సోమవారం, అక్టోబరు 27
“భర్తలు . . . తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి.”—ఎఫె. 5:28.
భర్త భార్యను ప్రేమించాలని, ఆమె అవసరాల్ని చూసుకోవాలని, ఆమెకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలని, ఆమెకు దేవునితో ఉన్న స్నేహాన్ని కాపాడాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఆలోచనా సామర్థ్యం, ఆడవాళ్లను గౌరవించడం, నమ్మకస్థులుగా ఉండడం మిమ్మల్ని ఒక మంచి భర్తగా చేస్తాయి. మీకు పెళ్లయ్యాక మీరొక తండ్రి అవ్వొచ్చు. ఒక మంచి తండ్రిగా ఉండడం గురించి యెహోవా నుండి ఏం నేర్చుకోవచ్చు? (ఎఫె. 6:4) యెహోవా తన కుమారుడైన యేసుతో తనని ప్రేమిస్తున్నానని, తనను చూసి సంతోషిస్తున్నానని చెప్పాడు. (మత్త. 3:17) ఒకవేళ మీరు ఒక తండ్రైతే, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్తూ ఉండండి. వాళ్లు చేసే మంచి పనుల్ని ఎక్కువగా మెచ్చుకోండి. యెహోవాను ఆదర్శంగా తీసుకున్న తండ్రులు, తమ పిల్లలు పరిణతిగల సహోదరులుగా, సహోదరీలుగా ఎదగడానికి సహాయం చేస్తారు. భవిష్యత్తులో పొందే ఆ బాధ్యతల కోసం మీరిప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? మీ కుటుంబం మీద, సంఘంలో ఉన్నవాళ్ల మీద శ్రద్ధ చూపించండి. వాళ్లను ప్రేమిస్తున్నారని, వాళ్లను చూసి సంతోషిస్తున్నారని చెప్పండి.—యోహా. 15:9. w23.12 28-29 ¶17-18
మంగళవారం, అక్టోబరు 28
“నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది [యెహోవాయే].”—యెష. 33:6.
ఈ లోకంలో అందరికీ వచ్చే కష్టాలకు, ఇబ్బందులకు యెహోవా నమ్మకమైన సేవకులు అతీతులేమి కాదు. దానికితోడు వాళ్లు హింస, వ్యతిరేకత కూడా ఎదుర్కోవాలి. అయితే, మనకు కష్టాలు రాకుండా చేస్తానని యెహోవా మాట ఇవ్వట్లేదు గానీ మనకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. (యెష. 41:10) ఆయన సహాయంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉండవచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆయనకు నమ్మకంగా ఉండవచ్చు. “దేవుని శాంతి” అని బైబిలు అంటున్న దాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (ఫిలి. 4:6, 7) దేవుని శాంతి అంటే, మనం ఆయనతో దగ్గరి సంబంధం కలిగివుండడం వల్ల వచ్చే ప్రశాంతత, నెమ్మది. ఈ శాంతి “మానవ అవగాహనకు మించినది,” మన ఊహలకు-ఆలోచనలకు అతీతమైనది. దాన్ని మాటల్లో వర్ణించలేం. ఉదాహరణకు, మీరు యెహోవాకు తీవ్రంగా ప్రార్థించిన తర్వాత మీకు వచ్చిన ప్రశాంతతను బట్టి ఆశ్చర్యపోయారా? అదే “దేవుని శాంతి.” w24.01 20 ¶2; 21 ¶4
బుధవారం, అక్టోబరు 29
“నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన పేరును స్తుతించు.”—కీర్త. 103:1.
దేవుని నమ్మకమైన సేవకులు ఆయన మీదున్న ప్రేమ వల్ల ఆయన పేరును నిండుహృదయంతో స్తుతిస్తారు. రాజైన దావీదు యెహోవా పేరును స్తుతించడం అంటే యెహోవాను స్తుతించడం అనే విషయం అర్థం చేసుకున్నాడు. మనం యెహోవా పేరు గురించి ఆలోచించినప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన అద్భుతమైన లక్షణాలు, ఆయన గొప్ప పనులు గుర్తొస్తాయి. దావీదు యెహోవా పేరును పవిత్రంగా ఎంచి, దాన్ని స్తుతించాలి అనుకున్నాడు. తనలో ఉన్న ‘సమస్తాన్ని’ అంటే నిండుహృదయంతో యెహోవాను స్తుతించాలని కోరుకున్నాడు. లేవీయులు కూడా యెహోవాను స్తుతించే విషయంలో అలాంటి స్ఫూర్తినే చూపించారు. యెహోవా పవిత్రమైన పేరును స్తుతించడానికి తమ పెదాలు పలికే మాటలు సరిపోవని వినయంగా ఒప్పుకున్నారు. (నెహె. 9:5) అలా వినయంగా, మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు యెహోవా ఎంతో మురిసిపోతాడు. w24.02 9 ¶6