మనమెలా ఆరాధించినా దేవునికి నచ్చుతుందా?
చాలామంది ఏమంటారంటే . . .
▪ “మతాలన్నీ దేవుని దగ్గరకే నడిపిస్తాయి.”
▪ “మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించినంతవరకు మీరేం నమ్మినా ఫర్వాలేదు.”
యేసు ఏమి చెప్పాడంటే . . .
▪ ‘ఇరుకు ద్వారాన ప్రవేశించండి; నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవానికి పోవు ద్వారం ఇరుకుగా ఆ దారి సంకుచితంగా ఉంది, దాన్ని కనుగొనేవారు కొందరే.’ (మత్తయి 7:13, 14) మతాలన్నీ దేవుని దగ్గరికే నడిపిస్తాయని యేసు నమ్మలేదు.
▪ ‘అనేకులు నన్ను చూసి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమం చేసేవారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్తాను.’ (మత్తయి 7:22, 23) యేసు శిష్యులమని చెప్పుకునేవాళ్ళందరినీ ఆయన తనవాళ్ళు అని అంగీకరించడు.
భక్తిపరులైన చాలామంది తమ నమ్మకాలను, ఆచారాలను ఎంతో ఇష్టపడతారు. అయితే ఆ ఆచారాలు, నమ్మకాలు దేవుని వాక్యమైన బైబిలు చెప్తున్నదానికి తగ్గట్టుగా లేకపోతే ఏమవుతుంది? మనుషులు పెట్టిన ఆచారాలను పాటిస్తే వచ్చే నష్టమేమిటో చెబుతూ తన కాలంలోని మత పెద్దలతో యేసు, ‘మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు’ అని అన్నాడు. ఆయన, ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది; మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు’ అని దేవుడన్న మాటలను వారికి గుర్తుచేశాడు.—మత్తయి 15:1-9; యెషయా 29:13.
మనం ఏమి నమ్ముతున్నామనేదే కాదు మనమెలా ప్రవర్తిస్తున్నామో చూసుకోవడం కూడా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునేవారు ‘దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు గాని, తమ క్రియలవలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు’ అని బైబిలు చెబుతోంది. (తీతు 1:16) నిజానికి, ఈ రోజుల్లో ప్రజలు ‘దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, పైకి భక్తిగలవారిలా ఉన్నా దాని శక్తిని ఆశ్రయించట్లేదు.’ కాబట్టి ‘ఇట్టివారికి విముఖుడవై ఉండు’ అని బైబిలు చెబుతోంది.—2 తిమోతి 3:4, 5.
దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం అవసరమే. కానీ అదొక్కటే ఎందుకు సరిపోదు? ఎందుకంటే, ఒక వ్యక్తి ఎంతో మనస్ఫూర్తిగా చేసే ఆరాధన కూడా తప్పైవుండొచ్చు. అందుకే దేవుని గురించిన సరైన జ్ఞానం చాలా అవసరం. (రోమీయులు 10:2, 3) సరైన జ్ఞానం సంపాదించుకుని, బైబిలు చెప్తున్నదాని ప్రకారం నడుచుకుంటే మనం దేవుణ్ణి సంతోషపరుస్తాం. (మత్తయి 7:21) సరైన మతాన్ని పాటించడం అంటే మనకు సరైన ఉద్దేశాలుండాలి, సరైన నమ్మకాలుండాలి, సరైన పనులు చేయాలి. సరైన పనులు చేయడమంటే మనం ఎప్పుడూ దేవునికి ఇష్టమైనదే చేయడమని అర్థం.—1 యోహాను 2:17.
దేవుని గురించి బైబిలు ఇంకా ఏమి చెబుతుందో తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షులను సంప్రదించండి. వారు మీ ఇంటికి వచ్చి బైబిల్లోని విషయాలను ఉచితంగా నేర్పిస్తారు. (w09 2/1)
[9వ పేజీలోని బ్లర్బ్]
సరైన మతాన్ని పాటించడం అంటే మనకు సరైన ఉద్దేశాలుండాలి, సరైన నమ్మకాలుండాలి, సరైన పనులు చేయాలి