క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
జనవరి 1-7
దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 1-3
“పరలోక రాజ్యం దగ్గరపడింది”
(మత్తయి 3:1, 2) ఆ రోజుల్లో, బాప్తిస్మమిచ్చే యోహాను యూదయ అరణ్యానికి వచ్చి ప్రకటిస్తున్నాడు; 2 అతను ఇలా చెప్తున్నాడు: “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి.”
మత్త 3:1, 2 nwtsty స్టడీ నోట్స్
ప్రకటిస్తున్నాడు: “సందేశాన్ని మోసుకెళ్లే వ్యక్తి బహిరంగంగా చేసే ప్రకటనను” ఈ గ్రీకు పదం సూచిస్తోంది. ఇది, ప్రకటనను చెప్పే విధానాన్ని, అంటే ఒక గుంపుకు ఇచ్చే ప్రసంగంలా కాకుండా బహిరంగంగా, అందరికీ చెప్పే ప్రకటనను సూచిస్తోంది.
రాజ్యం: మత్తయి పుస్తకంలో మొదటిసారి కనిపించే బే·సై·లేʹయ (ba·si·leiʹa) అనే గ్రీకు పదం రాజు పరిపాలించే ప్రభుత్వాన్ని, క్షేత్రాన్ని, ప్రజలను సూచిస్తోంది. ఈ పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మొత్తం 162 సార్లు ఉంటే, మత్తయి పుస్తకంలో 55 సార్లు కనిపిస్తుంది. అది చాలా సందర్భాల్లో దేవుని పరలోక పరిపాలనను సూచిస్తోంది. మత్తయి ఈ పదాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించాడంటే ఆయన రాసిన సువార్త పుస్తకాన్ని ‘రాజ్య సువార్త పుస్తకం’ అని పిలవచ్చు.
పరలోక రాజ్యం: ఈ పదబంధం కేవలం మత్తయి సువార్తలోనే, అది కూడా దాదాపు 30 సార్లు కనిపిస్తుంది. మార్కు, లూకా సువార్తల్లో అలాంటి మరో పదాన్ని అంటే “దేవుని రాజ్యం” అని ఉపయోగించారు. పరలోకం నుండి వచ్చిన నియమాల ఆధారంగా జరిగే పరిపాలనను “దేవుని రాజ్యం” సూచిస్తోంది.—మత్త 21:43; మార్కు 1:15; లూకా 4:43; దాని 2:44; 2 తిమో 4:18.
దగ్గరపడింది: దానర్థం పరలోక రాజ్యానికి కాబోయే రాజు కనిపించే సమయం వస్తోందని.
(మత్తయి 3:4) ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
nwtsty మీడియా
బాప్తిస్మం ఇచ్చే యోహాను బట్టలు, కనబడే తీరు
యోహాను, ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రాన్ని వేసుకునేవాడు; చిన్న వస్తువులను మోసుకెళ్లడానికి వీలుగా నడుముకు తోలుదట్టిని కట్టుకునేవాడు. ప్రవక్త అయిన ఏలీయా వస్త్రధారణ కూడా దాదాపు అలానే ఉండేది. (2 రాజు 1:8) ఒంటె వెంట్రుకలతో చేసిన వస్త్రం చాలా గరుగ్గా ఉంటుంది, సాధారణంగా పేదవాళ్లు దాన్ని వేసుకునేవాళ్లు. ధనవంతులైతే, పట్టు లేదా నారతో తయారుచేసిన మెత్తని బట్టలను వేసుకునేవాళ్లు. (మత్త 11:7-9) యోహాను పుట్టుకతోనే నాజీరు అయ్యాడు కాబట్టి ఆయన జుట్టు ఎన్నడూ కత్తిరించబడి ఉండకపోవచ్చు. ఆయన బట్టలు, కనబడే తీరుబట్టి ఆయన సాదాసీదాగా జీవించివుంటాడని, పూర్తిగా దేవుని చిత్తాన్ని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసి ఉంటాడని స్పష్టంగా అర్థమౌతుంది.
మిడతలు
బైబిల్లో ఉపయోగించబడిన “మిడతలు” అనే పదం, చిన్న స్పర్శావయవాలు లేదా ఫీలర్స్ ఉండే అన్నిరకాల గొల్లభామలను; ముఖ్యంగా పెద్ద దండులుగా వలస వెళ్లే గొల్లభామలను సూచిస్తోంది. యెరూషలేములో చేసిన ఒక విశ్లేషణ ప్రకారం, ఎడారి మిడతల్లో 75 శాతం ప్రోటీన్ ఉంటుందట. ఈరోజుల్లో వాటిని తినేటప్పుడు వాటి తలను, కాళ్లను, రెక్కలను, పొట్ట భాగాన్ని తీసేయగా మిగిలే శరీర భాగాన్ని (thorax) పచ్చిగా లేదా ఉడికించి తింటారు. వాటి రుచి రొయ్యలు లేదా పీతలులా ఉంటుందని, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుందని అంటారు.
అడవి తేనె
చిత్రంలో కనిపిస్తున్నవి (1) అడవి తేనెటీగలు పెట్టిన తేనెపట్టు, (2) తేనెతో నిండిన తేనెపట్టు. యోహాను తిన్న తేనె, బహుశా ఏపిన్ మెల్లిఫెరా సిరియాకా (Apis mellifera syriaca) అని పిలువబడే స్థానిక అడవి జాతి తేనెటీగలు తయారుచేసిన తేనె అయ్యుంటుంది. ఈ తేనెటీగలు వేడిగా, పొడి వాతావరణం ఉండే యూదా అరణ్యంలో ఎక్కువగా జీవిస్తాయి. అవి మనుషుల్ని దాడిచేసే అలవాటున్నవి కాబట్టి ఆ జాతి తేనెటీగల్ని మనుషులు పెంచలేరు. అయితే క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలో ఇశ్రాయేలులో ఉండే ప్రజలు ఈ తేనెటీగల్ని మట్టి పాత్రల్లో ఉంచేవాళ్లు. అందుకే ఎక్కువ సంఖ్యలో తేనెపట్టు అవశేషాలు, యోర్దాను లోయలోని పట్టణ ప్రాంతం మధ్యలో (ఇప్పుడు ఆ ప్రాంతాన్ని Tel Rehov అని పిలుస్తున్నారు) దొరికాయి. ఆ తేనెను, ప్రస్తుతం టర్కీ అని పిలుస్తున్న ప్రాంతం నుండి దిగుమతి చేసిన తేనెటీగలు తయారు చేసివుండవచ్చు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(మత్తయి 1:3) యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను.
మత్త 1:3 nwtsty స్టడీ నోట్
తామారు: మెస్సీయ వంశావళిలో ప్రస్తావించబడిన ఐదుగురు స్త్రీలలో ఈమె మొదటిది. మిగతా నలుగురు ఎవరంటే: అన్యులైన రాహాబు, రూతు (5వ వచనం); “ఊరియా భార్య” బత్షెబ (6వ వచనం); మరియ (16వ వచనం). సాధారణంగా వంశావళిలో అన్నీ పురుషుల పేర్లే ఉంటాయి, కానీ ఈ వంశావళిలో ఈ స్త్రీలు కూడా చేర్చబడ్డారంటే, ఏదో అసాధారణ పరిస్థితుల్లో వీళ్లు యేసు పూర్వీకులు అయ్యుంటారు.
(మత్తయి 3:11) మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
మత్త 3:11 nwtsty స్టడీ నోట్
బాప్తిస్మం ఇస్తున్నాను: లేదా నిన్ను “ముంచుతున్నాను.” బా·ప్‌టైʹజో (ba·ptiʹzo) అనే గ్రీకు పదానికి “ముంచు, మునుగు” అనే అర్థాలున్నాయి. బాప్తిస్మం అంటే పూర్తిగా మునగడమని ఇతర బైబిలు రెఫరెన్సులు చెప్తున్నాయి. ఒక సందర్భంలో, సలీము దగ్గర్లో ఉన్న యోర్దాను లోయలో “ఒక పెద్ద నీటిమడుగు” ఉండడంతో యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. (యోహా 3:23) ఐతియోపీయుడైన అధికారికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, వాళ్లిద్దరూ “నీళ్లలోకి దిగారు.” (అపొ 8:38) అంతేకాదు, “యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా” అని 2 రాజు 5:14లో నయమాను గురించి చెప్తున్నప్పుడు కూడా అదే గ్రీకు పదం ఉపయోగించబడింది.
చదవాల్సిన బైబిలు భాగం
(మత్తయి 1:1-17) అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; 3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, 4 ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; 5 నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; 6 యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, 7 సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; 8 ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; 9 ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; 10 హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; 11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. 12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; 13 జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; 14 అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; 15 ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; 16 యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 17 ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.
జనవరి 8-14
దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 4-5
“యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు”
(మత్తయి 5:3) “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.
మత్త 5:3 nwtsty స్టడీ నోట్
సంతోషం: ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు కలిగే ఆహ్లాదాన్ని మాత్రమే ఈ పదం సూచించడం లేదు. బదులుగా, మనుషుల విషయంలో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడడాన్ని, ఆయన అనుగ్రహాన్ని పొందడాన్ని అది సూచిస్తుంది. అంతేకాదు, పరలోకంలో మహిమాన్వితంగా ఉన్న దేవుడిని, అలాగే యేసును వర్ణించడానికి కూడా ఆ పదాన్ని ఉపయోగిస్తారు.—1 తిమో 1:11; 6:15.
దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు: “గుర్తించేవాళ్లు” అని అనువదించబడిన గ్రీకు పదానికి సాధారణంగా “పేదవాళ్లు (అవసరంలో ఉన్నవాళ్లు, డబ్బులు లేనివాళ్లు, బిచ్చగాళ్లు)” అనే అర్థం ఉంది. అయితే ఈ సందర్భంలో మాత్రం, అవసరంలో ఉన్నవాళ్లను, తమకు ఫలానా అవసరం ఉందని బాగా గుర్తించినవాళ్లను వర్ణించడానికి ఆ పదాన్ని ఉపయోగించారు. లూకా 16:20, 22 వచనాల్లో ‘అడుక్కునేవాడైన’ లాజరు గురించి చెప్తున్నప్పుడు కూడా అదే పదాన్ని ఉపయోగించారు. “ఆత్మవిషయమై దీనులైనవారు” అని కొన్ని బైబిళ్లలో అనువదించిన గ్రీకు పదం, తాము ఆధ్యాత్మికంగా అవసరంలో ఉన్నామని, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా గుర్తించిన ప్రజలను సూచిస్తుంది.
(మత్తయి 5:7) “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.
మత్త 5:7 nwtsty స్టడీ నోట్
కరుణ: “కరుణగల,” “కరుణ” అని అనువదించబడిన బైబిలు పదాలను క్షమించడం లేదా తీర్పు తీర్చేటప్పుడు చూసీచూడనట్లు ఉండడం అని చెప్పడానికి మాత్రమే ఉపయోగించలేదు. బదులుగా, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేసేలా ఒకర్ని కదిలించే కనికరం, దయ వంటి భావాల్ని వర్ణించడానికి ఆ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు.
(మత్తయి 5:9) “శాంతిని నెలకొల్పేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుని పిల్లలు అనబడతారు.
మత్త 5:9 nwtsty స్టడీ నోట్
శాంతిని నెలకొల్పేవాళ్లు: శాంతిస్వభావులు అని మాత్రమే కాదు, శాంతిలేని చోట శాంతిని తీసుకొచ్చేవాళ్లు అని అర్థం.
మీ పిల్లలకు సమాధానంగా ఉండడాన్ని నేర్పించండి
క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు “సమాధానమును వెదకి దాని వెంటాడ[డానికి]” వారికి తర్ఫీదునివ్వాలని కోరుకుంటారు. (1 పేతురు 3:11) అనుమానం, నిరాశ, పగ వంటి భావాలను తొలగించుకోవడానికి చేసే కృషికి తగిన ప్రతిఫలమే సమాధానపరులుగా ఉండడంవల్ల లభించే సంతోషం.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(మత్తయి 4:9) ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను ఆరాధిస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను.”
మత్త 4:9 nwtsty స్టడీ నోట్
ఆరాధిస్తే: “ఆరాధిస్తే” అని అనువదించిన గ్రీకు క్రియాపదం తద్ధర్మ కాలంలో (aorist tense) రాయబడింది. అంటే కొద్దిసేపు లేదా క్షణంలో చేసే పనిని అది సూచిస్తోంది. “ఆరాధిస్తే” అని అనువదించబడిన ఆ పదాన్ని బట్టి, తనను కేవలం ఒక్కసారే ఆరాధించమని సాతాను యేసును అడిగాడు గానీ ఎప్పుడూ తననే ఆరాధిస్తూ ఉండమని అడగలేదని చెప్పవచ్చు.
(మత్తయి 4:23) అప్పుడు ఆయన ప్రజల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ గలిలయ అంతటా ప్రయాణించాడు.
మత్త 4:23 nwtsty స్టడీ నోట్
బోధిస్తూ . . . ప్రకటిస్తూ: బోధించడం, ప్రకటించడం రెండూ ఒకటి కాదు. ఎందుకంటే బోధకుడు ఒక విషయాన్ని కేవలం చెప్పడమేకాదు, ఆ విషయం గురించి వివరిస్తాడు, ఒప్పించేలా మాట్లాడతాడు, ఆధారాలు కూడా చూపిస్తాడు.
చదవాల్సిన బైబిలు భాగం
(మత్తయి 5:31-48) “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా. 32 అయితే నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపాలు అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, వ్యభిచారం చేసే ప్రమాదంలోకి ఆమెను నెడుతున్నాడు. ఈ విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీని పెళ్లి చేసుకునే ఏ వ్యక్తయినా వ్యభిచారం చేస్తున్నాడు. 33 “అంతేకాదు, ‘మీరు ఒట్టు పెట్టుకుని దాన్ని తప్పకూడదు, కానీ మీరు యెహోవాకు చేసుకున్న మొక్కుబళ్లను చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు కదా. 34 అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయవద్దు; పరలోకం తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం; 35 అలాగే, భూమి తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది ఆయన పాదపీఠం; యెరూషలేము తోడు అని ఒట్టు వేయవద్దు, ఎందుకంటే అది మహారాజు నగరం. 36 మీ ప్రాణం తోడు అని ఒట్టుపెట్టుకోవద్దు, ఎందుకంటే మీరు ఒక్క వెంట్రుకను కూడా తెల్లగానైనా నల్లగానైనా చేయలేరు. 37 మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టే ఉండాలి. ఇవి కాకుండా మరేదైనా దుష్టుని నుండి వచ్చేదే. 38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 39 అయితే నేను మీతో చెప్తున్నాను, దుష్టుడైన వ్యక్తిని ఎదిరించకండి; కానీ మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టే వ్యక్తికి ఎడమ చెంప కూడా చూపించండి. 40 ఎవరైనా మిమ్మల్ని న్యాయస్థానానికి తీసుకెళ్లి, మీ లోపలి వస్త్రాన్ని తీసుకోవాలని అనుకుంటుంటే అతనికి మీ పైవస్త్రాన్ని కూడా ఇచ్చేయండి. 41 అధికారంలో ఉన్న ఒకతను ఒక మైలు రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే అతనితో పాటు రెండు మైళ్లు వెళ్లండి. 42 ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వండి, మిమ్మల్ని అప్పు అడగాలనుకునే వాళ్లనుండి మీ ముఖం తిప్పుకోకండి. 43 “‘నువ్వు నీ సాటిమనిషిని ప్రేమించాలి, నీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 44 అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి, 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన అందరి మీద అంటే దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. 46 మిమ్మల్ని ప్రేమిస్తున్నవాళ్లనే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది? సుంకరులు కూడా అలాగే చేస్తున్నారు కదా? 47 మీరు మీ సోదరులకు మాత్రమే నమస్కారం చేస్తే, మీరేం గొప్ప పని చేస్తున్నారు? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా? 48 మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులు అవ్వాలి.
జనవరి 15-21
దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 6-7
“దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి”
(మత్తయి 6:10) నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.
ప్రార్థించే గొప్ప అవకాశం
12 మన ప్రార్థనల్లో ఏ విషయానికి మనం ముఖ్యమైన స్థానం ఇవ్వాలి? యెహోవాకు, ఆయన ఇష్టానికి. ఆయన మనకోసం చేసిన ప్రతీదానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. (1 దినవృత్తాంతములు 29:10-13) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఎలా ప్రార్థించాలో యేసు భూమ్మీదున్నప్పుడు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 6:9-13 చదవండి.) పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా పరిగణించే దేవుని పేరు పరిశుద్ధపర్చబడడం గురించి ముందుగా ప్రార్థించాలని ఆయన చెప్పాడు. ఆ తర్వాత దేవుని రాజ్యం రావాలని, యెహోవా ఇష్టం భూమ్మీద నెరవేరాలని ప్రార్థించమని చెప్పాడు. ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నిటి గురించి ప్రార్థించాకే మన వ్యక్తిగత అవసరాల గురించి ప్రార్థించాలని యేసు చెప్పాడు. మన ప్రార్థనల్లో యెహోవాకు, ఆయన ఇష్టానికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా మనకు ఏది అత్యంత ప్రాముఖ్యమో చూపిస్తాం.
(మత్తయి 6:24) “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.
మత్త 6:24 nwtsty స్టడీ నోట్
సేవ చేయడం: ఈ గ్రీకు క్రియాపదం ఒక దాసునిగా అంటే ఒక్క యజమానికే సొంతమైన దాసునిగా సేవ చేయడాన్ని సూచిస్తుంది. క్రైస్తవుడు ఒకవైపు వస్తుసంపదల్ని కూడబెట్టుకోవడంలో నిమగ్నమై ఉంటూ, మరోవైపు దేవునికి చెందాల్సిన పూర్తి భక్తిని ఆయనకు చెల్లించడం కుదరదని యేసు చెప్తున్నాడు.
(మత్తయి 6:33) “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.
మత్త 6:33 nwtsty స్టడీ నోట్
ఇస్తూ ఉండండి: ఇక్కడ ఉపయోగించిన గ్రీకు క్రియాపదం ఒక పనిలో కొనసాగుతూ ఉండడాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ క్రియాపదాన్ని “నిరంతరం . . . ఇస్తూ ఉండండి” అనే అర్థంలో కూడా వాడవచ్చు. యేసు నిజ అనుచరులు కొంతకాలంపాటు రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చి, ఆ తర్వాత వేరే పనులకు ప్రాధాన్యత ఇవ్వరు. బదులుగా రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడమే వాళ్లకు జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయంగా ఉండాలి.
రాజ్యం: కొన్ని ప్రాచీన గ్రీకు రాతప్రతుల్లో “దేవుని రాజ్యం” అని ఉంది.
ఆయన: దేవున్ని, అంటే మత్త 6:32లో ప్రస్తావించబడిన ‘పరలోక తండ్రిని’ సూచిస్తుంది.
నీతి: దేవుని నీతిని అనుసరించేవాళ్లు ఆయన చిత్తాన్ని చేస్తారు, అంతేకాదు తప్పొప్పుల విషయంలో ఆయన ఉంచిన ప్రమాణాల్ని పాటిస్తారు. ఇది పరిసయ్యుల బోధకు పూర్తి విరుద్ధమైనది. వాళ్లు తమ సొంత నీతి ప్రమాణాలను ఏర్పాటు చేసుకుని వాటిని బోధించేవాళ్లు.—మత్త 5:20.
వస్తుసందల్ని కాదు రాజ్యాన్ని వెదకండి
18 మత్తయి 6:33 చదవండి. దేవుని రాజ్యానికి మన జీవితంలో మొదటిస్థానం ఇస్తే మన అవసరాలన్నిటినీ యెహోవాయే తీరుస్తాడు. అలాగని మనమెందుకు నమ్మవచ్చు? యేసు ఇలా చెప్పాడు, “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.” అవును మీకేమి అవసరమో మీకన్నా ముందు యెహోవాకు తెలుసు. (ఫిలి. 4:19) మీకు బట్టలు, ఆహారం అవసరమని ఆయనకు తెలుసు. మీరూ, మీ కుటుంబం ఉండడానికి ఓ ఇల్లు అవసరమనే విషయం కూడా యెహోవాకు తెలుసు. మీ అవసరాలన్నీ ఖచ్చితంగా తీరేలా ఆయన చూస్తాడు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(మత్తయి 7:12) కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి. నిజానికి ధర్మశాస్త్రం, ప్రవక్తలు బోధించేది ఇదే.
బంగారు సూత్రాన్ని మీ పరిచర్యలో పాటించండి
14 ఈ సన్నివేశం ఊహించుకోండి: ఓరోజు మీకు ఫోన్‌వచ్చింది, అది మీకు తెలిసిన గొంతు కాదు. మీకు ఎలాంటి ఆహారం ఇష్టమో చెప్పమని ఆ అపరిచితుడు మిమ్మల్ని అడిగాడు. ‘అసలు ఆయన ఎవరు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు’ అని మీరు అనుమానపడతారు. మర్యాదకొద్దీ కాసేపు మాట్లాడినా, ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం మీకు ఇష్టం లేదని చెబుతారు. అదే, ఫోన్‌చేసిన ఆ అపరిచితుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, తాను పోషకాహార విభాగంలో పనిచేస్తున్నాననీ తన దగ్గర ఆహారానికి సంబంధించి ఉపయోగకరమైన సమాచారం ఉందనీ చెప్పాడనుకోండి. అప్పుడు వినడానికి మీరు బహుశా మరింత సుముఖత చూపిస్తారు. ఎంతైనా, మనసు నొప్పించకుండానే విషయాన్ని సూటిగా చెప్పేవాళ్లను మనం ఇష్టపడతాం. పరిచర్యలో మనం కలిసేవాళ్ల పట్ల కూడా ఇదే మర్యాదను ఎలా చూపించవచ్చు?
15 చాలా ప్రాంతాల్లో, అసలు మనం ఎందుకు వచ్చామో గృహస్థులకు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంటివాళ్లకు తెలియని విలువైన సమాచారం మన దగ్గరున్న మాట నిజమే, కానీ మన గురించి అస్సలు పరిచయం చేసుకోకుండా, “ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే శక్తి మీకుంటే, మీరు ముందు దేన్ని పరిష్కరిస్తారు?” వంటి ప్రశ్నతో సంభాషణను మొదలుపెట్టాం అనుకోండి. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకుని, సంభాషణను బైబిలు వైపు మళ్లించడానికే మనం అలాంటి ప్రశ్నలు అడుగుతామన్నది వాస్తవమే. అయితే గృహస్థుడు మాత్రం మనసులో “అసలు ఈయన ఎవరు? ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నాడు? ఈయనకేం కావాలి?” అనే ఆలోచిస్తుంటాడు. కాబట్టి మనం ముందు చేయాల్సిన పని, గృహస్థునిలోని కంగారు పోగొట్టడమే. (ఫిలి. 2:3, 4) దాన్ని ఎలా చేయవచ్చు?
16 ఒక ప్రయాణ పర్యవేక్షకుడు, కింద ఉన్న పద్ధతి సమర్థవంతంగా ఉన్నట్లు అనుభవంతో తెలుసుకున్నాడు. ఆయన, ఇంటివాళ్లను పరిచయం చేసుకుని, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని వాళ్లకు ఇస్తూ, “ఈ రోజు ఇక్కడున్న వాళ్లందరికీ ఈ కరపత్రాన్ని ఇస్తున్నాం. దీనిలో, చాలామందికి వచ్చే ఆరు ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇది మీకోసం, తీసుకోండి” అని చెప్పేవాడు. తాను ఎందుకు వచ్చాడో చెప్పడం వల్ల గృహస్థుల్లో కంగారు తగ్గి, ప్రశాంతంగా సంభాషణ కొనసాగిస్తున్నారని ఆయన చెబుతున్నాడు. ఆ తర్వాత ఆయన కరపత్రంలోకి చూపిస్తూ, “ఈ ప్రశ్నల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” అని అడిగేవాడు. గృహస్థుడు ఏదైనా ప్రశ్నను ఎంచుకుటే, ఆ సహోదరుడు కరపత్రం తెరిచి, ఆ ప్రశ్నకు బైబిలు ఇస్తున్న జవాబు చర్చించేవాడు. ఒకవేళ గృహస్థులు ఇబ్బంది పడుతున్నట్లయితే, ఆయనే ఓ ప్రశ్నను ఎంపిక చేసి చర్చను కొనసాగించేవాడు. నిజమే, సంభాషణను మొదలుపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు, మనం విషయం చెప్పడానికి ముందు కొన్ని మర్యాదలు పాటించాలని ఆశిస్తారు. కాబట్టి గృహస్థులకు నచ్చేలా మన సంభాషణను మలచుకోవడం కీలకం.
(మత్తయి 7:28, 29) యేసు ఈ మాటలు చెప్పడం ముగించినప్పుడు, ప్రజలు ఆయన బోధించిన తీరు చూసి చాలా ఆశ్చర్యపోయారు, 29 ఎందుకంటే ఆయన వాళ్ల శాస్త్రుల్లా కాకుండా అధికారంగల వ్యక్తిలా బోధించాడు.
మత్త 7:28, 29 nwtsty స్టడీ నోట్స్
చాలా ఆశ్చర్యపోయారు: ఇక్కడ ఇచ్చిన క్రియాపదాన్ని “మాటలు రానంతగా ఆశ్చర్యపోవడం” అని నిర్వచించవచ్చు. అయితే ఉపయోగించబడిన క్రియాపదం బట్టి యేసు మాటలు వాళ్లపై చెరగని ముద్ర వేశాయని చెప్పవచ్చు.
ఆయన బోధించిన తీరు: యేసు ఎలా బోధించాడనే విషయాన్ని, అంటే ఆయన బోధనా పద్ధతులను అది సూచిస్తుంది. బోధనా పద్ధుతులు అన్నప్పుడు, కొండమీద ప్రసంగంలో ఆయన బోధించిన విషయాలన్నీ అందులో ఇమిడి ఉంటాయి.
వాళ్ల శాస్త్రుల్లా కాకుండా: శాస్త్రుల ఆచారం ప్రకారం, రబ్బీలను అధికారమున్న గౌరవంగల వ్యక్తులుగా ఎంచేవాళ్లు. అయితే యేసు మాత్రం యెహోవా ప్రతినిధిగా, అధికారం ఉన్న వ్యక్తిలా దేవుని వాక్యం ఆధారంగా బోధిస్తున్నాడు.—యోహా 7:16.
చదవాల్సిన బైబిలు భాగం
(మత్తయి 6:1-18) “మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి; లేకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి మీకు ఏ ప్రతిఫలమూ దక్కదు. 2 కాబట్టి నువ్వు దానధర్మాలు చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు మనుషులచేత మహిమ పొందడం కోసం సభామందిరాల్లో, వీధుల్లో అలా చేస్తుంటారు. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 3 కానీ నువ్వు మాత్రం దానధర్మాలు చేస్తున్నప్పుడు, నీ కుడిచేయి చేసేది నీ ఎడమచేతికి తెలియనివ్వకు. 4 అలా చేస్తే నీ దానధర్మాలు రహస్యంగా ఉంటాయి. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 5 “అంతేకాదు, మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ప్రవర్తించకండి; మనుషులకు కనిపించేలా సభామందిరాల్లో, ప్రధాన వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేయడం వాళ్లకు ఇష్టం. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 6 అయితే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఇంట్లో నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవ్వరూ చూడలేని నీ తండ్రికి ప్రార్థించు. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 7 నువ్వు ప్రార్థించేటప్పుడు, అన్యజనుల్లా చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పకు; ఎక్కువ మాటలు ఉపయోగిస్తే దేవుడు తమ ప్రార్థన వింటాడని వాళ్లు అనుకుంటారు. 8 కాబట్టి మీరు వాళ్లలా ఉండకండి; ఎందుకంటే మీరు అడగకముందే మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు. 9 “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: “‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. 10 నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి. 11 మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు; 12 మాకు అప్పుపడిన వాళ్లను మేము క్షమించినట్టే, మా అప్పులు కూడా క్షమించు. 13 మమ్మల్ని ప్రలోభాలకు లొంగిపోనివ్వకు, కానీ దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.’ 14 “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమిస్తే, మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు; 15 మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు. 16 “మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు, వేషధారుల్లా బాధగా ముఖం పెట్టకండి; తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్లు తమ ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 17 అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ తలకు నూనె రాసుకో, నీ ముఖం కడుక్కో. 18 అలా చేస్తే నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కాదుగానీ, ఎవరూ చూడలేని నీ తండ్రికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
జనవరి 22-28
దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 8-9
“యేసు ప్రజలను ప్రేమించాడు”
(మత్తయి 8:1-3) యేసు ఆ కొండ దిగి వచ్చాక చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు. 2 ఇదిగో! ఒక కుష్ఠురోగి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, “ప్రభువా, నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని అన్నాడు. 3 కాబట్టి యేసు తన చెయ్యి చాపి, అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే, శుద్ధుడివి అవ్వు” అన్నాడు. వెంటనే అతని కుష్ఠురోగం నయమైంది.
మత్త 8:3 nwtsty స్టడీ నోట్
అతన్ని ముట్టుకుని: కుష్ఠు వ్యాధి వచ్చినవాళ్లు, తమ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండేలా ఇతరులకు దూరంగా ఉండాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. (లేవి 13:45, 46; సంఖ్య 5:1-4) అయితే, యూదా మతనాయకులు అదనంగా ఇంకొన్ని నియమాలను పెట్టారు. ఉదాహరణకు, ఎవరైనాసరే కుష్ఠురోగికి 6 అడుగుల (1.8 మీటర్ల) దూరంలో ఉండాలని, గాలి బాగా వీచే రోజున మరింత దూరంలో అంటే 150 అడుగుల (45 మీటర్ల) దూరంలో ఉండాలనే నియమం పెట్టారు. అలాంటి నియమాలవల్ల ఇతరులు కుష్ఠురోగులతో నిర్దయగా ప్రవర్తించేవాళ్లు. కుష్ఠురోగులకు కనబడకుండా దాక్కున్న రబ్బీని, వాళ్లను దగ్గరకు రానివ్వకూడదని రాళ్లు విసిరిన మరొక వ్యక్తిని కూడా ఆచారం తప్పుబట్టలేదు. వీళ్లకు భిన్నంగా, కుష్ఠురోగుల పరిస్థితి చూసిన యేసు ఎంతో చలించిపోయి, ఒక కుష్ఠురోగిని ముట్టుకున్నాడు. కుష్ఠురోగిని అలా ముట్టుకోవడాన్ని యూదులు కనీసం కలలో కూడా ఊహించుకోలేరు. యేసుకు, ఆ రోగిని ముట్టుకోకుండా కూడా బాగు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆయన ఆ రోగిని ముట్టుకుని స్వస్థపర్చాడు.—మత్త 8:5-12.
నాకు ఇష్టమే: యేసు కేవలం కుష్ఠురోగి విన్నపాన్ని ఒప్పుకోవడమే కాదు, అతన్ని బాగుచేయాలనే తన బలమైన కోరికను కూడా వ్యక్తం చేశాడు. అలా చెప్పడం వల్ల, కేవలం తన బాధ్యతగా కాదుగానీ ఇష్టంగా బాగు చేస్తున్నానని యేసు చూపించాడు.
(మత్తయి 9:9-13) ఆ తర్వాత యేసు అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే కార్యాలయంలో కూర్చొనివున్న మత్తయిని చూసి అతనితో, “నా శిష్యుడివి అవ్వు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు. 10 తర్వాత యేసు అతని ఇంట్లో భోంచేస్తున్నప్పుడు ఇదిగో! చాలామంది పన్ను వసూలుదారులు, పాపులు అక్కడికి వచ్చారు; వాళ్లు యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోంచేస్తున్నారు. 11 పరిసయ్యులు అది చూసి యేసు శిష్యులతో ఇలా అన్నారు: “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు?” 12 వాళ్ల మాటల్ని విని యేసు ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. 13 కాబట్టి వెళ్లి, ‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకోండి. ఎందుకంటే నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.”
మత్త 9:10 nwtsty స్టడీ నోట్
భోంచేస్తున్నప్పుడు: లేదా “భోజనం బల్ల దగ్గర ఆనుకొని కూర్చున్నప్పుడు.” బల్ల దగ్గర ఎవరినైనా ఆనుకొని కూర్చోవడం ఆ వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యేసు కాలంలోని యూదులు సాధారణంగా, యూదులుకాని వాళ్లతో కలిసి బల్ల దగ్గర ఎప్పుడూ భోంచేసివుండరు.
పన్ను వసూలుదారులు: చాలామంది యూదులు రోమా అధికారుల కోసం పన్ను వసూలు చేసేవాళ్లు. ఆ యూదులు ప్రజలకు నచ్చని విదేశీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాళ్లు, అధికారులు విధించిన పన్ను కన్నా ఎక్కువ పన్నును బలవంతంగా వసూలు చేసేవాళ్లు. అందుకే ప్రజలు ఆ యూదులను ఇష్టపడేవాళ్లు కాదు. సాధారణంగా పన్ను వసూలుదారులతో తోటి యూదులు సహవసించేవాళ్లు కాదు. వాళ్లను పాపులతో, వేశ్యలతో సమానంగా చూసేవాళ్లు.—మత్త 11:19; 21:32.
(మత్తయి 9:35-38) తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు. 36 ఆయన ప్రజల్ని చూసినప్పుడు వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు చర్మం ఒలిచేయబడి, విసిరేయబడిన కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు. 37 అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. 38 కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.”
మత్త 9:36 nwtsty స్టడీ నోట్
జాలిపడ్డాడు: ఈ పదానికి గ్రీకు భాషలో స్పలాగ్ʹజో· మై (splag·khniʹzo·mai) అనే క్రియాపదాన్ని ఉపయోగించారు. ఆ క్రియాపదం “పేగులు” (splagʹkhna) అనే పదానికి సంబంధించినది. ఆ పదం, శరీరం లోపల కలిగే ఒక భావనను అంటే లోలోపల కలిగే భావోద్వేగాన్ని తెలియజేస్తుంది. కనికరపడడాన్ని వివరించడానికి గ్రీకులో దీనికి మించిన పదం ఇంకొకటి లేదు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(మత్తయి 8:8-10) అప్పుడు ఆ సైనికాధికారి ఇలా అన్నాడు: “అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను. నువ్వు ఒక మాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు. 9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే; నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒకర్ని ‘వెళ్లు!’ అంటే అతను వెళ్తాడు; ఇంకొకర్ని ‘రా!’ అంటే అతను వస్తాడు; నా దాసునితో, ‘ఇది చేయి!’ అంటే చేస్తాడు.” 10 ఈ మాటలు విన్నప్పుడు యేసు చాలా ఆశ్చర్యపోయి, తనను అనుసరిస్తున్న వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజం చెప్తున్నాను, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు.
“మీకు మాదిరి ఉంచాను”
16 అలాగే బహుశా, అన్యుడూ రోమీయుడూ అయిన ఒక సైనికాధికారి యేసును సమీపించి తన దాసుని స్వస్థపరచమని అడిగినప్పుడు, ఆ సైనికాధికారిలో లోపాలున్నాయని యేసుకు తెలుసు. ఆ రోజుల్లో సాధారణంగా ఒక సైనికాధికారికి ఎన్నో దౌర్జన్యాలు చేసిన, ఎంతో రక్తం చిందించిన, అబద్ధ ఆరాధనలో పాల్గొన్న గతచరిత్రే ఉండేది. అయినా యేసు మంచి విషయంపైనే అంటే ఆయనకున్న అసాధారణమైన విశ్వాసంపైనే దృష్టి కేంద్రీకరించాడు. (మత్తయి 8:5-13) ఆ తర్వాత, యేసు తన ప్రక్కన హింసా కొయ్యపై వ్రేలాడదీయబడిన దొంగతో మాట్లాడుతూ ఆ వ్యక్తిని ఆయన చేసిన గత నేరాల గురించి గద్దించలేదు గానీ భవిష్యత్తు గురించిన ఒక నిరీక్షణతో ఆయనను ప్రోత్సహించాడు. (లూకా 23:43) ఇతరుల గురించి ప్రతికూలంగా విమర్శనాత్మకంగా ఆలోచించడం, వారిని నిరుత్సాహపరచడానికే పనికొస్తుందని యేసుకు బాగా తెలుసు. ఇతరులలో ఉన్న మంచిని కనుగొనడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, అనేకులు తమను తాము మెరుగుపరచుకోవడానికి వారిని ప్రోత్సహించాయనడంలో సందేహం లేదు.
(మత్తయి 9:16, 17) పాత వస్త్రానికి అతుకు వేయడానికి కొత్త గుడ్డముక్కను ఎవ్వరూ ఉపయోగించరు. అలా చేస్తే, ఆ కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి పాత వస్త్రం నుండి విడిపోతుంది, చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 17 అలాగే, ప్రజలు కొత్త ద్రాక్షారసాన్ని పాత తోలుసంచుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, తోలుసంచులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది; తోలుసంచులు కూడా పాడౌతాయి. అందుకే ప్రజలు, కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తోలుసంచుల్లోనే పోస్తారు, అప్పుడు ఆ రెండూ పాడవకుండా ఉంటాయి.”
jy 70వ పేజీ, 6వ పేరా
యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు?
ఉపవాసం ఉండడం లాంటి పాత యూదామత ఆచారాల్ని తన శిష్యులు పాటించాల్సిన అవసరంలేదని, యేసు యోహాను శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకంటే యేసు, పాడైపోయిన పాత ఆరాధనా విధానానికి ‘అతుకువేసి’ దాన్ని సాగదీయడానికి రాలేదు. నిజానికి, ఆ పాత ఆరాధనా విధానం మొత్తం త్వరలోనే తీసి పారేయబడుతుంది. అయితే, యేసు ప్రోత్సహిస్తున్న కొత్త ఆరాధనా విధానం, మనుషులు కల్పించిన ఆచారాలతో నిండివున్న యూదా మతం లాంటిది కాదు. కాబట్టి, యేసు పాత వస్త్రానికి కొత్త గుడ్డముక్కను అతుకు వేయడానికో, లేదా గట్టిపడిన పాత తోలుసంచిలో కొత్త ద్రాక్షారసాన్ని పోయడానికో రాలేదు.
చదవాల్సిన బైబిలు భాగం
(మత్తయి 8:1-17) ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. 2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి—ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. 3 అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి—నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను. 4 అప్పుడు యేసు—ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. 5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి 6 —ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. 7 యేసు—నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా 8 ఆ శతాధిపతి—ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9 నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతి క్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి—ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని 12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను. 13 అంతట యేసు—ఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనొందెను. 14 తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి 15 ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 16 సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 17 ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన—ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
జనవరి 29–ఫిబ్రవరి 4
దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 10-11
“యేసు సేదదీర్పును ఇచ్చాడు”
(మత్తయి 10:29, 30) తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయితే మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు. 30 మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు.
మత్త 10:29, 30 nwtsty స్టడీ నోట్స్
పిచ్చుకలు: స్టౌ·తైʹయాన్ (strou·thiʹon) అనే గ్రీకు పదానికి చిన్న పక్షి అని అర్థం. అయితే ఆహారం కోసం ఉపయోగించే పక్షులన్నిటిలో చౌకగా దొరికే పిచ్చుకలను అది ఎక్కువగా సూచిస్తోంది.
తక్కువ విలువగల ఒక నాణేనికి: అక్ష., “ఒక అస్సారియోన్‌కు,” అది 45 నిమిషాలు పనిచేస్తే వచ్చే కూలి. (App. B14 చూడండి.) యేసు మూడవసారి గలిలయ యాత్రకు వెళ్లిన సందర్భంలో, రెండు పిచ్చుకలు ఒక అస్సారియోన్‌కు వస్తాయని చెప్పాడు. మరో సందర్భంలో, యూదయలో తన పరిచర్యను ప్రారంభించిన సుమారు ఒక సంవత్సరం తర్వాత, రెండు అస్సారియోన్‌లకు ఐదు పిచ్చుకలు వస్తాయని యేసు చెప్పాడు. (లూకా 12:6) ఈ రెండు వృత్తాంతాలను పోలిస్తే, వ్యాపారస్థుల దృష్టిలో పిచ్చుకలు ఎంత చౌకవంటే, ఐదవ పిచ్చుకను ఉచితంగా ఇచ్చేవాళ్లు.
మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు: ఒక మనిషి తలమీద సగటున 1,00,000 కన్నా ఎక్కువ వెంట్రుకలు ఉంటాయని అంచనా. ఇలాంటి సూక్ష్మ వివరాలు కూడా యెహోవాకు అంత బాగా తెలుసంటే, యేసు అనుచరులైన ప్రతీఒక్కరి పట్ల ఆయనకు ఎంతో శ్రద్ధ ఉందనే నమ్మకంతో మనం ఉండవచ్చు.
nwtsty మీడియా
పిచ్చుక
ఆహారంగా ఉపయోగించే పక్షులన్నిటిలో పిచ్చుకలే చాలా చౌకగా దొరికేవి. ఒక వ్యక్తి 45 నిమిషాలు పనిచేస్తే వచ్చే కూలితో రెండు పిచ్చుకల్ని కొనుక్కోవచ్చు. పిచ్చుక అని అనువదించబడిన గ్రీకు పదం రకరకాల చిన్న పక్షులను సూచిస్తోంది. అందులో మన ఇళ్లదగ్గర కనిపించే పిచ్చుకలు (Passer domesticus biblicus) అలాగే స్పానిష్ పిచ్చుకలు (Passer hispaniolensis) కూడా ఉన్నాయి. ఇవి ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తాయి.
(మత్తయి 11:28) భారం మోస్తూ అలసిపోయిన మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను.
మత్త 11:28 nwtsty స్టడీ నోట్
భారం మోస్తూ: తన దగ్గరకు రమ్మని యేసు పిలుస్తున్నవాళ్లు ఆందోళనవల్ల, అలసటవల్ల “భారం మోస్తూ” ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలకు మనుషులు జతచేసిన మానవ ఆచారాల వల్ల వాళ్లకు యెహోవాను ఆరాధించడం భారంగా తయారైంది. (మత్త 23:4) సేదదీర్పు పొందడానికి ఏర్పాటు చేసిన సబ్బాతు కూడా వాళ్లకు భారంగా తయారైంది.—నిర్గ 23:12; మార్కు 2:23-28; లూకా 6:1-11.
నేను మీకు సేదదీర్పును ఇస్తాను: “సేదదీర్పు” అని అనువదించబడిన గ్రీకు పదం కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూర్చోవడాన్ని లేదా పడుకోవడాన్ని సూచిస్తుంది (మత్త 26:45; మార్కు 6:31). అంతేకాదు కష్టం నుండి ఉపశమనాన్ని పొంది తిరిగి కోలుకోవడాన్ని, మళ్లీ బలాన్ని పొందడాన్ని కూడా సూచిస్తుంది (2 కొరిం. 7: 13; ఫిలే. 7). సందర్భాన్ని బట్టి చూస్తే, యేసు “కాడిని” (మత్త. 11:29) ఎత్తుకోవడమంటే విశ్రాంతి తీసుకోవడం కాదుగానీ సేవచేయడం అని అర్థం. ఈ వాక్యంలో యేసు కర్తగా, గ్రీకు పదం క్రియగా ఉంది. ఆ వాక్యానికి ఉన్న అర్థమేమిటంటే, భారం మోస్తున్న ప్రజలకు నూతన బలాన్ని, శక్తిని ఇచ్చి సులభంగా అలాగే తేలికగా ఉండే తన కాడిని ఎత్తుకోవాలనే కోరికను వాళ్లలో కలిగిస్తాడని.
(మత్తయి 11:29, 30) నా కాడి మీమీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నేను సాధుశీలుణ్ణి, అహంభావం లేనివాణ్ణి, గనుక మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. 30 ఎందుకంటే, నా కాడి మృదువైనది, నా భారం తేలికైనది.”
మత్త 11:29 nwtsty స్టడీ నోట్
నా కాడిని మీమీద ఎత్తుకుని: సాధారణంగా, “కాడి” అనేది బరువులు మోసే పశువుల మెడ మీద ఉంచే పరికరాన్ని సూచిస్తుంది. ఆదిమ భాషలో “కాడి” అని అనువదించబడిన పదానికి, రెండు బరువులు మోయడానికి ఒక మనిషి భుజంపై ఉంచే కర్ర అనే అర్థం కూడా ఉంది. యేసు ఉపయోగించిన “కాడి” అనే పదానికి సూచనార్థక భావంలో అధికారానికి, నిర్దేశానికి లోబడడం అని అర్థం. ఒకవేళ యేసు మనసులో దేవుడు తనపై మోపిన కాడి ఉండివుంటే, అంటే రెండు బరువులు మోసే కాడిలాంటిది ఉండివుంటే, అప్పుడు ఆయన ఆ కాడిని తనతోపాటు మోయమని, అలా మోయడానికి ఆయన సహాయం చేస్తానని చెప్పేవాడు. మరో మాటలో చెప్పాలంటే, “నాతోపాటు నా కాడి కిందకు రండి” అని చెప్పేవాడు. ఒకవేళ అది, యేసే స్వయంగా ఇతరుల మీద పెట్టే కాడిని సూచిస్తుంటే, దానర్థం తన శిష్యులు క్రీస్తు అధికారానికి అలాగే నిర్దేశానికి లోబడాలని.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(మత్తయి 11:2, 3) యోహాను చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు చేస్తున్న పనుల గురించి విన్నాడు. అతను తన శిష్యుల్ని పంపించి, 3 “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని ఆయన్ని అడగమన్నాడు.
jy 96వ పేజీ, 2-3 పేరాలు
యోహాను స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు
యోహాను అలా అడగడం వింతగా అనిపిస్తుందా? యోహాను దైవభక్తి ఉన్న వ్యక్తి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం యేసుకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు దేవుని పవిత్రశక్తి యేసు మీదికి దిగిరావడం ఆయన చూశాడు, యేసును తాను అంగీకరిస్తున్నట్లు దేవుడు చెప్పడం ఆయన విన్నాడు. యోహాను విశ్వాసం బలహీనపడిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే నిజమైతే, ఇప్పుడు మనం చూడబోతున్నట్లుగా, యేసు యోహాను గురించి గొప్పగా మాట్లాడేవాడు కాదు. మరి యోహానుకు యేసు గురించి అనుమానాలు లేకపోతే, యేసును ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు?
మెస్సీయను తానేనని యేసు స్వయంగా చెప్తే వినాలని యోహాను కోరుకొని ఉంటాడు. యోహాను చెరసాలలో మగ్గుతున్నాడు కాబట్టి ఆ మాట ఆయనకు బలాన్నిస్తుంది. యోహాను మరో ఉద్దేశంతో కూడా ఆ ప్రశ్న అడిగివుంటాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తి ఒక రాజు, విమోచకుడు అవుతాడని చెప్పే బైబిలు ప్రవచనాలు యోహానుకు తెలుసు. అయితే, యేసు బాప్తిస్మం తీసుకొని ఎన్నో నెలలు గడుస్తున్నా, యోహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. అందుకే, మెస్సీయ గురించిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి యేసు కాకుండా మరో వ్యక్తి రాబోతున్నాడా అని ఆయన అడుగుతున్నాడు.
(మత్తయి 11:16-19) “కాబట్టి, ఈ తరంవాళ్లను నేను ఎవరితో పోల్చాలి? వాళ్లు సంతల్లో కూర్చొని తోటిపిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు: 17 ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు.’ 18 అదేవిధంగా, బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా తింటూ, తాగుతూ జీవించలేదు; కానీ ప్రజలు, ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అని అంటున్నారు. 19 మానవ కుమారుడు అందరిలాగే తింటూ, తాగుతూ ఉన్నాడు; అయినా ప్రజలు ఆయన్ని, ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలు చేసేవాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అని అంటున్నారు. అయితే ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి.”
jy 98వ పేజీ, 1-2 పేరాలు
స్పందించని తరంవాళ్లకు శ్రమ
బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే యేసుకు ఎంతో గౌరవం ఉంది. అయితే, చాలామంది ప్రజలు యోహాను గురించి ఏమనుకున్నారు? యేసు తన “తరంవాళ్ల” గురించి ఇలా చెప్పాడు: “వాళ్లు సంతల్లో కూర్చొని తోటిపిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు: ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు.’”—మత్తయి 11:16, 17.
యేసు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నాడు? ఆయన ఇలా వివరించాడు: “యోహాను అందరిలా తింటూ, తాగుతూ జీవించలేదు; కానీ ప్రజలు, ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అని అంటున్నారు. మానవ కుమారుడు అందరిలాగే తింటూ, తాగుతూ ఉన్నాడు; అయినా ప్రజలు ఆయన్ని, ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలు చేసేవాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అని అంటున్నారు.” (మత్తయి 11:18, 19) యోహాను ఒక నాజీరుగా నిరాడంబరంగా జీవించాడు, ద్రాక్షారసాన్ని కూడా ముట్టుకోలేదు. అయినా ఆయనకు చెడ్డ దూత పట్టాడని ఆ తరంవాళ్లు అన్నారు. (సంఖ్యాకాండము 6:2, 3; లూకా 1:15) అయితే, యేసు అందరిలాగే జీవించాడు, ఆయన మితంగా తిన్నాడు, తాగాడు. అయినా ఆయన్ని తిండిబోతు, తాగుబోతు అని నిందించారు. కాబట్టి, ప్రజల్ని సంతోషపెట్టడం అసాధ్యం అనిపిస్తుంది.
చదవాల్సిన బైబిలు భాగం
(మత్తయి 11:1-19) యేసు తన 12 మంది శిష్యులకు నిర్దేశాలు ఇచ్చాక, చుట్టుపక్కల నగరాల్లో బోధించడానికి, ప్రకటించడానికి వెళ్లాడు. 2 యోహాను చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు చేస్తున్న పనుల గురించి విన్నాడు. అతను తన శిష్యుల్ని పంపించి, 3 “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని ఆయన్ని అడగమన్నాడు. 4 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు వింటున్నవాటి గురించి, చూస్తున్నవాటి గురించి వెళ్లి యోహానుకు చెప్పండి: 5 గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు, పేదవాళ్లకు మంచివార్త చెప్పబడుతోంది. 6 ఏ సందేహం లేకుండా నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”7 యోహాను శిష్యులు వెళ్లిపోతున్నప్పుడు, యేసు అక్కడున్న ప్రజలతో యోహాను గురించి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు: “మీరు ఏం చూడడానికి అరణ్యంలోకి వెళ్లారు? గాలికి ఊగుతున్న రెల్లునా? కాదు. 8 మరైతే మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఖరీదైన వస్త్రాలు వేసుకున్న వ్యక్తినా? కాదు. ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాళ్లు రాజభవనాల్లో ఉంటారు. 9 మరి అలాంటప్పుడు మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, నేను మీకు చెప్తున్నాను, అతను ప్రవక్త కన్నా చాలాచాలా గొప్పవాడు. 10 ‘ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు ముందుగా పంపిస్తున్నాను, అతను నీ ముందు నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు’ అని రాయబడింది అతని గురించే. 11 నేను మీతో నిజంగా చెప్తున్నాను, స్త్రీలకు పుట్టినవాళ్లలో బాప్తిస్మమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయితే పరలోక రాజ్యంలో తక్కువవాడు అతని కన్నా గొప్పవాడు. 12 బాప్తిస్మమిచ్చే యోహాను రోజుల నుండి ఇప్పటివరకు ప్రజలు పరలోక రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. అలా పట్టుదలగా ప్రయత్నించేవాళ్లు దాన్ని చేరుకుంటున్నారు. 13 ఎందుకంటే, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం, ప్రవక్తలు అందరూ ప్రవచించారు; 14 మీకు ఒప్పుకునే మనసు ఉంటే, ‘రావాల్సిన ఏలీయా’ ఇతనే. 15 చెవులు ఉన్నవాడు వినాలి. 16 “కాబట్టి, ఈ తరంవాళ్లను నేను ఎవరితో పోల్చాలి? వాళ్లు సంతల్లో కూర్చొని తోటిపిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు: 17 ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు.’ 18 అదేవిధంగా, బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా తింటూ, తాగుతూ జీవించలేదు; కానీ ప్రజలు, ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అని అంటున్నారు. 19 మానవ కుమారుడు అందరిలాగే తింటూ, తాగుతూ ఉన్నాడు; అయినా ప్రజలు ఆయన్ని, ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలు చేసేవాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అని అంటున్నారు. అయితే ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి.”