కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. మాస్కిల్.* దావీదు కీర్తన. జీఫువాళ్లు సౌలు దగ్గరికి వచ్చి, “దావీదు మా మధ్య దాక్కున్నాడు” అని చెప్పినప్పటిది.+
2 దేవా, నా ప్రార్థన విను;+
నా నోటి మాటలు ఆలకించు.
3 పరాయివాళ్లు నా మీదికి లేస్తున్నారు,
క్రూరులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.+
వాళ్లకు దేవుడంటే లెక్కలేదు.*+ (సెలా)
4 ఇదిగో! దేవుడే నా సహాయకుడు;+
నాకు సహాయం చేసేవాళ్లకు యెహోవా తోడుగా ఉంటాడు.
5 నా శత్రువులు చేసే కీడును ఆయన వాళ్ల మీదికే రప్పిస్తాడు;+
నువ్వు నమ్మకమైనవాడివి కాబట్టి వాళ్లను నాశనం చేయి.+
6 నేను ఇష్టంగా నీకు బలులు అర్పిస్తాను.+
యెహోవా, నేను నీ పేరును స్తుతిస్తాను. ఎందుకంటే, అది మంచిది.+