మీ అత్యవసర భావాన్ని కాపాడుకోండి
యెహోవాను పూర్ణప్రాణముతో సేవిస్తూ ఉండడానికి కచ్చితమైన, దేవుడిచ్చిన ఒక మార్గం ఏది? అదేమిటంటే మన హృదయాల్లో లోతుగా నిజమైన అత్యవసర భావాన్ని కలిగివుండడమే. దేవున్ని పూర్ణప్రాణముతో సేవించడమంటే మన సర్వస్వంతో ఆయనను సేవించడమని భావం, దానికి మనల్ని చేయమని ఆయన కోరే ప్రతిదాని ఎడల మనఃపూర్వకమైన, సంపూర్ణమైన విధేయత చూపించడం అవసరం.
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణప్రాణముతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” అని ప్రవక్తయైన మోషే ఇశ్రాయేలు జనాంగానికి ఉపదేశించినప్పుడు ఆయన ఈ అవసరతను నొక్కిచెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 6:5, NW) శతాబ్దాల తర్వాత అదే ఆజ్ఞను యేసుక్రీస్తు ఇలా పునరుద్ఘాటించాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణప్రాణముతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (మత్తయి 22:37, NW) అపొస్తలుడైన పౌలు “దేవుని చిత్తమును పూర్ణప్రాణముతో జరిగించుమని” ఎఫెసీయులకు చెప్పినప్పుడు, “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక యెహోవా నిమిత్తమని పూర్ణప్రాణముతో చేయుడి” అని కొలొస్సయులను కోరినప్పుడు ఆయన అదే అవసరతను సూచించాడు.—ఎఫెసీయులు 6:6, NW; కొలొస్సయులు 3:23, NW.
అయితే, మనలో అంతర్గతంగా అత్యవసర భావం లేకపోతే లేదా మునుపు మనకుండిన అత్యవసర భావం ఇప్పుడు తక్కువైపోవడం—బహుశా పూర్తిగా కోల్పోవడం జరిగితే దేవునికి మనం చేసే సేవలో మనం మన హృదయాన్ని, ప్రాణమును పెట్టడం కష్టమౌతుంది. మానవుని చరిత్రలో మునుపెన్నడూ చూడనటువంటి అత్యవసర సమయంలో నేడు మనం జీవిస్తున్నాము.
అత్యవసరత యొక్క ప్రత్యేకమైన కాలాలు
క్రైస్తవ పూర్వపు కాలాల్లో కొన్ని అత్యవసర కాలాలు ఉండినవి. నోవహు కాలం మరియు సొదొమ గొమొర్రాల నాశనానికి నడిపించిన కాలం కచ్చితంగా నిజమైన అత్యవసరతగల కాలాలైయుండెను. (2 పేతురు 2:5, 6; యూదా 7) జలప్రళయానికి ముందున్న సంవత్సరాలు నిస్సందేహంగా అత్యవసర కార్యంతో నిండివుండెను. జలప్రళయం ఎప్పుడు ప్రారంభమౌతుందో నోవహుకు ఆయన కుటుంబానికి కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, వారి ‘దైవిక భయం’ వారు కాలవిలంబన చేయకుండా వారిని నిశ్చయపర్చి ఉండవచ్చు.—హెబ్రీయులు 11:7.
అలాగే, సొదొమ గొమొర్రాల నాశనానికి ముందు, దేవదూతలు “లోతును త్వరపెట్టి” ఆయనకిలా చెప్పారు: ‘నీ ప్రాణిని దక్కించుకొనునట్లు పారిపొమ్ము!’ (ఆదికాండము 19:15, 17) అవును, ఆ సందర్భంలో కూడా, అత్యవసరత నీతిమంతుల జీవితాలను కాపాడింది. శతాబ్దాల తర్వాత, బబులోనులోని బందీలైన యూదులు, “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి” అని ప్రోత్సహించబడ్డారు. (యెషయా 52:11) ఆ అత్యవసర ప్రవచనార్థక ఆజ్ఞకు విధేయులై సా.శ.పూ. 537లో దాదాపు 2,00,000 మంది బందీలు బబులోనులో నుండి వేగంగా బయటికి వచ్చారు.
ఆ సందర్భాల్లోని ప్రతిదానిలో అత్యవసర భావం, తాము అత్యవసర కాలాల్లో జీవిస్తున్నామని భావించి ఆ నమ్మకాన్ని సజీవంగా ఉంచుకున్న వారు పూర్ణప్రాణముతో సేవచేయడానికి దారితీసింది.
క్రైస్తవ కాలాల్లో అత్యవసరత
క్రైస్తవ గ్రీకు లేఖనాలన్నిటిలోను అత్యవసర భావం కొరకైన అవసరత నొక్కిచెప్పబడింది. ‘జాగ్రత్తపడుడి,’ ‘మెలకువగా నుండుడి,’ ‘కనిపెట్టుకొని యుండుడి,’ ‘సిద్ధముగా ఉండుడి’—ఈ పదాలన్నీ తన అనుచరులలో సరైన అత్యవసర భావాన్ని కలిగించేందుకు యేసుక్రీస్తు ఉపయోగించినవే. (మత్తయి 24:42-44; మార్కు 13:32-37) అంతేగాక, పదిమంది కన్యకలు, దుష్టుడైన దాసుడు, తలాంతులు, మేకలలో నుండి గొర్రెలను వేరుచేయడం వంటివాటిని గూర్చిన ఆయన ఉపమానాలన్నీ ఎదురుచూడడాన్ని పురికొల్పి, అత్యవసర భావాన్ని కలిగిస్తాయి.—మత్తయి 25:1, 14, 15, 32, 33.
యేసు అత్యవసరత గురించి మాట్లాడడమే కాదుగాని, అత్యవసరతతో పనిచేయడం ద్వారా కూడా ఆయన తన మాటల యథార్థతను బలపర్చాడు. ఒక సందర్భంలో ఆయనను ఆపాలని జనసమూహము ప్రయత్నించినప్పుడు, ఆయన “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని” వారితో చెప్పాడు. (లూకా 4:42, 43) అంతేగాక, “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు” గనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుమని ఆయన తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్తయి 9:37, 38) దేవునికి చేసే అలాంటి ప్రార్థనాపూర్వక విజ్ఞాపన వాస్తవానికి అత్యవసర స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది.
అలాంటి అత్యవసరత సరైనదికాదా?
కొందరు న్యాయసమ్మతమైన ఈ ప్రశ్నను లేవదీయవచ్చు, ప్రవచింపబడిన “మహా శ్రమ” శతాబ్దాల తర్వాత రానైయుంటే పూర్వం ఆ కాలంలోనే అత్యవసర భావం ఎందుకు అవసరమైంది?—మత్తయి 24:21.
అది కేవలం ప్రకటన మరియు బోధనా పనిలో తన అనుచరులను తీరికలేనివారిగా ఉంచేందుకు యేసు ఉపయోగించిన ఎత్తుకాదని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. కాదు, అది తన శిష్యుల ఎడల క్రీస్తుకున్న ప్రేమ, అలాగే సమయాన్ని గూర్చిన యెహోవా దృక్కోణం ఎడల ఆయనకు గల పరిపూర్ణమైన అవగాహన అత్యవసరతపై ఆయన ఇచ్చిన ఉపదేశానికి ఆధారం. అవును, దేవుని సంకల్పం ప్రకారం యెహోవా చిత్తాన్ని నెరవేర్చేందుకు అత్యవసర స్ఫూర్తి అవసరమని క్రీస్తుయేసుకు తెలుసు. అంతేగాక, తాను తిరిగివచ్చే వరకు అత్యవసర భావాన్ని కలిగివుండడం ద్వారా తన శిష్యులు ఆత్మీయంగా ప్రయోజనం పొందగలరని ఆయనకు తెలుసు.
ఒక పరిమిత సమయంలో ముగించవలసిన ప్రపంచవ్యాప్త సాక్ష్యపు పని ఉందని యేసుక్రీస్తు స్పష్టంగా సూచించాడు. (మత్తయి 24:14; మార్కు 13:10) ఈ పని యొక్క క్రమమైన స్థాయిలు కేవలం ఆ పని విశదమైన తర్వాతనే బయల్పర్చబడ్డాయి. కాని ప్రతి పనిని నెరవేర్చడానికి అత్యవసరత అవసరమైంది. “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” చెప్పినప్పుడు యేసు ఈ పని యొక్క అభివృద్ధిని సూచించాడు. (అపొస్తలుల కార్యములు 1:8) మరియు ఆ విధంగా ఆ పని ప్రస్తుత కాలం వరకు విశదపర్చబడుతూ వచ్చింది. కొన్నిసార్లు అర్థం చేసుకోవడంలో సవరణలు చేసుకునే అవసరతను కలుగజేస్తూ, కాలగమనంలో అది దేవుని సేవకులకు కొన్ని ఆశ్చర్యాలను కలిగించింది.
క్రైస్తవ అత్యవసర భావం యెహోవా సంకల్పానికి దోహదపడింది. యెహోవా యొక్క తిరుగులేని కాలపట్టిక ప్రకారం తమ పని అభివృద్ధిని కొనసాగించేందుకు అది క్రీస్తు శిష్యులకు సహాయపడింది. అలాగే నేడు, ఇంచుమించు 2,000 సంవత్సరాలు వెనక్కి చూసినప్పుడు మనం ఆ దైవిక పట్టికను మరింత పూర్ణంగా అర్థం చేసుకుంటాము.
యెరూషలేము, యూదయ, సమరయలలో మరియు ఇశ్రాయేలీయుల ఎడల ప్రత్యేక అభిమానం ముగింపుకు వచ్చినప్పుడు సా.శ. 36కు ముందు చెదరిపోయిన యూదులకు సంపూర్ణమైన సాక్ష్యం ఇచ్చేందుకు క్రైస్తవ అత్యవసరత శిష్యులకు సహాయం చేసింది. (దానియేలు 9:27; అపొస్తలుల కార్యములు 2:46, 47) అలాగే, త్వరలోనే వారి విధానం అంతమౌతుందని యూదులందరికీ స్పష్టమైన హెచ్చరికనివ్వడంలో క్రైస్తవ అత్యవసరత తొలి సంఘానికి సహాయం చేసింది. (లూకా 19:43, 44; కొలొస్సయులు 1:5, 6, 23) సా.శ. 70లో అది అనుకోనిరీతిగా అంతమైన తర్వాత, ప్రవచించబడిన మతభ్రష్టత్వం దాని మరణకరమైన ఆత్మీయ అంధకారాన్ని వ్యాప్తి చేయకముందు అనేకులకు పరలోక నిరీక్షణను ప్రకటించేందుకు క్రీస్తు యొక్క మొదటి శతాబ్దపు సాక్షులకు అత్యవసరత సహాయం చేసింది. (2 థెస్సలొనీకయులు 2:3; 2 తిమోతి 4:2) ఆ తర్వాత, మధ్యయుగానికి సంబంధించిన శతాబ్దాలలో, క్రీస్తుయేసు ప్రవచించినట్లుగా గోదుమల వంటి కొంతమంది క్రైస్తవులు రాజ్య నిరీక్షణను సజీవంగా ఉంచారు. (మత్తయి 13:28-30) చివరికి, ఆయన నియమిత కాలంలో, ఈ అంతిమ తరంలో జీవిస్తున్న వారికి తీర్పును గూర్చిన తన అత్యవసర సమాచారంతో పురికొల్పబడిన ఒక శక్తివంతమైన, ఆధునిక దిన సంఘాన్ని యెహోవా ఉత్పన్నం చేశాడు.—మత్తయి 24:34.
ప్రాచీనకాలంనాటి దానియేలు వలె, దేవుని నమ్మకమైన ఆధునిక దిన సాక్షులు యెహోవాను ఎన్నడూ “నీవేమి చేయుచున్నావని” ప్రశ్నించడానికి ధైర్యం చేయరు. (దానియేలు 4:35) సమయం ప్రకారం తన పని జరిగేలా చూడడానికి కచ్చితంగా ఏమి అవసరమో యెహోవాకు తెలుసని వారు నమ్మకం కలిగివుంటారు. విషయాలను యెహోవా ఏర్పాటు చేసే విధానాన్ని ప్రశ్నించే బదులు, ఈ ప్రాముఖ్యమైన సమయాల్లో తనతోపాటు కలిసి పనిచేసే అవకాశాన్ని దేవుడు తమకిచ్చినందుకు వారు సంతోషిస్తారు.—1 కొరింథీయులు 3:9.
అత్యవసరతకు మరింత ప్రోత్సాహం
అత్యవసరతకు మరో కారణం ఏమిటంటే, మహా శ్రమ హఠాత్తుగా ప్రారంభమయ్యే కచ్చితమైన దినం మరియు గడియ ఏదో కచ్చితంగా చెప్పలేని మన అశక్తత. ఆ కష్టతరమైన సంఘటన ప్రారంభమయ్యే ముందే నిర్ణయించబడిన దినం మరియు గడియ గురించి భూమిపైనున్న ఎవరికీ తెలియదని క్రీస్తుయేసుకు కచ్చితంగా తెలుసు. (మత్తయి 24:36) మరో సందర్భంలో ఆసక్తిగల తన అపొస్తలులకు ఆయనిలా చెప్పాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” (అపొస్తలుల కార్యములు 1:7) అవును, ఫలితం స్పష్టంగా ఉంది, కాని అన్ని వివరాలు తెలుసుకోవడం మన పని కాదు.
అపొస్తలుడైన పౌలు అత్యవసరతను గూర్చి సరైన దృక్పథం కలిగి ఉండేవాడు. క్రీస్తు ప్రత్యక్షత గురించి థెస్సలొనీకయులకు, “సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు” అని ఆయన వ్రాసినప్పుడు బహుశా ఆయన మనస్సులో యేసు మాటలు ఉండివుండవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:1) “భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” యేసు చెప్పిన 17 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పత్రిక వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 1:8) ఆ సమయంలో ఇక ఎక్కువ వ్రాయటానికి వీలులేదు ఎందుకంటే అప్పటికి మరింత ఎక్కువ బయల్పర్చబడలేదు. అయినప్పటికీ వారు అత్యవసరతతో ప్రకటిస్తూ ఉండగానే యెహోవా దినము “రాత్రి వేళ దొంగ” వచ్చినట్లు తప్పకుండా వస్తుందని క్రైస్తవులు నమ్మకం కలిగివుండవచ్చు.—1 థెస్సలొనీకయులు 5:2.
మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ మాటలను మనస్సులో ఉంచుకుని, యెహోవా దినం శతాబ్దాల తర్వాత వస్తుందని భావించారంటే అవాస్తవంగా అనిపించవచ్చు. నిజమే, దూర ప్రాంతానికి వెళ్లిన రాజు గురించి, దేశాంతరం పోయిన మనుష్యుని గురించి యేసు చెప్పిన ఉపమానాలు వారికి తెలుసు. రాజు “చివరికి” తిరిగి వస్తాడని, ఆ ప్రయాణికుడు “బహు కాలమైన తరువాత” వస్తాడని ఆ ఉపమానాలు చూపించాయని కూడా వారికి తెలుసు. కాని, “చివరికి” అంటే ఎప్పుడు? “బహు కాలమైన తరువాత” అంటే భావమేమిటి? పది సంవత్సరాలా? ఇరవై సంవత్సరాలా? యాభై సంవత్సరాలా? లేక ఇంకా ఎక్కువ సమయమా? వంటి ప్రశ్నల గురించి వారు నిస్సందేహంగా అయోమయంలో పడివుంటారు. (లూకా 19:12, 15; మత్తయి 25:14, 19) “మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని” చెప్పిన యేసు మాటలు వారి చెవులలో మారుమ్రోగుతూనే ఉంటాయి.—లూకా 12:40.
అత్యవసరత యొక్క అనుకూలమైన ప్రభావం
అవును, దేవుడు పురికొల్పిన అత్యవసరతా భావం అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పనియైన ప్రకటించడం, బోధించడంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు పనితొందర కలిగి ఉండేందుకు సహాయపడుతూ వారిపై అద్భుతంగా ప్రోత్సాహకరమైన ప్రభావాన్ని చూపింది. అది నేడు మనల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూనే ఉంది. మనం ప్రసన్నంగా ఉండకుండా లేక “మేలు చేయుటయందు విసుకక” ఉండేలా అది చేస్తుంది. (గలతీయులు 6:9) లోకం మరియు దాని మోసకరమైన వస్తుదాయకత్వంలో ఎక్కువగా నిమగ్నమై ఉండకుండా అది మనల్ని కాపాడుతుంది. అది “వాస్తవమైన జీవము”పై మన మనస్సులను ఉంచుతుంది. (1 తిమోతి 6:19) ప్రభువైన యేసు తన శిష్యులు ‘తోడేళ్ల మధ్య గొర్రెల’ వలె ఉంటారని చెప్పాడు, లోకంతో పోరాడేందుకుగాను మనం దృఢ నిశ్చయత, స్థిర దృక్పథం కలిగి ఉండవలసిన అవసరత ఉందని ఆయనకు తెలుసు. అవును, మనం మన క్రైస్తవ అత్యవసర భావించే సురక్షితం చేయబడ్డాం, కాపాడబడ్డాం.—మత్తయి 10:16.
తన సేవకులు తమ అత్యవసర భావాన్ని సజీవంగా ఉంచుకొనేందుకు తగినంత సమాచారాన్ని యెహోవా దేవుడు తన అనంతమైన జ్ఞానంతో వారికి ఎల్లప్పుడూ అందజేశాడు. ఈ అవినీతికరమైన విధానం యొక్క “అంత్యదినములలో” మనమున్నామని ఆయన మనకు దయాపూర్వకంగా హామీ ఇచ్చాడు. (2 తిమోతి 3:1) మనం జీవిస్తున్న ఈ తరం మహాశ్రమలో మరియు అర్మగిద్దోనునందు దాని ముగింపులో అంతమైపోయే వరకు మనం జ్యోతులవలె ప్రకాశించాలని మనకు తదేకంగా గుర్తు చేయబడుతోంది.—ఫిలిప్పీయులు 2:15; ప్రకటన 7:14; 16:14, 16.
అవును, పూర్ణప్రాణముతో యెహోవాను సేవించడంలో దైవిక అత్యవసర భావం ఒక అంతర్గత భాగం అయ్యుంది. అది కాపాడుతుంది మరియు దేవుని సేవకులు ‘అలసట పడేలా, వారి ప్రాణములు విసుగు’ చెందేలా చేయాలని అపవాది చేసే ప్రయత్నాలను ఎదిరించేందుకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 12:3) పూర్ణప్రాణముతో కూడిన భక్తి యెహోవా సేవకులు నిరంతరం ఆయనకు విధేయులయ్యేలా చేస్తుంది, కాని ఇప్పుడు, అర్మగిద్దోనుకు ముందటి ఈ దినాల్లో నిజమైన అత్యవసర భావం పూర్ణప్రాణముతో కూడిన భక్తిలో అత్యావశ్యమైన భాగము.
“ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము” అని చెప్పిన అపొస్తలుడైన యోహాను మాటలను ప్రతిధ్వనించడంలో మనం కొనసాగుతుండగా మనం మన అత్యవసర భావాన్ని కాపాడుకోవడానికి మన దేవుడైన యెహోవా మనకందరికీ సహాయం చేయునుగాక.—ప్రకటన 22:20.