కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/1 పేజీలు 15-20
  • క్రైస్తవ కుటుంబము కలిసి పనిచేయును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ కుటుంబము కలిసి పనిచేయును
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు కలిసి పనులను చెయ్యాలి?
  • కుటుంబ పఠనములో కలిసిపనిచేయుట
  • సువార్త ప్రకటన పనిలో కలిసి పనిచేయుట
  • సమస్యలను పరిష్కరించుకొనుటలో కలిసిపనిచేయుట
  • వినోదములో కలసిపనిచేయుట
  • కలిసివుండటం వలన కలిగే ఆశీర్వాదములు
  • కుటుంబం—ఒక మానవ అవసరత!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • కుటుంబమంతా కలిసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • కుటుంబాలకు సహాయం
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/1 పేజీలు 15-20

క్రైస్తవ కుటుంబము కలిసి పనిచేయును

“సహోదరులారా, మీరందరు . . . యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను, . . . సన్నద్ధులైయుండవలెననియు మిమ్మును వేడుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 1:10.

1. ఐక్యత విషయంలో అనేక కుటుంబాల్లో ఉన్న పరిస్థితి ఏమిటి?

మీది ఐక్యతగల కుటుంబమేనా? లేక ప్రతివారు వారివారి యిష్టప్రకారం ఎవరతంట వారు వచ్చి పోయేదిగా ఉందా? మీరు పనులు కలిసి చేస్తారా? లేక అందరు ఒక చోట కలవడమంటే చాలా అరుదైన సంగతా? “కుటుంబము” అనే పదములో ఐక్యమైయున్న గృహము అనే భావమున్నది.a కానీ అనేక కుటుంబాలు అలా ఐక్యంగా లేవు. ఒక బ్రిటీషు లెక్చరరు ఇలా అనవలసి వచ్చింది: “మంచి సమాజానికి మంచి ఆధారమై యుండాల్సిన దానికి బదులుగా కుటుంబము సమస్త కలతలకు . . . మూలమయ్యింది.” అది మీ కుటుంబ విషయములోనూ నిజమా? అయితే అది అలాగే ఉండవలసిందేనా?

2. బైబిలులోని ఏ వ్యక్తులు ఒక మంచి కుటుంబమునుండి వచ్చారనేదానికి రుజువునిస్తున్నారు?

2 తల్లిదండ్రులు ఇరువురు లేక ఒకరేవున్నా కుటుంబంలో ఐక్యతగాని, లేక అనైక్యతగాని దాని నాయకత్వంపై ఆధారపడివుంటుంది. బైబిలు కాలాల్లో కలిసి ఐక్యంగా ఆరాధించిన కుటుంబాలు యెహోవా ఆశీర్వాదమును అనుభవించాయి. పురాతన ఇశ్రాయేలీయుల విషయంలోను ఇది వాస్తవము. యెఫ్తా కుమార్తె, సమ్సోను, సమూయేలు మొదలగు వీరంతా తాము దైవసంబంధమైన కుటుంబమునుండి వచ్చామని వివిధరీతులలో రుజువుపరచారు. (న్యాయాధిపతులు 11:30-40; 13:2-25; 1 సమూయేలు 1:21-23; 2:18-21) తొలి క్రైస్తవుల కాలాల్లో పౌలుతో పాటు కొన్ని మిషనరీ ప్రయాణాలలో నమ్మకమైన సహవాసిగావున్న తిమోతి, తన అవ్వయైన లోయి, తల్లి యునీకేల వలన హెబ్రీలేఖనముల జ్ఞానముతో పెంచబడ్డాడు. ఆయన పెరిగి ఎంతటి గొప్ప శిష్యుడు, మిషనరీ అయ్యాడో చూడండి!—అపొస్తలుల కార్యములు 16:1, 2; 2 తిమోతి 1:5; 3:14, 15; అపొస్తలుల కార్యములు 21:8, 9 కూడా చూడండి.

ఎందుకు కలిసి పనులను చెయ్యాలి?

3, 4. (ఎ) ఐక్యమైన కుటుంబములో ఏ లక్షణములు ప్రదర్శితం కావాలి? (బి) ఒక గృహము కేవలము ఒక ఇంటికంటె మిన్నయైనదిగా ఎలా కాగలదు?

3 పనులను కలిసి చేసుకోవడం వలన కుటుంబాలకు ప్రయోజనమేమిటి? అది వారి మధ్య పరస్పర అవగాహనను, గౌరవాన్ని పెంచుతుంది. మనము ఒకరికొకరము దూరమయ్యే బదులు, సన్నిహితంగా ఉండి మద్దతు నిచ్చుకుంటాము. ఫ్యామిలి రిలేషన్స్‌ అనే జర్నల్‌లో ఇటీవలి ఒక శీర్షిక ఇలా తెలిపింది: “‘బలమైన కుటుంబములకు’ కావలసిన నిర్దిష్ట లక్షణాలను తెలియజేసే ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అవేమనగా ఒకరియెడల ఒకరికి అంకితభావము, మెప్పు, సన్నిహితత్వము, మంచి సంభాషణ, సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యము, జీవితంలో బలమైన ఆత్మీయ స్థితి.”

4 ఈ లక్షణాలు కుటుంబములోనున్నప్పుడు, ఇల్లనేది ఎన్నటికి ఇంధనం నింపుకొనే స్థలమైన ఒక పెట్రోలు బంకువంటిదిగా ఉండదు. అది కేవలం ఒక ఇల్లే కాక, కుటుంబ సభ్యులను ఆకర్షించే ఆహ్వాన స్థలమైయుంటుంది. ఆప్యాయత, అనురాగము, జాలి, అవగాహనలకు అది ప్రశాంత నిలయంగా ఉంటుంది. (సామెతలు 4:3, 4) అది ఐక్యత కనిపించే పక్షిగూడులా ఉంటుందిగాని, విభజన, వేర్పాటుకుచోటైన తేలు గూడుగా ఉండదు. అయితే అది ఎలా సాధ్యమౌతుంది?

కుటుంబ పఠనములో కలిసిపనిచేయుట

5. నిజమైన ఆరాధనను నేర్చుకోడానికి మనము ఏమి ఉపయోగిస్తాము?

5 యెహోవాయొక్క సత్యారాధనను, తర్కనా సామర్థ్యాన్ని ఉపయోగించుటనుబట్టి లేక “పరీక్షించి తెలిసి” కొనుటనుబట్టి నేర్చుకొనడం జరుగుతుంది. (రోమీయులు 12:1) అరచి ప్రసంగాలిచ్చినందువల్ల లేక టివి., ప్రచారకుల ప్రసంగాలవల్ల ఉద్రేకపర్చబడేవారివలె మన ప్రవర్తన క్షణికమైన భావోద్రేకాల మూలంగా, నడిపించబడేదై యుండకూడదు. బదులుగా బైబిలును మరియు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా అందించబడే సాహిత్యాలను క్రమముగా చదివి ధ్యానించుట మూలంగా మనము పురికొల్పబడుతున్నాము. (మత్తయి 24:45) ఉత్పన్నమయ్యే ఏ పరిస్థితి, లేక శోధనలోనైనా క్రీస్తువంటి మనస్సును కలిగివుండుటనుబట్టి ఫలించేయే మన క్రైస్తవ క్రియలు. ఆ విషయానికొస్తే, యెహోవాయే మన గొప్ప విద్యాబోధకుడు.—కీర్తన 25:9; యెషయా 54:13; 1 కొరింథీయులు 2:16.

6. కుటుంబ పఠనమునకు మనకు ఏ ప్రపంచవ్యాప్తమైన ఉదాహరణ కలదు?

6 ప్రతీ క్రైస్తవ కుటుంబ ఆత్మీయత విషయంలో కుటుంబ బైబిలు పఠనము ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది. మీ కుటుంబ పఠనాన్ని మీ రెప్పుడు నిర్వహిస్తారు? అది ఒక పథకం లేకుండా అవకాశం మీద ఆధారపడివుందా లేక అప్పటికప్పుడు క్షణాల మీద తీసుకునే నిర్ణయంగా ఉందా, అట్లయితే అది అప్పుడప్పుడూ జరిగేదయ్యేవుంటుంది, లేక అసలు జరగకపోవచ్చు. కుటుంబ పఠనములో అందరూ కలవాలంటే క్రమమైన, నిర్ణీత కాల క్రమపట్టిక అవసరము. అప్పుడు కుటుంబంలో అందరికి ఏ రోజులో ఏ గంటకు కుటుంబ ఆత్మీయవిందుకు కలిసివుండాలో తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికంటే ఎక్కువగానున్న బెతేలు కుటుంబమునకు వారి కుటుంబ పఠనము సోమవారము సాయంకాలం అని తెలుసు. బేతేలులో స్వచ్ఛందగా పనిచేసే వీరికంతా ఆ దినముగింపులో పసిఫిక్‌ దీవులు మొదలుకొని న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, తైవాన్‌, హాంకాంగ్‌, అలా ఆసియా మీదుగా ఆఫ్రికా, ఐరోపా, చివరకు అమెరికా ఖండాల్లోని వారంతా ఒకే పఠనములో పాల్గొన్నారని గుర్తుంచుకొనుట ఎంతగా వారిని పురికొల్పుతుంది! వేలాది కిలోమీటర్లు, విభిన్న భాషలవలన వారు దూరం చేయబడినప్పటికి, ఈ కుటుంబ పఠనము బెతేలు కుటుంబ సభ్యులలో ఒక విధమైన సన్నిహిత భావాన్ని పుట్టిస్తుంది. కొద్దిమోతాదులో మీ కుటుంబ పఠనము ద్వారా మీరు అదే భావాన్ని పెంపొందించగలరు.—1 పేతురు 2:17; 5:9.

7. పేతురు చెప్పిన ప్రకారము, వాక్య సత్యాన్ని మన మెలా దృష్టించాలి?

7 అపొస్తలుడైన పేతురు మనకు ఇలాంటి ఉపదేశాన్నిస్తున్నాడు: “ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల . . . క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:2, 3) ఈ మాటలలో పేతురు ఎంతటి చక్కని వర్ణనను అందిస్తున్నాడు! ఇక్కడ ఆయన ఎ’పి పొ’థె సేటి అనే గ్రీకు కియా పదాన్ని ఉపయోగించాడు. లింగ్విస్టిక్‌ కీ టు ది గ్రీక్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ ప్రకారం “వాంఛించుట, కోరుట, ఆశించుట” అనే పదము నుండి ఇది వచ్చింది. ఇందులో గాఢమైన ఆశ అనే భావమున్నది. ఒక లేగ దూడ దాని తల్లి చనుమొనలకై ఎంత ఆరాటముతో వెదకుతుందో మీరు చూశారా, బిడ్డ తన తల్లి స్తన్యమును కుడుచునప్పుడు ఎంత పోరాటము సల్పుతాడో గమనించారా? మనకు కూడా వాక్య సత్యముపట్ల అలాంటి కోరిక ఉండాలి. గ్రీకు విద్వాంసుడు విలియమ్‌ బార్‌క్లే ఇలా అన్నాడు: “యథార్థమైన క్రైస్తవునికి దేవుని వాక్యమును పఠించడం ఆనందదాయకంగా ఉంటుందికాని, కష్టంగా ఉండదు, ఎందుకంటే అతని హృదయము వాంఛించే పోషణ అక్కడే లభిస్తుందని అతనికి తెలుసు.”

8. కుటుంబ పఠనమును నిర్వహించే సమయంలో కుటుంబ యజమానికి ఎదురయ్యే సవాలు ఏమిటి?

8 కుటుంబ పఠనము కుటుంబ శిరస్సుపై ఒక పెద్ద బాధ్యతనుంచుతుంది. ఆయన ఆ పఠనాన్ని అందరికి ఆసక్తికరంగానూ, అందరూ పాల్గొనే విధంగానూ చెయ్యాలి. పఠనం కేవలం పెద్దవారికి మాత్రమే ఉందన్నట్లు పిల్లలు భావించేలా చేయకూడదు. ఎంత భాగము పఠిస్తున్నామనేదానికంటె ఎంత శ్రేష్టంగా పఠిస్తున్నామనేది ముఖ్యము. బైబిలును సజీవకరంగా ఉపయోగించండి. యుక్తమనుకొన్నచోట్ల, మీరు చర్చించే సంగతులు పాలస్తీనాలో ఎక్కడా జరిగాయో మీ పిల్లలు దృశ్యీకరించుకొనేలా వారికి సహాయపడండి. ప్రతిఒక్కరు వారివారి వ్యక్తిగత పరిశోధన జరిపి, కుటుంబముతో పాలుపంచుకొనేలా ప్రోత్సహించండి. ఈ విధంగా పిల్లలు కూడా “యెహోవా సన్నిధిని” ఎదుగగలరు.—1 సమూయేలు 2:20, 21.

సువార్త ప్రకటన పనిలో కలిసి పనిచేయుట

9. ప్రకటించే పనిని కుటుంబమునకు ఒక సంతోషకరమైన అనుభవంగా ఎలా చేయవచ్చును?

9 యేసు ఇలా అన్నాడు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10) ఆ మాటలు మనఃపూర్వకంగా ప్రవర్తించే ప్రతి క్రైస్తవునికి ఒక పనిని—అనగా సువార్త ప్రకటించే పనిని, దేవుని రాజ్యసువార్తను ఇతరులకు అందించే పనిని అప్పగిస్తున్నది. ఈ పనిని ఒక కుటుంబముగా కలిసి చేయుట ప్రోత్సాహకరంగాను, ఆనందదాయక అనుభవంగాను ఉండగలదు. తమ పిల్లలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. పదిహేను నుండి ఇరవై ఒక్క సంవత్సరముల మధ్యవయస్సుగల ముగ్గురు కుమారుగల ఒక దంపతులు వారికి తమపిల్లలతో పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం స్కూలు విడిచిన తరువాత, ప్రతి శనివారం ఉదయం ఇంటింటిసేవకు వెళ్లే అలవాటు కలదని చెబుతున్నారు. తండ్రి ఇలా అంటున్నాడు: “మేము ప్రతిసారి వారికి ఏదో ఒకటి బోధిస్తాము. ఇది వారికి ఒక ఆనందదాయకమైన, ప్రోత్సాహకరమైన అనుభవంగా ఉండేలా చూస్తాము.”

10. తల్లిదండ్రులు తమ పిల్లలకు పరిచర్యలో ఎట్లు ప్రయోజనాన్ని చేకూర్చగలరు?

10 ప్రకటించే పనిలో, బోధించే పనిలో ఒక కుటుంబంగా కలిసి పనిచేయడం ఎంతో ఫలవంతంగా ఉండగలదు. కొన్నిసార్లు ప్రజలు చిన్నపిల్లవాడు క్లుప్తంగా నిష్కల్మషంగా అందించిన సమాచారానికి ప్రజలు అనుకూలంగా స్పందిస్తారు. అంతేగాక పిల్లవానికి సహాయం చేసేందుకు తల్లిగాని, తండ్రిగాని అక్కడే ఉంటారు. తమ పిల్లలు క్రమక్రమంగా తర్ఫీదుపొందుతూ, “సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు” పరిచారకులుగాను తయారవునట్లు చేయవచ్చును. ఇలా కలిసి పనిచేయడంద్వారా తమ పిల్లల స్వభావాన్ని, సమర్థతను, పరిచర్యలో మంచి మర్యాదలను పరిశీలించే అవకాశం దొరకుతుంది. ఇలా క్రమమైన వంతు కలిగియుండటంద్వారా పిల్లవాని అభివృద్ధిని చూసి విశ్వాసము బలపడేలా వారికి స్థిరమైన తర్ఫీదును ప్రోత్సాహమును ఇవ్వగలరు. అదే సమయంలో పరిచర్యలో తమ తలిదండ్రుల మంచి మాదిరులను కూడా చూడగలరు. అంతేగాక ఈ క్లిష్టమైన, బలత్కారముతో నిండిన కాలాలలో ఐక్యమైన, ఒకరిపట్ల మరొకరు శ్రద్ధవహించే కుటుంబంగా కలిసి పనిచేయడం, తీవ్రమైన నేర భయముగల ఇరుగుపొరుగులో కొంతమేరకు భద్రతను కూడా అందించగలదు.—2 తిమోతి 2:15; ఫిలిప్పీయులు 3:16.

11. సత్యముయెడల పిల్లవాని ఆసక్తిని ఏది సులభంగా తగ్గించగలదు?

11 పెద్దవారిలో కనపడే ద్వంద ప్రమాణాలను పిల్లలు సులభంగా పసిగట్టగలరు. సత్యముయెడల, ఇంటింటి పరిచర్యయెడల తల్లిదండ్రులు నిజమైన ప్రేమను చూపకుంటే, పిల్లలు ఆసక్తిగలవారిగా ఉంటారనేది చాలా కష్టమైన విషయం. అందుచేత బాగా ఆరోగ్యంగా ఉండే తండ్రి లేక తల్లి చేసే ప్రాంతీయ సేవంతా కేవలం పిల్లలతోచేసే వారపు బైబిలు పఠనమే అయితే చివరకు వారు విశాదకర ఫలితాలను ఎదురుచూడాల్సిన పరిస్థితి రావచ్చును.—సామెతలు 22:6; ఎఫెసీయులు 6:4.

12. కొన్ని కుటుంబాలు ఎలా యెహోవానుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందగలవు?

12 “ఏకమనస్సుతో” ఐక్యంగా ఉండుటలోని మరో ప్రయోజనమేమంటే కుటుంబమంతా సహకారంతో ముందుకు సాగగలదు, తద్వారా కుటుంబములోని ఒకరు సంఘములో పూర్తికాల పయినీరుగా పనిచేయవచ్చును. ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలు అలా చేస్తున్నవి, అలా వారి పయినీరు సభ్యుని అనుభవాలు, విస్తృతమైన సమర్థతవల్ల అందరూ ఆశీర్వాదం పొందుతారు.—2 కొరింథీయులు 13:11; ఫిలిప్పీయులు 2:1-4.

సమస్యలను పరిష్కరించుకొనుటలో కలిసిపనిచేయుట

13, 14. (ఎ) కుటుంబ అనుగుణ్యతపై ఏ పరిస్థితులు ప్రభావం చూపగలవు? (బి) అనేక కుటుంబ సమస్యలను ఎలా నిరోధించవచ్చును?

13 “వత్తిడి” “అపాయముతో,” నిండిన ఈ కష్టకాలాల్లో, మనందరము నలిగిపోయే స్థితిని ఎదుర్కొంటున్నాము. (2 తిమోతి 3:1, రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌; ఫిలిప్స్‌) పనిలో, పాఠశాలలో, వీధుల్లో, చివరకు గృహల్లోకూడా సమస్యలున్నవి. కొందరు అనారోగ్యముతో లేక దీర్ఘకాల భావోద్రేక సమస్యలతో బాధపడుతుంటారు, ఇవి తరచు కుటుంబములో అపోహలకు, ఉద్రిక్తలకు కారణమౌతాయి. అలాంటి పరిస్థితులతో ఎలా వ్యవహరించాలి? ప్రతిఒక్కరు ఎవరికి వారు మాట్లాడకుండా ముడుచుకొనివుంటే సరిపోతుందా? ఒకే ఇంట్లో ఉంటూ ఎవరంతట వారే ఉంటే సరిపోతుందా? లేదు. బదులుగా మన బాధలను వ్యక్తపరచుకొని సహాయము కొరకు అర్థించాలి. ఇందుకు ప్రేమగల కుటుంబ వలయముకంటె వేరే చోటు మరేముంది?—1 కొరింథీయులు 16:14; 1 పేతురు 4:8.

14 నయంకన్నా నివారణే మిన్నయని ప్రతి డాక్టరుకు తెలుసు. కుటుంబ విషయములోను ఇది వాస్తవమే. మనస్సు విప్పి, యథార్థంగా చర్చించుకోవడం సమస్యలు తీవ్రరూపం దాల్చకుండా కాపాడుతుంది. గంభీరమైన సమస్యలు తలెత్తినప్పటికి, కుటుంబమంతా కలిసి అందుకు సంబంధించిన బైబిలు సూత్రాలను పరిశీలించడంద్వారా వాటిని చేపట్టవచ్చు, పరిష్కరించుకొనవచ్చును కూడ. భేదము తలెత్తినప్పుడు కొలొస్సయులకు 3:12-14 నందలి పౌలు మాటలను అన్వయించుకొనడంద్వారా తరచు మంచి సంబంధము ఏర్పడవచ్చును: “కాగా దేవునిచేత ఏర్పరచబడినవారును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడను కొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”

వినోదములో కలసిపనిచేయుట

15, 16. (ఎ) క్రైస్తవ కుటుంబములను ఏ లక్షణము ప్రత్యేక పరచవలెను? (బి) కొన్ని మతములు ఎటువంటి ప్రజలను తయారు చేస్తున్నాయి, ఎందుకు?

15 యెహోవాదేవుడు సంతోషముగల దేవుడు. సత్యము సంతోషదాయకమైన వర్తమానము—మానవజాతికి నిరీక్షణ నందిస్తుంది. అంతేగాక ఆత్మ ఫలములలో ఒకటి సంతోషము. ఈ సంతోషము ఒక క్రీడాకారుడు పోటీలో గెలిచినప్పుడు పొందే తాత్కాలికమైన సంతోషానికి ఎంతో భిన్నమైంది. యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకొనుట మూలంగా హృదయములో ఉప్పొంగిపోయే లోతైన తృప్తితో కలిగే భావన ఇది. దేవునిపై ఆధారపడేవారికి కలిగే ఆనందము.” అది ఆత్మీయ విలువలు, క్షేమాభివృద్ధికరమైన సంబంధాలపై ఆధారపడిన ఆనందము.—గలతీయులు 5:22; 1 తిమోతి 1:11.

16 అందుచేత, యెహోవా క్రైస్తవ సాక్షులముగా మనము ఉల్లాసములేకుండా దిగులుతో ఉండవలసిన అవసరము లేదు. కొన్ని మతములు అటువంటి ప్రజలను తయారుచేస్తాయి. కారణమేమంటే వారి విశ్వాసము అటువంటి భిన్నమైన విషయాలను నొక్కిచెబుతుంది. వారి బోధలు విచారకరమైన, ఆనందము లేని ఆరాధనకు నడుపుతాయి. అవి బైబిలు ఆధారితమైనవి కావు, లేక సమతుల్యతను కలిగివుండవు. అవి దేవుని సేవలో సంతోషభరితమైన కుటుంబాలను ఉత్పన్నముచేయవు. యేసు వినోదము, విశ్రాంతి యొక్క అవసరతను గుర్తించాడు. ఉదాహరణకు ఒకసారి ఆయన తన శిష్యులను “ఏకాంత ప్రదేశములకు వెళ్లి కొంతసేపు అలసట తీర్చుకొనుటకు” ఆహ్వానించాడు.—మార్కు 6:30-32; కీర్తన 126:1-3; యిర్మీయా 30:18, 19.

17, 18. ఏ యుక్తమైన విధానాలలో క్రైస్తవ కుటుంబములు విశ్రాంతిగా సమయమును గడుపవచ్చును?

17 అలాగే కుటుంబాలకు కూడా కొంత వినోదముతో కూడిన విశ్రాంతి సమయము అవసరము. ఒక తండ్రి తన పిల్లలనుగూర్చి ఇలా చెప్పాడు: “మేము కలిసి ఆనందదాయకమైన పనులను ఎన్నో చేస్తుంటాము. కలిసి సముద్ర తీరానికి వెళ్తాము, పార్కులో బంతి ఆడుకుంటాము, పర్వత ప్రాంతాలకు పిక్‌నిక్‌ ఏర్పాటుచేసుకుంటాము. అప్పుడప్పుడు మాకు ‘పయినీర్‌ డే’ అని పూర్తిగా పయినీర్లవలె రోజంతా పరిచర్యలో గడిపే రోజు కలదు. ప్రత్యేక భోజనాన్ని ఏర్పాటుచేసుకుంటాము. ఒకరికొకరము బహుమతులను కూడా అందించుకుంటాము.”

18 తల్లిదండ్రులు వినోదముకొరకు తలంచవలసిన మరి ఇతర రంగాలేవనగా జంతు ప్రదర్శనశాలలకు వెళ్లడం, వినోదము కలిగించే అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, మ్యూజియంలు, ఇతర మనోరంజకమైన స్థలాలు. పెద్దపెద్ద వనములలో చెట్లమధ్య విహరించడం, పక్షులను గమనించడం, తోటలను పెంచడం అందరు సంతోషంతో కలిసిచేయగల పనులు. ఏదైన సంగీత వాయిద్యాన్ని నేర్చుకొనడానికి కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించవచ్చును. లేక ఇతర ఆచరణాత్మకమైన సరదా పనులలో పాల్గొనడానికి ప్రోత్సహించవచ్చును. సమతుల్యముగల తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆటలాడుకొనుటకు కూడా తప్పక సమయము తీసుకుంటారు. కుటుంబములు కలిసి ఆటలాడుకొన్నట్లయితే, చాలావరకు అవి కలిసివుంటాయి!

19. ఏ ఆధునిక వైఖరి కుటుంబానికి హాని కలిగించగలదు?

19 బాలలలో నేడుండే ఆధునిక వైఖరేమంటే, వినోద కార్యకలాపాలలో కుటుంబానికి వేరుగా వారికైవారు తమ కిష్టమొచ్చినదానిని చేసుకోవడం. వ్యక్తిగతంగా ఒక పిల్లవాడు తనకిష్టమొచ్చిన సరదాపనిని లేదా కాలము వెళ్లబుచ్చడానికి మరో ఇష్టమైన కార్యాన్ని ఎన్నుకోవడంలో ఏ నష్టము లేకపోయినప్పటికీ, అలాంటి ఆసక్తి మూలంగా మిగతా కుటుంబముతో శాశ్వతంగా వేరైవుండేలా అనుమతించడం అంత జ్ఞానయుక్తమైన విషయం కాదు. బదులుగా, పౌలు చెప్పిన సూత్రాన్ని మనము అన్వయించే వారమైయుండాలి: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములనేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:4.

20. చిన్న, పెద్ద సమావేశములు ఎలా సంతోషదాయక సమయములు కావచ్చును?

20 చిన్న, పెద్ద సమావేశములలో కుటుంబములు కలిసి కూర్చుండటాన్ని చూడటం మనందరికి ఎంత ఆనందదాయకం! తద్వారా తరచు పెద్దపిల్లలు, చిన్న పిల్లలకు సహాయపడే వీలవుతుంది. ఆవిధమైన ఏర్పాటు ద్వారా ఎదిగిన పిల్లలు వెనుక వరుసలో కూర్చొని సరిగా అవధానము నిలపకుండ పోవడాన్ని కూడా అరికట్టడానికి తోడ్పడుతుంది. దానితోపాటు సమావేశములకు వెళ్లి, వచ్చే ప్రయాణాలను కూడా ఆనందదాయకంగా చేసుకొనవచ్చును. దానికొరకు కుటుంబముతో ఏ మార్గములో ప్రయాణం చేయడం ఇష్టమో, మార్గం మధ్యలో ఏ స్థలాలను చూడలనుకుంటారో, ఎక్కడ ఉండాలనుకుంటారో ముచ్చటించు కొనవచ్చును. యేసు దినాలలో కుటుంబమంతా కలిసి యెరూషలేముకు ప్రయాణం చేయడము ఎంత ఉల్లాసవంతమైన సమయమై ఉండెనో ఒకసారి ఊహించండి!—లూకా 2:41, 42.

కలిసివుండటం వలన కలిగే ఆశీర్వాదములు

21. (ఎ) వివాహము విజయవంతమవడానికి మనమెలా కృషిచేయవచ్చును? (బి) నిలబడగల్గే వివాహానికి నాలుగు మంచి సలహాలేమిటి?

21 విజయవంతమైన కుటుంబాలను, ఐక్యమైన కుటుంబాలను సాధించుకోగలగడమంటే సులభమైన సంగతి కాదు. అవి యాదృచ్ఛికంగా రావు. కొందరు వాటి విషయములో తీవ్రంగా పట్టించుకోకుండా సులభంగా వదలివేసి, ఆ వివాహాన్ని విడాకులతో అంతం చేసుకుని మరొక వివాహం చేసుకోవడం సులభమనుకుంటారు. మరలా అదే సమస్యలు రెండవ లేక మూడవ వివాహంలో కూడా తలెత్తుతాయి. దానికి సరైన పరిష్కారం క్రైస్తవ సంబంధమైనదే: బైబిలు సూత్రములైన ప్రేమ, గౌరవము ద్వారా విజయానికి కృషి చేయండి. నిస్వార్థమైన, ఇచ్చి, పుచ్చుకొనే స్వభావంపైన ఐక్యమైన కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక వివాహము శాశ్వతంగా నిలబడేందుకు వివాహ సలహాదారుడొకరు ఒక సామాన్యమైన సూత్రాన్ని వివరించారు. ఆయన ఇలా వ్రాశారు: “మంచి వివాహాల్లో కనబడే నాలుగు నిర్ణయాత్మక అంశాలు ఏమంటే, వినుటకు ఇష్టపడుట, క్షమాపణ చెప్పుకోగల్గుట, భావోద్రేకపరంగా స్థిరమైన ఎడతెగని మద్దతును ఇవ్వగల సామర్థ్యమును కలిగివుండుట, అప్యాయతతో స్పర్శించు కోరికతో నుండుట.” ఆ అంశాలు నిజంగా వివాహమును చిరకాలము నిలిచేదానిగా చేయగలవు. ఎందుకనగా అవి సరైన బైబిలు సూత్రములపై ఆధారపడినవి.—1 కొరింథీయులు 13:1-8; ఎఫెసీయులు 5:33; యాకోబు 1:19.

22. ఐక్యమైన కుటుంబాన్ని కలిగివుండటం వలన కలిగే కొన్ని ప్రయోజనములు ఏమిటి?

22 మనము బైబిలు ఉపదేశమును అనుసరించినట్లయితే, ఐక్యమైన కుటుంబానికి స్థిరమైన పునాదులను కలిగివుంటాము. తిరిగి ఈ ఐక్యమైన కుటుంబాలు ఐక్యమైన ఆత్మీయంగా బలమైన సంఘానికి పునాదులౌతాయి. ఆవిధంగా మనము ఐక్యమై ఆయనకు ఎక్కువ స్తుతిని కలుగజేస్తే ఆయన నుండి విస్తార దీవెనలు పొందగలము.

[అధస్సూచీలు]

a “కుటుంబము అనేది ఫెమిలియా అనే లాటిన్‌ పదమునుండి వచ్చింది. అసలు ఒక గొప్ప ఇంటిలోనున్న సేవకులు, దాసులు, యజమానుడు, యజమానురాలు, పిల్లలు ఇతర సిబ్బందితో కూడిన యిల్లని దాని అర్థం.—ఎ షార్ట్‌ ఎటిమో లాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ మోడరన్‌ ఇంగ్లీష్‌, ఎరిక్‌ పార్ట్రిజ్‌ వ్రాసింది.

మీకు జ్ఞాపకమున్నవా?

◻ కుటుంబములు కలిసి పనిచేయడం ఎందుకు ప్రయోజనకరము?

◻ ఎందుకు క్రమమైన బైబిలు పఠనము ప్రాముఖ్యము?

◻ తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుట ఎందుకు ప్రాముఖ్యము?

◻ కుటుంబ వలయములోనే సమస్యలను చర్చించుకొనుట ఎందుకు సహాయకరముగా నుండగలదు?

◻ క్రైస్తవ కుటుంబములు ఎందుకు విచారకరమైనవిగా, సంతోషము లేనివిగా ఉండకూడదు?

[17వ పేజీలోని చిత్రం]

మీ కుటుంబమంతా కనీసము రోజుకొక్కసారైన కలిసి భోంచేయడంలోని ఆనందాన్ని పొందుతున్నారా?

[18వ పేజీలోని చిత్రం]

కుటుంబ వినోద పర్యటనలు విశ్రాంతిదాయకంగాను, ఆనందదాయకంగాను ఉండాలి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి