగ్గుతో గీసిన ఆ పెయింటింగ్ కంటే మీరు విలువైనవాళ్లు కారా? వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత మీకు ఎన్ని తూట్లు పొడిచినా, దేవుని కంటికి మీరు ఖచ్చితంగా విలువైనవాళ్లే. (కీర్తన 72:12-14) మానవ కుటుంబాన్ని అందంగా చెక్కిన యెహోవా దేవుడు, తనను ప్రేమించి తన మాట వినే వాళ్లందర్నీ తిరిగి పరిపూర్ణతకు తీసుకురావడానికి ఏం చేయాలో అది చేస్తాడు.—అపొస్తలుల కార్యాలు 3:21; రోమీయులు 8:20-22.
15 అవును, మనలో మనం చూడలేని మంచిని కూడా యెహోవా చూస్తాడు. అంతేకాదు, మనం ఆయన సేవ చేస్తుండగా మనలో ఉన్న మంచి పెరిగేలా, చివరికి మనం పరిపూర్ణులం అయ్యేలా ఆయన చేస్తాడు. సాతాను లోకం మనల్ని ఎలా చూసినా, యెహోవా మాత్రం తన నమ్మకమైన సేవకుల్ని చాలా విలువైనవాళ్లుగా చూస్తాడు.—హగ్గయి 2:7.
యెహోవా తన ప్రేమను పనుల్లో చూపిస్తాడు
16. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి గొప్ప రుజువు ఏంటి? ఆ బహుమతి మీ కోసమే అని ఎందుకు నమ్మవచ్చు?
16 నాలుగోదిగా, యెహోవా మనమీద ఉన్న ప్రేమను రుజువు చేయడానికి గొప్ప పని చేశాడు. ఆయన, యేసును విమోచన క్రయధనంగా ఇచ్చాడు. దేవుడు మనకు విలువ ఇవ్వడని, మనల్ని ప్రేమించడని సాతాను చెప్తున్న అబద్ధానికి ఆ విమోచన క్రయధనమే గట్టి సమాధానం. కొయ్య మీద యేసు చిత్రహింసలు పడి చనిపోవడమే పెద్ద బాధంటే, తన ముద్దుల కొడుకు కళ్లముందే చనిపోతుంటే యెహోవా అది చూడడం అంతకుమించిన బాధ. ఇదంతా వాళ్లిద్దరికీ మన మీదున్న ప్రేమకు రుజువు అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ బాధాకరంగా, దేవుడు ఇచ్చిన ఆ బహుమతి తమ కోసమే అని చాలామందికి నమ్మబుద్ధి కాదు. వాళ్లకు అంత అర్హత లేదని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని హింసించాడు, అయినా ఆయన ఇలా రాశాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు.’—గలతీయులు 1:13; 2:20.
17. యెహోవా మనల్ని తనవైపుకు, తన కుమారుడి వైపుకు ఎలా ఆకర్షించుకుంటాడు?
17 అంతేకాదు, క్రీస్తు బలి నుండి ప్రయోజనం పొందేలా మనలో ప్రతీఒక్కరికి సహాయం చేయడం ద్వారా, యెహోవా తన ప్రేమను రుజువు చేస్తున్నాడు. యేసు ఇలా అన్నాడు: “నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు.” (యోహాను 6:44) అవును, యెహోవాయే స్వయంగా మనల్ని తన కుమారుడి వైపుకు ఆకర్షించుకుని, శాశ్వత జీవితం పొందే అవకాశం ఇచ్చాడు. అదెలా? ప్రకటనా పని ద్వారా మనకు మంచివార్త అందేలా యెహోవా చూస్తాడు, అలాగే మనం అపరిపూర్ణులమైనా బైబిలు సత్యాల్ని అర్థం చేసుకుని పాటించేలా తన పవిత్రశక్తి ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు విషయంలో చెప్పినట్టే, మన విషయంలో కూడా ఇలా చెప్పగలడు: “నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. అందుకే విశ్వసనీయ ప్రేమతో నిన్ను దగ్గరికి తెచ్చుకున్నాను.”—యిర్మీయా 31:3.
18, 19. (ఎ) దేని ద్వారా యెహోవాకు మనమీద ఉన్న ప్రేమను చాలా దగ్గరగా రుచి చూస్తాం? ఆయన మనలో ప్రతీ ఒక్కరిని పట్టించుకుంటాడని ఏది చూపిస్తుంది? (బి) యెహోవా తదనుభూతితో వింటాడని బైబిలు ఎలా భరోసా ఇస్తుంది?
18 యెహోవా ప్రేమను చాలా దగ్గరగా రుచి చూడడానికి, ప్రార్థన కన్నా మించిన వరం లేదని చెప్పవచ్చు. “ఎప్పుడూ ప్రార్థించండి” అని బైబిలు మనలో ప్రతీ ఒక్కర్ని ఆహ్వానిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:17) యెహోవా మన ప్రార్థన వింటాడు. ఆయనకు “ప్రార్థనలు వినే దేవా” అనే పేరు కూడా ఉంది. (కీర్తన 65:2) ఆయన ఆ పనిని వేరే ఎవ్వరికీ, ఆఖరికి తన సొంత కుమారునికి కూడా ఇవ్వలేదు. ఒకసారి ఆలోచించండి: ఈ విశ్వానికే సృష్టికర్త తనతో మొహమాటం లేకుండా ఫ్రీగా మాట్లాడమని, ప్రార్థించమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎలా వింటాడు? ఏదో విని విననట్టుగా, పనిలో ఉండి ఒక చెవి వేసినట్టుగా, పట్టించుకోనట్టుగా వింటాడా? కానేకాదు.
19 యెహోవా తదనుభూతితో వింటాడు. తదనుభూతి అంటే ఏంటి? దేవునికి నమ్మకంగా సేవచేసిన ఒక పెద్దవయసు బ్రదర్ ఇలా అన్నాడు: “తదనుభూతి అంటే అవతలివాళ్ల బాధను, మన బాధలా ఫీలవ్వడం.” దెబ్బ మనకి తగిలితే నిజంగా నొప్పి యెహోవాకు కలుగుతుందా? తన ప్రజలైన ఇశ్రాయేలీయులు బాధపడుతున్నప్పుడు, యెహోవాకు ఎలా అనిపించిందో బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్ల బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.” (యెషయా 63:9) యెహోవా వాళ్ల బాధల్ని చూడడం మాత్రమే కాదు, ఆయన కూడా బాధ అనుభవించాడు. ఆయన ఎంతగా బాధపడతాడో ఆయనే స్వయంగా తన సేవకులకు చెప్తున్నాడు: “ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే, వాళ్లు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే.”b (జెకర్యా 2:8) కనుగుడ్డును ముట్టుకుంటే ఎంత నొప్పిగా ఉంటుందో కదా! అవును, మనం బాధపడినప్పుడు కూడా యెహోవాకు అంతే బాధగా ఉంటుంది. మనకు దెబ్బ తగిలితే, ఆయనకు నొప్పి కలుగుతుంది.
20. రోమీయులు 12:3 లో ఉన్న సలహా ప్రకారం, మనం ఎలా ఆలోచించకూడదు?
20 దేవుడు ప్రేమిస్తున్నాడు, విలువిస్తున్నాడు కదా అని పరిణతిగల ఏ క్రైస్తవుడూ అది చూసుకుని గర్వపడడు, తాను ఇతరుల కంటే ఎక్కువ అనుకోడు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయ ద్వారా అక్కడున్న మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా ప్రతీ ఒక్కరు దేవుడు తనకు ఇచ్చిన విశ్వాసం ప్రకారం, తనకు మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.” (రోమీయులు 12:3) వేరే అనువాదంలో ఆ లేఖనం ఇలా ఉంది: “మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి.” (పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి పరలోక తండ్రి ప్రేమలో తడిసి ముద్ద అవుతున్న మనం వివేచన చూపిద్దాం. దేవుని ప్రేమను మనమేదో సంపాదించుకున్నాం అని గానీ, మనకేదో అర్హత ఉండి ఆయన ప్రేమిస్తున్నాడు అని గానీ అనుకోకుండా ఉందాం.—లూకా 17:10.
21. సాతాను చెప్పే ఏ అబద్ధాల్ని మనం తిప్పికొడుతూ ఉండాలి? ఏ సత్యాన్ని చెప్పి మన హృదయాలకు భరోసా ఇస్తూ ఉండాలి?
21 సాతాను చెప్పే ప్రతీ అబద్ధాన్ని నమ్మకుండా ఉండడానికి మనలో ప్రతీ ఒక్కరం చేయగలిగినదంతా చేద్దాం. మనం పనికిరాని వాళ్లం, దేవుడు మనల్ని ప్రేమించడు అని సాతాను కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు. మీ జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల వల్ల మీకు, ‘నేను చెడ్డ వ్యక్తిని కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాడా? అసలు నా ముఖమైనా చూస్తాడా? అన్నీ చూసే దేవునికి నేను చేసే పిసరంత మంచి కనిపిస్తుందా? నేను చేసే పాపాల్ని కప్పడానికి విమోచన క్రయధనమైనా సరిపోతుందా?’ అని అనిపిస్తే అవేవీ నమ్మకండి. అవి పచ్చి అబద్ధాలు! బదులుగా పౌలు దైవప్రేరణతో రాసిన ఈ సత్యాన్ని చెప్తూ, మన హృదయాలకు భరోసా ఇస్తూ ఉందాం: “మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన ఇంకేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని నాకు నమ్మకం కుదిరింది.”—రోమీయులు 8:38, 39.
a బైబిలు పదేపదే పునరుత్థాన నిరీక్షణను, యెహోవాకున్న జ్ఞాపకశక్తితో ముడిపెడుతుంది. దేవుని నమ్మకమైన సేవకుడు యోబు యెహోవాతో ఇలా అన్నాడు: “నువ్వు . . . ఇంత సమయమని నియమించి తర్వాత నన్ను గుర్తుచేసుకుంటే ఎంత బావుంటుంది!” (యోబు 14:13) యేసు కూడా, “స్మారక సమాధుల్లో ఉన్న వాళ్లందరూ” పునరుత్థానం అవ్వడం గురించి మాట్లాడాడు. అది సరైనదే. ఎందుకంటే, యెహోవా ఎవరినైతే పునరుత్థానం చేయాలనుకుంటాడో వాళ్లను పూర్తిగా గుర్తుపెట్టుకుంటాడు.—యోహాను 5:28, 29, అధస్సూచి.
b కొంతమంది అనువాదకులు ఇక్కడ చెప్తున్న కనుగుడ్డు, దేవుని ప్రజల్ని ముట్టుకుంటున్న వ్యక్తి కనుగుడ్డు లేదా ఇశ్రాయేలు కనుగుడ్డే కానీ దేవునిది కాదు అని అంటారు. ‘దేవుని కనుగుడ్డును ముట్టుకోవడమా! అది అగౌరవం కదా’ అని అనుకుని బైబిలు కాపీలు రాసిన కొంతమంది ఆ లేఖనాన్ని మార్చేశారు. వాళ్లు అలా చేయడం వల్ల, యెహోవా ఏ స్థాయిలో మన బాధను తన బాధగా ఫీలవుతాడో తెలియకుండా పోయింది.