1999 “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలు
1 ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశానికి ప్రవేశించబోతుండగా, దేవుని నిర్దేశాలను గుణగ్రహించమని మోషే వారిని వేడుకున్నాడు. “ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే” అని ఆయన వాళ్ళతో చెప్పాడు. (ద్వితీ. 32:45-47) యెహోవా దృష్టిలో మన జీవితాలు ఎంతో ప్రశస్తమైనవి కనుక ఆయన తన అమూల్యమైన వాక్యం ద్వారా మనకు మార్గదర్శనాన్ని ఇవ్వడంలో కొనసాగుతున్నాడు. అందుకు మనం కృతజ్ఞులం కాదా? అందుకే, మనం, “దేవుని ప్రవచన వాక్యము” అనే మూడు రోజుల జిల్లా సమావేశం కోసమూ, మన కోసం యెహోవా దాచి ఉంచిన దాని కోసమూ ఆతురతతో ఎదురుచూస్తాం.
2 అందరి సౌకర్యార్థం, ఈ సంవత్సరపు జిల్లా సమావేశాలు ఇండియా మొత్తంలో 27 ప్రాంతాల్లో ఉండేలా ప్రణాళిక చేయబడ్డాయి. ఈ దేశంలో మొదటిసారిగా జిల్లా సమావేశం సంగ్రహ రూపంలో మిజోరాం భాషలో జరుగబోతోంది.
3 సమావేశానికి మీరు కూడా హాజరై ఉండాలని యెహోవా ఎదురు చూస్తున్నాడని మీరు నమ్ముతారు గనుక, సమావేశపు ప్రతి దినానికి హాజరయ్యేందుకు మీరు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొని ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. హాజరయ్యేందుకు తన సేవకులు చేసే వ్యక్తిగత కృషినీ, త్యాగాన్నీ ఆయన చూస్తున్నాడనీ అలాంటి వారిని ప్రశంసాపూర్వకంగా గుర్తుంచుకుంటాడనీ నిశ్చయత కలిగివుండండి. (హెబ్రీ. 6:10) సమావేశపు ప్రతిరోజూ ప్రారంభ పాట నుండి ముగింపు ప్రార్థన వరకూ ఉండడం ద్వారా, ఆయన వాక్యం మనకు విలువైనదని మనం ఎంచుతామని మనం యెహోవాకు తెలియజేస్తాం. (ద్వితీ. 4:10) సమావేశాన్ని సిద్ధపర్చడంలో పాల్గొన్న మన సహోదరులనేకమంది చేసిన కష్టానికి మెప్పుదలను చూపుతాం.
4 ప్రతి సమావేశ స్థలమందు వేలాదిమంది దేవుని ప్రజలు కూడుకొనే ఏర్పాట్లు చేయడానికి ముందుగా ప్లాన్ చేయడమూ, కార్యాలను చక్కగా సంస్థీకరించడమూ అవసరం. సమావేశ ఏర్పాట్లు ప్రేమపూర్వకంగా తయారుచేయబడ్డాయని తెలుసుకోవడం మనం దానికి సహకరించేందుకు మనల్ని పురికొల్పాలి, తద్వారా “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరు”గుతాయి. (1 కొరిం. 14:40) ఆధ్యాత్మిక ఆహారాన్ని, క్రైస్తవ సహవాసాన్ని ఆస్వాదించేలా మీరు సమావేశానికి పూర్తిగా సిద్ధపడి వచ్చేలా, ఈ క్రింద కొంత సమాచారము, జ్ఞాపికలు ఇవ్వబడ్డాయి.
సమావేశానికి ముందు
5 సమావేశానికి హాజరయ్యేందుకు వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకోవడంలో, మీతో బైబిలు పఠిస్తున్న వారికీ, ఆసక్తిగల ఇతరులకూ సహాయం అవసరమా? అక్కడ వారు చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు యెహోవా ఆరాధకులయ్యేలా వాళ్ళను కదిలించవచ్చు. (1 కొరిం. 14:25) లాడ్జింగ్, రవాణా విషయాల్లో ఎవరికైనా ముఖ్యంగా సంఘంలోని పెద్ద వయసు వారికి సహాయం అవసరమా అన్న విషయాన్ని పెద్దలు ఎరిగివుండాలి, వారి అవసరాలు తీర్చబడుతున్నాయా లేదా అని ప్రేమ పూర్వకంగా చూడాలి.—గల. 6:10.
6 మీ వసతులను గూర్చిన ఏర్పాట్ల విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? మీరు హోటల్లో ఉండేటట్లయితే మీకోసం రూమ్ బుక్ చేసినట్లు రూఢి అయ్యిందా? మీరు హోటల్‌కు అడ్వాన్స్ పంపించారా?
7 ఏదైన ఒక సమావేశాన్ని గురించిన సమాచారం మీకు అవసరమైతే, ఆ సమావేశం జరిగే స్థలం యొక్క చిరునామాతో సహా కావలసిన సమాచారాన్ని సంఘ కార్యదర్శి అందిస్తాడు. దయచేసి, సమావేశ స్థలాన్ని గూర్చి, వసతులను గూర్చి హాల్ మేనేజ్మెంటుకు ఫోను చేయడంగానీ లేక వ్రాయడంగానీ చేయవద్దు.
8 ప్రథమ చికిత్స విభాగం తక్షణ చర్య తీసుకోవలసి ఆకస్మిక పరిస్థితులతో వ్యవహరించేందుకు మాత్రమే కాబట్టి, మీకు అవసరం అనుకుంటే మీరు సొంతంగా ఆస్ప్రిన్లనూ, బాండేజ్లనూ, ఇన్హేలర్లనూ, జీర్ణసంబంధ మందులనూ, అలాంటి ఇతర వస్తువులనూ సమావేశ స్థలానికి తెచ్చుకోమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీకు గానీ, మీ ప్రియమైన వారికి గానీ హృద్రోగ సమస్యలు, మధుమేహవ్యాధి లేక మూర్ఛరోగ సమస్యలున్నట్లయితే, మీరు ఇంటివద్ద ఉన్నప్పుడూ, సెలవుకి వెళ్ళినప్పుడూ మీకు కావల్సిన మందులను మీ దగ్గర ఎలా ఉంచుకుంటారో, అలాగే సమావేశ స్థలానికి కూడా తెచ్చుకోండి. వారి పరిస్థితిని అర్థం చేసుకొనే కుటుంబ సభ్యులైనా లేక సన్నిహిత మిత్రులైనా ఆ వ్యక్తికి సహాయం అందించేంతటి మంచి స్థితిలో ఉంటారు కనుక వారు, వారి దగ్గర ఉండడం జ్ఞానయుక్తమైన పని.
9 సమావేశానికి వెళ్ళేటప్పుడు, అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడూ, అనియత సాక్ష్యమిచ్చే అవకాశాలు రావచ్చు. ఇతరులతో సత్యాన్ని పంచుకొనేందుకు మీరు సిద్ధపడి ఉంటారా? మనందరమూ, చిన్న పిల్లలు సహితం పెట్రోల్ బంకుల్లో పనిచేసే అటెండెంట్లకూ, హైవేల్లోనూ, బ్రిడ్జ్‌ల మీదా కనిపించే టోల్ కలెక్టర్లకూ, ప్రయాణంలో కలిసే వారికీ కరపత్రాల్ని ప్రతిపాదించవచ్చు. పత్రికలనూ, బ్రోషూర్లనూ, లేక ఇతర సాహిత్యాన్నీ ఆసక్తిగల వారితో పంచుకొనే అవకాశాలు ఉంటాయి. అనియతంగా సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉండండి. సాధారణంగా చేసే ప్రకటనా పద్ధతుల ప్రకారం చేస్తున్నప్పుడు కలవలేనివాళ్ళను అనియతంగా సాక్ష్యమిచ్చేటప్పుడు కలవవచ్చు.
సమావేశం జరుగుతున్నప్పుడు
10 ప్రతీరోజూ, సమావేశ హాలు తలుపులు తెరవబడినప్పుడు, మీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే లేదా మీ గుంపులోనివారి కోసం మాత్రమే సీట్లను రిజర్వు చేసుకోవచ్చు. సౌకర్యప్రదమైన సీట్లు వృద్ధులైన సహోదర, సహోదరీల కోసం రిజర్వు చేయబడతాయి. వికలాంగులకు, వీల్‌చెయిర్ అవసరమైనవారికి ప్రత్యేక స్థలాలు కేటాయించబడతాయి. వాతావరణ సంబంధమైన రోగాలూ లేదా అలర్జీలూ ఉన్న వారికోసం ప్రత్యేక వసతులున్న గదులను సమావేశ స్థలంలో ఏర్పాటు చేయడం సాధ్యంకాదు. ప్రతిరోజూ, మీరు కూర్చున్న సీట్లను విడిచివస్తున్నప్పుడు మీ వస్తువులన్నీ తీసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి.
11 మన జిల్లా సమావేశాలకు గొప్ప సంఖ్యలో హాజరయ్యేందుకు, మనం స్థానిక చట్టాలను, అగ్ని నిరోధక నియమాలను, సురక్షితత్వానికి సంబంధించిన ఇతర నియమాలను అనుసరించేవారమై ఉండవలసిన అవసరం ఉంది. కనుక, ఇరువైపుల ఉన్న సీట్ల మధ్యనున్న దారీ, హాల్ బయటికి వెళ్ళే దారీ స్పష్టంగా కనిపించేలా, ఏ అడ్డమూ లేకుండేలా చూడండి. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే, సమావేశం జరిగే చోటును త్వరగా ఖాళీ చేయాలి.
12 మీరు జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకుంటున్నారా? శనివారం ఉదయం కార్యక్రమంలో బాప్తిస్మ అభ్యర్థుల కోసం సీట్లు రిజర్వు చేయబడతాయి. అటెండెంట్లు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారు. సాధ్యమైతే, ఆ కార్యక్రమం ఆరంభమయ్యే ముందే దయచేసి అక్కడ కూర్చోండి. మీ బైబిలునూ, పాటలపుస్తకాన్నీ, పొందికైన వస్త్రాలనూ, టవల్నూ తెచ్చుకోవాలి. స్లోగన్లున్న టీషర్ట్స్ లాంటి దుస్తులు గౌరవప్రదమైన ఆ సందర్భానికి సముచితంకావు. బాప్తిస్మ అభ్యర్థులతో మన పరిచర్య పుస్తకంలోని ప్రశ్నలను పునఃసమీక్షించే సంఘపెద్దలు, పునఃసమీక్షిస్తున్న అంశాలను అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారో లేదో నిశ్చయపరచుకోవాలి. బాప్తిస్మం అనేది యెహోవాకు ఒకరు వ్యక్తిగతంగా చేసుకొనే సమర్పణకు ప్రతీక కనుక అభ్యర్థులు బాప్తిస్మం తీసుకొనేటప్పుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేక చేతులు పట్టుకోవడం సముచితం కాదు.
13 మీరు సమావేశాల్లో కెమెరాలను, వీడియో రికార్డర్లను, ఆడియో కేసెట్ రికార్డర్లను ఉపయోగించవచ్చు. అయితే, వాటిని మీరు సీట్ల మధ్య ఉండే దారికి అడ్డంగా ఉంచకూడదు, ఇతరుల చూపుకు అడ్డంగా ఉంచకూడదు. కార్యక్రమంపై అవధానానికి భంగం కలిగించకూడదు. వాటిని ఎలక్ట్రికల్ లేదా సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయకూడదు.
14 సెల్యూలార్ ఫోన్ల, పేజర్ల ఉపయోగం అధికమౌతోంది కనుక, ఈ సాధనాలు మీ అవధానానికి కానీ మీ చుట్టూ ఉన్న ఇతరుల ఏకాగ్రతకు కానీ ఆటంకం కలిగించకుండా చూడండి. మీరు ప్రేక్షకుల్లో కూర్చున్నప్పుడు ఈ సాధనాలు అందరికీ వినపడేలా మ్రోగడానికి దయచేసి అనుమతించవద్దు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీకు సెల్యూలార్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, దయచేసి ఆడిటోరియమ్ బయటకు వెళ్ళి ఉపయోగించండి.
15 సమయం ఆదా చేయడానికి, సులభంగా ఉండేందుకు ప్రతిరోజు మన భోజనాల్ని మనమే తెచ్చుకోవాలని సంస్థ కోరుతుంది. మధ్యాహ్న భోజన విరామంలో తమ కుటుంబాలతో కూర్చొని ఆ రోజు కోసం తాము తెచ్చుకున్న వాటిని తినవచ్చని ఈ నిర్దేశాన్ని పాటించిన చాలా మంది సహోదరులు కనుగొన్నారు. మధ్యాహ్న విరామం ఉపశమనానికి ఒక అవకాశమనీ తమ సహోదర, సహోదరీలతో అదనపు సమయాన్ని గడపడం ఆనందదాయకంగా ఉంటుందనీ చాలామంది చెప్పారు. ఆహారపదార్థాలను, పానీయాలను ముందే కొనుక్కొని వాటిని మీ సీట్ల క్రింద పట్టే చిన్న కంటైనర్‌లో ఉంచుకోవాలి. హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ నిర్దేశాన్ని అనుసరించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఇటీవల, మన సహోదరులు సమావేశం జరుగుతున్న సమయంలో, ఆడిటోరియమ్‌ను వదలి సమావేశ వసతుల లోపల ఉన్న ఫుడ్ స్టాల్లకో బయట ఉన్న ఫుడ్ స్టాల్లకో వెళ్తున్నారని నివేదించబడుతోంది. అలా చేయడం వల్ల ప్రేక్షకుల అవధానానికి భంగం కలగడమే కాక, ప్లాట్ ఫామ్ నుండి అందించబడుతున్న సమాచారానికి అగౌరవాన్ని చూపించినట్లవుతుంది. ఫుడ్ స్టాల్ల నుండి భోజన పానీయాలను తెచ్చుకోవాలని ఎవరైనా అనుకుంటే అభ్యంతరం ఏమీ లేదు కానీ, ఆ పని విరామ సమయంలో చేసుకోవడం మంచిది. ఫుడ్ స్టాల్ల చుట్టూ ఎక్కువ మంది గుమికూడి ఉంటే, బహుశా ఏదైన నేరం చేయాలన్న ఉద్దేశంతో లోకస్థులు, సమావేశానికి వచ్చినవారిగుంపులో కలిసిపోయేందుకు ఆకర్షించబడవచ్చన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం మంచిది. అందుకే సమావేశానికి ప్రతి ఒక్కరూ సొంతంగా ఆహార పానీయాలను తెచ్చుకోవడానికి శ్రమించమని కోరుతున్నాం. మీతో పాటు వచ్చే ఆసక్తిగలవారు కూడా సొంతంగా ఆహారం తెచ్చుకోవాలి. సమావేశ వసతులలోనికి గాజు కంటైనర్లను మద్యపానాలను అనుమతించడంలేదు.
16 ప్రతీరోజూ కార్యక్రమానంతరం సమావేశ స్థల సౌకర్యాలను శుభ్రం చేసేందుకు స్వచ్ఛందంగా మీరు పని చేయగలరా? లేక సమావేశపు ఇతర విభాగాల్లోని ఒకదానిలో మీరు పనిచేయగలరా? మీరు ఒకవేళ సహాయం చేయగలిగితే సమావేశంలోని వోలంటియర్ సర్వీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి దయచేసి రండి. 16 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తమ తండ్రితో గానీ బాధ్యత గల ఒక పెద్ద వ్యక్తితో గానీ పనిచేసేందుకు ఆహ్వానించబడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏదైనా చెత్త కనిపిస్తే తీసివేసి, హాలును శుభ్రంగా ఉంచడంలో సహాయం చేయవచ్చు.
17 మన సమావేశాలకు ఎలాంటి దుస్తులు ఎలాంటి కేశాలంకరణ తగినవి అనే విషయంలో మనం కొన్ని మంచి మార్గదర్శక సూత్రాలను పొందాము. ఉదాహరణకు: మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్లలో ఈ విషయంపై నిర్దేశాలు ఉన్నాయి, మన సాహిత్యాల్లో సరైన వస్త్రధారణను కేశాలంకరణను చూపించే చిత్రాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా, యెహోవా ఏమి చెప్తున్నాడో తెలియజేసే బైబిలు మన దగ్గర ఉంది. (రోమా. 12:2; 1 తిమో. 2:9, 10) మనమెవరమో మనం ఎందుకు వాళ్ళ నగరంలో సమావేశమయ్యామో ప్రజలకు తెలుసు. కాబట్టి, మన దుస్తులు, కేశాలంకరణలు శక్తివంతమైన సాక్ష్యాన్నివ్వాలి. యెహోవా ప్రజల్లో అధికసంఖ్యాకులు ఈ విషయంలో మంచి మాదిరిని ఉంచుతారు. అయితే, అప్పుడప్పుడూ, మన సమావేశాలకు హాజరయ్యే కొందరి వస్త్రధారణలో, కేశాలంకరణలో లౌకికాత్మ ప్రతిబింబించబడడాన్ని మనం చూస్తాం. తాము ఆధ్యాత్మిక వ్యక్తులమని చెప్పుకుంటూ, తమ శరీర సౌష్ఠవాన్ని బయల్పరచేటువంటి వస్త్రధారణ చేసుకున్నట్లయితే అది వారి ఆధ్యాత్మికతను ప్రశ్నిస్తుంది. తగిన విధంగా, మురికిలేనటువంటి, శుభ్రమైన రూపమే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే, కుటుంబ శిరస్సులు, తమ కుటుంబ సభ్యులు ఎలాంటి వస్త్రాలను ధరించాలనుకుంటున్నారో చూడాలి. ఇది మనం సమావేశ ప్రాంతం నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా అన్వర్తిస్తుంది. మన లేపల్ బ్యాడ్జిలను ఆ రోజు కార్యక్రమానికి ముందు తర్వాత కూడా ధరించుకొని ఉండడం ద్వారా మనం యెహోవాతో సంబంధం గలవాళ్ళమనీ, ఆయన యొక్క పరిశుభ్రమైన ప్రజలతో సంబంధం గలవాళ్ళమనీ తెలియజేసుకుంటాం.—మార్కు 8:38తో పోల్చండి.
18 “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అనీ “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును” అనీ దైవావేశము వలన జ్ఞానియైన సొలొమోను గ్రహించాడు. (సామె. 22:15; 29:15) కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేని చిన్న సాక్షులు కార్యక్రమం నుండి ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్న సహోదర సహోదరీల అవధానానికి భంగం కలుగజేశారు. గత సంవత్సర సమావేశాల్లో చిన్న పిల్లలు పర్యవేక్షణ లేని కారణంగా అటు ఇటు పరుగులెత్తడం గమనించడం జరిగింది. అదే సమయంలో, కొంతమంది యౌవనస్థులు ఆడిటోరియమ్ వెలుపలా, టాయ్లెట్ల దగ్గరా పిల్లలు తచ్చాట్లాడుతుండడం గమనించడం జరిగింది. ఈ పిల్లలూ, యౌవనులూ తమ కోసం తయారుచేయబడిన ఆధ్యాత్మిక కార్యక్రమం నుండి ప్రయోజనం పొందడం లేదన్నది స్పష్టమవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గూర్చి లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు కనుక, పిల్లలు తమ వద్ద కూర్చున్నప్పుడు మాత్రమే, వాళ్ళు సరిగా ప్రవర్తిస్తున్నారనీ, యెహోవా నిర్దేశాలను ఆలకిస్తున్నారనీ తల్లి గాని తండ్రి గాని నిశ్చయత కలిగి ఉండగలరు. ఎవరైనా అవధాన భంగం కలిగిస్తున్నట్లయితే, అటెండెంట్లు వారి దగ్గరికి వెళ్ళి, కార్యక్రమానికి అవధానాన్నివ్వమని దయాపూర్వకంగా గుర్తు చేస్తూ, అవధానభంగం కలిగించవద్దని కోరతారు.
19 మనం మన సమావేశాలకు ప్రజలను ఆహ్వానిస్తాం కనుక, మన పిల్లల గురించీ మన సొంత వస్తువుల గురించీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం తెలివైన పని. మన పిల్లలు యెహోవా అనుగ్రహించిన ప్రశస్తవరాలు. కానీ ఈ లోకం, సాతాను యొక్క దోచుకొనే ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది. అందుకే దయచేసి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎల్లప్పుడూ తెలుసుకోండి. అలాగే కెమెరాలు, పర్స్‌లు, ఇతర విలువైన వస్తువులు ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి, మీ సీట్లలో వదిలిపెట్టవద్దు. మీ వాహనానికి తాళం వేశారా అన్నది నిశ్చయపరచుకోండి. మీ వస్తువులను మీ వాహనపు డిక్కీలో పెట్టండి, లేదా మీతో పాటు ఉంచుకోండి. మీ వాహనంలో జొరబడి మీ వస్తువులను తీసుకోవాలన్న ప్రలోభం ఇతరులకు కలిగే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.
20 మీ కోసం బుక్ చేసిన హోటల్ విషయమై ఏమైనా సమస్యలు తలెత్తితే స్థానిక రూమింగ్ విభాగం మీకు సహాయం చేసేందుకు ఆతురతతో ఉంటుంది. దయచేసి, మీరు సమావేశ స్థలంలో ఉన్నప్పుడే, ఆ సమస్యను గురించి సమావేశ రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలియజేయండి. అలా వాళ్లు మీ సమస్యను పరిష్కరించడానికి సంతోషిస్తారు. అలా మీరు సమావేశాన్ని ఆస్వాదించడంలో కొనసాగవచ్చు. రూమింగ్కు సంబంధించి ఈ క్రింది విషయాలను గమనించండి:
▪ యెహోవా ప్రజలు చాలామంది హోటళ్ళలో ఉంటున్నారు కనుక, బుక్ చేయించుకునేటప్పుడే, పొగత్రాగేందుకు అనుమతించని గదులు కావాలని కోరుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికీ లభ్యం కాకపోవచ్చు. గత సంవత్సర సమావేశంలో కొంతమంది సహోదరులు మరిన్ని సదుపాయాల కోసం హోటల్ మేనేజ్మెంట్తో కొట్లాడినట్లుగా తెలుపుతూ మాకు నివేదికలు అందాయి.
▪ మీరు బసచేసే ఆ హోటల్ గదిని ఎప్పటినుంచి ఉపయోగిస్తారో, ఎప్పుడు గది ఖాళీ చేస్తారో ఆ సమయాలను దయచేసి అవలోకించి చూడండి. ముందుగానే తెలిపినట్లయితే, బహుశా ముందుగా ఆ గదికి కొంచెం ముందే వెళ్ళేందుకు లేదా కాస్త ఆలస్యంగా ఆ గదిని ఖాళీ చేసేందుకు హోటల్‌వాళ్ళు సమ్మతించవచ్చు.
▪ రాను రాను డబ్బు వెంట తీసుకొని వెళ్ళడం సురక్షితంగా ఉండడం లేదు కాబట్టి, మీరు ఉంటున్న హోటల్లో, భోజనానికి అయ్యే బిల్లులను, ఇతర బిల్లులను, రూమ్ బిల్లులతో కలిపి హోటల్ గది ఖాళీ చేస్తున్నప్పుడే ఒకేసారి చెల్లించడం శ్రేష్ఠం.
▪ అనేక హోటళ్ళలో లభ్యమయ్యే దూరదర్శిని లేదా వీడియో సర్వీసులు తరచూ అనుచితమైన కార్యక్రమాలను చూపించే చానెళ్ళను కూడా లభ్యం చేస్తాయి. చాలా హోటళ్ళలో కొన్ని ఛానల్స్ లేదా కొన్ని ఫీచర్లు మీరు రిక్వెస్ట్ చేస్తే, మీరెన్ని రోజులు అక్కడ ఉంటారో అంతవరకూ నిలిపివేస్తారు. ఇంట్లో లాగానే మీ పిల్లలు దూరదర్శినిలో ఏయే కార్యక్రమాలను తిలకిస్తున్నారు అనే విషయంలో దృష్టి ఉంచండి.
21 సమావేశ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సహోదర సహోదరీలు నోట్స్ వ్రాసుకోవడాన్ని చూడడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్లుప్తంగా వ్రాయడం మీ అవధానాన్ని నిలిపేందుకు సహాయపడి ప్రాముఖ్యమైన అంశాలు తిరిగి జ్ఞాపకం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. మీరు వ్రాసిన ఆ నోట్స్ తర్వాత మీ కుటుంబంతో లేక స్నేహితులతో పునఃసమీక్షించడం సమావేశపు ఉన్నతాంశాల్ని మీరు ధ్యానించేందుకు అలా మీరు వాటిని మర్చిపోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
22 దైవపరిపాలనా ఆసక్తులకు యెహోవా ప్రజలు ఎల్లప్పుడూ ఉదారంగా విరాళాలనిస్తారు. (నిర్గ. 36:5-7; 2 దిన. 31:10; రోమా. 15:26, 27) ప్రపంచవ్యాప్త పని కొరకైన మీ స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు జరుపుకునే పెద్ద హాలుల అద్దెను చెల్లించడానికి ఉపయోగించబడుతున్నాయి. మీ చందా చెక్కు రూపంలో ఇస్తున్నట్లయితే, దానిని “watchtower society”కి చెల్లించబడేలా వ్రాయండి. ఒక కవరులో చెక్కుతో పాటు ఈ విరాళము society’s corpus కి అని తెలియజేస్తున్న ఒక ఉత్తరాన్ని పెట్టండి.
23 ఆమోసు 3:7లో నమోదుచేయబడినట్లు యెహోవా ‘తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ యేమియు చేయను’ అని అంటున్నాడు. “మర్మములను బయలుపర”చే వానిగా యెహోవా, బైబిలులో వందలాది ప్రవచనాలను వ్రాయించాడు. అవి, ఖచ్చితంగా సంపూర్ణంగా నెరవేరాయి. (దాని. 2:28, 47) గొప్ప వాగ్దానాలు ఇంకా నెరవేరనైవున్నాయి. ఈ 1999-2000 “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలు దేవుని వాగ్దానాల మీద మీకున్న విశ్వాసాన్ని బలపరుస్తాయి. మీ కోసమైన యెహోవా మాటను దగ్గరకు వెళ్ళి ఆలకించండి. మీ పరిచర్యలో, మీ సంఘంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు విన్నవాటిని, చూసిన వాటిని ఆచరించండి. ఈ సమృద్ధమైన ఆధ్యాత్మిక విందు జరుగుతున్న ప్రతి దినమూ హాజరయ్యేందుకు మీరు చేసుకునే ఏర్పాట్లలో యెహోవా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తాం!
[3వ పేజీలోని బ్లర్బ్]
శుక్ర, శని, ఆది వారాల్లో రోజంతా హాజరై ఉండేలా ప్లాన్ వేసుకోండి!