ప్రేమ అయుక్తమైన అసూయపై విజయం సాధిస్తుంది
“ప్రేమ మత్సరపడదు [“అసూయపడదు,” NW].”—1 కొరింథీయులు 13:4.
1, 2. (ఎ) ప్రేమను గురించి యేసు తన శిష్యులకు ఏమి చెప్పాడు? (బి) ప్రేమ కలిగి మరియు అసూయపడుతూ కూడా ఉండగలగటం సాధ్యమేనా? మీరెందుకలా సమాధానమిస్తారు?
ప్రేమ నిజ క్రైస్తవత్వాన్ని సూచించే గురుతు. ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని’ యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 13:35) ప్రేమ క్రైస్తవ సంబంధాలనెలా ప్రభావితం చేయాలో వివరించడానికి అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడ్డాడు. మిగతా విషయాలతోపాటు, ఆయనిలా వ్రాశాడు: “ప్రేమ మత్సరపడదు [“అసూయపడదు,” NW].”—1 కొరింథీయులు 13:4.
2 పౌలు ఈ మాటలను వ్రాసినప్పుడు, ఆయన అయుక్తమైన అసూయను సూచిస్తున్నాడు. లేకపోతే అదే సంఘానికి ఆయనిలా వ్రాసి ఉండేవాడు కాదు: “దైవాసూయతో మీ యెడల అసూయ కలిగి యున్నాను.” (2 కొరింథీయులు 11:2, NW) సంఘంలో నీచప్రభావాన్ని కలిగి ఉన్న మనుష్యుల మూలంగా ఆయనకు “దైవాసూయ” రేగింది. ఎక్కువ ప్రేమపూర్వకమైన సలహాలను కలిగివున్న రెండవ ప్రేరేపిత లేఖను కొరింథులోని క్రైస్తవులకు వ్రాయడానికి అది పౌలును పురికొల్పింది.—2 కొరింథీయులు 11:3-5.
క్రైస్తవుల మధ్య అసూయ
3. అసూయ ఇమిడి ఉన్న ఒక సమస్య కొరింథు క్రైస్తవుల మధ్య ఎలా వృద్ధిచెందింది?
3 కొరింథీయులకు తాను వ్రాసిన మొదటి లేఖలో, ఈ క్రొత్త క్రైస్తవులు ఒకరితోనొకరు సర్దుకుపోవడాన్ని ఆపుతున్న ఒక సమస్యను పౌలు సరి చేయాల్సి ఉండినది. వారు ‘ఒకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగుతూ’ కొందరు మనుష్యులను ఉన్నతపరుస్తున్నారు. అది సంఘంలో విభాగాలు ఏర్పడటానికి దారి తీసింది, వేర్వేరు వ్యక్తులు “నేను పౌలు వాడను,” “నేను అపొల్లోవాడను,” “నేను కేఫావాడను,” అని చెప్పుకుంటున్నారు. (1 కొరింథీయులు 1:12; 4:6) అపొస్తలుడైన పౌలు సమస్య యొక్క మూలకారణాలను పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల పసిగట్టగలిగాడు. కొరింథీయులు “ఆత్మసంబంధులైన మనుష్యుల” వలె కాక శరీరానుసారమైన ప్రజలవలె ప్రవర్తిస్తుండిరి. అందుకే, పౌలిలా వ్రాశాడు: “మీరింకను శరీరసంబంధులై . . . యున్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?”—1 కొరింథీయులు 3:1-3.
4. ఒకరిని గురించి మరొకరు సరైన దృక్పథం కలిగి ఉండేందుకు తన సహోదరులకు సహాయం చేయడానికి పౌలు ఏ ఉపమానాన్ని ఉపయోగించాడు, దీనినుండి మనం ఎలాంటి పాఠాన్ని నేర్చుకోగలం?
4 సంఘంలోని వివిధ వ్యక్తుల కౌశలాలు మరియు సామర్థ్యాలను గురించిన సరైన దృష్టిని పొందడానికి పౌలు కొరింథీయులకు సహాయం చేశాడు. ఆయనిలా అడిగాడు: “నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” (1 కొరింథీయులు 4:7) 1 కొరింథీయులు 12వ అధ్యాయమందు, సంఘంలో భాగమైన వారు చెయ్యి, కన్ను, చెవి వలె శరీరం యొక్క వివిధ అవయవాలని పౌలు వివరించాడు. శరీరం యొక్క అవయవాలు ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలా దేవుడు వాటిని చేశాడని ఆయన సూచించాడు. పౌలు ఇలా కూడా వ్రాశాడు: “ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.” (1 కొరింథీయులు 12:26) నేడు దేవుని సేవకులందరూ ఒకరితోనొకరికి గల సంబంధాల విషయంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోవాలి. దేవుని సేవలో మరొక వ్యక్తి యొక్క నియామకాన్ని బట్టి లేక అతడు సాధించిన వాటిని బట్టి అసూయపడే బదులు, మనం అతనితో సంతోషించాలి.
5. యాకోబు 4:5 నందు ఏమి బయల్పర్చబడింది, మరి ఈ మాటల్లోని సత్యాన్ని లేఖనాలెలా ఉన్నతపరుస్తున్నాయి?
5 అది చేయడం కంటే చెప్పడం సులభమని ఒప్పుకోవలసిందే. పాపభరితులైన మానవులందరిలో ‘ఈర్ష్యపడే స్వభావం’ ఉందని బైబిలు రచయితయైన యాకోబు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (యాకోబు 4:5) కయీను తన అయుక్తమైన అసూయకు లొంగిపోయాడు గనుక మొదటి మానవ మరణం సంభవించింది. ఇస్సాకు యొక్క పెరుగుతున్న సంపదను చూసి ఫిలిష్తీయులు ఈర్ష్యపడ్డారు గనుక వారతన్ని హింసించారు. పిల్లలను కనడంలో తన అక్క ఫలవంతంగా ఉండటాన్ని చూసి రాహేలు అసూయపడింది. యాకోబు కుమారులు తమ చిన్న తమ్ముడైన యోసేపుపట్ల చూపబడిన ఆప్యాయాన్నిబట్టి అసూయపడ్డారు. ఇశ్రాయేలీయురాలు కాని తన మరదలిని చూసి మిర్యాము అసూయపడినదన్నది స్పష్టం. కోరహు, దాతాను మరియు అబీరాములు మోషే, అహరోనులకు విరుద్ధంగా ఈర్ష్యతో పన్నాగం పన్నారు. దావీదు యొక్క సైనిక విజయాన్ని చూసి రాజైన సౌలు అసూయపడ్డాడు. యేసు శిష్యులు తమలో ఎవరు గొప్ప వారని పదే పదే వాదించుకోవడానికి అసూయ కూడా ఒక కారణమనడంలో సందేహం లేదు. ఏ అసంపూర్ణ మానవుడు కూడా ‘ఈర్ష్యపడే స్వభావం’ నుండి పూర్తిగా స్వతంత్రుడు కాదన్నది వాస్తవం.—ఆదికాండము 4:4-8; 26:14; 30:1; 37:11; సంఖ్యాకాండము 12:1, 2; 16:1-3; కీర్తన 106:16; 1 సమూయేలు 18:7-9; మత్తయి 20:21, 24; మార్కు 9:33, 34; లూకా 22:24.
సంఘమందు
6. ఈర్ష్యపడే స్వభావాన్ని పెద్దలెలా అదుపు చేసుకోగలరు?
6 ఈర్ష్య మరియు అయుక్తమైన అసూయనుండి క్రైస్తవులందరూ జాగ్రత్తపడవలసిన అవసరముంది. దేవుని ప్రజల సంఘాలపట్ల శ్రద్ధ వహించేందుకు నియమించబడిన పెద్దల కూటమిలు ఇందులో ఇమిడివున్నాయి. ఒక పెద్దకు దీనస్వభావం ఉంటే అతను ఇతరులకంటే తాను మెరుగుగా ఉన్నానని కనిపించాలని అత్యాశతో ప్రయత్నించడు. మరోవైపు, ఒకానొక పెద్దకు చక్కగా సంస్థీకరించగల లేక బహిరంగ ప్రసంగమివ్వగల ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లయితే, ఇతరులు దాన్ని సంఘానికి ఆశీర్వాదంగా భావిస్తూ, ఆ విషయాన్నిబట్టి సంతోషిస్తారు. (రోమీయులు 12:15, 16) ఒక సహోదరుడు తన జీవితంలో దేవుని ఆత్మ ఫలాలను ఫలిస్తున్నానని చూపుతూ, చక్కగా అభివృద్ధి చెందుతుండవచ్చు. అతని లక్షణాలను పరిశీలిస్తున్నప్పుడు, అతనిలోని కొన్ని స్వల్ప లోపాలను అతిగా చూస్తూ, అతన్ని పరిచారకునిగా లేక పెద్దగా సిఫారసు చేయకుండా ఉండటానికి అదొక సహేతుక కారణమని భావించరాదు. అది ప్రేమ మరియు సహేతుకత లోపించడాన్ని చూపిస్తుంది.
7. ఒక క్రైస్తవునికి ఏదైనా దైవపరిపాలనా నియామకం వస్తే ఏ సమస్య వృద్ధి చెందవచ్చు?
7 ఎవరైనా ఒకరు దైవపరిపాలనా నియామకాన్ని లేక ఒక ఆత్మీయ దీవెనను పొందితే, సంఘంలోని ఇతరులు ఈర్ష్యపడకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు, సమర్థురాలైన ఒక సహోదరి క్రైస్తవ కూటాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఇతరుల కంటే ఎక్కువ తరచుగా ఉపయోగింప బడుతుండవచ్చు. ఇది కొందరు సహోదరీలు అసూయపడేలా చేయగలదు. ఫిలిప్పీ సంఘంలో యువొదియ మరియు సుంటుకేల మధ్య ఇలాంటి సమస్యే ఉండి ఉండవచ్చు. అలాంటి ప్రస్తుత దిన స్త్రీలు దీనంగా మరియు “ప్రభువునందు ఏకమనస్సుగలవారై” ఉండేందుకు వారికి పెద్దలనుండి దయాపూర్వకమైన ప్రోత్సాహం అవసరమవ్వవచ్చు.—ఫిలిప్పీయులు 2:2, 3; 4:2, 3.
8. అసూయ ఏ పాపభరితమైన కార్యాలకు నడిపించగలదు?
8 సంఘంలో ఇప్పుడు ఆధిక్యతలతో దీవించబడుతున్న వ్యక్తులకు మునుపుండిన లోపాలను గురించి ఒక క్రైస్తవునికి తెలిసి ఉండవచ్చు. (యాకోబు 3:2) అసూయతో, దీన్ని గురించి ఇతరులతో మాట్లాడాలని మరియు సంఘంలోని వారి నియామకాన్ని సవాలు చేయాలని శోధన కలుగవచ్చు. ఇది “అనేక పాపములను కప్పు” ప్రేమకు విరుద్ధంగా ఉంటుంది. (1 పేతురు 4:8) అసూయతో కూడిన మాటలు సంఘం యొక్క శాంతిని పాడుచేయగలవు. శిష్యుడైన యాకోబు ఇలా హెచ్చరించాడు: “మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.”—యాకోబు 3:14, 15.
మీ కుటుంబమందు
9. వివాహ జతలు అసూయా భావాలనెలా అదుపు చేసుకోగలరు?
9 అయుక్తమైన అసూయ వలన అనేక వివాహాలు విఫలమౌతున్నాయి. వివాహజతయందు అపనమ్మకాన్ని చూపడం ప్రేమపూర్వకం కాదు. (1 కొరింథీయులు 13:7) మరోవైపు, ఒక జత కలిగివున్న అసూయాభావాలపట్ల మరో జత అన్యమనస్కంగా ఉండవచ్చు. ఉదాహరణకు, వ్యతిరేకలింగ వ్యక్తుల్లో ఒకరిపట్ల తన భర్త చూపుతున్న ఆసక్తిని బట్టి భార్య అసూయపడవచ్చు. లేక అవసరాల్లో ఉన్న బంధువు కొరకు భార్య గడుపుతున్న ఎక్కువ సమయాన్నిబట్టి భర్త అసూయపడవచ్చు. అలాంటి భావాలనుబట్టి ఖిన్నులై, వివాహ జతలు మౌనంగా ఉండి సమస్యను మరింత చిక్కైనదిగా చేసే పద్ధతిలో తమ విసుగును చూపించవచ్చు. బదులుగా, అసూయపడే వివాహ జత సంభాషించి తన భావాలను గురించి యథార్థంగా మాట్లాడాలి. దానికి ప్రతిగా, మరో జత తన ప్రేమను గూర్చి తిరిగి భరోసా ఇచ్చి అర్థం చేసుకోవాలి. (ఎఫెసీయులు 5:28, 29) అసూయకు తావిచ్చే పరిస్థితులను నివారించి వారిద్దరూ అలాంటి భావాలను తగ్గించుకోవాలి. దేవుని మంద యొక్క కాపరిగా తనకున్న బాధ్యతను నెరవేర్చేందుకు తాను స్త్రీలయెడల తగినంత, యుక్తమైన అవధానాన్ని మాత్రమే ఇస్తున్నాడని గ్రహించేందుకు కొన్నిసార్లు ఒక క్రైస్తవ అధ్యక్షుడు తన భార్యకు సహాయపడవలసిన అవసరం ఉండవచ్చు. (యెషయా 32:2) ఒక పెద్ద అసూయకు ఎన్నడూ తగిన కారణాలను ఇవ్వకుండా జాగ్రత్తపడాలన్నది మాత్రం వాస్తవం. అతను తన స్వంత వివాహ సంబంధాన్ని దృఢపర్చుకోడానికి తగినంత సమయాన్ని గడుపుతున్నానని నిశ్చయపర్చుకుంటూ సమతూకాన్ని కనపర్చాలి.—1 తిమోతి 3:5; 5:1, 2.
10. తమ పిల్లలు అసూయా భావాలతో వ్యవహరించడానికి తల్లిదండ్రులెలా వారికి సహాయం చేయగలరు?
10 అయుక్తమైన అసూయా భావం ఎలా కలుగుతుందో తమ పిల్లలు గ్రహించడానికి తల్లిదండ్రులు వారికి సహాయం చేయాలి. పిల్లలు తరచూ గొడవలకు దారితీసే కీచులాటల్లో ఇమిడిపోతుంటారు. చాలామటుకూ దానికి కారణం అసూయే. ప్రతి బిడ్డ అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి గనుక, పిల్లలందరితో ఒకే విధంగా వ్యవహరించరాదు. అంతేకాక, వారిలో ప్రతి ఒక్కరికీ విభిన్నమైన శక్తులు మరియు బలహీనతలు ఉంటాయన్న విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఒక బిడ్డ ఎప్పుడూ కూడా మరో బిడ్డంత మంచిగా చేయాలని ప్రోత్సహింపబడితే, అది ఒకరిలో ఈర్ష్యను మరొకరిలో అహంకారాన్ని పెంపొందించగలదు. గనుక, ఒకరితోనొకరు పోటీపడటం ద్వారా కాక దేవుని వాక్యంలోని ఉదాహరణలను పరిశీలించడం ద్వారా తమ అభివృద్ధిని చూసుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలి. బైబిలిలా చెబుతుంది: “ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.” బదులుగా, “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” (గలతీయులు 5:26; 6:4) అత్యంత ప్రాముఖ్యంగా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమ బైబిలు పఠనం ద్వారా, దేవునివాక్యంలో ఉన్న మంచి మరియు చెడు ఉదాహరణలను ప్రత్యేకపరచి చూపడం ద్వారా సహాయం చేయవలసిన అవసరముంది.—2 తిమోతి 3:15.
అసూయను అధిగమించిన మాదిరులు
11. అసూయతో వ్యవహరించడంలో మోషే ఎలా ఒక మంచి ఉదాహరణ?
11 ఈ లోకపు అధికారదాహంగల నాయకులవలె కాక, “మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12:3) ఇశ్రాయేలీయులపై నాయకత్వాన్ని తానొక్కడే భరించడం మోషేకు కష్టతరమైనప్పుడు, ఇతర 70 మంది ఇశ్రాయేలీయులు మోషేకు సహాయం చేయడానికి వారికి శక్తినిస్తూ, యెహోవా వారిపై తన ఆత్మ పని చేసేలా చేశాడు. వీరిలో ఇద్దరు మనుష్యులు ప్రవక్తలవలె ప్రవర్తించడం ప్రారంభించినప్పుడు, ఇది మోషే నాయకత్వాన్ని అయుక్తంగా తగ్గిస్తుందని యెహోషువ భావించాడు. యెహోషువ ఆ పురుషులను అడ్డగించాలనుకున్నాడు, అయితే మోషే వినయంగా ఇలా తర్కించాడు: ‘నా నిమిత్తము నీకు రోషము [“అసూయ,” NW] వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక.’ (సంఖ్యాకాండము 11:29) అవును, ఇతరులు సేవాధిక్యతలను పొందినప్పుడు మోషే ఆనందించాడు. ఆయన అసూయతో ఘనతంతా తనకే ఉండాలని కోరుకోలేదు.
12. అసూయా భావాలను విసర్జించడానికి యోనాతానుకు ఏది సహాయం చేసింది?
12 ప్రేమ అయుక్తమైన అసూయా భావాలను ఎలా జయిస్తుందనే దానికి చక్కని మాదిరిని, ఇశ్రాయేలీయుల రాజైన సౌలు కుమారుడైన యోనాతాను చూపించాడు. తన తండ్రి సింహాసనాన్ని పొందగల వారసుల్లో యోనాతాను మొదటివాడు, కానీ తదుపరి రాజు అయ్యేందుకు యెహోవా యెష్షయి కుమారుడైన దావీదును ఎన్నుకున్నాడు. యోనాతాను స్థానంలో ఉండే అనేకులు దావీదును ఒక పోటీదారునిగా పరిగణించి అతనంటే అసూయపడేవారు. అయితే, దావీదుపట్ల యోనాతానుకున్న ప్రేమ అలాంటి భావన ఎన్నడూ తనపై అధికారం చేయకుండా కాపాడింది. యోనాతాను మరణాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, దావీదిలా చెప్పగల్గాడు: “నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.”—2 సమూయేలు 1:26.
అత్యున్నతమైన మాదిరులు
13. అసూయ విషయంలో ఎవరు శ్రేష్ఠమైన ఉదాహరణ, మరి ఎందుకు?
13 యుక్తమైన అసూయపైకూడా పట్టు సాధించిన వారిలో యెహోవా దేవుడు అత్యున్నతమైన మాదిరి. ఆయన అలాంటి భావాలను పరిపూర్ణంగా అదుపులో ఉంచుతాడు. దైవిక అసూయ యొక్క ఎలాంటి శక్తివంతమైన ప్రదర్శనయైనా ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమ, న్యాయము మరియు జ్ఞానమునకు అనుగుణంగా ఉంటుంది.—యెషయా 42:13, 14.
14. సాతానుకు భిన్నంగా యేసు ఏ మాదిరిని ఉంచాడు?
14 అసూయపై పట్టు సాధించినట్లు కన్పించిన వారిలో ఉన్నతమైన రెండవ మాదిరికర్త దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు. “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,” యేసు ‘దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.’ (ఫిలిప్పీయులు 2:6) అపవాదియగు సాతానుగా మారిన అత్యాశగల దేవదూత కలిగివున్న నడవడి నుండి అది ఎంత భిన్నమైనది! యెహోవాకు విరుద్ధంగా వ్యతిరేక దేవునిగా తన్ను నిలుపుకుంటూ, “బబులోను రాజు” వలె, సాతాను తనను తాను ‘మహోన్నతునితో సమానునిగా’ చేసుకోవాలని అసూయతో కోరుకున్నాడు. (యెషయా 14:4, 14; 2 కొరింథీయులు 4:4) యేసు తనకు ‘సాగిలపడి నమస్కారము చేసేలా’ చేయాలని కూడా సాతాను ప్రయత్నించాడు. (మత్తయి 4:9) యెహోవా సర్వాధిపత్యానికి లోబడాలన్న తన దీనమైన నడవడి నుండి ఏదీ కూడా యేసును ప్రక్కకు తొలగించలేదు. సాతానుకు భిన్నంగా, యేసు “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.” యేసు తన తండ్రి పరిపాలన యొక్క యథార్థతను ఉన్నతపర్చి, అపవాది యొక్క అహంకారము మరియు అసూయా నడవడిని పూర్తిగా నిరాకరించాడు. యేసు నమ్మకత్వానికి, “పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”—ఫిలిప్పీయులు 2:7-11.
మీ అసూయపై పట్టుసాధించడం
15. అసూయా భావాలను మనం అదుపు చేసుకునే విషయంలో మనమెందుకు శ్రద్ధ వహించాలి?
15 దేవుడు మరియు క్రీస్తు వలె కాక, క్రైస్తవులు అపరిపూర్ణులు. పాపభరితులు గనుక, కొన్నిసార్లు వారు పాపభరితమైన అసూయ కలిగి ప్రవర్తించవచ్చు. కాబట్టి, మన తోటి విశ్వాసి యొక్క కొన్ని స్వల్ప లోపాలను గురించి లేక ఊహించుకున్న తప్పిదాన్ని గురించి విమర్శించేందుకు అసూయ మనల్ని పురికొల్పడానికి అనుమతించే బదులు, ఈ ప్రేరేపిత మాటలను మనం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం: “అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?”—ప్రసంగి 7:16.
16. ఈ పత్రిక గత సంచికలో అసూయను గురించిన ఏ చక్కని సలహా ఇవ్వబడింది?
16 అసూయను గురించిన అంశంపై, 1911 మార్చి 15, కావలికోట (ఆంగ్లం) ఇలా హెచ్చరించింది: “మనం ప్రభువు సంకల్పం నిమిత్తం చాలా ఆసక్తిని, చాలా అసూయను కలిగి ఉండవలసినప్పటికీ, ఇతరుల బలహీనతలు వారి వ్యక్తిగతమైన విషయాలే; మరి మనం ‘అనవసరంగా జోక్యం చేసుకునే వారముగా’ ఉంటున్నామా అని చూసుకోవాలి. తర్వాత, ఈ విషయాన్ని గురించి పెద్దలు పరిశీలించడం యుక్తమా కాదా మరి పెద్దల వద్దకు వెళ్లడం మన పనియా కాదా అని చూసుకోవాలి. ప్రభువు సంకల్పం మరియు ప్రభువు పని నిమిత్తం మనకు అత్యంత అసూయ ఉండాలి, అయితే అది చేదైనది మాత్రం కాకూడదని మనం శ్రద్ధ వహించాలి . . . వేరే మాటల్లో చెప్పాలంటే, మనం ఇతరుల పట్ల అసూయ కలిగి ఉన్నామా, లేక ఇతరుల నిమిత్తం అంటే వారి మంచి మరియు బాగోగుల నిమిత్తం మనం అసూయ కలిగి ఉన్నామా అనే విషయంలో జాగ్రత్త వహించడం అవసరం.”—1 పేతురు 4:15.
17. అసూయ యొక్క పాపభరితమైన అలవాట్లను మనమెలా విసర్జించగలము?
17 క్రైస్తవులుగా మనం అహంకారాన్ని, అసూయను మరియు ఈర్ష్యను ఎలా విసర్జించగలము? మన జీవితాల్లో దేవుని పరిశుద్ధాత్మ పుష్కలంగా ప్రవహించడానికి అనుమతించడంలో పరిష్కారముంది. ఉదాహరణకు, మనం దేవుని ఆత్మ కొరకు మరియు దాని మంచి ఫలాలను కనుపర్చడంలో సహాయం కొరకు ప్రార్థించాల్సిన అవసరముంది. (లూకా 11:13) మనం క్రైస్తవ కూటాలకు హాజరవ్వవలసిన అవసరం ఉంది, అవి ప్రార్థనతో ప్రారంభమౌతాయి మరి దేవుని ఆత్మ మరియు దీవెనలు వాటిపై ఉంటాయి. అంతేకాక, దేవునిచేత ప్రేరేపింపబడిన బైబిలును మనం పఠించాల్సిన అవసరత ఉంది. (2 తిమోతి 3:16) యెహోవా పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్న రాజ్య ప్రచార పనిలో మనం భాగం వహించాల్సిన అవసరత ఉంది. (అపొస్తలుల కార్యములు 1:8) కొన్ని చెడు అనుభవాలవలన నలిగిపోయిన తోటి క్రైస్తవులకు సహాయం చేయడం, దేవుని ఆత్మ యొక్క మంచి ప్రభావానికి లోబడటంలో మరొక మార్గం. (యెషయా 57:15; 1 యోహాను 3:15-17) ఈ క్రైస్తవ కర్తవ్యాలను ఆసక్తితో నెరవేర్చడం అసూయ యొక్క పాపభరితమైన అలవాట్ల నుండి మనలను కాపాడటంలో సహాయం చేస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యమిలా చెబుతుంది: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.”—గలతీయులు 5:16.
18. అసూయ యొక్క అయుక్తమైన భావాలకు వ్యతిరేకంగా మనం ఎల్లప్పుడూ ఎందుకు పోరాడవలసి ఉండదు?
18 దేవుని పరిశుద్ధాత్మ ఫలాల్లో ప్రేమ మొదట చెప్పబడింది. (గలతీయులు 5:22, 23) ప్రేమను అవలంబించడం పాపభరితమైన స్వభావాలను ఇప్పుడు మనం అదుపు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. మరి భవిష్యత్తు సంగతేమిటి? లక్షలాదిమంది యెహోవాసాక్షులు రాబోయే భూ పరదైసులో జీవించాలన్న నిరీక్షణను కలిగి ఉన్నారు, వారక్కడ మానవ పరిపూర్ణతకు ఎత్తబడతారని ఎదురు చూడగలరు. ఆ నూతన లోకంలో, ప్రేమ నివసిస్తుంది మరి ఎవరూ కూడా అయుక్తమైన అసూయా భావాలను కలిగివుండరు, ఎందుకంటే “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతుంది.—రోమీయులు 8:21.
ధ్యానించాల్సిన అంశాలు
◻ అసూయను త్రిప్పికొట్టేందుకు సహాయం చేయడానికి పౌలు ఏ ఉపమానాన్ని ఉపయోగించాడు?
◻ సంఘం యొక్క శాంతిని అసూయ ఎలా విచ్ఛిన్నం చేయగలదు?
◻ అసూయతో వ్యవహరించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా తర్ఫీదునివ్వగలరు?
◻ అసూయ యొక్క పాపభరితమైన అలవాట్లను మనమెలా విసర్జించగలము?
[16వ పేజీలోని చిత్రం]
అసూయ సంఘ శాంతిని విచ్ఛిన్నం చేయనివ్వకండి
[17వ పేజీలోని చిత్రం]
అసూయా భావాలతో వ్యవహరించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు తర్ఫీదునివ్వగలరు