పాఠశాల పైవిచారణకర్తలకు మార్గదర్శక సూత్రాలు
ప్రతి సంఘంలోను, ఒక పెద్ద దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తగా నియమించబడతాడు. ఈ బాధ్యత మీకు అప్పగించబడితే, పాఠశాల విషయంలో మీరు చూపే ఉత్సాహం, ప్రతి విద్యార్థి పురోభివృద్ధిలో మీరు చూపే వ్యక్తిగత ఆసక్తి స్థానికంగా పాఠశాల ఏమి సాధిస్తుందనేదానికి ప్రముఖ కారణాలుగా ఉంటాయి.
మీ నియామకంలో ఒక ప్రముఖ భాగంగా ప్రతి వారం మీ సంఘంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు అధ్యక్షత వహించాలి. పాఠశాలలో విద్యార్థులుగా ఉన్నవారితోపాటు ఇతరులు కూడా హాజరవుతున్నారని గుర్తుంచుకోండి. మొత్తం సంఘం ఈ పాఠ్యపుస్తకంలోని 5 నుండి 8 పేజీల్లో పేర్కొనబడిన పాఠశాల లక్ష్యాల్లో కనీసం ఒక్కదానికి సంబంధించి ప్రేరేపణనిచ్చే, ఆచరణయోగ్యంగా ఉండే జ్ఞాపికలు పొందేలా పాఠశాలను నిర్వహించండి.
విద్యార్థులు పఠన నియామకాలు పొందేవారైనా, ప్రదర్శనశైలిలో సమాచారాన్ని అందించడానికి నియమించబడినవారైనా, లేక ప్రసంగాలు ఇచ్చేవారైనా వారందరిపైనా ఆసక్తిని కనబరచండి. తాము చేసేదాన్ని కేవలం ఒక నియామకంగా దృష్టించకుండా, అది యెహోవాకు తాము చేస్తున్న సేవలో పురోభివృద్ధిని సాధించడానికి ఒక అవకాశంగా దృష్టించేలా వారికి సహాయపడండి. వారి పురోభివృద్ధికి కీలకం వారు వ్యక్తిగతంగా చేసే కృషే. కానీ మీరు ప్రేమపూర్వకంగా ఆసక్తిని చూపిస్తూ, ప్రసంగ లక్షణాల విలువను అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ, ఆ లక్షణాన్ని ఎలా అన్వయించుకోవాలో వివరిస్తుండడం కూడా ప్రాముఖ్యమే. ఆ లక్ష్యం దిశలో, విలువైన వ్యాఖ్యానాలు చేయగలిగేలా ప్రతి ప్రసంగాన్ని జాగ్రత్తగా వినండి.
పాఠశాలను సమయానికి ప్రారంభించి సమయానికి ముగించేలా చూడండి. మీ వ్యక్తిగత వ్యాఖ్యానాలను వాటికి కేటాయించిన సమయంలోపలే ముగిస్తూ మంచి మాదిరి ఉంచండి. ఎవరైనా విద్యార్థి సమయం మించి ప్రసంగం ఇస్తుంటే మీరు గానీ మీ సహాయకుడు గానీ ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అప్పుడు విద్యార్థి తను చెబుతున్న వాక్యాన్ని ముగించి వేదిక దిగిపోవాలి. కార్యక్రమంలో వేరే భాగంలో సమయం మించిపోతే, మీరు చేసే వ్యాఖ్యానాలు క్లుప్తంగా ముగించి, కూటం తర్వాత ఆ సహోదరుడితో ఆ విషయం గురించి మాట్లాడండి.
మీరు కూటానికి హాజరైతే పాఠశాలను మీరే నిర్వహించాలి. ఏదైనా సందర్భంలో మీరు లేకపోయినట్లైతే పెద్దల సభ అంతకు ముందే నియమించిన మరో పెద్ద పాఠశాలను నిర్వహించాలి. పట్టిక వేయడంలో, నియామకపు చీటీలను వ్రాసి పంచిపెట్టడంలో, లేదా కార్యక్రమంలో ప్రత్యామ్నాయ ప్రసంగీకుల కోసం ఏర్పాట్లు చేయడంలో మీకు సహాయం అవసరమైతే, పెద్దల సభ నియమించిన ఒక పరిచర్య సేవకుణ్ణి ఉపయోగించుకోవచ్చు.
విద్యార్థుల భర్తీ. ప్రచారకులందరినీ పాఠశాలలో భర్తీ కమ్మని ప్రోత్సహించండి. సంఘంతో క్రియాత్మకంగా సహవసించే ఇతరులు బైబిలు బోధలతో ఏకీభవించినట్లైతే, వారి జీవితాలు క్రైస్తవ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్లైతే వారు భర్తీ కావచ్చు. పాఠశాలలో భర్తీ కావాలన్న కోరిక ఎవరైనా వ్యక్తం చేస్తే వారిని హృదయపూర్వకంగా మెచ్చుకోండి. ఆ వ్యక్తి ఇంకా ప్రచారకుడు కానట్లైతే పాఠశాల పైవిచారణకర్తగా మీరు పాఠశాలలో భర్తీ కావడానికి అర్హతలేమిటో ఆయనతో చర్చించాలి, ఆయనతో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న వ్యక్తి సమక్షంలో (లేదా విశ్వాసి అయిన తల్లి లేదా తండ్రి సమక్షంలో) చర్చించడం అభిలషణీయం. ఈ అర్హతలు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందని ప్రచారకుడిగా అవ్వడానికి అవసరమైన అర్హతలవంటివే. అవి మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలో 97 నుండి 99 పేజీల్లో వివరించబడ్డాయి. పాఠశాలలో భర్తీ అయిన వారందరి పేర్ల లిస్టును ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండండి.
సలహా పత్రం ఉపయోగం. ప్రతి విద్యార్థి సలహా పత్రం ఆయన సొంత పాఠ్యపుస్తకంలోని 79 నుండి 81 పేజీల్లోనే ఉంది. రంగుల సంకేతం తెలుపుతున్నట్లుగా ఒక విద్యార్థికి చదివే నియామకాన్ని ఇచ్చినప్పుడు 1 నుండి 17 ప్రసంగ లక్షణాల్లో దేన్నైనా ఉపయోగించవచ్చు. ప్రదర్శన శైలిలో అందించే నియామకాలకు, 7, 52, 53 ప్రసంగ లక్షణాలు తప్పించి దేన్నైనా ఉపయోగించవచ్చు. ప్రసంగాలకు 7, 18, 30 తప్పించి మిగతా ప్రసంగ లక్షణాలు వర్తిస్తాయి.
ఒక ప్రసంగ లక్షణం నియమించబడినప్పుడు, విద్యార్థి పుస్తకంలోని సలహా పత్రంలో ఆ ప్రసంగ లక్షణం ఎదురుగా ఉన్న ఖాళీలో “నియమించబడిన తేదీ” కింద పెన్సిలుతో తేదీ వ్రాయబడేలా పాఠశాల పైవిచారణకర్త నిశ్చయపరచుకోవాలి. విద్యార్థి తన నియామకాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆ ప్రసంగ లక్షణంలో చర్చించబడిన అధ్యయనం చివర్లో ఇవ్వబడిన అభ్యాసాలు చేశాడో లేదో ఒంటరిగా ఉన్నప్పుడు అడగండి. చేసినట్లైతే పత్రంలోని చిన్న బాక్సులో రైటు కొట్టాలి. అదే ప్రసంగ లక్షణంపై పనిచేయమని మీరు కోరుతున్నట్లైతే సలహా పత్రంపై ఇంకా ఎలాంటి అదనపు వ్యాఖ్యానాలు చేయనవసరం లేదు; “పూర్తయిన తేదీ” కాలమ్‌లో ఏమీ వ్రాయకండి. అక్కడ విద్యార్థి మరో ప్రసంగలక్షణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వ్రాయాలి. విద్యార్థి పుస్తకంలో 82వ పేజీలో ఉపయోగించిన సన్నివేశానికి ఎడమవైపున ప్రతి విద్యార్థి ప్రసంగం తర్వాత తేదీ వేయాలి. సలహా పత్రం పైనా, సన్నివేశాల పట్టికపైనా తేదీలు వేయడానికి ఖాళీలున్నాయి, వీటిని రెండ్రెండు సార్లు ఉపయోగించే వీలు ఉంది. కార్యక్రమం జరుగుతున్నప్పుడు విద్యార్థులు తమ పుస్తకాలు తమ దగ్గర ఉంచుకోవాలి.
ఒక్కోసారికి ఒక్కో ప్రసంగ లక్షణాన్ని నియమించండి. సాధారణంగా, పట్టికలోని క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేయడమే శ్రేష్ఠమైనది. అయితే, కొందరు అసాధారణ సామర్థ్యాన్ని చూపిస్తే కొన్ని పాఠాలను తమంతట తామే అధ్యయనం చేసి వాటిని అన్వయించుకొమ్మని వారిని ప్రోత్సహించవచ్చు. ప్రతిభావంతులైన ప్రసంగీకులుగా, బోధకులుగా అభివృద్ధి చెందేందుకు వారికి అత్యంత ఎక్కువగా దోహదపడతాయని మీరనుకునే ప్రసంగ లక్షణం విషయంలో మీరు వారికి సహాయం చేయవచ్చు.
ఒక విద్యార్థి పాఠశాలలో ఎన్నో సంవత్సరాలపాటు ఉన్నప్పటికీ ప్రతి పాఠాన్ని అధ్యయనం చేసి అన్వయించుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందగలడు. నిర్దిష్ట అవసరాలున్న విద్యార్థులకు సహాయపడేందుకు మీరు పట్టికలోని క్రమంలో వెళ్ళడానికి బదులుగా కొన్ని నిర్దిష్ట ప్రసంగ లక్షణాలను ఎంపిక చేసి వాటిపై పనిచేయమని చెప్పవచ్చు.
సలహా ఇవ్వడం. సలహా ఇచ్చేటప్పుడు బైబిలులోని ఉదాహరణలను సూత్రాలను ధారాళంగా ఉపయోగించండి. ఇవ్వబడిన సలహా, ఆ విధానమూ దేవుని వాక్యంలోని ఉన్నతమైన సూత్రాల నడిపింపులోనే జరిగిందని విద్యార్థులు గ్రహించగలగాలి.
మీరు మీ సహోదర సహోదరీల ‘సహకారులని’ మనస్సులో ఉంచుకోండి. (2 కొరిం. 1:24) వారిలాగే మీరు కూడా ఒక ప్రసంగీకుడిగా ఒక బోధకుడిగా మెరుగుపడడానికి కృషిసల్పాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకాన్ని అధ్యయనం చెయ్యండి, దాని సలహాను అన్వయించుకోండి, ఇతరులూ అలా చేయడానికి మంచి మాదిరిని ఉంచండి.
మీరలా చేస్తుండగా విద్యార్థులు చక్కగా చదివేవారిగా, సమర్థులైన ప్రసంగీకులుగా, ప్రభావవంతమైన బోధకులుగా అయ్యేలా వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. అందుకుగాను, వివిధ ప్రసంగ లక్షణాలేమిటో, అవెందుకు ప్రాముఖ్యమో, వాటిని అలవరచుకోవడమెలాగో విద్యార్థులు అర్థం చేసుకునేలా వారికి అవసరమైన ఏ సహాయమైనా చేయడానికి ప్రయత్నించండి. ఈ పాఠ్యపుస్తకం మీరలా చేయడానికి మీకు సహాయపడే విధంగానే రూపొందించబడింది. అయితే, సాధారణంగా ఈ పుస్తకంలోని పదాలను చదవడం మాత్రమే సరిపోదు. ఆ మాటలు వ్యక్తంచేసే అంశాన్ని, దాన్నెలా అన్వయించుకోవాలనే దాన్ని చర్చించండి.
ఒక విద్యార్థి ఒక ప్రసంగ లక్షణంపై చక్కగా పనిచేస్తే ఆయనను మెచ్చుకోండి. అదెందుకు సమర్థంగా ఉందో లేదా ఆయన చేసినది ఎందుకు ప్రాముఖ్యమో క్లుప్తంగా చెప్పండి. ఫలాని విషయంలో ఆయన మరెక్కువ శ్రద్ధ చూపిస్తే ప్రయోజనం ఉంటుందంటే, మీరు చెప్పేది ఆయనకు అర్థమవుతుందని నిశ్చయపరచుకోండి. దాన్నెలా సాధించాలో చర్చించండి. స్పష్టంగా చెప్పండి, అదే సమయంలో ప్రేమగా ఉండండి.
ఒక సమూహం ఎదుట లేచి నిలబడి ప్రసంగం ఇవ్వడమంటేనే చాలామందికి కష్టంగా ఉంటుందన్నది గుర్తుంచుకోండి. తాను సరిగ్గా చేయలేదని ఎవరికైనా అనిపిస్తే తాను ప్రయత్నిస్తూనే ఉండాలా అని ఆలోచించవచ్చు. “నలిగిన రెల్లును” విరువని “మకమకలాడుచున్న అవిసెనారను” ఆర్పని యేసును అనుకరించండి. (మత్త. 12:20) విద్యార్థి మానసికంగా ఎలా ఉన్నాడో పరిగణలోకి తీసుకోండి. సలహా ఇచ్చేటప్పుడు, విద్యార్థి కాస్త క్రొత్తవాడా లేక అనుభవజ్ఞుడైన ప్రచారకుడా అని ఆలోచించండి. హృదయపూర్వకంగా నిజంగా మెచ్చుకున్నప్పుడు ప్రజలు తమ యథాశక్తి చేసేందుకు బలపరచబడతారు.
ప్రతి విద్యార్థితో గౌరవపూర్వకంగా వ్యవహరించండి. రోమీయులు 12:10 మనకిలా చెబుతోంది: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సలహాదారుడికి ఇది ఎంత సముచితమైన సలహా! విద్యార్థి మీకన్నా పెద్దవారైతే 1 తిమోతి 5:1, 2 లోని నిర్దేశకాన్ని జాగ్రత్తగా అన్వయించుకోండి. అయితే, వయస్సుతో నిమిత్తం లేకుండా, చేసుకోవలసిన మార్పులను గురించిన సలహా ఇచ్చేటప్పుడు ప్రేమపూర్వకంగా చెబితే దాన్ని వెంటనే స్వీకరిస్తారు.—సామె. 25:11.
సలహా ఇచ్చేటప్పుడు శిక్షణ యొక్క లక్ష్యాన్ని విద్యార్థికి నొక్కిచెప్పండి. ఇచ్చిన ప్రసంగానికి ప్రశంసలను అందుకోవడం, తర్వాతి ప్రసంగ లక్షణానికి వెళ్ళమని చెప్పించుకోవడం, ఇతరులు అభినందించే ప్రసంగీకుడిగా బోధకుడిగా తయారుకావడం మాత్రమే కాదు దీని లక్ష్యం. (సామె. 25:27) మాట్లాడే మన బహుమానాన్ని యెహోవాను స్తుతించడానికి ఉపయోగించాలన్నదే దీని లక్ష్యం, ఆయన గురించి ఇతరులు తెలుసుకొని ఆయనను ప్రేమించడానికి వారికి సహాయం చేయాలన్నదే మన కోరిక. మత్తయి 24:14 మరియు 28:19, 20 వచనాల్లో పేర్కొనబడిన పనిని మనం సమర్థంగా నెరవేర్చేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికే ఈ శిక్షణ. బాప్తిస్మం పొందిన సహోదరులు అర్హులైతే కొంతకాలానికి బహిరంగ ప్రసంగీకులుగా బోధకులుగా “దేవుని మంద” పట్ల శ్రద్ధ వహించడంలో భాగం వహించేందుకు ఆహ్వానించబడుతుండవచ్చు.—1 పేతు. 5:2, 3.
తాము తర్వాత పనిచేయబోయే ప్రసంగ లక్షణాన్ని గురించిన చర్చను, నియామకం అందిన కొద్దిరోజుల్లోపలే పాఠ్యపుస్తకంలో చదవమని విద్యార్థులకు సూచించండి. పాఠశాలలో తమ భాగాలకు సిద్ధపడేటప్పుడూ, దైనందిన సంభాషణల్లోనూ, కూటాల్లో వ్యాఖ్యానించేటప్పుడూ, క్షేత్ర సేవలో పాల్గొనేటప్పుడూ తాము నేర్చుకొంటున్న విషయాలను అన్వయించుకొమ్మని వారిని ప్రోత్సహించండి.
నియామకాలు ఇవ్వడం. ఇది సాధారణంగా కనీసం మూడు వారాల ముందు జరగాలి. సాధ్యమైతే నియామకాలన్నీ వ్రాతపూర్వకంగా జరగాలి.
సంఘానికి ఉపదేశించాల్సిన భాగాలు పెద్దలకు నియమించాలి, ప్రత్యేకంగా ఆ భాగాలను సమర్థవంతంగా నిర్వహించే వారికి నియమించాలి, మంచి బోధకులుగా ఉన్న పరిచర్య సేవకులకు కూడా నియమించవచ్చు.
ఏ విద్యార్థి ప్రసంగాలు సహోదరులకు నియమించాలి, ఏవి సహోదరీలకు నియమించాలి అనేది నిర్ధారించడానికిగాను పాఠశాల పట్టికలోని సూచనలు పాటించండి. విద్యార్థి ప్రసంగాలు ఇచ్చేవారిలో సహోదరులు తక్కువగాను సహోదరీలు ఎక్కువగాను ఉన్నట్లైతే, సహోదరులను కేవలం చదివే నియామకాలకే పరిమితం చేయక వారికి ప్రసంగాలిచ్చే అవకాశాలు సమృద్ధిగా ఇచ్చేలా జాగ్రత్త వహించండి.
నియామకాలు ఇచ్చేటప్పుడు వ్యక్తుల పరిస్థితులను పరిగణలోకి తీసుకోండి. ఒక పెద్ద లేక పరిచర్య సేవకుడు అదే సాయంత్రం సేవా కూటంలో భాగం వహిస్తున్నప్పుడు లేక అదే వారంలో ఆయన సంఘంలో బహిరంగ ప్రసంగం ఇస్తున్నప్పుడు పాఠశాలలో నియామకం ఇవ్వడం అవసరమా? తన కుమార్తెకు లేదా కుమారుడికి పాఠశాలలో నియామకం ఉంటే బహుశ సహాయం అందించాల్సిన అవసరం ఒక సహోదరికి ఉంటుండవచ్చు, అదే రోజున ఆమెకు నియామకం ఇవ్వడం అవసరమా? ప్రత్యేకంగా ఒక యౌవనస్థుడికి లేదా ఇంకా బాప్తిస్మం పొందని విద్యార్థికి ఆ విషయం నియమించడం సముచితంగా ఉంటుందా? విద్యార్థి పనిచేస్తున్న ప్రసంగ లక్షణానికి ఆ నియామకం సరిపోతుందో లేదో పరిశీలించండి.
సహోదరీలకు ఇవ్వబడే నియామకాల విషయంలో చూస్తే, 78 మరియు 82 పేజీల్లోని సూచనల మేరకు విద్యార్థిని సాధారణంగా తన సన్నివేశాన్ని తనే ఎంపిక చేసుకుంటుంది. ఒక సహాయకురాలిని నియమించాలి, కానీ మరొక సహాయకురాలిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకానొక సన్నివేశాన్ని ప్రదర్శించడానికి ఫలాని సహాయకురాలు చక్కగా సరిపోతుందని విద్యార్థి కోరితే, ఆ కోరికను పరిగణలోకి తీసుకోవాలి.
అదనపు తరగతులు. పాఠశాలలో 50 కన్నా ఎక్కువ విద్యార్థులు ఉంటే విద్యార్థులు నిర్వహించే భాగాల కోసం అదనపు గదులను ఉపయోగించడం గురించి మీరు ఆలోచించవచ్చు. స్థానిక అవసరం ప్రకారం, విద్యార్థి నియామకాలన్నింటికీ లేదా కేవలం చివరి రెండు నియామకాలకు ఈ ఏర్పాటు ఉపయోగించవచ్చు.
ప్రతి అదనపు తరగతికి అర్హుడైన ఒక సలహాదారుడు ఉండాలి, ఆయన ఒక పెద్ద అయితే మంచిది. అవసరమైతే మంచి సామర్థ్యంగల పరిచర్య సేవకుడ్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సలహాదారులను పెద్దల సభ ఆమోదించాలి. పాఠశాల పైవిచారణకర్త వీరితో సన్నిహితంగా పనిచేయాలి, అప్పుడు విద్యార్థుల నియామకాలు ఎక్కడ నిర్వహించబడినా వారి విషయంలో సమర్థవంతంగా పనులు జరుగుతాయి.
ప్రత్యేక పఠన తరగతులు. సంఘంలో కొందరికి సంఘంలో మాట్లాడే భాష చదివే విషయంలో ప్రాథమిక బోధన అవసరమని పెద్దల సభ నిర్ణయిస్తే, మీరు ఇందుకోసం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల జరుగుతున్న సమయంలో తరగతులను నిర్వహించే ఏర్పాట్లు చేయవచ్చు. ఈ బోధన ప్రాథమిక అక్షరాస్యతా నైపుణ్యాల గురించి ఉండవచ్చు, లేదా చదవడం మెరుగుపరుచుకోవడానికే అయివుండవచ్చు.
అలాంటి తరగతులు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో విద్యార్థి ప్రసంగాలు ఇవ్వబడుతున్న సమయంలోనే నిర్వహించాల్సిన అవసరం లేదు. సరిపడేంత సహాయాన్ని ఇవ్వడానికి గాను పాఠశాల జరుగుతుండగా లభించే సమయం కన్నా ఎక్కువ సమయం అవసరం అవుతుండవచ్చు. స్థానిక పెద్దలు ఏమి అవసరమో, అలాంటి బోధన ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించవచ్చు. అవసరానికి అనుగుణంగా అందరికీ కలిపి ఒకేసారి లేదా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి బోధించే ఏర్పాట్లు చేయవచ్చు.
అర్హుడైన ఉపాధ్యాయుడు అవసరం. ఈ నియామకాన్ని సాధ్యమైతే చక్కగా చదవగల భాషా పరిజ్ఞానం ఉన్న ఒక సహోదరుడికి ఇస్తే మంచిది. సహోదరుడు అందుబాటులో లేనట్లైతే సమర్థురాలైన, మాదిరికరంగావున్న ఒక సహోదరిని సహాయం చేయమని పెద్దలు కోరవచ్చు. తరగతిలో బోధించేటప్పుడు సహోదరి తలపై ముసుకు వేసుకోవాలి.—1 కొరిం. 11:3-10; 1 తిమో. 2:11, 12.
అప్లై యువర్‌సెల్ఫ్ టు రీడింగ్ అండ్ రైటింగ్ అనే చిన్నపుస్తకం అనేక భాషల్లో అందుబాటులో ఉంది. అది ప్రాథమిక అక్షరాస్యతా నైపుణ్యాలు బోధించడానికి రూపొందించబడింది. భర్తీ అయిన వ్యక్తుల చదివే సామర్థ్యాన్ని బట్టి ఇతర బోధనా సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. విద్యార్థులు సరిపడేంతగా అభివృద్ధి సాధించిన తర్వాత వారిని అసలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగం వహించమని ప్రోత్సహించవచ్చు.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తగా మీరు సంఘ ప్రయోజనార్థం ఎంతో చేయగలరు. చక్కగా సిద్ధపడండి, రోమీయులు 12:6-8 లోని సలహాకు అనుగుణంగా దేవుడు మీకు నమ్మకంగా అప్పగించిన నియామకమని దృష్టిస్తూ దాని పట్ల శ్రద్ధవహించండి.