ఫిర్యాదు చేయడం ఎల్లప్పుడూ తప్పేనా?
మనం ఫిర్యాదు చేయలేని చికాకులకంటే ఏవి ఎక్కువ బాధాకరంగా ఉంటాయి?—మార్కీ డె కూస్టీన్, 1790-1857.
ఆమె రెండేళ్లపాటు తోటి ఉద్యోగినుండి లైంగిక వేదింపును సహించింది. ఆమె అసమ్మతిని తెలియజేసినందుకు దుర్భాషకు గురై, ఉద్ధేశపూర్వకంగా అలక్ష్యం చేయబడింది. పేరుకుపోయిన ఒత్తిడి ఆమె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తోంది, కాని ఆమె ఏమి చేయగలదు? అలాగే, తన తరగతిలో ఉన్నతశ్రేణి విద్యార్థిగావున్న ఒక విద్యార్థి పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు, పాఠశాల కోరుతున్న సమరోచిత కళా డ్రిల్లుల్లో భాగం వహించడానికి అతని మనస్సాక్షి అంగీకరించకపోవడమే అందుకు కారణం. ఇద్దరూ తమకు అన్యాయం జరుగుతున్నట్లు భావించారు, కానీ వాళ్లు ఫిర్యాదు చేయాలా? వాళ్లు ఫిర్యాదు చేస్తే, ఉపశమనం లభిస్తుందని ఎదురుచూడవచ్చా, లేక అది పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుందా?
మనం అపరిపూర్ణ మానవుల మధ్య హీనమైన లోకంలో జీవిస్తున్నాము గనుక ఇలాంటివి, మరితర ఫిర్యాదులు నేడు సర్వసాధారణమే. ఒక పరిస్థితి గురించి ఉదాసీనమైన అసమ్మతిని, వేదనను, బాధను లేక ఆగ్రహాన్ని వ్యక్తపర్చడం మొదలుకొని ఒక వ్యక్తికి వ్యతిరేకంగా లాంఛనప్రాయంగా ఆరోపణ చేయడం వరకూ, ఇలాంటివన్నీ ఫిర్యాదు చేయడంలోని భాగాలే. ఫిర్యాదు చేయడాన్నీ, ప్రతిఘటించడాన్నీ చాలామంది నివారిస్తారు; అయితే ఒకరు ఎప్పటికీ మౌనంగా ఉండవలసిందేనా? బైబిలు దృక్కోణం ఏమైవుంది?
మనమీద, ఇతరులమీద చూపే చెడు ప్రభావాలు
ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండే దృక్పథం హానికరమైనదనడంలో సందేహం లేదు, బైబిలు దాన్ని ఖండిస్తోంది. ఫిర్యాదు చేసే వ్యక్తి తనకు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా హాని కలుగజేసుకుంటాడు అలాగే, ఎవరి గురించి ఫిర్యాదు చేస్తున్నాడో వాళ్లకు విసుగు కలిగిస్తాడు. ఫిర్యాదు చేసే భార్యను గురించి ప్రస్తావిస్తూ, బైబిలు సామెత ఇలా చెబుతోంది: “ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము.” (సామెతలు 27:15) యెహోవాకు వ్యతిరేకంగా లేక ఆయన ఏర్పాట్లలో ఒకదానికి వ్యతిరేకంగా చేయబడే ఫిర్యాదు ప్రాముఖ్యంగా తప్పు. అరణ్యంలో తమ 40 ఏళ్ల ప్రయాణ కాలంలో అద్భుతంగా అందజేయబడిన మన్నాను ఇశ్రాయేలు జనాంగం “చవిసారములు లేని ఈ అన్నము” అని చెబుతూ దాని గురించి ఫిర్యాదు చేసినప్పుడు, గౌరవంలేని ఆ ఫిర్యాదీలను శిక్షించడానికి యెహోవా విషపూరితమైన పాములను పంపించాడు, దానితో అనేకులు మరణించారు.—సంఖ్యాకాండము 21:5, 6.
అంతేగాక, మన తోటి మానవుల్లో కనిపించే పొరపాట్ల “నలుసు” గురించి ఫిర్యాదు చేయవద్దు కానీ మనకై మనం చేసే పొరపాట్ల పెద్ద “దూలము” గురించి తెలుసుకొని ఉండమని యేసు తన అనుచరులకు ఉపదేశించాడు. (మత్తయి 7:1-5) అదే విధంగా, ‘ఏ విషయంలో ఎదుటివారికి తీర్పు తీరుస్తావో అట్టి కార్యాలు నీవూ చేస్తావు గనుక’ ఇతరులకు తీర్పుతీర్చడం (ఒక విధమైన ఫిర్యాదు చేయడం) ‘క్షమించరానిదని’ పౌలు దాన్ని ఖండించాడు. ఫిర్యాదు చేయడం గురించి ఇవ్వబడిన ఈ హెచ్చరికలు, అనవసరంగా విమర్శనాత్మకంగా ఉండడం మరియు ఫిర్యాదుచేసే దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం వంటివి నివారించడానికి మనల్ని పురికొల్పాలి.—రోమీయులు 2:1.
ఫిర్యాదు చేయడం ఎల్లప్పుడూ ఖండించబడిందా?
అన్ని విధాలైన ఫిర్యాదులూ ఖండించబడ వలసినవని మనం తీర్మానించాలా? లేదు, మనమలా తీర్మానించకూడదు. మనం జీవిస్తున్న ఈ లోపభరితమైన ప్రపంచంలో సరిచేయబడనర్హమైన అనేక అన్యాయాలు ఉన్నాయని బైబిలు సూచిస్తుంది. ఒక ఉదాహరణలో, అన్యాయానికి గురైన విధవరాలు “మాటి మాటికి వచ్చి [తనను] గోజాడకుండునట్లు” అసమ్మతంగానే ఆమెకు న్యాయం తీర్చిన అన్యాయస్థుడైన ఒక న్యాయాధిపతి గురించి యేసు ప్రస్తావించాడు. (లూకా 18:1-8) కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పులు సరిదిద్దబడేంతవరకు విడువక ఫిర్యాదు చేస్తుండవలసి ఉంటుంది.
దేవుని రాజ్యం రావాలని ప్రార్థించమని మనల్ని ప్రోత్సహించడం ద్వారా, ఈ ప్రస్తుత ప్రపంచపు లోపాలను గుర్తించి, వాటికి పరిష్కారం కొరకు దేవునికి ‘మొఱ్ఱపెట్టమని’ యేసు మనల్ని పురికొల్పలేదా? (మత్తయి 6:10) ప్రాచీన సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన “మొర” ఆయన చెవులకు చేరినప్పుడు, యెహోవా “నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు [ప్రవర్తించారో] లేదో” చూసి, దానికి ఒక పరిష్కారం తెమ్మని తన దూతలను పంపించాడు. (ఆదికాండము 18:20, 21) తనకు ఫిర్యాదు చేసినవారికి ఉపశమనం కలిగిస్తూ, ఆ రెండు పట్టణాలను దానిలోని అవినీతిపరులైన నివాసులను నాశనం చేయడం ద్వారా యెహోవా ఆ తర్వాత పరిస్థితిని చక్కబరిచాడు.
క్రైస్తవ సంఘం
క్రైస్తవ సంఘంలోని సహోదరుల మధ్య అది వేరుగా ఉండాలా? క్రైస్తవులు అపరిపూర్ణ స్త్రీ పురుషులే అయినప్పటికీ, వారు శాంతి ఐక్యతలతో దేవుని సేవ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ, సరిదిద్దబడవలసిన అవసరత గలవాటి గురించి కొంతమేరకు ఫిర్యాదు చేయవలసిన పరిస్థితులు వారి మధ్య తలెత్తుతాయి. మొదటి శతాబ్దంలో, పెంతెకొస్తు తర్వాత అభిషిక్త క్రైస్తవుల సంఘంలో ఒక పరిస్థితి తలెత్తింది. క్రొత్తగా క్రైస్తవులుగా మారిన అనేకులు అదనపు ఉపదేశం కొరకు, ప్రోత్సాహం కొరకు యెరూషలేములోనే ఉండిపోయారు. అందుబాటులోవున్న ఆహారాన్ని పంచుకోవడం జరిగేది. అయితే, “అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.” అపొస్తలులు ఇలా ఫిర్యాదు చేస్తున్నవారిని చికాకుకలిగించేవారని ఖండించే బదులు, పరిస్థితిని చక్కబరచడానికి చర్య గైకొన్నారు. అవును, తగిన గౌరవంతోనూ సరైన దృక్పథంతోనూ చేయబడే సహేతుకమైన ఫిర్యాదులను, సంఘంలో పర్యవేక్షణ చేసేవారు వినయంగా విని తగిన చర్యలు తీసుకుంటారు.—అపొస్తలుల కార్యములు 6:1-6; 1 పేతురు 5:3.
తగిన అధికారులకు ఫిర్యాదు చేయాలి
సరైన దృక్పథంతో, తగిన అధికారులకు ఫిర్యాదు చేయాలని మీరు ఈ పై ఉదాహరణల నుండి గమనించారా? ఉదాహరణకు, మోయలేని పన్ను భారం గురించి ఒక పోలీసుకు ఫిర్యాదు చేయడం లేక ఒకరి శారీరక రుగ్మతల గురించి ఒక న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం అర్ధరహితంగా ఉంటుంది. అలాగే, సంఘం వెలుపలి లేక లోపలి ఏ పరిస్థితి గురించి అయినా, సహాయం చేసే అధికారం గానీ సామర్థ్యం గానీ లేని వ్యక్తికి ఫిర్యాదు చేయడం అనుచితంగా ఉంటుంది.
నేడు అనేక దేశాల్లో, కొంత ఉపశమనాన్ని పొందవచ్చుననే అపేక్షతో విన్నపం చేసుకోవడానికి కోర్టులూ ఇతర తగిన అధికారాలు ఉన్నాయి. శీర్షికారంభంలో ప్రస్తావించబడిన విద్యార్థి కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు, న్యాయమూర్తులు ఆయనకు అనుకూలంగా తీర్పుతీర్చారు, ఆయన మళ్లీ పాఠశాలలోనికి చేర్చుకున్నారు. పాఠశాల ఆయనకు క్షమాపణలు తెల్పింది. అలాగే, లైంగిక వేధింపుకు గురైన ఆ ఉద్యోగిని, ఉద్యోగినుల సమాఖ్య ద్వారా ఉపశమనాన్ని పొందింది. పాఠశాల బోర్డు ఆమెకు క్షమాపణలు తెలిపింది. లైంగిక వేధింపును అరికట్టడానికి ఆమె యజమానులు చర్యలు తీసుకున్నారు.
అయితే, అన్ని ఫిర్యాదులకు అదే ఫలితం ఉంటుందని నిరీక్షించలేము. జ్ఞానియైన సొలొమోను రాజు వాస్తవికంగానే ఇలా పేర్కొన్నాడు: “వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు.” (ప్రసంగి 1:15) కొన్ని విషయాలు దేవుడు తన సమయంలో సరిదిద్దేంత వరకు వేచి ఉండవలసిందేనని మనం గుర్తించడం మంచిది.
[31వ పేజీలోని చిత్రం]
పెద్దలు సహేతుకమైన ఫిర్యాదులను విని, తగిన చర్యలు తీసుకుంటారు