కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/15 పేజీలు 8-12
  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం మూడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు మనకు చేరిన విధానం—భాగం మూడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిషనరీలు, బైబిల్‌ సొసైటీలు
  • ఒక అనువాదకుని శ్రమలు
  • బైబిలును వివాదం చుట్టుముట్టడం
  • అన్వేషణలు బైబిలు గ్రంథపాఠాన్ని స్థాపించడానికి సహాయపడ్డాయి
  • వాచ్‌ టవర్‌ సొసైటీ, బైబిలు
  • ఒక్క అనువాదం, అనేక భాషలు
  • అన్ని జనాంగాలకు సువార్త
  • సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • సైనాయ్‌టికస్‌ వ్రాతపతి పుస్తకమును కాపాడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/15 పేజీలు 8-12

బైబిలు మనకు చేరిన విధానం—భాగం మూడు

బర్మా, 1824—రాజాధికారులు ఆడనిరమ్‌ జడ్సన్‌, ఆన్‌ జడ్సన్‌ల మిషనరీ గృహాన్ని సోదా చేసి, విలువైనవని అన్పించిన వాటినన్నింటినీ అప్పుడే కొల్లగొట్టారు. కానీ వారు అత్యంత అమూల్యమైన ఖజానాను చేజిక్కించుకోలేకపోయారు—అది ఆన్‌ తన ఇంట్లో రహస్యంగా కప్పెట్టివుంచిన ఒక అనువాదిత బైబిలు చేతివ్రాత ప్రతి. గూఢచర్యం చేశాడని ఆరోపించబడిన దాని అనువాదకుడు ఆడనిరమ్‌ జడ్సన్‌ దోమలతో నిండిన జైల్లో చైన్లతో బంధించబడివుంటాడు. ఇప్పుడు ఆ చేతివ్రాత ప్రతి తేమ మూలాన నాశనమయ్యే ప్రమాదం ఉంది. దాన్నెలా కాపాడవచ్చు? ఆన్‌ దాన్ని ఒక గట్టి దిండులో పెట్టి కుట్టేసి, జైల్లో ఉన్న తన భర్తకు చేరవేసేస్తుంది. దిండు సురక్షితంగా ఉంటుంది, దానిలోని చేతివ్రాత ప్రతి మొట్టమొదటి బర్మీస్‌ బైబిలులో భాగమౌతుంది.

చరిత్రంతటిలోనూ అటువంటి సాహసాల్ని ఎన్నింటినో బైబిలు చేసింది. మునుపటి సంచికల్లో మనం బైబిలు వ్రాత ముగిసినప్పటి నుండి 1600ల తొలి భాగం వరకూ దాని అనువాదమూ పంపిణీలను పరిశీలించాము. అప్పటినుండి ఇప్పటివరకూ బైబిలు ఎలా కాపాడబడింది? అది ప్రజలందరికీ ఎన్నటికైనా అందుబాటులో ఉంటుందా? వాచ్‌ టవర్‌ సొసైటీ ఏ పాత్రను పోషించింది?

మిషనరీలు, బైబిల్‌ సొసైటీలు

1600లు, 1700లలో అనేక దేశాల్లో బైబిలు పఠనం విషయంలో విపరీతమైన పెరుగుదల కన్పించింది. ఈ కాలంలో విశేషంగా ఇంగ్లాండు బైబిలువల్ల ఎంతో ప్రభావితమయ్యింది. నిజానికి చెప్పాలంటే, బైబిలు కథలూ బోధలు రాజు నుండి రైతు వరకు దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనికీ చొచ్చుకొనిపోయాయి. అయితే బైబిలు ప్రభావం ఇంకా సుదూరాలకు వ్యాపించింది. అప్పట్లో ఇంగ్లాండు సముద్ర వ్యాపారంలోనూ, వలస ప్రాంతాల పరిపాలనలోనూ గొప్ప శక్తిగా ఉంది, కొంతమంది ఆంగ్లేయులు తమ సముద్ర ప్రయాణాల్లో బైబిలును తమతోపాటు పట్టుకెళ్లారు. విస్తృతమైన బైబిలు ప్రచారానికి ఇది ఆధారభూతమైంది.

1700ల చివర్లోకల్లా ఇంగ్లాండులో కొంతమంది, బ్రిటీషు సామ్రాజ్యానికి చెందిన మారుమూల దేశాల్లో ఉన్న ప్రజల ఆధ్యాత్మిక అవసరతల గురించి ఆలోచించేలా బైబిలు వారి మనస్సుల్ని రేపింది. అయితే ఇటువంటి చింతన విశ్వవ్యాప్తంగా ఉన్నదేమీ కాదు. చాలామంది చర్చిప్రజలు విధివిలాసంలో విశ్వాసముంచారు, అందుకని కొంతమంది ప్రజలు రక్షణ పొందకపోవడం దేవుని చిత్తమని అనుకున్నారు. భావి మిషనరీ విలియం కేరీ ఇండియాకు రావడానికైన ఒక మిషన్‌ కొరకు మద్దతును సంపాదించడానికి ఒక ఉత్తేజకరమైన ఉపన్యాసాన్ని ఇచ్చినప్పుడు, కొంతమంది మందలింపుగా, “వచ్చి కూర్చోవయ్యా కుర్రోడా; అన్యుల్ని మార్చాలని దేవుడు కోరుకున్నప్పుడు ఆయన నీ సహాయం లేకుండానే చేస్తాడులే!” అన్నారు. అయినప్పటికీ, కేరీ 1793లో ఇండియాకు ఓడలో ప్రయాణమయ్యాడు. అబ్బురపర్చే రీతిలో ఆయన చివరికి పూర్తి బైబిలును లేక అందులోని కొంత భాగాన్ని 35 భారతీయ భాషల్లోకి అనువదించాడు.

మిషనరీలు తమ అత్యంత ప్రాథమికమైన ఉపకరణం స్థానిక భాషలోని బైబిలేనని గ్రహించారు. అయితే, బైబిళ్లను ఇచ్చేదెవరు? ఆసక్తికరంగా, ప్రపంచమంతటా బైబిళ్లను వ్యాప్తిచేయడానికి ప్రారంభం కాబోయే ఒక ఉద్యమాన్ని, వేల్స్‌కు చెందిన మేరీ జోన్స్‌ అనే ఒక 16 ఏండ్ల అమ్మాయి అనూహ్యంగా రగిలించింది. 1800లో, మేరీ ఒక పాదిరి దగ్గర నుండి ఒక వెల్ష్‌ బైబిలును కొనుక్కోవడానికి కాళ్లకు చెప్పుల్లేకుండా 40 కిలోమీటర్లు నడిచింది. ఆమె ఆ డబ్బును ఆరు సంవత్సరాలపాటు దాచుకుంది, బైబిళ్లన్నీ అమ్ముడైపోయాయని తెల్సుకున్నప్పుడు ఆమె హతాశురాలై కంటతడిపెట్టింది. ఎంతో చలించిపోయిన ఆ పాదిరి మేరీకి తన స్వంత బైబిళ్లలో ఒకదాన్ని ఇచ్చాడు.

అటుతర్వాత, ఆ పాదిరి బైబిళ్లు కావాల్సిన అనేకమంది ఇతరుల గురించి ఆలోచించి, ఈ సమస్యను గురించి లండన్‌లోని తన స్నేహితులతో చర్చించాడు. దాని ఫలితంగా 1804లో బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ రూపొందింది. దాని పీఠిక సరళంగా ఉంది: ప్రజలకు తమ స్వంత భాషలో సరసమైన ధరలో, “ఒక తాత్పర్యంగానీ లేదా ఒక వ్యాఖ్యానంగానీ లేకుండా” ముద్రించబడిన బైబిళ్లను అందించడమే. మార్జిన్‌లలోని వ్యాఖ్యానాల్ని తీసివేయడంద్వారా ఈ సొసైటీ వ్యవస్థాపకులు సిద్ధాంతపరమైన వివాదాల్ని నివారించగలమని ఆశించారు. అయితే, అనేకసార్లు ఈ సొసైటీ అపోక్రిఫా, పూర్తిగా మునగడం ద్వారా బాప్తిస్మం పొందడం, త్రిత్వం అనే విషయాల్లో అభిప్రాయభేదాలు కలిగివుండేది.

తొలి ఔత్సుక్యం త్వరగా విస్తరించింది, 1813కల్లా జర్మనీ, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, రష్యాలలో తత్సంబంధిత సొసైటీలు రూపొందాయి. సకాలంలో, ఇతర దేశాల్లోనూ బైబిల్‌ సొసైటీలు వీటికి తోడయ్యాయి. తొలి బైబిల్‌ సొసైటీల సభ్యులు తమ లక్ష్యాల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు, ప్రపంచంలోని అత్యధికులు ఉపయోగించే ప్రధాన భాషలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని అనుకున్నారు. భాషల సంఖ్య వేలల్లో ఉందని వారు కలలో కూడా ఊహించలేదు! ఏ కొద్దిమంది అనువాదకులకు మాత్రమే హెబ్రీ, గ్రీకు భాషలు వచ్చు—ఆ మూల భాషలు వస్తే తిన్నగా వాటినుండే అన్యభాషల్లోనికి అనువాదం చేయవచ్చు. అందుకని, బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ అనువాదాల్ని స్పాన్సర్‌ చేసినప్పుడు, అనువాదకులు చాలా తరచుగా తమ అనువాదానికి ఇంగ్లీషు భాషలోని కింగ్‌ జేమ్స్‌ వెర్షన్‌ను ఆధారం చేసుకున్నారు.

ఒక అనువాదకుని శ్రమలు

బైబిల్లోని చాలాభాగం ప్రతిదిన అనుభవాలపై ఆధారపడిన కథనాల్నీ, దృష్టాంతాల్నీ కల్గివుంది. ఇందుమూలాన దాన్ని అనువదించడం సులభమౌతుంది, అలా కాక అది తత్వజ్ఞానానికి చెందిన అమూర్తమైన పదాల్లో వ్రాయబడి ఉంటే చాలా కష్టమయ్యేది. అయితే సహజంగానే మిషనరీల తొలి ప్రయత్నాలు, కొన్నిసార్లు గలిబిలితోకూడిన లేదా హాస్యాస్పదమైన అనువాదాల్ని ఉత్పత్తి చేశాయి. ఉదాహరణకు ఒక అనువాదం, ఇండియాలో ఒక భాగంలోని ప్రజలకు దేవుడు నీలిరంగులోవున్న ఒక వ్యక్తియన్న తలంపునిచ్చింది. వారు “పరలోకపు తండ్రి” అనడానికి బదులుగా “నీలాకాశ తండ్రి” అన్న వ్యక్తీకరణను ఉపయోగించారు!

అనువాదకునికి ఉన్న అవరోధాల గురించి ఆడనిరమ్‌ జడ్సన్‌ 1819లో ఇలా వ్రాశాడు: ‘భూమికి ఆవలివైపునున్న ప్రజలు మాట్లాడే భాషను మనం నేర్చుకొనేటప్పుడు అంటే ఎవరి ఆలోచనా సరళులు మన ఆలోచనా సరళికి భిన్నంగావుంటాయో, ఎవరి వ్యక్తపర్చే భాషా సంకేతాలు మనకు బొత్తిగా పరిచయంలేనివిగానూ, అలాగే అక్షరాలూ, పదాలూ మనకు తారసపడిన ఏ భాషాక్షరాలతో పదాలతో అస్సలు పొంతనలేకుండానూ ఉంటాయో ఆ భాషను నేర్చుకున్నప్పుడు; మనకు ఏ డిక్షనరీగానీ లేక భాషాంతరీకరణవేత్తగానీ లేనప్పుడు, స్థానిక టీచరు మద్దతు మనకు అందుబాటులో ఉండడానికి ముందు ఆ భాషను ఎంతోకొంత అర్థంచేసుకోడం అవసరం—దానంతటి భావం తీవ్రమైన కృషే!’ జడ్సన్‌ వంటి అనువాదకుల పని బైబిళ్ల సంఖ్యను గొప్పగా పెంచింది.—12వ పేజీలోని చార్టు చూడండి.

ఈ కష్టతరమైన అనువాదపు పనిలో ఆన్‌ జడ్సన్‌ తన భర్తకు సహాయం చేసింది. కానీ జడ్సన్‌ దంపతులు ఎదుర్కొన్నది కేవలం అనువాద సమస్యల్ని మాత్రమే కాదు. రాజాధికారులు ఆడనిరమ్‌ను జైలుకి లాక్కెళ్లినప్పుడు ఆన్‌ గర్భవతి. ఆమె దురుసుగా ప్రవర్తిస్తూన్న అధికారులకు తన భర్త పక్షంగా 21 నెలలపాటు ధైర్యంగా విజ్ఞాపనలు చేసుకుంది. ఆ విషమ పరిస్థితితోపాటు తన అస్వస్థత ఆమెపై ప్రతికూలంగా ప్రభావం చూపింది. ఆడనిరమ్‌ విడుదలయ్యాక ఎంతోకాలం గడవకముందే ధైర్యసాహసియైన ఆయన భార్య ఆన్‌, ఆమెతోపాటు ఆయన చిన్ని కూతురు జ్వరంతో మరణించారు. ఆడనిరమ్‌ హృదయం బ్రద్ధలైంది. అయినప్పటికీ, ఆయన శక్తికొరకు దేవునివైపు చూస్తూ అనువాదంలో కొనసాగి 1835లో బర్మీస్‌ బైబిలును పూర్తి చేశాడు. ఈలోగా, బైబిలుకు ఇతర మోసపూరితమైన సవాళ్లు ఎదురయ్యాయి.

బైబిలును వివాదం చుట్టుముట్టడం

1800లు గొప్ప సాంఘిక, రాజకీయ వివాదాల్ని చూశాయి, కొన్నిసార్లు బైబిలు వాటిలో ఒక కీలక పాత్రను పోషించింది. ఉదాహరణకు జార్‌ మద్దతుతోనూ, రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చి మద్దతుతోనూ రష్యన్‌ బైబిల్‌ సొసైటీ ప్రారంభమైనప్పటికీ కొంతకాలానికి జార్‌తోపాటు, రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చివారు ఆ సొసైటీని రద్దు చేశారు. (ఆ సొసైటీ వ్యతిరేకులు అప్పటికే దాదాపు ఒక సంవత్సరం ముందు వేలాది బైబిళ్లను దగ్ధం చేశారు.) తొలి క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో ప్రారంభించిన విశ్వవ్యాప్త బైబిలు పంపిణీని ఆర్థడాక్స్‌ పాదిరీలు ఇప్పుడు అంతం చేయాలని కృత నిశ్చయంతో ప్రయత్నాలు మొదలెట్టారు. చర్చి అధికారానికీ, ప్రభుత్వ అధికారానికీ బైబిలు ముప్పు వాటిల్లజేస్తుందని ఆర్థడాక్స్‌ నాయకులు 19వ శతాబ్దంలో వాదించారు. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే బైబిలు, అధికారులకు ముప్పువాటిల్లజేసేది కాదు గానీ, ప్రజానీకాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి చర్చీ చేతుల్లోనూ, ప్రభుత్వం చేతుల్లోనూ అది ఒక ఆయుధమని అప్పుడప్పుడే ఉద్భవిస్తూ ఉన్న రాజకీయ విప్లవ ఉద్యమం బైబిలును దృష్టించడం మొదలెట్టింది. బైబిలు రెండు వైపుల నుండీ దాడికి గురౌతుంది!

అటుతరువాతి సంవత్సరాల్లో కూడా బైబిలుపై “మేథాపర” దాడుల ఉధృతి పెరిగింది. 1831లో, ఛార్లెస్‌ డార్విన్‌ తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి దారితీసిన పరిశోధనాత్మక సముద్రయాత్రను ప్రారంభించాడు. క్రైస్తవత్వాన్ని అణచివేసే ఉపకరణంగా చిత్రీకరిస్తూ మార్క్స్‌, ఎంజెల్స్‌ అనే ఇద్దరు వ్యక్తులు 1848లో కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టోను జారీచేశారు. ఈ కాలంలోనే, ఉన్నత విమర్శకులు లేఖనాల ప్రామాణికత్వాన్నీ, బైబిల్లోని వ్యక్తుల చారిత్రక సత్యసంధత్వాన్నీ—చివరికి యేసు ఉనికిని కూడా శంకించారు! కానీ ఆలోచనాపరులైన వ్యక్తులు కొందరు, దేవున్నీ బైబిలునూ తిరస్కరించిన సిద్ధాంతాల్లోని దోషాన్ని గుర్తించి, వారు బైబిలు వాస్తవికతను నిర్ధారించడానికి పాండిత్య పద్ధతుల్ని అన్వేషించారు. వీరిలో జర్మనీకి చెందిన బహుభాషా కోవిదుడు కాన్‌స్టాంటిన్‌ వాన్‌ టిషెండార్ఫ్‌ ఒకరు.

అన్వేషణలు బైబిలు గ్రంథపాఠాన్ని స్థాపించడానికి సహాయపడ్డాయి

టిషెండార్ఫ్‌, బైబిలు యొక్క మూల గ్రంథపాఠాన్ని ఇక ఎటువంటి సందేహాలకూ తావివ్వకుండా స్థాపించాలన్న ఆశతో ప్రాచీన బైబిలు వ్రాతప్రతుల అన్వేషణలో మధ్యప్రాచ్యం అంతటా ప్రయాణించాడు. 1859లో, డార్విన్‌ ది ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీషీస్‌ను ప్రచురించిన అదే సంవత్సరంలో టిషెండార్ఫ్‌ సీనాయి పర్వత పాదంలో ఉన్న ఒక మఠంలో క్రైస్తవ గ్రీకు లేఖనాల—ఇప్పటివరకు తెలిసినంత మట్టుకు—అతి పురాతన పూర్తి ప్రతిని కనుగొన్నాడు. అది కోడెక్స్‌ సైనాయ్‌టికస్‌ అని పిలువబడుతుంది, బహుశ జెరోమ్‌ లాటిన్‌లోని వల్గేట్‌ను పూర్తిచేయడానికి దాదాపు 50 సంవత్సరాల ముందు అది ఉత్పత్తి చేయబడివుండవచ్చు. ఆ మఠంలో నుండి ఆయన ఈ కోడెక్స్‌ను తీయడంలోని ఔచిత్యం ఇప్పటికీ వివాదాంశంగా ఉన్నప్పటికీ, టిషెండార్ఫ్‌ దాన్ని ప్రచురించి, తద్వారా దాన్ని విద్వాంసులకు అందుబాటులో ఉంచాడు.a

అత్యంత పురాతనమైన మూల భాషా వ్రాతప్రతుల్లో సైనాయ్‌టికస్‌ ఒకటి గనుక, గ్రీకు లేఖనాలు వాటి సారమంతటిలో ఏమాత్రం మార్పు లేకుండా ఉండిపోయాయని అది వెల్లడిచేయడం మాత్రమే గాక, అటుతర్వాతి వ్రాతప్రతుల్లోకి చొరబడిన పొరబాట్లను కనుక్కోవడానికి విద్వాంసులకు సహాయపడింది కూడాను. ఉదాహరణకు, యేసును సూచిస్తున్న 1 తిమోతి 3:16 సైనాయ్‌టికస్‌లో ఇలా చదువబడుతుంది: “ఆయన శరీరిగా ప్రత్యక్షమయ్యాడు.” ఇక్కడున్న “ఆయన” అనే పద స్థానంలో, అప్పట్లో తెలిసిన అత్యధిక వ్రాతప్రతుల్లో, “ఆయన” అనే పదం కొరకైన గ్రీకు పదానికి కొంచెం మార్పు చేస్తే వచ్చే “దేవుడు” అనేదానికి సంక్షిప్తరూపం ఉంది. అయితే, “దేవుడు” అని ఉన్న ఏ గ్రీకు వ్రాతప్రతికన్నా చాలా సంవత్సరాల ముందు సైనాయ్‌టికస్‌ తయారుచేయబడింది. ఆ విధంగా, గ్రంథపాఠం అటుతర్వాత ఎప్పుడో భ్రష్టపర్చబడిందని వెల్లడైంది, స్పష్టంగా ఇది త్రిత్వ సిద్ధాంతానికి మద్దతునివ్వడానికే ప్రవేశపెట్టబడింది.

టిషెండార్ఫ్‌ కాలం నుండి ఇప్పటివరకు, చాలా వ్రాతప్రతులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు, హెబ్రీ లేఖనాల వ్రాతప్రతుల పూర్తి సంఖ్య దాదాపు 6,000, గ్రీకు లేఖనాల వ్రాతప్రతులు 13,000కు పైగా ఉన్నాయి. వీటి తులనాత్మక అధ్యయనం ఫలితంగా నమ్మగలిగే విశ్వసనీయమైన మూల భాషా గ్రంథపాఠం తయారైంది. విద్వాంసుడైన ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ చెబుతున్నట్లు: “భిన్నమైన పాఠాంతరాలు . . . చారిత్రాత్మక వాస్తవాలను లేక క్రైస్తవ విశ్వాస అభ్యాసాలను గూర్చిన ప్రధానమైన విషయాలను ప్రభావితం చేయవు.” అనేక ఇతర భాషల్లోకి బైబిలు అనువాదం కొనసాగుతుండగా అభివృద్ధిచెందుతున్న ఈ జ్ఞానం ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూర్చగలదు?

వాచ్‌ టవర్‌ సొసైటీ, బైబిలు

1881లో చిన్నదే అయినా, ఉత్సాహభరితమైన బైబిలు బోధకులూ, విద్యార్థులతో కూడిన గుంపు ఒకటి ఏర్పడింది, ఇది తర్వాత వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అయ్యింది. మొదట్లో, వారు ఇతర బైబిల్‌ సొసైటీలు ఉత్పత్తి చేసిన బైబిళ్లను పంపిణీ చేసేవారు, వీటిలో టిషెండార్ఫ్‌ యొక్క గ్రీకు లేఖనాలు కూడా ఉన్నాయి. అయితే, 1890కల్లా వారు తిన్నగా బైబిలు ప్రచురణలోకే అడుగుపెట్టారు, అప్పటికల్లా వారు అనేక బైబిలు సంపుటిలలో మొదటిదాన్ని స్పాన్సర్‌ చేశారు. 1926లో సొసైటీ తన స్వంత ప్రెస్సుల్లోనే బైబిలును ముద్రించడం ప్రారంభించింది. కానీ బైబిలు యొక్క అతినూతన అనువాదం యొక్క అవసరత మరింత స్పష్టం కానారంభించింది. ముందటి శతాబ్దంలోని అన్వేషణలద్వారా పాండిత్యంద్వారా సంపాదించిన జ్ఞానాన్ని సరసమైన ధరలోవున్న, అర్థంచేసుకోగలిగే బైబిలును ఉత్పత్తి చేయవచ్చా? ఈ లక్ష్యంతో, 1946లో సొసైటీ సహసభ్యులు లేఖనాల ఒక క్రొత్త అనువాదాన్ని ఉత్పత్తి చేయాలని తలపెట్టారు.

ఒక్క అనువాదం, అనేక భాషలు

ఇంగ్లీషులో పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదమును ఉత్పత్తి చేయడానికి అనుభవజ్ఞులైన అభిషిక్త క్రైస్తవులతో కూడిన ఒక అనువాద కమిటీ వ్యవస్థీకరించబడింది. అది ఆరు సంపుటిల్లో ప్రచురించబడి, క్రైస్తవ గ్రీకు లేఖనాలతో ప్రారంభమై 1950 నుండి 1960 సంవత్సరాల మధ్యకాలంలో అది విడుదల చేయబడింది. 1963 నుండి ప్రారంభమై అది మరి 27 భాషల్లోకి అనువదించబడింది, ఇంకా అనేక భాషల్లో అనువాదం కొనసాగుతుంది. ఇతర భాషల కొరకు, ఇంగ్లీషు భాష విషయంలో ఉన్న అవే లక్ష్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా, అనువాదం కచ్చితంగా ఉండాలి, మూల భాషా తలంపులకు సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. ఏదైనా ఒక సిద్ధాంతపర గ్రహింపుకు అనుగుణ్యంగా ఉండడానికి భావాన్ని వక్రీకరించకూడదు. రెండవదిగా, ఏకతను కాపాడాలి, సందర్భం అనుమతించినంత మేరకు సహేతుకమైన పరిమితుల్లో ఒక్కొక్క ప్రధాన పదానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అనువాదిత పదం ఉండాలి. ఇటువంటి పద్ధతిని అనుసరించడం కొన్ని నిర్దిష్ట పదాలను బైబిలు రచయితలు ఏ విధంగా ఉపయోగించారో గ్రహించడానికి పాఠకులకు సహాయపడుతుంది. మూడవదిగా, భావాన్ని మరుగుపర్చకుండా అనువాదం సాధ్యమైనంత అక్షరార్థంగా ఉండాలి. అక్షరార్థ అనువాదం పాఠకుడు మూల భాషల్లో ఉన్న విశిష్టలక్షణాల్ని మరింత దగ్గరగా పరిశీలించడాన్ని సాధ్యపరుస్తుంది, అంతేగాక తత్సంబంధిత తలంపులు ఎలా అభివృద్ధి అయ్యాయో గ్రహించడాన్ని కూడా సాధ్యపరుస్తుంది. నాలుగవదిగా, సామాన్య ప్రజలు చదవడానికీ అర్ధం చేసుకోవడానికి అది సులభంగా ఉండాలి.

ఇంగ్లీషులోని నూతన లోక అనువాదము యొక్క దాదాపు అక్షరార్థ అనువాద శైలి దాన్ని ఇతర భాషల్లోనికి అనువదించడాన్ని సాధ్యపరుస్తుంది. ఈ సంకల్పం నిమిత్తం ప్రస్తుతం సొసైటీ యొక్క అనువాద జట్లు తమ పనిని వేగిరపర్చడానికీ, దాన్ని మరింత కచ్చితంగా రూపొందించడానికీ అధునాతనమైన కంప్యూటర్‌ సాధనాలను ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లీషులోని నూతన లోక అనువాదములోని ఒక్కొక్క ప్రధాన పదానికి, దాన్ని అనువదిస్తున్న భాషలో సమానమైన పదాల పట్టికలను సమకూర్చడానికి అనువాదకులకు ఈ కంప్యూటర్‌ సిస్టమ్‌ సహాయం చేస్తుంది. బైబిలులోని ఒక్కొక్క హెబ్రీ మరియు గ్రీకు పదానికి సమానమైన ఇంగ్లీషు అనువాదిత పదాలను అధ్యయనం చేయడానికి కూడా ఇది వారికి సాధ్యమయ్యేలా చేస్తుంది.

నేరుగా హెబ్రీ గ్రీకు భాషల నుండి కాకుండా ఇంగ్లీషు నుండే అనువాదం చేయడం ప్రాముఖ్యమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది. అనువదించడానికయ్యే సమయాన్ని తగ్గించడానికి తోడుగా అన్ని భాషల్లోనూ వ్యక్తీకరణల్లో మరింత ఏకతను సాధ్యపరుస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఒక ప్రాచీన భాషలో నుండి వేర్వేరు ఆధునిక భాషల్లోనికి అనువదించడం కన్నా, ఒక్క ఆధునిక భాషలో నుండి వేర్వేరు భాషల్లోనికి యథాతథంగా అనువదించడం ఎంతో సులభంగా ఉంటుంది. ఎంతైనా, అనువాదకులు ఆధునిక భాషలు మాట్లాడేవారిని సంప్రదించగలరు గానీ, వేలాది సంవత్సరాల క్రిందట ఉనికిలో ఉన్న భాషలను మాట్లాడేవారిని సంప్రదించలేరు కదా.

అన్ని జనాంగాలకు సువార్త

బైబిలును భూమ్మీద అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉన్న పుస్తకంగా చేయడానికి సహాయపడిన కృత నిశ్చయంగల స్త్రీపురుషుల గురించి ఇంకా ఎంతెంతో వ్రాయవచ్చు. శతాబ్దాలుగా, దాదాపు నాలుగు వందల కోట్ల బైబిళ్లు, బైబిల్లోని భాగాలు ప్రపంచ జనాభాలోని 90 శాతంమంది మాట్లాడే రెండు వేల కన్నా ఎక్కువ భాషల్లో ముద్రించబడ్డాయి!

మన కాలంలో దేవుని రాజ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుందని బైబిలు ప్రవచించింది. దీన్ని సాధించడానికిగాను, బైబిలు ఇప్పుడు దాదాపు విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చేయడంలో యెహోవా దేవుడు స్పష్టంగానే తానుగా మనుష్యుల్ని నడిపించాడు. (మత్తయి 13:47, 48; 24:14) గతంలో నిర్భయులైన బైబిలు అనువాదకులూ, ప్రచురణకర్తలు మనకు దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి—నైతికంగా అంధకారంలోనున్న ప్రపంచంలో ఒకే ఒక్క ఆత్మీయ వెలుగుకు మూలాన్ని ఇవ్వడానికి ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వారు ప్రదర్శించిన అదే దృఢ నిశ్చయంతో మీరు చదివేలా, దాని ప్రకారంగా జీవించేలా, ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకునేలా వారి మాదిరి మిమ్మల్ని కదిలించును గాక. అవును, ప్రతి దినం, మీ చేతుల్లో ఉన్న ఆధారపడదగిన బైబిలు నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి!—యెషయా 40:6-8.

[అధస్సూచీలు]

a అక్టోబరు 15, 1988 కావలికోటలో (ఆంగ్లం) “కోడెక్స్‌ సైనాయ్‌టికస్‌ను రక్షించడం” అనే శీర్షికను చూడండి.

[12వ పేజీలోని చిత్రం]

బైబిలు అనువాదంలో అభివృద్ధి

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

భాషల

సంఖ్య

1 యూదులు హెబ్రీ లేఖనాలను గ్రీకులోనికి అనువదించడాన్ని ప్రారంభించారు

దాదాపు సా.శ.పూ. 280

12 జెరోమ్‌ లాటిన్‌ వల్గేట్‌ ముగించాడు దాదాపు సా.శ. 400

35 గుటెన్‌బర్గ్‌ మొదటి ముద్రిత బైబిలును పూర్తిచేశాడు దాదాపు 1455

81 బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ స్థాపించబడింది 1804

సంవత్సరం ప్రకారం అంచనా వేయబడిన భాషల సంఖ్య

522

1900

600

700

800

900

1,049

1950

1,100

1,200

1,300

1,471

1970

2,123

1996

2,200

2,300

2,400

[క్రెడిట్‌ లైను]

మూలాలు: Christianity Today, United Bible Society

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.

[8వ పేజీలోని చిత్రం]

జడ్సన్‌ బంధించబడి లాక్కెళ్లబడ్డాడు

[క్రెడిట్‌ లైను]

జెస్సీ పేజ్‌ వ్రాసిన Judson the Hero of Burma అనే పుస్తకం నుండి

[10వ పేజీలోని చిత్రం]

సీనాయి పర్వత పాదంలో ఉన్న ఈ మఠం వద్ద టిషెండార్ఫ్‌ ఒక అమూల్యమైన వ్రాతప్రతిని రక్షించాడు

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి