లోకాంతం గురించి కొందరు ఏమనుకుంటున్నారు?
‘యేసు ఒలీవ కొండపై కూర్చుని ఉన్నప్పుడు ఆయన వద్దకు శిష్యులు ఏకాంతంగా వచ్చి, “ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? నీ రాకకు, లోకాంతానికి సూచన ఏమిటి?” అని అడిగారు.’—మత్తయి 24:3, కతోలిక అనువాదము.
“లోకాంతము” అనే మాట విన్నప్పుడు మీ మదిలో ఏమి మెదులుతుంది? బహుశా, ఓ భయంకర విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు మీ కళ్ల ముందు కదలాడతాయి. బైబిల్లోని “హార్మెగిద్దోను” అనే పదం లోకాంతాన్ని సూచిస్తుందని కొందరు అనుకుంటారు. (ప్రకటన 16:15, 16) ఆ పదం బైబిల్లో ఒక్కసారే ఉన్నా వార్తాపత్రికలు, టీవీలు దాని గురించి ఎక్కువగా చెబుతున్నాయి, మతనాయకులు కూడా పదేపదే దాని గురించి మాట్లాడుతున్నారు.
లోకాంతం లేదా హార్మెగిద్దోను గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు, బైబిలు బోధలకు పొంతన ఉందా? దాని గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే, లోకాంతం గురించిన నిజాలు తెలుసుకోవడం వల్ల, అనవసరమైన భయాలు తొలగిపోతాయి, మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తాం, దేవుని మీద మనకున్న అభిప్రాయం మారుతుంది.
లోకాంతం గురించి సాధారణంగా ప్రజలు ఏమనుకుంటున్నారో, దాని గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో తెలుసుకోవడానికి మూడు ప్రశ్నల్ని పరిశీలిద్దాం.
1. లోకాంతం మనుష్యుల వల్ల వస్తుందా?
మనుష్యుల వల్ల వచ్చే విపత్తులను పాశ్చాత్య దేశాల్లోని పత్రికా రచయితలు, పరిశోధకులు ఎక్కువగా “హార్మెగిద్దోను” అని పిలుస్తారు. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, రెండవ ప్రపంచ యుద్ధాన్ని వాళ్లు “హార్మెగిద్దోను” అని పిలిచారు. ఆ యుద్ధాల తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్లు అణ్వాయుధాలతో దాడి చేసుకుంటాయని అందరూ భయపడ్డారు. ప్రసార మాధ్యమాలైతే ఆ యుద్ధానికి “అణ్వాయుధాల హార్మెగిద్దోను” అని పేరు పెట్టాయి. నేడు, కాలుష్యం వల్ల భూవాతావరణంలో పెనుమార్పులు వస్తాయని ఆందోళనపడుతున్న పరిశోధకులు, “వాతావరణ హార్మెగిద్దోను” రాబోతుందని హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ వాళ్లు చెప్పేది ఏమిటి? భూమితోపాటు, దానిమీదున్న జీవరాశుల భవిష్యత్తు పూర్తిగా మనుష్యుల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాలు తెలివిగా అడుగేయకపోతే భూమికి తీరని నష్టం వాటిల్లుతుంది.
మరి బైబిలు ఏమి చెబుతోంది? దేవుడు భూమిని, మనుషుల చేతుల్లో నాశనం కానివ్వడు. యెహోవాa భూమిని ఊరికే సృష్టించలేదు కానీ ‘నివాస స్థలంగా’ ఉండడానికి చేశాడని బైబిలు మనకు చెబుతోంది. (యెషయా 45:18) మనుష్యులు భూమిని పూర్తిగా నాశనం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు కానీ ఆయన “భూమిని నాశనం చేసే వాళ్లను నాశనం” చేస్తాడు.—ప్రకటన 11:18, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
2. లోకాంతం ప్రకృతి విపత్తు వల్ల వస్తుందా?
పెద్దపెద్ద ప్రకృతి విపత్తులను పత్రికా రచయితలు కొన్నిసార్లు “హార్మెగిద్దోను” అని అంటారు. 2010లో హయిటీని కుదిపేసిన భారీ భూకంపం వల్ల కలిగిన బాధను, ఆస్తినష్టాన్ని, ప్రాణనష్టాన్ని వివరిస్తూ ఒక నివేదిక ఆ విపత్తును “హయిటీలో ‘హార్మెగిద్దోను’” అని వర్ణించింది. విలేఖరులు, సినిమావాళ్లు సంభవించిన విపత్తులనే కాదు, సంభవిస్తాయని తాము భయపడే విపత్తులను కూడా “హార్మెగిద్దోను” అని పిలుస్తున్నారు. ఉదాహరణకు, అంతరిక్షం నుండి ఏదైనా చిన్న గ్రహం వచ్చి భూమిని ఢీకొంటే ఏమి జరుగుతుందో వర్ణించడానికి వాళ్లు “హార్మెగిద్దోను” అనే పదాన్ని వాడారు.
ఇంతకీ వాళ్లు చెప్పేది ఏమిటి? హార్మెగిద్దోను అనేది ఉన్నట్టుండి విరుచుకుపడి, విచక్షణ లేకుండా అమాయకులను పొట్టనబెట్టుకునే ఒక విపత్తు. దాన్నుండి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు.
మరి బైబిలు ఏమి చెబుతోంది? హార్మెగిద్దోను అనేది ఉన్నట్టుండి విరుచుకుపడి, విచక్షణ లేకుండా ప్రజలను పొట్టనబెట్టుకునే విపత్తు కాదు. దానిలో చెడ్డవాళ్లు మాత్రమే తుడిచిపెట్టుకుపోతారు. త్వరలో ‘భక్తిహీనులు లేకుండా పోతారు. వాళ్ల స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించినా వాళ్లు కనబడకుండా పోతారు’ అని బైబిలు హామీ ఇస్తోంది.—కీర్తన 37:10.
3. లోకాంతమప్పుడు దేవుడు భూమిని నాశనం చేస్తాడా?
దేవుణ్ణి నమ్మే చాలామంది, మంచికీ చెడుకూ మధ్య ఆఖరి పోరాటం జరుగుతుందని, అప్పుడు మన భూగ్రహం కూడా అంతమౌతుందని నమ్ముతారు. ప్రిన్స్టన్ సర్వే రీసర్చ్ అసోసియేట్స్ వాళ్లు అమెరికాలో ఒక సర్వే నిర్వహించారు. వాళ్లు సర్వే చేసిన పెద్దవాళ్లలో 40 శాతం మంది, “హార్మెగిద్దోను యుద్ధంలో” ప్రపంచం అంతమౌతుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు.
ఇంతకీ వాళ్లు చెప్పేది ఏమిటి? మనుష్యులు భూమ్మీద ఎల్లకాలం జీవించాలని, భూమి ఎప్పటికీ ఉండాలని దేవుడు సృష్టించలేదు. మనుష్యులందరూ ఎప్పటికైనా చనిపోవాలనే ఆయన చేశాడు.
మరి బైబిలు ఏమి చెబుతోంది? దేవుడు, ‘భూమి ఎన్నటికీ కదలకుండునట్లు దాన్ని పునాదుల మీద స్థిరపర్చాడు’ అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. (కీర్తన 104:5) భూమ్మీద ఉండేవాళ్ల గురించి అది ఇలా చెబుతోంది: ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. వారు దానిలో నిత్యం నివసిస్తారు.’—కీర్తన 37:29.
లోకాంతం గురించి సాధారణంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకూ బైబిలు చెబుతున్న దానికీ ఏమాత్రం పొంతన లేదు. మరి నిజం ఏమిటి? (w12-E 02/01)
[అధస్సూచి]
a దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.