కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwbr18 మార్చి పేజీలు 1-8
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018)
  • ఉపశీర్షికలు
  • మార్చి 5-11
  • మార్చి 12-18
  • మార్చి 19-25
  • మార్చి 26– ఏప్రిల్‌ 1
క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018)
mwbr18 మార్చి పేజీలు 1-8

క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

మార్చి 5-11

దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 20-21

“మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”

1(మత్తయి 20:3) ఉదయం దాదాపు 9 గంటలకు ఆ యజమాని మళ్లీ బయటికి వెళ్లినప్పుడు, పనిదొరక్క సంతలో నిలబడివున్న కొంతమందిని చూసి

nwtsty మీడియా

సంత

ఇక్కడ చూపించిన లాంటి సంతలు, రోడ్డు ప్రక్కన ఉంటాయి. వ్యాపారులు తరచూ ఎక్కువ సరుకుల్ని వీధిలో పెట్టడం వల్ల దారి చిన్నదైపోయి రద్దీగా ఉండేది. స్థానికులు ఇంటికి కావలసిన సరుకులు, మట్టి పాత్రలు, ఖరీదైన గాజు పాత్రలు, తాజా పండ్లు, కూరగాయలు అక్కడ కొనుక్కోవడానికి వీలుగా ఉండేది. ఆ కాలంలో ఫ్రిజ్‌ లాంటివి ఉండేవి కాదు కాబట్టి ప్రజలు సరుకుల కోసం ప్రతీరోజు సంతకు వెళ్లాల్సి వచ్చేది. అలా కొనుక్కోవడానికి వచ్చినవాళ్లు వర్తకులు లేదా ఇతర సందర్శకులు తెచ్చిన వార్తల్ని వినేవాళ్లు; అంతేకాదు సంతలో పిల్లలు ఆడుకునేవాళ్లు, కూలీలు పని కోసం చూసేవాళ్లు. సంతలో యేసు రోగుల్ని బాగుచేశాడు, పౌలు ప్రకటించాడు. (అపొ 17:17) కానీ గర్విష్ఠులైన శాస్త్రులు, పరిసయ్యులు మాత్రం ఇలాంటి సంత వీధుల్లో ప్రజల గుర్తింపు పొందాలని చూసేవాళ్లు.

(మత్తయి 20:20, 21) అప్పుడు, జెబెదయి భార్య తన ఇద్దరు కొడుకులతో యేసు దగ్గరికి వచ్చి, ఆయనకు వంగి నమస్కారం చేసింది. ఆమె ఆయన్ని ఒక విషయం అడగాలనుకుంది. 21 యేసు ఆమెను, “నీకు ఏం కావాలి?” అని అడిగాడు. అప్పుడు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కొడుకుల్లో ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో” అని ఆయన్ని అడిగింది.”

మత్త 20:20, 21 nwtsty స్టడీ నోట్‌

జెబెదయి భార్య తన ఇద్దరు కొడుకులతో: అంటే, అపొస్తలులైన యాకోబు, యోహానుల తల్లి. మార్కు సువార్త ప్రకారం యాకోబు, యోహానులే యేసును అడగడానికి వచ్చారు. అయితే వాళ్లు తమ తల్లి అయిన సలోమే ద్వారా అడిగించారు. అడిగింది ఆమెనే అయినా, అలా అడగడానికి కారణం యాకోబు, యోహానులే అని స్పష్టమౌతోంది. సలోమే యేసు తల్లికి సోదరి అయ్యుంటుంది.—మత్త. 27:55, 56; మార్కు 15:40, 41; యోహా. 19:25.

ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు: ఇక్కడ రెండు స్థానాలు గౌరవాన్ని, అధికారాన్ని సూచిస్తున్నాయి. అయితే కుడివైపు ఉన్నదే అన్నిటికన్నా ఎక్కువ గౌరవప్రదమైన స్థానం.—కీర్త 110:1; అపొ 7:55, 56; రోమా 8:34.

(మత్తయి 20:25-28) కానీ యేసు వాళ్లను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “దేశాల్ని పరిపాలించేవాళ్లు ప్రజలమీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా. 26 మీమధ్య అలా ఉండకూడదు; మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి, 27 మీలో ముందు ఉండాలనుకునేవాడు మీకు దాసుడిగా ఉండాలి. 28 అలాగే మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.”

మత్త 20:26, 28 nwtsty స్టడీ నోట్‌

సేవకుడిగా: లేదా “పరిచారకునిగా.” డయాకొనొస్‌ (di·aʹko·nos) అనే గ్రీకు పదం బైబిల్లో తరచూ కనిపిస్తుంది. ఈ పదం వినయంగా ఇతరులకు సేవచేయడానికి ముందుకొచ్చే వాళ్లను సూచిస్తుంది. ఈ పదం క్రీస్తును (రోమా 15:8), పరిచారకుల్ని లేదా క్రీస్తు పరిచారకుల్ని (1 కొరిం 3:5-7; కొలొ 1:23), సంఘ పరిచారకుల్ని (ఫిలి 1:1; 1 తిమో 3:8), పనివాళ్లను (యోహా 2:5, 9), ప్రభుత్వ అధికారుల్ని (రోమా 13:4) సూచించడానికి ఉపయోగించబడింది.

సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి: లేదా ‘పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి.’

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(మత్తయి 21:9) అంతేకాదు ఆయన ముందు వెళ్తున్న ప్రజలు, ఆయన వెనక వెళ్తున్న ప్రజలు ఇలా అరుస్తూ ఉన్నారు: “దేవా, దావీదు కుమారుడిని కాపాడు! యెహోవా పేరిట వస్తున్న ఈయన దీవెన పొందాలి! పరలోకంలో నివసించే దేవా, ఈయన్ని కాపాడు!”

మత్త 21:9 nwtsty స్టడీ నోట్‌

దేవా, కాపాడు: అక్ష., “హోసన్నా.” “కాపాడమని ప్రార్థిస్తున్నాం” లేదా “దయచేసి కాపాడు” అనే అర్థమున్న హీబ్రూ మాటల నుండి ఈ గ్రీకు పదం వచ్చింది. ఇక్కడ ఈ పదం రక్షణ లేదా విజయం దయచేయమని దేవుణ్ణి వేడుకోవడం కోసం ఉపయోగించబడింది; దీన్ని “దయచేసి రక్షణ ఇవ్వు” అనే అర్థంలో కూడా వాడవచ్చు. కొంతకాలానికి ఈ పదాన్ని ప్రార్థించడానికి అలాగే స్తుతించడానికి ఉపయోగించడం మొదలైంది. ఆ హీబ్రూ మాటలు కీర్త 118:25⁠లో కనిపిస్తాయి, ఆ కీర్తన పస్కా కాలంలో పాడే హల్లెల్‌ కీర్తనల్లో ఒకటి. కాబట్టి ఈ సందర్భంలో ప్రజల మనసులోకి ఈ పదాలు వెంటనే వచ్చాయి. దావీదు కుమారుణ్ణి మృతుల్లో నుండి పునరుత్థానం చేయడం ద్వారా ఒకవిధంగా ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మత్త 21:42⁠లో స్వయంగా యేసే కీర్తన 118:22, 23⁠లోని మాటల్ని చెప్పి, వాటిని మెస్సీయకు అన్వయించాడు.

దావీదు కుమారుడిని: ఈ పదం యేసు పుట్టిన వంశాన్ని, మెస్సీయగా ఆయనకున్న పాత్రను తెలియజేస్తుంది.

(మత్తయి 21:18, 19) పొద్దున్నే నగరానికి తిరిగి వస్తుండగా ఆయనకు ఆకలేసింది. 19 దారిలో ఆయన ఒక అంజూర చెట్టును చూసి దాని దగ్గరికి వెళ్లాడు. అయితే ఆయన దాన్ని చూసినప్పుడు ఆకులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు ఆయన ఆ చెట్టుతో, “ఇంకెప్పుడూ నీకు పండ్లు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూర చెట్టు ఎండిపోయింది.

jy 244 ¶4-6

అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి పాఠం నేర్పించాడు

యేసు ఎందుకు ఆ చెట్టును ఎండిపోయేలా చేశాడు? దానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి యేసు అన్న ఈ మాటల్ని గమనించండి: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీకు విశ్వాసం ఉంటే, మీరు సందేహపడకపోతే ఆ అంజూర చెట్టుకు నేను చేసినదాన్ని మీరు కూడా చేయగలుగుతారు; అంతేకాదు మీరు ఒకవేళ ఈ కొండతో, ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పినా అది జరుగుతుంది. విశ్వాసంతో మీరు వేటికోసం ప్రార్థిస్తారో వాటన్నిటినీ పొందుతారు.” (మత్తయి 21:21, 22) ఆవగింజంత విశ్వాసం కొండను సైతం కదిలించగలదని అంతకుముందు చెప్పిన మాటల్నే యేసు మళ్లీ చెప్పాడు.—మత్తయి 17:20.

కాబట్టి ఆ చెట్టును ఎండిపోయేలా చేయడం ద్వారా, దేవుని మీద విశ్వాసం ఉంచడం గురించి యేసు పాఠం నేర్పిస్తున్నాడు. ఆయనిలా అన్నాడు: “ప్రార్థనలో మీరు అడిగినవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి, అప్పుడు మీరు వాటిని తప్పక పొందుతారు.” (మార్కు 11:24) యేసు అనుచరులందరికీ అది ఎంత చక్కని పాఠమో కదా! మరిముఖ్యంగా అపొస్తలులకు ఆ పాఠం చాలా అవసరం. ఎందుకంటే, వాళ్లు త్వరలోనే ఎన్నో కష్టాల్ని ఎదుర్కోబోతున్నారు. అయితే, ఎండిపోయిన అంజూర చెట్టు ద్వారా యేసు విశ్వాసం గురించి మరో పాఠం నేర్పిస్తున్నాడు.

ఈ అంజూర చెట్టులాగే, ఇశ్రాయేలు జనాంగం కూడా పైకి బాగానే ఉన్నట్లు కనిపించింది. దేవునితో ఒప్పందం చేసుకున్న ప్రజలుగా వాళ్లు పైకి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లు కనిపించారు. కానీ, వాళ్లు ఓ జనాంగంగా విశ్వాసం చూపించలేదు, మంచి ఫలాల్ని ఫలించలేదు. వాళ్లు ఏకంగా దేవుని సొంత కుమారుణ్ణే తిరస్కరించారు! కాబట్టి ఆ చెట్టును ఎండిపోయేలా చేయడం ద్వారా, ఏమాత్రం ఫలించకుండా విశ్వాసం లేకుండా ఉన్న ఆ జనాంగానికి ఏం జరుగుతుందో యేసు చూపించాడు.

చదవాల్సిన బైబిలు భాగం

(మత్తయి 20:1-19) “ఎందుకంటే పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో పనివాళ్లను కూలికి పెట్టుకోవడానికి తెల్లవారుజామునే బయలుదేరిన ఒక ద్రాక్షతోట యజమానిలా ఉంది. 2 రోజుకు ఒక దేనారం ఇస్తానని పనివాళ్లతో మాట్లాడుకున్నాక అతను వాళ్లను తన ద్రాక్షతోటలోకి పంపించాడు. 3 ఉదయం దాదాపు 9 గంటలకు ఆ యజమాని మళ్లీ బయటికి వెళ్లినప్పుడు, పనిదొరక్క సంతలో నిలబడివున్న కొంతమందిని చూసి 4 వాళ్లతో, ‘మీరు కూడా ద్రాక్షతోటలోకి వెళ్లండి, మీకు న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను’ అని చెప్పాడు. 5 దాంతో వాళ్లు వెళ్లారు. అతను మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు అలాగే దాదాపు 3 గంటలకు మళ్లీ బయటికి వెళ్లి అలాగే చేశాడు. 6 చివరిగా అతను, సాయంత్రం దాదాపు 5 గంటలకు బయటికి వెళ్లి, అక్కడ ఖాళీగా నిలబడివున్న కొంతమందిని చూసి, ‘మీరు పనిచేయకుండా రోజంతా ఎందుకు ఇక్కడ నిలబడివున్నారు?’ అని వాళ్లను అడిగాడు. 7 అందుకు వాళ్లు, ‘మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు’ అని చెప్పారు; అప్పుడు అతను వాళ్లతో, ‘మీరు కూడా ద్రాక్షతోటలోకి వెళ్లండి’ అన్నాడు. 8 “సాయంత్రం అయినప్పుడు ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకుడితో ఇలా చెప్పాడు: ‘పనివాళ్లను పిలిచి వాళ్లకు కూలి ఇవ్వు; చివర్లో వచ్చినవాళ్లతో మొదలుపెట్టి, మొదట వచ్చినవాళ్ల వరకు అందరికీ ఇవ్వు.’ 9 5 గంటల నుండి పనిచేసినవాళ్లు వచ్చినప్పుడు, వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో దేనారం పొందారు. 10 కాబట్టి రోజంతా పనిచేసినవాళ్లు వచ్చినప్పుడు, వాళ్లు తమకు ఎక్కువ కూలి వస్తుందని అనుకున్నారు. అయితే వాళ్లు కూడా ఒక్క దేనారం మాత్రమే పొందారు. 11 వాళ్లు అది తీసుకుని, ద్రాక్షతోట యజమాని మీద సణగడం మొదలుపెట్టారు. 12 వాళ్లు ఇలా అన్నారు: ‘చివర వచ్చిన వీళ్లు ఒక్క గంటే పనిచేశారు; అయినా ఎండలో రోజంతా కష్టపడి పనిచేసిన మమ్మల్ని వీళ్లతో సమానం చేశావు!’ 13 కానీ ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నువ్వు నా దగ్గర ఒక దేనారానికి ఒప్పుకున్నావు కదా? 14 నీ కూలి తీసుకుని నువ్వు వెళ్లు. చివర్లో వచ్చిన వీళ్లకు కూడా, నీకు ఇచ్చినంతే ఇవ్వాలని అనుకుంటున్నాను. 15 నా డబ్బుతో నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు లేదా? లేక, నేను మంచిపని చేసినందుకు నీకు అసూయగా ఉందా?’ 16 అలా, ముందున్నవాళ్లు వెనక్కి వెళ్తారు, వెనకున్నవాళ్లు ముందుకు వస్తారు.” 17 యేసు యెరూషలేముకు వెళ్తుండగా, దారిలో 12 మంది శిష్యుల్ని పక్కకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: 18 ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధిస్తారు; 19 ఆయన్ని ఎగతాళి చేసి, కొరడాలతో కొట్టి, కొయ్యమీద వేలాడదీయడానికి అన్యులకు అప్పగిస్తారు. కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతికించబడతాడు.”

మార్చి 12-18

దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 22-23

“రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించండి”

(మత్తయి 22:36-38) “బోధకుడా, ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” 37 ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ 38 ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా.

మత్త 22:37 nwtsty స్టడీ నోట్‌

హృదయంతో: సూచనార్థక భావంలో ఉపయోగించినప్పుడు, ఈ పదం ఒక వ్యక్తి అంతరంగాన్ని సూచిస్తుంది. ప్రాణం, మనసు వంటి పదాలతో కలిసి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి భావోద్వేగాల్ని, కోరికల్ని, భావాల్ని సూచిస్తుంది. ఇక్కడ ఉపయోగించిన మూడు పదాలు (హృదయం, ప్రాణం, మనసు) ఒకదానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు విషయాలు కాదు, మూడింటి అర్థం కలగలిసి ఉంటుంది. దేవుని పట్ల పూర్తి ప్రేమను చూపించాలని శ్రేష్ఠమైన పద్ధతిలో తెలియజేయడానికే ఆ మూడు పదాల్ని ఉపయోగించారు

ప్రాణంతో: లేదా “పూర్తి వ్యక్తి.”

మనసుతో: అంటే ఆలోచన, అవగాహన సామర్థ్యం. దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన పట్ల ప్రేమను పెంచుకోవడానికి ఒక వ్యక్తి తన ఆలోచన, అవగాహన సామర్థ్యాన్ని ఉపయోగించాలి. (యోహా 17:3; రోమా 12:1) ద్వితీ 6:5 నుండి ఎత్తి చెప్పిన ఈ వాక్యం అసలు హీబ్రూ ప్రతిలో ‘హృదయం, ప్రాణం, బలం’ అనే అర్థమున్న మూడు పదాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే గ్రీకు భాషలోని మత్తయి సువార్తలో, “బలం” అనే పదానికి బదులు “మనసు” అనే పదం ఉపయోగించారు. ఇలా వేర్వేరు పదాల్ని ఉపయోగించడానికి చాలా కారణాలున్నాయి. ఆదిమ హీబ్రూ భాషలో “మనసు” అనే మాటకు ప్రత్యేకంగా ఒక పదమేమీ లేకపోయినా, దాని భావం “హృదయం” అనే హీబ్రూ పదంలో వచ్చేస్తుంది. సూచనార్థక భావంలో ఉపయోగించినప్పుడు ఈ పదం ఒక వ్యక్తి పూర్తి అంతరంగాన్ని అంటే అతని ఆలోచనల్ని, భావోద్వేగాల్ని, వైఖరిని, ఉద్దేశాల్ని సూచిస్తుంది. (ద్వితీ 29:4; కీర్త 26:2; 64:6; ఈ వచనానికి సంబంధించిన హృదయం అనే స్టడీ నోట్‌ చూడండి.) ఈ కారణం వల్లే, హీబ్రూలో “హృదయం” అనే పదం ఉపయోగించిన చోట, గ్రీకు సెప్టువజింటు గ్రీకు భాషలో దాని పూర్తి అర్థాన్ని తెలియజేసే “మనసు” అనే పదం ఉపయోగించారు. (ఆది 8:21; 17:17; సామె 2:10; యెష 14:13) ద్వితీ 6:5ను ఎత్తి చెప్తున్నప్పుడు మత్తయి “బలం” అనే మాటకు బదులు “మనసు” అనే గ్రీకు పదాన్ని ఉపయోగించడానికి మరో కారణం, హీబ్రూలోని “బలం, [లేదా, “శక్తి” అధస్సూచి.]” అనే పదం భౌతిక బలాన్ని, అలాగే ఆలోచన, అవగాహన సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది. ఏదేమైనా హీబ్రూ, గ్రీకు పదాల భావాల్లోని సారూప్యతలు ద్వితీయోపదేశకాండమును ఎత్తి చెప్తున్నప్పుడు సువార్త రచయితలు ఎందుకు ఒకే పదాల్ని ఉపయోగించలేదో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి.

(మత్తయి 22:39) రెండో ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అదేమిటంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’

మత్త 22:39 nwtsty స్టడీ నోట్‌

రెండో ఆజ్ఞ: మత్త 22:37⁠లో పరిసయ్యుని ప్రశ్నకు యేసు ఇచ్చిన సూటైన జవాబు ఉంది, అయితే యేసు అతను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడంతో పాటు, రెండో ఆజ్ఞను కూడా ఎత్తి చెప్తున్నాడు (లేవీ 19:18), అలా రెండో ఆజ్ఞను కూడా చెప్పడం ద్వారా ఆ రెండు ఆజ్ఞల్ని వేర్వేరుగా విడదీయలేం అని; మొత్తం ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలకు ఆధారం ఆ రెండు ఆజ్ఞలేనని తెలియజేశాడు.

సాటిమనిషి: “సాటిమనిషి” (అక్ష., “దగ్గర్లోని వ్యక్తి”) అనే గ్రీకు పదం కేవలం దగ్గర్లో నివసించే వాళ్లను మాత్రమే సూచించదు. ఒక వ్యక్తి కలుసుకునే ఎవరినైనా అది సూచిస్తుంది.—లూకా 10:29-37; రోమా 13:8-10.

(మత్తయి 22:40) ఈ రెండు ఆజ్ఞలే మొత్తం ధర్మశాస్త్రానికి, ప్రవక్తల పుస్తకాలకు ఆధారం.”

మత్త 22:40 nwtsty స్టడీ నోట్‌

మొత్తం ధర్మశాస్త్రానికి, ప్రవక్తల పుస్తకాలకు: “ధర్మశాస్త్రం” అంటే ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకున్న పుస్తకాలు. “ప్రవక్తల పుస్తకాలు” అంటే హీబ్రూ లేఖనాల్లోని ప్రవచన పుస్తకాలు. అయితే, ఈ పదాల్ని కలిపి ఉపయోగించినప్పుడు అవి, హీబ్రూ లేఖనాలన్నిటినీ సూచిస్తాయి.—మత్త 7:12; 22:40; లూకా 16:16.

ఆధారం: అక్షరార్థంగా ‘వేలాడుతున్నాయి’ అని అర్థం వచ్చే గ్రీకు పదాన్ని ఇక్కడ, సూచనార్థక భావంలో “ఆధారం” అనే అర్థాన్ని సూచించడం కోసం ఉపయోగించారు. అలా యేసు, కేవలం పది ఆజ్ఞలున్న ధర్మశాస్త్రమే కాదు, హీబ్రూ లేఖనాలన్నిటికీ ఆధారం ప్రేమే అని తెలియజేశాడు.—రోమా 13:9.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(మత్తయి 22:21) దానికి వాళ్లు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన వాళ్లతో, “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని చెప్పాడు.

మత్త 22:21 nwtsty స్టడీ నోట్‌

కైసరువి కైసరుకు: యేసు ఇచ్చిన ఈ జవాబు మత్తయి సువార్తతో పాటు, మార్కు 12:17, లూకా 20:25⁠లో కూడా కనిపిస్తుంది. రోమా అధిపతి గురించి యేసు మాట్లాడినట్టుగా నమోదైన ఏకైక మాట ఇదొక్కటే. “కైసరువి” అంటే, ప్రభుత్వ సేవలకు చెల్లించాల్సిన డబ్బు, అలాగే అలాంటి ప్రభుత్వ అధికారుల పట్ల చూపించాల్సిన గౌరవం, విధేయత.—రోమా 13:1-7.

దేవునివి దేవునికి: అంటే, ఒకరు నిండు హృదయంతో చేసే ఆరాధన, నిండు ప్రాణంతో చూపించే ప్రేమ, పూర్తి విశ్వసనీయ విధేయత.—మత్త 4:10; 22:37, 38; అపొ 5:29; రోమా 14:8.

(మత్తయి 23:24) గుడ్డి మార్గదర్శకులారా! మీరు దోమను వడగడతారు కానీ ఒంటెను మింగేస్తారు.

మత్త 23:24 nwtsty స్టడీ నోట్‌

దోమను వడగడతారు కానీ ఒంటెను మింగేస్తారు: ఇశ్రాయేలీయులు అపవిత్రంగా చూసే ప్రాణుల్లో దోమ అతి చిన్నది, ఒంటె అతి పెద్దది. (లేవీ 11:4, 21-24) ఇక్కడ యేసు మతనాయకుల గురించి అతిశయోక్తిగా, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆచారం ప్రకారం పవిత్రంగా ఉండడానికి వాళ్లు తాగేవాటిలో చిన్న దోమ కూడా లేకుండా వడగడతారు, అయితే ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఒంటెను మింగినంత పని చేస్తారు.

చదవాల్సిన బైబిలు భాగం

(మత్తయి 22:1-22) యేసు మళ్లీ ఉదాహరణలు ఉపయోగిస్తూ ఇలా అన్నాడు: 2 “పరలోక రాజ్యాన్ని, తన కొడుకు పెళ్లి విందు ఏర్పాటు చేసిన రాజుతో పోల్చవచ్చు. 3 పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లను పిలవడానికి రాజు తన దాసుల్ని పంపించాడు, కానీ వాళ్లు రావడానికి ఇష్టపడలేదు. 4 మళ్లీ అతను వేరే దాసుల్ని పంపిస్తూ ఇలా అన్నాడు: ‘“ఇదిగో! నేను విందు సిద్ధం చేశాను. ఎడ్లు, కొవ్విన జంతువులు వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెళ్లి విందుకు రండి” అని వాళ్లకు చెప్పండి.’ 5 కానీ ఆహ్వానితులు దాన్ని లెక్కచేయకుండా ఒకరు తన పొలానికి, ఇంకొకరు తన వ్యాపారం చూసుకోవడానికి వెళ్లిపోయారు; 6 మిగతావాళ్లు ఆ దాసుల్ని పట్టుకొని కొట్టి, చంపేశారు. 7 “దాంతో రాజుకు చాలా కోపమొచ్చి, తన సైన్యాల్ని పంపి ఆ హంతకుల్ని చంపించి, వాళ్ల నగరాన్ని తగులబెట్టించాడు. 8  తర్వాత రాజు తన దాసులకు ఇలా చెప్పాడు: ‘పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ ఆహ్వానితులు అందుకు అర్హులు కారు. 9 కాబట్టి, మీరు నగరం బయట దారుల్లోకి వెళ్లి, ఎవరు కనిపిస్తే వాళ్లను ఈ విందుకు పిలవండి.’ 10 ఆ దాసులు రాజు చెప్పినట్టే వెళ్లి, మంచివాళ్లు చెడ్డవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వాళ్లందర్నీ సమకూర్చారు; దాంతో పెళ్లి జరుగుతున్న ఇల్లంతా భోజనం చేసేవాళ్లతో నిండిపోయింది. 11 “రాజు తన అతిథుల్ని చూడడానికి వచ్చినప్పుడు, పెళ్లి వస్త్రం వేసుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి కనిపించాడు. 12 కాబట్టి, రాజు అతన్ని ‘నువ్వు పెళ్లి వస్త్రం వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతని దగ్గర జవాబు లేదు. 13 అప్పుడు రాజు తన సేవకులకు ఇలా చెప్పాడు: ‘ఇతని కాళ్లూచేతులు కట్టేసి బయట చీకట్లో పారేయండి. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.’ 14 “ఆహ్వానితులు చాలామంది ఉన్నారు కానీ ఎంచుకోబడినవాళ్లు కొంతమందే.” 15 తర్వాత పరిసయ్యులు వెళ్లి, ఆయన మాటల్లో తప్పు పట్టుకోవడానికి కుట్రపన్నారు. 16 కాబట్టి వాళ్లు తమ శిష్యుల్ని, అలాగే హేరోదు అనుచరుల్ని ఆయన దగ్గరికి పంపించి, ఇలా అడిగించారు: “బోధకుడా, నువ్వు ఎప్పుడూ సత్యమే మాట్లాడతావనీ, దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావనీ మాకు తెలుసు. అలాగే నువ్వు ఎవరి మెప్పూ కోరవని కూడా మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు మనుషుల హోదా పట్టించుకోవు. 17 అయితే మాకు ఓ విషయం చెప్పు, కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా?” 18 కానీ యేసు వాళ్ల దుష్టత్వాన్ని పసిగట్టి ఇలా అన్నాడు: “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు? 19 మీరు పన్ను కట్టడానికి ఉపయోగించే ఒక నాణేన్ని తీసుకొచ్చి నాకు చూపించండి.” అప్పుడు వాళ్లు ఒక దేనారాన్ని తీసుకొచ్చి చూపించారు. 20 ఆయన, “దీని మీదున్న బొమ్మ, బిరుదు ఎవరివి?” అని వాళ్లను అడిగాడు. 21 దానికి వాళ్లు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన వాళ్లతో, “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని చెప్పాడు. 22 అది విన్నప్పుడు వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయి, ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు.

మార్చి 19-25

దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 24

“చివరిరోజుల్లో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి”

(మత్తయి 24:12) చెడుతనం పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రేమ చల్లారిపోతుంది.

it-2 279 ¶6

ప్రేమ

ప్రేమ చల్లారిపోయే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి శిష్యులకు చెప్తూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునే చాలామంది ప్రేమ (అగాపే) చల్లారిపోతుంది అని అన్నాడు. (మత్త 24:3, 12) అపొస్తలుడైన పౌలు ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయని చెప్తూ, మనుషులు “డబ్బును ప్రేమించేవాళ్లు” అవుతారని చెప్పాడు. (2 తిమో 3:1, 2) అంటే, ఒక వ్యక్తి నీతి సూత్రాల్ని మరచిపోవడం, ఒకప్పుడు తనకు ఉన్న సరైన ప్రేమను కోల్పోవడం జరిగే అవకాశం ఉందని స్పష్టమౌతోంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సూత్రాలకు తగ్గట్టు జీవితాన్ని మార్చుకుంటూ ప్రేమను పెంచుకోవడానికి ఎల్లప్పుడూ కృషిచేస్తూ ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇది తెలియజేస్తుంది.—ఎఫె. 4:15, 22-24.

(మత్తయి 24:39) జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.

w99 11/15 19 ¶5

దేవునిపట్ల మీ విధిని మీరు నిర్వర్తిస్తున్నారా?

5 యేసుక్రీస్తు మన ఈ క్లిష్టమైన కాలాల గురించి ఇలా చెప్పాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:37-39) మితంగా ఉన్నంత వరకు తినటంలోను, త్రాగటంలోను తప్పేమీ లేదు, ఇక వివాహం విషయానికి వస్తే అది దేవుడే స్థాపించిన ఒక ఏర్పాటు. (ఆదికాండము 2:20-24) అయితే, జీవితంలోని సాధారణ కార్యకలాపాలు మన అతిగొప్ప చింతలుగా మారిపోయాయని మనం గ్రహించినట్లైతే, ఈ విషయం గురించి ఎందుకు ప్రార్థించకూడదు? మనం రాజ్యాసక్తులను ముందుంచటానికి యెహోవా సహాయం చేయగలడు, అలాగే సరైనదేదో చేయటానికీ ఆయనపట్ల మన విధిని నిర్వర్తించటానికీ కూడా ఆయన మనకు సహాయం చేయగలడు.—మత్తయి 6:33; రోమీయులు 12:12; 2 కొరింథీయులు 13:7.

(మత్తయి 24:44) కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.

jy 259 ¶5

అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు

తన శిష్యులు అప్రమత్తంగా, మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు హెచ్చరిస్తున్నాడు. అలా ఉండడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఆయన మరో ఉదాహరణ చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాత్రి ఏ సమయంలో దొంగ వస్తున్నాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే, అతను మెలకువగా ఉండి ఆ దొంగను ఇంట్లో జొరబడనివ్వడు. కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.”—మత్తయి 24:43, 44.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(మత్తయి 24:8) ఇవన్నీ పురిటి నొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.

మత్త 24:8 nwtsty స్టడీ నోట్‌

పురిటి నొప్పుల లాంటి వేదనలకు: ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం అక్షరార్థంగా, ప్రసవించేటప్పుడు కలిగే తీవ్రమైన నొప్పుల్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ మాట వేదనలు, నొప్పులు, బాధల గురించే మాట్లాడినా, మత్త 24:21⁠లో చెప్పిన మహాశ్రమకు ముందు రాబోయే కష్టాలు, బాధలు మళ్లీమళ్లీ వస్తుంటాయి, తీవ్రంగా ఉంటాయి అని తెలియజేస్తోంది.

(మత్తయి 24:20) మీరు చలికాలంలోనో, విశ్రాంతి రోజునో పారిపోవాల్సి రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి;

మత్త 24:20 nwtsty స్టడీ నోట్‌

చలికాలంలోనో: భారీ వర్షాలు, వరదలు, చలి వాతావరణం వల్ల ఈ కాలంలో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది, అలాగే ఆహారం, వసతి దొరకడం కూడా చాలాకష్టం.—ఎజ్రా 10:9, 13.

విశ్రాంతి రోజునో: యూదయ లాంటి ప్రాంతాల్లో, విశ్రాంతి రోజున ఎక్కువ దూరాలు ప్రయాణించడం, బరువులు మోసుకెళ్లడం నిషేధం, అలాగే ఆ రోజున నగర ద్వారాలను కూడా మూసి ఉంచేవాళ్లు.—అపొ 1:12; దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి పుస్తకంలోని 16వ భాగం చూడండి.

చదవాల్సిన బైబిలు భాగం

(మత్తయి 24:1-22) యేసు ఆలయం నుండి వెళ్లిపోతుండగా, ఆయన శిష్యులు ఆలయ కట్టడాలు చూపించడానికి ఆయన దగ్గరికి వచ్చారు. 2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా? నేను నిజంగా మీతో చెప్తున్నాను, రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా ఇవి పడద్రోయబడతాయి.” 3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, “ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి? మాతో చెప్పు” అని అడిగారు. 4 అప్పుడు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “ఎవరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి. 5 ఎందుకంటే చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పుకుంటూ ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు. 6 మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. అప్పుడు మీరు కంగారుపడకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు. 7 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి. 8 ఇవన్నీ పురిటి నొప్పుల లాంటి వేదనలకు ఆరంభం. 9  “అప్పుడు ప్రజలు మిమ్మల్ని హింసించి, చంపుతారు. నా శిష్యులుగా ఉన్నందుకు మీరు అన్ని దేశాల ప్రజల చేత ద్వేషించబడతారు. 10 అంతేకాదు చాలామంది దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతారు; ఒకరినొకరు అప్పగించుకుంటారు, ద్వేషించుకుంటారు. 11 చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి, ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు; 12 చెడుతనం పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రేమ చల్లారిపోతుంది. 13 కానీ అంతం వరకు సహించిన వాళ్లే రక్షించబడతారు. 14 అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది. 15 “కాబట్టి దానియేలు ప్రవక్త చెప్పినట్టు, నాశనాన్ని కలుగజేసే అసహ్యమైన వస్తువు పవిత్ర స్థలంలో ఉండడం మీరు చూసినప్పుడు (చదివే వ్యక్తి వివేచన ఉపయోగించాలి), 16 యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి. 17 డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో నుండి వస్తువులు తెచ్చుకోవడానికి కిందికి దిగకూడదు. 18 పొలంలో ఉన్న వ్యక్తి తన పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు. 19 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ! 20 మీరు చలికాలంలోనో, విశ్రాంతి రోజునో పారిపోవాల్సి రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి; 21 ఎందుకంటే, అప్పుడు మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు, ఆ తర్వాత మళ్లీ రాదు. 22 నిజానికి, ఆ రోజులు తగ్గించబడకపోతే ఒక్కరు కూడా తప్పించుకోలేరు; అయితే, ఎంచుకోబడిన వాళ్ల కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.

మార్చి 26– ఏప్రిల్‌ 1

దేవుని వాక్యంలో ఉన్న సంపద|మత్తయి 25

“అప్రమత్తంగా ఉండండి”

(మత్తయి 25:1-6) “అంతేకాదు, పరలోక రాజ్యమును దీపాలు పట్టుకొని పెళ్లికొడుకును కలవడానికి వెళ్లిన పదిమంది కన్యలతో పోల్చవచ్చు. 2 వాళ్లలో ఐదుగురు బుద్ధిలేని వాళ్లు, ఐదుగురు బుద్ధిగల వాళ్లు. 3 బుద్ధిలేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు కానీ అదనంగా నూనె తీసుకెళ్లలేదు. 4 అయితే బుద్ధిగల కన్యలు దీపాలతో పాటు బుడ్డీల్లో నూనె కూడా తీసుకెళ్లారు. 5 పెళ్లికొడుకు ఆలస్యం చేసేసరికి వాళ్లంతా కునికిపాట్లు పడి, నిద్రపోయారు. 6 సరిగ్గా మధ్యరాత్రి, ‘పెళ్లికొడుకు వచ్చేస్తున్నాడు! ఆయన్ని కలవడానికి వెళ్లండి’ అనే కేక వినిపించింది.

(మత్తయి 25:7-10) అప్పుడు ఆ కన్యలందరూ లేచి, తమ దీపాల్ని సిద్ధం చేసుకున్నారు. 8 బుద్ధిలేని కన్యలు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ దగ్గరున్న నూనెలో కొంచెం మాకు ఇవ్వండి’ అని బుద్ధిగల కన్యల్ని అడిగారు. 9 అప్పుడు బుద్ధిగల కన్యలు, ‘ఈ నూనె మనందరికీ సరిపోదేమో. మీరు నూనె అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్లి కొనుక్కోండి’ అన్నారు. 10 వాళ్లు కొనుక్కోవడానికి వెళ్తూ ఉండగా, పెళ్లికొడుకు వచ్చేశాడు. సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు, తర్వాత తలుపులు మూయబడ్డాయి.

(మత్తయి 25:11, 12) ఆ తర్వాత మిగతా ఐదుగురు కన్యలు కూడా వచ్చి, ‘అయ్యా, అయ్యా, మా కోసం తలుపు తెరువు!’ అన్నారు. 12 అప్పుడు పెళ్లికొడుకు, ‘నిజం చెప్తున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(మత్తయి 25:31-33) “మానవ కుమారుడు తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుంటాడు. 32 అప్పుడు అన్నిదేశాల వాళ్లు ఆయన ముందు సమకూర్చబడతారు. గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెల్ని వేరుచేసినట్టు, ప్రజల్ని ఆయన రెండు గుంపులుగా వేరుచేస్తాడు. 33 గొర్రెల్ని తన కుడివైపున, మేకల్ని తన ఎడమవైపున ఉంచుతాడు.

w15 3/15 27 ¶7

క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

7 యేసు చెప్పిన గొర్రెలు-మేకల ఉపమానాన్ని మనకాలంలో మరిత స్పష్టంగా అర్థం చేసుకున్నాం. “మనుష్యకుమారుడు” లేదా “రాజు” యేసనీ, రాజు “సహోదరులు” పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే స్త్రీపురుషులనీ మనకు తెలుసు. (రోమా. 8:16, 17) “గొర్రెలు,” “మేకలు” అన్ని దేశాల ప్రజల్ని సూచిస్తున్నాయి. మహాశ్రమల ముగింపులో యేసు వాళ్లకు తీర్పుతీరుస్తాడు. అవి త్వరలోనే మొదలౌతాయి. అలాగే, భూమ్మీద జీవిస్తున్న అభిషిక్తులకు మద్దతిస్తారా లేదా అనే దాన్నిబట్టే ప్రజలు తీర్పు పొందుతారని మనం తెలుసుకున్నాం. కాలం గడిచేకొద్దీ, ఈ ఉపమానంతోపాటు మత్తయి 24, 25 అధ్యాయాల్లో ఉన్న ఇతర ఉపమానాల్ని అర్థంచేసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తున్నందుకు ఎంతో కృతజ్ఞులం.

(మత్తయి 25:40) అప్పుడు రాజు వాళ్లతో ఇలా అంటాడు: ‘నేను మీతో నిజంగా చెప్తున్నాను, ఈ నా సోదరుల్లో అందరికన్నా తక్కువవాడికి మీరు చేసిందేదైనా నాకు చేసినట్టే.’

w09 10/15 16 ¶16-18

‘మీరు నా స్నేహితులు’

16 మీరు దేవుని రాజ్యంలో భూమ్మీద జీవించాలని కోరుకుంటున్నట్లైతే క్రీస్తు సహోదరులతో స్నేహం చేస్తున్నట్లు ఎలా చూపించవచ్చు? క్రీస్తు సహోదరులతో స్నేహం చేస్తున్నట్లు చూపించే అనేక విధానాల్లో మూడు విధానాలను ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ప్రకటనా పనిలో మనస్ఫూర్తిగా పాల్గొనాలి. ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించమని క్రీస్తు తన సహోదరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14) అయితే, వేరేగొర్రెల మద్దతు లేకపోతే క్రీస్తు సహోదరుల్లో నేడు భూమ్మీద శేషించినవారికి అది శక్తికి మించిన పనే అవుతుంది. వేరేగొర్రెలకు చెందినవారు ప్రకటనా పనిలో పొల్గొన్న ప్రతీసారి క్రీస్తు సహోదరులు చేయాల్సిన పవిత్ర పనిలో వారికి చేయూతనిస్తారు. స్నేహం కోసం వారు చేస్తున్న ఆ సహాయాన్ని క్రీస్తు, ఆయన దాసుని తరగతి వారు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు.

17 రెండవదిగా, ప్రకటనా పనికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా వేరేగొర్రెలు దాసుని తరగతికి సహాయం చేయవచ్చు. “అన్యాయపు సిరివలన” స్నేహితులను సంపాదించుకోమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (లూకా 16:9) యెహోవా, యేసు స్నేహాన్ని డబ్బుతో కొనగలమని దానర్థం కాదు. బదులుగా దేవుని రాజ్యం కోసం భూమ్మీదున్న సంఘ పని కోసం మన వస్తు సంపదలను ఉపయోగించడం ద్వారా మనం మన స్నేహాన్ని ప్రేమను మాటల్లోనే కాదు ‘క్రియలతోను సత్యముతోను’ చూపిస్తాం. (1 యోహా. 3:16-18) మనం ప్రకటనా పని కోసం డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు, ఆరాధనా స్థలాల నిర్మాణానికి, నిర్వాహణకు, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి విరాళాలు ఇచ్చినప్పుడు మనం అలాంటి ఆర్థిక సహాయాన్ని చేస్తాం. మనం ఇచ్చేది ఎంతైనా సంతోషంగా ఇస్తే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు నిజంగా మెచ్చుకుంటారు.—2 కొరిం. 9:7.

18 మూడవదిగా, సంఘ పెద్దల నిర్దేశాలను పాటించడం ద్వారా మనమంతా క్రీస్తు స్నేహితులమని చూపించవచ్చు. ఈ పెద్దలు క్రీస్తు నిర్దేశంలో పరిశుద్ధాత్మచేత నియమించబడతారు. (ఎఫె. 5:23) ‘మీపైని నాయకులుగా ఉన్నవారి మాట విని, వారికి లోబడియుండుడి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 13:17) సంఘ పెద్దలు ఇచ్చే బైబిలు నిర్దేశాన్ని పాటించడం కొన్నిసార్లు మనకు కష్టమనిపించవచ్చు. మనకు వారి బలహీనతలు తెలిసివుండవచ్చు కాబట్టి వారి ఉపదేశాన్ని తప్పుగా భావించే అవకాశముంది. కానీ, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ఈ అపరిపూర్ణ మానవులను పెద్దలుగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వారి అధికారానికి మనం స్పందించే తీరు క్రీస్తుతో మనకున్న స్నేహాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దల లోపాలను పట్టించుకోకుండా వారి నిర్దేశాలను సంతోషంగా పాటించినప్పుడు క్రీస్తును ప్రేమిస్తున్నామని చూపిస్తాం.

చదవాల్సిన బైబిలు భాగం

(మత్తయి 25:1-23) “అంతేకాదు, పరలోక రాజ్యమును దీపాలు పట్టుకొని పెళ్లికొడుకును కలవడానికి వెళ్లిన పదిమంది కన్యలతో పోల్చవచ్చు. 2 వాళ్లలో ఐదుగురు బుద్ధిలేని వాళ్లు, ఐదుగురు బుద్ధిగల వాళ్లు. 3 బుద్ధిలేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు కానీ అదనంగా నూనె తీసుకెళ్లలేదు. 4 అయితే బుద్ధిగల కన్యలు దీపాలతో పాటు బుడ్డీల్లో నూనె కూడా తీసుకెళ్లారు. 5 పెళ్లికొడుకు ఆలస్యం చేసేసరికి వాళ్లంతా కునికిపాట్లు పడి, నిద్రపోయారు. 6 సరిగ్గా మధ్యరాత్రి, ‘పెళ్లికొడుకు వచ్చేస్తున్నాడు! ఆయన్ని కలవడానికి వెళ్లండి’ అనే కేక వినిపించింది. 7 అప్పుడు ఆ కన్యలందరూ లేచి, తమ దీపాల్ని సిద్ధం చేసుకున్నారు. 8 బుద్ధిలేని కన్యలు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ దగ్గరున్న నూనెలో కొంచెం మాకు ఇవ్వండి’ అని బుద్ధిగల కన్యల్ని అడిగారు. 9 అప్పుడు బుద్ధిగల కన్యలు, ‘ఈ నూనె మనందరికీ సరిపోదేమో. మీరు నూనె అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్లి కొనుక్కోండి’ అన్నారు. 10 వాళ్లు కొనుక్కోవడానికి వెళ్తూ ఉండగా, పెళ్లికొడుకు వచ్చేశాడు. సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు, తర్వాత తలుపులు మూయబడ్డాయి. 11 ఆ తర్వాత మిగతా ఐదుగురు కన్యలు కూడా వచ్చి, ‘అయ్యా, అయ్యా, మా కోసం తలుపు తెరువు!’ అన్నారు. 12 అప్పుడు పెళ్లికొడుకు, ‘నిజం చెప్తున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. 13 “కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు. 14 “అంతేకాదు పరలోక రాజ్యాన్ని, దూర దేశానికి వెళ్లబోయే ముందు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అప్పగించిన వ్యక్తితో పోల్చవచ్చు. 15 అతను వాళ్లవాళ్ల సామర్థ్యాలకు తగ్గట్టుగా ఒకరికి ఐదు తలాంతులు, ఇంకొకరికి రెండు తలాంతులు, మరొకరికి ఒక తలాంతు ఇచ్చి వెళ్లిపోయాడు. 16 వెంటనే, ఐదు తలాంతులు పొందిన దాసుడు వెళ్లి, వాటితో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. 17 అలాగే, రెండు తలాంతులు పొందిన వ్యక్తి ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు. 18 అయితే ఒకేఒక్క తలాంతు పొందిన వ్యక్తి మాత్రం వెళ్లి, గుంట తవ్వి, తన యజమాని డబ్బును అందులో దాచిపెట్టాడు. 19 “చాలాకాలం తర్వాత యజమాని వచ్చి, ఆ దాసులు తన డబ్బుతో ఏమి చేశారో పరిశీలించాడు. 20 ఐదు తలాంతులు పొందిన వ్యక్తి ముందుకు వచ్చి ఇంకో ఐదు తలాంతులు చూపించి, ‘అయ్యా, నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు; ఇదిగో, నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. 21 అప్పుడు యజమాని అతనితో ‘శభాష్‌, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు’ అన్నాడు. 22 ఆ తర్వాత రెండు తలాంతులు పొందిన వ్యక్తి ముందుకొచ్చి, ‘అయ్యా, నువ్వు నాకు రెండు తలాంతులు ఇచ్చావు; ఇదిగో, నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అన్నాడు. 23 అప్పుడు యజమాని అతనితో ‘శభాష్‌, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు’ అన్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి