కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/15 పేజీలు 4-7
  • బాధ ఇక ఎంతమాత్రం ఉండనప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాధ ఇక ఎంతమాత్రం ఉండనప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వెంటనే తన చిత్తాన్ని బలవంతంగా ఎందుకు జరిపించకూడదు?
  • ప్రజలు సరైనది చేసేలా వారిని బలవంతం చేయవచ్చుగా?
  • అమాయకులైన బాధితులందరి సంగతేమిటి?
  • బాధను అనుభవించే వారికి నిజమైన ఉపశమనం
  • “అన్నిటికి కుదురుబాటు”
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • బాధలనుభవిస్తున్న వారికి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • బాధను సహించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/15 పేజీలు 4-7

బాధ ఇక ఎంతమాత్రం ఉండనప్పుడు

మానవ కుటుంబం కొరకు దేవుడు కలిగి ఉన్న మొదటి సంకల్పంలో బాధకు తావే లేదు. ఆయన దాన్ని రూపొందించలేదు, ఆయనకు అది ఇష్టంలేదు. ‘ఒకవేళ ఆ మాటే నిజమైతే, అది ఎలా మొదలైంది, అది ఇప్పటివరకూ కొనసాగేందుకు దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడు?’ అని మీరు అడుగవచ్చు.—యాకోబు 1:13 పోల్చండి.

దానికి జవాబు, మానవ చరిత్రను గూర్చిన అతి పురాతన రికార్డునందు అంటే బైబిలునందు ప్రాముఖ్యంగా ఆదికాండము పుస్తకంలో కనుగొనబడుతుంది. మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా అపవాదియగు సాతాను చేసిన తిరుగుబాటులో అతనితో చేతులు కలిపారని అది చెబుతుంది. వారి చర్యలు అతి ప్రాధాన్యమైన వివాదాంశాలను రేకెత్తించాయి, ఆ వివాదాంశాలు విశ్వ శాంతి భద్రతల పునాదిపై దాడి చేశాయి. తమకు ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకోగల హక్కు తమకుందని వారు అనినప్పుడు, వారు దేవుని సార్వభౌమాధిపత్యాన్ని సవాలు చేశారు. పరిపాలించగల మరియు “మంచి చెడులను” నిర్ణయించగల ఆయన హక్కును వారు ప్రశ్నించారు.—ఆదికాండము 2:15-17; 3:1-5.

వెంటనే తన చిత్తాన్ని బలవంతంగా ఎందుకు జరిపించకూడదు?

‘అలాంటప్పుడు, దేవుడు వెంటనే తన చిత్తాన్ని బలవంతంగా ఎందుకు జరిపించకూడదు?’ అని మీరు అడుగవచ్చు. అనేకులకు, అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ‘దేవునికి శక్తి ఉంది. తిరుగుబాటుదారులను నాశనం చేసేందుకు ఆయన దాన్ని ఉపయోగించవలసింది’ అని వారు అంటారు. (కీర్తన 147:5) అయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘తమ చిత్తాన్ని బలవంతంగా జరిపించేందుకు ఉన్నత అధికారాన్ని ఉపయోగించే వారిని అందరినీ నేను నిస్సంశయంగా అంగీకరిస్తానా? తన శత్రువులను తుదముట్టించేందుకు డెత్‌ స్క్వాడ్‌లను ఒక నియంత ఉపయోగిస్తే నేను వెంటనే దాన్ని అసహ్యించుకోనా?’ అనేకమంది సహేతుకమైన వ్యక్తులు అలాంటి విషయాన్ని హేయమైనదిగా భావిస్తారు.

‘ఒహ్‌, దేవుడే ఆ శక్తిని ప్రదర్శిస్తే, ఆయన చర్యలను ఎవరూ ప్రశ్నించలేరు’ అని మీరు అంటారు. అలాగని మీరు కచ్చితంగా చెప్పగలరా? దేవుడు శక్తిని ప్రదర్శించే విధానాన్ని ప్రజలు ప్రశ్నిస్తారన్నది నిజం కాదా? ఆయన చెడును సహించడం విషయంలో వలె, కొన్నిసార్లు ఆయన తన శక్తిని ఎందుకు ఉపయోగించడు అని వారు ప్రశ్నిస్తారు. మరి ఇతర సమయాల్లో ఆయన దాన్ని ఎందుకు ఉపయోగించాడు అని వారు ప్రశ్నిస్తారు. దేవుడు తన శత్రువులకు విరుద్ధంగా తన శక్తిని ఉపయోగించే విషయంలో నమ్మకస్థుడైన అబ్రాహాము కూడా ఓ సమస్యను కలిగివున్నాడు. దేవుడు సొదొమను నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చెడు ప్రజలతోపాటు మంచి వారు కూడా చనిపోతారని అబ్రాహాము పొరపాటుగా భయపడ్డాడు. అతనిలా విలపించాడు: “ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక.” (ఆదికాండము 18:25) అబ్రాహాము వంటి యథార్థమైన ప్రజలకు కూడా, అంతిమ శక్తి దుర్వినియోగం చేయబడదనే హామీ ఇవ్వవలసిన అవసరం రావచ్చు.

నిజమే, దేవుడు ఆదాము, హవ్వ మరియు సాతానులను వెనువెంటనే నాశనం చేయగలిగే వాడే. అయితే, అది ఇతర దేవదూతలను లేక ఆయన చర్యలను గురించి తర్వాత తెలుసుకునే భవిష్య సృష్టిని అదెలా ప్రభావితం చేయగలిగి ఉండేదో ఆలోచించండి. అది దేవుని పరిపాలనా హక్కును గురించి సమసిపోని ప్రశ్నలను వారిలో మిగుల్చుతుందా? నిజానికి, తనకు వ్యతిరేకతను కనపర్చే వారిని ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా నాశనంచేసే దేవుడని నీఛఛీ వర్ణించిన విధంగా, ఆయన ఒక రకమైన నియంత అని దేవుడు నిందకు గురయ్యేలా చేసి ఉండేది కాదా?

ప్రజలు సరైనది చేసేలా వారిని బలవంతం చేయవచ్చుగా?

‘ప్రజలు సరైనది చేసేలా దేవుడు వారిని బలవంతం చేయలేడా?’ అని కొందరు అడుగవచ్చు. దీన్ని కూడా పరిశీలించండి. తమ ఆలోచనావిధానానికి అనుగుణంగా ప్రజలు ఉండేలా చేసేందుకు ప్రభుత్వాలు చరిత్రంతటిలో ప్రయత్నించాయి. కొన్ని ప్రభుత్వాలు లేక కొంతమంది పాలకులు తమ చెరలోనున్న వారికిగల స్వేచ్ఛా చిత్తం అనే అద్భుతమైన వరాన్ని వారినుండి దొంగిలిస్తూ బహుశ మందులు లేక సర్జరీల వంటి మనస్సును నియంత్రించే అనేక పద్ధతుల్ని ఉపయోగిస్తూ తమ బాధితుల స్వేచ్ఛా చిత్తమనే అద్భుతమైన వరాన్ని దోచుకోవడం జరిగింది. ఆ వరాన్ని ఎవరైనా దుర్వినియోగం చేయగల సాధ్యత ఉన్నప్పటికీ, నైతిక స్వేచ్ఛగల వ్యక్తిగా ఉండటాన్ని మనం ఒక విలువైన సంగతిగా భావించమా? ఆ స్వేచ్ఛను తీసేయాలని ఏ ప్రభుత్వాలైనా లేక పాలకులైనా చేసే ప్రయత్నాలను మనం సమర్థిస్తామా?

అయితే, చట్టాన్ని అమలు చేసేందుకు దేవుడు వెంటనే శక్తిని ఉపయోగించడానికి బదులు ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? తన చట్టాలను నిరాకరించిన వారికి తన పరిపాలననుండి తాత్కాలిక స్వేచ్ఛా సమయాన్ని అనుమతించడం ద్వారా తిరుగుబాటుతో చక్కగా వ్యవహరించవచ్చని యెహోవా దేవుడు తీర్మానించాడు. మానవ కుటుంబం అంటే ఆదాము హవ్వల సంతానం దేవుని చట్టాలకు లోబడి ఉండకుండా తమనుతాము పరిపాలించుకునేందుకు ఇది వారికి పరిమిత సమయాన్నిస్తుంది. ఆయన ఇలా ఎందుకు చేశాడు? ఆయన తన చిత్తాన్ని అమలు చేసేందుకు తన అపరిమితమైన శక్తిని ఉపయోగించినప్పుడు కూడా తన పరిపాలనావిధానం ఎల్లప్పుడూ సరైనదని మరియు నీతియుక్తమైనదని నిరూపిస్తూ నిర్వివాదమైన సాక్ష్యం సమకూడుతుందనే విషయం మరియు ఆయనకు విరుద్ధంగా ఎలాంటి తిరుగుబాటైనా ఇప్పుడో అప్పుడో విపత్తుకు దారి తీస్తుందనే విషయం కూడా సరైన సమయంలో నిరూపించబడుతుందని ఆయనకు తెలుసు గనుక.—ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 34:10-12; యిర్మీయా 10:23.

అమాయకులైన బాధితులందరి సంగతేమిటి?

‘ఈలోగా, అమాయకులైన బాధితులందరి సంగతేమిటి?’ అని మీరు అడుగవచ్చు. ‘న్యాయానికి సంబంధించిన ఏదో విషయాన్ని నిరూపించేందుకు వారందరు బాధ అనుభవించడం నిజంగా సమంజసమైన విషయమేనా?’ న్యాయానికి సంబంధించిన ఏదో అస్పష్టమైన విషయాన్ని నిరూపించేందుకు దేవుడు చెడును అనుమతించలేదు. బదులుగా, ఆయన మాత్రమే సర్వాధిపతి మరియు ఆయన చట్టాలకు లోబడటం సర్వ సృష్టి యొక్క శాంతి సంతోషాల కొరకు ప్రాముఖ్యమనే ప్రధానమైన సత్యాన్ని శాశ్వతంగా స్థాపించేందుకు ఆయన దాన్ని అనుమతించాడు.

దుష్టత్వాన్ని అనుమతించడం మానవజాతిపై తీసుకువచ్చే ఏ విధమైన హానినైనా తాను సంపూర్ణంగా తీసివేయగలనని దేవునికి తెలుసుననే ఒక కీలకమైన విషయాన్ని మనస్సులో ఉంచుకోవలసి ఉంది. దీర్ఘ కాలంలో, వేదన మరియు బాధ తాత్కాలికంగా అనుమతింపబడిన ఈ కాలం ఉపయుక్తమైన ఫలితాన్ని తీసుకురాగలదు. ఓ పిల్లవాన్ని చంపగల వ్యాధి నుండి వానిని కాపాడే నొప్పిని కలిగించే టీకాను ఒక వైద్యుడు వానికిస్తుండగా వాన్ని గట్టిగా పట్టుకునే తల్లిని గురించి ఆలోచించండి. తన పిల్లవానికి నొప్పి కలగాలని ఏ తల్లీ కోరుకోదు. తన రోగులను కలత పర్చాలని ఏ వైద్యుడూ అనుకోడు. ఆ సమయంలో, ఆ పిల్లవాడు తనకు కలిగిన నొప్పికిగల కారణాన్ని గుణగ్రహించడు, అయితే అది ఎందుకు అనుమతించబడిందో అతడు తర్వాత అర్థం చేసుకుంటాడు.

బాధను అనుభవించే వారికి నిజమైన ఉపశమనం

బాధను అనుభవించే వారు ఈ విషయాలను తెలుసుకోవడం వారికి అంత ఉపశమనాన్ని కలిగించకపోవచ్చని కొందరు భావించవచ్చు. బాధ ఉండడానికిగల కారణసహితమైన వివరణ “ఆకలితో అలమటిస్తున్న మనిషికి ఆహార పదార్థాల రసాయనికతను గురించిన ప్రసంగాన్ని ఇచ్చినంత సహాయకరంగా ఉంటుందని” హన్స్‌ కంగ్‌ పేర్కొంటున్నాడు. అతనిలా అడుగుతున్నాడు: “ఈ వివేకవంతమైన తర్కమంతా, బాధతో కృంగిపోయిన వ్యక్తికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలదా?” దేవుని వాక్యమైన బైబిలును అలక్ష్యం చేసే మనుష్యుల ‘వివేకవంతమైన తర్కం’ బాధను అనుభవిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. అటువంటి మానవ తర్కం, మానవుడు బాధను అనుభవించాలని దేవుడు సంకల్పించాడని మరియు ఈ భూమి ఒక కన్నీటి లోయగా లేక తుదకు పరలోకంలో జీవితాన్ని పొందే వారి కొరకైన పరీక్షా స్థలంగా ఉండేందుకు రూపొందించబడిందని సూచించడం ద్వారా సమస్యను మరింత ఎక్కువ చేసేందుకే దోహదపడింది. అదెంతటి దైవదూషణ!

అయినప్పటికీ, బైబిలు నిజమైన ఉపశమనాన్ని ఇస్తుంది. బాధ ఉండటానికిగల సంగతమైన వివరణను అది అందించడం మాత్రమే కాదు గానీ, బాధను తాత్కాలికంగా అనుమతించడం ద్వారా వచ్చిన హానినంతటినీ తీసివేస్తానని దేవుడు చేస్తున్న కచ్చితమైన వాగ్దానమందు అది నమ్మకాన్ని పెంపొందింపజేస్తోంది.

“అన్నిటికి కుదురుబాటు”

తన మొదటి మానవ సృష్టి తిరుగుబాటు చేయకముందు పరిస్థితులు ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో త్వరలో ఆయన అలా చేస్తాడు. మానవుడు స్వతంత్రంగా పరిపాలించేందుకు ఆయన నియమించిన సమయం దాదాపు అయిపోవచ్చింది. ఆయన యేసును పంపే సమయంలో మనము జీవిస్తున్నాము. “అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియైయుండుట ఆవశ్యకము.”—అపొస్తలుల కార్యములు 3:20, 21.

యేసుక్రీస్తు ఏమి చేస్తాడు? భూమిపైనుండి దేవుని శత్రువులను అందరినీ ఆయన తుడిచి వేస్తాడు. (2 థెస్సలోనీకయులు 1:6-10) ఇది, మానవ నియంతలు నియమించే శీఘ్ర వినాశనమై ఉండదు. తన చిత్తాన్ని అమలుపర్చేందుకు అపరిమితమైన తన శక్తిని ఆయన త్వరలో ఉపయోగించడంలో ఆయన పూర్తిగా న్యాయబద్ధంగా ఉన్నాడని, మానవుని తప్పుడు పరిపాలన యొక్క భయంకరమైన పర్యవసానాలు కొండంత రుజువును ఇస్తున్నాయి. (ప్రకటన 11:17, 18) భూమిపై ఇంతకు మునుపెన్నడూ అనుభవించనిదే అయినా నోవహు కాలంలో జరిగిన జలప్రళయంకన్నా ఎంతో గొప్పదైనటువంటి “శ్రమ” అని ప్రాథమికంగా దీని భావమై ఉంటుంది. (మత్తయి 24:21, 29-31, 36-39) ఈ “మహాశ్రమను” తప్పించుకునే వారు “తన పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా” దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలన్నిటి నెరవేర్పును చూసినప్పుడు, వారు “విశ్రాంతికాలము”లను అనుభవిస్తారు. (అపొస్తలుల కార్యములు 3:19; ప్రకటన 7:14-17) దేవుడు ఏమి వాగ్దానం చేశాడు?

యుద్ధం మరియు రక్తపాతం వలన కలిగిన బాధ అంతమౌతుందని ప్రాచీన కాలంనాటి దేవుని ప్రవక్తలు చెబుతున్నారు. ఉదాహరణకు, “ఆయనే భూదిగంతములవరకు యుద్ధములను మాన్పువాడు” అని కీర్తన 46:9 మనకు చెబుతోంది. ఇక అమాయకులైన బాధితులు మరియు దుఃఖాన్ని అనుభవించే శరణార్థులూ ఉండరు, అలాగే ఇక ఎవరూ క్రూరమైన యుద్ధాల్లో మానభంగం చేయబడరు, అంగవిహీనులు చేయబడరు మరియు చంపబడరు! ప్రవక్త అయిన యెషయా ఇలా చెబుతున్నాడు: “జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4.

నేరం మరియు అన్యాయం మూలంగా కలిగిన బాధకు అంతం వస్తుందని కూడా ప్రవక్తలు ప్రవచించారు. “యథార్థవంతులు దేశమందు నివసించుదురు” మరియు నొప్పిని మరియు బాధను కలిగించే వారు “దానిలోనుండి పెరికివేయబడుదురు” అని సామెతలు 2:21, 22 వాగ్దానం చేస్తోంది. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట” ఇక ఉండదు. (ప్రసంగి 8:9) దుష్టులందరూ మరింకెప్పుడూ లేకుండా తీసివేయబడతారు. (కీర్తన 37:10, 38) బాధనుండి విముక్తులై అందరూ శాంతి, భద్రతలతో జీవించగలరు.—మీకా 4:4.

అంతేకాకుండా, భౌతిక మరియు భావోద్రేక రుగ్మతల మూలంగా కలిగిన బాధ తొలగించబడుతుందని ప్రవక్తలు వాగ్దానం చేశారు. (యెషయా 33:24) అంధులు, చెవిటి వారు, వికలాంగులు మరియు అనారోగ్యం, వ్యాధి వలన పీడింపబడే వారందరూ స్వస్థపర్చబడతారని యెషయా వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 35:5, 6) మరణ ప్రభావాల్ని దేవుడు తీసివేస్తాడు. ‘సమాధులలో నున్నవారందరు తన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు’ అని యేసు ప్రవచించాడు. (యోహాను 5:28, 29) “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గురించిన తన దర్శనంలో, “దేవుడు . . . వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని అపొస్తలుడైన యోహానుకు చెప్పబడింది. (ప్రకటన 21:1-4) దాన్ని ఊహించుకోండి! వేదనయైనను, కన్నీరైనను, ఏడ్పైనను మరియు మరణమైనను ఇక ఉండవు, అంటే బాధ ఇక ఉండనే ఉండదు!

దుష్టత్వం తాత్కాలికంగా అనుమతింపబడిన ఈ కాలంలో కలిగిన ఎటువంటి విషాదకరమైన సంఘటనలైనా కూడా పరిహరించబడతాయి. దేవుడు ఎన్నడూ సంకల్పించని మానవ వేదన మరియు బాధ యొక్క జ్ఞాపకాలు కూడా పూర్తిగా తీసివేయబడతాయి. “పూర్వము కలిగిన బాధలు . . . మరువబడును మునుపటివి మరువబడును” అని యెషయా ప్రవచించాడు. (యెషయా 65:16, 17) పరదైసు భూమిపై సంపూర్ణమైన శాంతి, సంతోషాలతో జీవించే పరిపూర్ణ మానవ కుటుంబం కొరకైన దేవుని ఆది సంకల్పం పూర్తిగా నెరవేర్చబడుతుంది. (యెషయా 45:18) ఆయన సర్వాధిపత్యమందు నమ్మకం స్థిరమైనదౌతుంది. సంపూర్ణ మానవ బాధలను దేవుడు అంతం చేసే ఆ సమయంలో అంటే ఆయన నీఛఛీ ఆరోపించిన రీతిలో ఒక విధమైన “నియంత, వంచకుడు, మోసగాడు మరియు తీర్పరి” కాదు గానీ తన పరమ శక్తిని ప్రేమపూర్వకమైన, జ్ఞానవంతమైన మరియు యుక్తమైన రీతిలో ప్రదర్శిస్తాడని చూపే ఆ సమయంలో జీవించడం ఎంతటి ఆధిక్యత అయి ఉంటుందో కదా!

[5వ పేజీలోని చిత్రం]

కొంతమంది పాలకులు తమ చెరలోనున్న వారికిగల స్వేచ్ఛా చిత్తాన్ని వారినుండి దొంగిలిస్తూ వారిని అదుపులో ఉంచుకునే అనేక పద్ధతులను ఆచరించారు

[క్రెడిట్‌ లైను]

UPI/Bettmann

[7వ పేజీలోని చిత్రం]

బాధ ఇక ఉండనప్పుడు, అందరూ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి