మనకు సంఘం అవసరం
1 యెహోవా సంఘం ఎడల తమకున్న మెప్పును కోరహు కుమారులు ఒకసారిలా వ్యక్తపర్చారు: “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము.” (కీర్త. 84:10) వారి దృష్టిలో, దానితో పోల్చదగినదేది లోకం ప్రతిపాదించలేదు. మీరూ ఆ భావాలనే కలిగివుంటే, సంఘాన్ని మీరు మీ జీవితంలో ముఖ్యకేంద్రంగా చేసుకోవాలి.
2 క్రైస్తవ సంఘం దాని ఆరంభం నుండి యెహోవా ఆశీర్వాదం తనకుందని చూపించింది. (అపొ. 16:4, 5) మనలో ఎవరమూ సంఘం ఎడల కృతఘ్నత కలిగివుండకూడదు లేదా అది కేవలం మనల్ని భౌతికంగా ఒకదగ్గర చేర్చడానికి ఉన్న మూలం మాత్రమేనని భావించకూడదు. సంఘం, ప్రతి సమాజంలో ఉన్న యెహోవాసాక్షులు ప్రోత్సాహాన్ని, బలాన్ని పొందే స్థలం. మనం యెహోవాచే బోధింపబడేలా, రాజ్య పని కొరకు సంస్థీకరింపబడేలా ఐక్య సహవాసం కలిగి ఉండడానికి అది సహాయం చేస్తుంది.—యెష. 2:2.
3 మనకు సత్యం నేర్పించడానికి క్రైస్తవ సంఘం ఒక ప్రాథమిక మార్గం. (1 తిమో. 3:15) యేసు అనుచరులు ‘అందరూ ఏకమై’ ఉండాలి అంటే దేవునితో, క్రీస్తుతో, మరియు ఒకరితో ఒకరు ఐక్యత కలిగివుండాలి. (యోహాను 17:20, 21; యెషయా 54:13 పోల్చండి.) ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ, మన సహోదరులు బైబిలు బోధలను, సూత్రాలను విశ్వసిస్తారు, వాటికనుగుణంగా నడుచుకుంటారు.
4 శిష్యులను చేయడమనే మన పనిని నెరవేర్చడానికి మనం తర్ఫీదు పొంది, సిద్ధం చేయబడ్డాము. లేఖనాధార చర్చలను ప్రారంభించడంలో మనకు సహాయం చేసేందుకు ప్రతి నెల కావలికోట, తేజరిల్లు! మరియు మన రాజ్య పరిచర్య సహాయకరమైన సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఆసక్తిని ఎలా కనుగొని, పెంపొందింపజేయాలనేది మనకు చూపించడానికి కూటాలు ఉద్దేశించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న అభివృద్ధి, ఈ పనిలో మనకు పరలోక మద్దతు ఉందని నిరూపిస్తుంది.—మత్త. 28:18-20.
5 ‘ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయడానికి’ మనం ప్రతి దినం సంఘం ద్వారా, ప్రోత్సాహాన్ని పొందుతాము. (హెబ్రీ. 10:24, 25) మనం శ్రమలను నమ్మకంగా సహించడానికి బలపర్చబడతాము. ఒత్తిళ్లను, వ్యాకులతలను ఎదుర్కోడానికి ప్రేమగల అధ్యక్షులు మనకు సహాయం చేస్తారు. (ప్రసం. 4:9-12) మనం దారితప్పిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు మనకు అవసరమైన ఉపదేశం ఇవ్వబడుతుంది. ఇలాంటి ప్రేమపూర్వక శ్రద్ధను వేరే ఏ సంస్థ అందజేస్తుంది?—1 థెస్స. 5:14.
6 మన ఐక్యతను కాపాడుకోవడానికి మనం తన సంస్థకు సన్నిహితంగా ఉండాలన్నది యెహోవా చిత్తం. (యోహాను 10:16) నమ్మకమైన దాసుని తరగతితో మనం మన సహవాసాన్ని కాపాడుకోవడానికి సంఘం సహాయం చేసే ఒక మార్గమేమిటంటే, మన ప్రోత్సాహం కొరకు ప్రయాణ కాపరులను పంపించడమే. ప్రేమపూర్వక నడిపింపుకు మనం ప్రతిస్పందించడమన్నది, మనల్ని ఆత్మీయంగా బలంగా ఉంచడానికి సహాయం చేసే సన్నిహితత్వంలోకి మనల్ని దగ్గరకు చేస్తుంది.
7 మన ఆత్మీయ జీవనానికి సంఘం అత్యావశ్యకం. దాని నుండి వేరుగా ఉండి, అంగీకార యోగ్యంగా యెహోవాను సేవించడం అసాధ్యం. కాబట్టి మరి మనం యెహోవా ఏర్పాటుచేసినదానికి సన్నిహితంగా ఉందాము. మనం దాని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేద్దాము, అక్కడ మనం పొందే ఉపదేశాన్ని యథార్థంగా అన్వయించుకుందాము. సంఘం మనకు ఎంత ముఖ్యమైనదో మనం ఈ విధంగా మాత్రమే చూపించగలము.—కీర్త. 27:4.