క్రైస్తవ కూటాలకు మీరెందుకు హాజరుకావాలి
దక్షిణ అమెరికాలో నివసించు రొసారియోకు అనేక నెలలుగా ఎలీజబెత్‌తో బైబిలు పఠించడం ఆనందంగావుంది. దేవుని రాజ్యాన్ని గూర్చి, అది భూమిపై పరదైసు పరిస్థితుల్ని ఎలా తెస్తుందో నేర్చుకోవడం, రొసారియోకెంతో పులకరింపు కలుగజేసింది. అయితే, ఎలీజబెత్ రాజ్యమందిరానికి రమ్మని ఆహ్వానించినప్పుడల్లా, ఆమె దానికి నిరాకరించింది. సంఘ కూటాలకు హాజరు కాకుండ ఇంటి దగ్గరే బైబిలు పఠిస్తూ, అది చెప్పే విషయాలు అభ్యసిస్తే చాలని ఆమె భావించింది. క్రైస్తవ కూటాలు మీకు నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? తన ప్రజలు సమకూడవలెననే ఏర్పాటును దేవుడెందుకు చేస్తున్నాడు?
మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారిచుట్టునున్న ప్రజలకు ఎంతో భిన్నంగా ఉన్నందున, వారి మనుగడకు సరియైన సహవాసము అగత్యము. తొలి క్రైస్తవుల ఒక సంఘానికి అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: ‘మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును, నిష్కళంకులునై లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.’ (ఫిలిప్పీయులు 2:15) యూదయలోని క్రైస్తవులకు ప్రత్యేకముగా కష్టకాలముండెను, వారికి పౌలు యిలా వ్రాశాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) సమాజముగా కూడుట ద్వారా మనమెట్లు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పరస్పరం పురికొల్పుకొందుము?
క్రైస్తవులెట్లు పరస్పరం “పదును” పెట్టుకొందురు
“పురికొల్పు” అని అనువదింపబడిన, పౌలు ఉపయోగించిన గ్రీకు పదమునకు అక్షరార్థముగా “పదునుచేయుట” అని భావము. క్రైస్తవులు పరస్పరం ఎలా పదును పెట్టుకొందురో వివరిస్తూ ఒక బైబిలు సామెత ఇట్లనుచున్నది: “ఇనుముచేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.” (సామెతలు 27:17; ప్రసంగి 10:10) మనము క్రమంగా పదును పెట్టాల్సిన పనిముట్లను పోలివున్నాము. యెహోవా యెడల ప్రేమ కనబరచుట, మన విశ్వాసంపై ఆధారపడి నిర్ణయాలు చేయుట అనగా లోకంనుండి వేరైయుండుటని భావం గనుక, అనేకుల మార్గము నవలంబించక మనం ఎడతెగక భిన్న మార్గాన ఉండాలి.
భిన్నంగా ఉండాలనే మన నిర్విరామ కృషి సత్కార్యముల కొరకైన మన ఆసక్తిని పదునులేకుండ చేస్తుంది. అయితే యెహోవాను ప్రేమించే ఇతరులతో మనమున్నప్పుడు, మనం పరస్పరం పదునుపెట్టుకుంటాము అనగా ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరము పురికొల్పుకొందుము. మరోవైపున, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మనల్నిగూర్చే తలస్తూవుంటాము. అవినీతికరమైన, స్వార్థపూరితమైన లేదా తెలివిమాలిన తలంపులు మన మనస్సుల్లో ప్రవేశించవచ్చు. “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” (సామెతలు 18:1) అందుకే పౌలు థెస్సలోనిక పట్టణమందుగల సంఘానికిలా వ్రాశాడు: “మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనికొకడు ఆదరించి యొకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.”—1 థెస్సలొనీకయులు 5:11.
రొసారియో ప్రాథమిక బైబిలు బోధలనుగూర్చిన తన పఠనమును ముగించిననూ, ఆమె సంఘముతో సహవసించుటకు వెనుదీసింది. ఇంకా ఎక్కువ సహాయం అందించడం వీలుకానందున, ఎలీజబెత్ ఆమెను సందర్శించడం మానేసింది. కొన్ని నెలల తర్వాత ప్రాంతీయకాపరి రొసారియోను సందర్శించి ఆమెనిలా అడిగాడు: “కుటుంబమందలి ప్రతి సభ్యుడు బయట హోటల్లో మంచి భోజనం చేయగల్గిననూ, వారందరు కలిసి ఇంట్లో భోజనం చేయకపోతే ఏమి జరుగుతుంది?” అందుకు రొసారియో, “వారు కుటుంబ సహవాసాన్ని పోగొట్టుకుంటారని” జవాబిచ్చింది. దానితో ఆమెకు విషయం అర్థమై క్రమంగా కూటాలకు రావడం ఆరంభించింది. ఆమెకు అవి ఎంత ప్రయోజనకరంగా ఉండెనంటే అప్పటినుండి ఆమె ఒక్క కూటాన్ని కూడా తప్పిపోలేదు.
మీరు నమ్ముతున్న విషయాలందే ఇతర ప్రజలును తమ విశ్వాసాన్ని వ్యక్తపరచడాన్ని వినడం ఎంత ప్రోత్సాహకరమో, ఆలాగే అట్టి విశ్వాసం వారి జీవితాల్ని మార్చడాన్ని చూడ్డం అంతే ప్రోత్సాహకరం. వ్యక్తిగత అనుభవం ద్వారా పౌలు దీనినెరిగియున్నాడు, కాగా ఆయన రోమీయుల సంఘానికిలా వ్రాశాడు: “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.” (రోమీయులు 1:11, 12) వాస్తవానికి, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు పౌలు రోమాకు రాగల్గాడు, అదీ రోమన్ల చేతిలో బందీగా ఆయన వచ్చాడు. అయితే తనను కలిసికోవడానికి ఆ పట్టణానికి 60 కిలోమీటర్లకు పైగా దూరాన్నుండి నడిచివచ్చిన రోమా సహోదరులను ఆయన చూసినప్పుడు, “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.”—అపొస్తలుల కార్యములు 28:15.
అపాయకరమగు కాలాల్లో ఆత్మీయాహారమును కనుగొనుట
రోమాలో గృహ నిర్భందంలో నున్నప్పుడు, పౌలు సమాజముగా కూడుట మానకుండుటను గూర్చి హెబ్రీయులకు వ్రాశాడు. “ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు” అనే మాటలు చేర్చడం మనకొక విశేష అర్థానిస్తున్నవి. (హెబ్రీయులు 10:25) యెహోవాసాక్షులు ఎడతెగక 1914వ సంవత్సరము లోకాంత సమయారంభానికి ఒక గుర్తుగా ఉన్నదని, “భక్తిహీనుల తీర్పును నాశనమును” సమీపించినదని లేఖనములనుండి చూపిస్తూనే ఉన్నారు. (2 పేతురు 3:7) బైబిలు పుస్తకమగు ప్రకటన చెప్పిన ప్రకారము, యుగాంత ఆరంభమందు అపవాది పరలోకమునుండి పడద్రోయబడినప్పుడు, అతడు గొప్ప ఆగ్రహము తెచ్చుకొని, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న . . . శేషించిన వారితో యుద్ధము చేయుటకై” బయలువెళ్లాడు. (ప్రకటన 12:7-17) కాబట్టి, దేవుని ఆజ్ఞలు పాటించడం ప్రత్యేకంగా ఇప్పుడు మరింత కష్టం; అందువలన మన తోటి విశ్వాసుల్ని కలుసుకోవడం మనకు మరింత అవసరం. అపవాది దాడులను ఎదుర్కొనుటకుగాను మన విశ్వాసాన్ని, దేవుని కొరకైన మన ప్రేమను బలపర్చుటకు కూటములు మనకు సహాయం చేస్తాయి.
దేవుని యెడల ప్రేమ, విశ్వాసము ఒకసారి నిర్మిస్తే ఇక శాశ్వతంగా నిలిచే భవనాలవంటివి కావు. బదులుగా, అవి నిర్విరామ పోషణతో నెమ్మదిగా వర్థిల్లగల జీవులను పోలివున్నాయి, ఆ పోషణ కరువైతే అవి కృంగి కృశించిపోతాయి. అందుకే యెహోవా తన ప్రజలను బలపర్చడానికి క్రమమైన ఆత్మీయాహారం ఏర్పాటు చేశాడు. మనందరికి అటువంటి ఆహారం అవసరము, అయితే దేవుని సంస్థ, అది ఏర్పాటుచేసిన కూటములనుండి మినహా దీనిని మనమెక్కడ పొందగలము? ఎక్కడా పొందలేము.—ద్వితీయోపదేశకాండము 32:2; మత్తయి 4:4; 5:3.
తానెలా క్రైస్తవ సంఘాన్ని పోషిస్తున్నాడో చూడడానికి మనకు సహాయపడగల ఒక ప్రశ్నను యేసు వేశాడు. ఆయనిలా అడిగాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.” (మత్తయి 24:45, 46) తన అనుచరులను పోషించడానికి యేసు మొదటి శత్దామందు ఎవరిని నియమించాడు, తను రాజ్యాధికారమునకు వచ్చినప్పుడు ఎవరు నమ్మకంగా ఈ ఆహారం ఇవ్వడాన్ని ఆయన కనుగొన్నాడు? ఏ మానవుడును ఈ శతాబ్దాల కాలమంతటిలో జీవిస్తూరాలేదనుట స్పష్టమే. క్రైస్తవ కాలాలకు పూర్వం ఇశ్రాయేలు జనాంగము దేవుని సేవకునిగా ఉన్నట్లే, ఆత్మాభిషక్తులైన క్రైస్తవుల సంఘమే అట్టి దాసుడని సాక్ష్యాధారాలు సూచిస్తున్నవి. (యెషయా 43:10) అవును, యేసు అట్టి ఆత్మాభిషేక క్రైస్తవుల ప్రపంచవ్యాప్త సభద్వారా ఆత్మీయాహారమును సమకూరుస్తున్నాడు, ఆ సభ నేడు ఈ ఆత్మీయాహారమును స్థానిక యెహోవాసాక్షుల సంఘాల ద్వారా సరఫరా చేస్తున్నది.
యేసు ఆత్మీయాహారాన్ని అందించే విధానమును అపొస్తలుడైన పౌలు మరియెక్కువగా యిలా వర్ణిస్తున్నాడు: “ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. . . . మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.”—ఎఫెసీయులు 4:8, 11-13.
“మనుష్యులకు ఈవులుగా” వున్న వారు ప్రాముఖ్యముగా స్థానిక సంఘాల్లో, అనగా కూటములందు సహోదరులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తారు. ఉదాహరణకు అంతియొకయలో “యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.” (అపొస్తలుల కార్యములు 15:32) అదేవిధముగా నేడు ఆత్మీయార్హతగల పురుషులిచ్చే ప్రసంగాలు మన విశ్వాసాన్ని స్థిరపరుస్తాయి, కావున అది వాడిపోదు లేదా క్రియాశూన్యంగా తయారుకాదు.
నిజమే, మనమింకనూ కూటాలకు హాజరుకావడం ఆరంభించకపోయినను ఒకానొక సంఘ సభ్యుడు వ్యక్తిగతంగా సహాయం చేసినందున మనం మంచి అభివృద్ధి సాధించియుండవచ్చు. “దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు . . . బోధింపవలసిన” వారిగా “మీరు పాలుత్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు” కాని సమయముంటుందని బైబిలు చెబుతున్నది. (హెబ్రీయులు 5:12) అయితే ఒకడు ఎల్లకాలము పాలుత్రాగువానిగానే ఉండలేడు. దేవుని యెడల ప్రేమను, ఆయనయందు సజీవమైన విశ్వాసాన్ని ఉంచడానికి ఆలాగే ‘దేవుని సమస్త సలహాను” అన్వయించుటలో ఆచరణయోగ్యమైన సహాయమందించుటకు క్రైస్తవ కూటములు ఎడతెగని బైబిలు ఉపదేశ కార్యక్రమాన్ని అందిస్తాయి. (అపొస్తలుల కార్యములు 20:27) ఇది కేవలం “పాల” కంటే ఎక్కువైనది. బైబిలు ఇంకను ఇట్లనుచున్నది: “వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:14) ప్రాథమిక గృహ బైబిలు ఉపదేశమందు భాగముగా ఉండని ప్రాముఖ్యమైన బైబిలు ప్రవచనముల ప్రతి వచన పఠనము, మన జీవితాల్లో దేవుని ఎలా అనుకరించగలమనే విషయమై లోతైన చర్చలవంటి అనేక అంశాలు కూటములో విచారింపబడతాయి.
యెహోవా అందించే జ్ఞాపికలు—నీవెనుక పలికే స్వరము వంటివి
అటువంటి సంఘ పఠనముల ద్వారా, మనమెలాంటి వ్యక్తులుగా ఉండాలో యెహోవా క్రమంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి జ్ఞాపికలు అవశ్యకము. అవి లేకుంటే మనం స్వార్థం, అహంకారం, పేరాశవంటి వాటికి సులభంగా లొంగిపోతాము. లేఖనాలనుండి లభించే జ్ఞాపికలు ఇతర మానవులతో, దేవునితో జయప్రదమగు సంబంధం కలిగివుండుటకు మనకు సహాయం చేస్తాయి. “నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని” అని 119:59వ కీర్తన రచయిత ఒప్పుకున్నాడు.
మనం క్రమంగా క్రైస్తవ కూటములకు హాజరగు కొలది, యెషయా ద్వారా యెహోవా పలికిన ప్రవచన నెరవేర్పును మనం అనుభవిస్తాము, అదిలా చెబుతున్నది: “నీ మహాగొప్ప బోధకుడు దాగియుండడు, నీ మహాగొప్ప బోధకుని చూస్తున్నట్లు నీ కన్నులుండవలెను. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” మన అభివృద్ధిని యెహోవా కనిపెడుతూ, మనం తప్పటడుగు వేసినట్లయిన ఆయన ప్రేమతో సరిదిద్దును. (యెషయా 30:20 NW, 21; గలతీయులు 6:1) దీనికంటే ఎక్కువ సహాయాన్ని కూడ ఆయన దయచేస్తాడు.
సంఘము ద్వారా పరిశుద్ధాత్మను పొందుట
యెహోవాసాక్షులతో క్రమముగా క్రైస్తవ కూటములకు హాజరగుట వలన, మనం దేవుని ప్రజలపై నిలిచే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బలపర్చబడతాము. (1 పేతురు 4:14) అంతేకాదు, సంఘంలో క్రైస్తవ అధ్యక్షులు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 20:28) దేవునినుండి వచ్చే ఈ చురుకైన శక్తి ఒక క్రైస్తవునిపై బలమైన ప్రభావం చూపుతుంది. బైబిలిట్లంటున్నది: “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” (గలతీయులు 5:22, 23) దేవుని సంస్థద్వారా పనిచేయు పరిశుద్ధాత్మ యెహోవాను ప్రేమించు వారికి భవిష్యత్తునందున్న దానిని స్పష్టంగా అద్భుతరీతిలో అర్థము చేసికొనుటకు కూడ మనకు సహాయం చేస్తుంది. దేవుని సంకల్పాన్ని ఈ విధానపు ప్రముఖులు అర్థం చేసుకోలేరని వివరించిన తర్వాత, పౌలు యిలా వ్రాశాడు: “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు.”—1 కొరింథీయులు 2:8-10.
విశ్వాసాన్ని బలపరచే ఆత్మీయాహారానికి తోడుగా, సంఘంయొక్క ముఖ్య కార్యవిధానమందు భాగం వహించడానికి ఇష్టపడేవారికి సంఘం శిక్షణకూడా ఇస్తుంది. అదేమిటి?
సంఘం ద్వారా ఇవ్వబడే శిక్షణ
క్రైస్తవ సంఘమంటే ప్రజలక్కడ వినోదం అనుభవిస్తూ, శ్రేష్ఠమైన జీవితాలు జీవించడానికి బహుశ పరస్పరం ప్రోత్సహించుకునే ఒక సామాజిక క్లబ్బు వంటిది కాదు. ఆత్మీయ అంధకారమందు జీవించే వారియొద్దకు రాజ్యసువార్త తీసుకెళ్లాలని యేసు సంఘాన్ని స్థాపించాడు. (అపొస్తలుల కార్యములు 1:8; 1 పేతురు 2:9) అది స్థాపించబడిన సా.శ. 33 పెంతెకొస్తు దినం మొదలుకొని, అది ప్రచారకుల సంస్థగా ఉండెను. (అపొస్తలుల కార్యములు 2:4) యెహోవా సంకల్పాలను గూర్చి వేరొకరితో చెప్పడానికి ప్రయత్నించిననూ, అతన్ని ఒప్పింపలేకపోయిన అనుభవం మీకేదైనా వుందా? బోధనా కళయందు సంఘ కూటాలు వ్యక్తిగత శిక్షణనిస్తాయి. బైబిలు ఉదాహరణలు పఠించుట ద్వారా, తర్కించుటకు మనమెలా సాధారణ పునాదివేయాలో నేర్చుకుంటాము, న్యాయ తర్కనకు ఆధారంగా లేఖనాలను ఎలా ఉపయోగించాలో, ప్రశ్నలు, ఉపమానములు ఉపయోగించుట ద్వారా తర్కించుటకు ఇతరులకు ఎలా సహాయం చేయాలో నేర్చుకుంటాము. అటువంటి నైపుణ్యములు బైబిలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మరో వ్యక్తికి సహాయంచేస్తే వచ్చే చెప్పనలవికాని ఆనందాన్ని కలిగియుండుటకు మీకు దోహదపడగలవు.
కలహాలతో చీల్చబడిన ఈ అవినీతి లోకంలో, క్రైస్తవ సంఘం నిజంగా ఒక ఆత్మీయ ఆశ్రయ దుర్గం. అది అసంపూర్ణ మానవులతో తయారైననూ, అది ప్రశాంతతకు, ప్రేమకు నిలయమై యుంది. కాబట్టి, మీరు అన్ని కూటాలకు హాజరగువారైయుండి, కీర్తనల రచయితయొక్క ఈ మాటల సత్యాన్ని మీకైమీరు చూడండి: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు! ఎంత మనోహరము! . . . ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.”—కీర్తన 133:1, 3.