ఒక సంకల్పంతో పునర్దర్శనాలు చేయడం
1 పునర్దర్శనం చేసేటప్పుడు, క్రితంసారి మీరు చర్చించిన విషయం గురించి ఆ వ్యక్తికున్న జ్ఞానం పెంపొందేలా చేయగల లేఖనాన్ని ఉపయోగించడానికి మీరు ప్రయత్నించాలి.
2 చందా సేకరించలేకపోతే, పత్రికలను అందించినచోట పునర్దర్శనాలు చేయడంలోని లక్ష్యాల్లో ఒకటేమిటంటే, పత్రికామార్గం స్థాపించుకోవడం. ఇలాంటి ఒక సరళమైన అందింపు ప్రభావవంతంగా ఉండగలదు:
◼ “మనం దేవునికి ఎందుకు భయపడాలో వివరించే శీర్షికగల, నేను మీకిచ్చిన కావలికోటను మీరు చదివి ఆనందించి ఉంటారని నేననుకుంటున్నాను. ‘జీవితం ఎందుకింత చిన్నదిగా ఉంది?’ అని ప్రశ్నించే శీర్షికగల తేజరిల్లు! పత్రికను ఈరోజు నేను తెచ్చాను. అది ఒక మంచి ప్రశ్న, కాదంటారా?” ఇలా చెబుతూ మీరు కొనసాగించవచ్చు: “యోహాను 3:16 నందలి యేసు మాటలు నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తున్నాయి. దయచేసి ఈ పత్రిక తీసుకొని, బైబిలు నందు అందజేయబడిన దృఢమైన నిరీక్షణను బట్టి ప్రోత్సాహాన్ని పొందండి.” తర్వాతి సంచికలను అందజేయడానికి తిరిగి వస్తానని, విధేయులైన మానవజాతి కొరకు దేవుడు ఏం వాగ్దానం చేశాడనేది వీలైతే చర్చిస్తానని వివరించండి. మీరు పత్రికలు అందజేసిన ప్రతిసారి ఒక పునర్దర్శనాన్ని లెక్కించుకోవచ్చని గుర్తుంచుకోండి.
3 “యుద్ధంలేని లోకం—ఎప్పుడు?” (కావలికోట, అక్టోబరు 1) శీర్షికను అందజేసి ఉంటే మీరిలా చెప్పవచ్చు:
◼ “సంపూర్ణమైన శాంతి ఉంటే, ఈ భూమిపై జీవితం ఎలా ఉంటుంది? [జవాబు చెప్పనివ్వండి.] దేవుడు ఏం చేస్తానని వాగ్దానం చేశాడో మీకు చూపించనివ్వండి.” కీర్తన 37:10, 11 చదివి, ఇక్కడ భూమిపై దేవుని చిత్తం నెరవేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించండి. మత్తయి 6:9, 10 నందు వ్రాయబడివున్నట్లుగా, దేని కొరకు ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడో ఆ వ్యక్తికి చెప్పండి. యేసు మాటల భావాన్ని సహేతుకంగా తలంచడానికి అతనికి సహాయం చేయండి. గృహస్థుడు గతంలో కావలికోట లేదా తేజరిల్లు! పత్రికలకు చందాచేయనట్లయితే, మీరు ఇప్పుడు చందా సేకరించి, మరింత చర్చించడానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
4 “జీవితం ఇంత చిన్నదిగా ఎందుకు ఉంది?” అనే ముఖశీర్షిక పరంపరపై మరింత చర్చించడానికి తిరిగి వెళ్లితే, మీరు ఈ విధంగా ప్రారంభించవచ్చు:
◼ “క్రితంసారి నేను వచ్చినప్పుడు, మానవ జీవితాయుష్షు గురించి మనం మాట్లాడాము. నిస్సందేహంగా మీరు తేజరిల్లు! శీర్షికల్లో గమనించినట్లుగా, మనం 70 లేక 80 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించడానికి సహాయం చేసే ఏ నిరీక్షణను శాస్త్రవేత్తలు ఇవ్వలేకపోతున్నారు. కాని బైబిలు వాగ్దానం చేస్తున్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] దేవుని మనస్సులో మానవుని కొరకు మరింత శ్రేష్ఠమైనదొకటుందని బైబిలు చూపిస్తుంది.” ఆ తర్వాత యోహాను 17:3 చదివి, జ్ఞానాన్ని పొందడం నిత్యజీవానికి ఎలా నడిపించగలదో వివరించండి. ఈ సందర్భంలో మీరు గృహబైబిలు పఠనం గురించి చెప్పవచ్చు లేదా మరోసారి చర్చించడానికి ఏర్పాటు చేసుకోవచ్చు.
5 బైబిలు పఠనాన్ని ప్రారంభించడం మన పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం. మీరు అందించిన పత్రికలను తీసుకున్న వ్యక్తిని బహుశా మీరు అనేకసార్లు దర్శించి ఉండవచ్చు. ఈసారి మీరు వెళ్లినప్పుడు ఇలా చెప్పటానికి ఎందుకు ప్రయత్నించకూడదు?:
◼ “మతం గురించి, ఆధునిక జీవనంలో దాని విలువ గురించి ప్రజలకు అనేక భిన్నమైన ఉద్దేశాలున్నాయి. దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు లేక మనమెందుకు వృద్ధులమై మరణిస్తాము అనేవాటి గురించి పరస్పర విరుద్ధమైన నమ్మకాలున్నాయి. ఎలా ప్రార్థించాలి, అది దేవుడు వినేలా ఎలా చేయాలి అనేవాటి గురించి తెలుసుకోవాలని కొంతమంది ప్రజలు ఇష్టపడవచ్చు.” మన బైబిలు పఠన పుస్తకాల్లో ఒకదాన్ని తెరిచి, గృహస్థునికి ఆసక్తికరంగా ఉంటుందని మీకు అనిపించిన అంశాన్ని తీసుకొని, పఠనం ఎలా నిర్వహించబడుతుందో క్లుప్తంగా ప్రదర్శించండి.
6 యెహోవా సంకల్పంగల దేవుడు. అక్టోబరులో ఒక సంకల్పంతో పునర్దర్శనాలు చేయడం ద్వారా మనం ఆయనను అనుకరిద్దాము.